మే - 2014 వార్తల్లో ప్రదేశాలు


 మే - 3
¤  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 
 మే - 4
¤  ముంబయికి 120 కిలోమీటర్ల దూరంలో రాయ్‌గడ్ జిల్లాలోని నిది గ్రామ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 19 మంది మరణించారు.   

»    కొంకణ్ రైలు మార్గంలోని నాగోథానే - రోహా రైల్వే స్టేషన్ల మధ్య 20 బోగీలతో కూడిన దివా - సావంత్ వాడీ ప్యాసింజర్ రైలు ఒక సొరంగం బయట పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టు తప్పి పడిపోయాయి.   

»    మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 మే - 8
¤   అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో మహాత్మాగాంధీ స్మారక స్థలికి శంకుస్థాపన నిర్వహించారు.  

 »    దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   

»    7 అడుగుల పొడవు, 30 అంగుళాల వెడల్పు ఉన్న విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రారంభించనున్నారు.   

»    ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేయించడం విశేషం. గాంధీ విగ్రహం చుట్టూ గాంధీజీ సందేశాలతో పాటు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన నెల్సన్ మండేలా, ఐన్‌స్టీన్ సందేశాలను పొందుపరిచారు.
 మే - 9
¤   కేరళలోని తిరుచూర్ పట్టణంలో ప్రతి ఏటా నిర్వహించే ప్రఖ్యాత 'పూరమ్' పండుగను ఘనంగా నిర్వహించారు.
 మే - 23
¤   మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌కు చెందిన 18వ శతాబ్దం నాటి అపురూపమైన బంగారు ఉంగరాన్ని లండన్‌లో వేలం వేయగా ఏకంగా రూ.1.42 కోట్ల ధర పలికింది.   

»    41.2 గ్రాముల బరువున్న ఈ మేలిమి బంగారు ఉంగరంపై 'రామ' అంటూ శ్రీరాముడి పేరును దేవనాగరి భాషలో అందంగా చెక్కారు.   

»    1799లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దళాలతో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధానంతరం టిప్పుసుల్తాన్ పార్థివదేహం నుంచి ఈ ఉంగరాన్ని తీసుకెళ్లిపోయారనే కథనం ఉంది.   

»    మహా యోధుడైన ముస్లింనేత టిప్పు సుల్తాన్ హిందూ దేవుడైన రాముడిపేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని ధరించి ఉండటం ఎంతో గొప్ప విషయంగా ఉంగరాన్ని వేలం వేసిన క్రిస్టీస్ సంస్థ పేర్కొంది.