సెప్టెంబరు - 2014 ఆర్థికరంగం


సెప్టెంబరు - 1
¤ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు ఆ సంస్థ ప్రమోటర్ విజయ మాల్యా, మరో ముగ్గురు డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ప్రకటించింది. కరెంటు ఖాతాలను అధికంగా తెరవడం ద్వారా నిధులను మళ్లించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
  »   విజయ మాల్యాకు రుణం ఇచ్చిన సంస్థల్లో, ఈ ప్రకటన చేసిన తొలి బ్యాంకుగా యూబీఐ నిలిచింది.
సెప్టెంబరు - 5
¤  18 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యక్తిగత పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)ను ఇచ్చే పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రారంభించింది.  »   10 - 18 సంవత్సరాల పిల్లలు ఏటీఎం కార్డు, చెక్‌బుక్‌తో సహా సొంతంగా ఖాతా నిర్వహించుకునేందుకు అనుమతించాలని 3 నెలల క్రితం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సొంతంగా సంతకం చేయగల 10 ఏళ్లు పైబడిన పిల్లల కోసం 'పెహ్లీ ఉదాన్' ఖాతాలను ఎస్‌బీఐ ప్రారంభించింది.  »   తమ తల్లిదండ్రులు/ సంరక్షకుల భాగస్వామ్యంతో ఏ వయస్సు చిన్నారుల పేరిట అయినా ఖాతా నిర్వహించేందుకు 'పెహ్లా కదమ్' పథకాన్ని కూడా ఎస్‌బీఐ ఆవిష్కరించింది.  »   పొదుపుపై పిల్లలో అవగాహన పెంచడానికి తోడు, తెలివిగా ఖర్చు చేయడం, అవసరమైన వాటినే కొనుగోలు చేయాలనే ఆలోచన కల్పించడమే ఈ పథకాల ఉద్దేశమని ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు.  »   ఈ రెండు రకాల ఖాతాల కోసం ప్రత్యేకంగా ముద్రించిన పాస్‌బుక్, చెక్‌బుక్ జారీ చేస్తారు. చిన్నారుల ఫొటోతో ప్రత్యేక డిజైన్‌తో తీర్చిదిద్దిన ఏటీఎం/ డెబిట్ కార్డు అందజేస్తారు.  »   రోజుకు రూ.5,000 పరిమితి మించకుండా ఇంటర్‌నెట్‌లో బ్యాంకింగ్‌ను అనుమతిస్తారు. బిల్లుల చెల్లింపు, కాలపరిమితి డిపాజిట్ ప్రారంభం, రికరింగ్ డిపాజిట్ లాంటివి నెట్ బ్యాంకింగ్‌లో చేసుకోవచ్చు.  »   రోజుకు రూ.2000 గరిష్ఠ పరిమితితో మొబైల్ బ్యాంకింగ్‌ను కూడా అనుమతిస్తారు. బిల్లుల చెల్లింపు, మొబైల్/ డీటీహెచ్ రీఛార్జుల లాంటివి చేసుకోవచ్చు.
సెప్టెంబరు - 10
¤  ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 10,000 ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి పొందవచ్చు. దీని ప్రకారం ఈ బ్యాంకు ఖాతాదారులు దేశంలో ఎవరికైనా తమ ఖాతా నుంచి నగదు బదిలీ చేయవచ్చు. నగదు అందుకునే వారికి దేశంలోని ఏ బ్యాంకులోనూ ఖాతా ఉండనక్కరలేదు. మొబైల్ నంబరు ఉంటే చాలు.¤  ప్రభుత్వరంగ సంస్థల్లో కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం అంగీకరించింది.
కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీల్లో తన వాటాలను విక్రయంచే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. కోల్ ఇండియాలో 10 శాతం, ఓఎన్‌జీసీలో 5 శాతం, ఎన్‌హెచ్‌పీసీలో 11.36 శాతం వాటాను 'ఆఫర్ ఫర్ సేల్' పద్ధతిలో విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
  »   సీసీఈఏకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహిస్తున్నారు.  »   నష్టాల్లో ఉన్న 11 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల (సీపీఎస్ఈ) ఉద్యోగులకు జీతాలు, బోనస్, భవిష్యనిధి, గ్రాట్యుటీ, ఫించన్, ఈఎస్ఐ లాంటి వాటి కింద జరపాల్సిన చెల్లింపులకు రూ.287.67 కోట్లు విడుదల చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.
సెప్టెంబరు - 12
¤  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఆగస్టులో పరోక్ష పన్నుల వసూళ్లు 4.6% పెరిగి రూ.1,94,429 కోట్లకు చేరాయి.  »   గతేడాది ఇదే కాలంలో పరోక్ష పన్నుల రూపంలో రూ.1,85,881 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది.  »   ఎక్సైజ్ సుంకం వసూళ్లు స్వల్పంగా 0.5% పెరిగి రూ.61,415 కోట్లకు చేరాయి. కస్టమ్స్ పన్నులు కూడా 0.3% పుంజుకొని రూ.71,207 కోట్లుగా నమోదయ్యాయి.  »   సేవా పన్నుల వసూళ్లు 15.1 శాతం వృద్ధితో రూ.61,870 కోట్లకు ఎగబాకాయి.
సెప్టెంబరు - 15 
¤  ఏటీఎమ్‌లను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను యాక్సిస్ బ్యాంకు ప్రారంభించింది.  »   ఎవరైనా అనధికార కార్యకలాపాలకు పాల్పడితే అప్రమత్త సంకేతాన్ని ఇవ్వడంతోపాటు ఏటీఎమ్‌కు, కేంద్రీకృత భద్రతా నిర్వహణ వ్యవస్థకు మధ్య సమాచార సౌలభ్యాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తుంది. అంతేకాకుండా పోలీసు ఠాణాకు, గస్తీ అధికారికి కూడా ఇది సమాచారమిస్తుంది.¤  టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత అయిదేళ్లలో అతి తక్కువ స్థాయికి దిగి వచ్చింది. కూరగాయలు సహా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఈ ఏడాది ఆగస్టు నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 3.74 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జులైలో 5.19 శాతంగా ఉంది.  »   2013 ఆగస్టులో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్పణం 6.79 శాతంగా ఉంది. 2009 అక్టోబరులో నమోదైన 1.8 శాతం తర్వాత డబ్ల్యూపీఐ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి.  »   ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది జులైలో 8.43 శాతం కాగా, ఆగస్టులో 5.15 శాతానికి దిగివచ్చింది. కూరగాయల ధరలు వరుసగా మూడో నెలలోనూ తగ్గి, ఆగస్టులో 4.88 శాతంగా నమోదైంది. ఉల్లిపాయల ధరలు 44.7 శాతం, పళ్ల ధరల ద్రవ్యోల్బణం 20.31 శాతానికి తగ్గాయి. కోడిగుడ్లు - మాంసం - చేపల ధరల్లోనూ తగ్గుదల నమోదైంది. పంచదార, వంటనూనెల ద్రవ్యోల్బణం 3.67 శాతం నుంచి 3.45 శాతానికి తగ్గాయి.  »   బంగాళా దుంపల ధర మాత్రం 46.41 శాతం నుంచి 61.61 శాతానికి పెరిగింది. పాలు 12.18 శాతం, పప్పుదినుసులు 7.81 శాతం మేర ధరలు పెరిగాయి.  »   ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సహా ఇంధన, విద్యుత్తు విభాగాల్లో ద్రవ్యోల్బణం 7.40 శాతం నుంచి 4.54 శాతానికి దిగి వచ్చాయి.
¤  ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఆగస్టులో వాణిజ్యలోటు నాలుగు నెలల గరిష్ఠానికి చేరి, 1083 కోట్ల డాలర్లుగా నమోదైంది. గత ఏప్రిల్ తర్వాత ఆ స్థాయిలో లోటు పెరగడం ఇదే ప్రథమం. ఎగుమతుల్లో 5.26% వృద్ధి ఉండటంతో ఏప్రిల్‌లో వాణిజ్యలోటు 1000 కోట్ల డాలర్లకు చేరింది.¤  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎగుమతులు వృద్ధి రేటు 2.35 శాతం తగ్గి, 2,695 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇది అయిదు నెలల కనిష్ఠం కావడం గమనార్హం. మరో వైపు దిగుమతులు 2.08% పెరుగుదలతో 3,779 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.  »   మే, జూన్ లలో ఎగుమతుల్లో వరుసగా 12.4%, 10.22% చొప్పున వృద్ధి నమోదైంది. జులైలో ఎగుమతుల వృద్ధి రేటు 7.33 శాతంగా నమోదైంది.  »   అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్ - ఆగస్టు) ఎగుమతులు 7.31% వృద్ధితో 13,479 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు 2.69% క్షీణించి 19,094 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.  »   వాణిజ్య లోటు కూడా గత ఏడాది ఏప్రిల్ - ఆగస్టు మధ్య నమోదైన 7,060 కోట్ల డాలర్ల నుంచి 5,615 కోట్లకు దిగివచ్చింది.  »   పసిడి దిగుమతులు పెరిగి 203 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాది కిందట ఇవి 73.87 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.¤  చమురు దిగుమతులు 14.97% క్షీణతతో 1,283 కోట్ల డాలర్లకు పరిమితం కాగా చమురేతర దిగుమతులు 13.82% వృద్ధితో 2,495 కోట్ల డాలర్లకు చేరాయి.¤  పసిడి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో రత్నాభరణాల ఎగుమతులు 10.35% తగ్గి 323 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు కూడా 17.67 శాతం తగ్గుదలతో 54.7 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.  »   తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, ఇనుప ఖనిజం, పెట్రోలియం ఉత్పత్తుల్లో ఎగుమతుల వృద్ధి తగ్గింది.  »   దిగుమతుల విషయానికొస్తే ఎరువులు, బొగ్గు, పెట్రోలియం తదితర రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. 
సెప్టెంబరు - 16 
¤ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎమ్‌జేడీవై) పథకం కింద బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు ఆరంభిస్తున్న వారికి లభించే ప్రయోజనాలు, ఇప్పటికి బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారికీ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  »   అయితే ఆయా ప్రయోజనాల కోసం ఖాతాదారులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పీఎమ్‌జేడీవై కింద ఖాతాదారులకు 'రూపే
' డెబిట్ కార్డును ఇస్తున్నారు. వీరికి లక్ష రూపాయల ప్రమాద బీమా ఉంటుంది. కొంతకాలం పాటు బ్యాంకు లావాదేవీలు సక్రమంగా ఉంటే, వీరికి రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన.
  »   కుటుంబంలో ఒకరికి ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఓవర్ డ్రాఫ్టు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
  »   రూపే కార్డుదారులకు రూ.30,000 జీవిత బీమా కూడా లభిస్తుంది.
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి 21 ప్రతిపాదనలను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదించింది.
  »   ఆర్థికశాఖ కార్యదర్శి అరవింద్ మయరాం నేతృత్వంలోని ఎఫ్ఐపీబీ సమావేశమై 35 ప్రతిపాదనలను పరిశీలించి, 21 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
 
సెప్టెంబరు - 17
¤ చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో, చైనా అగ్రగామి వాణిజ్య బ్యాంక్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ)తో 260 కోట్ల డాలర్ల (ఈ మొత్తం భారతీయ కరెన్సీలో సుమారు రూ. 5,600 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  »   ఈ ఒప్పందంలో భాగంగా ఇండిగో కొనుగోలు చేయదలచిన ముప్పైకి పైగా విమానాలకు ఐసీబీసీ రుణం అందించింది.¤ రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో జగదీష్‌పూర్ - ఫూల్పూర్ - హాల్దియాల మధ్య 2,050 కిలోమీటర్ల పొడవునా గ్యాస్ గొట్టపు మార్గం (పైప్‌లైన్) నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు గెయిల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ) బి.సి.త్రిపాఠి ప్రకటించారు.  »   పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సహజ వాయువును సరఫరా చేసేందుకు ఈ పైపులైను ఉపయోగపడుతుంది.
సెప్టెంబరు - 18
¤ జాతీయ బ్యాంకుల్లో కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  »   ఎవరైనా బ్యాంకు ఉద్యోగి అకాల మరణం చెందితే వారి రక్త సంబంధీకులకు కేవలం క్లర్కులు, గ్రూప్-డి కేటగిరీల్లో మాత్రమే నియామకాలు వర్తింపజేస్తారు.¤ భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రొత్సహించే దిశగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు చైనాకు చెందిన ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా (చైనా ఎగ్జిమ్ బ్యాంక్) తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సెప్టెంబరు - 22
¤ వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని ఏరోజుకారోజు రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో 'కిసాన్ వాణి' సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ఇఫ్కో అనుబంధ సంస్థ అయిన ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  »   ఆంధ్రా బ్యాంకు సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ ఈ సదుపాయాన్ని లాంఛనంగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
సెప్టెంబరు - 23 
¤ ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) ఆర్థికేతర అవసరాలను నెరవేర్చడానికి ఐసీఐసీఐ బ్యాంక్ 'ఎన్ఆర్ఐ అడ్వాంటేజ్' పేరుతో ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది.
¤ ప్రముఖ డచ్ కంపెనీ ఫిలిప్స్ రెండు సంస్థలుగా విడిపోయింది. 120 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ హెల్త్‌కేర్, లైఫ్‌స్త్టెల్ విభాగాలను ప్రత్యేక కంపెనీగా విడదీసింది. మిగిలిన సంస్థ విడిగా లైటింగ్ సొల్యూషన్ల బిజినెస్‌ను నిర్వహించనుంది. రెండు కంపెనీలూ ఫిలిప్స్ బ్రాండ్‌ను కొనసాగించనున్నాయి.
 
సెప్టెంబరు - 23 
¤ రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముంబయిలో ప్రకటించారు.
ముఖ్యాంశాలు:
  »   రెపో రేటు 8 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంలలో మార్పు లేదు. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) 22 శాతం వద్దే ఉంటుంది.
  »   ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 5.5% వృద్ధి చెందవచ్చని అంచనా.
  »   వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని జనవరి 2015 కల్లా 8 శాతానికి, జనవరి 2016 నాటికి 6 శాతానికి చేర్చాలని లక్ష్యం.
  »   చిన్న, చెల్లింపుల బ్యాంకులపై మార్గదర్శకాలు నవంబరు చివరికల్లా విడుదల.
  »   డిసెంబరు 2న తదుపరి ద్వైమాసిక విధానాన్ని ప్రకటిస్తారు.