ఏప్రిల్ - 2014 నివేదికలు - సర్వేలు


ఏప్రిల్ - 1
¤  ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత‌ ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతం ఉండగలదని 'ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)' అంచనా వేసింది. ప‌రిశ్రమలు, సేవల రంగాల పనితీరు మెరుగైనందున 2014 -15కు 5.5 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదని తన నివేదిక 'ఏడీబీ అవుట్‌లుక్‌ 2014'లో తెలిపింది. 

నివేదిక‌లోని ముఖ్యాంశాలు

 భారత ఆర్థిక వ్యవస్థ పూర్థి స్థాయి వృద్ధిరేటును అందుకోవాలంటే మరికొంత సమయం పడుతుంది.

 ఇటీవలి భారత వృద్ధిరేటు క్షీణతను పరిశీలిస్తే చాలా కింద స్థాయికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత కంటే త‌గ్గకపోవచ్చు. అయితే వ్యవస్థాపరమైన అడ్డంకులను తొలగించే వరకూ వృద్ధి రేటు పూర్వ స్థాయిని చేరడానికి అవకాశం లేదు.

 2013 -14కి వృద్ధి రేటు 4.9 శాతం ఉండగలదని 'కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ)' తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2012 -13)లో ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఇది దశాబ్ద కాల కనిష్ఠ స్థాయి.

ఏప్రిల్ - 3
¤  పెట్టుబడులను ఆకర్షించడంలో మహారాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో గుజరాత్‌ ఉండేదని 'అసోచామ్‌' నివేదిక వెల్లడించింది. గత డిసెంబరు నాటికి మహారాష్ట్ర ఆకట్టుకున్న పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.14,73,466 కోట్లు ఉండగా, గుజరాత్‌ రూ.13,98,347 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆకట్టుకోగలిగింది. మహారాష్ట్ర రెండో అంచె, మూడో అంచె నగరాలలో పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించి గుజరాత్‌ను మించిపోయింది. 

నివేదికలో విశ్లేషించిన ఇతర ముఖ్యాంశాలు

 మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత‌ ఎక్కువ పెట్టుబడి ప్రతిపాదనలను పొందిన మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటక. డిసెంబరు 2013 నాటికి మొత్తం రూ.1,30,50,467 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, వాటిలో 48.2 శాతం ఈ అయిదు రాష్ట్రాలకే వచ్చాయి. మిగిలిన రూ.61,50,105 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు 15 ఇతర రాష్ట్రాలకు దక్కాయి.

  తొలి అగ్రగామి అయిదు రాష్ట్రాల జాబితాలో ఉన్న మూడు రాష్ట్రాలు గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో గత సంవత్సరం పెట్టుబడి ప్రతిపాదనల విలువ క్షీణించింది. 

 ముఖ్యంగా సేవలు, విద్యుత్తు సంబంధిత పరిశ్రమలకు మహారాష్ట్ర నిలయంగా మారింది. ఈ రెండు రకాల పరిశ్రమల్లోనూ గత ఏడాది రూ.67,000 కోట్లకు పైగా పెట్టుబడులను మహారాష్ట్ర ఆకర్షించింది. గుజరాత్‌లో ఈ రెండు రకాల పరిశ్రమలకూ అందిన పెట్టుబడి ప్రతిపాదనల విలువ సుమారు రూ.62,000 కోట్లు మాత్రమే ఉంది.

 పెట్టుబడి ప్రతిపాదనలలో అత్యధికంగా విద్యుత్తు రంగం (36.5 శాతం), సేవలు (23.6%), తయారీ (23%), నిర్మాణం - స్థిరాస్తి (11.1%), నీటి పారుదల (3%)కు చెందినవి. గనుల తవ్వకం విభాగానికి సంబంధించి కేవలం 2.8 శాతం ప్రతిపాదనలు లభించాయి. సేవల విభాగంలో మహారాష్ట్ర 38.2 శాతం ప్రతిపాదనలను, విద్యుత్తు విభాగంలో 28.3% ప్రతిపాదనలను ఆకర్షించగలిగింది. గుజరాత్‌కు విద్యుత్తు విభాగంలో 39.4%, సేవల విభాగంలో 22.2% ప్రతిపాదనలు అందాయి. 

 2011 డిసెంబరుకు గుజరాత్‌ మొత్తం రూ.16,28,126 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను అందుకుంది. ఆ ఏడాది మహారాష్ట్రకు రూ.14,13,728 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.
ఏప్రిల్ - 11
¤ ఎల్‌నినో ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం 8.5 శాతం పైకి; ఆర్థిక వృద్ధి 5 శాతం దిగువకు వెళ్లవచ్చని సింగపూర్‌ బ్రోకరేజీ సంస్థ డీబీఎస్‌ అంచనా వేసింది. 'వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని ఎల్‌నినో 2015 జనవరి కల్లా 8 శాతం పైకి చేర్చే అవకాశం ఉంది. ఆహార సూచీలో 5 శాతం మేర పెరుగుదల కనిపించినా అది టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 8.5 శాతానికి చేర్చుతుంద'ని డీబీఎస్‌ తన నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామం వల్ల రిజర్వు బ్యాంకు తన పరపతి విధానంలో సరళంగా ఉండడానికి అవకాశాలను తగ్గించవచ్చు.

        
»  ఎల్‌నినో కారణంగా అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షపాతంపై ప్రభావం పడుతుంది. మన దేశంలో దీనికి బలహీన నైరుతి రుతుపవనాలు తోడవుతుంటాయి.

¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం 'ఫిచ్‌' అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. అదే సమయంలో దేశ రేటింగ్‌ అంచనాను 'స్థిరం'గా ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, సగటు తగ్గుతూ (2012-13లో వృద్ధి దశాబ్ద కనిష్ఠ స్థాయి అయిన 4.5 శాతం) వస్తోందని ఆ ఏజెన్సీ పేర్కొనడం గమనార్హం      

  
»   భారత జీడీపీ సగటు (అయిదేళ్లకు) 6.7 శాతంగా ఉంది. దీర్ఘకాల విదేశీ, స్థానిక కరెన్సీ ఐడీఆర్ (ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌)ను  గా ప్రకటించింది. అంటే తక్కువ నష్టభయం ఉందని ఈ రేటింగ్‌ సూచిస్తోంది. అదే సమయంలో అంచనాలను స్థిరంగా ఉంచింది.

ఫిచ్ నివేదికలో పేర్కొన్న ఇత‌ర ముఖ్యాంశాలు...


 ప్రస్తుత ఎన్నికల సీజన్‌ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిగా ఉంది.

 తదుపరి సంకీర్ణ ప్రభుత్వం ఆర్థిక విధానాల అమలును మొదలుపెట్టగానే తిరిగి ఆర్థిక వ్యవస్థ తన స్థిర వృద్ధి దిశగా పయనిస్తుందా లేదా ప్రస్తుత స్థాయిల వద్దే నిలిచి ఉంటుందా అన్న విషయం స్పష్టమవుతుంది.

 అయితే, ద్రవ్య స్థిరీకరణ జరగకపోయినా బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు మరింత పెరిగినా ప్రతికూల రేటింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది.

 ఎన్నికల నేపథ్యంలో 2013-14కు ద్రవ్య లోటు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరింది. అయితే ఇది ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చిన ప్రత్యేక డివిడెండ్లతోనూ; బిల్లు చెల్లింపులు, మూలధన వ్యయాల వాయిదాలతోనూ సాధించింది. దీర్ఘకాలంలో ద్రవ్య స్థిరీకరణ సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు రేకెత్తవచ్చు.

 భారత పాలన, వ్యాపార వాతావరణ ప్రమాణాలు బలహీనంగా ఉన్నాయి. ఎన్నికల అనిశ్చితి తొలగితే క్రమంగా పెట్టుబడుల్లో మార్పులు రావొచ్చు.

 పెట్టుబడులపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ 300 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. అయితే ఇందులో కొన్ని సాధ్యం కానివి, మరికొన్ని రాష్ట్ర స్థాయుల వద్ద సమస్యలను ఎదుర్కొంటున్నవి ఉన్నాయి.

¤ ఆసియాలో 100 అత్యంత ప్రభావిత కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చోటు సంపాదించాయి. కంపెనీ వ్యూహాలపై సలహాలిచ్చే రోలాండ్‌ బెర్జెర్‌ ఈ జాబితాను తయారు చేసింది

        
»   జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 77వ స్థానంలో ఉండగా టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ వ‌రుసగా 79, 80 స్థానాలను దక్కించుకున్నాయి. వంద కంపెనీల జాబితాలో శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రథమ స్థానంలో నిలిస్తే తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ (రెండు), టయోటా (మూడు), హితాచీ (నాలుగు), సోనీ (అయిదు) ఉన్నాయి.        


»   కంపెనీ ఆదాయం, వృద్ధి, పరిశోధన, బ్రాండ్‌ విలువ, విదేశాల్లో కార్యకలాపాలు, సామాజిక బాధ్యత, వినూత్నత తదితర అంశాల ఆధారంగా కంపెనీలను రోలాండ్‌ బెర్జెర్‌ ఎంపిక చేసింది. ఈ కంపెనీలు ఇంధనం, టెలికాం, ఫైనాన్స్‌, ఐటీ ఉత్పత్తులు, సేవలు, స్థిరాస్తి, దీర్ఘకాలం మన్నే వినియోగ వస్తువులు లాంటి అనేక వ్యాపారాల్లోకి విస్తరించి ఉన్నాయి.   

     
»   చైనాకు చెందిన 28 కంపెనీలు జాబితాలో ఉండగా పెట్రో చైనా, సైనోపెక్‌, చైనా మొబైల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.
 ఏప్రిల్ - 19
¤ భారత్‌కు చెందిన 15 రకాల పక్షులు పరిణామ క్రమపరంగా భిన్నంగా ఉండటంతోపాటు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్), యేల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.  
      
»   ప్రపంచవ్యాప్తంగా ఈ అధ్యయాన్ని నిర్వహించారు. ఇందులో పరిణామ క్రమపరంగా భిన్నంగా ఉండటంతో పాటు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న 100 జాతుల పక్షులను వెలుగులోకి తెచ్చారు.       

 »   భారత్‌కు సంబంధించి బెంగాల్ ఫ్లోరికాన్, లెస్సర్ ఫ్లోరికాన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సోషియబుల్ లాప్‌వింగ్, జెర్డాన్స్ కోర్సర్ లాంటి పక్షులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సహజ ఆవాసాలైన గడ్డి నేలలు, పొద అడవులు నాశనం కావడం వల్ల అవి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని అధ్యయనం తెలిపింది.        

»   స్పూన్‌బిల్డ్ శాండ్‌పైపర్, సైబీరియా కొంగ, వైట్ బెల్లీడ్ హెరాన్ పక్షుల మనుగడ వాటి ఆవాసాలైన చిత్తడి నేలలపై ఆధారపడి ఉన్నాయని హెచ్చరించింది.


¤ కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం దిగువన భూగర్భంలో ఉన్న అమూల్యమైన సంపదను మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్‌రాయ్‌తో తనిఖీ చేయించాలని సుప్రీంకోర్టు నియమించిన న్యాయ నిపుణుడు (అమికస్ క్యూరీ) గోపాల్ సుబ్రహ్మణ్యం తన నివేదికలో కోర్టుకు వెల్లడించారు.    
    
»   ఆలయానికి ట్రస్టీలుగా ఉన్న ట్రావెన్‌కోర్ రాజకుటుంబం ఆలయం దైనందిన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధించాలని ఈ నివేదికలో పేర్కొన్నారు. 'కల్లర-బి' పేరుతో ఉన్న ఖజానాను తెరవవద్దని ట్రస్టీలు చెబుతున్నప్పటికీ ఆ ఖజానాను కొన్నేళ్ల క్రితమే తెరిచినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని నివేదికలో వెల్లడించారు. ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా ఆలయ సంపదను చేజిక్కించుకునే ప్రమాదం పొంచి ఉందని నివేదికలో హెచ్చరించారు.        

»   గోపాల్ సుబ్రహ్మణ్యం గతంలో భారత సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 
ఏప్రిల్ - 21
¤  దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ నివేదిక వెల్లడించింది.   
    
 »   10-14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వీరంతా సరైన రక్షణ, ప్రమాణాలు లేని వర్క్ షాపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది.   
    
 »   అసోచామ్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ఉత్పత్తి 2015 నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది.      

 »   ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తవుతున్న నగరాల్లో ముంబయి (96 వేల మెట్రిక్ టన్నులు) మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ (67 వేలు), బెంగళూరు (57 వేలు), చెన్నై (47 వేలు), హైదరాబాద్ (25 వేల మెట్రిక్ టన్నులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏప్రిల్ - 30
¤  ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రపంచ
 బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన డెవలప్‌మెంట్ డాటా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 
ఇంటర్నేషనల్ కంపారిజన్ పోగ్రాం (ఐసీపీ) నివేదిక పేర్కొంది.

ముఖ్యాంశాలు

కేవలం ఆరేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 
2005లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2011 కల్లా జపాన్‌ను సైతం వెనక్కినెట్టి మూడో 
స్థానానికి చేరింది.

 ఎప్పటిలాగే అమెరికా అగ్రస్థానంలో, చైనా తర్వాతి స్థానంలో నిలిచాయి.

 జపాన్, జర్మనీలు 4, 5 స్థానాల్లో నిలిచాయి.

 ఆ తర్వాత వరుసగా 6 నుంచి 12 స్థానాల్లో రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా,
 ఇటలీ, మెక్సికోలు నిలిచాయి.

 2011లో ప్రపంచం 90 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.5,400 లక్షల కోట్ల) విలువైన
 వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసింది. అందులో దాదాపు సగం స్వల్ప, మధ్యాదాయ దేశాల 
నుంచి వచ్చింది.

 ప్రపంచంలోనే అతిపెద్ద 12 ఆర్థికవ్యవస్థల్లో ఆరు మధ్యాదాయ విభాగం నుంచి 
వచ్చినవే.

 మొత్తం 12 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఉమ్మడిగా చూస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 
మూడింట రెండు వంతులకు సమానం. జనాభా పరంగా 59% వాటా వీటిదే.
                     


¤  సుమారు శతాబ్దకాలంగా పాఠశాలల్లో బాలుర కంటే బాలికలకే అన్ని సబ్జక్టుల్లోనూ
 ఎక్కువమార్కులొచ్చాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
        

»   భారత్‌తో సహా 30కి పైగా దేశాల్లో కెనడా విశ్వవిద్యాలయ పరిశోధకులు 
నిర్వహించినఅధ్యయనంలో  విషయం వెల్లడైంది.
        

»   పాఠశాల స్థాయిలో బాలికలే ఎందుకు ముందంజలో ఉన్నారనే అంశాన్ని 
విశ్లేషించినపుడుసామాజికసాంస్కృతిక పరమైన అంశాలూ కారణమని వెల్లడైంది
అంతేకాకుండా చదువుకునే తీరుతెన్నులుశైలిలో బాలికలుబాలుర మధ్య ఉన్న 
తేడాలు కూడా బాలికలదే పైచేయి కావడానికి మరోకారణమని పరిశోధకులు తేల్చారు.