| ¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి చెందిన రెండు ముఖ్య అంశాలకు ఆమోద ముద్ర వేశారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014 కాగా, రెండోది రాష్ట్రపతి పాలన. |  |
| » ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడది చట్టంగా రూపొందనుంది. త్వరలో దీన్ని కేంద్ర రాజపత్రంలో ముద్రించి, నోటిఫై చేయనున్నారు. దీంతో పార్లమెంటు పాత్ర పూర్తవుతుంది. ఇక 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రానుంది. ఆరోజు నుంచి కొత్త రాష్ట్రం అధికారికంగా మనుగడలోకి వస్తుంది. » ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర మంత్రివర్గ సిఫార్సుకూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఆర్టికల్ 356 కింద అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడానికి రాష్ట్రపతి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినట్లయింది. » మార్చి 1 నుంచి రాజ్యాంగ అధికరణ 356 (1) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.¤ మూడున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు వార్డుల నుంచి ఛైర్‌పర్సన్/ మేయర్ వరకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేసింది. » పురపాలక ఎన్నికలను కచ్చితంగా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేసింది. » రాష్ట్రం మొత్తం యూనిట్‌గా తీసుకుని 158 మున్సిపాలిటీలు, 19 నగర పాలక సంస్థలకు రిజర్వేషన్లు సిద్ధం చేశారు. అనపర్తి మున్సిపాటిలీపై న్యాయ వివాదం ఉండటంతో దాన్ని తప్పించారు. షెడ్యూలు ఏరియా పరిధిలోకి వచ్చే మందమర్రి, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉండవు. వీటిలో తొలి విడత కింద 146 మున్సిపాలిటీలు, 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పది నగర పాలక సంస్థలకు వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటించారు. » నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉన్నాయి. జనరల్‌కు 51.41%, బీసీలకు 33.33%, ఎస్సీలకు 12.42%, ఎస్టీలకు 2.82% రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమల్లో భాగంగా 158 మున్సిపాలిటీల్లోని 78 స్థానాలు, 19 నగరపాలక సంస్థల్లోని 9 స్థానాలను మహిళలకు కేటాయించారు. » రాష్ట్రంలో 181 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 19 నగర పాలక సంస్థలు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మినహా ఎక్కడా ఎన్నికైన పాలక మండళ్లు లేవు. |
మార్చి - 2
|
| ¤ రాష్ట్ర విభజన అంకంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్ర విభజన బిల్లు చట్ట రూపం సంతరించుకుంది. » ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభల ఆమోదం పొందిన 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014' కు మార్చి 1న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేసిన వెంటనే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని భారతీయ రాజపత్రం (ద గెజిట్ ఆఫ్ ఇండియా)లో 'ద ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్-2014' పేరుతో ముద్రించి, దానికి చట్టబద్ధ హోదా కల్పించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. రిజిస్టర్డ్ నెంబర్ డీఎల్-(ఎన్) 04/0007/2003-14 పేరుతో 71 పేజీల చట్టాన్ని గెజిట్‌లో పొందుపరిచారు. |
మార్చి - 3
|
| ¤ రాష్ట్రంలో తొలివిడత కింద 146 మున్సిపాలిటీలు, 10 నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించింది. » మార్చి 30న పోలింగ్ నిర్వహించి, ఏప్రిల్ 2న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు.¤ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తూ, మత్స్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. » ఏటా వేసవిలో నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని తీరప్రాంత రాష్ట్రాలను ఆదేశిస్తుంది. సముద్రంలో మత్స్య సంపద పెరిగేందుకు ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టింది.¤ గవర్నర్ కోటాలో జరిగే శాసన మండలి సభ్యుల (ఎమ్మెల్సీల) నియామకంలో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసిన ముగ్గురు నేతలు కంతేటి సత్యనారాయణ రాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయిలను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆమోదం తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సిఫార్సు చేసిన రఘురామ్‌రెడ్డి పేరును మాత్రం గవర్నర్ తిరస్కరించారు. |
మార్చి - 4
|
| ¤ జూన్ 2వ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదే రోజు కొత్త ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంటుందని వెల్లడించింది. » ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంచిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జూన్ రెండో తేదీతో ముగుస్తుండటంతో అదే రోజు కొత్త రాష్ట్రాల అసెంబ్లీలు ఏర్పాటవుతాయి. ఆ రోజు నుంచీ ఆంధ్రప్రదేశ్ అధికారికంగా విడిపోయి రెండు కొత్త రాష్ట్రాలు మనుగడలోకి వస్తాయి. |
మార్చి - 6
|
| ¤ రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో తొలిసారిగా హైదరాబాద్‌లో సమావేశమైంది. » ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఖరారు చేయడానికి కమిటీకి నెల రోజుల గడువు విధించారు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులు, సింగిల్ యూనిట్ (సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ) ఉద్యోగుల విభజన మాత్రమే కమిటీ పరిధిలో ఉంటుంది. అఖిల భారత అధికారుల విభజనతో సంబంధంలేదు. |
మార్చి - 7
|
| ¤ రాష్ట్ర విపత్తు స్పందనాదళం (ఎస్‌డీఆర్ఎఫ్) కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని సచివాలయంలో డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. » ఈ కార్యాలయంలో వందమంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వీరు సహాయ కార్యక్రమాలు చేపడతారు. |
| ¤ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన 'జై సమైక్యాంధ్ర' పేరిట సరికొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. » పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావు కాగా, ప్రస్తుత అధ్యక్షుడు తానేనని కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. |  |
| ¤ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. » ఏప్రిల్ ఆరో తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్ రెడ్డి ప్రకటించారు. |
 | ¤ సీమాంధ్ర, తెలంగాణలకు ప్రత్యేక పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)లను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. » సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.రఘవీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. |  |
| » కార్య నిర్వాహక అధ్యక్షుడి హోదాను తెలంగాణకు మాత్రమే ఇచ్చారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆ పదవిలో నియమించారు. సీమాంధ్రకు ఈ పదవిని కల్పించలేదు. » సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కె.చిరంజీవి, తెలంగాణ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దామోదర్ రాజనర్సింహ నియమితులయ్యారు. |  |
¤ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 6,25,83,653 మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మార్చి 9న ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
|  |
| » 9.30 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 75 లక్షల దరఖాస్తులు వస్తే, మన రాష్ట్రంలోనే 10 లక్షలు రావడం విశేషం. |
| ¤ కృష్ణా ట్రైబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదు కాబట్టి దాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. |  |
| » జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేతో కూడిన ధర్మాసనం ముందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. » మహారాష్ట్ర వాదనలను తోసిపుచ్చుతూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషిన్లను సమగ్రంగా పరిశీలించడానికి అంగీకరిస్తూ కేసు విచారణను జులై మూడో వారానికి వాయిదా వేసింది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోనున్నందున ఈ కేసుపై వేసవి సెలవుల అనంతరం విచారణ చేపట్టాలన్న కర్ణాటక విజ్ఙప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.¤ ఏప్రిల్ 6న నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిన ఎన్నికల సంఘం తాజాగా తాము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే మార్చి 10 న విడుదల చేసిన షెడ్యూలులో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పామని, కానీ ఇప్పుడు దాన్ని రెండు దశలకు మార్పు చేసి ఏప్రిల్ 6, 8 తేదీల్లో చేపట్టి, 11న కౌంటింగ్ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసింది. దీనికి అనుమతి ఇవ్వాలని కోరింది. » ఎన్నికలు జరిగే స్థానాలు: మొత్తం 99 రెవెన్యూ డివిజన్లలోని 1096 జెడ్పీటీసీ స్థానాలు; 16,589 ఎంపీటీసీ స్థానాలు. |
మార్చి - 21
|
¤ హెలెన్, లెహర్ తుపానులతో నష్టపోయిన రాష్ట్రానికి రూ.344 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. శంభూసింగ్ నేతృత్వంలోని కేంద్రబృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, విపత్తు నిర్వహణ కమిషనర్ సి.పార్థసారధి, వివిధ శాఖల అధికారులు సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు కేంద్ర బృందాలు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించి వచ్చాయి.
|
¤ రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారానే తమ పాస్‌లను పొందేందుకు దక్షిణ మధ్య రైల్వే వీలు కల్పించింది.
|  |
| » దేశంలోనే తొలిసారిగా 'నివారణ్', 'కాంప్‌ట్రాన్', 'మై పాస్'ల పేరిట రూపొందించిన ఆన్‌లైన్ వ్యవస్థను ద.మ.రైల్వే జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ప్రారంభించారు. » 'నివారణ్' పేరిట రూపొందించిన ఆన్‌లైన్ సేవల్లో భాగంగా ఉద్యోగులు తమ సమస్యలను నమోదు చేసిన వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. » దేశవ్యాప్తంగా 12 లక్షల మంది రైల్వే సిబ్బంది మధ్య అనుసంధానం ఉండేలా 'కామన్ పోర్టల్ ఫర్ ట్రాన్స్‌ఫర్స్' (కాంప్‌ట్రాన్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగులు పరస్పరం బదిలీ కోరుకొనే పక్షంలో తమ వివరాలు నమోదు చేస్తే, వాటితో సరిపోలే ఇతర ఉద్యోగుల ద్వారా అనుసంధానాన్ని ఏర్పరుచుకొనేందుకు, తద్వారా బదిలీలను చేపట్టేందుకు వీలు కల్పించేలా ఈ సేవలను ప్రవేశపెట్టారు. |
మార్చి - 22
|
| ¤ శేషాచలం అడవుల్లో రగిలిన కార్చిచ్చును ఆపరేషన్ శేషాచలం పేరిట మూడు హెలికాప్టర్లు నీటిని చల్లి ఆర్పివేశాయి. ¤ రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట సమీపంలోని శ్రీనివాసనగర్ (వెస్ట్)లో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) తొలి శాఖను ఏర్పాటు చేశారు. దీన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ శాంతాసిన్హా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బీఎంబీకి ఇది దేశవ్యాప్తంగా 19వ శాఖ. |
| » ఈ సందర్భంగా బీఎంబీ సీఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ మాట్లాడుతూ.. తమ బ్యాంకు సేవలు కేవలం మహిళలకే అందుతాయనేది సరికాదని, పురుషులు-మహిళలు అనే వివక్ష లేకుండా అందరికీ సేవలు అందిస్తామని చెప్పారు. |  |
» అయితే రుణ మంజూరీలో, రుణ పథకాల రూపకల్పనలో మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తామిచ్చే రుణాల్లో 70 శాతం మహిళలకేనని, మిగిలిన 30 శాతం రుణాలు మహిళలు-పురుషులు ఎవరైనా తీసుకోవచ్చని అన్నారు. » సాధారణ బీమా పాలసీల విక్రయం నిమిత్తం 'న్యూ ఇండియా ఎష్యూరెన్స్' కంపెనీతో బీఎంబీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. |
| ¤ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా వేదాంతం సీతారామ అవధాని నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ సంచాలకులు (డైరెక్టర్)గా అవధాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టుకు రిజిస్ట్రార్‌గా రాష్ట్రం నుంచి వెళుతున్న తొలి తెలుగు వ్యక్తి అవధాని కావడం విశేషం. |  |
| » అవధాని 1956లో గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జన్మించారు. 1980లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (గోల్డ్ మెడల్) పట్టా పొందారు. 1987లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. 2002లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలతోపాటు, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించారు. మూడున్నర సంవత్సరాల నుంచి రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో వివిధ హోదాల్లో ఈయన పని చేశారు. |
మార్చి - 26
|
| ¤ జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.1,13,594 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అధికారులు గవర్నర్‌కు వివరించారు. దీనిలో ఆంధ్రాలోని ప్రాజెక్టులకు రూ.36,591 కోట్లు, తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి రూ.76,643 కోట్లు కావాలని చెప్పారు. » ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆరు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు నీటి పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని పునర్విభజన చట్టంలో ఉంది. ఈ జాబితాలో మరో 16 ప్రాజెక్టులను కూడా చేర్చేలా కేంద్రానికి సూచించాలని నీటిపారుదల శాఖ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. |
సలావుద్దిన్ అహ్మద్
| ¤ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సలహాదారులుగా రాజస్థాన్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దిన్ అహ్మద్, మహారాష్ట్ర మాజీ డీజీపీ ఏఎన్ రాయ్‌లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. |
ఏఎన్ రాయ్
|
రాష్ట్రపతి పాలనలో మంత్రుల బాధ్యతలను నెరవేర్చేందుకు ఇద్దరు సలహాదారులను నియమించడం ఆనవాయితీ.
» ఉత్తరప్రదేశ్‌కు చెందిన అహ్మద్ 1975 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2012 ఫిబ్రవరి 15న పదవీ విరమణ పొందారు. ఏఎన్ రాయ్ 1972 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. మహారాష్ట్ర డీజీపీగా 2010 మే నెలలో పదవీవిరమణ పొందారు. » అహ్మద్ పరిపాలన వ్యవహారాలను, రాయ్ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. |
¤ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై రాజ్యసభ ఆమోదం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసినట్లు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వెల్లడించారు. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలని, లోక్‌సభ జరిగే అవకాశం లేనందున రాజ్యసభ ద్వారానైనా ఆమోదం తీసుకోవాలని ఉందని తాను కేంద్రానికి గుర్తుచేసినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకు భద్రత కల్పించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.
|
¤ పురపాలక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.13 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 10 నగర పాలక సంస్థలు, 145 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్రఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2005లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 4.01 శాతం పోలింగ్ పెరిగింది. » ఈవీఎంలు మొరాయించిన ఆరు చోట్ల ఏప్రిల్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. » రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 82.45 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 60.65 శాతంగా ఉంది. » రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి - భన్వర్‌లాల్. » రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బి.రమాకాంత్‌రెడ్డి. » కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ - వి.ఎస్.సంపత్.
|
¤ కరీంనగర్ జిల్లా కేంద్రం, జగిత్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన అదనపు సబ్‌కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ పోర్టు పోలియో జడ్జి జస్టిస్ వి.సూరి అప్పారావు జస్టిస్ నవీన్‌రావుతో కలిసి ప్రారంభించారు.
|
|
| » కరీంనగర్‌లోని ప్రస్తుత సబ్‌కోర్టులో 2001 కేసులు పెండింగ్‌లో ఉండగా అదనంగా ఏర్పాటైన సబ్ కోర్టుకు 907 కేసులను బదిలీ చేశామని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ తెలిపారు. |
|
|