సెప్టెంబరు - 2014 వార్తల్లో ప్రదేశాలు


సెప్టెంబరు - 1
¤ సాయుధ వాహనాల పరీక్షల్లో భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలుగా దేశంలోనే తొలి బాలిస్టిక్ పరిశోధన కేంద్రాన్ని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం (జీఎఫ్ఎస్‌యు)లో ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ డైరెక్టర్ జనరల్ జె.ఎం.వ్యాస్ తెలిపారు.
   »    ఇది ఆసియాలోనే తొలి బాలిస్టిక్ పరిశోధన కేంద్రం.
సెప్టెంబరు - 3
¤  అరుదైన పగడపు జాతులను పరిరక్షించే వనాన్ని గుజరాత్‌లోని దేవభూమి - ద్వారకా జిల్లాలో ఉన్న మిథాపూర్ తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు.   »    దీన్ని మిథాపూర్ కోరల్ గార్డెన్‌గా పేర్కొంటారు. సముద్రపు నీటి సరస్సులను ఏర్పాటు చేసి అందులో వివిధ పగడపు జాతులను పెంచుతారు. ఒక్కో సరస్సును ఒక్కో రకానికి కేటాయిస్తారు. కచ్ జలసంధిలో పెరిగే అన్ని రకాల పగడపు జాతులను ఇక్కడ చూడవచ్చు.¤  ప్రపంచంలోనే పొడవైన భారీ రైలు సొరంగ మార్గాన్ని స్విట్జర్లాండ్‌లోని ఆమ్‌స్టెగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 57 కి.మీ. పొడవుతో రెండు సమాంతర ట్రాక్‌లను ఇందులో నిర్మిస్తున్నారు. 2016 చివర్లో ఇది ప్రారంభం కానుంది.
సెప్టెంబరు - 6 
¤  పసిఫిక్ మహా సముద్రం అడుగున ఉన్న ఓ భారీ అగ్నిపర్వతాన్ని అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మల్టీబీమ్ ఎకో సౌండ్ టెక్నాలజీని ఉపయోగించి కనుక్కున్నారు. దీని వయసు పది కోట్ల సంవత్సరాలు. ప్రస్తుతం క్షీణ దశలో ఉంది.   »    ఈ అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రంలో 5,100 మీటర్ల లోతులో ఉంది. ఇది సముద్రం అడుగు నుంచి 1,100 మీటర్ల ఎత్తు ఉంది. జనావాసంలేని జార్విస్ ద్వీపానికి 300 కి.మీ. దూరంలో ఈ అగ్ని పర్వతం ఉంది.
సెప్టెంబరు - 8
¤  ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న నికరాగ్వా రాజధాని మనాగ్వాలో భారీ ఉల్కాపాతం సంభవించింది.   »    న్యూజిలాండ్ మీదుగా 40వేల కి.మీ. సమీపం నుంచి భూమిని దాటి వెళ్లిన '2014 ఆర్‌సీ' గ్రహ శకలం ముక్క మనాగ్వాలో పడి ఉంటుందని నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
సెప్టెంబరు - 18
¤  మాతృదేశం కోసం త్యాగాలు చేసిన వీరసైనికుల జ్ఞాపకార్థం పోర్ట్‌బ్లెయిర్‌లోని మెరీనా పార్క్ వద్ద నిర్మించిన ఒక స్మారక చిహ్నాన్ని అండమాన్ - నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎ.కె.సింగ్ జాతికి అంకితం చేశారు.
సెప్టెంబరు - 21
¤  ఆసియాలో అత్యంత ఆదరణ పొందిన, బసచేయడానికి అనువుగా పరిగణిస్తున్న పది పర్యాటక కేంద్రాల్లో ఆగ్రా, అహ్మదాబాద్, కొచ్చి, పనాజీలు చోటు పొందాయి.   »    ఈ జాబితాలో చైనాలోని జుహాయి నగరం ప్రథమ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా(2), అహ్మదాబాద్(3) నిలిచాయి. కొచ్చి, పనాజీలు వరుసగా ఏడు, ఎనిమిది స్థానాలు పొందాయి.   »    వివిధ ప్రాంతాల్లో హోటళ్ల వివరాలు, విడిది వసతులకు సంబంధించిన ఆన్‌లైన్ సైట్ 'ట్రివాగో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
సెప్టెంబరు - 26 
¤  అంతర్జాతీయ ప్రమాణాలతో మేనేజ్‌మెంట్ విద్యను బోధించడానికి హైదరాబాద్‌లో ప్రముఖ బిజినెస్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది.   »    ఇప్పటికే ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ఉండగా, తాజాగా కెనడా 'గ్లోబల్ బిజినెస్ స్కూల్‌'గా అంతర్జాతీయంగా పేరున్న "స్కూలచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్" హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తన ప్రాంగణాన్ని ప్రారంభించింది.   »    ఈ విద్యా సంస్థను తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించారు.¤  లడఖ్ వద్ద సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత సడలింది. లడఖ్ వద్ద షుమర్ ప్రాంతం నుంచి చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది.   »    లడఖ్ వద్ద నుంచి 750 పీఎల్ఏ దళాల ఉపసంహరణ మొదలైందని, ఉభయుల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉన్న తనిఖీ ఠాణాలను తొలగించేందుకు భారత్ సమ్మతించింది. చైనా కూడా అక్కడ నిర్మిస్తున్న రోడ్డు పనులను నిలిపివేయడానికి అంగీకరించింది.