జూన్ - 3
|
¤ మనకు 560 కాంతి సంవత్సరాల దూరంలో డ్రాకో నక్షత్ర మండలంలోని కెప్లర్-10 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీగ్రహం కెప్లర్-10 సి ని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
» మన భూమికంటే పరిమాణంలో రెండు రెట్లు, బరువులో 17 రెట్లు ఎక్కువగా ఉన్న ఈ గ్రహం సౌరకుటుంబం వెలుపల ఇప్పటిదాకా కనుక్కున్న భూమిలాంటి అన్ని గ్రహాల్లో కెల్లా పెద్దదని, అందుకే దీనికి 'గాడ్జిల్లా ఆఫ్ ఎర్త్స్' అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది ప్రతి 45 రోజులకు ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తుంది. భూమిలో రాళ్లు, రప్పలతో ఉన్న ఈ గ్రహం భారీ ఎత్తున వాయువులతో కూడా నిండి ఉంది. ఇది 1100 కోట్ల ఏళ్ల క్రితం పుట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» బిగ్‌బ్యాంగ్ జరిగి విశ్వం ఏర్పడిన 300 కోట్ల ఏళ్లకే ఇది పుట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై అధ్యయనం ద్వారా తొలినాటివిశ్వం గురించి అనేక వివరాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
» భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు అయితే, కెప్లర్-10 సి వ్యాసం 29,000 కి.మీ.
» భూమి మీద ఒక ఘనపు సెంటీమీటరు సాంద్రత 5.5 గ్రాములైతే కెప్లర్-10 సి మీద ఒక ఘనపు సెంటీమీటరు సాంద్రత 7.5 గ్రాములు.
» నిజానికి ఇలా బ్రహ్మాండమైన పరిమాణంలో ఉండే గ్రహాలు హైడ్రోజన్‌తో నిండి మన గురుడిలాగా లేదా నెప్ట్యూన్ తరహాలో భారీ వాయు గోళాల్లా ఉండాలి. కానీ, కెప్లర్-10 సి కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా మన భూమి తరహాలోనే గట్టి ఉపరితలం ఉన్న గ్రహంగా మనుగడ సాగిస్తోంది. |
జూన్ - 4
|
¤ ఆధునిక పరిజ్ఞానంతో కూడిన మూడు ఐఎస్‌వీ (ఇమ్మీడియట్ సపోర్ట్ వెజల్స్)లు తూర్పు నౌకాదళంలోకి చేరాయి.
» విశాఖపట్నం నావల్ డాక్‌యార్డు జెట్టీలో నిర్వహించిన కార్యక్రమంలో మూడు ఐఎస్‌వీలు టీ 35, టీ 36, టీ 37 తూర్పు నౌకాదళంలో చేరాయి. ఇవి కోస్తాతీర సముద్ర మండలి ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధికి పాటు పడతాయి. పూర్తిగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను అమర్చడం ద్వారా 40 నాటికల్ మైళ్ల వేగంతో ఇవి సాగర జలాల్లో దూసుకుపోతాయి.
¤ మన సౌరకుటుంబానికి పొరుగున 13 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాప్టెన్స్ అనే పురాతన నక్షత్రం చూట్టూ ఉన్న రెండు గ్రహాలను ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన లా సిలా, హవాయిలోని కెక్, చిలీలోని మెగాలెన్ కేంద్రాల్లోని స్పెక్ట్రోమీటర్ల ద్వారా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
» ఈ రెండు గ్రహాలకు కాప్టెన్స్ బీ, కాప్టెన్స్ సీ లుగా పేర్లు పెట్టారు.
» ఇవి 1,150 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని, 16,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ మరుగుజ్జు గెలాక్సీలో ఇవి ఏర్పడగా ఆ గెలాక్సీని మన పాలపుంత లాగేసుకుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
¤ రోదసీలో గెలాక్సీల నుంచి వచ్చే అతినీలలోహిత కాంతిని పరిశీలిస్తూ, హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన విశ్వం సరికొత్త వర్ణ చిత్రాన్ని నాసా ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
» ఇంతవరకూ అత్యంత స్పష్టంగా రంగులతో, సమగ్రంగా రూపొందించిన విశ్వం చిత్రాల్లో దీన్నే ఉత్తమమైందిగా భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుమారు 10 వేల గెలాక్సీలు ఉన్నాయి.
» సుమారు 1,370 కోట్ల ఏళ్ల క్రితం బిగ్‌బ్యాంగ్ జరిగి విశ్వం ఆవిర్భవించగా 500-1000 కోట్ల ఏళ్ల మధ్య కాలంలోనే అత్యధిక నక్షత్రాలు పుట్టాయని అంచనా.
¤ కొత్త తరం పర్యావరణ హిత కండోమ్స్‌ను అభివృద్ధి చేస్తున్న భారత శాస్త్రవేత్త లక్ష్మీనారాయణన్ రఘుపతికి బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి సుమారు రూ.59 లక్షల (లక్ష డాలర్లు) గ్రాంట్ లభించింది. ముడి పాలిస్టర్‌తో ఆయన వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో పని చేస్తున్నారు.
» గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన గ్రాండ్ ఛాలెంజెస్ ఎక్స్‌ప్లొరేషన్ (జీసీఈ) కాంటెస్ట్‌లో భాగంగా ఎంపికైన 50 ఐడియాల్లో నుంచి 12వ రౌండ్‌లో ఆయనకు ఈ బహుమతి లభించింది. |
జూన్ - 5
|
¤ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కొత్తపరిజ్ఞానాన్ని కనుక్కున్నారు.
» పైకప్పు పెంకులపై టైటానియం డయాక్సైడ్ మిశ్రమం పూతను పూస్తే వాతావరణంలో పొగమంచు ఏర్పడేందుకు కారణమవుతున్న నైట్రోజన్ ఆక్సైడ్‌లను విచ్ఛిన్నం చేయవచ్చని వారు ప్రకటించారు.
» ఒక కారు సంవత్సర కాలంలో 17 వేల కి.మీ. దూరం నడిస్తే విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్‌లను ఒక ఇంటి పైకప్పు పెంకులపై పూసే టైటానియం డయాక్సైడ్ మిశ్రమం 97% తొలగిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. |
జూన్ - 6
|
¤ ముంబయి హార్బర్‌లో 2013 ఆగస్టు 14న పేలుడుకు గురె, నీట మునిగిన జలాంతర్గామి 'ఐఎన్ఎస్- సింధురక్షక్'ను సుముద్ర గర్భం నుంచి వెలికితీశారు.
» మునిగిన నౌకలను పునరుద్ధరించే 'రిజాల్వ్ మెరైన్' అనే అమెరికన్ సంస్థకు చెందిన ముంబయి శాఖ రూ.240 కోట్ల కాంట్రాక్టుతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.
» 2300 టన్నుల బరువైన సింధురక్షక్‌ను రెండు నౌకల సాయంతో నీటిపైకి తీసుకొచ్చి, ఒక ప్రత్యేకమైన నావపై ఉంచింది. సింధురక్షక్ నీటిలో తేలే సామర్థ్యం సంతరించుకున్నాక రిజాల్వ్ మెరైన్ సంస్థ దాన్ని నౌకాదళానికి అప్పగిస్తుంది. |
జూన్ - 7
|
¤ లేజర్ కిరణాలతో సమాచార ప్రసారాన్ని కొనసాగించే ఓ సరికొత్త పరికరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి హైడెఫినిషన్ వీడియోను అందకున్నట్లు నాసా వెల్లడించింది.
» 175 మెగాబైట్ల ఈ వీడియో అంతరిక్షం నుంచి భూమికి చేరాలంటే ప్రస్తుత పద్ధతుల్లో పదినిమిషాలకు తక్కువ పట్టదని, ఆప్టికల్ పేలోడ్ ఫర్ లేజర్ కామ్ సైన్స్ (ఓపల్స్) విధానంతో 3.5 సెకన్లలోనే అందుకున్నారని నాసా తెలిపింది. |
జూన్ - 12
|
¤ భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి సిద్ధమై 13 ఏళ్లు పూర్తయింది.
» 2001 జూన్ 12న బ్రహ్మోస్ క్షిపణి తొలి ప్రయోగాన్ని నిర్వహించారు. ఇప్పటివరకూ 42 సార్లు ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
» బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
» బ్రహ్మోస్ క్షిపణి 13 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బ్రహ్మోస్ వైమానిక వెర్షన్ కోసం కొత్త సిమ్యులేషన్ కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎ.పి.జె.అబ్దుల్ కలాం న్యూఢిల్లీలో ప్రారంభించారు.
» బ్రహ్మోస్ సంస్థ భారత విభాగం అధిపతి శివథాను పిళ్లై. |
జూన్ - 14
|
¤ భారత్‌కు చెందిన అత్యంత భారీ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ విక్రమాదిత్య'ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ గోవాతీరంలో జాతికి అంకితం చేశారు.
» గోవా తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను మోడీ పరిశీలించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి. » దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పొడవు 282 మీటర్లు. బరువు 44,500 టన్నులు. 20 అంతస్తుల ఎత్తు, మూడు ఫుట్‌బాల్ కోర్టులంత సైజులో ఈ నౌక ఉంది.
» నౌకలో 22 డెక్స్ ఉన్నాయి. 1600 మంది సిబ్బంది ఉన్నారు. 45 రోజుల పాటు పూర్తిగా సముద్రంలోనే గడిపే సామర్థ్యం దీని సొంతం. ఇందులోని సిబ్బందికి నెలకు లక్ష గుడ్లు, 20 వేల లీటర్ల పాలు, 16 టన్నుల బియ్యం అవసరమవుతాయి.
» రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ నౌక కిందటేడాది నవంబరు 16న నేవీలో చేరింది. తాజాగా దీన్ని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. |
జూన్ - 18
|
¤ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 'ఆకాశ్' గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను సైన్యం విజయవంతంగా పరీక్షించింది.
» ఒడిశాలోని బాలాసోర్ ఐటీఆర్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు.
» ఈ క్షిపణి తక్కువ ఎత్తులో (సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎగువున) గాలిలో ప్రయాణిస్తున్న మానవ రహిత వాహనాన్ని దిగ్విజయంగా ఛేదించింది. దీంతో ఇది సైన్యంలో చేరడానికి సిద్ధమైంది.
» ఆకాశ్ సూపర్‌సోనిక్ క్షిపణి పూర్తిస్థాయి నమూనాలపై సైన్యం జరిపిన ప్రామాణిక పరీక్షల్లో ఇది చివరిది.
» ఆకాశ్ క్షిపణి 18 కి.మీ. ఎత్తులో 30 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
¤ ప్రపంచంలోనే అతి చిన్న డ్రోన్‌ను హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
» కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన ఈ డ్రోన్ 106 మిల్లీగ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.
» తలపై పిరమిడ్ ఆకారంలో ఉండే లైట్ సెన్సర్ ఆధారంగా దేహాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎలక్ట్రానిక్ కండరాలతో రెక్కలను ఆడిస్తూ ఇది ముందుకెళుతుంది. తేలికైన, అతి సన్నటి తీగ సాయంతో విద్యుత్‌ను అందుకుని ఇది పనిచేస్తుంది. |
జూన్ - 20
|
¤ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రహశకల యాత్ర కోసం అనువైన వేదిక దొరికింది. స్పిట్జర్ అంతరిక్ష టెలిస్కోపు సాయంతో పరిశీలనలు జరిపి భూమికి చేరువలో ఉన్న 2011 ఎండీ అనే గ్రహశకలం ప్రతిపాదిత యాత్రకు యోగ్యమైందని సంస్థ తేల్చింది. |
జూన్ - 24
|
¤ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా కిరణాల టెలిస్కోప్‌ను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సంస్థ రూపొందించింది. ఈ టెలిస్కోప్ అన్ని రకాల క్షేత్రస్థాయి పరీక్షల్లోనూ విజయం సాధించిందని ఈసీఐఎల్ ప్రకటించింది.
» ముంబయిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) కోసం ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు.
» దీన్ని జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్న హన్లేలో ఏర్పాటు చేయనున్నారు.
» దీనికి 'మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్‌పరిమెంట్' (మేస్) అని పేరుపెట్టారు.
» 2016 ప్రారంభంలో ఈ టెలిస్కోప్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌గా గుర్తింపు పొందుతుంది. ఆస్ట్రో ఫిజిక్స్, ఫండమెంటల్ ఫిజిక్స్, పార్టికల్ యాక్సిలరేషన్ మెకానిజం లాంటి పలు రంగాల పరిశోధనల్లో మన శాస్త్రవేత్తలకు 'మేస్' తోడ్పడుతుంది.
» ప్రపంచంలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్ నమీబియాలో ఉంది. పలు పరిశోధక సంస్థలు కలిసి ఈ టెలిస్కోప్‌ను అభివృద్ధి చేశాయి. మేస్‌ను బార్క్ సహకారంతో ఈసీఐఎల్ రూపొందించింది.
» 180 టన్నుల బరువుండే మేస్‌లో 1200 కిలోల బరువున్న హై రిజల్యూషన్ ఇమేజింగ్ కెమేరా ఉంటుంది. దీని ద్వారానే విశ్వంలోని అద్భుతాలను పరిశీలించడానికి శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుంది.
¤ సాగరాల్లో శత్రు జలాంతర్గాముల పనిపట్టే అత్యాధునిక యుద్ధనౌకను భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది.
» ఐఎన్ఎస్ (ఇండియన్ నావల్ షిప్) కమోర్తా అనే ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ రూపొందించింది.
» కమోర్తాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జలాంతర్గాములను పేల్చివేసే స్వదేశీ రాకెట్ లాంచర్ ఉండే తొలి యుద్ధనౌక ఇదే కావడం గమనార్హం. నీటి లోపల మరింత మెరుగైన పరిశీలన కోసం 'బౌ మౌంటెడ్ సోనార్'ను కూడా మొదటిసారిగా దీనిపైనే అమర్చారు.
» ఐఎన్ఎస్ కమోర్తా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలు అందిస్తుంది.
¤ కాంక్రీట్ కట్టడాల్లో పగుళ్ల ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే సరికొత్త టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్, నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీకి వారు 'సెన్సింగ్ స్కిన్' అని పేరు పెట్టారు.
» అణు వ్యర్థాలను భద్రపరిచే కట్టడాలు, నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే భారీ బ్రిడ్జిల పర్యవేక్షణకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడనుంది.
» ఈ టెక్నాలజీ వల్ల పగుళ్లను ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన చర్యలు చేపట్టవచ్చు. తద్వారా పెను ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు.
» 'సెన్సింగ్ స్కిన్' అనేది ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన విద్యుత్‌ను ప్రసారం చేయగల పెయింట్. దీన్ని పాత, కొత్త కట్టడాలకు పూసి, వాటిపై కొన్ని ఎలక్ట్రోడులను అమర్చుతారు. చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా రెండు ఎలక్ట్రోడుల మధ్య కరెంటును ఈ పెయింట్ ద్వారా ప్రసారం చేస్తారు. తర్వాత ఆ డేటాను విశ్లేషిస్తారు. ఆ సమాచారం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఏదో తేడా ఉన్నట్లు గుర్తిస్తారు. |
జూన్ - 25
|
¤ ఇప్పటివరకూ మానవ మాత్రులెవరూ చూడనంతటి భారీ వజ్రాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇది ఏకంగా మన భూగోళమంత ఉండటం విశేషం.
» రోదసిలో 900 కాంతి సంవత్సరాల దూరంలో దీన్ని గుర్తించారు.
» విస్కాన్సిన్ - మిల్వాకీ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ కప్లాన్ తన సహచరులతో కలిసి దీన్ని కనుక్కున్నారు.
» ఈ వజ్రం వాస్తవానికి ఒక వైట్ డ్వార్ఫ్. అంటే అంత్యదశలో ఉన్న అత్యంత సాంద్రతతో కూడిన నక్షత్రం. ఇది అతి శీతలంగా ఉండటం వల్ల దీంట్లో ఉన్న కర్బనం స్ఫటికంలా తయారైంది. ఫలితంగా ఇది వజ్రంలా మారిపోయింది.
» డేవిడ్ బృందం కనుక్కున్న వైట్ డ్వార్ఫ్ ఎక్వేరియస్ నక్షత్ర మండలంలో ఉంది. |
జూన్ - 28
|
¤ విశ్వసృష్టి తెలుసుకునేందుకు ఈసీఐఎల్ రూపొందించిన 'మేజర్ అట్మాస్ఫియరిక్ చెరింకోవ్ ఎక్స్‌పరిమెంట్ (మేస్)' టెలిస్కోప్‌ను జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు తరలించారు.
» లడఖ్‌లో ఏర్పాటు చేయనున్న ఈ టెలిస్కోప్ 2016లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
» ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్.
¤ ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి వీలుగా భారత నౌకాదళం 'ఐఎన్ఎస్ మైసూర్' యుద్ధనౌకను పర్షియన్ గల్ఫ్‌లో మోహరించింది.
» ఏడెన్ గల్ఫ్‌లో ఇప్పటికే మరో యుద్ధనౌక ఐఎన్ఎస్ తర్కాష్‌ను సిద్ధంగా ఉంచారు.
» భారత వాయుసేన కూడా సి-17, సి-130జే సూపర్ హెర్క్యులస్ విమానాలను సిద్ధంగా ఉంచింది. |
జూన్ - 29
|
¤ అంతర్జాతీయ పరిశోధకుల బృందం భూమిని పోలిన ఒక గ్రహాన్ని కనుక్కుంది. ఇది భూమికి కేవలం 16 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉందని వారు పేర్కొన్నారు.
» సూపర్ - ఎర్త్ (జీజే 832 సీ)గా పేర్కొంటున్న ఈ గ్రహం జీజే 832 నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 16 రోజులు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
» సూపర్ - ఎర్త్ ద్రవ్యరాశి భూమి కంటే అయిదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ రాబర్ట్ విటెన్ మియర్ వెల్లడించారు.
» వీరి పరిశోధన ఫలితాలను ఖగోళ భౌతికశాస్త్ర జర్నల్‌లో ప్రచురించారు.
¤ నరోరా అణు విద్యుత్ కర్మాగారం (ఎన్ఏపీఎస్) - 1, 2 యూనిట్లు ఈ ఏడాది చివరిలోగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల పరిధిలోకి వెళ్లనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
» దీంతో 14 పౌర అణు రియాక్టర్లను భద్రతా ప్రమాణాల పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ పూర్తవుతుంది. భారత్ - అమెరికా అణు ఒప్పందంలో భాగంగా ఈ కట్టుబాటు అవసరం.
» ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లాలో ఈ రెండు రియాక్టర్లు ఉన్నాయి. ఇవి 220 మెగావాట్ల ప్రెజరైజ్డ్ భారజల రియక్టర్ల (పీహెచ్‌డబ్ల్యూఆర్) తరగతికి చెందినవి.
» ఎన్ఏపీఎస్ - 1 జనవరి 1991లోనూ, ఎన్ఏపీఎస్ - 2 జులై 1992 లోనూ ప్రారంభమయ్యాయి.
» భారత్ - అమెరికా అణు ఒప్పందంలో భాగంగా 2014 చివరికల్లా 14 రియాక్టర్లను భద్రతా ప్రమాణాల పరిధిలోకి తీసుకెళ్లనున్నట్లు భారత్ 2008 జులై లోనే ఐఏఈఏకు సమాచారం అందించింది.
» భారత్ - అమెరికా అణు ఒప్పందంలోని నిబంధనలు అన్నింటినీ పాటించడం ద్వారా అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నించవచ్చు.
¤ లో డెన్సిటీ సూపర్‌సోనిక్ డీసెలరేటర్ (ఎల్‌డీఎస్‌డీ) వాహనాన్ని హవాయి దీవుల్లో నాసా విజయవంతంగా ప్రయోగించింది.
» ఎగిరే పళ్లెం (ఫ్లయింగ్ సాసర్)లా కనిపించే ఈ వాహనాన్ని భవిష్యత్తులో అంగారక గ్రహంపై క్షేమంగా దిగేందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు నాసా రూపొందించింది. |
జూన్ - 30
|
¤ అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకం మరోమారు రెపరెపలాడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ - సీ23) అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది.
» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్‌వీ - సీ23 విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది.
» ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం స్పాట్ - 7తోపాటు కెనడా, సింగపూర్, జర్మనీలకు చెందిన మరో నాలుగు చిన్న ఉపగ్రహాలను 662.3 కి.మీ. ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 1073.7 సెకన్లకు స్పాట్ - 7ను, మరో నాలుగు నిమిషాల వ్యవధిలో మిగిలిన నాలుగు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొత్తం 20 నిమిషాల్లో ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైంది.
» ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
» పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ23 స్ట్రాఫాన్ బూస్టర్లు లేని వాహక నౌక. ఇలాంటి పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది పదోది. పీఎస్ఎల్‌వీల శ్రేణిలో 27వది. తొలిసారి జరిగిన పీఎస్ఎల్‌వీ మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. పీఎస్ఎల్‌వీ - సీ23 వాహకనౌక పొడవు 44.4 మీటర్లు. బరువు 230 టన్నులు. ఈ రాకెట్ తన వెంట 765 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను, ఇస్రోకు చెందిన 60 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లింది.
ఉపగ్రహాల వివరాలు:స్పాట్-7: ఇది ఫ్రెంచి దేశానికి చెందింది. బరువు 714 కిలోలు. దీని జీవిత కాలం పదేళ్లు. భూమిని అతి దగ్గరగా ఫొటోలు తీయనుంది.ఎఐశాట్: ఇది జర్మనీకి చెందింది. బరువు 14 కిలోలు. దీంతో సముద్ర యానం, నౌకల గమనాన్ని పరిశీలించవచ్చు. నౌకల నుంచి వచ్చే సంకేతాలను తీసుకుని సమాచారం ఇస్తుంది.ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2: ఈ రెండు ఉపగ్రహాల బరువు 30 కిలోలు. ఇవి కెనడాకు చెందినవి. ఇవి సిగ్నల్స్‌ను తీసుకుని ట్రాన్స్‌మిషన్ చేస్తాయి.వెలాక్స్: ఇది సింగపూర్‌కు చెందింది. బరువు 6.4 కిలోలు. మొదటి నానో శాటిలైట్. దీన్ని ఎన్‌టీయూ విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారుచేశారు. ఇది సంకేతాలను తీసుకుని నిల్వ చేసుకుంటుంది.నావిగేషన్ ఎఐఎస్‌యూ: ఇది ఇస్రోకు చెందిన పేలోడ్. దీని బరువు 60 కిలోలు. దీన్ని నావిగేషన్ కోసం పంపారు. అంటే ప్రయోగ సమయంలో వాహక నౌక వివరాలను ఎప్పటికప్పుడు ప్రయోగ వేదికకు తెలుపుతుంది. ఇది సమర్థంగా తన పనిని పూర్తి చేసింది.
» తాజా ప్రయోగంలో రాకెట్‌లోని నాలుగు దశలు అద్భుతంగా పనిచేశాయి. మొదటి దశ ప్రయోగాన్ని 138 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 110.64 సెకన్లకు 52.7 కిలోమీటర్ల ఎత్తులో పూర్తి చేశారు. రెండో దశ 42 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 262.18 సెకన్లకు 218.7 కి.మీ. ఎత్తులో పూర్తయ్యింది. మూడో దశను 7.6 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 521.20 సెకన్లలో 536.8 కిలో మీటర్ల ఎత్తులో పూర్తి చేశారు. నాలుగో దశ 2.5 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 1,036.72 సెకన్లలో 659.1 కి.మీ. ఎత్తులో దిగ్విజయంగా పూర్తి చేశారు.
» ఇస్రో వాణిజ్యపరంగా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 అతి ఎక్కువ బరువైంది కావడం విశేషం. దీని బరువు 714 కిలోలు. భూమిపై 60 - 60 కి.మీ. వ్యాసార్ధంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువు నైనా హై రిజల్యూషన్ ఫొటోలు తీయడం దీని ప్రత్యేకత. 662.3 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
» పీఎస్ఎల్‌వీ - సీ23 వాహక నౌక తెలుగు వారైన షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యాన 50 రోజుల వ్యవధిలో అనుసంధానం జరిగింది. తక్కువ కాలంలో వాహకనౌక అనుసంధానం చేయడం, ప్రయోగం నిర్వహించడం విశేషం. |
|
|