ఫిబ్రవరి - 2014 ఆర్థికరంగం


ఫిబ్రవరి - 6
¤  గతేడాది డిసెంబరు 31 నాటికి ఎయిరిండియా అప్పులు రూ.26,033 కోట్లని, నిర్వహణా రుణాలు రూ.21,125 కోట్లకు పైగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి అజిత్‌సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.¤  బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ భారత్‌లోని తన కంపెనీ వొడాఫోన్ ఇండియాకు చెందిన మైనారిటీ షేర్ హోల్డర్ల వాటాలను రూ.10,141 కోట్లకు కొనుగోలు చేస్తానంటూ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.   »    ప్రస్తుతం వొడాఫోన్ ఇండియాలో వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కి చెందిన మారిషెస్ అనుబంధ కంపెనీ సీజీపీ ఇండియాకు 64.38% వాటా ఉంది. ఈ వాటాను 100 శాతానికి పెంచుకునేందుకు ఆ కంపెనీ గతంలోనే ముందుకొచ్చింది. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదన (ఎఫ్‌డీఐ)ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) గత ఏడాది డిసెంబరు 30న ఆమోదించింది. అయితే ఇది రూ.1,200 కోట్లకు మించిన ప్రతిపాదన కావడంతో దీన్ని మంత్రి వర్గ పరిశీలనకు నివేదించారు.
ఫిబ్రవరి - 8
¤  భూతలంపై పర్యవేక్షణ - నిఘా అవసరాల నిమిత్తం అనువైన రాడార్ సిస్టమ్స్ విభాగంలో కలిసి పనిచేసేందుకు హైదరాబాద్‌లోని  ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
   »    దీనివల్ల సైన్యం, పోలీసు విభాగాలు, ప్రత్యేక భద్రతా కార్యకలాపాలు సాగించే విభాగాలకు అనువైన అధునాతన ఉపకరణాలను అందించే అవకాశం ఏర్పడుతుంది.
ఫిబ్రవరి - 11
¤  ఇంధనాన్ని రిటైల్‌గా విక్రయించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఇతర సంస్థలకు గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి రూ.10,000 కోట్ల నగదు సబ్సిడీని కేంద్ర ఆర్థికశాఖ మంజూరు చేసింది.   »    రూ.26,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరగా ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.10,000 కోట్లు మంజూరు చేసింది.   »    ఇందులో ఐఓసీకి రూ.5,172.87 కోట్లు, బీపీసీఎల్‌కు రూ.2,499.39 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.2,327.47 కోట్లు లభిస్తాయి.¤  2014 జనవరి నెలకు భారత ఎగుమతులు కేవలం 3.79% మాత్రమే పెరిగి 2,670 కోట్ల డాలర్లకు చేరాయి. అయితే దిగుమతులు క్షీణించడం, ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు తగ్గడం ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది.   »    విలువైన లోహాల దిగుమతులు గణనీయంగా తగ్గడంతో వాణిజ్యలోటు భారీగా తగ్గి, జనవరి నెలకు 992 కోట్ల డాలర్లకు పరిమితమైంది.   »    2013 జనవరిలో వాణిజ్య లోటు 1,890 కోట్ల డాలర్లు. దీంతో పోలిస్తే వాణిజ్య లోటు దాదాపు సగానికి తగ్గినట్లే.   »    2014 జనవరి నెలకు పెట్రోలియం, విలువైన రాళ్లు, నగల ఎగుమతులు వరుసగా 13.1%, 9.39% చొప్పున తగ్గాయి. జనవరి నెలకు దిగుమతులు 18.07% తగ్గాయి. వీటి విలువ 3,662 కోట్ల డాలర్లుగా నమోదయింది.   »    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలలకు ఎగుమతులు 5.71% పెరిగి, 25,700 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు 7.81% క్షీణించి, 37,700 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 12,000 కోట్ల డాలర్లుగా నమోదయింది.
ఫిబ్రవరి - 12
¤  మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు
   »    వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15) తొలి నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఛార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. అలాగే వాటిని తగ్గించే ప్రయత్నమూ చేయలేదు.

   »    సరకు రవాణా ఛార్జీలు కూడా యథాతథం.   »    ప్రతిపాదిత రైల్వే వార్షిక ప్రణాళిక మొత్తం రూ.64,305 కోట్లు. ఇందుకోసం సాధారణ బడ్జెట్ నుంచి రూ.30,225 కోట్లు కేటాయింపు.   »    స్థూల రవాణా ఆదాయ లక్ష్యం రూ.1,60,775 కోట్లు. ప్రయాణికుల ఛార్జీల ద్వారా రూ.45,255 కోట్లు, వస్తు రవాణా ద్వారా రూ.1,05,770 కోట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం రూ.9,700 కోట్లు.   »    వ్యయం రూ.1,10,649 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే రూ.13,589 కోట్లు అదనం.   »    రవాణా సేవల ద్వారా ఆదాయ లక్ష్యం రూ.94 వేల కోట్లు. లోడింగ్ లక్ష్యం 1,052 మిలియన్ టన్నులకు పెంపు.   »    కొత్తగా 17 ఉత్తమశ్రేణి (ప్రీమియం) రైళ్లు, 38 ఎక్స్‌ప్రెస్, 5 పాసింజర్ రైళ్లు.   »    రైలు ఛార్జీలను హేతుబద్ధీకరించేందుకు స్వతంత్రంగా పనిచేసే రైల్వే టారిఫ్ అథారిటీ (ఆర్టీఏ)ను నెలకొల్పనున్నారు.   »    మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా రైలు మార్గాల ఏర్పాటు.   »    జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి సమీపంలోని కట్రాకు త్వరలో రైళ్ల రాక పోకలు ప్రారంభం.   »    తరువాతి స్టేషన్ ఏమిటో, అక్కడికి రైలు ఏ సమయానికి చేరుకుంటుందో ప్రయాణిస్తున్న రైల్లోనే ప్రదర్శన.   »    నిరీక్షణ జాబితా ప్రయాణికులకు టికెట్ కన్‌ఫర్మ్ అయితే వారి మొబైల్ ఫోన్‌కు దానంతటదే సంక్షిప్త సందేశం వచ్చే ఏర్పాటు.   »    మరిన్ని జనాహార్ కేంద్రాలు, ఎస్కలేటర్లు.   »    రైళ్లు ఢీకొనడాన్ని నివారించేందుకు దేశీయంగా రూపొందించిన కొలిజన్ అవాయిడెన్స్ వ్యవస్థను, డ్రైవర్ల అప్రమత్తతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రైళ్లలో విజిలెన్స్ కంట్రోల్ పరికరాల ఏర్పాటు.   »    కోచ్ లోపలి భాగాల్లో మంటల వ్యాప్తిని నిరోధించే సామగ్రి వినియోగం. విద్యుత్ సర్క్యూట్ల భద్రత కోసం మల్టీ టైర్ భద్రత. ఏసీ కోచ్‌లలో పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్లను అందుబాటులో ఉంచుతారు.   »    ప్యాంట్రీల్లో ఎల్పీజీ సిలిండర్ల బదులు ఎలక్ట్రిక్ వంట పరికరాలు.   »    రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రకటించగా, ఆ రెండూ రాష్ట్రానికే కేటాయించడం గమనార్హం. కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి మార్గంలో ఒకటి, కాచిగూడ నుంచి గుంటూరుకు మరొకటి మంజూరు చేశారు.   »    రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే కర్ణాటకలోని గుల్బర్గా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   »    రైల్వేశాఖ సహాయ మంత్రులు: కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి, అధిర్ రంజన్ చౌధురి.
ఫిబ్రవరి - 17
¤  2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు   »    వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.   »    ప్రణాళికా వ్యయం రూ.5,55,322 లక్షల కోట్లు.   »    ప్రణాళికేతర వ్యయం రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ.2,46,397 కోట్లు.   »    ఆదాయపు పన్ను, ఇతరత్రా ప్రత్యక్ష పన్ను రేట్లలో మార్పులేదు. పరోక్ష పన్ను రేట్లు మారాయి.   »    చిన్నకార్లు, మోటార్ సైకిళ్లు, వాణిజ్య వాహనాలపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 8 శాతానికి తగ్గింపు.   »    స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)పై ఎక్సైజ్ సుంకం 30 నుంచి 24 శాతానికి తగ్గింపు. పెద్ద, మధ్యతరహా కార్లపై సుంకం 27-24 నుంచి 24-20 శాతానికి తగ్గింపు.   »    మొబైల్ హ్యాండ్‌సెట్లపై ఎక్సైజ్ సుంకం 'సెన్‌వ్యాట్ క్రెడిట్‌పై 6 శాతంగా ఉంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.   »    రూ.కోటి పైగా వార్షికాదాయం ఉన్న అత్యంత ధనవంతులపై 10% సర్‌ఛార్జ్ కొనసాగుతుంది.   »    రూ.10 కోట్ల ఆదాయం ఉన్న దేశీయ కార్పొరేట్లపై 10% సర్‌ఛార్జ్.   »    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.6%. 2014-15లో ఇది 4.1% గా ఉంటుంది. 2013-14లో రెవెన్యూ లోటు 3%.   »    2009 మార్చి 31 కంటే ముందు తీసుకున్న విద్యార్థి రుణాల వడ్డీపై మారటోరియం. దీంతో రూ.2,600 కోట్ల వడ్డీ మాఫీ అవుతుంది. దీని వల్ల 9 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.   »    నిర్భయ నిధికి మరో రూ.1,000 కోట్ల కేటాయింపు.   »    2.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులకు రూ.3,370 కోట్ల నగదు బదిలీ.   »    సోలార్ మిషన్‌కు రూ.100 కోట్ల కార్పస్.   »    ప్రణాళికా వ్యయంలో విద్యారంగం వాటా 9% పెరిగింది. ఈ రంగానికి రూ.67,398 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో పాఠశాల విద్య వాటా రూ.51,198 కోట్లు. ఉన్నత విద్య వాటా రూ.16,200 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.61,857 కోట్లతో పోలిస్తే ఇది 8.96% ఎక్కువ.   »    వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.8 లక్షల కోట్లకు పెంచారు. 2012-13లో రూ.2.54 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.79 లక్షల కోట్లకు పెరగనున్నాయని ఆర్థికమంత్రి ప్రకటించారు.   »    ఆహార భద్రత చట్టం అమలు నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరం సబ్సిడీలకు కేటాయింపుల్ని పెంచారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి చమురు, ఆహారం, ఎరువులపై సబ్సిడీలను రూ.2,46,397 కోట్లకు పెంచారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలును దృష్టిలో ఉంచుకుని ఆహార సబ్సిడీని భారీగా రూ.1,15,000 కోట్లకు పెంచారు. రూ.65 వేల కోట్లను చమురు సబ్సిడీలకు కేటాయించారు.   »    కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం (2014-15) ప్రవేశపెట్టింది మాత్రం మధ్యంతర బడ్జెట్. ఎక్కువ (10) సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది (8 సాధారణ, 2 మధ్యంతర).
2014-15 మధ్యంతర బడ్జెట్- ప్రధాన పథకాలకు శాఖలవారీగా కేటాయింపులు గ్రామీణాభివృద్ధి                                - రూ.82,200 కోట్లు మానవ వనరుల అభివృద్ధి               - రూ.67,398 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం            - రూ.33,725 కోట్లు మహిళా శిశు సంక్షేమం                  - రూ.21,000 కోట్లు తాగునీరు, పారిశుద్ధ్యం                    - రూ.15,260 కోట్లు ఎస్సీ ఉపప్రణాళిక                           - రూ.48,638 కోట్లు ఎస్టీ ఉపప్రణాళిక                             - రూ.30,726 కోట్లు తపాలా శాఖ ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్టుకు రూ.4,909 కోట్లు కేటాయించారు.
మధ్యంతర బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో)
ప్రగతికి పది సూత్రాలుమరో మూడు దశాబ్దాల్లో.. అంటే 2043 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు దోహదపడే 10 సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.1. ద్రవ్య పటిష్టీకరణ2016-17 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి తగ్గించాలి. ద్రవ్యలోటును ఎప్పటికీ దీనికంటే తక్కువగానే ఉంచాలి.2. విదేశీ పెట్టుబడులను ప్రోత్సాహించాలికరెంట్ అకౌంట్ లోటు మరికొన్నాళ్ల పాటు ఉంటుంది. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు వంటి విదేశీ పెట్టుబడులతోనే సమస్యను అధిగమించాలి. కాబట్టి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి.3. ధరల స్థిరీకరణ, అభివృద్ధిఅధిక వృద్ధిరేటు లక్ష్యంగా ఉన్న వర్థమాన ఆర్థిక వ్యవస్థలో ఓ మాదిరి ద్రవ్యోల్బణ రేటు ఆమోదయోగ్యమే. ద్రవ్య విధాన రూపకల్పన సమయంలో ధరల స్థిరీకరణ-వృద్ధి విషయంలో రిజర్వ్ బ్యాంక్ సమతౌల్యాన్ని సాధించాల్సి ఉంది.4. ద్రవ్య సంస్కరణలుద్రవ్య, శాసన సంస్కరణల సంఘం సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. ఇందుకు చట్టాల్లో మార్పులు అవసరంలేదు.5. మౌలిక సదుపాయాలుదేశంలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలి. కొత్త సౌకర్యాలను భారీగా కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని మరింత విస్తృతంగా వినియోగించాలి. పెట్టుబడుల సమీకరణ, దీర్ఘకాలిక నిధుల కోసం కొత్త సంస్థలను నెలకొల్పాలి.6. తయారీ రంగంప్రభుత్వం ఈ రంగంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా ఎగుమతులకు ఉద్దేశించిన తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించాలి. ఎగుమతయ్యే ఉత్పత్తులపై రాష్ట్ర, కేంద్ర పన్నులను రద్దు చేయాలి. లేదా తగ్గించాలి. వస్తువులను ఇక్కడే తయారు చేసేలా ప్రోత్సహించేందుకు కనీస ధరను రక్షణగా కల్పించాలి.7. సబ్సిడీలువనరులు పరిమితంగా, వాటిని కోరేవారు అధికంగా ఉన్నారు. ప్రభుత్వం నిజంగా సబ్సిడీలు అవసరమైన వారిని గుర్తించి, పూర్తిగా అర్హులైన వారికే ఇవ్వాలి.8. నగరీకరణప్రభుత్వం తగినంత దృష్టి సారించకపోతే దేశంలోని నగరాలు పాలించలేనివి, నివసించలేనివిగా మారే అవకాశముంది. పౌరులకు మరింత మెరుగైన పాలన అందించే విధంగా కొత్త వనరులను సృష్టించి, వినియోగించాలి.9. నైపుణ్యాల వృద్ధిమాధ్యమిక విద్య, యూనివర్సిటీ విద్య, సంపూర్ణ పారిశుద్ధ్యం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యమివ్వాలి.10. బాధ్యతలు పంచుకోవాలిప్రధాన ప్రాజెక్టుల ఆర్థిక వ్యయంలో సహేతుకమైన భాగాన్ని భరించడానికి రాష్ట్రాలు సుముఖంగా ఉండాలి. తద్వారా రక్షణ, రైల్వేలు, జాతీయ రహదారులు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించగలుగుతుంది.
ఫిబ్రవరి - 19
¤   భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లకు చేరింది. భారత్‌లో ఈ స్థాయి మొబైల్ వినియోగదారులను పొందిన తొలి, ఏకైక మొబైల్ కంపెనీగా ఎయిర్‌టెల్ రికార్డు సృష్టించింది.
   »    ఎయిర్‌టెల్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి, ఇది 20వ సంవత్సరం. మొబైల్ టెలిఫోన్ లైసెన్స్‌ను 1994 నవంబరులో పొందిన ఈ కంపెనీ మొబైల్ సేవలను 1995లో ప్రారంభించింది.
   »    రెవెన్యూ, వినియోగదారుల పరంగా చూస్తే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మొబైల్ కంపెనీగా ఎయిర్‌టెల్ గుర్తింపు పొందింది.
   »    ఈ ఏడాది జనవరి చివరినాటికి కంపెనీ మార్కెట్ వాటా 28 శాతంగా ఉంది.
ఫిబ్రవరి - 20
¤   గ్లాక్సో స్మిత్ క్లెయిమ్ (జీఎస్‌కే) భారత అనుబంధ సంస్థలో అదనంగా 24.33% వాటాను సొంతం చేసుకోవడానికి గ్లాక్సో స్మిత్ క్లెయిమ్ సింగపూర్ కంపెనీ చేసిన రూ.6,400 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఆమోదంవల్ల దేశంలోకి దాదాపు రూ.6,390 కోట్ల విదేశీ నిధులు రానున్నాయి.
   »     ప్రిజమ్ పేమెంట్ సర్వీసెస్‌ను హస్తగతం చేసుకోవడానికి జపాన్ కంపెనీ హిటాచీ చేసిన ప్రతిపాదనకు కూడా ప్రభుత్వ ఆమోదం లభించింది. ప్రిజమ్ పేమెంట్‌లో 100% వాటాను హిటాచీ సొంతం చేసుకోనుంది. దీని ద్వారా రూ.1,540 కోట్ల విదేశీ నిధులు భారత్‌కు దక్కుతాయి.
ఫిబ్రవరి - 28
¤ ప్రభుత్వ రంగ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భెల్ లలో వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,300 కోట్లకు పైగా సమీకరించాలని నిర్ణయించింది.   » ఆర్థికమంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని సాధికారిక మంత్రుల బృందం (ఈజీఓఎం) ఐఓసీలో 10%, భెల్‌లో 5% వాటా అమ్మకానికి అనుమతించింది.
¤ బొగ్గు, పెట్రోలియం శుద్ధి ఉత్పత్తులు, సహజ వాయువు ఉత్పత్తులు క్షీణించడంతో జనవరిలో కీలక ఎనిమిది రంగాల పరిశ్రమల వృద్ధి 1.6 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఇది 8.3 శాతంగా ఉండటం విశేషం. గతేడాది డిసెంబరులోనూ 2.1 శాతంగా వృద్ధి నమోదైంది.
   » ఎరువులు, సిమెంటు, ఉక్కు, విద్యుత్, ముడిచమురు, బొగ్గు, పెట్రోలియం శుద్ధి ఉత్పత్తులు, సహజ వాయువు తదితర ఎనిమిది రంగాలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 38% వాటాను కలిగి ఉన్నాయి.   » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరిలో మౌలిక రంగ అభివృద్ధి 2.4 శాతంగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వృద్ధి 6.9 శాతంగా ఉంది.¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ 4.7 శాతానికి చేరింది. వ్యవసాయ సేవల రంగాలు రాణించడం ఇందుకు కారణం.