జూన్ - 2014 అంతర్జాతీయం


జూన్ - 1
¤  తన గూఢచర్య లక్ష్యాల కోసం అమెరికా జాతీయ భద్రతాసంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో విస్తరించిన వ్యక్తుల ముఖచిత్రాలను సేకరిస్తోందని 'ద న్యూయార్క్ టైమ్స్' పత్రిక తన కథనంలో పేర్కొంది.   
»    దీనికోసం ఎన్ఎస్ఏ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, ఈ మెయిళ్లు, సామాజిక మాధ్యమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వ్యక్తుల చిత్రాలను సేకరిస్తోందని వెల్లడించింది.
జూన్ - 5
¤  సిరియా ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఘన విజయం సాధించారు. ఆయన మరో ఏడేళ్ల పాటు పాలన కొనసాగించనున్నారు.   
»    అసద్ నేతృత్వంలోని అధికార బాత్ పార్టీ 90 శాతానికి పైగా ఓట్లు సాధించింది. అధ్యక్ష ఎన్నికల్లో 15.8 మిలియన్ల ఓటర్లకు 11.6 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
¤ నేపాల్రాజధాని ఖాట్మండులోని గోకర్ణ జాతీయ పార్కులో వృక్షాలను  2,500 మందికి పైగా ప్రజలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించారు.   
»    ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో విద్యార్థులు, బౌద్ధ సన్యాసులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.   
»    గత జులైలో అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఈ తరహా కార్యక్రమాన్ని 936 మందితో నిర్వహించి, గిన్నిస్ రికార్డు సాధించారు. దీన్ని అధిగమించాలనేదే తమ యత్నమని నిర్వాహకులు తెలిపారు.
 జూన్ - 7
¤ నరేంద్ర మోడీకి తమ దేశంలో అనుమతి లేదంటూ కొన్నేళ్ల క్రితం తిరస్కరించిన అమెరికా, ఇప్పుడు ఆయన్ని ఒక తరహా ఫ్యాషన్‌కు ప్రతినిధిగా భావిస్తోంది. అమెరికాలోని మూడు ప్రఖ్యాత వార్తా పత్రికలు టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లు మోడీ ట్రేడ్‌మార్క్ కుర్తాపై, దానిని ఆయన ధరించే తీరుపై ప్రశంసలు కురిపించాయి. 
¤ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) శిఖరాగ్ర సమావేశాలు 2014 నవంబరులో నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరగనున్నాయి.
 జూన్ - 8
¤ ఈజిప్ట్ మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ ఈజిప్ట్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.   
»    59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా ఈజిప్ట్‌కు ఏడో అధ్యక్షుడు. కైరోలోని సుప్రీంకోర్టు జనరల్ అసెంబ్లీ ఎదురుగా ఆయన, పదవీ ప్రమాణం చేశారు.
 జూన్ - 9
¤ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. దాడిలో పాల్గొన్న మొత్తం 10 మంది ఉగ్రవాదులు సహా 29 మంది ఈ ఘటనలో చనిపోయారు.   
»    దాడికి తమదే బాధ్యత అని నిషేధిత తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. టీటీపీ మాజీ అధిపతి హకీముల్లా హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు సంస్థ ప్రకటించింది.   
»    మరో ఘటనలో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో సున్నీ తెగకు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మంది షియా యాత్రికులు మృతి చెందారు.
 జూన్ - 10
¤ బంగ్లాదేశ్‌లోని సాకర్ అభిమానులు తమ అభిమాన జట్ల దేశాల జెండాలను ఇళ్లపై ప్రదర్శిస్తున్నందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్లపై ఇతర దేశాల జెండాలను ప్రదర్శించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో బంగ్లాదేశ్‌లో సాకర్ ప్రపంచకప్ పోటీలు జరగనుండటం తెలిసిందే.
 జూన్ - 13
¤ ప్రతిష్ఠాత్మక 'వాషింగ్టన్ ఒడంబడిక'లో భారత్‌కు పూర్తిస్థాయిలో శాశ్వత సభ్యత్వం లభించింది. దీంతో భారతీయ డిగ్రీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడంతోపాటు, అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగాలకు భారతీయ ఇంజినీర్లు మరింత సులువుగా వెళ్లేందుకు విస్తృతావకాశాలు ఏర్పడతాయి.   
»    2007 నుంచి భారత్‌కు ఈ ఒడంబడికలో తాత్కాలిక సభ్యత్వం ఉంది. తాజాగా అది శాశ్వతమైంది.   
»    1989లో కుదిరిన ఈ ఒప్పందంపై 17 దేశాలు సంతకాలు చేశాయి.   
»    ఇంజినీరింగ్ డిగ్రీ కార్యక్రమాలకు అధికారిక గుర్తింపును ఇచ్చే సంస్థల మధ్య కుదిరిన ఈ అంతర్జాతీయ స్థాయి ఒడంబడికను 'వాషింగ్టన్ అకార్డ్‌'గా పేర్కొంటున్నారు.  
 »    తాజాగా న్యూజిలాండ్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ భారత్‌కు శాశ్వత సభ్యత్వ మంజూరుకు అనుకూలంగా ఓటేశాయి.
 జూన్ - 14
¤  రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెయిన్ సైన్యానికి చెందిన ఒక రవాణా విమానాన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో విమానంలోని 40 మంది సైనికులు, 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.   
»    లుషాంక్ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది.
 జూన్ - 16
¤  ఇరాక్‌లో షియాలు అధికంగా నివసించే కీలక పట్టణం తల్ అఫర్‌ను ఉగ్రవాదులు హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ పట్టణం నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లారు.   
»    సున్నీ తెగకు చెందిన 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్ (ఐఎస్ఐఎల్)' ఉగ్రవాదుల దాడులతో ఇరాక్‌లో ఇటీవల సంక్షోభం మొదలైంది. ఇప్పటికే తిక్రిత్, మోసుల్ సహా అనేక ప్రాంతాలను ఉగ్రవాదులు చేజిక్కించుకున్నారు. ఉగ్రవాదుల దాడులకు ఆలస్యంగా ప్రతిస్పందించిన ఇరాక్ భద్రతా దళాలు ఎదురుదాడి ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది.   
»    పట్టుబడ్డ ఇరాక్ భద్రతా దళాలను ఉగ్రవాదులు అమానుషంగా ఊచకోత కోశారు. ఇరాక్ సైనికులను సామూహికంగా కాల్చి చంపుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో తీవ్ర సంచలనం సృష్టించాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది.   
»    అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇరాక్ ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులను ఖండించింది. ఇరాక్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.

¤  ఇటీవల కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం తాలిబన్ల ఏరివేత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సంక్షోభిత ఉత్తర వజీరిస్థాన్‌లో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని పూర్తిస్థాయి పోరాటానికి దిగిన సైన్యం యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులతో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. ఈ సైనికచర్యలో 177 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.   
»    పాకిస్థాన్ సైన్యం ఈ ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌కు 'ప్రవక్త ఖడ్గ విన్యాసం' అనే అర్థం వచ్చేలా పేరు పెట్టింది.   
»    సైన్యం దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో అత్యధికులు 'తూర్పు తుర్క్‌మెనిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం (ఈటీఐఎం)'కు చెందినవారు ఉన్నారు.
 జూన్ - 17
¤  దీపావళి, ఈద్ పండగలకు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడిస్తున్న సెలవులకు తోడు అదనపు సెలవులను ప్రకటిస్తే దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుందని, ప్రస్తుత సెలవుల్లో మార్పులు చేయాల్సి వస్తుందని అందుచేత ఈ పండగలకు సెలవులు ఇవ్వలేమని పేర్కొంది.   
»    బ్రిటన్‌లో ఉన్న హిందూ, ముస్లింలు ఈ రెండు పండగలకు దేశవ్యాప్తంగా సెలవును ప్రకటించాలని కోరుతూ 1,21,843 సంతకాలతో ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇలా వెలువరించింది.

¤  బ్రిటన్, ఐర్లాండ్‌లలో పర్యటించే భారత, చైనా దేశాల పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఇకపై ఒకే వీసాతో రెండు దేశాల్లో పర్యటించవచ్చు.   
 »    'గ్రౌండ్ బ్రేకింగ్' పేరుతో ఇరుదేశాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ వీసాతో రెండు దేశాల్లో నిర్ణీత కాలపరిమితిలో ప్రయాణించవచ్చు. ఈ వీసా పథకాన్ని ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి ఫ్రాన్సెస్ ఫిడ్జిరాల్డ్ ప్రకటించారు.
జూన్ - 18 
¤  అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్‌లో 40 మంది భారతీయ కార్మికులను తీవ్రవాదులు అపహరించారు. మోసుల్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. అపహరణకు గురైన వారిలో అత్యధికులు పంజాబీలు కాగా మిగిలినవారు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. వీరు మోసుల్‌లో ఒక నిర్మాణ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు.   
»    సున్నీ తీవ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)' దాడుల నేపథ్యంలో మోసుల్ నుంచి కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో అపహరణ ఘటన చోటు చేసుకుంది.

¤  ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవిని భారత్ దక్కించుకోలేక పోయింది.   
»    జర్మనీకి చెందిన జ్యుర్జెన్ స్టాక్‌ను ఎంపిక చేస్తూ ఇంటర్‌పోల్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది.   
»    ఈ పదవికి పోటీపడినవారిలో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఉన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జోర్డాన్, యూకే అభ్యర్థులతో పాటు రంజిత్ సిన్హా ఫ్రాన్స్‌లోని లియాన్స్‌లో ఉన్న ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. చివరకు జ్యుర్జెన్ స్టాక్ అభ్యర్థిత్వం ఖరారైంది.   
»    ఇంటర్‌పోల్ ఉన్నత పరిపాలనా మండలి అయిన జనరల్ అసెంబ్లీ స్టాక్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపితే 2015 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జనరల్ అసెంబ్లీ 2014 నవంబరులో మొనాకోలో భేటీ కానుంది.   
»    ప్రస్తుతం ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్‌గా అమెరికాకు చెందిన రోనాల్డ్ కె.నోబుల్ వ్యవహరిస్తున్నారు.

¤  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటిష్ గయానాకు చెందిన ఒక తపాలా బిళ్ల సౌత్‌బేలో నిర్వహించిన వేలంలో దాదాపు రూ.57 కోట్లు పలికింది.  
»    1856లో జారీ అయిన ఈ స్టాంపు ముఖ విలువకు దాదాపు కొన్ని కోట్ల రెట్ల ఎక్కువకు అమ్ముడుపోయింది. దీన్ని గుర్తు తెలియని వ్యక్తి టెలిఫోన్ ద్వారా వేలంలో పాడి గెలుచుకున్నాడు.
 జూన్ - 19
¤  మాల్దీవులులోని మాలే అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ - నిర్వహణ బాధ్యతల నుంచి అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చిన జీఎమ్ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు లార్డ్ హాఫ్‌మన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో ఉపశమనం లభించింది. విమానాశ్రయ ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఈ ఒప్పందం చెల్లుబాటు అయ్యే ఒప్పందమేనని సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఈ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేయడం వల్ల జీఎమ్ఆర్ ఇన్‌ఫ్రాకు చెందిన జీఎమ్ఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కూడా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.   
»    మాలేలోని ఇబ్రహీం నషీర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ నిమిత్తం జీఎమ్ఆర్ గ్రూపు 2010లో మాల్దీవుల ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందం కాల పరిమితి 25 సంవత్సరాలు కాగా ప్రాజెక్టు విలువ 500 మిలియన్ డాలర్లు. తర్వాత మాల్దీవుల్లో ప్రభుత్వం మారింది. అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందం చెల్లదంటూ 2012లో విమానాశ్రయ విస్తరణ, నిర్వహణ కాంట్రాక్టును రద్దు చేసింది. దీనిపై జీఎమ్ఆర్ గ్రూపు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు విచారణ తర్వాత దీనిపై తాజాగా తీర్పు వెలువడింది.
 జూన్ - 23
¤  ఢాకాలో 2001లో బెంగాలీ సంవత్సరాది వేడుకలను లక్ష్యంగా చేసుకుని బాంబుదాడి చేసి, పదిమందిని బలిగొన్నారనే కేసులో ఎనిమిది మంది నిషేధిత 'హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ)' సంస్థ ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది.   
»    వీరిలో హుజీ అధినేత ముస్తి అబ్దుల్ హన్నన్ కూడా ఉన్నాడు.

¤  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ (ఈఐసీ) బంగారు నాణేలను విడుదల చేసింది.   
»    ఒక్కో నాణెం బరువు 200 గ్రాములు. మొత్తం 210 నాణేలను విడుదల చేసింది. ఒక నాణెం విలువ సుమారు రూ.12.30 లక్షలు.  
»    సచిన్ 24 ఏళ్ల కేరీర్ నేపథ్యంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో సంస్థ ఈ నాణేలను రూపొందించింది. సచిన్ టెస్టుల సంఖ్యను సూచించే విధంగా ఒక్కో నాణెం 200 గ్రాముల బరువు ఉంటుంది. ఈ నాణేలకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు, విలువ ఉన్నాయి.   
»    నాణెంలో ఒకవైపు సచిన్ బొమ్మ, అతడి టెస్టు జెర్సీ నెంబరు 187, సచిన్ సంతకంతో కూడిన బ్యాట్, స్వస్థలం ముంబయిని సూచించే విధంగా ఇండియా గేట్ బొమ్మ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అని దానిపై రాసి ఉంది.   
»    నాణేనికి రెండో వైపు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ - 2 బొమ్మను ముద్రించారు.
 జూన్ - 28
¤  భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ వివాదాస్పదమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మీదుగా చైనా-పాకిస్థాన్‌ల మధ్య సుదీర్ఘమైన రైలు మార్గాన్ని నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
   

»    చైనాలోని జిన్ జియాంగ్ పట్టణం నుంచి పాకిస్థాన్‌లోని నౌకాశ్రయ ప‌ట్టణం గ్వద‌ర్ వ‌ర‌కు 1800 కి.మీ. మేర సుదీర్ఘ రైలు మార్గాన్ని నిర్మించాల‌ని చైనా నిర్ణయించింది.   
»    పాకిస్థాన్‌లో తీవ్రవాదుల దాడులు పెరగడం, చైనాలో జిన్ జియాంగ్‌తోపాటు పలు పట్టణాల్లో టిర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమకారుల దాడుల్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.   
»    పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా కస్కర్-గ్వదర్ పట్టణాలను కలుపుతూ ఆర్థిక కారిడార్ నిర్మించేందుకు పాక్-చైనా ప్రభుత్వాలు ఇప్పటికే బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని కూడా భారత్ వ్యతిరేకిస్తోంది.