జులై - 2014 జాతీయం


జులై - 1
¤  భారత రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ సామాజిక నెట్‌వర్కింగ్ సైట్ 'ట్విట్టర్‌'లో అడుగుపెట్టారు. రాష్ట్రపతి భవన్, ప్రణబ్ ఛాయాచిత్రాలను; ఆయన వివిధ అవార్డులను ప్రదానం చేస్తున్న చిత్రాలను దీనిలో పొందుపరిచారు. ఇది ట్విట్టర్‌లో రాష్ట్రపతి అధికారిక ఖాతా అనీ, దీన్ని రాష్ట్రపతి సచివాలయం నిర్వహిస్తుందనీ అధికార వర్గాలు ప్రకటించాయి. రాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్రపతి భవన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు దీని ద్వారా తెలియజేస్తారు.   »    ప్రణబ్ చేసే ట్వీట్స్‌కు దిగువున 'రాష్ట్రపతి ముఖర్జీ' అని ఉంటుంది. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ 2006 లో ప్రారంభం కాగా దీనిలో ఖాతా తెరిచిన తొలి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వార్తల్లో నిలిచారు.
జులై - 2
¤  అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) 2010లో భారతీయ జనతా పార్టీపై గూఢచర్యం నిర్వహించిందంటూ అమెరికా మీడియాలో వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ఉండే అమెరికా అత్యున్నత స్థాయి దౌత్యవేత్తను పిలిపించి, ప్రభుత్వం నిరసన తెలిపింది.   »    అమెరికా రాయబారిగా ఉన్న నాన్సీ పావెల్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ప్రస్తుతం తాత్కాలిక రాయబారి క్యాథలీన్ స్టీఫెన్స్ విధులు నిర్వహిస్తున్నారు.¤  ఉల్లిగడ్డ, బంగాళాదుంపలను కేంద్రప్రభుత్వం అత్యవసర సరకుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. తద్వారా వాటి నిల్వలపై ఆంక్షలు విధించింది. మార్కెట్లో ఉల్లి, బంగాళాదుంపల లభ్యతను పెంచడం, వాటి ధరలను తగ్గించడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.   »    ఉల్లి కనీస ఎగుమతుల ధరను టన్నుకు 300 డాలర్ల నుంచి 500 డాలర్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్లో ఉల్లిగడ్డ లభ్యతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగాళాదుంప ఎగుమతులపై ఇప్పటికే కేంద్రం టన్నుకు 450 డాలర్ల కనీస ధరను ప్రకటించింది.   »    రేషన్ దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించడం కోసం అదనంగా 50 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జులై - 3
¤  ప్రభుత్వ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో కొత్తగా నాలుగు వ్యాక్సిన్ల (టీకాలు)ను చేర్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు.   »    సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు కొత్త టీకాలు 13 ప్రాణాంతక జబ్బుల నుంచి పిల్లలను కాపాడతాయి. ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ టీకాల వల్ల రోటా వైరస్, రుబెల్లా, పోలియో నుంచి చిన్నారులకు రక్షణ లభిస్తుంది.¤  మహిళల సహాయార్థం దేశవ్యాప్తంగా సుమారు 660 నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.   »    640 జిల్లాలతో పాటు మరో 20 నగరాల్లో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.477 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.   »    గృహహింస, లైంగిక దాడి, అత్యాచారాలు తదితరాల నుంచి మహిళలకు రక్షణ కల్పించడమే వీటి ఉద్దేశం.¤  దేశంలోనే అత్యంత వేగవంతమైన ప్రయోగాత్మక రైలు పరుగును రైల్వేశాఖ ఢిల్లీ - ఆగ్రా మధ్య విజయవంతంగా నిర్వహించింది.   »    గంటకు 160 కి.మీ. వేగంతో 200 కి.మీ. దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలును న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 6వ నంబర్ ప్లాట్‌ఫాం నుంచి ప్రారంభించారు.   »    గతంలో దేశ రాజధాని నుంచి ఆగ్రా చేరడానికి 120 నిమిషాల సమయం పట్టగా ఇప్పుడది 90 నిమిషాలకు తగ్గింది.   »    ప్రయోగాత్మక పరుగు విజయవంతం కావడంతో ఈ ఏడాది నవంబరు నుంచి దీని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం ఢిల్లీ - కాన్పూర్, ఢిల్లీ - చండీగఢ్ మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.¤  బీహార్ గవర్నర్ డాక్టర్ డి.వై.పాటిల్‌ను పశ్చిమ బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.   »    పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్ జూన్ 30న రాజీనామా చేశారు. నారాయణన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి పాటిల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
జులై - 4
¤  జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ - కాట్రా రైల్వే మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రారంభించారు.   »    కాశ్మీరులోని కాట్రా, ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయానికి బేస్‌క్యాంప్. జమ్ము నుంచి ఉధంపూర్‌కు ఇప్పటికే రైల్వే మార్గం ఉండగా, ఉధంపూర్ నుంచి కాట్రా వరకు నిర్మించిన నూతన మార్గాన్ని ప్రధాని తాజాగా ప్రారంభించారు.   »    ఉధంపూర్ - కాట్రా లైన్‌ను రూ.1132.75 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఏడు సొరంగాలు, 30కి పైగా చిన్నా, పెద్ద వంతెనలు ఉన్నాయి. కాట్రా రైల్వేస్టేషన్ పర్యావరణ హితంగా ఉంటుంది. సౌరవిద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకునేందుకు కాట్రా స్టేషన్‌లోనే పాస్‌లను ఇస్తారు.   »    ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీకి ఇదే తొలి జమ్మూ-కాశ్మీర్ పర్యటన. కాట్రా - ఉధంపూర్ రైల్వేమార్గంతో పాటు బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద 240 మెగావాట్ల 'యూరి - 2' జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.   »    బాదామీబాగ్ సైనిక ప్రధాన కార్యాలయంలో సైనిక్ సమ్మేళన్‌లో కూడా ప్రధాని పాల్గొన్నారు.   »    బాదామీబాగ్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న 1200 ఏళ్ల నాటి శివాలయాన్ని కూడా ప్రధాని దర్శించారు.¤  గోవా గవర్నర్ బి.వి.వాంఛూ తన పదవికి రాజీనామా చేశారు.   »    వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో బి.వి.వాంఛూ సాక్షిగా ఉన్నారు. ఆయన వాంగ్మూలాన్ని కూడా తాజాగా సీబీఐ నమోదు చేసింది.
జులై - 5 
¤  ఈశాన్య రాష్ట్రం త్రిపురలో మలేరియా తీవ్రంగా విజృంభించింది. జూన్ తొలివారం నుంచి 43 మంది పిల్లలు సహా 61 మంది మృతి చెందారు. లక్ష మందికి పైగా అస్వస్థులయ్యారు.   »    వ్యాధి నియంత్రణకు కేంద్ర పారామిలటరీ, రాష్ట్ర భద్రతా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను, హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.
జులై - 6
¤  ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో గవర్నర్‌గా ఉన్న కమలా బేణీవాల్‌ను మిజోరం గవర్నరుగా బదిలీ చేశారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు లోకాయుక్త నియామకంతో పాటు పలు చట్టాల విషయంలో కమలతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. కమల నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు.   »    గుజరాత్‌లో కొత్త గవర్నరును నియమించేవరకు రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మిజోరం గవర్నరుగా ఉన్న వొక్కం పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నరుగా బదిలీ చేశారు. అదే సమయంలో త్రిపుర గవర్నరుగా కూడా పురుషోత్తమన్ అదనపు బాధ్యతలు చేపడతారు.¤  బాలికల నిష్పత్తిని పెంచడానికి గుజరాత్‌లో ప్రవేశపెట్టిన 'బేటీ బచావో అభియాన్' (బాలికా సంరక్షణ పథకం) సత్ఫలితాలను ఇవ్వడంతో దాన్ని త్వరలో దేశమంతటా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
జులై - 7
¤  నెలవారీ పింఛను కనీస మొత్తాన్ని రూ.1000గా పేర్కొంటూ చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.   »    ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 28 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇందులో 5 లక్షల మంది వితంతువులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఇప్పటిదాకా నెలకు వెయ్యి రూపాయల కంటే తక్కువ పింఛనే అందుతోంది.¤  ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో భారతీయ రైల్వే ఖాతాలు తెరిచింది. వీటిని కేంద్ర రైల్వే శాఖా మంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.   »    తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేరవేసేలా సామాజిక మాధ్యమంలో ఖాతాలు తెరిచినట్లు మంత్రి ప్రకటించారు.
¤  'బహుడా యాత్ర'ను ఒడిశాలోని పూరీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు.   »    ఏడు రోజులపాటు పెంపుడు తల్లి గుండిచా మందిరంలో విడిది చేసిన దేవదేవుడు సోదర, సోదరిలతో కలిసి తిరిగి శ్రీమందిరానికి చేరుకున్నాడు. దీన్నే 'బహుడా యాత్ర' గా పిలుస్తారు.¤  ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు చదివే 14 లక్షల పాఠశాలల్లో వెంటనే పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాలంటూ కేంద్రం రాష్ట్రాలను కోరింది.   »    జిల్లాల తాజా విద్యా సమాచారం ప్రకారం 14.5 లక్షల గ్రామీణ పాఠశాలల్లో నీటిసౌకర్యం లేక అమ్మాయిలు మూత్రశాలలను ఉపయోగించుకోలేక పోతున్నారంటూ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ వెల్లడించింది. నిర్ణీత కాలవ్యవధిలో పాఠశాలలకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం సూచించింది.   »    పాఠాశాలల్లో మంచినీటి, మూత్రశాలల వసతి సౌకర్యాలు ఉన్నట్లయితే కచ్చితంగా విద్యార్ధుల హాజరు మెరుగవుతుందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఆ సౌకర్యాలు లేకపోవడంతో కిశోర ప్రాయంలోకి అడుగిడిన అమ్మాయిలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని వెల్లడించింది.¤  ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఫత్వాను జారీ చేసే చట్టబద్ధత షరియత్ కోర్టుకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఎదుట హాజరు కాకుండానే ఓ వ్యక్తి పరోక్షంలో ఈ తరహా ఆదేశాలు జారీచేయడం అనేది మానవ హక్కులను దారుణంగా ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.   »    దేశంలో ఒక రకంగా సమాంతర న్యాయవ్యవస్థను నడిపే షరియత్ కోర్టుల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ విశ్వలోచన్ మదాం అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.¤  పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.¤  దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో చేస్తున్న చట్టాలు, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులు, కేసుల వాయిదాల లాంటివి దీనికి కారణాలుగా పేర్కొంది.   »    కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోకసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం సుప్రీంకోర్టులో 63,843 కేసులు, దేశంలోని 24 హైకోర్టుల్లో 44.62 లక్షల కేసులు, వివిధ దిగువస్థాయి కోర్టుల్లో 2.68 కోట్ల కేసులు మొత్తం కలిపి 3.13 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.   »    24 హైకోర్టుల్లో 906 మంది న్యాయమూర్తులకు 636 మందే ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
జులై - 8
¤  పోలవరం ముంపు మండలాలను ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు' ను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ మండలాలను కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసింది. ఆరునెలలపాటు మాత్రమే చెల్లుబాటయ్యే ఆర్డినెన్స్ స్థానంలో ప్రస్తుత బిల్లును తెచ్చారు.   »    కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెస్తున్న మొదటి చట్టం ఇది. ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో తెరాస, బిజూ జనతాదళ్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు కూడా వీరితో జత కలిశారు.
జులై - 9
¤  జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి, వారిని ముందుగానే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.   »    సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా సారథ్యంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.   »    రాజీవ్ హత్య కేసులో ఏడుగురి జీవిత ఖైదు శిక్షలను రద్దు చేసి వారిని విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.¤  కోచిలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న యుద్ధ విమానాలను తీసుకెళ్లే స్వదేశీ వాహక నౌక (ఐఏసీ) నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.19 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.¤  తెలంగాణ, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.13,987 కోట్లతో నాలుగు, ఆరు లైన్ల హైవేలను 676 కిలోమీటర్ల మేర విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.
జులై - 11
¤  తీవ్ర నిరసనల మధ్య పోలవరం ప్రాజెక్టు బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు - 2014)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పోలవరం ముంపు ప్రాంతాలున్న ఖమ్మం జిల్లాలోని ఏడు రెవెన్యూ మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ, తృణమూల్, ఎంఐఎం పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపీలు నిరసన తెలిపారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.¤  కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగార్థుల కోసంhttp://www.niesbudnaukri.com/ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అభ్యర్థులు తమ వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.   »    పారిశ్రామికవేత్తల, చిన్న వ్యాపారాల జాతీయ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఈఎస్‌బీయూడీ) ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది.   »    కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్ మిశ్రా దీన్ని ప్రారంభించారు.¤  పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన చేసింది.   »    అండమాన్ నికోబార్ దీవుల లెప్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అజయ్ కుమార్ సింగ్‌కు కటారియా స్థానంలో అదనపు బాధ్యతలు కేటాయించారు.   »    కాంగ్రెస్ నేత కటారియా (81 ఏళ్లు) గతేడాది జులైలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే క్రమంలో భాగంగా తాజాగా కటారియాను పక్కన పెట్టింది.   »    తనను సంప్రదించకుండానే మిజోరం నుంచి బదిలీ చేశారని నిరసన తెలుపుతూ నాగాలాండ్ గవర్నర్ వక్కం పురుషోత్తమన్ రాజీనామా చేశారు.¤  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉదయ్ యు లలిత్ అభ్యర్థిత్వాన్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.   »    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని కొలీజియం ఈ సిఫారసు చేసింది.   »    లలిత్‌తో పాటు మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్ చంద్రపంత్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.భానుమతి పేర్లను కూడా కొలీజియం సిఫారసు చేసింది.   »    సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వానికి కొలీజియం సిఫారసు చేయగా ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి పంపిన నేపథ్యంలో అభ్యర్థిత్వం నుంచి ఆయన వైదొలిగారు. ఆయన స్థానంలో యు.యు.లలిత్ పేరును కొలీజియం సిఫారసు చేసింది.   »    లలిత్ పలు ఉన్నత స్థాయి కేసులను వాదించారు. 2జీ కుంభకోణం విచారణలో స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా హాజరయ్యారు. కృష్ణజింకను వేటాడినట్లు సల్మాన్‌ఖాన్‌పై ఆరోపణలు వచ్చిన కేసులో వాదనలు వినిపించారు.¤  ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు సంబంధిత రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కనీస వేతనాలతో సమానంగా వేతనాలు అందించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.బాబ్డేతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   »    ఉపాధి హామీ కూలీలకు అందించే వేతనం కనీస వేతనానికి తగ్గకూడదంటూ 2011, సెప్టెంబరు 23 లో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్కువ వేతనాలు అందించిన కూలీలకు కేంద్రం బకాయిలు కూడా చెల్లించాలని ఆదేశించింది.   »    ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కనీస వేతనంతో సమానంగా ఉపాధి హామీ వేతనాన్ని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
జులై - 12 
¤  కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) 160వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు.   »    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఘజియాబాద్‌లో 'నేషనల్ అకాడమీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్‌'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.   »    ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూడీ మాజీ డైరెక్టర్ జనరల్ జి.ఎస్.తవర్ మలానీకి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 
జులై - 13
¤  గ్రామ పంచాయతీలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వే పూర్తయింది.   »    దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలకు 2017 నాటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్, స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించాయి.
జులై - 14
¤  పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ఉద్దేశించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు' కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.   »    ఈ బిల్లుకు ఇటీవలే లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది.   »    పోలవరం నిర్మాణం వల్ల వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతారని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.¤  అయిదు రాష్ట్రాలకు అయిదుగురు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గవర్నర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.   »    ఉత్తరప్రదేశ్ - రామ్ నాయక్, గుజరాత్ - ఓం ప్రకాష్ కోహ్లీ, పశ్చిమ బెంగాల్ - కేసరినాథ్ త్రిపాఠీ, చత్తీస్‌గఢ్ - బలరాం దాస్ టాండన్, నాగాలాండ్ - పద్మనాభ ఆచార్య గవర్నర్లుగా నియమితులయ్యారు.   »    పద్మనాభ ఆచార్యకు త్రిపుర బాధ్యతలను అదనంగా అప్పగించారు.   »    ఎన్‌డీఏ సర్కారు నిర్దేశం మేరకు యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామా చేయడం/బదిలీ కావడం వల్ల ఖాళీ అయిన రాష్ట్రాల్లో తాజా నియామకాలు జరిగాయి.   »    నరేంద్ర మోడీ ప్రభుత్వం గవర్నర్ల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి.   »    ట్రాయ్ మాజీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించిన అంశానికి సంబంధించిన 'ట్రాయ్' సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
జులై - 18
¤  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు (పోలవరం బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జులై 17న ఆమోదం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 200కు పైగా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో చట్టం అయింది. బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది.   »    పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చట్టం సవరణ బిల్లుకు కూడా జులై 17న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా ట్రాయ్ మాజీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామకానికి వీలు కల్పించేలా ట్రాయ్ చట్టంలోని ఒక క్లాజును సవరిస్తూ మే 28న ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఈ బిల్లును తెచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టం అయ్యింది.   »    జాతీయ ఆకృతి (డిజైన్) సంస్థ బిల్లుకు కూడా రాష్ట్రపతి జులై 17న ఆమోదం తెలిపారు. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు గాంధీనగర్‌లో ఒక శాఖ, బెంగుళూరులో ఒక శాటిలైట్ కేంద్రం ఉన్నాయి. ఈ చట్టంతో 'జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థ'గా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ చట్టం విద్యార్థులకు పీజీ, ఇతర డిగ్రీలు అందించడానికి సంస్థకు వీలు కల్పిస్తుంది. ఇకపై ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులకూ అందిస్తుంది.¤  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ ప్రభుత్వం కోసం రూ.36,766 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యుత్ సబ్సిడీ నిమిత్తం రూ.260 కోట్లు కేటాయించారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
జులై - 19 
¤  నాగాలాండ్ 19వ గవర్నర్‌గా పద్మనాభన్ బాలకృష్ణ ఆచార్య ప్రమాణ స్వీకారం చేశారు.   »    త్రిపుర గవర్నర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు.¤  ఉత్తరప్రదేశ్‌లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 1.72 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
జులై - 21
¤  ఉపాధి హామీ కింద చేపట్టే పనుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి సంబంధించినవి 60 శాతం తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఉపాధి హామీ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా భూమి అభివృద్ధి, నీరు, చెట్ల పెంపకం లాంటి పనులకు 60 శాతం విధిగా చేపట్టాలని స్పష్టం చేశారు.   »    గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టే పనులకు మెటీరియల్‌పై చేసే వ్యయం 40 శాతం మించకూడదని, జిల్లాస్థాయిలో కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 40 శాతానికి ఎక్కువ కాకూడదని స్పష్టం చేశారు.   »    2011 జనాభా లెక్కల ఆధారంగా గుర్తించిన వెనకబడిన బ్లాక్‌ల అభివృద్ధికి ఉపాధి హామీ పనుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.   »    తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన మండలాలు 78, ఆంధ్రప్రదేశ్‌లో 116 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.   »    కూలీలకు వేతనం, జీవనోపాధిని కల్పించేలా నాణ్యమైన ఆస్తుల రూపకల్పనకు ఉపాధి ప్రణాళికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.   »    గ్రామ సభలను నిర్వహించి గ్రామ పంచాయతీ స్థాయిలో పనులను ఎంపిక చేయాలని ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.¤  కేంద్ర ప్రభుత్వోద్యోగుల శాఖాపరమైన పదోన్నతి పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను పునరుద్ధరించాలన్న అభ్యర్ధనను సుప్రీంకోర్టు అంగీకరించింది.   »    1997లో ఈ వెసులుబాట్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది.
జులై - 23
¤  సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రూ.60.49 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.   »    2014-15 ఆర్థిక సంవత్సరానికి అయ్యే ఖర్చులకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగించనుంది.   »    ఈ ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదంతో బడ్జెట్ ప్రక్రియలో రెండో దశ ముగిసినట్లయింది.   »    త్వరలో జరగనున్న ఆర్థిక బిల్లుపై చర్చ అనంతరం ఆ బిల్లు ఆమోదంతో బడ్జెట్ ప్రక్రియ ముగుస్తుంది.
జులై - 25
¤  లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ చెప్పారు. నిర్దిష్ట సంఖ్యలో సీట్లు గెలవని పార్టీకి ఈ హోదాను ఇచ్చిన సందర్భం గతంలో లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు తన అభిప్రాయాన్ని తెలియచేశారు.    »    543 మంది సభ్యులుండే లోక్‌సభలో విపక్షనేత పదవి పొందేందుకు అవసరమైన పదిశాతాన్ని (55 సీట్లు) కాంగ్రెస్ సాధించలేదని ఏజీ వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 44 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు.   »    కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికైనా ఆ హోదాను ఇవ్వాలన్న ఆ పార్టీ వాదనను కూడా ఏజీ తిరస్కరించారు. లోక్‌సభలో యూపీఏకు 60 మంది సభ్యులు ఉన్నారు.¤  ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ)ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.   »    కేవీఐసీ పునరుద్ధరణ లక్ష్యంగా రద్దు చేసినట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ప్రకటించింది.   »    ఈ రద్దు జులై 24 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.   »    ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ చట్టం ప్రకారం ఛైర్మన్లు, సభ్యులు పదవుల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది.¤  భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టి (2012 జులై 25) రెండేళ్లు పూర్తయ్యాయి.   »    ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఒక ప్రదర్శనశాలను ప్రారంభించారు. దీన్ని లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంకు భారత ప్రతిబింబంగా పేర్కొనవచ్చు. 1911 నుంచి ఇప్పటివరకూ భారత చారిత్రక సంఘటనలను ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు.   »    ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సమక్షంలో రాష్ట్రపతి దీన్ని ప్రారంభించారు.   »    ఈ ప్రదర్శనశాలతో పాటు విజ్ఞాన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.¤  అసంఘటిత, ప్రైవేటు రంగాల్లో పదవీ విరమణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పింఛను అందించాలనే ఒక ప్రైవేటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.   »    ఈ 'జాతీయ కనీస పింఛను (హామీ) బిల్లు - 2014' ను భారతీయ జనతా పార్టీ సభ్యుడు నిశికాంత్ దూబే ప్రవేశపెట్టారు.   »    జాతీయ పింఛను బోర్డును ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. అసంఘటిత లేదా ప్రైవేటు రంగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారి రికార్డులను, 60 ఏళ్లు నిండినా ప్రతిపాదిత చట్టం కింద కనీస పింఛను అందనివారి రికార్డులను ఈ బోర్డు నిర్వహిస్తుంది. రూ.50 వేల కోట్ల మూలనిధితో జాతీయ పింఛను నిధిని ఏర్పాటు చేయాలని బిల్లు పేర్కొంటోంది.¤  ప్రయాణికుల రైళ్ల వేగాన్ని గంటకు 160 - 200 కి.మీ.కు పెంచడానికి రైల్వేశాఖ తొమ్మిది కారిడార్లను గుర్తించింది.   »    ఢిల్లీ - ఆగ్రా, ఢిల్లీ - చండీగఢ్, ఢిల్లీ - కాన్పూర్, నాగ్‌పూర్ - బిలాస్‌పూర్, మైసూరు - బెంగళూరు - చెన్నై, ముంబయి - గోవా, ముంబయి - అహ్మదాబాద్, చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్ మార్గాల్లో వేగాన్ని పెంచనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.¤  బొగ్గు గనుల కేటాయింపు అవకతవకలపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు న్యాయమూర్తిగా ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి భరత్ పరాశర్‌ను సుప్రీంకోర్టు నియమించింది.   »    ఈ కేసులో సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తరఫున వాదనలు వినిపించడానికి చండీగఢ్‌కు చెందిన న్యాయవాది ఆర్.ఎస్.చీమాను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది.   »    బొగ్గు కుంభకోణానికి సంబంధించి వివిధ కోర్టుల పరిశీలనలో ఉన్న అన్ని కేసులనూ ప్రత్యేక కోర్టుకే బదిలీ చేయాలని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని జస్టిస్ మదన్ బి.లోకుర్, జస్టిస్ కురియెన్ జోసెఫ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.¤  ఉత్తరప్రదేశ్‌లోని బరేలి నుంచి అలహాబాద్ బయలుదేరిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో కూలిపోయిన దుర్ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన ఏడుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
జులై - 26 
¤  పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. గంగానది ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధి లాంటి వివిధ అంశాలపై పౌరుల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు http://mygov.nic.in/ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.
జులై - 27
¤  భారత పౌర అణుకేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తనిఖీలకు సంబంధించిన అదనపు ప్రోటోకాల్ జులై 25 నుంచి అమల్లోకి వచ్చింది.   »    భారత్ - అమెరికా అణు ఒప్పందం ప్రకారం ఇది తప్పనిసరి.   »    తనిఖీలకు అంగీకరిస్తూ 20 అణుకేంద్రాల జాబితాను భారత్ ఇప్పటికే ఐఏఈఏకు అందజేసింది.
జులై - 28
¤  భారతీ ఎయిర్‌టెల్ 30 కోట్ల వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. ఈ కంపెనీ మొబైల్, ల్యాండ్‌లైన్, డీఎస్ఎల్, డీటీహెచ్ సర్వీసులను అందిస్తోంది.   »    1995లో కార్యకలాపాలను ప్రారంభించిన ఎయిర్‌టెల్ 2009లో 10 కోట్లు, 2012లో 20 కోట్ల మంది వినియోగదార్లకు చేరువైంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మొబైల్ కంపెనీగా నిలిచింది.¤  సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేందర్ సింగ్, పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, రైల్వే శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ కలిసి ప్రారంభించారు.   »    ఈ మూడు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఈసారి ఈ రైలును రూపొందించారు. సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈసారి జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించనుంది.   »    ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 197 రోజులపాటు తన ప్రయాణాన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా కొనసాగిస్తుంది.   »    2015 ఫిబ్రవరి 6న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రైలు తన ప్రయాణాన్ని ముగిస్తుంది.   »    భారత్‌లోని వృక్ష, జంతు జీవజాలం వివరాలను ఈ రైలులో పొందుపరిచారు.   »    ఇప్పటివరకు సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 విడతలుగా సేవలు అందించింది. దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.   »    ఇప్పటివరకు ప్రయాణించిన దూరం లక్ష కిలోమీటర్లు. సందర్శకుల సంఖ్య 1.09 కోట్లు. వీరిలో విద్యార్థులు 22.6 లక్షల మందిపైనే ఉన్నారు. సందర్శించిన ఉపాధ్యాయుల సంఖ్య 1.2 లక్షలు. ఇది 335 స్టేషన్లలో రైలు ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శన దినాలు 1205గా ఉన్నాయి.
జులై - 29
¤  భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు.   »    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.   »    వ్యవసాయోత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రధాని మోడీ 'ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు' (ల్యాబ్ టు ల్యాండ్) అనే నినాదాన్ని ఇచ్చారు.   »    ''ఒక బొట్టుకు మరింత పంట అన్నది లక్ష్యం కావాలి" అని పిలుపునిచ్చారు.   »    వ్యవసాయ అనుబంధ రంగాల్లో కృషి చేసిన వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రధాని పురస్కారాలను అందజేశారు.   »    హర్యానాకు చెందిన కృష్ణా యాదవ్‌కు 'ఎన్‌జీ రంగా ఫార్మర్ అవార్డ్ ఫర్ డైవర్సిఫైడ్ అగ్రికల్చర్' పురస్కారం, హైదరాబాద్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌కు సర్దార్ పటేల్ విశిష్ట ఐసీఏఆర్ పురస్కారాలను ప్రదానం చేశారు.
జులై - 31
¤  సుమారు 6 వేల మంది భారతీయులు వివిధ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారనీ, వీరిలో అత్యధికంగా 1400 మంది సౌదీ అరేబియాలో ఉన్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో ప్రకటించారు.   »    పాకిస్థాన్ కారాగారాల్లో 219 మంది ఉన్నట్లు ఆమె ప్రకటించారు. వీరితో పాటు 249 మంది మత్స్యకారులూ అక్కడి జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు.   »    యూఏఈ, చైనా, అమెరికా, బంగ్లాదేశ్, మలేసియా, మయన్మార్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో భారతీయ ఖైదీలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.¤  భారత్‌లో 1400కు పైగా సాంస్కృతిక ప్రదేశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు మార్గం సుగమమైంది.   »    వీటిలో సఫ్దర్‌జంగ్ సమాధి, ఎల్లోరా గుహలు, పురానా కిలా లాంటి 76 వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవి గూగుల్ కల్చరల్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.   »    భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తోడ్పాటుతో గూగుల్ ఈ 76 ప్రదేశాలకు సంబంధించిన 360 డిగ్రీల ఆన్‌లైన్ చిత్రాలను సిద్ధం చేసింది. దీంతో ఆన్‌లైన్‌లో ఉన్న ఏఎస్ఐ ప్రదేశాల సంఖ్య 100కు చేరింది.