ఆగస్టు - 2014 నివేదికలు - సర్వేలు


ఆగస్టు - 1
¤  ఉపాధి పొందేందుకు పట్టభద్రులైన యువతకు ఏయే సంస్థలు ఆకర్షణీయంగా ఉన్నాయనే అంశంపై అంతర్జాతీయ బ్రాండింగ్‌ సంస్థ 'యూనివర్సమ్‌' సర్వే నిర్వహించింది. 2014లో ఆసియా - పసిఫిక్‌ దేశాల్లోని ఆకర్షణీయమైన సంస్థలపై నిర్వహించిన సర్వేలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.

   »    వ్యాపార కోర్సులు అభ్యసించిన వారు గూగుల్ తర్వాత‌ డెలాయిట్‌, సిటీ, యాపిల్‌,
పీ అండ్‌ జీ సంస్థలను ఎంచుకున్నారు. తరవాతి స్థానాల్లో అకౌంటింగ్‌ సంస్థలు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ సంస్థలైన యునీలీవర్‌ 14, నెస్లే 16, లోరెల్‌ 20వ ర్యాంకు పొందాయి. 


   »    ఐటీ పట్టభద్రులు గూగుల్ తర్వాత‌ యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శామ్‌సంగ్‌, బీఎండబ్ల్యు సంస్థలకే ఓటేశారు. నోకియా 32వ స్థానంలో నిలిచింది.
ఆగస్టు - 6
¤  'న్యూ వరల్డ్ వెల్త్' అనే సంస్థ ప్రపంచంలో అత్యంత ధనవంతులున్న దేశాల జాబితాను రూపొందించింది.

ముఖ్యాంశాలు:

 జూన్ 2014 నాటికి ప్రపంచంలో మొత్తం 1.3 కోట్ల మంది కోటీశ్వరులు (మిలియనీర్లు) ఉన్నారు. ఇందులో 4,95,000 మందిని కుబేరులు (మల్టీ మిలియనీర్లు)గా పరిగణించింది.

 సర్వే నిమిత్తం మిలియనీర్ అంటే ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ, మల్టీ మిలియనీర్లు అంటే కనీసం 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.60 కోట్లు) నికర సంపద ఉన్నవారిగా పరిగణించారు.

 ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో మిలియనీర్ల సంఖ్య 58% పెరగ్గా మల్టీ మిలియనీర్లు 71% వరకూ పెరిగారు.

 14,800 మంది కుబేరులతో భారతదేశం అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

 2700 మంది కుబేరులతో ముంబయి నగరం అంతర్జాతీయంగా అత్యధిక ధనవంతులున్న తొలి 25 నగరాల్లో ఒకటిగా నిలిచింది. హాంకాంగ్ నగరం 15,400 మంది ధనవంతులతో అగ్రస్థానంలో ఉంది.
అత్యధిక ధనవంతులున్న తొలి 10 దేశాలు - కుబేరుల సంఖ్య
1.  అమెరికా - 1,83,500
2.  చైనా - 26,600
3.  జర్మనీ - 25,400
4.  బ్రిటన్ - 21,700
5.  జపాన్ - 21,000
6.  స్విట్జర్లాండ్ - 18,300
7.  హాంకాంగ్ - 15,400
8.  భారత్ - 14,800
9.  రష్యా - 11,700
10. బ్రెజిల్ - 10,300

¤  అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ హే గ్రూపుతో కలిసి ఫార్చూన్ ఇండియా 'భారత్‌లో అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితా'ను రూపొందించింది.

ముఖ్యాంశాలు:

  ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ భారత్‌లోనే అత్యంత ప్రశంసనీయమైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ యునీ లీవర్ (హెచ్‌యూఎల్) నిలిచాయి.

  కార్పొరేట్ విధానాలు, సామాజిక ప్రభావం, ఉత్పత్తి నాణ్యత, ఉద్యోగుల సాధికారత, ఓర్పు తదితర అంశాల్లో ఐటీసీ అత్యధిక మార్కులు సంపాదించింది.

  రెండో స్థానాన్ని దక్కించుకున్న ఎల్ అండ్ టీ నాయకత్వం విషయంలో అత్యధిక రేటింగ్‌ను పొందింది. హెచ్‌యూఎల్ పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి నాణ్యత, నాయకత్వం, వినూత్నత, అంతర్జాతీయ యవనికపై స్థానం తదితర అంశాల్లో రాణించింది.

  మారుతి సుజుకీ, ఎస్‌బీఐ, టీసీఎస్, కోకకోలా, శాంసంగ్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ
టాప్ - 10లో నిలిచాయి.
ఆగస్టు - 7
¤  దేశంలో అత్యంత విలువైన కంపెనీలతో కన్సల్టింగ్ సంస్థ 'బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా' తన వార్షిక 
సర్వేను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు:
 దేశంలోనే అత్యంత విలువైన బ్రాండుగా టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
 21 బిలియన్ డాలర్ల (రూ.1,26,000 కోట్లు) తో భారత్ టాప్ - 100 బ్రాండ్లలో ముందు 
నిలిచింది. ఈ 100 కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లయితే అందులో 
అయితో వంతు ఈ గ్రూపుదే కావడం గమనార్హం.

 4.1 బిలియన్ డాలర్లతో ఎల్ఐసీ రెండో స్థానాన్ని దక్కించుకోగా, ఎస్‌బీఐ
 (4 బిలియన్ డాలర్లు), భారతీ ఎయిర్‌టెల్ (3.8 బిలియన్ డాలర్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ 
(3.5 బిలియన్ డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


అత్యంత విలువైన భారత బ్రాండ్లలో 6 నుంచి 20 స్థానాల్లో నిలిచిన కంపెనీలు:
 ఓఎన్‌జీసీ(3.29 బిలియన్ డాలర్లు), ఇండియన్ అయిల్(3.15 బి.డా.), ఎల్ అండ్ టీ
 (2.37 బి.డా.),ఇన్ఫోసిస్ (2.29 బి.డా.), ఎం అండ్ ఎం (2.27 బి.డా.), విప్రో (1.93 బి.డా.), 
హెచ్‌సీఎల్ టెక్ (1.92బి.డా.), ఐసీఐసీఐ బ్యాంక్ (1.68 బి.డా.), గోద్రెజ్ (1.50 బి.డా.) 
మారుతీ సుజుకీ (1.359 బి.డా.), అడాగ్ (1.357 బి.డా.), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.22 బి.డా.), 
ఐడియా సెల్యులర్(1.14 బి.డా.), భారత్ పెట్రోలియం (1.12 బి.డా.), 
అమూల్ (1.11 బిలియన్ డాలర్లు).             
ఆగస్టు - 15
¤  ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థల జాబితా 'అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్‌'లో తొలి 500 విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు నిలిచింది.

   »    ఈ సంస్థను 19వ శతాబ్ద చివరి దశలో జంషెడ్‌జీ నుస్సేర్‌వంజీ టాటా స్థాపించారు.

   »    జాబితాలో ఐఐఎస్‌సీ 301 - 400 మధ్య స్థానాన్ని సాధించింది. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

   »    ఐఐఎస్‌సీ నేచురల్ సైన్సెస్, గణిత విభాగంలో 151 - 200 మధ్య స్థానంలో నిలిచింది. రసాయనశాస్త్ర విభాగంలో 51 - 75 మధ్య స్థానం పొందింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఐఐఎస్‌సీతో పాటు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ 101 - 150 స్థానంలో నిలిచాయి.
ఆగస్టు - 18 
¤  అంతర్జాతీయ పునరుత్పాదక విద్యుత్‌రంగ స్థితిగతులు - 2014 
నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 పవన విద్యుదుత్పత్తి దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో చైనా, అమెరికా, జర్మనీ, స్పెయిన్ ఉన్నాయి.

   »    ప్రపంచవ్యాప్తంగా 2013లో 35,000 మెగావాట్ల మేర అదనంగా సామర్థ్యం జతకావడంతో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 3,18,000 మెగావాట్లకు చేరింది.

   »    2013లో చైనా అత్యధికంగా 16,100 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించింది. భారత్ 1700 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా ఉత్పిత్తి చేసింది. 
ఆగస్టు - 27
¤  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి నివేదిక అందజేసింది.

   »    రాజధాని ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గత యూపీఏ ప్రభుత్వం ఆ మేరకు 2014, ఏప్రిల్ 25న ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 31 లోపు నివేదిక ఇవ్వాలని కూడా అప్పుడే నిర్దేశించింది.

   »    రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ - గుంటూరు - తెనాలి (వీజీటీఎం) మధ్య రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతుండగా కమిటీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించింది. రాజధానిని చక్కటి సాగు భూములున్న విజయవాడ - గుంటూరు ప్రాంతంలో కేంద్రీకరిస్తే దీర్ఘకాలంలో ఆర్థికంగా, పర్యావరణపరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. వినుకొండ - మార్టూరు - దొనకొండ వద్ద ఏర్పాటు చేస్తే అలాంటి ఇబ్బందులేవీ ఉండవని తన నివేదికలో తేల్చి చెప్పింది.

   »    ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం సామాజిక జీవనం, ఆర్థికాభివృద్ధి రెండింటికీ ఆస్కారం ఉండేలా కేంద్రీకృత రాజధాని కావాలని అభిలషిస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ మాత్రం రాజధానిని భారీ ఎత్తున ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం చేయవద్దని సిఫార్సు చేసింది.
ఆగస్టు - 31 
¤  కేంద్రంలో వంద రోజులు పూర్తి చేసుకున్న నరేంద్రమోడీ సర్కారు పాలనపై కార్పొరేట్ సంస్థలు సంతృప్తితో ఉన్నట్లు అసోచామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. మోడీ సర్కారుకు పదికి ఎనిమిది మార్కులు లభించాయి. 357 మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ఈ సర్వేను నిర్వహించారు.

   »    5 శాతం కంటే దిగువన ఉన్న ఆర్థిక వృద్ధిని 6 శాతానికి తీసుకువెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ పేర్కొన్నారు.

¤  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2013 సంవత్సరానికి గాను జువెనైల్స్ నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ముఖ్యాంశాలు: 

  »    దేశవ్యాప్తంగా జువెనైల్స్‌పై నమోదైన నేరాల్లో 66.6 శాతం మంది జువెనైల్స్ పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల వయసులోపు వారే. 7 - 12 ఏళ్ల మధ్య జువెనైల్స్ 2.4 శాతం ఉండగా, 12 - 16 ఏళ్ల మధ్య వయసు వారు 31 శాతం.

   »    జువెనైల్స్ సంబంధిత ఐపీసీ నేరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉండగా నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్ ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే జువెనైల్స్‌పై 63 శాతం ఐపీసీ నేరాలు నమోదయ్యాయి.

   »    నేరాలకు పాల్పడే కొత్త జువెనైల్స్ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా 33,961 మంది కొత్త జువెనైల్స్ కాగా పాతవారు 4145 మంది. ఏపీలో చూస్తే 2888 మంది కొత్తవాళ్లు అయితే 245 మంది పాతవారే ఉన్నారు.