అక్టోబరు - 1
|
¤ మధ్య ప్రాచ్య దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం 'ఈజీ ఎన్నారై అకౌంట్' పేరిట ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఖాతా సదుపాయాలను ప్రారంభించింది. » మినిమం(కనీస) బ్యాలెన్స్ సమస్య లేకుండా ఎన్నారైలు స్వదేశాలకు నగదు పంపేందుకు (రెమిటెన్స్) ఈ ఖాతాలు ఉపయోగపడతాయి.
|
అక్టోబరు - 6
|
¤ స్టాక్ మార్కెట్‌లో మదుపరులు ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.23.33 లక్షల కోట్లను సంపాదించారు. » బీఎస్ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25 - 49 శాతం వృద్ధిని కనబరిచింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.94 లక్షల కోట్లకు చేరువైంది. » ప్రస్తుతం బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (ఎమ్ - క్యాప్) రూ. 93,77,672 కోట్లుగా ఉంది. అంటే రూ.100 లక్షల కోట్లకు కేవలం రూ.6.22 లక్షల కోట్లు తక్కువ. 2013 డిసెంబరు 31 నుంచి 2014 అక్టోబరు 1 మధ్య కాలంలో సెన్సెక్స్ 25.49 శాతం లాభపడింది. » ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మొత్తం 5,485 కంపెనీలు నమోదై ఉన్నాయి. » మార్కెట్ విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉన్న సెన్సెక్స్ బ్లూ - చిప్ కంపెనీల్లో టీసీఎస్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, విప్రో, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ ఉన్నాయి. » రూ.5,43,684.13 కోట్ల మార్కెట్ విలువతో టీసీఎస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. » ఈ ఏడాది ఇంతవరకు విదేశీ మదుపరులు నికరంగా రూ.83,438 కోట్ల నిధులను స్టాక్ మర్కెట్‌లో పెట్టుబడి పెట్టారు. రుణ విపణిలో వారు నికరంగా రూ.1.18 లక్షల కోట్ల నిధులను మదుపు చేశారు.¤ ఈ - కామర్స్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన 'ది బిగ్ బిలియన్ డే' విజయవంతం అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది 'అన్ని రకాల ఉత్పత్తులపై 80 శాతం వరకు రాయితీ' అంటూ విస్తృత ప్రచారం చేసింది. » ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక ఆఫర్లతో ఆర్డర్లు స్వీకరించిన సంస్థ 10 గంటల వ్యవధిలో మొత్తం 100 మిలియన్ డాలర్ల (రూ.610 కోట్లు) విక్రయాలు ( Gross Merchandise Volume - ఆన్‌లైన్‌లో జరిగిన మొత్తం విక్రయాలు డాలర్ రూపంలో) సాధించినట్లు ప్రకటించింది. » ఒక్క రోజులోనే 100 కోట్ల హిట్స్ (వెబ్‌సైట్ సందర్శన) లభించినట్లు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ వెల్లడించారు.
|
అక్టోబరు - 7
|
¤ ప్రత్యక్ష పన్ను, వసూళ్లు ఏప్రిల్ - సెప్టెంబరులో నికరంగా రూ.2.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ¤ ఈ ఏడాది భారత్ 5.6 శాతం వృద్ధిని సాధించవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) అంచనా వేసింది. 2015లో 6.4 శాతానికి వృద్ధి పెరగవచ్చని పేర్కొంది. » చైనా ఈ ఏడాది 7.4 శాతం వృద్ధి సాధించగలదని, తర్వాతి ఏడాది 7.1 శాతానికి తగ్గొచ్చని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. ¤ 19 రక్షణ రంగ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్, భారత ఫోర్జ్, మహేంద్ర టెలిఫోనిక్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, టాటా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, పంజ్ లాయిడ్ మొదలగు కంపెనీల ప్రతిపాదనలు ఈ జాబితాలో ఉన్నాయి. » 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు ఇవ్వడం కోసం 19 రక్షణ ప్రతిపాదనలకు పారిశ్రమిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం (డీఐపీపీ) ఆమోదం తెలిపింది. |
అక్టోబరు - 13
|
¤ ఫేస్‌బుక్ మిత్రులకు రోజులో ఏ సమయంలో అయినా నగదును బదిలీ చేసుకునే వినూత్న సేవకు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ) శ్రీకారం చుట్టింది. » నగదు పంపే, అందుకునే వ్యక్తులకు తమ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదని, ఈ సేవకు ఛార్జీ కూడా ఉండదని బ్యాంక్ వెల్లడించింది.¤ స్టాక్ మార్కెట్లకు మూడేళ్లపాటు దూరంగా ఉండాలంటూ డీఎల్ఎఫ్‌పై నిషేధం విధిస్తూ సెబీ ఆదేశాలు జారీచేసింది. » కంపెనీతో పాటు ఛైర్మన్ కె.పి. సింగ్, మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపైనా నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. దీంతో వీరు నిషేధకాలంలో మార్కెట్లలో ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు, ఇతర లావాదేవీలతోపాటు నిధుల సమీకరణకు దూరంగా ఉండాలి. » పబ్లిక్ ఇష్యూ సమయంలో సమాచారాన్ని బుద్ధిపూర్వకంగా దాచిపెట్టినట్లు తెలిసిన నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.¤ నొప్పి నివారణ ఔషధమైన వొవెరాన్ విక్రయాలపై వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నందుకు నోవార్టిస్‌కు జాతీయ ఔషధ ధరల నిర్ణయ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) రూ.300 కోట్ల జరిమానాను విధించింది. » నోవార్టిస్ స్విట్జర్లాండ్‌కు చెందిన ఔషధ సంస్థ.
|
|
అక్టోబరు - 14
|
¤ అమెరికా నుంచి జరుగుతున్న పౌల్ట్రీ దిగుమతులపై భారత్ విధించిన ఆంక్షలకు సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పరిశీలనకు వచ్చిన కేసులో భారత్ ఓడిపోయింది. » అమెరికా ఈ కేసును దాఖలు చేసింది. » అమెరికా దిగుమతులపై భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి అంతర్జాతీయ నియమావళికి అనుగుణంగా లేదని డబ్ల్యూటీవో వివాద పరిష్కార బృందం పేర్కొంది. » ఈ బృందం నిర్ణయంపై అప్పీలు చేయడానికి భారత్‌కు 60 రోజుల వ్యవధి ఉంది. » కోడిగుడ్లు, పౌల్ట్రీ మీట్ సహా కొన్ని రకాల అమెరికా ఉత్పత్తుల దిగుమతులను భారత్ నిషేధించడాన్ని సవాలు చేస్తూ 2012 మార్చిలో అమెరికా డబ్ల్యూటీవోను ఆశ్రయించింది. » అమెరికా నుంచి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి కాకుండా మనదేశం 2007లో నిషేధాన్ని విధించింది. దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది. » భారత్ ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా (ఏఐ)కు సంబంధించి తీసుకున్న చర్యలు శానిటరీ, ఫైటో-శానిటరీ (ఎస్‌పీఎస్)కు చెందిన పలు ఆర్టికల్స్‌కు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా సంబంధిత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కూడా లేవని డబ్ల్యూటీవో తన రూలింగ్‌లో తెలిపింది.¤ జంతువులపై సౌందర్య వర్ధక సాధనాల పరీక్షలు జరపకూడదని నిషేధాన్ని విధించిన కొన్ని నెలలకే, వాటికి సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులపై కూడా మన దేశం నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో దక్షిణాసియా ప్రాంతంలో 'క్రూరత్వ రహిత' మొదటి కాస్మెటిక్స్ మండలంగా భారత్ నిలిచింది. » ఈ తరహా ఉత్పత్తుల దిగుమతిని నిషేధిస్తూ భారత ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో 135-బి అనే ఒక కొత్త నిబంధనను చేర్చిందని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌డీవో) పేర్కొంది. » '2014 సంవత్సర డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ (ఫిఫ్త్ అమెండ్‌మెంట్) నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జంతువులపై పరీక్షించిన ఏ సౌందర్య సామాగ్రి కూడా దేశంలోకి దిగుమతి కాకూడదు' అని అధికారిక నోటిఫికేషన్‌లో వివరించారు. ఈ నోటిఫికేషన్ నవంబరు 13 నుంచి అమల్లోకి రానుంది. » జంతువుల హక్కుల కోసం పోరాడే పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) బృందం ఈ చర్యను స్వాగతించింది.¤ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5 ఏళ్ల కనిష్ఠానికి తగ్గింది. ఆగస్టులో 3.74% ఉండగా, సెప్టెంబరులో 2.38 శాతంగా నమోదైంది.
|
అక్టోబరు - 15
|
¤ ఐరోపాకు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 250 అత్యాధునిక ఏ 320 నియో విమానాలను కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని జెట్ విమానాలను ఆర్డరు పొందడం ఎయిర్‌బస్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. » ఈ విమానాల సరఫరా 2018 నుంచి ప్రారంభం అవుతుంది. » ఒక్కో ఏ 320 నియో విమానం ఖరీదు 102.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 627 కోట్లు). 250 విమానాల ఖరీదు సుమారు రూ.1.55 లక్షల కోట్లు అవుతుంది. ¤ దేశంలో మొబైల్ ఫోన్లను వాడేవారి సంఖ్య 92.43 కోట్లకు చేరడంతో ఆగస్టులో మొత్తం టెలికం వినియోగదారుల సంఖ్య మరోసారి 95 కోట్లను (తొలిసారి 2012 మార్చి) దాటింది. » జులై నెలాఖరు నాటికి 94.64 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉండగా ఆగస్టు చివరికి వీరు 95.18 కోట్లకు పెరిగారని ట్రాయ్ వెల్లడించింది. |
అక్టోబరు - 21
|
¤ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌టీఐఎల్)లో సంక్షోభిత నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. » ఎన్ఎస్ఈఎల్ లో తలెత్తిన రూ.5,600 కోట్ల చెల్లింపుల సంక్షోభం బాధితులను, మదుపరులను ఆదుకోవడం, వారు కోల్పోయిన సొమ్మును వీలైనంత త్వరగా తిరిగి ఇప్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు విలీన ఆదేశాలు జారీ చేసింది. » ఎన్ఎస్ఈఎల్ మాతృ సంస్థ అయిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్‌ను జిగ్నేష్ షా నెలకొల్పారు. ¤ టాటా గ్రూప్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) చైనాలో కార్ల తయారీ ప్లాంట్‌ను 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,300 కోట్ల) పెట్టుబడితో నెలకొల్పింది. ఈ ప్లాంట్‌లో తయారైన ప్రీమియమ్ లగ్జరీ రేంజ్ రోవర్ ఎవోక్ కారును తాజాగా విపణిలోకి విడుదల చేసింది. |
అక్టోబరు - 22
|
¤ సంవత్ 2070 చివరి రోజు లాభాలతో ముగిసింది. సంవత్సర కాలంలో బీఎస్ఈ సెన్సెస్ 5547.87 పాయింట్లు దూసుకెళ్లి, 26.12% లాభాలను అందించింది. » గత అయిదు సంవత్ సంవత్సరాల్లో ఇదే అత్యధిక లాభం. » సంవత్ 2065లో సెన్సెక్స్ ఏకంగా 103.57% (8813.26 పాయింట్ల) మేర ప్రతిఫలాలను అందించింది. » సంవత్ 2070లో బీఎస్ఈలోని కంపెనీలు రూ.25 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించాయి. » దీపావళి నుంచి మరుసటి దీపావళికి ముందు రోజు వరకు ఉన్న ఏడాది కాలాన్ని 'సంవత్'గా పిలుస్తారు. ¤ చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల కోసం 'శుభ్ లాభ్' పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. » ఈ కార్యక్రమం కింద చిన్న, మధ్య స్థాయి సంస్థలకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇస్తుంది. ప్రాసెసింగ్ రుణం మొదలైనవాటిలో రాయితీ కల్పిస్తుంది. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకూ ఉంటుంది. |
అక్టోబరు - 26
|
¤ ఏడాది వ్యవధిలో దేశంలోని బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) దాదాపు రూ.లక్ష కోట్ల మేరకు పెరిగాయి. » 2013-14 సంవత్సరం చివరకు దేశంలోని అన్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులు రూ.2.63 లక్షల కోట్లకు చేరాయి. కిందటి ఏడాది ఇవి 1.64 లక్షల కోట్లు ఉండేవి. |
అక్టోబరు - 27
|
¤ భారత ఐటీ, సమాచార రంగంలో 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన టెలికాం దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ముందుకొచ్చింది. » సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ సీఈఓ మసయోషిసన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో, టెలికాం మంత్రి రవిశంకర ప్రసాద్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. ¤ ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు www.pmjdy.gov.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం వివరాలు తెలుసుకునేందుకు, పథకం పరిశీలన - పురోగతిని సమీక్షించేందుకు, బ్యాంకు ఖాతా ప్రారంభానికి దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు, ఆర్థిక అక్షరాస్యత ప్రచారానికి ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. » ఈ వెబ్‌సైట్‌లో వివరాలను హిందీ, ఆంగ్ల భాషల్లో పొందుపరిచారు. |
అక్టోబరు - 31
|
¤ ముడి చమురు, ఎరువులు, సహజ వాయువు రంగాల ఉత్పత్తిలో క్షీణత కారణంగా సెప్టెంబరులో 8 కీలక రంగాల్లో వృద్ధి తగ్గు ముఖం పట్టింది. ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి చేరి 1.9 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే నెలలో వృద్ధి 9% ఉంది. » కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సహజవాయువు, ఎరువులు, శుద్ధ (రిఫైనరీ) ఉత్పత్తులు వరుసగా 6.2%, 11.6%, 2.5% చొప్పున క్షీణించాయి. ముడి చమురు ఉత్పత్తి 1.1% తగ్గింది. » ప్రారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది కీలక రంగాలకు 38% వాటా ఉంది. ¤ ఏటీఎంల వినియోగానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. ముఖ్యాంశాలు
డబ్బును, మినీ స్టేట్‌మెంట్‌ను తీసుకోవడం, నిల్వను తెలుసుకోవడం ఇలా ఎలాంటి పనులకైనా ఖాతా ఉన్న సొంత బ్యాంకు ఏటీఎంలను అయిదు సార్లకు మించి వినియోగిస్తే, తదుపరి ప్రతి లావాదేవీకి ఇకపై రూ.20 రుసుము చెల్లించాలి.
అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచితంగా వినియోగించుకోవడాన్ని నెలకు అయిదు నుంచి మూడు సార్లకు కుదించింది.
ఆరు మెట్రోనగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరులో ఈ మార్గదర్శకాలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ ప్రకటించింది.
సేవింగ్స్/కరెంట్ ఖాతాదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఆరు మెట్రో నగరాల్లో తప్ప మిగతా చోట్ల సేవింగ్స్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించుకోవడంలో నిబంధనలు మారలేదు. |
|
|