నవంబరు - 4
|
¤ భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ 'అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ నేషనల్ కౌన్సిల్ (ఎన్‌సీఏఈఆర్)' 5 శాతానికి తగ్గించింది. » వృద్ధి రేటును ఇంత క్రితం 5.7% అంచనా వేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించింది. » ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం సానుకూల అంశాలు అయినప్పటికీ దేశంలో తక్కువ వర్షపాతం, పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఇతర అంతర్జాతీయ అనిశ్చితి అంశాలు వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్‌సీఏఈఆర్ అభిప్రాయపడింది.
|
నవంబరు - 7
|
¤ దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ భారత ఆర్థికవృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.6 శాతానికే పరిమితం కావచ్చని లెక్కగట్టింది. ఆగస్టులో ఇదే సంస్థ భారత జీడీపీ 5.7 శాతంగా నమోదు కాగలదని అంచనా వేసింది. » ద్రవ్యలోటు 4.2 శాతానికి చేరవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. వ్యవసాయంలో వృద్ధి 1.3 శాతం, సేవల రంగ వృద్ధి అంచనా 7.1 శాతంగా లెక్క గట్టింది.
|
నవంబరు - 10
|
¤ చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.¤ టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)గా పిలిచే ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం దిల్లీలో సంతకాలు చేశాయి.
|
నవంబరు - 11
|
¤ ఇ - కామర్స్ దిగ్గజం అలీబాబా ఆన్‌లైన్‌లో రికార్డు విక్రయాలను సాధించింది. » చైనాలో 'సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజాలో ఒక్కరోజులోనే 9.34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,000 కోట్లు)కు పైగా విక్రయాలు చేసి సంచలనం సృష్టించింది. » నవంబరు 11న ఎక్కువ ఒకట్లు (11.11.14) వస్తాయి కాబట్టి ఆ రోజున 'సింగిల్స్ డే' పేరిట 2009 నుంచి అలీబాబా భారీ డిస్కౌంట్లు ప్రకటించి విక్రయాలు చేస్తోంది.
|
నవంబరు - 12
|
¤ సెప్టంబరులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధి మూడు నెలల గరిష్ఠానికి చేరి 2.5 శాతంగా నమోదైంది. తవ్వక, తయారీ రంగాలు రాణించడమే దీనికి కారణం. కిందటి ఏడాది ఇదే నెలలో ఐఐపీ 2.7 శాతంగా ఉంది.¤ ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి పరిమితమైంది. ఆహార ద్రవ్యోల్బణ రేటు ప్టెంబరులో 7.67 శాతం ఉండగా, అక్టోబరులో 5.59 శాతంగా నమోదైంది.
|
నవంబరు - 14
|
¤ అక్టోబరు నెలకు ద్రవ్యోల్బణం 1.77 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ఠ స్థాయి. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరల్లో క్షీణత, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర వహించాయి. » అక్టోబరు నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తక్కువ స్థాయిలో 5.52 శాతానికి పరిమితమైంది. 2012 జనవరిలో ద్రవ్యోల్బణ లెక్కింపులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాక ఇంత తక్కువ నమోదు కావడం ఇదే మొదటిసారి.
|
నవంబరు - 16
|
¤ షేర్ల క్రయ విక్రయాల లావాదేవీల (ఈక్విటీ ట్రేడింగ్‌లు) పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా అమెరికాకు చెందిన నాస్‌డాక్ ఓఎంఎక్స్ అవతరించింది. 2014లో ఇప్పటి వరకు జరిగిన మొత్తం లావాదేవీల సంఖ్య పరంగా ఇది అగ్రస్థానానికి దూసుకెళ్లింది. » మన దేశానికి చెందిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) రెండో స్థానానికి పరిమితమైంది. » ప్రపంచ ఎక్స్ఛేంజీల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఈ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం గతేడాది ఇదే సమయం (జనవరి - అక్టోబరు 2013) లో ఎన్ఎస్ఈ తొలి స్థానంలో ఉంది. » ఈ ఏడాది (జనవరి - అక్టోబరు)లో నాస్‌డాక్ ఓఎమ్ఎక్స్‌లో ఈక్విటీ ట్రేడింగ్‌లు 144.2 కోట్లకు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 52 ఎక్స్ఛేంజీల్లో అగ్రస్థానంలో నిలిచింది. » ఎన్ఎస్ఈ 141.74 కోట్ల ట్రేడింగ్‌లతో రెండో స్థానంతో సరిపుచ్చుకుంది. » చైనాకు చెందిన షెంజెన్ స్టాక్ ఎక్స్ఛేంజీ (128.4 కోట్లు), న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ (128.25 కోట్లు)లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. » 32.39 కోట్ల లావాదేవీలతో భారత్‌కు చెందిన బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ) ఎనిమిదో స్థానంలో నిలిచింది.
|
నవంబరు - 17
|
¤ ఆరు నెలల తర్వాత తొలిసారిగా భారత ఎగుమతులు ప్రతికూలంగా నయోదయ్యాయి. ఇంజినీరింగ్, ఔషధ, రత్నాభరణాల లాంటి ప్రధాన రంగాల్లో ఎగుమతులు కలిసి రాకపోవడంతో అక్టోబరులో భారత ఎగుమతులు 5.04 శాతం తగ్గాయి. 26.09 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బంగారం దిగుమతులు ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వాణిజ్య లోటు అక్టోబరులో 13.35 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది అక్టోబరులో వాణిజ్య లోటు 10.59 బిలియన్ డాలర్లు మాత్రమే. అయితే సెప్టెంబరులో వాణిజ్య లోటు 14.24 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే. » 2014 అక్టోబరులో దిగుమతులు 3.62% పెరిగి 39.44 బిలియన్ డాలర్లకు పెరిగాయి. |
నవంబరు - 19
|
¤ ఆస్ట్రేలియా తయారీ విమానాలను భారత్‌లో విక్రయించడానికి మహీంద్రా గ్రూప్‌నకు అనుమతి లభించింది. » మహీంద్రా గ్రూప్స్ విమానాలుగా పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లలో 5-10 సీట్లు ఉంటాయి. భారత నిబంధనల ప్రకారం సిబ్బంది కాకుండా, నలుగురు ప్రయాణికులకే అనుమతి ఉంది. కానీ తొమ్మిది మంది ప్రయాణికులకు మహీంద్రా సంస్థ అనుమతి కోరుతూ వస్తోంది. ఇప్పటికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిబంధనలను సవరణ చేయడంతో మహీంద్రాకు మార్గం సుగమం అయ్యింది. » మహీంద్రా సంస్థ ఆస్త్రేలియాకు చెందిన ఒక విమానయాన కంపెనీని ఇటీవల కొనుగోలు చేసింది. ఈ సంస్థ తన విమానాలను కాలిఫోర్నియాలో కూడా విక్రయిస్తోంది.
|
నవంబరు - 20
|
¤ భారత్‌లోనే అతి పెద్ద బ్యాంకింగ్ విలీనానికి తెర తీసింది. దాదాపు రూ.15,000 కోట్లతో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్నట్లు కొటక్ మహీంద్ర బ్యాంకు ప్రకటించింది. » ఈ విలీనంతో రూ.2 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్‌తో కొటక్ మహీంద్ర బ్యాంకు దేశంలోనే అతిపెద్ద నాలుగో ప్రైవేట్ బ్యాంకుగా అవతరించనుంది. |
నవంబరు - 24
|
¤ ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఎఫ్ఏపీసీసీఐ)లో మహిళా విభాగం ఏర్పాటైంది. » ఫ్యాప్సీ ఉమెన్ ఇన్ బిజినెస్ (ఎఫ్ఐబీ) అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. » ఎఫ్ఐబీ తొలి అధ్యక్షురాలిగా వినీతా సురానా ఎంపికయ్యారు. » వ్యాపార రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ విభాగం కృషి చేస్తుంది. |
నవంబరు - 28
|
¤ బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ) చరిత్రలో మరపురాని ఘట్టం ఆవిష్కృతమైంది. నమోదిత కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ.100 లక్షల కోట్ల మైలు రాయిని దాటింది. దశాబ్ద కాలంలోనే బీఎస్ఈ మదుపర్ల సంపద పదింతలవడం విశేషం. » ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూ.100.01 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ విలువ చివరకు రూ.99,81,572 కోట్లకు పరిమితమైంది. రూ.100 లక్షల కోట్లకు ఇది 0.2% తక్కువ. డాలర్లలో ఈ విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీఎస్ఈ మార్కెట్ విలువ దాదాపు 500 కోట్ల డాలర్లు (రూ.29 లక్షల కోట్లు) పెరిగింది. » 2003లో రూ.10 లక్షల కోట్లతో మొదలైన బీఎస్ఈ మార్కెట్ విలువ ప్రస్థానం 11 ఏళ్లలోనే పదింతలైంది. 2009లో రూ.50 లక్షల కోట్లకు చేరగా, గత అయిదేళ్లలో రెండు రెట్లు పెరిగింది. » ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న తొలి పది స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బీఎస్ఈ కూడా ఒకటి. 19.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ జాబితాలో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ అగ్రస్థానంలో ఉంది. బీఎస్ఈది పదో ర్యాంకు కాగా, భారత్‌కు చెందిన మరో స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ 11వ స్థానంలో కొనసాగుతోంది. » నమోదిత కంపెనీల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజీ బీఎస్ఈనే. దాదాపు 4,700 కంపెనీల షేర్లు ఇందులో ట్రేడవుతున్నాయి. అలాగే నమోదిత మదుపర్ల సంఖ్య సుమారు 2.7 కోట్లు. » బీఎస్ఈ మార్కెట్ విలువలో సెన్సెక్స్ 30 కంపెనీలదే దాదాపు 50 శాతం వాటా. వీటి మార్కెట్ విలువ రూ.47 లక్షల కోట్ల వరకు ఉంది. రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు దాటిన కంపెనీల్లో ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.¤ భారత ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో రాణించలేకపోయింది. జులై - సెప్టెంబరులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటు 5.3 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్‌లో వృద్ధి 5.7 శాతం కంటే ఇది తక్కువే. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వృద్ధి 5.2 శాతంతో పోలిస్తే కాస్తంత ఎక్కువ. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో వ్యవసాయ రంగంలో వృద్ధి 5% నుంచి 3.23 శాతానికి పరిమితం కావడం తాజా జీడీపీ గణాంకాల మందగమనానికి కారణమైంది. తయారీ రంగంలో వృద్ధి 0.1 శాతానికి చేరడం కూడా ప్రభావం చూపింది. » 2014 - 15 ప్రథమార్ధం (ఆరు నెలల కాలం)లో వృద్ధి 5.5. శాతంగా నమోదైంది. 2013 - 14 తొలి ఆరు నెలల కాలంలో ఇది 4.9 శాతం.¤ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 20 శాతాన్ని ఆభరణాల రూపంలో తప్పనిసరిగా ఎగుమతి చేయాలన్న 80 : 20 నిబంధనను ప్రభుత్వం రద్దు చేసిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. » ఒకసారి దిగుమతి చేసుక్ను బంగారంలో 20 శాతాన్ని ఎగుమతి చేసినట్లు రుజువు చూపితేనే, మళ్లీ బంగారం దిగుమతికి అనుమతించే ఈ నిబంధనను 2013 ఆగస్టులో ప్రవేశపెట్టారు.¤ చమురు ఉత్పత్తి తగ్గించకూడదని పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నిర్ణయించడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రపంచం వినియోగిస్తున్న చమురులో మూడింట ఒక వంతు ఈ 12 దేశాల నుంచే వస్తోంది. » ఒపెక్ నిర్ణయంతో ముడిచమురు ధర అంతర్జాతీయంగా 5 ఏళ్ల కనిష్ఠానికి తగ్గి, బ్యారెల్ 72.76 డాలర్లుగా నమోదైంది. గత జూన్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 115 డాలర్లు పలికింది. » ధరల తగ్గుదల రూపంలో కొద్దికాలం పాటు కష్టాలు ఎదురైనా, దీర్ఘకాల లాభం కోసం ఉత్పత్తి యథావిధిగా రోజుకు 3 కోట్ల బ్యారెళ్ల (బ్యారెల్ అంటే 119.24 లీటర్ల చొప్పున మొత్తం 357.72 కోట్ల లీటర్లు) మేర కొనసాగించాలన్న సౌదీ అరేబియా వాదననే ఒపెక్ ఆమోదించింది.
|
|
|