| ¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ప్రగతిశీల పాడి రైతుల సంఘం, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సంయుక్త భాగస్వామ్యంతో డెయిరీ షో - 2014ను హైదరాబాద్‌లో నిర్వహించారు. » రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తోట నరసింహం ఈ ప్రదర్శనను ప్రారంభించారు. |
» రాష్ట్రంలో దాదాపు 76 లక్షల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమ రంగంలో స్థిరమైన ఆదాయం పొందుతున్నట్లు మంత్రి వెల్లడించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి మొదటి స్థానం, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో మూడో స్థానం దక్కినట్లు మంత్రి వెల్లడించారు. ¤ 2014 సంవత్సరానికి హజ్ యాత్రికుల దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అహ్మదుల్లా పాల్గొన్నారు. దరఖాస్తులను సమర్పించేందుకు ఆఖరితేదీ మార్చి 15 గా నిర్ణయించారు. |
ఫిబ్రవరి - 3
|
| ¤ రాష్ట్ర విద్యుత్ సంరక్షణ సంఘం (స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్)కు సహకార సంస్థ (సొసైటీ) హోదా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » స్వయం ప్రతిపత్తితో పాటు సంఘానికి విస్తృతాధికారాలను కల్పిస్తూ ఏటా రూ.పది కోట్ల నిధుల కేటాయింపునకు అనుమతించింది. ఏపీ ట్రాన్స్‌కో రూ.రెండు కోట్లు, జెన్‌కో రూ.4 కోట్లు, నాలుగు డిస్కంల నుంచి రూ.కోటి చొప్పున నిధులను ఏటా దీనికి అందజేస్తారు. » రాష్ట్ర ఇంధన సంరక్షణ సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి వ్యవహరిస్తున్నారు. |
ఫిబ్రవరి - 5
|
| ¤ జైళ్లశాఖకు ప్రత్యేక జెండాను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఉత్సవ ఊరేగింపులు, డ్యూటీ మీట్‌లో నిర్వహించబోయే ఈవెంట్స్‌లో ప్రదర్శించేందుకు వీలుగా జెండా ఏర్పాటు చేయాల్సిందిగా జైళ్లశాఖ కోరగా, ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జెండాలో పైభాగం (లంబకోణం) ఎరుపురంగులో, కిందిభాగం (లంబకోణం) నీలం రంగులో ఉండి, మధ్యలో జైళ్లశాఖ చిహ్నం ఉంటుంది.¤ భారీ వర్షాలు, వరదల్లో పక్కా ఇళ్లు కోల్పోతే రూ.70 వేల ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో కేంద్ర ఉత్తర్వుల మేరకు ఈ పెంపుదల మార్చి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. » పలు అంశాల్లో కేంద్రం ప్రతిపాదించిన పరిహారంతో పోలిస్తే రాష్ట్రం ఇచ్చే సహాయమే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అంశాల వారీగా పరిహారాన్ని పేర్కొంటూ, ఒకవేళ కేంద్రం కంటే రాష్ట్రమే ఎక్కువ సహాయం అందిస్తుంటే అదే అమల్లో ఉంటుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. » తాజా మార్గదర్శకాలు ఏడాదిపాటు అమల్లో ఉంటాయి. |
ఫిబ్రవరి - 6
|
| ¤ శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో ఆదిత్యుని జన్మదిన వేడుకలు (రథసప్తమి ఉత్సవాలు) వైభవంగా జరిగాయి. |
ఫిబ్రవరి - 7
|
| ¤ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. » ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపించిన పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర కేబినెట్ పలు సవరణలను చేసింది. మొత్తం 32 సవరణలకు ఆమోదముద్ర వేసింది. » గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రతిపాదనను కేంద్ర కేబినేట్ అంగీకరించలేదు. ఉమ్మడి రాజధానిని రెండు మూడేళ్లకే పరిమితం చేయాలనే సవరణను తిరస్కరించింది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానినే ఖరారు చేసింది. » పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లోని 37 గ్రామాలను, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంద్రకు ఇవ్వాలని నిర్ణయించారు. భద్రాచలం ఆలయ పట్టణం, పరిసరాలను తెలంగాణలో కలుపుతారు. » రాయలసీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక సాయాలు, ప్రోత్సాహకాల అంశాన్ని 14వ ఆర్థిక సంఘానికి అప్పగించనున్నారు. » విజయవాడ-గుంటూరు-తెనాలి ప్రాంతాలను మెట్రో నగరంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి, ఏడాదిలోగా నివేదికను అందించాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్‌లో చివరి అంశంగా దీన్ని చేర్చింది. » రాజధాని ఎంపిక కమిటీకి సిఫార్సులు చేయడానికి గతంలో 45 రోజుల సమయం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఆర్నెల్లకు పెంచారు. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. » హైదరాబాద్ ఆదాయ పంపిణీకి కేంద్ర మంత్రివర్గం అంగీకరించలేదు » రాష్ట్ర శాసనసభ, మండళ్లలో చర్చ తర్వాత వేలాది సవరణల ప్రతిపాదనలతో వచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును యథాతథంగా రాష్ట్రపతికి పంపాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.¤ మీసేవ కార్యాలయానికి లేదా కేంద్రాలకు వెళ్లకుండా ప్రభుత్వ సేవలను ఇక నుంచి ఇంట్లోనుంచే ఆన్‌లైన్‌లో పొందవచ్చు. » ఇందుకోసం రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా మీసేవ ఆన్‌లైన్ పోర్టల్online.meeseva.gov.in ను ప్రారంభించింది. |
ఫిబ్రవరి - 10
|
 | ¤ రాష్ట్ర శాసనసభలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనమండలిలో సభా నాయకుడు సి.రామచంద్రయ్య 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. » మొత్తం రూ.1,83,129 కోట్ల బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం కింద రూ.67,950 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,15,179 కోట్లు కేటాయించారు. |
» బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగించారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్: ఎన్నికల సమయంలో కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ప్రభుత్వ పాలన సక్రమంగా సాగేందుకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలలు లేదా ఆరు నెలల కాలానికి నిధులను ఖర్చు చేసేందుకు సభ ఆమోదాన్ని పొందుతారు. ఈ ఆమోదం తీసుకోకపోతే ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి వస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుంది. అందుకే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-206 ప్రకారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటారు. ఎన్నికల అనంతరం మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.¤ 'రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక'ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.ముఖ్యాంశాలు » 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ముందు ఏడాది కంటే ప్రస్తుత ధరల ప్రకారం 13.91%, స్థిర ధరల ప్రకారం 5.78% ఎక్కువగా నమోదైంది. » ఆశాజనకంగా ఉన్న వర్షపాతం, పంటలసాగు కారణంగా ఈ ఏడాది జీఎస్‌డీపీ ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి, ఆదాయ వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. » వార్షిక వృద్ధి రేటు పెరుగుదలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరుగుతోంది. 9వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధిరేటు 5.59% ఉండగా పదో ప్రణాళికకు ఇది 8.19 శాతానికి పెరిగింది. 11వ ప్రణాళికలో ఇది 8.37 శాతానికి చేరింది. » 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యమైన 10% వృద్ధిరేటును చేరుకోవడం సాధ్యమే. వ్యవసాయరంగంలో 6%, పారిశ్రామిక రంగంలో 10.5%, సేవారంగంలో 11.5% వృద్ధిరేటు లక్ష్యాలను చేరుకోగలం. » 12వ ప్రణాళికలో రాష్ట్ర ప్రణాళికా వ్యయం రూ.3,42,842 కోట్లు. 12వ ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 9.2%. » రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా తలసరి ఆదాయం బాగా పెరుగుతోంది. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం ఎక్కువ. 2004-05లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.25,321. 2011-12లో రూ.69,350 ఉండగా, 2012-13 నాటికి 13.29% పెరిగి రూ.78,564 కు చేరింది.¤ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి పచ్చజెండా ఊపారు. |
ఫిబ్రవరి - 11
|
| ¤ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిషత్‌కు దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఆ శాఖ కమిషనర్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. దేవాదాయశాఖ కార్యదర్శి, టీటీడీ కార్యనిర్వహణాధికారి సహా 21 మంది సభ్యులుగా ఉంటారు. ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. |
ఫిబ్రవరి - 12
|
¤ కంతేటి సత్యనారాయణ రాజు, నంది ఎల్లయ్య రత్నాబాయిలను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఆమోదం తెలిపారు. వీరి నియామకాలు గవర్నర్ కోటాలో జరిగాయి. » గవర్నర్ కోటాలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా, ముగ్గురితో కూడిన జాబితాను సీఎం కార్యాలయం రాజ్‌భవన్‌కు పంపింది. ఆ జాబితాకే గవర్నర్ అనుమతి లభించింది.¤ ఎటువంటి చర్చ లేకుండానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. » తెలంగాణ ప్రాంత సభ్యుల ఆందోళన మధ్య ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించగా, సభ ఆమోదం పొందినట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. » 2014-15 సంవత్సరంలో 4 నెలలకు అవసరమైన వ్యయానికి సంబంధించిన అడ్వాన్స్ కింద రూ.79 వేల కోట్ల కేటాయింపులకు ఆమోదం లభించింది. » 2013-14 ఆర్థిక సంవత్సరంలో తదుపరి వ్యయానికి (రూ.11 వేల కోట్లు), ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లును ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది.¤ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం మొదటి విడతగా రూ.846.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. » బోధన రుసుము కింద రూ.742.20 కోట్లను, ఉపకార వేతనాలకు రూ.104 కోట్లను విడుదల చేసింది. బీసీలకు రూ.338.10 కోట్లు, ఈబీసీలకు రూ.286.75 కోట్లు, ఎస్సీలకు రూ.177.24 కోట్లు, ఎస్టీలకు రూ.34.59 కోట్లు, మైనారిటీలకు రూ.10.24 కోట్లు విడుదలయ్యాయి. ¤ ప్రఖ్యాత సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమైంది. » సారలమ్మ మేడారంలోని గద్దెపైకి రావడంతో ఈ జాతర మొదలైంది. ఆమె తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెపైకి చేరారు. |
ఫిబ్రవరి - 13
|
| ¤ 2013 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలోని రాష్ట్ర ఆర్థిక అంశాలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తయారు చేసిన విశ్లేషణాత్మక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసనమండళ్లలో ప్రవేశపెట్టింది.ముఖ్యాంశాలు » 2012-13 బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా, వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ యంత్రాంగాలు బలహీనంగా ఉన్నాయి. తొలి కేటాయింపు రూ.1.46 లక్షల కోట్లలో రూ.1.30 లక్షల కోట్లే వ్యయమయింది. ఆర్థిక శాఖ అదనంగా మరో రూ.10,990 కోట్లను బడ్జెట్‌కు కేటాయించింది. దీంతో రూ.26 వేల కోట్లు (బడ్జెట్‌లో 17%) మిగిలిపోయాయి. శాఖలకు బడ్జెట్ ఆదేశాలు ఇవ్వకపోవడం, నిధులను స్తంభింపజేయడం, కిందిస్థాయి నుంచి అభ్యర్థనలు రాకపోవడం, ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవడం, పనుల్లో పురోగతి మందగించడం, పనుల వాయిదా, ఖజానా అధికారులు బిల్లుల్ని చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. » నీటిపారుదల శాఖ, రహదారుల విభాగాల్లో నిర్మాణ పనులు సకాలంలో పూర్తికాలేదు. ఈ కారణంగా కేటాయింపుల్లో రూ.71 వేల కోట్లు మిగిలాయి. » నిబంధనలను అమలు చేయకపోవడంతో రూ.3,140 కోట్ల గ్రాంట్లు కేంద్రం నుంచి రాకుండా పోయాయి. » మిగతా రాష్ట్రాల్లో విద్యారంగంపై సగటున 17.23% ఖర్చు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో 12.44 శాతమే ఖర్చయింది. » గృహనిర్మాణ సంస్థ రూ.3,617 కోట్లు, ఆర్టీసీ రూ.1,984 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. » రాష్ట్ర అప్పులు రూ.1.69 లక్షల కోట్లకు చేరాయి. అప్పులపై చెల్లింపుల భారం 2019-20 నుంచి బాగా పెరగనుంది. » వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ ఖర్చు మూడేళ్లకాలంలో 69% మేర పెరిగింది. విద్యుత్ ఛార్జీలకు ప్రభుత్వం భరిస్తున్న రాయితీ భారం (2008-09 నుంచి 2012 మార్చి నాటికి) రూ. 13,129 కోట్లు నాలుగు విద్యుత్‌పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఇంధన శాఖకు 2012-13 కాలంలో రూ.117.84 కోట్లు అనవసరంగా కేటాయించారు. వడ్డీ మాఫీ పథకానికి ముందువరకూ పంట రుణాలపై పావలా వడ్డీ పథకం అమల్లో ఉంది. దీని బకాయిలు రైతులకు చెల్లించడానికి గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించి, అందులో సగం మాత్రమే విడుదల చేసింది. చివరికి అందులోనూ గత జులై నాటికి రూ.69 కోట్లే రైతులకు అందజేశారు. » 2010-14 మధ్యకాలంలో పాల దిగుబడిని పెంచడానికి రూ.50.38 కోట్లు కేటాయించి, ఒక్క పైసా ఖర్చు చేయలేదు. 2011-12లో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేశారు. ఆ రుణాల పరపతి స్థిరీకరణ నిధి కింద రూ.100 కోట్లు కేంద్రం ఆప్కాబ్‌కు ఇచ్చినా ఖర్చు చేయలేదు. » జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా, సకాలంలో పూర్తికాక పోవడంతో ఆశించిన ప్రయోజనాలు కలగలేదు. మరోవైపు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని 'కాగ్' నివేదిక స్పష్టం చేసింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో స్తంభించిపోయిన పెట్టుబడి సుమారు రూ.70 వేల కోట్లు కాగా, నిర్మాణంలో జాప్యం కారణంగా పెరిగిన అంచనాల విలువ రూ.57 వేల కోట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది.¤ రాష్ట్ర ద్రవ్య వినియోగ బిల్లు (ఓటాన్ అకౌంట్)ను రాష్ట్ర ఉభయ సభలు ఆమోదించాయి. » అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. » మండలిని కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు. » గడచిన 11 నెలల కాలంలో (2013 మార్చి 13 నుంచి 2014 ఫిబ్రవరి 13వ తేదీ వరకు) శాసనసభ 48 రోజుల పాటు పనిచేసింది. 11 నెలల్లో 4 పర్యాయాలు సమావేశమైన అసెంబ్లీ ఈ 48 రోజుల్లో 115 గంటల 46 నిముషాల పాటు సభా కార్యక్రమాలు నిర్వహించింది. » శాసనమండలి విప్ రుద్రరాజు పద్మరాజును చీఫ్‌విప్‌గా నియమిస్తూ రాష్ట్ర పభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. |
ఫిబ్రవరి - 14
|
| ¤ ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం 2014 వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఈ కమిటీకి ఛైర్మన్‌గా ట్రాన్స్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ జి.రామకృష్ణారెడ్డి నియమితుడయ్యారు. » ఈ నెలాఖరుకల్లా ట్రాన్స్‌కో సీఎండీకి పీఆర్‌సీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సూచించిన వేతనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. |
¤ మేడారం మహా జాతర అధికారికంగా ముగిసింది. » సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వారివారి వడ్డెరులు (పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించి వన ప్రవేశం చేయించారు. | |
| ¤ నగరాలు, పట్టణాల సమీకృత అభివృద్ధికి వార్డు కమిటీలు, ఏరియా సభల ద్వారా అక్కడి సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో వివిధ పనులు, ఆయా విభాగాల అధిపతుల వివరాలను ప్రకటించింది. |
ఫిబ్రవరి - 16
|
| ¤ గుంటూరు నగరం చుట్టూ నిర్మించిన ఇన్నర్ రింగ్‌రోడ్డు ఒకటి, రెండు దశల రహదారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయం నుంచే ప్రారంభించారు. |
ఫిబ్రవరి - 17
|
| ¤ రాష్ట్రంలో జీవ శాస్త్రాల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీని ప్రకారం ఈ రంగానికి పరిశ్రమ హోదా లభిస్తుంది. జీవశాస్త్రాల కంపెనీలను బహుముఖంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక నూతన విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ప్రకారం బయోటెక్నాలజీ, వైద్య ఉపకరణాలు, బయోసేవలు, ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్ విభాగాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. » ఈ నూతన విధానాన్ని తీసుకురావడం వల్ల కొత్తగా రూ.20,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, 2019 నాటికి 13.5 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎగుమతులు రూ.60,000 కోట్లకు చేరతాయని, 50,000 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. » రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జీవశాస్త్రాల విధానం ప్రకారం ఈ రంగానికి చెందిన సంస్థల స్థాపనకు ఏక గవాక్ష పద్ధతిలో త్వరితంగా అనుమతులు లభిస్తాయి.¤ ఉత్తమ వారసత్వ నగరం (హెరిటేజ్ సిటీ)గా కేంద్ర ప్రభుత్వం తిరుపతిని ఎంపిక చేసింది. » జాతీయ పర్యటక పురస్కారం కోసం 'వారసత్వ విభాగం'లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 2012-13 సంవత్సరానికి తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపిక చేసింది. |
| ¤ రాష్ట్ర విభజనను నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ గుడ్‌బై చెప్పారు. » ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని కూడా ఆయన స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ప్రత్యమ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని గవర్నర్ నరసింహన్ కేంద్రానికి నివేదించారు. |
¤ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ సంఘం (చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్) పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » మాజీ ఐఏఎస్ అధికారిణి కె.సుజాత రావు దీనికి అధ్యక్షురాలిగా ఉంటారు. » రహీమొద్దీన్ (మహబూబ్‌నగర్), ఎస్.మురళీధర రెడ్డి (కడప), ఆచంట మమతా రఘువీర్ (హైదరాబాద్), మక్కపాటి సుజాత (హైదరాబాద్), పోచంపల్లి అచ్యుతరావు (హైదరాబాద్), ఎస్.భీమలింగం (విశాఖపట్నం)లను సభ్యులుగా నియమించింది. » పాలకమండలి మూడేళ్ల పాటు పదవిలో ఉంటుంది. » ఛైర్‌పర్సన్‌కు 65, సభ్యులకు 60 ఏళ్ల వయో పరిమితిని ప్రభుత్వం విధించింది. ఈ వయోపరిమితి ముగిసిన వారు పాలకమండలి కాలపరిమితితో సంబంధం లేకుండా వైదొలగాల్సి ఉంటుంది. |
ఫిబ్రవరి - 22
|
| ¤ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో 70 సామాజిక భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. |
ఫిబ్రవరి - 24
|
| ¤ విద్యాహక్కు చట్టం అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 31 మందితో సలహా మండలి ఏర్పాటయింది. ఈ మేరకు ప్రాథమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. » సలహా మండలికి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి సహ-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. |
ఫిబ్రవరి - 25
|
| ¤ రాష్ట్రంలోని వేలాది మంది అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి ఉపయోపడే పలు నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించింది. » 2014-15లో అర్చకుల సంక్షేమానికి రూ.17.73 కోట్లు, ఉద్యోగుల సంక్షేమానికి రూ.6.56 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. » వివాహ రుణాలను లక్ష రూపాయిలకు పెంచారు. » వైద్య ఖర్చుల వాపసు మొత్తాన్ని (మెడికల్ రీఎంబర్స్‌మెంట్) రూ.2 లక్షలకు పెంచారు. » 65 ఏళ్లు పైబడిన అర్చకులు, ఇతర ఉద్యోగుల్లో ఎలాంటి జీవనాధారం లేని, అనాధలైన వృద్ధులు, వికలాంగులకు నెలకు రూ.500 ఫించన్ ఇవ్వాలని నిర్ణయించారు. |
ఫిబ్రవరి - 27
|
| ¤ రాష్ట్రంలో అన్ని రకాల అనుమతులు పొందిన 80 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (నోటిఫైడ్-సెజ్)లో 11,064 ఎకరాల మేర భూమి నిరుపయోగంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. గత ఆరేళ్లుగా అక్కడ ఎలాంటి పరిశ్రమలను స్థాపించలేదని పేర్కొంది. » రాష్ట్రంలో మొత్తం 111 సెజ్‌లు మంజూరయ్యాయి. వీటిలో అనుమతులు పొంది, వెంటనే పరిశ్రమలు స్థాపించాల్సినవి 80 ఉన్నాయి. వీటి పరిధిలో 30,420 ఎకరాల భూమి ఉండగా, 12,430 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉందని ప్రభుత్వం నివేదించింది. పరిశ్రమలను స్థాపించాల్సిన స్థలం (ప్రాసెసింగ్ జోన్) 11,064 ఎకరాలు నిరుపయోగంగా ఉందని వెల్లడించింది. ఇందులో అధిక శాతం వ్యవసాయ భూమే. » పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించి సెజ్‌లకు అప్పగించింది. పంటలు పండే ఈ భూమి ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. » దేశవ్యాప్తంగా 408 సెజ్‌లలో 53,275 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నట్లు కేంద్రానికి నివేదిక అందింది.¤ రాష్ట్రంలో 18,594 గిరిజన ఆవాసాలు ఉండగా, వీటిలో కేవలం 9,859 ఆవాసాలకు మాత్రమే తాగునీరు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.¤ గడచిన అయిదేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో 44,96,360 మంది ఓటర్లు పెరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. » ముఖ్యంగా యువ ఓటర్ల నమోదు అనూహ్యంగా పెరిగింది. అంతర్జాలంలో ఓటరు నమోదు అవకాశాలు విస్తృతం కావడమే ఇందుకు కారణం. కేవలం తొలి ఓటర్లు అంటే 18 నుంచి 19 సంవత్సరాల ఓటర్లు సుమారు 15.06 లక్షల మంది నమోదు చేసుకున్నారు. |
| » గత అయిదేళ్లలో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2009 ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్లు 2,92,07,416 మంది, పురుష ఓటర్లు 2,86,84,843 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 5,22,573 మంది ఎక్కువగా ఉన్నారు. |  |
| » ప్రస్తుత జాబితా ప్రకారం పురుష ఓటర్లు 3,13,56,704 మంది ఉండగా, మహిళా ఓటర్లు 3,10,27,482 మాత్రమే నమోదు అయ్యారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,29,222 మంది తక్కువగా నమోదైనట్లు తేలింది. » రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు కూడా భారీగా పెరిగాయి. 2009లో 66,766గా ఉన్న పోలింగ్ కేంద్రాలు 2014 నాటికి 69,014 కు చేరాయి. |
ఫిబ్రవరి - 28
|
| ¤ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆర్టికల్ 356ని ఉపయోగించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతూ, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. » ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2014కు లోక్‌సభ ఆమోదం తెలిపిన తీరును నిరసిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖకు నివేదిక పంపారు. దీంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపింది. » రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కసారి రాష్ట్రపతి పాలన విధించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 1973 జనవరి 11 నుంచి డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా 1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. » రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే గవర్నర్ పాలన అమల్లోకి వస్తుంది. గవర్నర్‌కు సమస్తాధికారాలు సమకూరుతాయి. ముఖ్యమంత్రి, మంత్రిమండలి బాధ్యతలన్నీ ఆయనకు సంక్రమిస్తాయి. ఇద్దరు సలహాదారుల్ని నియమిస్తారు. విశ్రాంత ఐఏఎస్ లేదా ఐపీఎస్‌లను ఈ పోస్టుల్లో కేంద్రం నియమిస్తుంది. వీరికి మంత్రుల బాధ్యతలు వస్తాయి. » రాష్ట్రపతి పాలన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక బాధ్యతలు నిర్వహించాలి. » రాష్ట్రపతి పాలన సమయంలో ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగిస్తారు. తుపాన్లు, విపత్తులు వంటి అసాధారణ సమయాల్లో తప్ప ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదు. పోస్టుల భర్తీ, నామినేటెడ్ నియామకాలు వంటివి జరగవు. జీతభత్యాల పెంపు ఉండదు. రాష్ట్రపతి పాలన దృష్ట్యా కొత్త పీఆర్‌సీకి అవకాశం ఉండదు. » ముఖ్యమంత్రి, మంత్రులు మాజీలవుతారు. వారి ప్రొటోకాల్ రద్దవుతుంది. శాసనసభ్యులు మాత్రమే ఉంటారు. వారికి ఎలాంటి అధికారిక హోదాలూ ఉండవు. నెలవారీగా జీతం మాత్రం అందుతుంది. శాసనసభ సెస్పెన్షన్‌లో ఉంటుంది. కాబట్టి, సభాపరమైన కమిటీల్లో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. ప్రభుత్వమే లేదు కాబట్టి, జిల్లాల్లో ఎమ్మెల్యే హోదాలో వివిధ కమిటీల్లో ఉండే సభ్యత్వాలు రద్దవుతాయి. ప్రొటోకాల్ ఉండదు. నియోజకవర్గం అభివృద్ధి కోటాలో నిధుల మంజూరు వంటి వ్యవహారాలు ఉండవు. శాసనసభ స్పీకర్ మాత్రమే సాంకేతికంగా పదవిలో ఉంటారు. కొత్త శాసనసభ ఏర్పాటై ప్రొటెం స్పీకర్ బాధ్యతలు చేపట్టే వరకూ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. శాసనమండలికి మాత్రం సుప్తచేతనావస్థ వర్తించదు. » కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాలపై ఇష్టానుసారం ఆర్టికల్ 356 ప్రయోగించకుండా 11-3-1994న ఎస్.ఆర్.బొమ్మై కేసులో తొమ్మిది మంది సభ్యులున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అప్పట్నుంచి దేశంలో రాష్ట్రపతి పాలన ప్రయోగాలు తగ్గిపోయాయి. » దేశంలో ఇప్పటి వరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాది దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. » తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి మిగిలిపోనున్నారు. ఫిబ్రవరి 19న రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్రపతి పాలన విధిస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనంతో 1956 నవంబరు 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి సీఎంగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. 16వ, చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 2010 నవంబరు 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. |
¤ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలపాటు పొడిగించింది. జూన్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.¤ రాష్ట్ర విభజన ప్రక్రియలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సహాయం అందించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఒక్కో అధికారి, మరో తెలుగేతర అధికారి ఉన్నారు. » ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ బుర్రా వెంకటేశం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ జయేష్ రంజన్‌లకు ఈ బాధ్యతలు అప్పగించారు.¤ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో అయిదువేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న భారీ సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు, సోలార్ ఎనర్జీ కో-ఆపరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ఏపీఐఐసీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. » ఈ సోలార్ పార్కులో రూ.600 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 500 మెగావాట్లు, రెండో దశలో మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నారు.
|
|
|