మే - 2014 నివేదికలు - సర్వేలు


మే - 3
¤ ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) రెండు రాష్ట్రాల కోసం విడివిడిగా రూపొందించిన సామాజిక - ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలను విడుదల చేసింది. రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు పారిశ్రామిక వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక:


 సత్వర సామాజిక - ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండబోతున్న కోస్తా, రాయలసీమ లోని 13 జిల్లాలను ఫ్యాప్సీ జోన్లుగా విభజించింది. అవి 
1) శ్రీకాకుళం - విజయనగరం 
2) విశాఖపట్టణం 
3) ఉభయ గోదావరి జిల్లాలు
 4) కృష్ణా - గుంటూరు 
5) ప్రకాశం - నెల్లూరు 
6) కడప - కర్నూలు 
7) చిత్తూరు - అనంతపురం.


తెలంగాణ ప్రణాళిక:

 రెండు మూడు జిల్లాలను కలిపి ఒక అభివృద్ధి కేంద్రంగా గుర్తించి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలి.

 దీని కోసం తెలంగాణను అయిదు వృద్ధి కేంద్రాలుగా ఫ్యాప్సీ ఈ ప్రణాళికలో గుర్తించింది. ఇవి 
1) ఆదిలాబాద్ - కరీంనగర్ 
2) నిజామాబాద్ - మెదక్ 
3) వరంగల్ - ఖమ్మం 
4) హైదరాబాద్ - రంగారెడ్డి 
5) మహబూబ్‌నగర్ - నల్గొండ.
మే - 6
¤  దేశంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి తగ్గుముఖం పట్టి ఆర్థిక ప్రగతి ఊపందుకుంటుందని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనా వేసింది.

   »    2014లో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 4.9 శాతం వృద్ధి చెందుతుందని, 2015లో జీడీపీ 5.9 శాతానికి చేరుకుంటుందని ఓఈసీడీ తాజా నివేదిక వెల్లడించింది.

   »    భారత ఆర్థికవ్యవస్థ 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో మందగించి, అభివృద్ధి అడుగంటిందని, ఆ ఏడాది జీడీపీ వృద్ధిరేటు దశబ్దపు కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి చేరిందని నివేదిక వెల్లడించింది.
మే - 7
¤ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ (ఏఏపీ) పేరుతో 91 దేశాల్లోని 1600 నగరాల వాయు కాలుష్యం తీరుతెన్నుల వివరాలతో నివేదికను విడుదల చేసింది.   

»    ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వాయు కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది.   

»    ఢిల్లీలో పీఎం 2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ స్థాయిలో ఉన్న పార్టికల్స్) ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వాయు కాలుష్యంలో ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఈ రేణువుల వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.   

»    ఢిల్లీలో పీఎం 2.5 సాంద్రత 153 మైక్రోగ్రాముల మేర, పీఎం 10 తీవ్రత 286 మైక్రోగ్రాముల మేర ఉందని వెల్లడైంది. ఇది అనుమతించిన స్థాయి కంటే చాలా ఎక్కువ.  

 »    కాలుష్యం ఎక్కువగా ఉండే నగరంగా ఒకప్పుడు గుర్తింపు పొందిన బీజింగ్‌లో పీఎం 2.5 తీవ్రత 56 మైక్రోగ్రాములు, పీఎం 10 తీవ్రత 121 మైక్రోగ్రాముల మేర ఉందని నివేదిక పేర్కొంది.   

»    శిలాజ ఇంధనాలపై ఆధారపడటం, రవాణా కోసం సొంత మోటారు వాహనాలను ఉపయోగించడం, భవనాల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోకపోవడం, వంట కోసం బయోమాస్‌ను వాడటం వల్ల వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.   

»    దేశంలో మరణాలకు కారణమవుతున్న అంశాల్లో వాయు కాలుష్యం అయిదో స్థానంలో ఉంది. పీఎం 10, పీఎం 2.5 రేణువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస, హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
మే - 8
¤  ఆదాయం, లాభం, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద, శక్తిమంతమైన 2000 కంపెనీలతో ఫోర్బ్స్ పత్రిక 'గ్లోబల్ 2000' జాబితాను విడుదల చేసింది. వీటిలో భారత్‌కు చెందిన 54 కంపెనీలకు స్థానం లభించింది.   

»    భారత కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచి మొత్తం జాబితాలో 135వ స్థానాన్ని దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 5,090 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 3,05,400 కోట్లు). ముకేష్ అంబానీ సారథ్యంలోని ఈ కంపెనీ 2014 మే నాటికి 7,280 కోట్ల డాలర్ల విక్రయాలు జరిపింది.   

»    రిలయన్స్ తర్వాత 2,360 కోట్ల డాటర్ల మార్కెట్ విలువతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (155 ర్యాంక్), ఓఎన్‌జీసీ (176వ ర్యాంక్), ఐసీఐసీఐ బ్యాంక్ (304), టాటా మోటార్స్ (332), ఇండియన్ ఆయిల్ (416), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (422), కోల్ ఇండియా (428) లాంటి కంపెనీలు ఉన్నాయి.   

»    జాబితాలోని మొత్తం 2000 కంపెనీల ఆదాయం 38 ట్రిలియన్ డాలర్లు, లాభం 3 ట్రిలియన్ డాలర్లు, ఆస్తుల విలువ 161 ట్రిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 44 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 62 దేశాలకు చెందిన ఈ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు.   

»    జాబితాలో మొదటి మూడు స్థానాలూ చైనా కంపెనీలే దక్కించుకోవడం విశేషం. చైనీస్ బ్యాంక్ ఐసీబీసీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్, మూడో స్థానంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి. మొదటి పది కంపెనీల్లోనూ అయిదు కంపెనీలు చైనావే కావడం గమనార్హం.   

»    జాబితాలో మొత్తం 564 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 225 కంపెనీలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది.
మే - 14
¤  ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచంలోని అత్యంత ధనవంతులకు చెందిన ఆవాసాల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నివాసం అత్యంత ప్రియమైనదిగా అగ్రస్థానాన్ని పొందింది. లండన్‌లోని లక్ష్మీ మిట్టల్ గృహాలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.   

»    ముంబయిలోని 27 అంతస్తుల యాంటీలియాను (అట్లాంటిక్‌లోని ఒక కల్పిత దీవి పేరిట ఈ భవనాన్ని నిర్మించారు) ముకేష్ ప్రత్యేకంగా తన కుటుంబం కోసమే నిర్మించుకున్నారు.   

»    4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన నిర్మాణానికి 2 బిలియన్ డాలర్ల వరకూ వ్యయం అయి ఉంటుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. మన్‌హట్టన్‌లో 2 బిలియన్ డాలర్లతో కట్టిన 52 అంతస్తుల '7 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌'తో యాంటీలియాను ఫోర్బ్స్ పోల్చింది.   

»    ముకేష్ 'యాంటీలియా' తర్వాతి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన లలీ సఫ్రాకు ఫ్రాన్స్‌లో ఉన్న 'విల్లా లియోపోల్డా' నిలిచింది. 2008 నాటికి దీని విలువ 750 మిలియన్ డాలర్లు.   

»    మూడో అత్యంత ఖరీదైన బిలియనీర్ ఆవాసంగా అమెరికాలోని వ్యాపారవేత్త ఇరారెనర్ట్‌కు చెందిన నివాసం నిలిచింది. దీని విలువ 2014 పన్ను అంచనాల ప్రకారం 248.5 మిలియన్ డాలర్లు.   

»    లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలస్ గార్డెన్స్‌లో మిట్టల్‌కున్న రెండు నివాసాలు సైతం 21 అత్యంత ఖరీదైన బిలియనీర్ల నివాసాల జాబితాలో వరుసగా 5, 18వ స్థానాలను దక్కించుకున్నాయి.