మే - 2014 రాష్ట్రీయం


మే - 1
¤  రాష్ట్ర వరి రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం.) పథకంలో అయిదు జిల్లాలను తొలగించి, కొత్తగా మరో మూడింటిని చేరుస్తూ రాష్ట్రానికి ఉత్తర్వులు పంపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పథకం అమలు చేసే జిల్లాల సంఖ్య 11 నుంచి 9కి తగ్గిపోయింది. వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఖరీఫ్ సీజన్ నుంచి ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.కొత్తగా చేర్చిన జిల్లాలు: కడప, అనంతపురం, వరంగల్.తొలగించిన జిల్లాలు: కృష్ణా, గుంటూరు, మెదక్, నెల్లూరు, నల్గొండ. దీంతో ఈ జిల్లాల రైతులకు రాయితీలు అందే అవకాశం లేకుండా పోయింది.ఇక నుంచి ఆహార భద్రత పథకం అమలయ్యే జిల్లాలు: ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, వరంగల్.¤  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది.   »    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 (1) కింద పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దాని నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పూర్తి చేయడానికే ఈ అథారిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.   »    హైదరాబాద్ పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. అథారిటీ దీనిపై తుది నిర్ణయానికి వచ్చేంతవరకూ కార్యాలయం అక్కడే కొనసాగుతుంది.
మే - 8
¤  రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ కేటాయింపుల్లో మార్పు రానుంది. రెండు రాష్ట్రాల ఏర్పాటు తేదీ అంటే
జూన్ 2వ తేదీ నుంచి ఈ మార్పు వర్తించే విధంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదేశాలకు సవరణ చేస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
   »    మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోకి వెళ్తున్నాయి. ఈ కారణంగా ఆ రెండు జిల్లాలు వినియోగించే విద్యుత్‌ను సీపీడీసీఎల్‌లో తగ్గించి ఎస్‌పీడీసీఎల్‌కు బదలాయిస్తున్నారు.   »    విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో సీపీడీసీఎల్, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌పీడీసీఎల్‌తో పాటు తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉంటాయి.   »    2008లో ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను ఈపీడీసీఎల్‌కు 15.80%, ఎస్‌పీడీసీఎల్‌కు 22.27%, సీపీడీసీఎల్‌కు 46.06%, ఎన్‌పీడీసీఎల్‌కు 15.87% పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర గ్రిడ్‌లోకి వచ్చిన విద్యుత్‌ను అదే దామాషాలో ఆయా సంస్థలకు ఇస్తూ వస్తున్నారు.   »    సీపీడీసీఎల్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలు ఎస్‌పీడీసీఎల్ పరిధిలోకి వెళుతున్నాయి. ఆ మేరకు ఇక్కడ విద్యుత్ వినియోగం తగ్గి అక్కడ పెరగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 8.37% విద్యుత్‌ను సీపీడీసీఎల్ నుంచి తిరుపతి కేంద్రంగా ఉండే ఎస్‌పీడీసీఎల్‌కు బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రభుత్వాన్ని కోరింది.   »    తాజా ఆదేశాల ప్రకారం సీపీడీసీఎల్ వాటా 38.02 శాతానికి తగ్గి ఎస్‌పీడీసీఎల్‌కు 30.31 శాతానికి చేరింది. ఈ ప్రకారం తెలంగాణ పరిధిలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల వాటా 53.89% అవుతుండగా ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థలకు కేటాయిస్తున్న విద్యుత్ 46.11 శాతంగా ఉండనుంది.
మే - 10
¤  తలసరి ఆదాయంలో తెలంగాణే మిన్నగా నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయంలో హైదరాబాద్ రూ.1,09,557తో మొదటి స్థానంలో ఉండగా, వరంగల్ రూ.50,951తో చివరి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం సరాసరి తలసరి ఆదాయం రూ.73,930.   »    ఆంధ్రప్రదేశ్‌లో సరాసరి తలసరి ఆదాయం రూ.66,754. విశాఖపట్నం రూ.98,296తో మొదటి స్థానంలోనూ, శ్రీకాకుళం రూ.46,117 తో చివరి స్థానంలోనూ ఉన్నాయి.   »    తెలంగాణలోని పది జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలోనూ తలసరి ఆదాయానికి సంబంధించిన వివరాలు...తెలంగాణ జిల్లాల వారీగా తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకొని).
ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకొని)
మే - 11
¤  రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.   »    రాష్ట్రంలో రెండు దశల్లో 294 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 42 లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 30న, మే 7న ఎన్నికలు నిర్వహించారు.   »    తెలంగాణలో 72.31%, ఆంధ్రప్రదేశ్‌లో 78.66% పోలింగు నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 75.46% పోలింగు నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే కేవలం 2.74% మాత్రమే పెరిగింది.
మే - 12
¤  పురపాలక ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.   »    ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కార్పొరేషన్లు, 92 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా ఆధిక్యత ప్రదర్శించింది.   »    అయిదు కార్పొరేషన్లు, 54 మున్సిపాలిటీలను తిరుగులేని మెజారిటీతో గెలుచుకుంది. ఇతరుల మద్దతుతో 11 మున్సిపాలిటీల్లో అధికారాన్ని దక్కించుకోనుంది. ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మున్సిపాలిటీలో గెలుపొందగా 11 చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.   »    తెలంగాణలో మూడు నగర పాలక సంస్థలకు, 53 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల ప్రకారం మూడు నగర పాలక సంస్థల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. 53 పురపాలక సంఘాల్లో 16 చోట్ల కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యత లభించగా తెరసాకు నాలుగు చోట్ల, తెలుగు దేశానికి 3 చోట్ల, భాజపా, ఎంఐఎంలకు ఒక్కో చోటు మాత్రమే పూర్తి ఆధిక్యత లభించింది. అత్యధికంగా 27 చోట్ల హంగ్ పరిస్థితి నెలకొంది.   »    సీమాంధ్రలో మొత్తం 92 మున్సిపాలిటీల్లోని 2,571 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 1428 వార్డులలో జయకేతనం ఎగురవేసింది. వైసీపీ 941 వార్డులలో గెలిచింది.
మే - 13
¤  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.   »    ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లా పరిషత్‌లలో తొమ్మిదింటిని తెదేపా కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక జడ్పీటీసీ స్థానాల్లో తెదేపా గెలుపొందింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పరిషత్‌లను కూడా తెదేపా కైవసం చేసుకుంది.   »    కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే వైకాపా గెలిచింది.   »    ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎంపీటీసీ స్థానాలు: 10,092టీడీపీ - 5,216; వైకాపా - 4,199; కాంగ్రెస్ - 172 స్థానాలను గెలుచుకున్నాయి.   »    ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జడ్పీటీసీ స్థానాలు: 653టీడీపీ - 373; వైకాపా - 275; కాంగ్రెస్ - 2 స్థానాలను గెలుచుకున్నాయి.   »    తెలంగాణలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు: 6,525కాంగ్రెస్ - 2,351; తెరాస - 1860; టీడీపీ - 1061 స్థానాలను గెలుచుకున్నాయి.   »    తెలంగాణలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు: 443కాంగ్రెస్ - 176; తెరాస - 191; తెదేపా - 53 స్థానాలను గెలుచుకున్నాయి.¤  దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటి డబుల్‌డెక్కర్ రైలు కాచిగూడ- గుంటూరు మధ్య ప్రారంభమైంది. రైలు లైటింగ్ సహాయకుడు అబ్దుల్ రహమాన్ సిగ్నల్ ఇచ్చి రైలును ప్రారంభించారు.   »    డబుల్ డెక్కర్ రైలులో 10 బోగీల్లో 1200 సీట్లు ఉన్నాయి.
మే - 14
¤  దేశవ్యాప్తంగా 81.5 కోట్ల ఓటర్ల సమాచారాన్ని తొలిసారిగా కంప్యూటరీకరించినట్లు హైదరాబాద్‌కు చెందిన 'మోడల్' అనలిటిక్స్ సంస్థ ప్రకటించింది.   »    ఓ రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా వివరాల (డాటా అనలిటిక్స్) సేవలను అందించే క్రమంలో దేశంలోని 81.5 కోట్ల ఓటర్ల సమాచారాన్ని నూతన సాఫ్ట్‌వేర్ ద్వారా 2.5 కోట్ల పీడీఎఫ్ పేజీల్లో నిక్షిప్తం చేశారు. వీటి నిల్వ సామర్థ్యం 8 టెరాబైట్స్.¤  చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా రాష్ట్రానికి నాలుగు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.   »    తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రెండేసి కారిడార్లు మంజూరు కాగా మన రాష్ట్రానికి నాలుగింటిని కేంద్రం మంజూరు చేయడం విశేషం.   »    అనంతపురం జిల్లా హిందూపురం; చిత్తూరు, ఇదే జిల్లాలోని శ్రీ సిటీ సెజ్; నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతాలను పారిశ్రామిక సమూహాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల సమీకరణతో పాటు మౌలిక వసతులకు కూడా కేంద్రం సాయం అందిస్తుంది.
మే - 15
¤  పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.   »    ఈ పరీక్షల చరిత్రలో తొలిసారిగా 88.62% ఉత్తీర్ణత నమోదయింది. రెగ్యులర్ విద్యార్థులు 10,61,703 మంది పరీక్షలు రాయగా 9,40,924 మంది (88.62%) ఉత్తీర్ణత సాధించారు.   »    రాష్ట్రవ్యాప్తంగా 4,95,225 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారు. 4,60,086 మంది (92.90%) ఉత్తీర్ణులయ్యారు.   »    తూర్పు గోదావరి జిల్లాలో గరిష్ఠంగా 96.26% ఉత్తీర్ణులు కాగా, కనిష్ఠంగా ఆదిలాబాద్ జిల్లాలో 58.31% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.   »    రాష్ట్రం మొత్తంమీద వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్న పాఠశాలలు 5,784 ఉన్నాయి.¤  తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీసీడ్స్)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్)ను రెండుగా విభజిస్తున్నట్లు ప్రకటించింది.   »    రాష్ట్ర ఆవిర్భావ తేదీ జూన్ 2 నుంచి టీసీడ్స్ పని చేయడం ప్రారంభిస్తుంది.¤  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్‌లో ఆక్టోపస్ (ఉగ్రవాద వ్యతిరేక దళం) నూతన భవనాన్ని డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు.
మే - 16
¤  ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల తరువాత రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో భాజపా అధికారంలోకి రాబోతున్నాయి.   »    రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాల సాయం లేకుండానే తెదేపా, భాజపాలు ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత సంఖ్యాబలం సాధించడం విశేషం.   »    కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో తెదేపా మూడో అతిపెద్ద పక్షంగా అవతరించింది.   »    విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.   »    రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 102 చోట్ల, 25 లోక్‌సభ స్థానాల్లో 15 చోట్ల తెదేపా విజయం సాధించింది. భాజపా నాలుగు శాసనసభ, రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. మొత్తంగా తెదేపా కూటమి 106 శాసనసభ, 17 లోక్‌సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. వైకాపా 67 శాసనసభ, ఎనిమిది లోక్‌సభ సీట్లు గెలుచుకుంది.   »    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈసారి కేవలం మూడు పార్టీలే ప్రాతినిధ్యం వహించనున్నాయి.   »    తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధించింది. తెలంగాణ కోసం ఉద్యమించిన తెరాస కొత్త రాష్ట్రంలో తొలి సర్కారు ఏర్పాటు చేయనుంది. సొంతంగా పార్టీ ఏర్పాటుకు 60 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా, తెరాస అంతకంటే మూడు ఎక్కువే గెలుచుకుంది. తెరాస అత్యధికంగా 11 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది.   »    తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.అసెంబ్లీ ఫలితాలు: తెరాస 63, కాంగ్రెస్ 20, తెదేపా 15, భాజపా 5, ఎంఐఎం 7, వైకాపా 3, సీపీఎం 1, సీపీఐ 1, బీఎస్పీ 2, స్వతంత్రులు 1.లోక్‌సభ ఫలితాలు: తెరాస 11, కాంగ్రెస్ 2, తెదేపా 1, భాజపా 1, ఎంఐఎం 1, వైకాపా 1.   »    ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమికి వైకాపా కంటే 5,99,264 (2.06%) ఓట్లు అధికంగా పోలయ్యాయి. తెదేపా, భాజపా కూటమికి మొత్తం 1,33,72,862 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 46.53%. వైకాపాకి 1,27,71,323 ఓట్లు పోలయ్యాయి. ఇవి 44.47%.   »    తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2.86% ఓట్లకే పరిమితం కావడం గమనార్హం.
మే - 18
¤  ఈ నెల 26 నుంచి విభజన ప్రక్రియను అమలు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. తెలంగాణకు కేటాయించిన కార్యాలయాల్లో ముందుగా ఉద్యోగులను నియమించి, ఆ తర్వాత దస్త్రాలను చేరవేయాలని సూచించారు. మే 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు బదలాయింపుల పనులు పూర్తి చేయాలని, జూన్ రెండో తేదీన ఆవిర్భావ దినం నుంచి పరిపాలన ప్రారంభం కావాలని ఆదేశించారు.   »    జూన్ 2 నుంచి నాలుగు నెలల పాటు ఇరు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులకు ఆయన ఆమోదం తెలిపారు.   »    ఏపీ మొత్తం బడ్జెట్ రూ.34,595 కోట్లు. రెవెన్యూ బడ్జెట్ రూ.28,626 కోట్లు. మూలధన బడ్జెట్రూ.3,882 కోట్లు.   »    తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.26,516 కోట్లు. రెవెన్యూ బడ్జెట్ రూ.21,295 కోట్లు. మూలధన బడ్జెట్ రూ.3,046 కోట్లు.   »    ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఇప్పటివరకూ ప్రవేశాలు జరుగుతున్న రీతిలోనే మరో పదేళ్లపాటు కొనసాగించాలని ప్రధాన కార్యదర్శి మహంతి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు విద్యాసంస్థల ప్రవేశాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులందరికీ ఉన్నతవిద్యలో సమానావకాశాలు కల్పించాలని రాజ్యాంగంలోని 371 (డి) అధికరణం చెబుతోందని, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుందనీ, అందరూ పాటించాలనీ ఆదేశించారు.
మే - 19
¤  మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి 79 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జూపల్లి గ్రామంలోని ఈవీఎం మొరాయించడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు.   »    వంశీ గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.¤  రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న కొన్ని కార్పొరేషన్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దశాబ్దాలుగా ఇవి మొండి బకాయిలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం కొన్ని సంస్థల్లో మూలధన వాటాగా పెట్టుబడి పెట్టినా, వాటి నుంచి రాబడి లేదు. వడ్డీయే కాదు, అసలు కూడా వసూలయ్యే అవకాశంలేని రుణాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రుణాలను మూల ధన వ్యయంగా మార్పు చేసింది. మరికొన్ని పెట్టుబడులను గ్రాంట్లుగా మార్చింది.   »    పునర్విభజన నేపథ్యంలో రుణాలు, అడ్వాన్స్‌లు మొదలైన వాటికి సంబంధించి కచ్చితమైన లెక్కలు తేల్చే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
 మే - 20
¤  ఎట్టకేలకు ఉభయ రాష్ట్రాల మధ్య విభజించాల్సిన ఉద్యోగుల లెక్క తేలింది. రాష్ట్రస్థాయి పోస్టులు మొత్తం 88,232 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 27,259 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలను కూడా ఉభయ రాష్ట్రాలకు పంచుతారు. ఈ పోస్టులను జనాభా నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలకు విభజిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు 51,457, తెలంగాణకు 36,775 పోస్టులు లభిస్తాయి. ఖాళీలను మినహాయించి, ఉద్యోగులనే పరిగణనలోకి తీసుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు 35,536 మందిని, తెలంగాణకు 25,397 మందిని కేటాయిస్తారు.   »    ప్రస్తుతం జూన్ 2వ తేదీకల్లా సచివాలయం, హెచ్‌వోడీల్లోని పోస్టులు, ఉద్యోగులను మాత్రమే విభజించాలని నిర్ణయించారు. జిల్లాల్లోని డీఎస్‌పీ, ఆర్‌డీవో వంటి రాష్ట్ర స్థాయి పోస్టులు 39,486 ఉండగా, ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లడం లేదు. జూన్ 2వ తేదీ తర్వాతనే వాటిని విభజిస్తారు. ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కాలం పట్టనుంది. 
 మే - 23
¤  ఉమ్మడి రాష్ట్రంలోని ఆదాయం, వ్యయం, అప్పులు, గ్రాంట్లను మదింపు చేసిన అధికారులు రెండు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కేటాయింపుల వివరాల నివేదికలను తయారు చేశారు.   »    13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నివేదికను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు.నివేదికలోని ముఖ్యంశాలు  కొత్త ఆంధ్రప్రదేశ్ తొలి అడుగులు ఆర్థిక భారంతో మొదలవనున్నాయి. ఆరంభం నుంచే ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఆదాయం ఉండదు. తగ్గించుకునే ఖర్చులు కనిపించడంలేదు. ఈ స్థితిలో ప్రస్థానాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలు కనీసం రూ.10 వేల కోట్ల ఆర్థిక లోటుతో మొదలు కాబోతున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలు ఏప్రిల్, మే దాదాపు ముగిసినట్లే. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలు ఆవిర్భవిస్తున్నాయి. అందుకే ఆ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి అంటే పది నెలల కాలానికి ఉమ్మడి రాష్ట్రంలోని బడ్జెట్ ప్రకారం ఆర్థిక వనరుల అంచనాలు తయారయ్యాయి.  కేంద్ర పన్నుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాటా రూ.13,461 కోట్లు, రాష్ట్రంలో పన్ను ఆదాయం రూ.28,108 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.7,032 కోట్లు, కేంద్ర గ్రాంటు రూ.3,416 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.52,017 కోట్ల రాబడి ఉండొచ్చని అధికారులు తేల్చారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం సుమారు రూ.24,186 కోట్లు. వేతన సవరణ, ఉద్యోగుల డీఏ కింద ఇవ్వాల్సింది రూ.6,370 కోట్లు ఉంటుందని, స్థానిక, ప్రభుత్వరంగ సంస్థలకు రూ.3,229 కోట్లు విడుదల చేయాలని నిర్ధారించారు. బడ్జెట్‌లో జరిపిన కేటాయింపుల మేరకు ఆయా పథకాలు, పనులకు రూ.28,257 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కకట్టారు. దీంతో రాబడి కంటే ఖర్చు రూ.10వేల కోట్ల పైనే ఉంటుందని తేల్చారు.¤  ఉన్నత విద్యా మండలి రజతోత్సవ సంచికను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.   »    వృత్తివిద్య కోర్సుల ప్రవేశాలకు పరీక్షలను నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి కీలకపాత్ర పోషిస్తోంది.   »    జాతీయ విద్యా విధానం-1986 ను అనుసరించి, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే ఉన్నత విద్యామండలి 1988లో ఏర్పడింది.   »    మండలి ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక సంచికను రూపొందించారు.   »    ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి.
 మే - 28
¤  ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కి సవరణ చేస్తూ, మోడీ సర్కారు పంపిన ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలోని అయిదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. మార్చి 1న అప్పటి మన్మోహన్‌సింగ్ సర్కారు ప్రతిపాదించిన సవరణకే మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపింది.   »    తాజా ఆర్డినెన్స్ వల్ల కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు (పినపాక, మోరంపల్లి బంజర, బూర్గుంపాడు, నాగినేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల పల్లి, సారపాక, ఇరవెండి, మోతె పట్టినగర్, ఉప్పసాక, నక్రిపేట, సోంపల్లి గ్రామాలు మినహాయించి), చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి) మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అవుతాయి. పైన పేర్కొన్న కొన్ని గ్రామాల ద్వారా జాతీయ రహదారి 221 వెళుతుందని, తెలంగాణ ప్రాంతానికి భద్రాచలం పట్టణంతో అనుసంధానం కొనసాగించడానికి ఈ గ్రామాలే ముఖ్యమని, అందువల్లే వాటిని మినహాయించినట్లు కేంద్రం తెలిపింది.¤  జూన్ 2 నుంచి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వివిధ రంగాల్లో పరిస్థితిపై ప్రణాళిక శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు.ముఖ్యాంశాలు2012-13 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.3,35,018 కోట్లు.  2004-05 నుంచి 2012-13 మధ్య తెలంగాణ సగటు వార్షిక వృద్ధి 16.05% కాగా, జాతీయ సగటు వృద్ధి 15.58%.  తెలంగాణలో వృద్ధికి ప్రధాన కారణం పారిశ్రామిక, సేవల రంగాల్లో సాధించిన పురోగతే. 2012-13లో సేవలరంగం రూ.1,80,864 కోట్లతో జీఎస్‌డీపీలో 54% వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత పరిశ్రమల రంగం రూ.86,582 కోట్లతో 28.8% వాటాను దక్కించుకుంది.  వ్యవసాయ రంగం మూడో స్థానంలో ఉంది. ఇది రూ.57,472 కోట్లతో 17.2% వాటా కలిగి ఉంది. పదేళ్లలో సేవా, పారిశ్రామిక రంగాలు వృద్ధి సాధించగా, వ్యవసాయ రంగం వాటా 17.8% నుంచి 17.2 శాతానికి పడిపోయింది.  తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ గత పదేళ్లలో మంచి పురోగతి సాధించినట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2004-05లో తలసరి ఆదాయం రూ.24,408 కాగా, 2012-13లో రూ.83,020. జాతీయ తలసరి ఆదాయం రూ.24,143 నుంచి రూ.68,747కు పెరిగింది.¤  జూన్ 2న రాష్ట్రం రెండుగా విడిపోనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఇరు రాష్ట్రాలకూ లీడ్ బ్యాంకులను అధికారికంగా ప్రకటించింది.   »    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఏపీఎస్ఎల్‌బీసీ)కి ఆంధ్రాబ్యాంక్, తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (టీఎస్ఎల్‌బీసీ)కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) లీడ్ బ్యాంకులుగా వ్యవహరిస్తాయి.   »    ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రాబ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది.
 మే - 29
¤  రాష్ట్ర విభజన నేపథ్యంలో 'మీ సేవను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ విభజన ప్రక్రియ పూర్తి చేసింది.   »    విభజన తేదీ (జూన్ 2) తర్వాత రెండు రాష్ట్రాలకు వీలుగా వేర్వేరు పోర్టల్‌లను ఏర్పాటు చేశారు. మీ సేవలోని 318 సేవలను ఇరు రాష్ట్రాలకు కేటాయించారు.   »    తెలంగాణకు tg.meeseva.gov.in, ఆంధ్రప్రదేశ్‌కు ap.meeseva.gov.in అని ప్రత్యేక పోర్టల్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.   »    ప్రస్తుతం అందుబాటులో ఉన్న మీ సేవ పోర్టల్‌ను 2015 మార్చి 31 వరకు ఏపీ ఆన్‌లైన్ నిర్వహిస్తుందని, ఇందుకు అవసరమైన ఖర్చును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో భరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 మే - 30
¤  తెలంగాణ ప్రభుత్వ కొత్త అధికార చిహ్నానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. కాకతీయ తోరణం, దానిపై నాలుగు సింహాల జాతీయ చిహ్నం, మధ్యభాగంలో చార్మినార్, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో తెలంగాణ ప్రభుత్వం పేరు చిహ్నంలో పొందుపరిచారు.   »    తెలంగాణ రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ప్రతిపాదనలకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు.¤  రాజ్యసభ సభ్యుల విభజనలో స్థానాలు తారుమారయ్యాయి. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ నిర్వహించిన లాటరీలో ఇద్దరు సీమాంధ్ర సభ్యులు తెలంగాణకు, నలుగురు తెలంగాణ సభ్యులు సీమాంధ్రకు వెళ్లారు.   »    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని మూడో భాగం, సెక్షన్ 12, 13ల ప్రకారం ప్రస్తుతం సమైక్యాంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది రాజ్యసభ సభ్యులను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి తెలంగాణకు ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు 11 మంది చొప్పున లాటరీ పద్ధతిలో పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ తీశారు.   »    ఇందులో వి.హనుమంతరావు, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గరికపాటి మోహన్‌రావు, పాల్వాయి గోవర్థన రెడ్డితోపాటు సీమాంధ్రకు చెందిన కె.వి.పి.రామచంద్రరావు, సి.ఎం.రమేష్‌లు తెలంగాణకు వెళ్లారు. తెరాస సభ్యుడు కె.కేశవరావు, తెలంగాణ తెదేపా నాయకుడు దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు రేణుకాచౌదరి, ఎం.ఎ.ఖాన్‌లతో పాటు సుజనా చౌదరి, జె.డి.శీలం, జైరాం రమేష్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామ లక్ష్మి, చిరంజీవి ఆంధ్రకు వెళ్లారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి మృతితో మరొక స్థానం ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా ఉంది.
 మే - 31
¤  ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పదేళ్ల వార్షిక సగటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తి వార్షిక సగటు వృద్ధి 15.58% కాగా, ఆంధ్రప్రదేశ్ వార్షిక సగటు 15.25% మాత్రమే. తెలంగాణ స్థూల ఉత్పత్తి 16.05%. జాతీయ సగటు కంటే ఎక్కువ కావడం గమనార్హం.   »    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రాలు కొత్తగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ రంగాల పరిస్థితిపై ప్రణాళికశాఖ నివేదికలు సిద్ధం చేసింది.ముఖ్యాంశాలు:   »    2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.4,19,391 కోట్లు. 2004-05 నుంచి 2012-13 మధ్య సగటు వార్షిక వృద్ధి 15.25%. జాతీయ సగటు వృద్ధి కంటే ఆంధ్రలో వృద్ధి తగ్గుదలకు ప్రధాన కారణం వ్యవసాయ రంగం వాటా తగ్గిపోవడమే. 2012-13లో సర్వీసు రంగం రూ.2,08,336 కోట్లతో జీఎస్‌డీపీలో 49.7% వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగం రూ.1,14,492 కోట్లతో 27.3% వాటాతో రెండో స్థానంలో ఉండగా, పరిశ్రమల రంగం వాటా రూ.96,563 కోట్లతో 23 శాతంగా ఉంది.   »    పదేళ్లలో సేవా, పారిశ్రామిక రంగాలు వృద్ధి సాధించగా, వ్యవసాయ రంగం వాటా 29.9% నుంచి 27.3 శాతానికి పడిపోయింది. అయితే వ్యవసాయం అనుబంధ రంగాలైన పండ్ల తోటల పెంపకం, పాడి సంపదలో ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో గనులు-క్వారీలు, నిర్మాణ రంగంలోనూ ఎక్కువ వృద్ధి ఉంది.¤  కొత్త ఖరీఫ్ సీజన్ సమీపించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పంట దిగుబడుల లక్ష్యాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. గతేడాది (2013-14)లో ఉమ్మడి రాష్ట్రంలో 2.18 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను రైతులు పండించారు. వీటిలో తెలంగాణలో సుమారు కోటి టన్నులు దాకా ఉండవచ్చని ప్రాథమిక అంచనా.¤  రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ రెండు నుంచి ప్రస్తుతమున్న హైకోర్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పరిగణిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటన విడుదల చేశారు.   »    'హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్' పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా సూచన మేరకు 'హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌'గా మార్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
http://gkseva.blogspot.com/2015/01/blog-post_3.html