మార్చి - 2014 ఆర్థికరంగం


మార్చి - 1
¤  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పన్ను వసూళ్లు 10% పెరిగాయి. ఏప్రిల్ నుంచి జనవరి వరకు పన్నుల రూపంలో ప్రభుత్వం రూ.8,21,329 కోట్లను వసూలు చేసిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది.    »   2013 - 14లో పన్ను వసూళ్ల వృద్ధి 11.8 శాతంగా ఉంటుందని సవరించిన అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పదినెలల వసూళ్లు అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఎక్సైజ్ వసూళ్లు తగ్గడమే ఇందుకు కారణం. ఇవి 5.2% క్షీణించి, రూ.1,16,593 కోట్లకు పరిమితమయ్యాయి.
మార్చి - 3
¤  2005 కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్ల చెలామణికి రిజర్వ్ బ్యాంక్ మరో 9 నెలల గడువు ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ ఈ నోట్లతో ప్రజలు క్రయవిక్రయాలు జరపొచ్చని స్పష్టం చేసింది. ప్రజలు వీటిని స్వీకరించవచ్చు, చెల్లించవచ్చని ప్రకటించింది.    »   2014 ఏప్రిల్ 1 నుంచి 2005 కు ముందు ముద్రించిన నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు జనవరి 22న రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో చెల్లించి బదులుగా కొత్త నోట్లను తీసుకోవాలని సూచించింది.¤  బాంబే హౌస్‌గా పిలుస్తున్న ముంబయిలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయానికి భారతీయ హరిత భవన మండలి (ఐజీబీసీ) నుంచి హరిత రేటింగ్ గుర్తింపు లభించింది.    »   భారత్‌లో ఐజీబీసీ నుంచి హరిత రేటింగ్‌ను పొందిన తొలి హెరిటేజ్ భవనం ఇదే కావడం విశేషం.
మార్చి - 5
¤  కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు బాగా తగ్గి, 4.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.9 శాతానికి సమానం.    »   వస్తు రూప ఎగుమతులు పుంజుకోవడంతో పాటు దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు క్షీణించి, మూడో త్రైమాసికానికి సీఏడీ తక్కువ స్థాయిలో నమోదైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.    »   దేశం లోపలకు వచ్చే విదేశీ మారక ద్రవ్యానికీ, దేశం బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యానికీ మధ్య తేడానే సీఏడీగా వ్యవహరిస్తారు. ఇది గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 31.9 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6.5%) గా ఉంది.
మార్చి - 10
¤  వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇండియా రేటింగ్స్ స్థిర దృక్పథాన్ని కొనసాగించింది. రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేవు. రాష్ట్రాల మొత్తం లోట్లు పెరిగాయి. అయినా, స్థిరపడిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అలానే కొనసాగగలవని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. రేటింగ్ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాల గ్యారెంటెడ్ రుణ కార్యక్రమాలపై కూడా స్థిర దృక్పథాన్ని వ్యక్తం చేసింది.    »   విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్యారెంటెడ్ రుణ కార్యక్రమాన్ని 'రేటింగ్ వాచ్‌'లో ఉంచినట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది.    »   2013-14కు రాష్ట్రాల మొత్తం ద్రవ్యలోటు 2.3 శాతానికి చేరగలదని పేర్కొంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 2.2% ఉండగలదని భావించారు.
మార్చి - 11
¤  ఫిబ్రవరి నెలకు భారత ఎగుమతులు 3.67% క్షీణించాయి. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 3.67% తగ్గి, 2,568 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.    »   ఎగుమతులు తగ్గినా, పసిడి దిగుమతులు భారీగా పడిపోవడంతో ఫిబ్రవరికి వాణిజ్యలోటు 813 కోట్ల డాలర్లుగానే నమోదైంది. ఇది గత అయిదు నెలల్లో కనిష్ఠ స్థాయి.    »   ఫిబ్రవరి నెలకు ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా తగ్గాయి. దిగుమతులు 17.09% క్షీణించి, 3,381 కోట్ల డాలర్లకు చేరాయి.    »   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలలకు (ఏప్రిల్-ఫిబ్రవరి) ఎగుమతులు 4.79% శాతం పెరిగి, 28,270 కోట్ల డాలర్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో 26,985 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 8.65% తగ్గి, 44,978 కోట్ల డాలర్ల నుంచి 41,086 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 12,816 కోట్ల డాలర్లుగా నమోదైంది.
మార్చి - 12
¤  విద్యుత్ ఉత్పత్తి, గనుల రంగ ఉత్పత్తి రాణించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) స్వల్పంగా పెరిగింది. జనవరి, 2014లో 0.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఏప్రిల్ -జనవరి కాలంలో అంతకు ముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పెరిగింది ఒక శాతమే.    »   జనవరి 2013లో ఐఐపీ 2.5 శాతంగా నమోదైంది. డిసెంబరులో ఐఐపీ క్షీణతను 0.6 శాతం నుంచి 0.16 శాతానికి ప్రభుత్వం సవరించింది.    »   జనవరిలో విద్యుత్ ఉత్పత్తి 6.5 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది 6.4 శాతంగా ఉంది.    »   ఐఐపీ సూచీలో 14% వెయిటేజీ ఉండే గనుల తవ్వకం కూడా 2013 జనవరితో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో -1.8 శాతం నుంచి 0.7 శాతానికి చేరింది.    »   తయారీ రంగం మాత్రం 0.7% తగ్గింది. 2013 జనవరిలో 2.7 శాతం వృద్ధి చెందింది. 2 ఫిబ్రవరి, 2014లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.1 శాతానికి పరిమితమైంది. ఇది 25 నెలల కనిష్ఠ స్థాయి. ప్రభుత్వం విడుదల చేసిన వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) గణాంకాల ప్రకారం పానీయాలతో కూడిన ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.57 శాతానికి చేరింది. గత నెల ఇది 9.9 శాతంగా ఉంది.    » కూరగాయల ధరల్లో పెరుగుదల జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 21.91 శాతం నుంచి 14.04 శాతంగా నమోదైంది.    »   గుడ్లు, చేపలు, మాంసం లాంటి ప్రొటీను వస్తువుల ధరలు ఫిబ్రవరిలో 9.69 శాతం పెరగ్గా జనవరిలో 11.69 శాతం ప్రియమయ్యాయి.    »   తృణ ధాన్యాల ధరల్లో వేగం కిందటి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో 11.42 శాతం నుంచి 9.93 శాతానికి తగ్గింది.
 మార్చి - 13
¤  వినియోగ‌దారులు, వ్యాపారులు, వివిధ ఆర్థిక సంస్థల మ‌ధ్య ఇ-కామ‌ర్స్‌, మొబైల్ కామ‌ర్స్ లావాదేవీల చెల్లింపుల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 'ఎస్‌బీఐఈపే' సేవ‌ను ప్రవేశ‌పెట్టింది.

    »   దేశంలో ఆన్‌లైన్ యాగ్రిగేట‌ర్ స‌ర్వీసుకు శ్రీకారం చుట్టిన మొద‌టి బ్యాంకు ఎస్‌బీఐనే కావ‌డం విశేషం. 40కి పైగా బ్యాంకుల‌కు చెందిన ఇంట‌ర్నెట్‌ చెల్లింపుల‌కు వార‌ధిగా ఉండేందుకు ఆయా బ్యాంకుల‌తో 'ఎస్‌బీఐఈపే' అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. 
 మార్చి - 14
¤  ఫిబ్రవ‌రి నెల‌కు టోకు ధ‌ర‌ల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.68 శాతానికి తగ్గింది. ఇది 9 నెల‌ల క‌నిష్ఠం. 2013 మే నెల‌లో న‌మోదైన 4.58 శాతం త‌ర్వాత ఇదే అత్యల్ప స్థాయి. ఉల్లి, బంగాళ‌దుంప‌ల ధ‌ర‌లు త‌గ్గడంతో ద్రవ్యోల్బణం ప‌రిమిత‌మైంది. డిసెంబ‌రు నుంచి ధ‌రల‌ పెరుగుద‌ల రేటు త‌గ్గుముఖం ప‌ట్టింది.     »   ద్రవ్యోల్బణం త‌గ్గడంతో ఏప్రిల్ 1న‌ ప్రక‌టించ‌బోయే ప‌ర‌ప‌తి విధాన స‌మీక్షలో కీల‌క విధాన రేట్ల కోత‌ను ప‌రిశీలించేందుకు ఆర్‌బీఐకి అవ‌కాశం ఏర్పడిన‌ట్లయింది. 
మార్చి - 18
పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్ఈ ఈటీఎఫ్‌)ను ప్రారంభించారు. ఈ ఫండ్ ద్వారా రూ.3000 కోట్లు స‌మీక‌రించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో ఇప్పటి వ‌ర‌కూ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా ప్రభుత్వం రూ.13,119 కోట్లు స‌మీక‌రించింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఈటీఎఫ్‌కు స్పంద‌న ల‌భిస్తే ఖ‌జానాకు మ‌రో రూ.3000 కోట్లు స‌మ‌కూరుతాయి. దీంతో స‌వ‌రించిన పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యాన్ని ప్రభుత్వం చేర‌గ‌లుగుతుంది.
    »   ఈ ఈటీఎఫ్‌ను గోల్డ్‌మ‌న్ శాక్స్ నిర్వహిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల‌లో న‌మోద‌వుతుంది.
    »   సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో 10 ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు ఉంటాయి. ఓఎన్‌జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియ‌న్ ఆయిల్‌, ఆయిల్ ఇండియా, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ త‌దిత‌ర కంపెనీల్లో వాటాదారులు కావ‌డానికి ఈ ఫండ్ వీలు క‌ల్పిస్తుంది.
    »   ఈటీఎఫ్‌ ప్రపంచ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతున్న పెట్టుబ‌డి సాధ‌నం. భార‌త్‌లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.
మార్చి - 19
¤  విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్‌ మద్దతు నిలిచిపోనున్నందున ఏటీఎం సేవలతో సహా బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని బ్యాంకులను రిజర్వు బ్యాంక్‌ హెచ్చరించింది. వేరే ఆపరేటింగ్‌ వ్యవస్థలను అమలు చేయడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల‌ని బ్యాంకుల‌కు సూచించింది.
    »   విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఏప్రిల్‌ 8 నుంచి మైక్రోసాఫ్ట్‌ మద్దతు నిలిపివేయనుంది. ఇక బగ్‌లకు ప్యాచ్‌లను, అప్‌డేట్‌లను ఇవ్వదు.
    »   ఎక్స్‌పీని మైక్రోసాఫ్ట్‌ 2001లో విడుదల చేసింది. ఇప్పటికీ ఏటీఎంలు సహా కొన్ని వ్యవస్థలు విండోస్‌ ఎక్స్‌పీపై పని చేస్తున్నాయి.
మార్చి - 20
¤  ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ కె.సి.చక్రవర్తి ఇంకా మూడు నెలలు మిగిలి ఉండ‌గానే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను 2009 జూన్‌లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మరో రెండేళ్లు పొడిగించడంతో 2014 జూన్‌ 15తో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల గడువు కంటే ముందే ఏప్రిల్‌ 25 కల్లా తనను బాధ్యతల నుంచి విముక్తి కల్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు.     »   ప్రస్తుతం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ఛైర్మన్‌గానే కాకుండా కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ బ్యాంకింగ్‌ అడ్వయిజరీ కమిటీ అధిపతిగా కూడా ఆయన ఉన్నారు. ఆర్‌బీఐకి రాక ముందు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకుకు సీఎండీగా పనిచేశారు.     »   జూన్‌తో చక్రవర్తి పదవీ కాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. ఈ పదవీ కోసం అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకర్లను ఇంటర్వ్యూకు పిలిచింది.
 మార్చి - 21
¤  'ద టాప్‌ ఎంప్లాయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌' వరుసగా రెండో ఏడాది కూడా ఐరోపాలో అగ్రగామి ఉపాధి కల్పన సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)ను ఎంపిక చేసింది.
    »   మానవ వనరులకు సంబంధించి ప్రాథమిక స్థితిగతులు, ప్రయోజనాలు, శిక్షణ, కెరీర్‌ అభివృద్ధి, కంపెనీ సంస్కృతి లాంటి ఆరు విభాగాల్లో అసామాన్య పనితీరును కనబరిచినట్లు టీసీఎస్‌ గుర్తింపు పొందింది.    »   ద టాప్‌ ఎంప్లాయిర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక స్వతంత్ర సంస్థ. అంతకు మందు దీన్ని సీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా మానవ వనరుల విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబర్చిన సంస్థలను ఇది ఎంపిక చేస్తుంది. ఈ సంస్థ స్వతంత్రంగా చేసిన పరిశోధనతో పాటు 'గ్రాంట్‌ థోర్న్‌టన్‌' పరిశీలన ఆధారంగా ఉత్తమ సంస్థ ఎంపిక పూర్తవుతుంది. 
 మార్చి - 24
¤  బ్యాంకులో ఖాతా లేన‌ప్పటికీ త‌మ ఏటీఎమ్‌ల‌ నుంచి డ‌బ్బు విత్ డ్రా చేసుకునే కొత్త సేవ‌ల‌ను ప్రభుత్వరంగ బ్యాంకు అయిన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)' ప్రారంభించింది. దీనికోసం కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల‌ను ఇన్‌స్టంట్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ (ఐఎమ్‌టీ) స‌దుపాయంతో అనుసంధానిస్తారు.

    »   దేశీయంగా ప్రవేశ‌పెట్టిన ఈ త‌ర‌హా సేవ వినియోగ‌దారుడికి చెందిన డ‌బ్బును దాన్ని అందుకునే వ్యక్తికి (రిసీవ‌ర్‌) పంప‌డానికి మాత్రమే అనుమ‌తిస్తుంది.    »   డ‌బ్బు అందుకునే వ్యక్తి మొబైల్ నంబ‌రు ద్వారా బ్యాంకు ఏటీఎమ్ లేదా రిటైల్ ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ స‌దుపాయం నుంచి డ‌బ్బు పొంద‌వ‌చ్చు.    »   ప్రత్యేకించిన బీఓఐ ఏటీఎమ్‌ల‌లో నుంచి డెబిట్ కార్డును ఉప‌యోగించ‌కుండానే రిసీవ‌ర్ డ‌బ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్ గురించిన పాక్షిక వివ‌రాలు రిసీవ‌ర్‌కు మొబైల్ ఫోన్‌లో తెలుస్తాయి. డ‌బ్బును పంపించే వ్యక్తి వ‌ద్ద నుంచి ఐఎమ్‌టీ రుసుం కింద ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.25 వ‌సూలు చేస్తారు.
 మార్చి - 26
¤  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పదకొండు నెలలకు పరోక్ష పన్ను వసూళ్లు 5.6% పెరిగి రూ.4,41,826 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు రూ.4,18,286 కోట్లుగా నమోదయ్యాయి.     »   తయారీ రంగ స్తబ్దతకు అద్దం పడుతూ ఎక్సైజ్‌ పన్ను వసూళ్లు 3.8 శాతం క్షీణించి రూ.1,49,711 కోట్లకు పరిమితమయ్యాయి.     »   ఈ మధ్య కాలంలో సేవా పన్నుపై రెవెన్యూ విభాగం బాగా దృష్టి పెట్టడంతో సేవా పన్ను వసూళ్లు 18.2 శాతం వృద్ధితో రూ.1,34,171 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - ఫిబ్రవరిలో రూ.1,13,505 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. సమీక్ష కాలానికి రూ.1,49,211 కోట్ల కస్టమ్స్‌ పన్నులను వసూలు చేసినట్లు సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.     »   గత నెలలో ఎక్సైజ్‌, కస్టమ్స్‌, సేవా పన్నుల మొత్తం వసూళ్లు 5 శాతం పెరిగి రూ.41,174 కోట్ల నుంచి రూ.43,794 కోట్లకు చేరాయి. సేవా పన్నుల వసూళ్లు 15.4 శాతం వృద్ధితో రూ.12,181 కోట్లుగా నమోదు కాగా కస్టమ్స్‌ పన్నులు రూ.15,109 కోట్లు, ఎక్సైజ్‌ పన్నులు రూ.16,054 చొప్పున వసూలయ్యాయి.¤  కాలిఫోర్నియాకు చెందిన సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' వ‌ర్చువ‌ల్ రియాలిటీ హెడ్ మౌంటెడ్ గేమింగ్ డిస్‌ప్లేల‌ను అందించే 'ఒకుల‌స్' కంపెనీని 2 బిలియ‌న్ డాల‌ర్లకు (రూ.12,000 కోట్లు) కొనుగోలు చేసింది. దీంతో గేమింగ్‌పైనా ప‌ట్టు చేజిక్కుంచుకోవ‌డంతో పాటు క‌మ్యూనికేష‌న్స్‌, మీడియా, వినోదం త‌దిత‌ర కొత్త విభాగాల్లోనూ ఫేస్‌బుక్ బ‌లోపేతం కానుంది. ఇటీవ‌ల‌ 'వాట్స్‌యాప్‌'ను 19 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1,17,800 కోట్లు)తో ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది.
మార్చి - 27
¤  బాసెల్‌ - III నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకులకు ఇచ్చిన గడువును రిజ‌ర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో ఏడాది పొడిగించింది. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు, లాభదాయకతలను పరిగణనలోకి తీసుకుని ఈ నిబంధనల అమలు గడువును 2019, మార్చి వరకూ పెంచుతున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.     »   గతంలో నిర్ణయించిన ప్రకారం 2018, మార్చి నాటికి బ్యాంకులు పూర్తి స్థాయిలో బాసెల్‌ - III నిబంధనలను అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగానే గడువును పెంచినట్లు రిజర్వు బ్యాంకు వివరించింది.¤  రైతుల కోసం యాక్సిస్‌ బ్యాంకు 'కిసాన్‌ కార్డు'ను ప్రవేశపెట్టింది. ఈ కార్డుతో ఏటీఎం నుంచి ఒక రోజులో రూ.లక్ష వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్‌ క్రెడిట్‌ క్రాప్‌ రుణ ఖాతాలు ప్రారంభించే వ్యవసాయ ఖాతాదారులకు ఈ కార్డులను ఇవ్వనున్నట్లు పేర్కొంది.
    »   ప్రస్తుతం బ్యాంకుకున్న ఇలాంటి ఖాతాదారుల్లో 90-95% మంది శాఖలకు వచ్చి లావాదేవీలు నిర్వహిస్తున్నారని, ఇకపై 30-40 మంది రైతులు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించుకోగలరని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, రిటైల్‌ బ్యాంకింగ్‌ అధిపతి ఆర్‌.కె.బమ్మి తెలిపారు.
మార్చి - 28
¤ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త అధ్యక్షుడిగా డీసీఎమ్‌ శ్రీరామ్‌ ఛైర్మన్‌, సీనియర్‌ ఎండీ అజయ్‌ శ్రీరామ్‌ ఎన్నికయ్యారు. ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ క్రిస్‌ గోపాలకృష్ణన్‌ స్థానంలో ఈయన బాధ్యతలు చేపడతారు.

    »    శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ పాలనా విభాగానికి ఛైర్మన్‌గానూ; ఎస్‌ఓఎస్‌ చిల్డ్రన్‌ విలేజెస్‌ ఆఫ్‌ ఇండియాకు ట్రస్టీగానూ ఈయన ఉన్నారు. రూ.5700 కోట్ల టర్నోవరు గల డీసీఎమ్‌ శ్రీరామ్‌ గ్రూపు వ్యవసాయ, క్లోరో వినైల్‌, విలువ జోడించిన వ్యాపారాల్లో సేవలందిస్తోంది    »   టీఐఎల్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ సుమిత్‌ మజుందార్‌ 2014 -15కు సీఐఐ గౌరవ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.    »    సీఐఐ ఉపాధ్యక్షుడిగా నౌషద్‌ ఫోర్బ్స్‌ ఎన్నికయ్యారు.
మార్చి - 30
¤ కష్టాల్లో చిక్కిన 'ఏబీజీ షిప్‌యార్డు'కు ఊర‌ట లభించింది. రూ.11,000 కోట్ల కార్పొరేట్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్‌) ప్రతిపాదనకు 22 బ్యాంకుల కూటమి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో రూ.1,800 కోట్ల తాజా నిర్వహణ మూలధన రుణం కూడా కలిసి ఉంటుంది.    »   భారత బ్యాంకింగ్‌ రంగ చరిత్రలోనే ఇది రెండో అతి పెద్ద సీడీఆర్‌ ప్యాకేజీ. గత ఏడాది జులైలో ఇంజినీరింగ్‌, నిర్మాణ కంపెనీ 'గామన్‌ ఇండియా'కు రూ.13,500 కోట్ల విలువైన రుణ చెల్లింపు గడువును పదేళ్ల పాటు తక్కువ వడ్డీ రేటుతో పొడిగించడమే ఇంతవరకు అతి పెద్ద సీడీఆర్‌ ప్యాకేజీ.