ఏప్రిల్ - 2
|
¤ సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద నిధుల విడుదలకు కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. పి.ఎం. ప్యాకేజీ, డి.డి.పి. ప్రాంతాల్లో లేని ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద ఇప్పటి వరకు ఇస్తున్న 25 శాతం నిధులను యాభై శాతానికి పెంచింది. అయితే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సూచించే సంస్కరణలు అమలు చేస్తేనే ఇస్తామనే షరతు విధించింది. ఇప్పటి వరకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లాంటివి తాము సూచించిన సంస్కరణలు అమలు చేస్తేనే రుణం ఇస్తామంటూ షరతులు పెట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం సంస్కరణల అమలును షరతుగా పేర్కొంది. ఈ మేరకు ఏఐబీపీ మార్గదర్శకాల్లో చేసిన మార్పులను వివరాలను కేంద్రం రాష్ట్రాలకు పంపింది. » రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి నిధుల కొరతతో పూర్తి చేయలేని వాటికి కేంద్రం నిధులిచ్చి పూర్తి చేసేందుకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్రం ఏఐబీపీ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ఏఐబీపీ మార్గదర్శకాల్లోని మార్పులు » ప్రాజెక్టు తాజా వ్యయంలో కనీసం 50% ఖర్చు చేసి ఉండాలి, సగం పనులను కూడా పూర్తి చేసి ఉండాలి. » ఆధునికీకరణ ప్రాజెక్టులైతే ప్రణాళికా సంఘం నుంచి పెట్టుబడి అనుమతి ఉండి నిర్మాణం పూర్తయి పదేళ్లుగా నిర్వహణలో ఉండాలి. 2002 - 03కు ముందు నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు లేదా నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పడి నీటి తీరువా వసూలు చేస్తున్న ప్రాజెక్టులకు అవకాశం కల్పిస్తారు. » ఏఐబీపీ కింద గుర్తించి, మొదటి విడత నిధులను విడుదల చేసిన తర్వాత నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయకపోతే గరిష్ఠంగా రెండేళ్లు మాత్రమే గడువు పొడిగిస్తారు. పెరిగిన ధరలో 20 శాతం మాత్రమే అనుమతిస్తారు. » జల వనరుల మంత్రిత్వ శాఖ సూచించే సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు 50 శాతం నిధులు ఇస్తుంది. » ప్రత్యేక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 75 శాతం నిధులు అందుతాయి. » ప్రత్యేక ప్రతిపత్తిగల రాష్ట్రాలకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుంది. డి.డి.పి., గిరిజన ప్రాంతాలు, ప్రధానమంత్రి ప్యాకేజీ అమల్లో ఉన్న జిల్లాలకు 90 శాతం అందుతాయి. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద మన రాష్ట్రంలో గుర్తించిన ప్రాజెక్టులు » శ్రీరామసాగర్ వరద కాలువ, గుండ్లకమ్మ, ఎస్సారెస్పీ స్టేజ్ -2, పాలెంవాగు, రాలివాగు, మత్తడివాగు, గొల్లవాగు, పెద్దవాగు, భీమా, వెలిగల్లు, అలీసాగర్, గుత్ప, దేవాదుల, నీల్వాయి, కిన్నెరసాని, దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టేల్‌పాండ్, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల, ప్రాణహిత - చేవెళ్ల, కోయిల్‌సాగర్, సింగూరు, దుమ్ముగూడెం, కొమరం భీం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, మోదికుంట వాగు. » అయితే ఈ ప్రాజెక్టుల్లో ప్రాణహిత, దుమ్ముగూడెం -సాగర్ టేల్‌పాండ్, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, దేవాదుల మినహా మిగిలిన ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం పనులు జరిగాయి. అలీసాగర్, గుత్ప, వెలిగల్లు కొమరం భీం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు పూర్తయ్యాయి. » రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండి సంక్షోభంలో ఉన్న జిల్లాల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో ప్రాణహిత - చేవెళ్ల, దుమ్ముగూడెం - నాగార్జుసాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అన్ని అనుమతులు లభిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు అందుతాయి. |
ఏప్రిల్ - 3
|
¤ ప్రాణహిత - చేవెళ్ల బ్యారేజి నిర్మాణానికి సంబంధించిన అలైన్‌మెంట్‌కు మహారాష్ట్ర అంగీకరించింది. బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు అవసరమైన 'జియో టెక్నికల్ సర్వే' చేయించాలని కోరింది. అయితే కీలకమైన బ్యారేజి ఎత్తు విషయంలో మాత్రం ఇంకా సానుకూలత వ్యక్తం చేయలేదు. » ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకంపై రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఇంజినీర్లతో బోర్డు ఏర్పాటైంది. అప్పటినుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. » మార్చి 24న రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్ల స్థాయి సమావేశం నాగపూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నాగపూర్‌లోని జల వనరుల అభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ కులకర్ణి ప్రాణహిత - చేవెళ్ల చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. వార్థా - వైన్‌గంగ కలిసే ప్రాంతాన్ని బ్యారేజి నిర్మాణానికి అనువైన స్థలంగా పేర్కొంటూ, దీనికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు మహారాష్ట్ర తన లేఖలో పేర్కొంది. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయించాలని సూచించింది. అయితే సర్వే చేసే సమయంలో వన్యమృగ సంరక్షణ చట్టం, అటవీ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని, వీటిని ఉల్లంఘించరాదని పేర్కొంది. |
ఏప్రిల్ - 5
|
¤ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు నివాళులు అర్పించాయి. » రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్ గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతలు బాబు జగ్జీవన్‌రామ్‌కు పూలమాలలు సమర్పించారు.
|
ఏప్రిల్ - 7
|
¤ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వెల్లడించకూడదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల తరహాలో వీటినీ మే 7 తర్వాత విడుదల చేయాలని స్పష్టం చేసింది. » మున్సిపల్ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆపేయాలని వి.వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు వ్యక్తులు దాఖలుచేసిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ జ్ఞానసుధామిశ్ర, జస్టిస్ గోపాలగౌడతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. |
ఏప్రిల్ - 11
|
| ¤ రాష్ట్రంలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2003లో 108 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తాత్కాలికంగా ఏర్పాటయ్యాయి. వీటిలో 36 కోర్టులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు ఇచ్చింది. మిగతా 72 కోర్టులను ఎప్పటికప్పుడు ఏడాదిపాటు పొడిగించుకుంటూ వస్తున్నారు. మార్చి ఆఖరుతో ఈ న్యాయస్థానాల కాలపరిమితి ముగియడంతో 2015 మార్చి 31 వరకు కొనసాగించేలా తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిలో 42 అదనపు జిల్లా కోర్టులు, 30 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి. |
ఏప్రిల్ - 15
|
¤ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతిని రాష్ట్రప్రభుత్వం తెలుగు నాటకరంగ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. |
ఏప్రిల్ - 17
|
¤ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు ఏర్పాటైన కమలనాథన్ కమిటీ రద్దయింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు కేటాయించేందుకు ఏర్పాటైన రాష్ట్రస్థాయి సలహా సంఘమే ఇక అన్ని వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుంది. » రాష్ట్రస్థాయి పోస్టులను, ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు కేటాయించేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు విశ్రాంత ఐఏస్ అధికారి కమలనాథన్ నేతృత్వంలో మార్చి నెలలో ఒక కమిటీ ఏర్పాటయింది. మరోవైపు పునర్-వ్యవస్థీకరణ చట్టం తయారైన నెల రోజుల్లోగా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధనను మార్చి 29న కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఆ రోజున ఏర్పాటు చేసిన సలహా సంఘానికి కమలనాథన్‌ను ఛైర్మన్‌గా నియమించింది. రెండింటికీ ఆయనే నేతృత్వం వహిస్తుండటంతో ఉద్యోగ వర్గాల్లో గందరగోళం తలెత్తింది. అసలు ఏ కమిటీ విధులను నిర్వహిస్తున్నదీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల కోసం ఏర్పాటైన కమిటీని రద్దు చేస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. » దీంతో ఇక కమలనాథన్ నేతృత్వంలోని రాష్ట్ర సలహా సంఘమే మార్గదర్శకాలు రూపొందించడం, వాటికి కేంద్రం ఆమోదముద్ర వేశాక తదనుగుణంగా ఉద్యోగుల విభజన వంటి పనులను చేపడుతుంది.¤ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లోని మొత్తం 13 జిల్లాల్లో ఏప్రిల్ 16 వరకూ సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది.ముఖ్యాంశాలు : 13 జిల్లాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 3,65,62,986. వీరిలో మహిళలు 1,83,88,867 మంది కాగా, పురుషులు 1,81,70,961. 3,158 మంది ఇతరులు (హిజ్రాలు) ఉన్నారు. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో పురుషులతో పోలిస్తే, మహిళా ఓటర్లు 52,130 మంది ఎక్కువగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 35,984 మంది అధికంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 37,65,487 మంది ఓటర్లు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 17,17,919 మంది ఓటర్లు ఉన్నారు. |
¤ విజయవాడ, గుంటూరు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికార యంత్రాంగం ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. » తాజాగా ఈ రెండు స్టేషన్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో ఆన్‌లైన్ సేవల జాబితాలో చేరిన ప్రధాన రైల్వేస్టేషన్ల సంఖ్య ఆరుకు చేరింది. » ఇప్పటివరకూ ఈ సేవలను సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, గుంతకల్లు స్టేషన్లు అందిస్తున్నాయి. » ఈ సేవల కింద రైల్వేస్టేషన్లలోని డిస్‌ప్లే బోర్డులో మరికొద్దిసేపట్లో బయలుదేరే, చేరుకొనే రైళ్ల సమాచారం, ప్లాట్‌ఫారాల వివరాలను ప్రదర్శిస్తారు. ¤ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి వీలుగా రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచుతూ మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలనను విధించిన నేపథ్యంలో గవర్నర్ ఈ సిఫార్సు చేశారు. » ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీం తీర్పు, ఆ మేరకు జరిగిన రాజ్యాంగ సవరణ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల లోపు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. ఒకవేళ లోక్‌సభ రద్దయితే రాజ్యసభలో ఆమోదం పొంది కొత్త లోక్‌సభ ఏర్పడిన నెల రోజుల్లోపు రాష్ట్రపతి పాలనకు ఆమోద ముద్ర తీసుకోవాలి. లేని పక్షంలో గడువు ముగిసిన వెంటనే రద్దు చేసిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచినా, రద్దు చేసినా తిరిగి ఏర్పాటు చేయాలని సుప్రీం గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. » రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి 50 రోజులైంది. నెలాఖరులోపు పార్లమెంటులో ఆమోదం పొందకపోతే అసెంబ్లీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాకే రాష్ట్రపతి పాలన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉండదు కానీ అనివార్యంగా అసెంబ్లీని మాత్రం పునరుద్ధరించాల్సి ఉంటుంది. అసెంబ్లీని పునరుద్ధరిస్తే, వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ చివరి అంకంలో ఉన్న ప్రస్తుత తరుణంలో అసెంబ్లీ పునరుద్ధరణ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. అటు పార్లమెంటు ఆమోదం పొందక, ఇటు శాసనసభ పునరుద్ధరణా జరగకపోతే రాజ్యంగ, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభను రద్దు చేయడం ఒక్కటే మెరుగైన పరిష్కారమని కేంద్రానికి సిఫార్సు చేశారు. |
ఏప్రిల్ - 22
|
| ¤ చుండూరు మారణకాండ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ 21 మందికి జీవిత కారాగార శిక్ష, మరో 35 మందికి ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ, విచారణ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. » దళితులపై దాడికి బాధ్యులను గుర్తించడంలో, సంఘటన జరిగిన ప్రాంతాన్ని రుజువు చేయడంలో, చనిపోయిన వారు ఎప్పుడు చనిపోయారో నిరూపించడంలో విచారణ కోర్టులో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా కింది కోర్టు జరిపిన విచారణలో విధానపరమైన లోపాలున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. » గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు ఆరో తేదీన ఎనిమిది మంది దళితులు దారుణ హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మారణహోమానికి అగ్రవర్ణాలకు చెందినవారిని బాధ్యులుగా పేర్కొంటూ, మొత్తం 219 మందిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దళిత సంఘాల వినతి మేరకు దేశంలోనే తొలిసారిగా సంఘటన స్థలంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, విచారణ జరిపారు. 2004 నవంబరులో ప్రారంభమైన విచారణ మార్చి 2007 నాటికి ముగిసింది. 179 మందిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 123 మందిని నిర్దోషులుగా తేల్చింది. 56 మందిని దోషులుగా పేర్కొంది. వీరిలో 21 మందికి జీవిత కారాగార శిక్ష, 35 మందికి ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిస్ 2007 జులై 31న తీర్పు వెల్లడించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ 2007లో నిందితులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తన తీర్పును వెల్లడించింది. |
ఏప్రిల్ - 23
|
| ¤ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 4,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. తెలంగాణ లోని 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలకు 1,934 మంది, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 శాసనసభ నియోజకవర్గాల్లో 2,576 మంది బరిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. |
ఏప్రిల్ - 24
|
| ¤ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక పని ప్రారంభమైంది. గత నెల 28న కేంద్ర హోంశాఖ మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్.శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల కమిటీ హైదరాబాద్‌లో తొలిసారిగా భేటీ అయింది. » కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషీతోపాటు రాజధాని కమిటీ సభ్యులు రతిన్ రాయ్, అరోమర్ దేవి, జగన్ షా, కె.టి.రవీంద్రన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. |
ఏప్రిల్ - 25
|
| ¤ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను మరో రెండు నెలలపాటు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. » ఆర్టికల్ 356 (3) ప్రకారం అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతూ, రాష్ట్రంలో మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీనికి రెండు నెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తీసుకోవాలి. అంటే ఏప్రిల్ 30 లోపు ఆ పని పూర్తి చేయాలి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్లమెంట్‌ను సమావేశ పరిచి ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త పంథా ఎంచుకుంది. అందులో భాగంగా అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధిస్తోంది. » జూన్ 2 నాటికి రెండు కొత్త రాష్ట్రాలు మనుగడలోకి రానుండటంతో కేంద్రం అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపింది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలైపోయారు. అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన కొనసాగించాలని గవర్నర్ కూడా నివేదిక పంపిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంది. |
ఏప్రిల్ - 28
|
| ¤ జిల్లా న్యాయస్థానాల్లో కేసుల స్థితిగతులను తెలుసుకునేందుకు 'జిల్లా కోర్టుల వెబ్‌సైట్లు' ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైకోర్టు సెంట్రల్ హాల్‌లో ఈ వెబ్‌సైట్ http://ecourts.gov.in/ap ని ప్రారంభించారు. » ఇప్పటి వరకు రాష్ట్రంలోని 890 కింది న్యాయస్థానాలను ఈ ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చారు. » నూతనంగా ప్రారంభించిన వెబ్‌సైట్లో జిల్లా కోర్టుల కేసుల వివరాలు ఉంటాయి.¤ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన కొనసాగించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. |
|
|