మే - 1
|
¤ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హైస్పీడ్ రైలు సొరంగాన్ని చైనా ప్రారంభించింది.
» ఈ సొరంగం పొడవు 16.3 కిలోమీటర్లు. ఇది గన్సు, జింజియాంగ్ ప్రావిన్స్‌లను కలుపుతుంది.
» ఈ సొరంగం సముద్ర మట్టానికి 3,607 మీటర్ల ఎత్తులో ఉంటుంది. |
మే - 2
|
¤ అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 350 మంది మృత్యువాత పడ్డారు.
» బడాక్షాన్ ప్రావిన్స్‌లోని హోబోబరిక్ గ్రామంలోని 300 ఇళ్లపై బురద, మట్టి, రాళ్లు పడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
» ఈ దుర్ఘటనలో మూడొంతుల గ్రామం శిథిలాల కింద సమాధి అయింది.
» సహాయక చర్యల్లో అఫ్గానిస్థాన్ ఆర్మీకి నాటో దళాలు కూడా సాయం చేశాయి.
» బడాక్షాన్ ప్రావిన్స్ గవర్నర్ షా వలీలుల్లా అదీబ్.
¤ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సహజసిద్ధమైన ముత్యాన్ని బ్రిటన్‌కు చెందిన వూలీ అండ్ వాలిస్ సంస్థ లండన్‌లో వేలం వేసింది.
» లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల సంస్థ డేవిడ్ మోరిస్ ఈ ముత్యాన్ని రూ.8.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక ముత్యం వేలంలో ఇంత భారీ ధర పలకడం ఓ ప్రపంచ రికార్డు.
» సహజసిద్ధమైన 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు.
¤ మరాఠా యోధుడు శివాజీ జీవిత విశేషాలతో కూడిన బొమ్మల పుస్తకాన్ని ప్రముఖ చరిత్రకారుడు బాబా సాహెబ్ పురందరె బ్రిటన్ ప్రతినిధుల సభలో ఆవిష్కరించారు.
» వంద తైల వర్ణ చిత్రాల్లో శివాజీ జీవితాన్ని పొందుపరచిన ఈ పుస్తకం తొలిప్రతిని ప్రముఖ ఎన్ఆర్ఐ, లేబర్ పార్టీ ఎంపీ కీత్‌వాజ్‌కు పురందరె అందజేశారు.
» మహారాష్ట్రలోని పాల్ఘడ్‌కు చెందిన గిరిజన చిత్రకారుడు బ్రిజేష్ మోగ్రె పుస్తకంలోని తైల వర్ణాలను చిత్రించారు. |
మే - 4
|
¤ దక్షిణ యెమెన్‌లో సైన్యం 40 మంది అల్‌ఖైదా అనుమానితులను హతమార్చింది.
¤ లిబియా నూతన ప్రధాన మంత్రిగా వ్యాపారవేత్త అహ్మద్ మతిక్ (42) ప్రమాణ స్వీకారం చేశారు. |
మే - 5
|
¤ అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రపంచంలోనే పూర్తిస్థాయి ప్రైవేట్ సూట్స్‌తో కూడిన తొలి విమాన అపార్ట్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసింది. అతిపెద్ద ప్రయాణికుల విమానంగా పేరొందిన ఎయిర్‌బస్ ఎ-380 రెండో అంతస్తు (అప్పర్‌డెక్)లో ఈ సదుపాయాలను ఆవిష్కరించింది. ఇందులో డబుల్ బెడ్‌రూమ్, ఎటాచ్డ్ బాత్‌రూమ్, మొబైల్, వైఫై వినియోగించే సదుపాయం ఉంటుంది. రిక్లైనింగ్ లాంజ్ సీట్, ఫుల్‌లెంగ్త్ బెడ్, మినీ బార్, వార్డ్‌రోబ్ ఉంటాయి.
» ఎతిహాద్ సంస్థ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమ్స్ హోగన్. |
మే - 6
|
¤ భారత్ తదితర దేశాలకు చెందిన అత్యంత నిపుణులైన కార్మికులను ఆకర్షించడానికి అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
» దీనిలో భాగంగా, హెచ్ - 1బి వీసా పొందిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు కూడా అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది.
» అత్యంత నైపుణ్యమున్న కార్మికులకు అమెరికాలో హెచ్ - 1బి వీసా మంజూరు చేస్తుంటారు. ఐటీ లాంటి ప్రధాన రంగాల ఉద్యోగులకు ఈ వీసా లభిస్తుంటుంది. అయితే, ఈ వీసా పొందిన ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగావకాశాలను కోరుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో దీనికి అనుమతి లేదు. దీంతో పలువురు ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు.
» ఈ నష్టాన్ని అరికట్టడానికి అమెరికా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
¤ సిరియాఆగ్నేయ ప్రాంతం శివారులోని ఓ సొరంగంలో శక్తిమంతమైన బాంబు పేలిన ఘటనలో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
¤ భారత్‌లో వైద్య విద్యను పూర్తి చేసినవారు తమ దేశంలో ప్రాక్టీస్ చేయకుండా బ్రిటన్ నిషేధించడం వివాదాస్పదమైంది.
» భారత్ తర్వాత పాకిస్థాన్, ఈజిప్టు, నైజీరియా దేశాలకు చెందిన డాక్టర్లపై కూడా బ్రిటన్‌లోని జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎంసీ) నిషేధం విధిస్తోంది. అయితే ఈ దేశాల వారికంటే నిషేధానికి గురైన భారతీయ డాక్టర్ల సంఖ్య ఎక్కువ.
» గత అయిదేళ్లలో భారత్, పాక్‌లో శిక్షణ పొందిన 117 మంది డాక్టర్లపై బ్రిటన్‌లో పనిచేయకుండా జీఎంసీ ఆంక్షలు విధించింది. |
మే - 7
|
¤ అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వరకు దాదాపు 1,13,813 మంది భారతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
» ఈ గణాంకాల ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు.
» 2,90,133 మంది విద్యార్థులతో చైనా అగ్రస్థానంలో ఉంది.
¤ థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్రాను, ఆమె కేబినెట్‌లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు పదవుల నుంచి తొలగించింది.
» షినవత్రా శక్తిమంతమైన తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది.
» కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దేశ క్యాబినెట్ ఉప ప్రధాని నివత్తుమ్‌రోంగ్ బూన్సంగ్‌పైసన్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించింది.
» జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ధావిల్ ప్లీన్ శ్రీని 2011లో అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో షినవత్రా, 9 మంది మంత్రుల ప్రమేయం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
» ఇంగ్లక్ షినవత్రా ఫ్యూథాయ్ పార్టీకి చెందినవారు. |
మే - 8
|
¤ సోవియట్ హయాం నాటి ఒక వ్యోమనౌకను జర్మనీలో లెంపర్జ్ అనే సంస్థ వేలం వేసింది. దీని పొడవు 2.2 మీటర్లు.
» ఈ వ్యోమనౌకను 1970లలో ప్రయోగాత్మక మానవరహిత అంతరిక్ష యాత్రల కోసం ఉపయోగించారు. వేలంలో దీనికి రూ.8.3 కోట్లు దక్కాయి. |
మే - 9
|
¤ భారత మిరపకాయ దిగుమతులపై మే 30 నుంచి సౌదీ అరేబియా నిషేదం విధించింది. పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ ఈ నిర్ణయం తీసుకుంది.
¤ దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) ఘనవిజయం సాధించింది.
» ఏఎన్‌సీ విజయంతో దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడిగా 72 ఏళ్ల జాకబ్ జుమా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.
» దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణాంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవేకావడం విశేషం. |
మే - 13
|
¤ షియా ముస్లింలే లక్ష్యంగా బాగ్దాద్‌లో సంభవించిన వేర్వేరు బాంబు పేలుళ్లలో 25 మంది మృతి చెందారు.
» తూర్పు బలాదియత్, సద్ర్, ఉర్, జమిల, మామల్, కర్రడ జిల్లాల్లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. |
మే - 14
|
¤ టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని సోమా ప్రాంతంలో ఒక బొగ్గుగనిలో పేలుడు సంభవించిన ఘటనలో 245 మంది మృతి చెందారు.
» టర్కీ ప్రధానమంత్రి తయ్యిప్ ఎర్డోగాన్. |
మే - 15
|
¤ భౌతికశాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త నికోలా టెస్లా స్మారక మ్యూజియం ఏర్పాటుకు చేయూతనివ్వనున్నట్లు ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.
» ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.48 కోట్లు ఖర్చు కానుంది.
» వాషింగ్టన్‌లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.
¤ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, పూర్తిగా దోష రహితమైన అతి చక్కని నీలి వజ్రాన్ని క్రిస్టీస్ సంస్థ జెనీవా (స్విట్జర్లాండ్)లో వేలం వేసింది.
» 13.22 క్యారట్ల ఈ వజ్రం రూ.144 కోట్ల ధర పలికింది.
» ఈ నీలి వజ్రానికి 'ది విన్స్‌టన్ బ్లూ'గా నామకరణం చేశారు.
¤ అల్‌ఖైదా దాడిలో 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌లో నేలమట్టమైన ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్ - డబ్ల్యూటీసీ) జంట భవనాల వద్ద ఆ నాటి సంఘటనకు గుర్తుగా ఏర్పాటు చేసిన మ్యూజియంను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రారంభించారు. |
మే - 19
|
¤ కొలంబియాలోని ఫండాసియాన్ పట్టణంలోని ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరై వస్తున్న 31 మంది చిన్నారులు బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో సజీవ దహనమయ్యారు. |
మే - 20
|
¤ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఆరు నెలలుగా అట్టుడుకుతున్న థాయ్‌లాండ్ను ఆ దేశ సైన్యం అధీనంలోకి తీసుకుంది. దేశంలో మార్షల్‌లా విధించింది.
» శాంతి భద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది సైనిక కుట్ర ఎంత మాత్రం కాదని థాయ్‌లాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయుత్ చాన్‌చోవా ప్రకటించారు.
¤ 67వ కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో ప్రారంభమైంది. |
మే - 21
|
¤ ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్ని ముబారక్‌కు భారీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో కైరోలోని క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన ఇద్దరు కొడుకులు అలా, గమాల్‌లను కూడా దోషులుగా తేల్చిన కోర్టు వారికి నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. |
మే - 22
|
¤ థాయ్‌లాండ్లో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. 'రక్తరహిత తిరుగుబాటు'తో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజ్యాంగాన్ని రద్దు చేసింది. దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.
» టీవీ, రేడియో స్టేషన్లు తమ రోజువారీ కార్యక్రమాలన్నీ నిలిపివేసి, కేవలం సైన్యం విడుదల చేసే ప్రకటనలనే ప్రసారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఘర్షణ పెరగకుండా చూడటానికే ఇలా చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ప్రయూత్ ఛాన్-ఒ-ఛా ప్రకటించారు.
» థాయ్‌లాండ్లో 1932లో రాజరిక పాలన ముగిశాక ఇప్పటివరకు సైన్యం 18 సార్లు తిరుగుబాటు యత్నాలు చేసింది. 11 సార్లు ఇవి విజయవంతమయ్యాయి. |
మే - 23
|
¤ థాయ్‌లాండ్లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్న సైన్యం మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్ర సహా ఆమె కుటుంబంలోని పలువురిని అదుపులోకి తీసుకుంది. తద్వారా అధికారంపై తన పట్టును మరింత పెంచుకుంది.
¤ అఫ్గానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు భారీ ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దౌత్య కార్యాలయంలో ఉన్న వారెవరికీ హాని జరగలేదు.
» ఈ ఘటన ఇరాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని హెరాత్ పట్టణంలో జరిగింది.
» దౌత్య కార్యాలయానికి రక్షణ కల్పిస్తున్న ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) దళ సభ్యులు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగి దాడికి పాల్పడిన నలుగురు తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చారు.
» ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సుభాష్ గోస్వామి. |
మే - 24
|
¤ చైనా, గ్రీస్, టర్కీ దేశాల్లోని పలుప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి.
» నైరుతి చైనాలోని ఇంగ్‌జియాంగ్ కౌంటీలో రిక్టర్ స్కేల్‌పై 5.6; గ్రీస్, టర్కీ తీరాల వద్ద సముద్రంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
¤ సోమాలియా దేశ రాజధాని మొగదిషులో పార్లమెంటులో ఎంపీలు సమావేశమై ఉన్న సమయంలో షెబాబ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. కారుబాంబు, ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు తిరుగుబాటుదారులు సహా 10 మంది చనిపోయారు.
¤ యెమెన్‌లోని సయోన్ నగరంలో సైన్యం, అల్‌ఖైదా ఉగ్రవాదుల మధ్య భీకర పోరాటం జరిగింది. సైనిక, భద్రత, ప్రభుత్వ విభాగాల ప్రధాన కార్యాలయాలు భవనాలు లక్ష్యంగా ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దాడికి దిగగా, సైన్యం తిప్పికొట్టింది.
» ఈ పోరులో 15 మంది ఉగ్రవాదులు, 10 మంది సైనికులు చనిపోయారు.
¤ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పరిపాలక రాజధాని ష్వానేలో వరుసగా రెండోసారి జాకబ్ జుమా ప్రమాణ స్వీకారం చేశారు.
» ష్వానేను గతంలో ప్రిటోరియాగా పిలిచేవారు.
» దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్‌టౌన్. |
మే - 29
|
¤ ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్‌సిసి కి ఘన విజయం దక్కింది. ఆయన ఏకంగా 96% ఓట్లను సాధించారు. |
|
|