అక్టోబరు - 2
|
¤ గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, నీరు - చెట్టు పథకాలను ప్రారంభించారు. » రూ.2కే 20 లీటర్ల శుద్ధజలాన్ని అందజేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, 'జన్మభూమి - మా ఊరు', ఎన్టీఆర్ భరోసా పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.400 విలువైన ఎల్ఈడీ బల్బును రూ.10కే పేదలకు పంపిణీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
|
అక్టోబరు - 4
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 'రైతు సాధికారిక సంస్థ'ను ఏర్పాటు చేసింది. రూ.కోటి మూలధనంతో కంపెనీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. » విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యవస్థాపక డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. వ్యవసాయ శాఖ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. » రైతులు రుణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, సాధికారత కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు, అప్పులు తీసుకునేందుకు ఈ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో రైతు రుణ విముక్తి పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఏజెన్సీగా ఉంటుంది.¤ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య వివిధ రంగాల్లో సంబంధాలను మరింత మెరుగుపరచడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. » సెప్టెంబరు 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. » రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల మెరుగుదలతోపాటు సమస్యల పరిష్కారానికి ఈ గ్రూప్ కృషి చేస్తుంది. త్వరితగతిన ఆర్థికంగా అభివృద్ధి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపరుచుకోవడం, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు, సాంస్కృతిక రంగంలో పరస్పర సహకారంతోపాటు రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
|
అక్టోబరు - 6
|
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఏడు మిషన్లలో మొదటిదైన ప్రాథమిక రంగ మిషన్ (ప్రాథమిక రంగం విధాన పత్రం) ను అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజక వర్గంలోని గరుడాపురంలో ప్రారంభించారు. » ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. » వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడంలో భాగంగానే ప్రాథమిక రంగ మిషన్‌కు రూపకల్పన చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు.¤ విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రజల (ఎన్ఆర్‌టీ) సంక్షేమం కోసం కేరళ, పంజాబ్ తరహా విధానాన్ని చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వారి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతోపాటు సంక్షేమ నిధిని స్థాపించడం, నిరంతర సేవలను అందించే సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం లాంటివి ఇందులో ఉంటాయి.
|
అక్టోబరు - 7
|
¤ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తెలంగాణలోని పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. » రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు నెలకు అయిదు కిలోల బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా, ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. » ఇందుకయ్యే ఖర్చును బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ నుంచి ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
|
అక్టోబరు - 8
|
¤ ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీమ్ 74వ వర్ధంతి సభను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరై, భీమ్‌కు నివాళులు అర్పించారు. » భీమ్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయేలా రూ. 25 కోట్లతో జోడేఘాట్‌లో స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. భీమ్ పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
|
అక్టోబరు - 9
|
¤ ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ వినియోగదారుడు తమ ఊరిలో రోజువారీ విద్యుత్ సరఫరా ఎలా జరిగిందనే విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంappower.ap.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. » ఈ సైట్‌లో లాగిన్ అయిన వినియోగదారుడు ఏపీలోని 13 జిల్లాల్లో సరఫరా అయిన విద్యుత్ వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
|
అక్టోబరు - 10
|
¤ బంగాళాఖాతంలో ఏర్పడిన హుదుద్ తుపాను పెను తుపానుగా మారింది. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాకు ముప్పుందని భారత వాతావరణ శాఖ సూచించింది. » బంగాళా ఖాతంలో ఏర్పడిన పెను తుపానుకు హుదూద్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఒమన్ దేశం నిర్ణయించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టే తుపాన్లకు పేరు నిర్ణయించే అవకాశం మన దేశంతో పాటు బంగ్లాదేశ్, ఒమన్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవులు, పాకిస్థాన్, థాయ్‌లాండ్కు ఉంది. » ' హుదుద్ ' ఒక పక్షి పేరు. ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ పక్షి కనిపిస్తుంది. ఇజ్రాయిల్ దేశ జాతీయ పక్షి ఇది. ఆ దేశంలో దీన్ని హుపో అని పిలుస్తారు.¤ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. » మంగళగిరిలో 193 ఎకరాల్లో సుమారు రూ.1200 కోట్లతో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.¤ హైదరాబాద్ వై-ఫై నగరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఎయిర్‌టెల్ పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది. » హైటెక్ సిటీ ప్రాంతంలోని 8 కిలోమీటర్ల పొడవున సైబర్ టవర్స్ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్, కొండాపూర్ కూడలి, రహేజా మైండ్ స్పేస్ కూడలుల మధ్య 17 హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేసింది. మూడు నెలలపాటు ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద అందిస్తారు.
|
అక్టోబరు - 12
|
¤ హుద్‌హుద్ తీవ్ర పెను తుపాను విలయం సృష్టించింది. ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో విరుచుకుపడింది. రహదారి, సమాచార వ్యవస్థలను ఛిద్రం చేసింది. ఆరుగురి ప్రాణాలను హరించింది. గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, కుండపోతగా కురిసిన వర్షం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. » ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను తీవ్రతతో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. » విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుపాను పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే హరికేన్లను తలపించింది. విశాఖపట్నంలో సృష్టించిన బీభత్సం ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే హరికేన్, టైఫూన్ ల స్థాయిలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా నమోదైన గాలుల వేగం, అలల తీవ్రతను పరిశీలిస్తే హరికేన్ - 4 స్థాయి తీవ్రత ఉన్నట్లు పేర్కొన్నారు. » ఈశాన్య పసిఫిక్, ఉత్తర అట్లాంటిక్‌లో ఏర్పడే తుపాన్లను హరికేన్లుగా, వాయువ్య పసిఫిక్‌లో ఏర్పడే వాటిని టైఫూన్‌లుగా పిలుస్తారు. గాలుల వేగం గంటకు 61 కిలోమీటర్లుగా నమోదైతే ఉష్ణమండల వాయుగుండంగా పేర్కొంటారు. 117 కిలోమీటర్ల వరకు ఉంటే ఉష్ణమండల స్ట్రోమ్ గా, ఈశాన్య పసిఫిక్‌లో గాలుల వేగం 119 కిలోమీటర్లకు మించితే హరికేన్‌లు గా పిలుస్తారు. గాలుల వేగం పెరుగుతున్న కొద్దీ తీవ్రతను బట్టి హరికేన్ - 1, 2, 3, 4, 5 గా పిలుస్తారు. గాలుల వేగం గంటకు 209 - 252 కిలోమీటర్లుగా నమోదైతే వాటిని హరికేన్ - 4 గా పేర్కొంటారు. వాయువ్య పసిఫిక్‌లో వేగం 239 కిలోమీటర్లు దాటితే టైఫూన్లు గా చెబుతారు. 254 కి.మీ. మించితే హరికేన్ - 5, సూపర్ టైఫూన్లు గా చెబుతారు. ఇవి సృష్టించే భీభత్సం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రాణ, ఆస్తి నష్టాలతోపాటు ఈ విపత్తు నుంచి కోలుకునేందుకు నిధుల ఖర్చుతోపాటు కొన్ని నెలలు పడుతుంది. » హుద్‌హుద్ తుపాను తీవ్రత గురించి అమెరికాకు చెందిన నాసా 3 రోజుల ముందే ప్రపంచానికి తెలిపింది. నాసాకు చెందిన ఆక్వా ఉపగ్రహం ఈ నెల 9వ తేదీ రాత్రి 7.53 గంటలకు భారత దేశం మీదుగా పయనించే సమయంలో సముద్రంలో తుపాను కేంద్రీకృతమైన ప్రాంతాన్ని చిత్రీకరించింది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా బంగళాఖాతంలో 155 మైళ్ల దూరంలో ఉన్న తుపాను దృశ్యాన్ని, ఉష్ణోగ్రతల వివరాలను ఆక్వా నమోదు చేసింది. ఈ తుపాను తీవ్రంగా ఉంటుందని అప్పుడే తెలిపింది.
|
అక్టోబరు - 13
|
¤ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాలపై హుద్‌హుద్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. హుద్‌హుద్ ధాటికి ఉత్తరాంధ్రలో 21 మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.¤ మెదక్ జిల్లా సిద్ధిపేట మార్కెట్ యార్డులో రూ.5కే భోజనం అందించే 'సద్దిమూట'; మాతా శిశు సంరక్షణ, ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఇచ్చే 'భోజనామృతం' కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. » గతంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన 'సుభోజనం' పథకానికే 'సద్దిమూట' గా తిరిగి పేరు పెట్టారు.
|
అక్టోబరు - 14
|
¤ హుద్‌హుద్ తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.1000 కోట్లను ప్రకటించారు. » తుపాను నష్టం, సహాయ పునరావాస కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా hudhud.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో సహాయ పునరావాస కార్యక్రమాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదులు, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సిటిజన్ ఇన్‌పుట్స్ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేశారు.¤ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం అమలు చేసే గృహనిర్మాణ పథకాన్ని నందమూరి తారక రామారావు పేరుతో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఇప్పటివరకు ఈ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్లు (ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్‌మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్)గా పిలుస్తున్నారు.¤ హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై విచారణ, చర్యల సిఫార్సు బాధ్యతను సాంకేతిక విద్య కమిషనర్ శైలజా రామయ్యర్‌కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
|
అక్టోబరు - 16
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన అచ్యుతాపురం రికార్డు సృష్టించింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 8.30 నుంచి 13వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు 52.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో 1987 నవంబరు 3న నెల్లూరు జిల్లాలో నమోదైన 52.3 సెంటీమీటర్ల రికార్డు రెండో స్థానానికి వెళ్లింది. » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రికార్డును పరిశీలిస్తే ఖమ్మం జిల్లాకు చెందిన కొయిడాలో 1996 జూన్ 17న కురిసిన 67.5 సెంటీమీటర్ల వర్షపాతానిదే తొలి స్థానం.
|
అక్టోబరు - 17
|
¤ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రాబోయే రెండు మూడేళ్లలో తిరుమల తిరుపతి తరహాలో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. రెండువేల ఎకరాల భూమిని సేకరించి విల్లాలు, కాటేజీలు, ఉద్యానాలు, వేద పాఠశాల, జింకల పార్కులను ఏర్పాటు చేసి 'టెంపుల్ సిటీ'గా తయారు చేస్తారని తెలిపారు.¤ తెలంగాణ రాష్ట్రంలో 'నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ (ఎన్ఎంఎఫ్‌పీ)' పథకం అమలుకు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 18ని జారీ చేసింది.
|
అక్టోబరు - 20
|
¤ దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు పరిధిలో ఉన్న మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలను ఈ బ్యాంకు పరిధిలోకి తీసుకురావడంతో తెలంగాణ అంతటికీ ఒకే గ్రామీణ బ్యాంకు ఏర్పాటయింది. » ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయమే ఈ బ్యాంకు కేంద్ర కార్యాలయం కానుంది. » తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రాయోజిత (స్పాన్సర్) బ్యాంకుగా ఉంటుంది.
|
అక్టోబరు - 21
|
¤ కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల లైవ్‌స్టాక్ భవనంలో రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. |
అక్టోబరు - 22
|
¤ తుపాను తాకిడికి నష్టపోయిన విశాఖవాసుల్లో ఆత్మస్థైర్యం, స్ఫూర్తి నింపేందుకు 'తుపానుని జయిద్దాం' పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ సాగరతీరంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ¤ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అవుటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)ను జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎన్‌హెచ్‌డీపీ - 7) కింద చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే, ప్రాజెక్టుకు అవసరమైన భూమినంతటినీ రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలని షరతు విధించింది. » హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహాలో విజయవాడ-గుంటూరు-తెనాలి చుట్టూ రూ.19,700 కోట్లతో 180 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన రింగురోడ్డు ప్రాజెక్టు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ¤ గతేడాది (2013) ఖరీఫ్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలు నష్టపోయిన 11 లక్షల మంది రైతులకు దాదాపు రూ.600 కోట్లను పరిహారంగా ఇవ్వాలని జాతీయ వ్యవసాయ పంటల బీమా కంపెనీ నిర్ణయించింది. ఇందులో రూ.282.54 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. మిగతా రూ.320 కోట్ల విడుదలకు ప్రభుత్వ అనుమతిని కోరుతూ దస్త్రం పంపింది. |
అక్టోబరు - 23
|
¤ ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాన్ బాధితులను ఆదుకునేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్ఐఎన్ఎల్ - రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. |
అక్టోబరు - 24
|
¤ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిని భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది.¤ తెలంగాణలో ప్రభుత్వ చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకునేందుకు రాబోయే అయిదేళ్లకు లీజు రుసుం పెంచకుండా మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో చేపల పెంపకానికి ఏటా మత్స్యకారులకు ప్రభుత్వం లీజుకు ఇస్తుంది. » చెరువుల స్థాయిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీలో చిన్న వాటికి రూ.10 వేల లోపు లీజు రుసుం ఉంటుంది. రెండో కేటగిరీ కింద రూ.10 వేల నుంచి రూ.20 వేలు, 3వ కేటగిరీలో రూ.20 వేలకు మించి రుసుం ఉంటుంది.
|
అక్టోబరు - 27
|
¤ హుద్‌హుద్ తుపాను సృష్టించిన విపత్తు మూల్యం రూ.63,000 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. » తుపానులో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకే రూ.21,640.63 కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు సుమారు రూ.1630 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు తెలిపింది. » ఇక ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టం ఊహ కందని విధంగా ఉన్నట్లు పేర్కొంది. అది సుమారు రూ. 30,000 - 40,000 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేసింది. » ఈ ప్రకృతి వైపరిత్యం కారణంగా అన్నింటికంటే ఎక్కువగా పారిశ్రామిక రంగం కుదేలైనట్లు తెలిపింది. ఈ రంగానికి సుమారు రూ.6,136 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. గృహనిర్మాణ రంగానికి రూ.3,236 కోట్లు, మున్సిపల్ శాఖ ఆస్తులకు రూ.3,621 కోట్లు, రోడ్ల, భవనాలకు రూ.1,065 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. » ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. రూ.1,339 కోట్ల విలువైన ఉద్యాన పంటలు, రూ.940 కోట్ల విలువైన సాధారణ పంటలు నాశనమైనట్లు వివరించింది. » ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందుఎన్నడూ లేనంత బీభత్స రీతిలో విశాఖపట్నానికి తాకిన ఈ భారీ విపత్తు నుంచి బయట పడాలంటే కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. » ఈ భారీ విపత్తు నుంచి బయటపడటానికి రూ.9,751 కోట్ల సాయం చేయాలని కోరింది. ఇప్పటికే తక్షణ సాయం కింద ప్రధాన మంత్రి ప్రకటించిన వెయ్యికోట్ల రూపాయలకు అదనంగా మరో 8,751 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. » ఈ నెల 12న సంభవించిన తుపాను తాకిడికి రాడార్లు కూడా పనిచేయడం లేదు. |
అక్టోబరు - 29
|
¤ నవంబరులో జరిగే కార్తీక వన మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని, ఈ సందర్భంగా 25 కోట్ల మొక్కలని నాటాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. |
అక్టోబరు - 30
|
¤ తెలంగాణ శాసనసభలో ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యుడిగా సికింద్రాబాద్‌కు చెందిన ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. » ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్ నియామకంతో తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120కి చేరింది. ¤ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » 2015 ఫిబ్రవరి 14న ఆయన జయంతిని కర్నూల్లో నిర్వహించాలని పేర్కొంది. ¤ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. |
అక్టోబరు - 31
|
¤ ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు 7,858 కిలోల భారీ లడ్డూను తయారు చేసిన తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ నాలుగోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. » 2011లో 5,570 కిలోలతో లడ్డూ తయారీని ప్రారంభించి, 2012లో 6,599 కిలోలు, 2013లో 7,133 కిలోలు, 2014లో 7,858 కిలోల భారీ లడ్డూలను ఈ సంస్థ తయారు చేసి రికార్డుల కెక్కింది. |
|
|