జూన్ - 2014 జాతీయం


జూన్ - 1
¤  దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో గాలుల బీభత్సానికి చనిపోయిన వారి సంఖ్య 57కు చేరింది.   »    ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది.¤  దేశంలోని తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమ నిలిచింది.   »    మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.   »    విద్యార్థుల సంఘం, విలేజ్ విజన్ సెల్‌ల చొరవతో ఆ గ్రామంలో పొగాకు కట్టడి సాధ్యమైంది. పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులు, మత్తుపానీయాల అమ్మకం, వినియోగాన్ని నిషేధిస్తూ గ్రామం తీర్మానం చేసింది. దీన్ని ఉల్లంఘంచిన వారికి జరిమానా విధిస్తారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామం తొలి పొగాకు రహిత గ్రామంగా ఆవిర్భవించింది.
జూన్ - 2
¤  కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి మల్లికార్జున ఖర్గేను లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సోనియాగాంధీ నియమించారు.   »    కర్ణాటకకు చెందిన 72 ఏళ్ల దళిత నేత మాపన్న మల్లికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రాష్ట్ర అసెంబ్లీకి ఆయన వరుసగా తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. 2009లో గుల్బర్గా నుంచి ఎంపీగా ఎన్నికైన ఖర్గే ఈసారి ఎన్నికల్లో మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారీ గెలిచారు. యూపీఏ-2 సర్కారులో ఖర్గే రైల్వేమంత్రి బాధ్యతలను నిర్వహించారు.¤  కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆయన ఈ నెల 14న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
జూన్ - 4
¤  16వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.¤  రోడ్డు రవాణా, హైవే, నౌకాయాన శాఖలను నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీకి అదనంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య శాఖల బాధ్యతలను అప్పగించారు. ఈ శాఖలను చేపట్టిన గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో ఈ మార్పు చోటు చేసుకుంది.¤  సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు సహా గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అనేక కేసులు వాదించిన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ భారత నూతన సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు.   »    అదనపు సొలిసిటర్ జనరళ్లుగా సీనియర్ న్యాయవాదులు మణిందర్ సింగ్, ఎల్.నాగేశ్వరరావు, తుషార్ మెహతా, పి.ఎస్.పట్వాలియా, నీరజ్ కిషన్ కౌల్ నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.   »    రాష్ట్రానికి చెందిన లావు నాగేశ్వరరావు యూపీఏ-2 హయాంలో కూడా అదనపు సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు.¤  కొత్తగా ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.   »    రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణం చేయించారు.   »    67 ఏళ్ల కమల్‌నాథ్ ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా సేవలందించారు.   »    కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జూన్ - 5
¤  రహదారి ప్రమాదాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను మిగులుస్తున్న నేపథ్యంలో మోటారు వాహనాల చట్టాన్ని సమూలంగా సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి చెందిన ఆరు దేశాలు అమెరికా, కెనడా, సింగపూర్, జపాన్, జర్మనీ, యూకేల్లో అమల్లో ఉన్న రహదారి భద్రత నిబంధనలను పరిశీలించి, అక్కడ అనుసరిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా చట్టాన్ని మెరుగుపరచాలని నిర్ణయించింది.¤  తొమ్మిది నెలల బాలికకు ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు కాలేయ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు.   »    ఆరాధిత బెనర్జీ అనే పాపకు మూడు నెలల వయసులో 'బైలియరీ అట్రేషియా' సమస్య ఉన్నట్లు తేలింది. ఒకవైపు కాలేయం పనితీరు క్రమంగా దెబ్బతింటుండగా, మరోవైపు మెదడులో రక్తస్రావం మూలంగా ఎడమ చేయి, కాలు కదపలేని స్థితికి చేరుకుంది. కాలేయ మార్పిడితో పాప ప్రాణాలు దక్కుతాయని డాక్టర్లు భావించి, కాలేయ మార్పిడి చేశారు.¤  అత్యాచారాల విషయంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి జరగకుండా ఏ ప్రభుత్వమూ నిలువరించలేదని, జరిగిన తర్వాత మాత్రమే చర్య తీసుకోగలమని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.¤  16వ లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని లోక్‌సభలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిగువ సభ భారతీయ భాషా సాంస్కృతిక సౌరభాలతో గుబాళించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భాషలు, వస్త్రధారణలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఎంపీలు తమ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే రీతిలో రావడం కనువిందు చేసింది. అంతర్జాతీయ భాష ఆంగ్లం, జాతీయ భాష హిందీ, ప్రాచీన భాష సంస్కృతంతో పాటు ఉర్దూ తదితర భారతీయ భాషల్లో సభ్యులు ప్రమాణం చేశారు.   »    ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ ఎంపీలకు స్వాగతం పలికారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తర్వాత ముగ్గురు ప్యానల్ స్పీకర్లతో ప్రమాణం చేయించారు. క్యాబినెట్, స్వతంత్ర హోదా, సహాయ మంత్రులు వరుసగా ప్రమాణం చేశారు.   »    మోడీ, అద్వానీ, సోనియా గాంధీ, రాజ్‌నాథ్ సింగ్‌లు హిందీలో, సుష్మా స్వరాజ్, ఉమాభారతి, హర్షవర్థన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు.   »    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీల్లో చిత్తూరు సభ్యుడు ఎన్.శివప్రసాద్ ఒక్కరే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు.   »    510 మంది లోక్‌సభ సభ్యులు ఒక్కరోజులోనే ప్రమాణ స్వీకారం చేశారు
 జూన్ - 6
¤  ఇటలీలోని రోమ్, మిలాన్ నగరాలకు ఎయిరిండియా (ఏఐ) ఢిల్లీ నుంచి నేరుగా విమాన సేవలను ప్రారంభించింది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ను ఈ సేవలకు వినియోగించనున్నారు. ఇందులో 18 బిజిసెస్, 238 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి.   »    ఢిల్లీ నుంచి రోమ్‌లోని లియోనార్డో డావిన్సీ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి మిలాన్‌లోని మాల్పెన్సా విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి ఈ విమానం ప్రయాణిస్తుంది.¤  కేవలం రూ.1,099 ధరకే అంతర్జాలం (ఇంటర్నెట్) సదుపాయం కలిగి ఉండే ఫోన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది.    »    పెంటెల్ టెక్నాలజీస్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ 'పెంటా భారత్ ఫోన్‌'ను బెంగళూరులో మారిషెస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పర్యాగ్ ఆవిష్కరించారు. ఇంత చవక ఫోన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం దేశంలో ఇదే ప్రథమమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 
 జూన్ - 7
¤  పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో అంతుచిక్కని అనారోగ్యంతో పదిమంది చిన్నారులు మృతి చెందారు. జ్వరం, వాంతులతో మొదలై తీవ్రంగా వణుకుతూ చనిపోతున్నట్లు వైద్యులు ప్రకటించారు.¤  తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం (కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సృష్టించింది. కేఎన్‌పీపీలోని ఒకటో యూనిట్‌లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి.   »    కేఎన్‌పీపీ దేశంలో తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్.
 జూన్ - 8
¤  ముంబయి మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి.   »    వర్సోవాలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ జెండా ఊపి మెట్రోరైలును ప్రారంభించారు. చవాన్‌తోపాటు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనాఅంబానీ తదితరులు రైల్లో ఘట్కోపర్ వరకు ప్రయాణించారు. ముంబయి మెట్రోరైలు ప్రాజెక్టులో రిలయన్స్ ఇన్‌ఫ్రాకూ భాగస్వామ్యం ఉంది.¤  ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు త్వరలో 'ముల్తానీ మట్టి'తో ప్యాక్ వేయనున్నారు. కాలుష్యం మూలంగా తాజ్‌మహల్ పాలరాయి ధవళ వర్ణాన్ని కోల్పోయి, లేత పసుపు రంగుకు మారుతుండటంతో ఈ చికిత్స చేయాలని భారత పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ణయించారు.¤  దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో 47.8º సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత 60 ఏళ్లలో ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
 జూన్ - 9
¤  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదరిక నిర్మూలన, మతహింసను అరికట్టడం, అవినీతిని అంతమొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, యువతకు ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఆయన వివరించారు.
 జూన్ - 10
¤  కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులందరూ తమ ఆస్తులు, అప్పులు, వ్యాపార ఆసక్తుల వివరాలను రెండునెలల్లో ప్రధాని నరేంద్రమోడీకి తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   »    కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక, హోం మంత్రిత్వ శాఖ మంత్రుల ప్రవర్తన నియమావళిని జారీ చేసింది.ముఖ్యాంశాలు  మంత్రులు వ్యాపారాన్ని ప్రారంభించరాదు. భాగస్వామిగా ఉండరాదు. మంత్రి పదవి చేపట్టకముందే ఏదైనా వ్యాపార ఆసక్తులు కలిగి ఉంటే, వాటిని జీవిత భాగస్వామి కాకుండా, ఇతర కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు బదలాయించవచ్చు. అయితే, మంత్రులుగా నియమితులు కాకముందే వారు కూడా ఆ వ్యాపారంతో సంబంధం కలిగి ఉండాలి.   పౌరసేవల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తమ విధులు, బాధ్యతలకు భిన్నంగా పని చేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తేకూడదు.   ప్రభుత్వానికి ఏవైనా వస్తువులు సరఫరా చేసే లేదా సేవలందించే వ్యాపారాల్లో మంత్రుల కుటుంబ సభ్యులు పాలు పంచుకోకూడదు. లైసెన్సుల మంజూరు, ఇతర అనుమతులు, కోటాలు, లీజులపై ఆధారపడే వ్యాపారాల్లో మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఉండకూడదు.   తన కుటుంబ సభ్యులెవరైనా వ్యాపారం ప్రారంభించినా, భాగస్వామిగా చేరినా సదరు మంత్రి ప్రధానికి తెలియజేయాలి.   ప్రధాని ముందస్తు అనుమతి లేకుండా మంత్రుల జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు విదేశీ ప్రభుత్వోద్యోగాలు చేయరాదు. విదేశీ సంస్థల్లోనూ ఉద్యోగాలు చేయకూడదు. అప్పటికే అలాంటి ఉద్యోగంలో ఉండి ఉంటే ప్రధానికి తెలియజేయాలి.   మంత్రులు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో షేర్లు కలిగి ఉండవచ్చు. అయితే, అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో సదరు సంస్థల్లో షేర్లు కలిగి ఉండటం వల్ల చెడ్డపేరు వస్తుందని ప్రధాని భావించే పక్షంలో వాటికి దూరంగా ఉండాలి.   మంత్రులు, వారి కుటుంబ సభ్యుల స్థిరాస్తుల వివరాలు, షేర్లు, డిబెంచర్లు, నగదు, ఆభరణాల మొత్తం విలువ తెలియజేయాలి.   మంత్రి పదవిలో ఉన్నంతకాలం ప్రతి ఏడాది ఆగస్టు 31 లోగా గత ఆర్థిక సంవత్సరంలోని ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానికి సమర్పించాలి.¤  'కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన' నినాదంతో పాలన వ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోడీ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వివిధ వ్యవహారాలపై నిర్ణయాధికారం ఉన్న నాలుగు క్యాబినెట్ కమిటీలను రద్దు చేశారు.   »    ఇటీవలే 21 మంత్రివర్గ బృందాల (జీవోఎం)ను, 9 సాధికార మంత్రివర్గ బృందాల (ఈజీవోఎం)ను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.   »    నాలుగు క్యాబినెట్ కమిటీలను రద్దు చేసిన మోడీ నియామక, ఆర్థిక, పార్లమెంటరీ, రాజకీయ, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించనున్నారు.ప్రధాని రద్దు చేసిన క్యాబినెట్ కమిటీలు1. ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ2. ధరల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ3. ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ4. విశిష్ట ప్రాధికార సంస్థకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ
 జూన్ - 12
¤  గుజరాత్‌లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట ఎత్తును ప్రస్తుతమున్న 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్ల గరిష్ఠ ఎత్తుకు పెంచడానికి 'నర్మదా నియంత్రణ అథారిటీ (ఎన్‌సీఏ)' అనుమతించింది. ఢిల్లీలో సమావేశమైన ఎన్‌సీఏ ఈ నిర్ణయం తీసుకుంది.   »    సర్దార్ సరోవర్ డ్యాంపై 17 మీటర్ల ఎత్తయిన గేట్లను అమర్చడానికి, తద్వారా ఆనకట్ట ఎత్తును పెంచడానికి అనుమతి జారీ చేసింది.   »    నర్మదా నదిపై భారీ ఆనకట్టల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 'నర్మదా బచావో ఆందోళన్' ఛైర్‌పర్సన్ మేధాపాట్కర్ ఎన్‌సీఏ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎత్తును పెంచడం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో 2.5 లక్షల మంది జీవిస్తున్నారని, వీరి హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆమె ఆరోపించారు.
 జూన్ - 14
¤  చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు లేక లక్షలాది మంది మహిళలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం (ఎలీప్) సిద్ధమయ్యాయి.   »    ఏడాదికి 40వేల మంది చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 1.20 లక్షల మంది మహిళలకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ముందుకు నడిపించే బాధ్యతను ఎలీప్‌కు అప్పగించింది.   »    ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 14, కర్ణాటకలో 4 చొప్పున శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు రూ.50 కోట్ల వరకు వ్యయం కానుండగా, 75% కేంద్ర చేనేత శాఖ, మిగతా 25% ఎలీప్ అందించనున్నాయి.   »    'వందేమాతరం' పేరిట 'ప్రగతి మార్గం - మహిళా నైపుణ్యం' నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.   »    ఎలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవి.   »    ఎలీప్ అంటే 'అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ALEAP)'.
 జూన్ - 15
¤  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేటు కళాశాల 1,107 మందితో వెనక్కి నడిచి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించింది.   »    'నూతన ఆలోచనలు' అనే అంశం కింద కళాశాల ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.   »    1039 మందితో వెనక్కి నడిచి 2012లో గిన్నిస్‌కెక్కిన చైనాలోని షాంఘై నగరం పేరిట ఉన్న రికార్డును ఇండోర్‌లోని పీఐఎంఆర్ కళాశాల తిరగరాసింది.
 జూన్ - 16
¤  విశ్వ విఖ్యాత కాశీ విశ్వేశ్వరాలయంలో సమర్పించేందుకు భక్తులు తీసుకొచ్చే విభూతి పొట్లాలను ఇకనుంచి అనుమతించమని పోలీసులు వెల్లడించారు.   »    కొన్ని అవాంఛనీయ శక్తులు విభూతి పొట్లాల్లో ప్రమాదకరమైన ఆర్‌డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను కలిపే ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.   »    కేవలం ప్యాకెట్లను మాత్రమే అనుమతించబోమని, విడిగా తీసుకెళ్లి విభూతిని సమర్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు.
జూన్ - 17
¤  యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్ల సేవలను విరమించుకోవాలని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి తన పదవికి రాజీనామా సమర్పించారు. నెహ్రూ - గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.   »    జోషీ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సిందిగా ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీని రాష్ట్రపతి ఆదేశించారు.    »    ఇందిరాగాంధీ హయాంలో నియమితులైన గవర్నర్లను ఆ తర్వాత 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం భారీ ఎత్తున మార్చింది. అప్పటి నుంచి కొత్తగా వచ్చే ప్రభుత్వాలన్నీ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఎన్‌డీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు విష్ణుకాంత శాస్త్రి (యూపీ), బాబూ పరమానంద్ (హర్యానా), కైలాష్‌పతి మిశ్రా (గుజరాత్), కేదార్‌నాథ్ సాహ్ని (గోవా)లను 2004లో యూపీఏ ప్రభుత్వం తొలగించగా భాజపా ఎంపీ బి.పి.సింఘాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.    »    దీనిపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం 2010లో తీర్పునిస్తూ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారని, గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధ పదవి అని, గవర్నర్లపై విశ్వాసం కోల్పోయామంటూ ఏకపక్షంగా తొలగించజాలదని స్పష్టం చేసింది. అనైతిక ప్రవర్తన, అవకతవకలు లాంటి గట్టి కారణాలున్నప్పుడు మాత్రమే గవర్నర్‌ను తొలగించగలదని పేర్కొంది.¤  భారత్‌లో భూమి ఎడారీకరణ వేగంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతున్న సంగతిని గుర్తించిన మోడీ ప్రభుత్వం ఈ సవాలును ఎదుర్కొనే లక్ష్యంతో ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రకటించింది.   »    2030 నాటికి 'భూ వినాశ రహిత (ల్యాండ్ డిగ్రెడేషన్ న్యూట్రల్)' దేశంగా అవతరించాలని నిర్ణయించింది.   »    మృత్తిక (నేల), జల, జీవ వైవిధ్య సుస్థిర నిర్వహణ ద్వారా భూ వనరుల పరిస్థితిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.    »    పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ పరిశోధన, విద్యా భారత మండలి నిర్వహించిన 'ప్రపంచ ఎడారీకరణ నివారణ దినోత్సవం'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాష్ జవదేకర్ 'పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోడీ ప్రభుత్వం నిర్ణయించినందున 2030 నాటికి భూ వినాశ రహిత దేశంగా అవతరించాల్సి ఉందని' ప్రకటించారు.
జూన్ - 18
¤  భారత అణుశక్తి కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన హోమీ జె.బాబా నివసించిన బంగ్లా 'మెహ్రంగిర్' ధర ఏకంగా రూ.372 కోట్లు పలికింది.   »    ముంబయిలో అత్యంత విలాసవంతమైన 'మలబార్ హిల్స్' ప్రాంతంలో ఈ భవనం ఉంది. అద్భుత వాస్తు శిల్పంతో నిర్మితమై ఉన్న ఈ మూడంతస్తుల భవంతి సముద్రానికి అభిముఖంగా ఎత్తయిన ప్రదేశంలో ఉంటుంది.   »    1966లో వియన్నా వెళుతున్న హోమీ బాబా విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన సోదరుడు జెంషేడ్ ఈ ఇంటికి సంరక్షకులయ్యారు.   »    జెంషేడ్ 'నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)' ను స్థాపించి ఈ భవంతిని సంరక్షించారు. 2007లో జెంషేడ్ మరణించిన తర్వాత ఈ భవంతి ఎన్‌సీపీఏ ఆధీనంలోకి వెళ్లింది.    »    జంషేడ్ బాబా విల్లు మేరకే ఈ భవంతిని విక్రయించినట్లు ఎన్‌సీపీఏ ఛైర్మన్ ఖుస్రూ సంతూక్ ప్రకటించారు.¤  దేశ పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రాధాన్యాంశంగా కూడా తీసుకుంది.   »    జాతీయ జనాభా నమోదు ప్రాజెక్టు కింద ఈ కార్డులను జారీ చేస్తారు. 
 జూన్ - 19
¤  కీలకమైన రోజువారీ, విధాన, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే 6 క్యాబినెట్ కమిటీలను కేంద్రప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇందులో నాలుగు కమిటీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రెండింటికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు.   »    భద్రత, ఆర్థిక, రాజకీయ, పార్లమెంటరీ, అధికార నివాస కేటాయింపు, నియామకాలపై ఏర్పాటైన కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు. వీటిలో భద్రత, ఆర్థిక, నియామకాలు, రాజకీయ వ్యవహారాల కమిటీలు మోడీ నేతృత్వంలో పనిచేస్తాయి. అధికార నివాస కేటాయింపు, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలకు రాజ్‌నాథ్ నేతృత్వం వహిస్తారు. ఆరు కమిటీల్లోనూ రాజ్‌నాథ్‌కు సభ్యత్వం ఉంది.   »    నాలుగు కమిటీల్లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారు. ఆర్థిక, రాజకీయ, పార్లమెంటరీ, నివాస వ్యవహారాలకు సంబంధించిన కమిటీల్లో ఆయనకు చోటు దక్కింది.   »    భాజపా మిత్రపక్షం తెదేపా తరఫున పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యత్వం కల్పించారు.¤  చత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్ రాజీనామా చేశారు. ఆయన 2010లో గవర్నరుగా నియమితులయ్యారు.¤  సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ (59 సంవత్సరాలు) అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.   »    ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.¤  జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్ష పదవికి మర్రి శశిధర్ రెడ్డి, అయిదురుగు సభ్యులు రాజీనామా చేశారు.   »    శశిధర్ రెడ్డితో పాటు ఎన్‌డీఎంఏకు రాజీనామా చేసిన సభ్యుల్లో సీఐఎస్ఎఫ్ మాజీ డైరక్టర్ జనరల్ కె.ఎం.సింగ్, పౌర విమానయానశాఖ మాజీ కార్యదర్శి కె.ఎన్.శ్రీవాస్తవ, మాజీ మేజర్ జనరల్ జె.కె.బన్సల్, బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ బి.భట్టాచార్జీ, సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ కె.సలీం అలీ ఉన్నారు.   »     రాజీనామా చేయని సభ్యుల్లో సీఆర్‌పీఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ జె.కె.సిన్హా, వైద్య నిపుణుడు ముజఫర్ అహ్మద్, సముద్ర అభివృద్ధి విభాగం మాజీ కార్యదర్శి హర్ష కె.గుప్త ఉన్నారు. 
 జూన్ - 20
¤  ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైల్వేశాఖ ప్రయాణికుల చార్జీలను భారీగా పెంచింది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే అన్ని తరగతుల చార్జీలను 14.2 శాతం మేర పెంచింది.   »     సరకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచింది. పెంపు జూన్ 25 నుంచి అమల్లోకి వస్తుంది.¤  కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తుది నివేదిక మరో రెండేళ్ల తర్వాతే అమల్లోకి రానుంది.   »     గత నవంబరు 29న ట్రైబ్యునల్ ఈ నివేదికను ఇవ్వగా, దాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో నివేదికను ఇంకా గెజిట్‌లో ప్రచురించలేదు.   »     రాష్ట్ర విభజన నేపథ్యంలో, ట్రైబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెలాఖరు వరకు గడువు ఉండగా, దాన్ని ఆగస్టు 1 నుంచి 2016 జులై ఆఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   »     చివరిసారిగా ఇచ్చిన నివేదిక ఇంకా గెజిట్‌లో ప్రచురితం కానందున తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనాలు విన్న తర్వాత, ట్రైబ్యునల్ తుది నివేదిక ఇచ్చే అవకాశముంది.   »     కృష్ణా జలాలపై ఏర్పాటైన బచావత్ ట్రైబ్యునల్ గడువు 2000లో ముగిసిన తర్వాత, 2004లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పాటైంది. ఇది మొదట మధ్యంతర నివేదికను ఇచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలను విని, గత నవంబరులో తుది నివేదికను ఇచ్చింది. 
 జూన్ - 21
¤  కేరళలోని త్రిసూర్ జిల్లాలో 46,660 మంది ఒకేసారి ఆధ్యాత్మిక పద్యం ఆలపించి గిన్నిస్ పుస్తకంలో చోటు పొందారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ (భారత్) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన త్రిసూర్‌లోని వడక్కునాథన్ ఆలయంలో సామూహికంగా పద్యాన్ని ఆలపించారు. 'నిజనప్పన' పేరుతో 16వ శతాబ్దానికి చెందిన మలయాళ కవి పూన్ థానమ్ దీన్ని రచించారు. 
 జూన్ - 22
¤  కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) సంఖ్యను మరింత తగ్గించడంతో పాటు, వాటి తీరు తెన్నులను మార్చడానికి ఉన్న అవకాశాలను కేంద్రం అన్వేషించవచ్చని ప్రణాళికా సంఘం పేర్కొంది.
   »     ప్రస్తుతమున్న సీఎస్ఎస్/ అదనపు కేంద్ర సాయం పథకాలను 12వ పంచవర్ష ప్రణాళిక (2012 - 17)కాలంలో 66 పథకాలుగా కుదించాలని గతేడాది కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
   »     2013 - 14 బడ్జెట్ అంచనాల్లో 137 సీఎస్ఎస్‌లకు, అయిదు పథక ఆధారిత ఏసీఏలకు నిధులు కేటాయించారు.   »     సీఎస్ఎస్‌లు రాష్ట్ర ప్రణాళికలో భాగంగా ఉంటే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని ప్రణాళిక సంఘం భావిస్తోంది. ఆరోగ్యం, విద్య, సాగునీరు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన 17 ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలను కూడా పునర్‌వ్యవస్థీకరించనున్నారు.¤  అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)తో 2009 మార్చిలో భారత్ కుదుర్చుకున్న 'అదనపు ప్రోటోకాల్‌'ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని వియన్నా కేంద్రంగా పనిచేసే ఐఏఈఏకు తెలియజేసింది.   »     దేశ పౌర అణు కార్యక్రమానికి సంబంధించిన రియాక్టర్లు, ఇతర అణు ఇంధన కేంద్రాల్లో ఐఏఈఏ పరిశీలకులు క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించేందుకు ఈ ప్రోటోకాల్ వీలు కల్పిస్తుంది.   »     ఈ తనిఖీలకు అనుమతించే 20 కేంద్రాలను భారత్ ఇప్పటికే గుర్తించింది. భారత్, అమెరికా అణు ఒప్పందానికి అనుకూలంగా కుదుర్చుకున్న అదనపు ప్రోటోకాల్‌ను ఆమోదించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం అణు ఒప్పందం అమలుకు తాము కట్టుబడి ఉంటామనే సంకేతాన్ని పంపినట్లయింది. 
 జూన్ - 23
¤  హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు (జీహెచ్ఎన్‌పీ) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేరింది.   »     కులు లోయలో సిమ్లాకు 250 కి.మీ. దూరంలో 940.40 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో పురాతన పద్ధతుల్లో పరిసరాలు, అరుదైన జీవులను సంరక్షిస్తున్నారు.   »     ఈ ప్రాంతంలోనే ఉన్నత హిమాలయాల మంచు కరిగి నదులు ఏర్పడి ప్రవహిస్తాయి. ఇక్కడ అరుదైన జీవ, జంతుజాలం జీవనం సాగిస్తోంది.   »     గుజరాత్‌లోని 11వ శతాబ్దంనాటి రాణీ కా వావ్ దిగుడు మెట్లబావిని కూడా ఈ జాబితాలో చేర్చాలని యునెస్కో ప్రాథమికంగా నిర్ణయించింది.
 జూన్ - 24
¤  గుజరాత్ పోలీస్ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ప్రకటించారు.¤  చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధాన్ని మరో ఏడాది కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   »     పాలు, పాలతో తయారుచేసే చాక్లెట్లు, క్యాండీలు లాంటి వాటికీ వచ్చే ఏడాది జూన్ 23 వరకు ఈ నిషేధం వర్తిస్తుంది.   »     2008లో తొలిసారిగా ఇలాంటి నిషేధాన్ని భారత్ విధించి ఏటా దాన్ని పొడిగించుకుంటూ వస్తోంది.
 జూన్ - 25
¤  వరి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాలుకు సాధారణ రకం ధాన్యం కనీస మద్దతు ధరను ప్రస్తుతమున్న రూ.1310 నుంచి రూ.1360 కి (పెరుగుదల రూ.50) పెంచగా, ఏ గ్రేడ్ రకం ధాన్యం ధరను క్వింటాలుకు రూ.1345 నుంచి రూ.1400 కి (పెరుగుదల రూ.55) పెంచింది. 2014-15 పంట ఏడాదికి వర్తించే ఈ కొత్త ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.   »     ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ వ్యయధరల కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా ధరలను పెంచింది.   »     సీసీఈఏ నిర్ణయించిన ఇతర పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు (క్వింటాలకు) ఇలా ఉన్నాయి.   »     మొదటి రకం పత్తిబేళ్లు రూ.4000 నుంచి రూ.4050   »     రెండో రకం పత్తిబేళ్లు రూ.3700 నుంచి రూ.3750   »     కందిపప్పు, మినపపప్పు రూ.4300 నుంచి రూ.4350   »     పెసరపప్పు రూ.4500 నుంచి రూ.4600   »     సన్‌ఫ్లవర్ రూ.3700 నుంచి రూ.3750   »     నువ్వులు రూ.4500 నుంచి రూ.4600   »     హైబ్రిడ్ జొన్నలు రూ.1500 నుంచి రూ.1530   »     రాగులు రూ.1500 నుంచి రూ.1550   »     సజ్జలు (రూ.1250), మొక్కజొన్న (రూ.1310), వేరుశెనగ (రూ.4000), సోయాబీన్ (రూ.2500 - రూ.2560) ధరలను అలాగే కొనసాగించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది.¤  న్యూఢిల్లీ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పాట్నాకు 75 కి.మీ. దూరంలోని గోల్డెన్‌గంజ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.¤  కర్ణాటక రాష్ట్రంలో పదోతరగతి చదువుతున్న అంధ విద్యార్థులకు మాట్లాడే ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని కర్ణాటక విద్యాశాఖ నిర్ణయించింది.¤  ఈసారి రుతుపవనాలు బలహీనంగా ఉండవచ్చన్న అంచనాలకు తగ్గట్లుగానే తొలి విడతలో దేశవ్యాప్తంగా 45% తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.   »     జూన్ 1 నుంచి 17వ తేదీ మధ్య సాధారణంగా 78.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈసారి 43.4 మిల్లీమీటర్లు మించలేదని వివరించింది.   »     వాతావరణ శాఖకు దేశవ్యాప్తంగా ఉన్న 36 సబ్ డివిజన్లకుగాను కేవలం ఒక్క చోటే అధికంగానూ, ఏడు చోట్ల సాధారణంగానూ వర్షపాతం నమోదయింది. 18 చోట్ల తక్కువగా, 10 చోట్ల అతి తక్కువగా నమోదయినట్లు ఐఎండీ ప్రకటించింది.¤  నాగాలాండ్ గవర్నర్ అశ్వినీ కుమార్ రాజీనామా చేశారు.   »     యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామా చేయాలని కొద్దిరోజుల కిందట కేంద్ర హోంశాఖ సందేశం పంపింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి, చత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్‌దత్ రాజీనామా చేశారు.   »     ఇప్పటివరకు రాజీనామా చేసిన ముగ్గురు గవర్నర్లు సివిల్ సర్వీస్ మాజీ అధికారులే. రాజకీయ నేపథ్యం ఉన్నవారు ఎవరూ ఇంకా రాజీనామా చేయలేదు.¤  మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం, మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లు 73 శాతానికి చేరాయి.   »     సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. కానీ మహారాష్ట్ర సర్కారు ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది.
 జూన్ - 26
¤  తమిళనాడు ప్రభుత్వం 'అమ్మ' పేరుతో మరో జనాకర్షక పథకాన్ని ప్రారంభించింది.   »     ఇప్పటికే రాష్ట్రంలో తక్కువ ధరలకు అమ్మ క్యాంటీన్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు పథకాలను అమలు చేస్తుండగా తాజాగా అమ్మ ఫార్మసీ (మందుల దుకాణం) పథకాన్ని ప్రారంభించారు.¤  కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) చట్టం కిందకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) గృహ నిర్మాణాన్ని తీసుకొచ్చింది.   »     దీంతోపాటు మురికివాడల అభివృద్ధిని సైతం సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమాల జాబితాలో జత చేసింది.   »     'సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న అసమానతలను తగ్గించే చర్యలు'గా అభివర్ణిస్తూ కొత్త నిబంధనల్లో ప్రభుత్వం వీటిని చేర్చింది.   »     2014, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కంపెనీల చట్టం ప్రకారం లాభాల్లో ఉన్న కంపెనీలు తమ మూడేళ్ల సగటు నికర లాభాల్లో కనీసం రెండు శాతాన్ని సీఎస్ఆర్ కార్యక్రమాలపై వెచ్చించాలి. ఒకవేళ నిర్దేశించిన మొత్తాన్ని వారు ఖర్చు చేయని పక్షంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కారణాలు తెలపాల్సి ఉంటుంది.¤  జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా మూడు నెలల గడువునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.   »     ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసేందుకు జులై 4తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.   »     ఇప్పటివరకు హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్ పూర్తి స్థాయిలో ఈ చట్టాన్ని అమలుచేశాయి. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్ పాక్షికంగా అమలు చేశాయి. 19 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయలేదు.   »     కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.¤  మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యాయి.   »     సామాజిక మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో... ఎన్‌డీఏ తొలి నెల రోజుల పాలనలోని విశేషాలను తెలియజేస్తూ అయిదున్నర నిమిషాల వీడియోక్లిప్‌ను ప్రభుత్వం యూట్యూబ్‌లో ఉంచింది. దీన్ని హిందీలో చిత్రీకరించారు. 'స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ - మంత్రా ఆఫ్ న్యూ గవర్నెన్స్' పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.
 జూన్ - 28
¤  అత్యంత పటిష్టమైన బందోబస్తు మధ్య వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయింది. హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్‌లో దాదాపు 3,800 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరేందుకు బల్‌తల్ బేస్‌క్యాంప్ వద్ద యాత్రకు శ్రీకారం చుట్టారు.   »     అమర్‌నాథ్ జీ దేవస్థాన మండలి ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా పవిత్ర గుహ వద్ద తొలిపూజలు నిర్వహించి 44 రోజుల యాత్రను ప్రారంభించారు.¤  అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా రూపొందించిన తాజా మ్యాప్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్ర పటాల్లో చూపినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారిపోదని, అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొంది.¤  ఒకరి సాయం లేకుండా దేశ వ్యాప్తంగా 16 పట్టణాల్లో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ యాప్‌ను కేంద్ర పర్యటకశాఖ విడుదల చేసింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించింది. దీనికి 'ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్' అని పేరు పెట్టింది. 
 జూన్ - 29
¤  ఒడిశాలోని దివ్యక్షేత్రం పూరీలో విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా సాగింది. స భక్త జనఘోష మధ్య జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో తల్లి గుండిచా ఆలయం వద్దకు చేరాడు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు భక్తుల జయధ్వానాల మధ్య ముందుకు సాగాయి.    »     బొడొదండొ శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి మూడు కి.మీ. దూరంలోని గుండిచా ఆలయానికి రథాలు చేరుకున్నాయి.   »     శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి తొలి పూజ చేయాల్సి ఉండగా, ఆయన రథయాత్రను బహిష్కరించారు.    »     ఒడిశా గవర్నర్ ఎస్.సి.జమీద్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు.¤  తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కర్ణాటక ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.   »     బెంగళూరులోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్.వాఘేలా రోశయ్యతో ప్రమాణం చేయించారు.    »     కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రోశయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
 జూన్ - 30
¤  2002లో గోద్రా అల్లర్ల అనంతర పరిణామాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ నానావతి కమిషన్‌కు గుజరాత్ ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్‌కు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.   »     ఈ విధంగా కమిషన్ గడువును పెంచడం ఇది 22వ సారి.¤  పంటల బీమా పథకం ప్రీమియంలో ప్రభుత్వ వాటాను పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 5 శాతం ఉండగా కేంద్రం 25 శాతం చెల్లించాలని నిర్ణయించింది. రాష్ట్రాల వాటా 25 శాతం కాబోతుంది. అంటే ప్రభుత్వాల వాటా 50 శాతం అవుతుంది. రైతులు మరో 50 శాతం భరించాలి.¤  యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన మరో గవర్నర్ రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్ రాజీనామా చేశారు.