జూన్ - 2014 నివేదికలు - సర్వేలు


జూన్ - 4
¤   భారత్‌లో ఆర్థిక వ్యవస్థ పురోగతిపై మధ్యతరగతి వర్గం చాలా విశ్వాసంతో ఉంది. వృద్ధి అవకాశాలపై దేశంలోని మధ్యస్థాయి ఆదాయ వర్గాలు గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

   »    ఈ బ్యాంక్ భారత్‌తోపాటు ఇండోనేషియా, నైజీరియా, ఘనా, కెన్యా వంటి దేశాల్లో కూడా అధ్యయనం నిర్వహించింది. భారత్‌లో నిర్వహించిన ఈ ఆన్‌లైన్ సర్వేలో 1,000 మంది పాల్గొన్నారు.

   »    అధ్యయనంలో పాల్గొన్న 45% మధ్యస్థాయి ఆదాయం కలిగినవారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

   »    37% కొంత మేరకే విశ్వాసాన్ని ప్రకటించారు.

   »    వచ్చే అయిదేళ్లలో తమ వ్యక్తిగత ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయని 35% భావిస్తున్నారు.
జూన్ - 17
¤   బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) యూనివర్సిటీల ర్యాంకింగ్ సమాచారాన్ని 'క్యూఎస్ బ్రిక్స్ - 2014 టాప్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్' పేరుతో విడుదల చేశారు.

   »    ఈ నివేదిక మొదటి ప్రతిని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీకి అందజేశారు. బ్రిక్స్ దేశాల్లోని ప్రతిష్ఠాత్మక 200 విశ్వవిద్యాలయాలకు ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించారు.

   »    మొదటి 10 ర్యాంకులకు చెందిన విద్యాలయాల్లో భారత్‌కు ఒకటి కూడా దక్కలేదు. మొదటి పదింటిలో చైనాకు చెందినవి 6 ఉండగా, బ్రెజిల్ 2, రష్యా, దక్షిణాఫ్రికా చెరో ఒకటి చొప్పున నిలిచాయి.

   »    చైనాకు చెందిన త్సింగ్‌హు విశ్వవిద్యాలయం మొదటి స్థానాన్ని సంపాదించింది. 20 ర్యాంకుల్లో మాత్రమే భారత వర్సిటీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఢిల్లీ ఐఐటీ 13, బాంబే ఐఐటీ 15, కాన్పూర్ ఐఐటీ 17, మద్రాస్, ఖరగ్‌పూర్ ఐఐటీలు వరుసగా 17, 20 స్థానాల్లో నిలవగా రూర్కీ ఐఐటీ 37వ స్థానంలో నిలిచింది.

   »    ముంబయి యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, మణిపాల్ వర్సిటీ, బిట్స్ (పుణె), కలకత్తా, ఢిల్లీ, అలహాబాద్, అమితీ, అన్నా, పంజాబ్ విశ్వవిద్యాలయాలు 200 వర్సిటీల స్థాయిలో స్థానాన్ని దక్కించుకున్నాయి.
 జూన్ - 19
¤   భారతదేశం ఉన్నత విద్య ప్రమాణాల్లో దూసుకుపోతోందని ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది. 'ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2014' నివేదికను టైమ్స్ విడుదల చేసింది.

   »    ఆసియాలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఈ జాబితాలో భారత్‌కు చెందిన 10 సంస్థలకు చోటు దక్కింది. భారత్‌కు చెందిన 10 సంస్థలకు చోటు దక్కడం ఇదే తొలిసారి.

   »    చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం 32వ స్థానంలో నిలిచి భారత్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించింది.

   »    ఖరగ్‌పూర్ ఐఐటీ 45వ స్థానం, కాన్పూర్ ఐఐటీ 55వ స్థానం, ఢిల్లీ, రూర్కీ ఐఐటీలు ఉమ్మడిగా 59వ స్థానం, గౌహతి ఐఐటీ 74వ స్థానం, మద్రాస్ ఐఐటీ 76వ స్థానాల్లో నిలిచాయి.

   »    కోల్‌కతా వర్సిటీ 76వ స్థానం, అలీగఢ్ ముస్లిం వర్సిటీ 80వ స్థానం, జేఎన్‌టీయూ 90వ స్థానంతో జాబితాలో చోటు సంపాదించాయి.

¤   స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నగదు మొత్తాలు సుమారు రూ.14 వేల కోట్లకు పెరిగినట్లు 'స్విస్ నేషనల్ బ్యాంక్' (ఎస్ఎన్‌బీ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

   »    అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2013లో ఈ మొత్తం సుమారు 40 శాతానికి పైగా పెరగడం విశేషం.

   »    స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివిధ దేశాల ఖాతాదారుల వివరాలను వెల్లడించాలంటూ స్విట్జర్లాండ్‌పై భారత్ సహా పలు దేశాలు విపరీతమైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఎస్ఎన్‌బీ ఈ గణాంకాలను విడుదల చేసింది.
 జూన్ - 20
¤   స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న మొత్తం సొమ్ములో దాదాపు మూడింట రెండొంతల సొమ్ము పెద్ద బ్యాంకులైన యూబీఎస్, క్రెడిట్ సూసే ఖాతాల్లోనే ఉన్నట్లు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకింగ్ ప్రాధికార సంస్థ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్‌బీ) తన నివేదికలో వెల్లడించింది.

   »    స్విట్జర్లాండ్‌లో మొత్తం 283 బ్యాంకులు ఉన్నాయి. వాటిల్లో భారతీయులు దాచిన సొమ్ము మొత్తం రూ.14 వేల కోట్లు కాగా యూబీఎస్, క్రెడిట్ సూసే బ్యాంకుల్లోనే రూ.10 వేల కోట్ల వరకు ఉంది.

   »    ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు బ్యాంకుల్లో దాచిన సొమ్ము రూ.60 లక్షల కోట్లు.

   »    స్విస్ బ్యాంకుల్లో పొదుపు - డిపాజిట్ ఖాతాల్లో ఉన్న సొమ్ము మాత్రం రూ.500 కోట్లే. స్విస్ బ్యాంకులు తమ ఖాతాదారుల సొమ్ములో ఎక్కువ భాగాన్ని 'ఖాతాదారులకు చెల్లించాల్సిన ఇతర మొత్తాలు' అని పేర్కొంటాయి. భారతీయులకు చెందిన ఇలాంటి మొత్తం రూ.11 వేల కోట్లకు పైగా ఉంది.

   »    విదేశాల్లోని కొన్ని బ్యాంకుల ద్వారా కూడా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము ఉంటుంది. ఈ మొత్తం 2013లో దాదాపు రూ.650 కోట్లు ఉంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాదారులు ట్రేడ్‌ పోర్ట్‌ఫోలియోలు, ఆర్థిక పెట్టుబడులు లాంటి వివిధ పద్ధతుల్లో సొమ్మును దాస్తారు.