సెప్టెంబరు - 1
|
¤ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడల్లో తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ)కి అప్పగించింది. » డీఎంఆర్ సీ ముఖ్య సలహాదారు ఇ.శ్రీధరన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెట్రోరైల్ ప్రాజెక్ట్ సలహాదారుగా నియమించింది. » రాష్ట్రంలోని ఈ రెండు ప్రాజెక్టులను మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఇ.శ్రీధరన్‌ను కోరారు. » ఢిల్లీ మహానగరంలో నిర్దిష్ట గడువుకు ముందే మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసిన ఘనత శ్రీధరన్ సొంతం. |
సెప్టెంబరు - 2
|
¤ బాలికా సంరక్షణ కోసం గత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 'బంగారు తల్లి పథకం' పేరును చంద్రబాబు ప్రభుత్వం 'మా ఇంటి మహాలక్ష్మి'గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో చట్ట సవరణ చేయనున్నట్లు ప్రకటించింది. |
సెప్టెంబరు - 4
|
¤ నూతన ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంటుందనే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. » 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలతోపాటు అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా పలు ప్రాజెక్టులను సీఎం శాసనసభలో ప్రకటించారు. » ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని, సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.¤ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా సతీష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » ఈ విషయాన్ని మండలి ఛైర్మన్ చక్రపాణి శాసనమండలిలో ప్రకటించారు. » మండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య. |
సెప్టెంబరు - 6
|
¤ చట్ట సభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తమ బడ్జెట్‌లో బీసీ ఉప ప్రణాళికకు 25 శాతం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ పరంగా హోదా కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.¤ చిత్తూరు జిల్లా కలికిరిలో ఆగస్టు 23న సైనిక్ పాఠశాల 'లెర్న్ టు లీడ్' నినాదంతో ప్రారంభమైనట్లు రక్షణశాఖ ప్రకటించింది. » ఆంధ్రప్రదేశ్‌లో రెండోదైన ఈ విద్యాలయం 84 ఎకరాల్లో విస్తరించి ఉంది. » ఈ విద్యాలయ మొదటి ప్రిన్సిపల్ కల్నల్ ఆర్ అలగర్ రాజ్. |
సెప్టెంబరు - 10
|
¤ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తాగునీటి గ్రిడ్‌ను మూడున్నరేళ్లలో పూర్తిచేసి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను కొత్తగా ఏర్పాటు చేసింది. » దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టరుగా ఐటీ రంగ నిపుణులు గంటా సుబ్బారావు, సంచాలకులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణను నియమించింది. |
సెప్టెంబరు - 11
|
¤ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మహాత్ముడి గ్రామ స్వరాజ్యం కలలను నిజం చేసేలా, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ 'తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం'ను రూపొందించింది. అతి కీలకమైన గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేసేలా చట్టం సిద్ధమైంది. దీనిపై ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌గా వెలువడనుంది. » తెలంగాణ రాష్ట్రంలోని 8845 గ్రామ పంచాయతీలు కేవలం విధి నిర్వహణకే పరిమితమవకుండా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణ సంస్థలుగా కూడా వ్యవహరించనున్నాయి.¤ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. » మొదటిదశలో ఏడు జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. » మెదక్ జిల్లాలో సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, నల్గొండ జిల్లాలో సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.¤ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతోపాటు కొన్ని గ్రామాలను తెలంగాణ పరిధిలో నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనం చేసే ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో ఉన్న ఆరు రెవెన్యూ మండలాలు, ఆరు గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది ప్రకటనను విడుదల చేసింది. » రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3లో వివరాలు పేర్కొన్నారు. ఆ మేరకు ఖమ్మం జిల్లా పరిథిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, చింతూరు, వర రామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఆరు గ్రామాలు విలీనమయ్యాయి. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కిందికి ఈ 6 గ్రామాలు వచ్చాయి. ¤ పైపుల ద్వారా ఇంటికే వంట గ్యాస్‌ను సరఫరా చేసే పథకానికి తెలంగాణలోని అయిదు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ (తెలంగాణ), కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి (ఆంధ్రప్రదేశ్) జిల్లాలున్నాయి. రానున్న మూడు నుంచి అయిదేళ్లలో వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ¤ హైదరాబాద్ మెట్రో రైలు మస్కట్ 'నిజ్'ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. » నగరానికి ఉన్న నాలుగు వందల ఏళ్ల ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా, నాటి నిజాం ప్రభువుల రాజసం ఉట్టి పడేలా 'నిజ్' ను తీర్చిదిద్దారు. » మెట్రో రైలు మూడు కారిడార్లను తెలిపే రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నీలంతో మస్కట్ 'నిజ్' ఉంటుంది. మెట్రో స్టేషన్‌లలో ఉండే ప్రయాణికులకు ఉపయోగపడేలా 'నిజ్' పేరిట హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగుల్లోనూ ఈ 'నిజ్' ప్రయాణికులు కోరిన సమాచారాన్ని తక్షణం తెలియజేస్తుంది. ఏ రైలు ఏ రూట్లో ఏ సమయంలో అందుబాటులో ఉంటుంది, స్టేషన్లో ఉన్న వసతులు, రైలు ప్రత్యేకతలు, మెట్రో డిపోల విశేషాల సమాహారాన్ని అన్ని వర్గాలకు అందించడమే నిజ్ పని. » మస్కట్ నిజ్‌కు ఎల్అండ్‌టీ సంస్థ ఓ కథను సృజనాత్మకంగా రూపొందించి, అతడు ప్రయాణికులకు అడుగడుగునా సహాయ పడతాడు అనే కథతో నిజ్ మస్కట్‌కు ఇతివృత్తాన్ని తయారు చేసింది. ఈ కథ ప్రకారం 'నిజ్' 1985లో నిజాం వంశంలో పుట్టాడు.¤ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకు రూ.కోటి అందజేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సానియా ఎంపికయ్యింది. |
సెప్టెంబరు - 12
|
¤ తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలను ఈ నెల 24 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకు రూ.10 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. » మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, వసుంధర రాజే, ఆనందీ బెన్, మమతా బెనర్జీ; లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్; కేంద్ర మహిళా మంత్రులు, గవర్నర్లు, కిరణ్‌బేడీ, మేథాపాట్కర్, అరుంధతీ రాయ్‌లతో పాటు మరో విదేశీ ప్రముఖరాలిని బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను స్వయంగా ఆహ్వానిస్తానని కేసీఆర్ ప్రకటించారు.¤ తిరుపతిలో వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు సిఫార్సు చేయాలని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించాలని సీఎం ఆర్థిక సంఘాన్ని కోరారు. » ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి నెంబర్‌వన్ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని, 2022 నాటికి దేశంలోని తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెడతానని ఆర్థిక సంఘానికి చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు.లక్ష్యాలు మాతృ మరణాలను లక్షకు 990 నుంచి 450కి తగ్గించడం. 5-16 ఏళ్ల లోపున్న 81 లక్షల మంది పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రాథమిక విద్యను అందించడం. 16-24 ఏళ్ల లోపు 50 లక్షల మంది యువకులను ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా నైపుణ్య శిక్షణ అందించడం. 100 శాతం అక్షరాస్యత సాధించడం. స్వయం సహాయక సంఘాల్లో కోటి మందిని సభ్యులుగా చేర్చడం. వచ్చే అయిదేళ్లలో వారికి రూ.లక్ష మూలధనం/ బ్యాంక్ రుణం సమకూర్చడం. రాష్ట్రంలోని 33 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై వచ్చే అయిదేళ్లలో తలసరి రూ.లక్ష పెట్టుబడిని పెట్టడం. ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్లు, అయిదు ప్రచారోద్యమాలే ప్రధాన పరిపాలన లక్ష్యాలు. అసంఘటిత రంగం చేయూతకు ప్రాథమిక రంగాల అభివృద్ధి, కరవు నివారణ. వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి పోర్టు ఆధారిత వృద్ధి, సేవా రంగాల విస్తృతే అంతిమ మార్గం. ప్రస్తుతం రూ.85,709గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2018-19 నాటికి రూ.2 లక్షలకు తీసుకెళ్లడం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.4.75 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు పెంచడం. |
మూడు వ్యూహాలుసామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు వ్యూహాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో తోలు, ఆటోమొబైల్, బయోటెక్, సిమెంట్, గనులు, సౌర, పవన విద్యుత్తు, ట్రాన్స్ ఫార్మర్లు, సాఫ్ట్‌వేర్, ఏరోస్పేస్, ఆధ్యాత్మిక పర్యాటకం, వ్యవసాయ వాణిజ్యానికి ప్రోత్సాహం. ఉత్తరాంధ్రలో సాఫ్ట్‌వేర్, ఐటీ, సెమీ కండక్టర్, స్టీల్, పెట్రోల్, రత్నాలు, సౌర పవన విద్యుత్తు, జౌళి, విద్య, సముద్ర ఆహారం, ప్యాకేజింగ్, స్టోరేజీలకు ప్రోత్సాహం. కోస్తా జిల్లాల్లో పళ్లు, కూరగాయలు, పాలు, మత్స్య, పాడి, పశు, ఆహారశుద్ధి, ప్యాకేజింగ్, ఆటోమొబైల్, రవాణా, టెక్స్‌టైల్, ఫార్మా, విమానయాన, వైద్య పరికరాలు, దుస్తులు, ఐటీ, విద్య, నైపుణ్యాభివృద్ధి, వినోద రంగాలను విస్తృతం చేయడం. |
సెప్టెంబరు - 15
|
¤ అక్టోబరు 2వ తేదీ నుంచి నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ, పింఛన్ల పెంపు, 24 గంటల విద్యుత్తు సరఫరా కార్యక్రమాలను ఆరోజు నుంచి మొదలు పెట్టడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమను సాధించింది. దేశీయ ద్విచక్ర వాహనదారు హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) పెట్టుబడులను ఆకర్షించింది. » హీరో మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యే రెండో ఆటోమొబైల్ పరిశ్రమ. » చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో జపాన్‌కు చెందిన ఇసుజీ మోటార్స్ కార్ల పరిశ్రమ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. » శ్రీ సిటీ సమీపంలోని ఏపీఐఐసీ కి చెందిన 600 ఎకరాల్లో హీరో మోటార్స్ సంస్థ భారీ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించింది. » దక్షిణాది రాష్ట్రాలు, దక్షిణ, తూర్పు ఆసియా దేశాల అవసరాలకు సరిపడా హీరో మోటార్స్ వాహనాలను సంస్థ ఉత్పత్తి చేయనుంది. » హీరో మోటార్ సంస్థ రూ.2200 కోట్లతో ఈ ప్లాంటును నిర్మించనుంది. ఏటా 18 లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ప్లాంటు కార్యరూపం దాల్చి, ఉత్పత్తులు ప్రారంభమయ్యేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్లాంటు ద్వారా కనీసం 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.¤ ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ఛానల్‌కు మల్లాది శైలజ సుమన్ తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. » విజయవాడలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయం (హైదరాబాద్)లో ప్రోగ్రాం హెడ్‌గా శైలజ పని చేశారు. » రెండు తెలుగు రాష్ట్రాలకు భాష ఒక్కటే కావడంతో తొలుత రెండు ఛానెళ్లు అవసరం లేదని భావించారు. అయితే స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కోణంలో రెండు ఛానళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. » ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సప్తగిరి ఛానెల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారు. తెలంగాణాకు మరో పేరు పెడతారు. » ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నారు.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఒక్క కాగితం కూడా వాడకుండా కేబినెట్ సమావేశం నిర్వహించి చరిత్ర సృష్టించింది. » ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. సాధారణంగా ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ఎజెండాను మంత్రులకు పంపుతారు. కొన్ని నివేదికలు, సమాచారాన్ని కూడా అందిస్తారు. మొత్తంగా ఒక్కో మంత్రికి 60 - 70 పేజీల పత్రాలు అందుతాయి. ఒక్కోసారి అంతకు మించే ఉంటాయి. ఇక సమావేశానికి వచ్చే అధికారులు కూడా తమతో ఫైళ్లు తీసుకొచ్చి, వాటిలో అవసరమైన పత్రాల ప్రతులను మంత్రులకు అందిస్తారు. మొత్తానికి కేబినెట్ భారీస్థాయిలో కాగితాలతో కుస్తీపడిన తర్వాతే నిర్ణయాలు వెలువడతాయి. » తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఒక్క కాగితం కూడా కనిపించలేదు. అనేక కీలక నిర్ణయాలకు ఈ భేటీ వేదికైంది. దీని వెనుక భారీ కసరత్తు జరిగింది. » 'ఈ - కేబినెట్' లో భాగంగా మంత్రులందరికీ ముందుగానే ఐప్యాడ్లు ఇచ్చారు. ఇంటర్నెట్ ద్వారా సమావేశ ఎజెండాను నేరుగా వాటికి పంపారు. ఎజెండాకు అనుబంధంగా ఉండే సమాచారం, ఇతర అనుబంధాలను కూడా 'అటాచ్‌మెంట్' రూపంలో మంత్రుల ఐప్యాడ్లకు చేరుకుంది. ఫైళ్లకు బదులుగా మంత్రులు సింపుల్‌గా ఐప్యాడ్లతో వచ్చారు. » ముఖ్యమైన అంశాలపై అధికారులు మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటికి సంబంధించిన అదనపు వివరాలను మంత్రులు ఐప్యాడ్లలో ఎప్పటికప్పుడు చూసుకున్నారు. » ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 'ఈ -కేబినెట్' కు జాతీయ మీడియాలో కూడా ప్రశంసలు లభించాయి.
|
సెప్టెంబరు - 16
|
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే రోజు పది ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)ను కుదుర్చుకుంది. ¤ ఈ 10 అవగాహన ఒప్పందాల్లో విద్యుత్తుకు సంబంధించి 6 ఎంఓయూలు ఉన్నాయి.ఒప్పందాలు¤ అందరికీ విద్యుత్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపే ఒప్పందం. గృహాలకు నిరంతర విద్యుత్తు సరఫరాకు ఇది దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల విద్యుత్తును అందించేందుకు దశలవారీగా కార్యక్రమం. ¤ 2016 జులై-సెప్టెంబరు నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా 24 గంటల విద్యుత్ సరఫరా. ప్రస్తుతమున్న 8,037 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని 2019 నాటికి 29,017 మెగావాట్లకు పెంపు. ¤ అనంతపురం జిల్లా ఎస్‌పీకుంటలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 5,500 ఎకరాలను కేటాయించింది. ¤ విశాఖపట్నం జిల్లా పులిమడకలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఒప్పందం. ¤ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 5 వేల హెక్టార్లలో 2,500 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం. ¤ గృహ, వ్యవసాయరంగంతో పాటు పురపాలక సంఘాల్లో ఇంధన పొదుపు చర్యలను పాటించేందుకు ఒక ఒప్పందం. ¤ చిత్తూరు జిల్లా మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్‌కు ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయించింది. భూమి అప్పగింత, ఆటోమొబైల్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై ఒప్పందం. ¤ డీఆర్‌డీవోకు చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలంలోని కొక్కిరాల కొండలో 1,103 ఎకరాల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం. ¤ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమీర్ (SAMEER - సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్)కు విశాఖపట్నం జిల్లా ఆనందపురంలోని గంభీపురంలో 13 ఎకరాల అప్పగింతకు ఒప్పందం. ¤ మొత్తం ఎంఓయూలపై వచ్చే అయిదేళ్లలో రూ.88,500 కోట్లు ఖర్చు చేసే అవకాశముందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో ఎన్టీపీసీ ద్వారా రూ.25,000 కోట్లు, సోలార్ ప్రాజెక్టుల ద్వారా రూ.20,000 కోట్లు, హీరో గ్రూప్ ద్వారా రూ.3,500 కోట్లు, డీఆర్‌డీవో ద్వారా రూ.40,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ¤ కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య విజయం సాధించింది. ¤ మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెరాసా అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ¤ చిన్నారులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించడానికి కొత్తగా 'గోరు ముద్దలు' పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటించారు. » రాష్ట్రంలోని 55,024 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి బలహీనంగా, బరువు తక్కువగా ఉన్నవారికి ఇప్పుడిచ్చే దానికంటే రెండు రెట్లు పౌష్టికాహారం ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశమని మంత్రి ప్రకటించారు.
|
సెప్టెంబరు - 18
|
¤ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.¤ తెలంగాణ రాష్ట్రంలో మూడు అగ్రశ్రేణి సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పుతున్నాయి. » హైదరాబాద్‌కు సమీపంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ సంస్థలు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ ఉన్నాయి. ఈ మూడు సంస్థలు తొలిదశలో దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. |
సెప్టెంబరు - 19
|
¤ వ్యవసాయశాఖలో ఆదర్శ రైతుల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో బహుళ ప్రయోజన విస్తరణ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. » ఆదర్శ రైతు వ్యవస్థను 2007లో వైఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. వ్యవసాయ విస్తరణపై రైతుల్లో చైతన్యం తీసుకురావడంలో ఆదర్శ రైతులు విఫలమయ్యారని విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. » రైతులు వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసుకున్న పంటపై రైతు బంధు పథకం కింద ప్రస్తుతం రూ.లక్ష వరకు ఉన్న రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. |
సెప్టెంబరు - 21
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు 12.70 లక్షల గృహాల కొరత ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1.8 కోట్ల గృహాల కొరత ఉండగా అందులో దాదాపు 7 శాతం కొరత ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు వెల్లడించింది. » ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటి నిర్మూలనకు, మౌలిక సదుపాయాల కల్పనలకు కేంద్ర ప్రభుత్వం 'సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆవాస్ యోజన' కార్యక్రమాన్ని చేపట్టనుంది. తద్వారా 2022 నాటికి దేశంలో అందరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యం ఏర్పరచుకుంది. » ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడల్లో నివసించే జనాభా 50.67 లక్షలు. మురికివాడలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మురికివాడల్లో నివసిస్తున్న జనాభాలో 9 శాతం మంది ఇక్కడే ఉన్నారు. » తెలంగాణ రాష్ట్రంలో మురికివాడల్లో నివసించే జనాభా 45.20 లక్షలు. దేశవ్యాప్తంగా మురికివాడల్లో నివసిస్తున్న జనాభాలో 7 శాతం మందితో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. |
సెప్టెంబరు - 22
|
¤ బోధనా రుసుముల చెల్లింపు పథకం స్థానంలో 'ఫాస్ట్' (FAST - ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సాయాన్ని కేవలం తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. » తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జులై 30న జారీ చేసిన 'ఫాస్ట్' జీవోను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరస్రసాద్‌రావు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది.¤ ప్రజలకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారాన్ని మండల డిప్యూటీ తహసీల్దార్‌లకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తహసీల్దార్‌లకు మాత్రమే ఆ పత్రాలు ఇచ్చే అధికారం ఉంది. ఈ విషయంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. |
సెప్టెంబరు - 23
|
¤ అయిదు జబ్బులు డిఫ్తీరియా, టెటనస్, కోరింత దగ్గు (డీపీటీ), కామెర్లు, న్యూమోనియా, ఇన్‌ఫ్లూయంజాకు ఒకే టీకా 'పెంటావ్యాలెంట్'ను పిల్లలకు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ నిర్ణయం తీసుకుంది. » కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, పాండిచ్చేరి, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2011లో పెంటావ్యాలెంట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించి సత్ఫలితాలు సాధించారు. » పెంటావ్యాలెంట్‌తో పాటు శిశువుల్లో తీవ్ర విరేచనాల నిరోధానికి రోటా వ్యాక్సిన్ అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. |
సెప్టెంబరు - 24
|
¤ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. » ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వం వహించే ఈ కమిటీలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఐటీ-సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సభ్యులుగా ఉంటారు. » కమిటీకి ఎలాంటి కాల పరిమితి విధించలేదు. భూ సమీకరణ పూర్తయ్యేంత వరకు ఇది కొనసాగనుంది.¤ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యులతో కూడిన మూడు ఆర్థిక కమిటీలను నియమించారు.
కమిటీ
|
|
ఛైర్మన్
|
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) | - | భూమా నాగిరెడ్డి |
అంచనాల కమిటీ | - | మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి |
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ | - | కాగిత వెంకట్రావు |
|
¤ దేశంలోనే తొలి వ్యవసాయ థీమ్‌పార్కు ఏర్పాటు, నీటి వనరుల నిర్వహణ కోసం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ (ఆర్ఎఫ్‌సీ), అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)ల మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. » ఇందులో భాగంగా ఆర్ఎఫ్‌సీ, ఇక్రిశాట్‌లు కలిసి రైతుల కోసం అత్యాధునిక వ్యవసాయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
|
సెప్టెంబరు - 25
|
¤ రాజీవ్ యువశక్తి పథకం పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని సీఎంఈవై - ముఖ్యమంత్రి యువజన సాధికారత (చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్)గా పిలవనున్నారు.
|
సెప్టెంబరు - 26
|
¤ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఉమ్మడి రాష్ట్రంలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విభజిస్తూ తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. » ఎన్టీఆర్ వర్సిటీ తరహాలో తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. » వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయానికి తాత్కాలిక ఉపకులపతి (వీసీ)గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య క్యాదర్శి సురేష్ చందాను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో కొత్త ఉపకులపతిని నియమించనుంది.¤ 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు మిషన్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆ.ర్.కృష్ణారావు జీవో నెంబరు 20 విడుదల చేశారు. » వ్యవసాయం - దాని అనుబంధ రంగాలు, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల కల్పన, సేవ రంగాల్లో విశేష ప్రగతి సాధించి 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో తొలి రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో ముందడుగు వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. » ప్రతి మిషన్‌కు ముఖ్యమంత్రి అధ్యక్షతన పనిచేసే మిషన్ సపోర్ట్ యూనిట్‌తో పరిపాలన మండలి ఏర్పాటవుతుంది. సంబంధిత శాఖ కార్యదర్శి దానికి సమన్వయకర్తగా పని చేస్తారు.
|
సెప్టెంబరు - 27
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును 'డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్యశ్రీ' గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న 938 చికిత్సలకు అదనంగా మరో వంద చికిత్సలను చేర్చారు. దీంతోపాటు ఏడాదికి ఒక కుటుంబానికి ఉన్న చికిత్సల వ్యయ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు.¤ కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. » తెలంగాణ ఉద్యమ ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.¤ హైదరాబాద్ పురానీహవేలీ లోని సిటీ సివిల్ కోర్టు 150 వసంతాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. » తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.¤ విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 'సప్తగిరి' ఛానల్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుతో కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. » విజయవాడ ఆకాశవాణి కేంద్రం భవనానికి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టి ప్రజలకు పునరంకితం చేశారు.
|
సెప్టెంబరు - 29
|
¤ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. » తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో ఉన్న 462 మంది అమరవీరుల కుటుంబాలకు అతి త్వరలోనే ఈ సాయం అందించేందుకు నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తూ రూపొందిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.¤ వృద్ధ కళాకారుల పింఛనును తెలంగాణ ప్రభుత్వం రూ.500 నుంచి రూ.1500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు నెల నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ పింఛను పొందుతున్న 3,254 మంది కళాకారులు దీనివల్ల లబ్ధి పొందుతారు.
|
|
|