ఆగస్టు - 2
|
¤ రూ.50 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సిండికేట్ బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎస్.కె.జైన్ సహా ఆరుగురిని సీబీఐ బెంగళూరులో అరెస్టు చేసింది. బొగ్గు కుంభకోణంలో ప్రమేయమున్న కొన్ని కంపెనీలకు బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా రుణపరిమితిని పెంచేందుకు లంచం తీసుకున్నట్లు జైన్‌పై ఆరోపణలు ఉన్నాయి. » కేసు దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
|
ఆగస్టు - 3
|
¤ వరదలు ముంచెత్తవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బీహారులోని నలభై నాలుగు వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొరుగు దేశమైన నేపాల్‌లో కొండచరియలు విరిగి పడిన దుర్ఘటన ప్రభావం బీహారుపై పడే ప్రమాదం ఉండటంతో ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ చర్యలకు ఉపక్రమించింది.
» నేపాల్ లోని సింధుపాల్‌చౌక్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సుమారు రెండువందల మంది ఆచూకీ తెలియలేదు. » నేపాల్‌లో సుంకోషిగా మొదలయ్యే నది భారత భూభాగంలోకి బీహారు వద్ద కోసీగా ప్రవేశిస్తుంది.¤ దేశీయ పరిజ్ఞానంతో తయారైన 40 ధ్రువ్ హెలికాప్టర్లను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిలిపివేసింది. జులై 25న ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ధ్రువ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏడుగురు సిబ్బంది మరణించిన నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హెలికాప్టర్లపై నిశితంగా తనిఖీలు జరిపేవరకూ వాటిని గగనవిహారం చేయించబోమని వైమానిక దళం తెలిపింది. ధ్రువ్ హెలికాప్టర్లను పర్వత ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు.
|
ఆగస్టు - 5
|
| ¤ ఢిల్లీ శాసనసభను రద్దు చేసే విషయంలో అయిదు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. » అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో 2014 ఫిబ్రవరి 17న ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు.¤ జీవశాస్త్ర విద్యార్థులకు శిక్షణ నిమిత్తం జంతువులపై కోత ప్రక్రియ (డిసెక్షన్)ను చేపట్టవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు నోటిఫికేషన్ జారీ చేసింది. » 2011లో ఈ ప్రక్రియపై పాక్షిక నిషేధం విధించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. » జంతు ప్రేమికుల సంస్థ అయిన 'పెటా' (PETA - పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ప్రతినిధులతో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పలు విడతల్లో సంప్రదింపులు జరిపాక ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనివల్ల ఏటా 1.9 కోట్ల జంతువుల ప్రాణాలను కాపాడవచ్చని 'పెటా' ప్రకటించింది.¤ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం నేపథ్యంలో ఇటలీకి చెందిన రక్షణ ఉత్పత్తుల సంస్థ ఫిన్‌మెకానికా, దాని అనుబంధ సంస్థల నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. » భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్ల సరఫరాకు ఉద్దేశించిన రూ.3600 కోట్ల ఒప్పందానికి సంబంధించి రూ.360 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీని మాతృసంస్థ ఫిన్‌మెకానికా. దీని అనుబంధ సంస్థలు భారత్‌లో అనేక రక్షణ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నాయి. |
ఆగస్టు - 11
|
¤ ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రెండుబిల్లులను ప్రవేశపెట్టింది.
» కొలీజియం స్థానంలో ఆరుగురు సభ్యులతో కూడిన నియామక సంస్థ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ఆ సంస్థ విధివిధానాలను నిర్దేశించే బిల్లు మరొకటి.
» కొలీజియం వ్యవస్థ ఉండాలా? వద్దా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యవస్థను భారత ప్రధాన న్యాయమూర్తి గట్టిగా సమర్థించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశ పెట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
» యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఇలాంటి బిల్లునే రాజ్యసభలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బిల్లును సమగ్రంగా తీసుకొచ్చేందుకే ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పింది.
» తాజాగా ప్రవేశపెట్టిన రెండు బిల్లుల్లో ఒకదాని పేరు జ్యుడిషియల్ నియామకాల కమిషన్ బిల్లు (ఎన్‌జేఏసీ) - 2014, మరొకటి రాజ్యాంగ (121వ సవరణ) బిల్లు - 2014. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ఆధిక్యం కావాల్సి ఉండగా సాధారణ బిల్లు ఆమోదానికి సాధారణ ఆధిక్యం సరిపోతుంది.
» ప్రతిపాదిత ఎన్‌జేఏసీని, ఆ సంస్థ కూర్పును రాజ్యాంగంలో పొందుపరచడానికి రాజ్యాంగ (121వ సవరణ) బిల్లు - 2014ను ఉద్దేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలకు ప్రతిపాదిత ఎన్‌జేఏసీ అనుసరించాల్సిన ప్రక్రియను ఎన్‌జేఏసీ బిల్లు - 2014లో పొందుపరిచారు. కమిషన్ కూర్పును భవిష్యత్తులో సాధారణ చట్టం ద్వారా మార్చకుండా ఉండేందుకు, న్యాయవ్యవస్థ నుంచి వెల్లడవుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తున్నారు. ఈ బిల్లులోని ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
ఎన్‌జేఏసీకి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు.
ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు.
న్యాయశాఖా మంత్రి, ఇద్దరు ప్రముఖులు ఈ కమిషన్‌లో ఉంటారు.
ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. వారిని మరోసారి నామినేట్ చేయడానికి వీల్లేదు.
కమిషన్‌లో ఉండే ఇద్దరు ప్రముఖ వ్యక్తులను భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేత లేదా లోక్‌సభలో అతిపెద్ద విపక్ష పార్టీనేత ఎంపిక చేస్తారు.
ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మైనారిటీలకు చెందిన వారై ఉండాలి లేదా మహిళా వర్గం నుంచి ఎంపిక చేయాలి.
ఎన్‌జేఏసీ లోని ఇద్దరు సభ్యులు అంగీకరించకున్నా నియామక ప్రక్రియ ముందుకు వెళ్లదు. ఈ కమిషన్ సిఫార్సును ప్రభుత్వం పునఃపరిశీలించాల్సిందిగా వెనక్కి పంపించవచ్చు. దాన్ని కమిషన్ ఏకాభిప్రాయంతో మళ్లీ పంపిస్తే నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే. |
ఆగస్టు - 12
|
¤ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'అమ్మ' పేరిట మరో పథకానికి శ్రీకారం చుట్టారు. నవజాత శిశువుల కోసం 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకాన్ని ప్రవేశపెడుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు.
» రూ.67 కోట్లు కేటాయించిన ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 670 లక్షల శిశువులకు లబ్ధి చేకూరుతుంది.
» బేబీ కిట్‌లో తువ్వాలు, జత దుస్తులు, దోమ తెర, తలనూనె, సబ్బు, షాంపూ తదితర 16 వస్తువులు ఉంటాయి. |
ఆగస్టు - 13
|
¤ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య వెనుక కుట్రపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ విభాగం మల్టీ - డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ (ఎండీఎంఏ) గడువును కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.
» ఇంటెలిజెన్స్ బ్యూరో తదితర అధికారులతో కూడిన ఈ విభాగం గడువు మే 31తో ముగిసింది. ఇప్పుడు దీని గడువును పెంచారు.
» రాజీవ్‌గాంధీ హత్య కుట్రలో కీలకమైన వ్యక్తిగా అనుమానిస్తున్న శ్రీలంకకు చెందిన కుమరన్ పద్మనాభన్ అలియాస్ కేపీ పాత్రపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.¤ న్యాయమూర్తుల నియామకానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పించే చరిత్రాత్మక బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
» 'జాతీయ జ్యుడీషియల్ నియామకాల బిల్లు - 2014' మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం పొందింది. దీంతో పాటు ప్రతిపాదిత కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే 99వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఎటువంటి వ్యతిరేకత లేకుండా సభ ఆమోదం పొందింది.
» ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దు అవుతుంది. ఆరుగురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ నియామక జాతీయ కమిషన్ (ఎన్‌జేఏసీ) కొలువు తీరుతుంది.
» కమిషన్ సిఫారసును రాష్ట్రపతి పునఃపరిశీలించాల్సిందిగా వెనక్కు పంపించవచ్చని, ఇలా వెనక్కు వచ్చిన సిఫారసును కమిషన్ ఏకాభిప్రాయంతో మళ్లీ పంపిస్తే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సిందేనని బిల్లులో ఉండగా, 'ఏకాభిప్రాయ' నిబంధనను లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ నిబంధనను తొలగిస్తూ అధికారిక సవరణకు కాంగ్రెస్ పట్టుబట్టింది. ప్రభుత్వం అందుకు అంగీకరించి సవరణ చేయడంతో బిల్లు ఆమోదానికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు.¤ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 288 గ్రామాలు ముంపునకు గురవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
» పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 276, ఛత్తీస్‌గఢ్‌లో 4, ఒడిశాలో 8 గ్రామాలతో పాటు 3247.52 హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (స్వతంత్ర హోదా) లోక్‌సభలో ప్రకటించారు. |
ఆగస్టు - 14
|
¤ ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతమున్న 'కొలీజియం' వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
» జ్యుడీషియల్ నియామకాల జాతీయ కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లు - 2014 ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎన్‌జేఏసీని రాజ్యాంగంలో పొందుపరుస్తూ తీసుకొచ్చిన 121వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా రాజ్యసభ 179 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమోదించింది. మొత్తం 180 ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు బిల్లులనూ ఆగస్టు 13నే లోక్‌సభ ఆమోదించింది.
» రాజ్యాంగ సవరణ బిల్లుకు 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన తర్వాతే ఎన్‌జేఏసీ అమల్లోకి వస్తుంది. ఇందుకు 8 నెలల వరకు సమయం పడుతుంది. రాష్ట్రాల ఆమోదం తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. ఆ తర్వాత కొలీజియం వ్యవస్థ రద్దయి ఆరుగురు సభ్యులతో కూడిన ఎన్‌జేఏసీ అమల్లోకి వస్తుంది.
» ఈ కమిషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. సుప్రీంకోర్టులో ఆయన తర్వాత స్థానంలో ఉండే ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు ప్రముఖులు, న్యాయశాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు.
» కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన రెండు బిల్లులను ప్రముఖ న్యాయ కోవిదుడు ఫాలి ఎస్.నారిమన్ తీవ్రంగా తప్పుపట్టారు.
¤ 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
» 21వ శాతాబ్దం మనదేనని, అందుకు కావాల్సిన దృఢ నిశ్చయం, శక్తి, జ్ఞానం, విలువలు, ఐక్యత మనవద్ద ఉన్నాయని, ఈ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.¤ ఎన్‌డీఏ సర్కారు ఆధ్వర్యంలో జులై 7న మొదలైన తొలి పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ఈసారి 167 గంటలపాటు, రాజ్యసభలో 142 గంటల పాటు చర్చలు జరిగాయి. గత ఏడాది యూపీఏ హయాంలో జరిగిన ఇదే బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ కేవలం 19 గంటల 36 నిమిషాల పాటు మాత్రమే నడవడం గమనార్హం. మిగిలిన సమయమంతా అంతరాయాలు, వాయిదాలతోనే గడిచిపోయింది.
» ఈసారి పార్లమెంటు సమావేశాలు 28 సిట్టింగులుగా జరిగాయి. 2004లో జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లో 24 సిట్టింగులు జరగ్గా, 2009లో 26 సిట్టింగులు జరిగాయి.
» ఇంజినీరింగేతర, డిప్లొమా పట్టభద్రులకు శిక్షణ సదుపాయాన్ని కల్పించే
అప్రెంటీస్ బిల్లు - 2014 ను లోక్‌సభ తాజాగా ఆమోదించింది. కార్మిక సంఘాలు వ్యతిరేకించిన ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా శిక్షణార్థులకు ఉద్యోగులతో సమానంగా సెలవులు తదితర సదుపాయాలు సమకూరుతాయి. ¤ సంచలనం సృష్టించిన పూలన్‌దేవి హత్యకేసులో దోషి షేర్‌సింగ్ రాణాకు ఢిల్లీ న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. బందిపోటు నుంచి లోక్‌సభ సభ్యురాలిగా మారిన పూలన్‌దేవిని 2001లో ఢిల్లీలో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాణాకు ఢిల్లీ న్యాయస్థానం యావజ్జీవ శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. |
ఆగస్టు - 15
|
¤ దేశవ్యాప్తంగా 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
» ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు.
» మోడీ తన ప్రసంగంలో సరికొత్త ప్రణాళికా వ్యవస్థ, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన, క్లీన్ ఇండియా తదితర పథకాలను ప్రకటించారు.
ప్రధాని ప్రసంగంలో పేర్కొన్న పథకాల వివరాలు:సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన: ఈ పథకం కింద 2016 లోపు ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించడానికి కృషి చేస్తారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం తదితర ప్రమాణాలతో గ్రామాన్ని తీర్చిదిద్దుతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జయప్రకాష్ నారాయణ్ జయంతి (అక్టోబరు 11) రోజున ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు.ప్రధానమంత్రి జన్ ధన్ యోజన: పేద ప్రజలను బ్యాంకింగ్ సేవల రంగంతో అనుసంధానించడమే లక్ష్యంగా 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' పథకాన్ని మోడీ ప్రకటించారు. ఈ పథకం కింద పేదలకు బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, రూ.లక్ష బీమా, రూ.అయిదు వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తారు. జన్ ధన్ యోజనలో భాగంగా తొలుత 15 కోట్ల మంది పేదలకు బ్యాంకు సేవలు లభించనున్నాయి.పరిశుభ్ర భారత్: జాతి పిత మహాత్మాగాంధీ 150వ జయంతి (2019) నాటికి దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా మలచుకుందామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అక్టోబరు 2 నుంచి 'పరిశుభ్ర భారత్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని, ప్రతి పాఠశాలలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డిని నిర్మిస్తారు. దీని కోసం ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటారు.ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ: 64 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరింత మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రణాళికా సంఘాన్ని 1950లో మన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారు. నాటి సోవియట్ యూనియన్ స్ఫూర్తితో దీనికి నాంది పలికారు. ప్రధాని ఛైర్మన్‌గా వ్యవహరించే ప్రణాళికా సంఘం దేశంలో వనరుల వినియోగం, వివిధ రంగాల్లో సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ సంఘం ఉప ఛైర్మన్‌గా పలువురు ప్రముఖులు పనిచేశారు. తొలి డిప్యూటీ ఛైర్మన్‌గా గుల్జారీలాల్ నందా పనిచేశారు. ఆ తర్వాత ఈ పదవిని వి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రహ్మణ్యం, పి.ఎన్.హస్కర్, మన్మోహన్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్ థారియా, ఆర్.కె.హెగ్డే, చివరిగా మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పనిచేశారు. సోవియట్ స్ఫూర్తితో ప్రభుత్వ రంగానికి, భారీ పరిశ్రమలకు పెద్దపీట వేసిన కాలంలో ప్రణాళికా సంఘానికి ఎంతో ప్రాధాన్యం లభించింది. కానీ 1990లలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచి దాని ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోవడం ఆరంభమైంది. సంస్కరణల నేపథ్యంలో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయడం, లైసెన్స్ రాజ్ శకం అంతరించడంతో ప్రణాళికా సంఘం పెద్దగా అధికారాలు లేకుండా ఒక సలహా సంఘంగా మారిపోయింది. మరో వైపు, ప్రణాళికా సంఘంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిరసన కూడా పెరుగుతూ వచ్చింది. రాష్ట్రాల ప్రణాళికలను ఆమోదింపజేసుకోవడానికి ఏటా ఢిల్లీకి వచ్చి ప్రణాళికా సంఘం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రులు ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ పరిణామాల క్రమంలో ఈ సంఘాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ప్రధాని మోడీ నిర్ణయించారు. » సోవియట్ స్ఫూర్తితో నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు. 1965 వరకూ వరుసగా మూడు ప్రణాళికలు పూర్తయ్యాయి. కరవు, రూపాయి విలువ క్షీణించడం తదితర కారణాలతో 1966 - 69 మధ్య కాలంలో మూడు వార్షిక ప్రణాళికలను రూపొందించారు. నాలుగో పంచవర్ష ప్రణాళిక 1969లో మొదలైంది. తర్వాత కాలంలో వరుసగా మూడు ప్రణాళికలు అమలయ్యాయి. 1990లో అనిశ్చిత రాజకీయ పరిస్థితుల వల్ల రెండేళ్ల పాటు వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు. 1992లో ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక మొదలైంది. అప్పటివరకూ ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలు తొమ్మిదో ప్రణాళిక (1997) నుంచి ప్రైవేటు, ప్రభుత్వ - ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక (2012 - 17) నడుస్తోంది.¤ స్వాతంత్య్ర దినం సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నూతన కార్యక్రమాలను ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు 'కృషి మహోత్సవ్'ను నిర్వహిస్తామని ప్రకటించారు. » మహిళల పేరు మీద 1.5 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి ద్వారానే నేరుగా ప్రయోజనాలు అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు.¤ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అధికార యంత్రాంగం చేపట్టిన వ్యర్థాల సేకరణ, నిర్వహణ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రారంభించారు. 'వ్యర్థ రహిత జోధ్‌పూర్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అమీర్‌ఖాన్ రూ.11 లక్షల విరాళం కూడా ప్రకటించారు.¤ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)' ఆధ్వర్యంలో సరికొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు. » 20 × 30 అడుగుల కొలతలున్న ఈ జెండా నిత్యం అన్ని రకాల వాతావరణాల్లో ఎగురుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో 400 వాట్ల సామర్థ్యం గల మెటల్ హాలైడ్ ల్యూమినర్ల సాయంతో వెలుగులీనుతుంది.
|
ఆగస్టు - 16
|
| ¤ సోలాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ '765 కేవీ సోలాపూర్ - రాయచూర్ ట్రాన్స్‌మిషన్ లైన్ల'ను జాతికి అంకితం చేశారు. » సోలాపూర్ - పుణె నాలుగు వరుసల మార్గానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.¤ ముంబయిలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ) సెజ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. |
ఆగస్టు - 17
|
| ¤ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ వీర జవాన్ల పేర్లకు ముందు ఇకపై 'షాహిద్' (అమరుడు) అనే పదాన్ని వాడాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. » ఈ నిబంధనను అందరూ అమలు చేయాలని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దిలీప్ త్రివేది ఆదేశాలు జారీ చేశారు. అన్ని అధికారిక సమాచారాలు, సందేశాలు, ప్రసంగాల్లో మృతవీరుల పేర్ల ముందు ఈ పదాన్ని వాడనున్నట్లు ఆయన ప్రకటించారు. |
ఆగస్టు - 18
|
¤ పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని మోడీ తీసుకున్న చొరవను అందిపుచ్చుకోకుండా ఆ దేశం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు కాశ్మీరీ వేర్పాటువాదులతో చర్చలు జరపడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇస్లామాబాద్‌లో జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలను భారత ప్రభుత్వం రద్దుచేసింది.¤ దేశవ్యాప్తంగా 10,000 పాఠశాలల్లో విద్యార్థినులకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించడం కోసం రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రకటించింది. » స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన 'క్లీన్ ఇండియా' చొరవకు కంపెనీ తనవంతుగా ప్రతిస్పందించి ఈ విరాళాన్ని ప్రకటించింది. » పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వ్యవస్థను మెరుగుపరచడానికి, రానున్న మూడేళ్లలో లూధియానా పరిసర గ్రామాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.100 కోట్ల వరకు సాయం చేస్తామని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన భారతీ ఫౌండేషన్ ప్రకటించింది. » భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ లూధియానాకు చెందినవారు.
|
ఆగస్టు - 19
|
| ¤ హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ హర్యానాలోని కైథాల్‌లో శంకుస్థాపన చేశారు. ఈ రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారిని నాలుగు వరసలుగా మార్చనున్నారు. » రైతుల కోసం ప్రధానమంత్రి 'కృషి సించయి యోజన' అనే కొత్త పథకాన్ని ప్రధాని ప్రకటించారు. రైతుల భూములకు సరిపడా సాగునీరు అందించడానికే ఈ పథకమని పేర్కొన్నారు.¤ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయదలచిన కొత్త సంస్థ రూపురేఖలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రజల ఆలోచనలను ఆహ్వానించారు. ప్రతిపాదిత సంస్థపై ప్రజలు సూచనలు తెలిపేందుకుhttp://mygov.nic.in/ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక వేదికను సిద్ధం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.¤ తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు స్పీకర్ ఒక లేఖ పంపించారు. నిర్ణయం తీసుకునేముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ఆమె సంప్రదించారు. » ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి అవసరమైన కనీస సీట్లు కాంగ్రెస్‌కు లేవు కాబట్టి ఆ హోదా ఇవ్వలేమని రోహత్గీ వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం పదోవంతు (55) అయినా ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. » ఈ విధంగా 1980, 1984లో కనీస సంఖ్యలో సీట్లు దక్కని కారణంగా లోక్‌సభలో ఏ పార్టీకీ ప్రతిపక్ష నేత హోదా లభించలేదు. కాంగ్రెస్‌కు పంపించిన లేఖలో ఈ నేపథ్యాన్ని, నిబంధనలను స్పీకర్ పేర్కొన్నారు. » లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. కేంద్ర సమాచార కమిషనర్, విజిలెన్స్ కమిషనర్ తదితర ముఖ్యమైన నియామకాల్లో ప్రతిపక్ష నేతకు తగిన ప్రాధాన్యం ఉంటుంది¤ మణిపూర్‌కు చెందిన ప్రముఖ హక్కుల నేత ఇరోమ్ చాను షర్మిళను కారాగారం నుంచి విడుదల చేయాలని ఇంఫాల్‌లోని స్థానిక కోర్టు ఆదేశించింది. » సైన్యానికి ప్రత్యేక అధికారాలు కల్పించే AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుమారు 14 ఏళ్లపాటు ఆమె ఉపవాస దీక్ష చేసింది. ఈ క్రమంలో షర్మిళను ఆత్మహత్యాయత్నం చేసిన ఆరోపణలపై జైలుకు తరలించారు.¤ జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370 రాజ్యాంగ ప్రామాణికతపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్ 370 భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగంగా తయారైందంటూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. » ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్‌కు రక్షణ, విదేశీ వ్యవహారాల్లో తప్ప ఇతర అన్ని అంశాల్లో పూర్తి స్వయంప్రతిపత్తి ఉంటుంది. భారతీయ చట్టాలు అక్కడ వర్తించవు. కాశ్మీరీయేతరులు ఆ రాష్ట్రంలో ఆస్తులను కొనుగోలు చేయడానికి గానీ, ఉద్యోగాలు పొందడానికి గానీ వీల్లేదు. |
ఆగస్టు - 20
|
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందిముఖ్యాంశాలు: » అన్ని రంగాల ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చే 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఆమోదం. రూ.లక్ష కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యాధునిక ఐటీ ప్రయోజనాలను కల్పిస్తారు. » డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద అన్ని మంత్రిత్వ శాఖల ప్రాజెక్టులు ఉంటాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామ పంచాయతీ స్థాయిలో హైస్పీడ్ ఇంటర్నెట్, ప్రభుత్వ విద్య, వైద్య సేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించడం, మొబైల్ కనెక్టివిటీ, ఈ-గవర్నన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉద్యోగాల కల్పన, వ్యవసాయంలో ఐటీ వినియోగం తదితర లక్ష్యాలను కేంద్రం నిర్దేశించింది. ఈ కార్యక్రమ అమలును ప్రధాని నేతృత్వంలోని ఒక కమిటీతోపాటు, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పర్యవేక్షిస్తుంది. 'డిజిటల్ ఇండియా'ను ఈ ఏడాదే ప్రారంభించి 2018 వరకూ దశల వారీగా అమలుచేయనున్నారు. » నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రూ.3,216 కోట్ల వ్యయంతో సెల్‌ఫోన్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 1836 'బేస్ ట్రాన్స్‌మిషన్ టవర్ల'ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనుంది. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వినిమయాన్ని పెంచాల్సిన అవసరం ఉందంటూ స్థానిక ప్రజలు, పోలీసులు చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. » ఇనుము, బాక్సైట్ తదితర 55 రకాల ఖనిజాలపై రాయల్టీ పెంపుదలకు అంగీకారం. దీనివల్ల ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరగనుంది. బొగ్గు, లిగ్నైట్, ఇసుకలకు ఈ పెంపు వర్తించదు. » ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధరను టన్నుకు 350 అమెరికా డాలర్లకు తగ్గించారు. దేశీయంగా ఉల్లి నిల్వలు పెరగడం, ధర తగ్గుముఖం పట్టడం లాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ పోయిన దశల్లో వాటి ఎగుమతులను నిరుత్సాహపరచి ధరలను అదుపులో పెట్టడానికి కేంద్రం గత నెలలో కనీస ఎగుమతి ధరను 500 డాలర్ల వరకు పెంచింది. పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పుడు తగ్గించింది. » మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 38 కి.మీ. పొడవున నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,680 కోట్లు. 2018 మార్చి లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
ఆగస్టు - 21
|
| ¤ జాతీయ యుద్ధ స్మృతి చిహ్నం నిర్మాణానికి రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ ఆమోదం తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో ఈ స్మృతి చిహ్నాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ కాంప్లెక్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. » సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్, రక్షణశాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌తో జైట్లీ చర్చల అనంతరం ఇండియా గేట్‌లోని ఛాత్రి కాంప్లెక్స్‌లో స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చిహ్నంపై 21 వేల మంది సైనిక అమరుల పేర్లను లిఖించనున్నారు.¤ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో వినియోగించేందుకు అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాలు వాడిన మందుపాతర్ల డిటెక్టర్లను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. దుర్ఘటనలకు బాధితులవుతున్న భద్రతా బలగాల్లో మూడింట రెండొంతుల మంది మెరుగుపరచిన పేలుడు పరికరాల (ఐఈడీ) పేల్చివేతలకు బలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. » మావోయిస్టులను ఎదుర్కోవడానికి కేంద్ర హోంశాఖ రూపొందించిన తాజా ప్రణాళికలో పలు విషయాలను పేర్కొంది. దీని ప్రకారం వామపక్ష తీవ్రవాద సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి మరింత తోడ్పాటు అందించాలని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)ను కోరనున్నారు. » ఇకపై రాష్ట్రస్థాయిలో మావోయిస్టు నిరోధక చర్యల పురోగతిని ప్రతినెలా సమీక్షించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో సామాజిక పోలీసింగ్ కోసం ప్రతి జిల్లాకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10 లక్షల మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచాలని తాజా ప్రణాళికలో పేర్కొంది.¤ జార్ఖండ్‌లోని రాంచీలో కొత్తగా నెలకొల్పిన 765 కేవీ రాంచీ - ధరమ్‌జయ్‌గఢ్ - సిపత్ ట్రాన్స్‌మిషన్ లైన్, పవర్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. » దీని ద్వారా జార్ఖండ్‌లో చీకట్లు అలుముకున్న ప్రాంతాలకు వెలుగులు అందించవచ్చు. ఇది కేవలం విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌మిషన్ లైన్ మాత్రమే కాదని; భారత్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే అద్భుతమైన అనుసంధాన వేదిక అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ముండా తదితరులు పాల్గొన్నారు. » మహారాష్ట్రలోని మౌడాలో వెయ్యి మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశను కూడా ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాన్ గైర్హాజరయ్యారు.¤ హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు నదీ లోయలో పడిపోయిన ఘటనలో 23 మంది మృతి చెందారు. సంగ్లా గ్రామం నుంచి కల్ప వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.¤ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని హతమార్చిన వారిపై నిర్మించిన వివాదాస్పద పంజాబీ చిత్రం 'కౌమ్ దే హీరే' విడుదలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కావాల్సి ఉంది. |
ఆగస్టు - 22
|
¤ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కని నేపథ్యంలో లోక్‌పాల్ ఎంపిక కమిటీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. » లోక్‌పాల్ చట్టాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేతకూ చోటు కల్పించాలన్న నిబంధన ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కనందున లోక్‌పాల్ చట్టాన్ని తిరస్కరించలేమని, ఆ హోదాకు వివరణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరిని రెండు వారాల్లో తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రధాన ప్రతిపక్షనేత హోదా అనేది లోక్‌పాల్ చట్టానికి మాత్రమే పరిమితమయ్యే అంశం కాదని, ప్రస్తుతమున్న ఇతర చట్టాలు, రాబోయే చట్టాలకూ ఇది ముఖ్యమేనని ఈ అంశంలో ఇంకా జాప్యం తగదని పేర్కొంది.¤ ప్రతిపక్ష నేత లేని కారణంగా ప్రభుత్వం కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కొత్త ప్రధాన కమిషనర్ నియామకాన్ని పక్కన పెట్టింది. పారదర్శకత కోసం 2005లో ఏర్పాటు చేసిన సీఐసీకి ప్రధాన కమిషనర్ లేకుండా ఉండటం ఇదే మొదటిసారి. » ప్రస్తుత సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం ఆగస్టు 22తో ముగిసింది.
|
ఆగస్టు - 24
|
¤ మహారాష్ట్ర గవర్నర్ పదవికి కె.శంకర్‌నారాయణన్ (82 సంవత్సరాలు) రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులైన ఆయన కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక తన పదవి నుంచి వైదొలగడానికి విముఖత చూపారు. » శంకర్ నారాయణన్‌ను మిజోరం రాష్ట్రానికి పంపిస్తూ, గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లికి మహారాష్ట్ర అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు వెలవరించింది. » ఈ నెల ప్రారంభంలో మిజోరం గవర్నర్ కమలా బేణివాల్‌ను ప్రభుత్వం తొలగించింది. » నారాయణన్ పదవీ కాలం 2017తో ముగియనుంది.¤ తమిళనాడులోని సేలంలో ప్రఖ్యాత సేలం హైస్కూల్ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. » చంద్రయాన్ - 1, చంద్రయాన్ - 2 ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.అన్నాదొరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. » చంద్రయాన్ - 1 యాత్రను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008 అక్టోబరులో చేపట్టింది. చంద్రయాన్ - 2 యాత్రను 2017లో చేపట్టనున్నట్లు అన్నాదొరై ప్రకటించారు.¤ దేశంలోనే తొలిసారిగా హౌరాలోని శిబ్‌పూర్ (పశ్చిమ బెంగాల్)లో 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ)'ని ఏర్పాటు చేశారు. » ఐఐఈఎస్‌టీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.¤ కోస్తా తీర రాష్ట్రాల్లో ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి ఉద్దేశించిన 'సాగర్ మాల' ప్రాజెక్టును వేగవంతం చేయాలని నౌకాయాన మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోరింది. » ఓడరేవుల్లో సదుపాయాలు, ఫెర్రీ సేవలు, పర్యాటక వసతులు, అంతర్గత జలరవాణా... వీటన్నింటినీ క్రోఢీకరిస్తూ ఈ పథకాన్ని పూర్తి చేయాల్సి ఉంది. రేవులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రైలు, రోడ్లు, విమాన సదుపాయాలు, తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు రేవులతో అనుసంధానత, శీతల గిడ్డంగులు, గోదాములు మొదలైనవన్నీ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.¤ ఇండో - టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ)లో జవాన్లు మానసిక వ్యాధులతో బాధపడుతున్న నేపథ్యంలో 100 మంది జవాన్లను పదవీ విరమణ చేయించేందుకు ఐటీబీపీ నిర్ణయించింది. » పదేళ్ల కంటే ఎక్కువ కాలం సేవలందించిన వారితో రాజీనామా చేయించాలని నిర్ణయించింది. మనోవ్యాధితో బాధపడుతున్నవారు ఉన్మాదులుగా మారే అవకాశం ఉందని, సహచర సిబ్బందికి ప్రమాదం ఏర్పడవచ్చని ఐటీబీపీ భావిస్తోంది. » ఐటీబీపీ దళాలు అత్యంత కఠినమైన పరిస్థితులుండే మంచుతో కూడిన భారత్ - చైనా సరిహద్దులో 9,000 - 18,700 అడుగుల వరకు ఎత్తు ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తుంటారు.¤ పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూలు లాంటి ఉద్యాన తోటల సాగు విస్తీర్ణం పెంపులో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. » జాతీయ ఉద్యాన మిషన్ (ఎన్‌హెచ్ఎం) పథకం కింద ఉద్యాన పంటల సాగుకు కేంద్రం ఇస్తున్న రాయితీలను ఈ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల సాగులో ఏడో స్థానంలో నిలిచింది. |
ఆగస్టు - 25
|
| ¤ గత 17 ఏళ్ల కాలంలో కేంద్రంలోని వివిధ ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు క్షేత్రాల కేటయింపులన్నీ అక్రమం, ఏక పక్షమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1993 నుంచి 2010 వరకు కేటాయింపులకు 36 స్క్రీనింగ్ కమిటీలు అనుసరించిన పద్ధతులను తీవ్రంగా ఆక్షేపించింది. అయితే ఈ దశలో ఆ కేటాయింపులను రద్దు చేయడానికి ధర్మాసనం ఇష్టపడలేదు. ఈ రకమైన కేటాయింపుల వల్ల ఉత్పన్నమైన, ఉత్పన్నమయ్యే పరిణామాలపై మరోసారి విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. » వేలం పద్ధతి ప్రవేశపెట్టక ముందు 1993 నుంచి 2010 వరకు కేంద్రంలో వివిధ ప్రభుత్వాల హయాంలో కేటాయించిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కోర్టు పరిశీలించింది. అప్పుడు కేటాయించిన బొగ్గు క్షేత్రాలన్నింటినీ రద్దు చేయాలని న్యాయవాది ఎం.ఎల్. శర్మ, స్వచ్ఛంద సేవా సంస్థ కామన్‌కాజ్ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. |
ఆగస్టు - 26
|
| ¤ కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నరుగా నియమితులయ్యారు. » ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ రాజస్థాన్ గవర్నరుగా నియమితులయ్యారు. » గోవా నూతన గవర్నరుగా మృదులా సిన్హా నియమితులయ్యారు. » గుజరాత్ స్పీకర్ వాజూభాయ్ రూడాభాయ్ వాలా కర్ణాటక నూతన గవర్నరుగా నియమితులయ్యారు. » మృదులా సిన్హా ప్రముఖ హిందీ రచయిత్రి. » కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేసినవారిలో షీలా దీక్షిత్ 8వ గవర్నర్.¤ ఇటలీకి చెందిన ఆయుధ తయారీ సంస్థ 'ఫిన్ మెకానికా' భారతదేశంలో ఇకపై ఏ టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సంస్థపై ముడుపుల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గ్రూపు అనుబంధ సంస్థ అయిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టులను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది.¤ రక్షణ రంగంలో అప్రూవల్ రూట్ ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ఇంతవరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన సంగతిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. » సైన్యానికి కావాల్సిన యంత్ర సామగ్రిలో 70 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి బదులు దేశీయ పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడం మేలనే ఉద్దేశంతో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచారు. అయితే ఎఫ్‌డీఐని 49 శాతానికి పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతిని కోరే కంపెనీ భారతీయ కంపెనీ అయ్యి, ఆ కంపెనీ నిర్వహణ భారతీయుల చేతిలోనే ఉండాలనే షరతును కేంద్రం విధించింది. |
ఆగస్టు - 27
|
| ¤ రాయితీ ఎల్‌పీజీ సిలిండర్లను నెలకు ఒకటే సరఫరా చేయడంపై ఉన్న పరిమితిని కేంద్ర క్యాబినెట్ ఎత్తేసింది. దీంతో వినియోగదారులు తమ కోటా మేరకు సంవత్సరంలో ఎప్పుడైనా మొత్తం 12 రాయితీ సిలిండర్లను పొందవచ్చు. » యూపీఏ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో రాయితీపై ఇచ్చే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల కోటాను 9 నుంచి 12కు పెంచుతూ నెలకు ఒక సిలిండర్‌ను మాత్రమే సరఫరా చేస్తారంటూ పరిమితి విధించింది. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు భావించిన మోడీ క్యాబినెట్ సిలిండర్ల సరఫరాపై ఉన్న పరిమితిని తాజాగా తొలగించింది.¤ హిందీ, కొంకణి, మరాఠీ సహా ఎనిమిది భాషల్లో వెబ్‌సైట్లను నిర్వహించుకోవడానికి వీలుగా '.భారత్' (డాట్ భారత్) డొమైన్ పేరును దేవనాగరి లిపిలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. హిందీ భాషలో వెబ్‌సైట్‌ను నిర్వహించే ఆసక్తి ఉన్నవారు ఆ లిపిలోనే పేరు నమోదు చేసుకునేందుకు ఇప్పుడు వీలవుతుంది. పేరు చివర్లో .కామ్ (డాట్ కామ్), .నెట్, .ఇన్ అని ఎలా ఉంటుందో ఇప్పుడు '.భారత్' అని హిందీ అక్షరాల్లో ఉంటుంది. » త్వరలో మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ డొమైన్ పేర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 'భారత జాతీయ అంతర్జాల ఎక్స్ఛేంజీ' (ఎన్.ఐ.ఎక్స్.ఐ.) ప్రయత్నిస్తోంది.¤ 'జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్' (ఎన్.ఒ.ఎఫ్.ఎన్.) ద్వారా దేశంలో 2014లో 60 వేల గ్రామాలను, 2015లో లక్ష గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 మార్చి నాటికి 2.50 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.¤ రైల్వేల్లో ఆటోమేటిక్ రూట్‌లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. » హైస్పీడ్ రైళ్లు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో సబర్బన్ కారిడార్ ప్రాజెక్టులు, సరకు రవాణాకు ప్రత్యేక మార్గాలు, ట్రైన్ సెట్ల నిర్మాణం, రైలు ఇంజిన్లు - బోగీల తయారీ - నిర్వహణ సదుపాయాలు, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థలు, ప్రయాణికులు - సరకు కేంద్రాలు, రైల్వే లైన్లు, సైడింగ్స్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎఫ్‌డీఐలను నూరు శాతం అనుమతిస్తారు. » రైల్వేల భద్రతకు సంబంధించిన అంశాల్లో మాత్రం 49 శాతానికి మించి ఎఫ్‌డీఐలను అనుమతించాలంటే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) ముందు పెడతారు. రైల్వే కార్యకలాపాల్లో మాత్రం ఎఫ్‌డీఐలను అనుమతించరు. |
ఆగస్టు - 28
|
| ¤ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన'ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. » ఈ పథకం కింద 2015 జనవరి 26 లోపు 7.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లభిస్తాయి. కనీస మొత్తం ఏమీ లేకుండానే ఈ ఖాతాను తెరవవచ్చు. బ్యాంకు ఖాతాతో పాటు డెబిట్‌కార్డు, రూ.30 వేల జీవిత బీమా, రూ.లక్ష ప్రమాద బీమా సదుపాయం కూడా కల్పిస్తారు. » జన్ ధన్ యోజన కింద తొలిరోజే దేశవ్యాప్తంగా 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఒకే రోజు 1.5 కోట్ల ప్రమాద బీమాలను తెరవడం కూడా ఒక రికార్డే. » ఖాతాను తెరచిన ఆరు నెలల తర్వాత ప్రతి ఖాతాదారుడికి రూ.5000 రుణం తీసుకునే అవకాశం లభిస్తుంది. » ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు 77 వేల ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభించారు.¤ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా అందే ప్రయోజనాలకు సంబంధించిన మార్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదలయింది. ఇకపై కనీస పింఛను రూ.వెయ్యి లభిస్తుంది. గరిష్ఠ వేతన పరిమితి ఇప్పుడున్న రూ.6,500 నుంచి రూ.15,000కి పెరుగుతుంది. చందాదారులకు లభించే గరిష్ఠ బీమా రూ.3.60 లక్షలకు చేరుతుంది. ఈ మార్పులన్నీ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. » ఉద్యోగుల ఫించను పథకం - 1995 (ఈపీఎఫ్ - 95) కింద ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచడం వల్ల 28 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓలో చందాదారులుగా చేరడానికి ఉన్న నెలవారీ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000కి పెంచడం వల్ల అదనంగా 50 లక్షల మంది ఈ సంస్థ పరిధిలోకి రానున్నారు. |
ఆగస్టు - 31
|
| ¤ తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని 19 నగరాల్లో బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 2017 నాటికి వీటిని మోహరించే అవకాశం ఉంది. ఫలితంగా శత్రుదేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల నుంచి ఆ ప్రాంతాలకు రక్షణ కల్పించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక స్థితి, అక్కడున్న పౌర జనాభా, ఆర్థిక విలువ లాంటి అంశాల ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, బెంగళూరు, చెన్నై, పుణె, గౌహతి, కాన్పూర్, చండీగఢ్ తదితర 19 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. » చైనా, పాకిస్థాన్ భారీగా క్షిపణులను సమకూర్చుకున్న నేపథ్యంలో వాటి నుంచి దేశాన్ని రక్షించేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సరికొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తోంది. » ప్రధానంగా పాకిస్థాన్‌కు చెందిన ఘోరి - 2, షహీన్ - 2 క్షిపణుల పరిధిని దృష్టిలో పెట్టుకుని ఈ నగరాలను ఎంపిక చేశారు. ఈ అస్త్రాలు 2000 - 2500 కి.మీ. పరిధిని కలిగి ఉన్నాయి. మరోపక్క చైనా వద్ద 13 వేల కిలోమీటర్ల వరకు వెళ్లగలిగే ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. అయితే 2800 కి.మీ. పరిధి కలిగిన చైనా క్షిపణి సీఎస్ఎస్- 2ను డీఆర్‌డీవో పరిగణనలోకి తీసుకుంటోంది. దాన్ని దక్షిణ చైనా సముద్రంలోని యుద్ధనౌకల నుంచి ప్రయోగించే వీలుంది. » డీఆర్‌డీవో రూపొందించే బాలిస్టిక్ క్షిపణుల్లో రెండంచెలు ఉంటాయి. మొదటి అంచె శత్రుక్షిపణిని నేల నుంచి 12 - 15 కి.మీ. ఎత్తులో నేలకూలుస్తుంది. ఒకవేళ శత్రు అస్త్రం ఈదశను తప్పించుకుంటే 8 - 12 కి.మీ. ఎత్తులో పనిచేసే రెండో అంచె దాని సంగతి తేలుస్తుంది. పాకిస్థాన్ స్థావరాల నుంచి హైదరాబాద్ 19 వేల కి.మీ. దూరంలో ఉంది. విశాఖకు మాత్రం దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన చైనా యుద్ధనౌకల నుంచే ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్ కూడా ఈ నౌకల పరిధిలోనే ఉంది. |
|
|