జూన్ - 3
|
¤ నేపాల్ లో బస్సు నదిలో పడిన ఘటనలో 18 మంది భారతీయ యాత్రికులు మరణించారు. » ఖాట్మండుకు పశ్చిమంగా ప్యుతాన్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి మాడి నదిలో పడిపోయింది. » బస్సులో ప్రయాణిస్తున్న 74 మందిలో ముగ్గురు మినహా మిగతా వారంతా భారతీయులే. వీరంతా ప్రముఖ హిందూ యాత్రా స్థలం స్వర్గద్వారిని దర్శించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. |
జూన్ - 6
|
¤ ఆపరేషన్ బ్లూస్టార్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అమృతసర్ స్వర్ణదేవాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరువర్గాలు దాడులకు దిగడంతో 12 మందికి గాయాలయ్యాయి. » మాజీ ఐపీఎస్ అధికారి సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) మద్దతుదారులు ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ఘర్షణలకు దారితీసింది. » ఈ ఘర్షణలకు సంబంధించి విచారణ జరుపుతామని అకాల్‌తక్త్ జతేదార్ జ్ఞాని గురుబచన్ సింగ్ ప్రకటించారు. » జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలే నేతృత్వంలోని సిక్కు తీవ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి ఏరి వేయడానికి 1984 జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టారు. |
జూన్ - 8
|
¤ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి కి 40 కిలోమీటర్ల దూరంలో మనాలీ - కిరాత్‌పూర్ హైవేపై థాలోట్‌కు సమీపంలో బియాస్ నదీ తీరంవద్ద జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు. » విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు నదిలో ఫొటోలు దిగుతుండగా నదికిపైన ఉన్న 126 మెగావాట్ల లార్జీ జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించిన జలాశయం నుంచి అధికారులు ఎలాంటి హెచ్చరికలూ చేయకుండానే అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. యాత్రకు వెళ్లిన విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. |
జూన్ - 10
|
¤ గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో ఉన్న ఓ ఫ్త్లె ఓవర్‌లోని కొంత భాగం కూలిపోయిన దుర్ఘటనలో అయిదుగురు కార్మికులు మృతి చెందారు. |
జూన్ - 12
|
¤ భారత్‌లో 'ఎయిర్ ఏషియా ఇండియా' కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సంస్థ తొలి విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు బయలుదేరి వెళ్లింది. » రూ.999 చౌకధరతో ఈ తొలి విమాన సర్వీసును సంస్థ ప్రారంభించింది. » దేశంలోని ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్ తర్వాత నాలుగో చౌక విమానయాన సంస్థ ఇదే కావడం గమనార్హం.¤ చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఉన్న భిలాయ్ ఉక్కు కర్మాగారంలో విషవాయువు లీకైన ఘటనలో ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లు సహా ఆరుగురు మరణించారు. |
జూన్ - 17
|
¤ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సూపర్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలో 130వ సూపర్ కంప్యూటర్ కాగా మన దేశంలో ఐదవది. » ఒక విద్యాసంస్థలో సూపర్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. » ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా ఎయిరో డైనమిక్స్, వాతావరణం, జీవ రసాయనశాస్త్రం తదితర రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తారు. |
జూన్ - 18
|
¤ ఎన్‌సీడెక్స్ (నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్) గుంటూరులో పసుపు, మిర్చి నాణ్యతను పరీక్షించే కేంద్రాన్ని నెలకొల్పింది. తాము అనుమతించిన స్టార్ అగ్రివేర్ హౌసింగ్ అండ్ కొలెటరల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎన్‌సీడెక్స్ ప్రకటించింది. » ఈ కేంద్రం వల్ల వినియోగదారులు సకాలంలో తమ వద్ద ఉండే పసుపు, మిర్చి నిల్వలకు పరీక్షలు నిర్వహించి, వాటిని డెలివరీకి సిద్ధం చేయగలుగుతారు. |
జూన్ - 20
|
¤ ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపు ఏర్పాటుకు చిలీ ఎడారిలోని 3 వేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాగ్ర భాగాన్ని పేల్చివేశారు. » ఈ టెలిస్కోపు ద్వారా భూమికి వెలుపల ఎక్కడైనా జీవం ఉందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. » ఈ యూరోపియన్ ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ టెలిస్కోపు (ఈఈఎల్‌టీ) నిర్మాణం 2024 నాటికి పూర్తి కానుంది. |
జూన్ - 21
|
¤ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా చైనా సైనికులు వాడిన తూటాలను తూర్పు చైనాలోని నాన్జింగ్ ప్రాంతంలో కనుక్కున్నారు. » ఆ యుద్ధంలో జరిగిన నాన్జింగ్ ఊచకోత దుర్ఘటన మృతుల స్మారక మందిరం వెలుపల ఓ నిర్మాణ స్థలంలో దాదాపు 450 మెషీన్‌గన్ తూటాలు, ఇతర చిన్న చిన్న ఆయుధ సామగ్రిని కనుక్కున్నారు. |
జూన్ - 23
|
¤ జర్మనీకి చెందిన బెయర్స్ డోర్ఫ్ ఏజీ అనుబంధ సంస్థ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ నివియా భారత్‌లో తన తొలి తయారీ కేంద్రానికి గుజరాత్‌లో శంకుస్థాపన చేసింది. » గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో సనంద్ వద్ద ప్లాంటు ఏర్పాటుకు నివియా కంపెనీ ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. » తయారీ కేంద్రమే కాకుండా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. |
జూన్ - 24
|
¤ శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలని భారత్ సంకల్పించింది. » రూ. 120 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాలని నిర్ణయించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. » శ్రీలంకలో తమిళులు ఎక్కువగా నివసించే దక్షిణ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సాంస్కృతిక మూలాలను పెంపొందించడానికి వీలుంటుందని భారత్ భావిస్తోంది. |
జూన్ - 25
|
¤ భారత పొగాకు దిగ్గజం 'ఇండియన్ టొబాకో కంపెనీ (ఐటీసీ)' అనుబంధ సంస్థ అయిన ఖాట్మండులోని సూర్య టొబాకో కంపెనీ గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. » సుమారు 40 ట్రక్కుల నిండా లోడ్ చేసి ఉన్న సిగరెట్ పెట్టెలన్నీ కాలిపోయాయి.¤ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) భారత్‌లో ప్రత్యేకంగా క్లౌడ్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. » ప్రస్తుతం ఐబీఎంకు ప్రపంచవ్యాప్తంగా 13 క్లౌడ్ ఆధారిత డేటా సెంటర్లు ఉన్నాయి. |
జూన్ - 27
|
¤ తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL-గెయిల్) పైప్‌లైన్ విస్ఫోటనం చెందిన ఘటనలో 15 మంది మరణించారు. » మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.20 లక్షలు గెయిల్, రూ.3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం, రూ.2 లక్షలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తాయి. » కోనసీమ భూగర్భంలో దాదాపు 900 కి.మీ. మేర చమురు సంస్థలకు చెందిన గ్యాస్‌పైపు లైన్లు ఉన్నాయి. 30 కి పైగా చమురు బావులున్నాయి. తాటిపాకలో మినీ రిఫైనరీ, గ్యాస్‌కలెక్టింగ్ స్టేషన్ ఉన్నాయి. |
జూన్ - 28
|
¤ తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్‌లైను పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18 కి చేరింది. » గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ అగ్నిప్రమాదంపై కేంద్రం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.కె.సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది.¤ చెన్నై సమీపంలోని మొగలివాక్కం లో నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు నిర్మాణ కూలీలు మరణించారు. శిథిలాల కింద చాలా మంది కూలీలు చిక్కుకున్నట్లు అధికారులు ప్రకటించారు.¤ ఉత్తర ఢిల్లీ ఇంద్రలోక్‌లోని తులసీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో పదిమంది మరణించారు. |
జూన్ - 29
|
¤ తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో గ్యాస్ పైపులైను పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది.¤ చెన్నై నగర సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. |
|
|