జూలై - 2014 వార్తల్లో ప్రదేశాలు


 జూలై - 5
¤  ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్‌ను దుబాయ్‌లో నిర్మించాలని దుబాయ్ హోల్డింగ్స్ అనే సంస్థ నిర్ణయించింది.       »  'మాల్ ఆఫ్ ది వరల్డ్' పేరుతో షేక్ జాయేద్ రోడ్‌లో దాదాపు 4.80 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.       »  ఈ మాల్‌ను ఏటా 18 కోట్ల మంది సందర్శిస్తారని అంచనా వేశారు.¤  ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) రెండో ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జర్షియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
 జూలై - 6
¤  చెన్నై శివారులో ఓ గోదాం ప్రహరీ కూలడంతో పదకొండు మంది మృతి చెందారు.       »  మృతుల్లో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. మరో ఇద్దరు ఒడిశా రాష్ట్రవాసులు.       »  తమిళనాడులో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన తెలుగువారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
జూలై - 12 
¤  ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను జమ్ముకాశ్మీర్‌లోని కౌరీ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు.       »  ఉత్తర జమ్ముకాశ్మీర్‌లో పర్వత ప్రాంతాల్లో సంధానతను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఇది జమ్మూను బారముల్లాతో కలుపుతుంది. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం ఆరున్నర గంటలకు తగ్గిపోతుంది.       »  ఫ్రాన్స్‌కే తలమానికమైన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉండే ఈ బ్రిడ్జి 2016కి పూర్తవుతుంది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు ఉంటుందని అంచనా.       »  చైనాలోని గుయ్‌జో ప్రావిన్స్‌లోని బెయ్ పాంజియాంగ్ నదిపై నిర్మించిన వంతెనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు ఉంది. దాని ఎత్తు 275 మీటర్లు. భారత్‌లో వంతెన నిర్మాణం పూర్తయితే ఆ రికార్డు బద్దలవుతుంది. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. నిర్మాణానికి ఉపయోగించనున్న ఉక్కు 25వేల టన్నులు.       »  ఉక్కు స్తంభాల సంఖ్య 17. స్తంభం గరిష్ఠ ఎత్తు 133.7 మీటర్లు. వంతెన ఖరీదు రూ.512 కోట్లు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.20 వేల కోట్లు.
జూలై - 23
¤  విశాఖ సమీపంలోని 'ఎర్రమట్టి దిబ్బలు' అరుదైన గుర్తింపును సాధించాయి.       »  భూ విజ్ఞాన విశిష్ఠతను సంతరించుకున్న ఎర్రమట్టి దిబ్బలను కేంద్ర ప్రభుత్వం 'భూ విజ్ఞాన వారసత్వ ప్రదేశం (జియోలాజికల్ హెరిటేజ్ సైట్)'గా గుర్తించింది.       »  విశాఖ నగరానికి 20 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 10 మీటర్ల నుంచి 90 మీటర్ల ఎత్తులో దాదాపు 2 కి.మీ. మేర ఇవి విస్తరించి ఉన్నాయి.
జూలై - 24
¤  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టిన ఘటనలో 14 మంది పాఠశాల విద్యార్థులు సహా 16 మంది దుర్మరణం చెందారు.
జూలై - 29
¤  కర్ణాటకలోని చారిత్రక చిత్రదుర్గ పట్టణంలో యురేనియం (స్పెషల్ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ) శుద్ధి కేంద్రం ఏర్పాటుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.       »  భారత యురేనియం సంస్థతోపాటు అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ కమిషన్) సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాయి.       »  శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగా మొదట యురేనియంను వాయువు (యురేనియం హెక్సాఫ్లోరైడ్) గా పరివర్తన చేసి వివిధ సెంట్రిఫ్యూజెస్ వ్యవస్థల ద్వారా అతి వేగంగా తిప్పిస్తారు. చివర్లో యు - 235, యు - 238 రకాల యురేనియం ఏర్పడుతుంది.       »  ఇక్కడ ఉత్పత్తయ్యే యు - 235 యురేనియాన్ని అణు విద్యుత్తు కేంద్రాలు, జలాంతర్గాములు, అణ్వస్త్రాల్లో ఇంధనంగా వినియోగిస్తారు.¤  హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు.       »  సిమ్లా నుంచి సవేరాఖడ్‌కు వెళుతున్న హిమాచల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు బసంత్‌పూర్ - కింగల్ జాతీయ రహదారిపై కతర్‌ఘాట్ ప్రాంతంలో 400 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.¤  ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మణిపూర్‌లో చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.       »  నానీ సమీపంలో చేపడుతున్న ఈ వంతెన కోసం 141 మీటర్ల ఎత్తయిన స్తంభాలు నిర్మిస్తున్నారు.       »  ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా పేర్కొంటున్న యూరప్‌లోని బెల్‌గ్రేడ్ - బార్ రైల్వే లైన్‌లో ఉన్న మాలా - రిజేకా వంతెన స్తంభాలు 139 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.       »  111 కిలోమీటర్ల పొడవున జిరిబామ్ - తుపల్ - ఇంఫాల్ రైల్వే లైనులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు.       »  జిరిబామ్ సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో ఉండగా ఇంఫాల్ 780 మీటర్ల ఎత్తులో ఉంది. పలు నదులు కూడా ప్రవహిస్తున్న ఈ మార్గంలో 46 సొరంగాలు, ఎత్తయిన వంతెనలు నిర్మిస్తున్నారు.
జూలై - 30
¤  మహారాష్ట్రలోని పుణె జిల్లా అంబేగావ్ తాలూకా మాళిణ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 19 మంది మృతి చెందారు.       »  ఈ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొండ పెద్ద ఎత్తున కోసుకుపోయి బురద, బండరాళ్లు ఒకేసారి విరుచుకుపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.       »  పుణెకు 100 కి.మీ. దూరంలో ప్రసిద్ధిగాంచిన బీమశంకర జ్యోతిర్లింగం ఆలయానికి 10 కి.మీ. దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల కింద మారుమూలన మాళిణ్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 750 మంది నివాసం ఉంటున్నారు. ఎక్కువమంది గిరిజనులే. వీరంతా మహాదేవ్ కోలీ జాతికి చెందినవారు.
జూలై - 31
¤  మహారాష్ట్రలోని పుణె జిల్లా, మాళిణ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కు చేరింది.¤  'మెట్రోపొలిస్' పేరిట మూడేళ్లకోసారి జరిగే సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ఎంపికైంది.       »  ఈ ఏడాది అక్టోబరు ఆరో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో 'మెట్రోపొలిస్ - 2014' జరగనుంది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు చెందిన మేయర్లు, ఇతర ప్రముఖులు సదస్సుకు హాజరవుతారు.       »  'మెట్రోపొలిస్' పేరిట మూడేళ్లకోసారి ప్రపంచంలోని పెద్ద నగరాల ప్రజాప్రతినిధులు ఏదో ఒక నగరంలో సమావేశమవుతారు. నగరాల పరిస్థితి, పెరుగుతున్న జనాభా, అభివృద్ధి తదితర అంశాలపై మేథోమధనం నిర్వహిస్తారు.       »  మూడేళ్ల క్రితం 'మెట్రోపొలిస్‌'ను ఆస్ట్రేలియా లోని సిడ్నీలో నిర్వహించారు.