జనవరి - 2014 క్రీడలు


జనవరి - 1
¤ క్వీన్స్ టౌన్‌లో వెస్టిండిస్ - న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మూడో వన్డేలో 
న్యూజిలాండ్ 159 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
          
» ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరె అండర్సన్ 36 బంతుల్లో శతకం 
సాధించి ప్రపంచ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఏ ఫార్మాట్లోనైనా అండర్సన్‌దే 
అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ సెంచరీ.
          

» పాక్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది 16 ఏళ్ల వయసులోశ్రీలంకపై నెలకొల్పిన రికార్డు
 (కెన్యా రాజధాని నైరోబిలో జరిగినమ్యాచ్‌లో)ను అండర్సన్ చెరిపేశాడు.

          
» ఈ మ్యాచ్‌లో అండర్సన్ మొత్తం 47 బంతులనెదుర్కొని, 131 పరుగులతో 
నాటౌట్‌గా నిలిచాడు. ఈ స్కోరులో 14 సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి.          

» కోరె అండర్సన్ ముద్దుపేరు 'కోజా'.

¤ జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ వేగం వెనుక బలం అతడి మోకాళ్లే కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.          

» బోల్ట్ మోకాలి చిప్పల్లోని సమరూపతే అతడి విజయం వెనుక కీలకం కావచ్చని నోర్తుంబ్రియా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు.

          
» జమైకా వాసులకు ప్రపంచంలోనే అత్యుత్తమ పరుగుల వీరులుగా పేరుండటంతో ఆ దేశస్థుల మోకాళ్లపై పరిశోధనలు చేపట్టారు. మోకాళ్లలోని సమరూపత పరుగులో సామర్థ్యానికి ఒక సంకేతంలా గుర్తించారు.
జనవరి - 3
¤ బ్రిటన్ బయట తొలిసారి నిర్వహించనున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. భారత్ టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సహకారంతో, 'ద వింబుల్డన్ ఫౌండేషన్' ఈ నెలలో ఢిల్లీ, ముంబయిలలో రెండు అండర్-14 టోర్నీలను నిర్వహించనుంది. ఈ టోర్నీల్లో టాప్-16 క్రీడాకారులు ఏప్రిల్‌లో జూనియర్ మాస్టర్స్ టోర్నీలో తలపడతారు. బాలురు, బాలికల సింగిల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరిన నలుగురు ఇంగ్లండ్ అండర్-14 టెన్నిస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈ టోర్నీని ఆగస్ట్‌లో నిర్వహిస్తారు.
జనవరి - 4
¤ భారత్ అండర్-19 ఆసియా క్రికెట్ కప్ విజేతగా నిలిచింది.

          
» షార్జా మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో భారత అండర్-19 జట్టు 40 పరుగుల తేడాతో పాకిస్థాన్ అండర్-19 టీమ్‌పై విజయం సాధించింది.     
     
» అండర్-19 స్థాయిలో ఇది ఏడో ఆసియా కప్. భారత్ విజేతగా నిలవడం ఇది రెండోసారి. 2012లో భారత్, పాక్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఇప్పుడు భారత్ తొలిసారిగా సింగిల్‌గా విజేతగా నిలిచింది.          

» భారత కెప్టెన్ విజయ్ జోల్          

» పాక్ కెప్టెన్ సమీ అస్లామ్          

» ఆసియాకప్ గెలిచిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఉన్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్ లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ కాగా, మరొకరు ఆంధ్రా బ్యాట్స్‌మెన్ రికీ భుయ్.          

» తాజా టోర్నీలో ఫైనల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా విజయ్ జోల్ నిలిచాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ నిలిచాడు.

¤ బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ విజేతగా సెరెనా విలియమ్స్ (అమెరికా) నిలిచింది.          

» ఫైనల్ పోరులో విక్టోరియా అజరెంక (బెనారస్) పై సెరెనా నెగ్గింది.          

» సెరెనా విలియమ్స్ కెరీర్‌లో ఇది 58వ సింగిల్స్ టైటిల్.          

» విజేతగా నిలిచిన సెరెనాకు 1,96,670 డాలర్ల (రూ.1.22 కోట్ల) ప్రైజ్‌మనీ లభించింది.


¤   న్యూజిలాండ్‌లో జరిగిన ఆక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా అనా ఇవనోవిచ్ (సెర్బియా) నిలిచింది.          

» ఫైనల్లో ఇవనోవిచ్ అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌పై గెలిచింది.          

» విజేతగా నిలిచిన ఇవనోవిచ్‌కు 43 వేల డాలర్లు (రూ.26.76 లక్షలు) దక్కాయి.
జనవరి - 5
¤   సిడ్నీలో జరిగిన అయిదో, చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది.
          
»  ఈ విజయంతో యాషెస్ సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి.          

»  మ్యాన్ ఆఫ్ ద సిరీస్ - మిషెల్ జాన్సన్, ఆస్ట్రేలియా.

¤   స్టానిన్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెన్నై ఓపెన్ టైటిల్ నెగ్గాడు.          

»  ఫైనల్ పోరులో 7-5, 6-2తో ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.          

»  వావ్రింకాకు ఇది రెండో చెన్నై ఓపెన్ టైటిల్. తొలిసారిగా 2011లో విజేతగా నిలిచాడు.          

»  జోహాన్ బ్రెయిన్స్ (స్వీడన్), ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్) జోడీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
జనవరి - 6
¤   మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య జోషి పురుషుల జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్ వన్ అయ్యాడు. భారత్ నుంచి జూనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నెంబర్ వన్ కావడం ఇదే తొలిసారి.
          

»  ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పదిహేడేళ్ల జోషి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
          
»  నవంబరు వరకు 11వ ర్యాంక్‌లో ఉన్న జోషి 18,776 పాయింట్లు సాధించి అగ్రపీఠాన్ని అలంకరించాడు.
          

»  ఆదిత్య 2011లో రష్యాలో జరిగిన రెమెన్‌స్కో జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీలో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది జపాన్‌లో జరిగిన ఆసియా సబ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచాడు.
          

»  గత నెల చండీగఢ్‌లో జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం ఆదిత్య ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడానికి దోహదపడింది.


¤   చిన్న వయసులోనే ప్రతిభావంతులను గుర్తించి, ప్రోత్సహించేందుకు రూ.2,200 కోట్లతో దేశవ్యాప్తంగా 75 క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
          

»  ముందుగా ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. మూడేళ్ల కాలంలో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
          

»  తొలి ఏడాదిలో 35, రెండు, మూడు సంవత్సరాల్లో 20 పాఠశాలల చొప్పున ప్రారంభిస్తారు.
          

»  క్రీడా పాఠశాలగా ఎంపికయ్యేందుకు ఇప్పటికే నాలుగైదు క్రీడాంశాల్లో సౌకర్యాలు ఉండాలి. జాతీయ పాఠశాల క్రీడల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉండాలి. మంచి క్రీడల నేపథ్యం, 25 ఎకరాల స్థలంతోపాటు అదనంగా 100 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించగలిగే స్థితిలో ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం లభిస్తుంది. క్రీడాబడుల్లో నాలుగైదు క్రీడాంశాల్లో అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పాఠశాలలపై ప్రభుత్వం పదేళ్ల కాలంలో దాదాపు రూ.2,200 కోట్లు ఖర్చు చేయనుంది.
జనవరి - 9
¤    రష్యాలోని సోచి నగరంలో ఫిబ్రవరి 7 నుంచి 23 వరకు జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ముగ్గురు అథ్లెట్లు పోటీ పడనున్నారు.
          

»  లజ్ క్రీడలో శివ్ కేశవన్, అల్పైన్ స్కీయింగ్‌లో హిమాంశు ఠాకూర్, క్రాస్ కంట్రీలో నదీమ్ ఇక్బాల్ పాల్గొనబోతున్నారు.
జనవరి - 10
¤    రోహన్ బోపన్న - ఖురేషీ జోడీ సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది.          

»  పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న జోడీ 6-1, 6-2తో లూకస్ రోసొల్ - జావొ సౌసా జోడీని ఓడించింది.

¤    జాతీయస్థాయి పైకా అండర్-16 పోటీల్లో బాలుర వాలీబాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు ఛాంపియన్‌షిప్ సాధించింది.          

»  ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 25-16, 25-18, 25-18 తో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది.

          
»  అథ్లెటిక్స్‌లో హర్యానా 24 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, 21 పాయింట్లతో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రెండోస్థానం సాధించింది. అథ్లెటిక్స్‌లో రాష్ట్రానికి 9 పతకాలు (1 + 6 + 2) లభించాయి.
          


»  ఈ పోటీలు మహబూబ్‌నగర్‌లో జరిగాయి.
జనవరి - 11
¤    ఏటీపీ సిడ్నీ ఇంటర్నేషనల్‌లో రోహన్ బోపన్న (భారత్) - ఖురేషీ (పాకిస్థాన్) జోడీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.          

» డబుల్స్ ఫైనల్లో బోపన్న - ఖురేషీ జోడీ 6-7, 6-7తో డానియల్ నెస్టర్ (కెనడా) - నెనాద్ జిమోంజిక్ (సెర్బియా) జోడీ చేతిలో ఓడింది.


¤    ఆంధ్రప్రదేశ్ యువ కెరటం యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-3 టోర్నీలో టైటిల్ కైవసం చేసుకుంది.          

» న్యూఢిల్లీలో జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో ప్రాంజల 3-6, 6-2, 6-3తో బునియవి థామ్‌చయ్‌వాట్ (థాయ్‌లాండ్)ను ఓడించింది.

¤    ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భవిశెట్టి సౌజన్య అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్ సింగిల్స్ ఛాంపియన్‌గా అవతరించింది.          

» ఔరంగాబాద్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సౌజన్య
5-7, 6-4, 6-4తో భారత్‌కే చెందిన ప్రార్థన తోంబరే ను ఓడించింది.


 » 20 ఏళ్ల సౌజన్యకిది కెరీర్‌లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. గతేడాది ఈజిప్టులో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో ఆమె తొలిసారిగా విజేతగా నిలిచింది.

¤    బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించారు.
          

» భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు ప్రతిష్ఠాత్మక 'సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం'ను ప్రదానం చేశారు. ఈ అవార్డును స్వీకరించిన 21వ భారత క్రికెటర్‌గా కపిల్ రికార్డులకు ఎక్కాడు. 

          
» భారత క్రికెట్‌కు సేవలు అందించిన బాపూ నాథ్‌కర్ణి, ఫరూఖ్ ఇంజినీర్, ఏక్‌నాథ్ సోల్కర్‌కు కూడా ఈ పురస్కారాలు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో నాథ్‌కర్ణి ఫరూఖ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దివంగత సోల్కర్ తరఫున ఆయన భార్య పురస్కారాన్ని స్వీకరించారు.

అవార్డు గ్రహీతల వివరాలు: 
 ఉత్తమ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్) అవార్డు
రవిచంద్రన్ అశ్విన్.

 దిలీప్ సర్దేశాయ్ అవార్డు: 
రోహిత్ శర్మ.

 లాలా అమరనాథ్ అవార్డు (రంజీ ట్రోఫీలో బెస్ట్ ఆల్‌రౌండర్): 
అభిషేక్ నాయర్.

 మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు, వికెట్లు):
 జీవన్ జోత్ సింగ్ (పంజాబ్), ఈశ్వర్ పాండే (మధ్యప్రదేశ్).

 ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్ - 25 బెస్ట్ క్రికెటర్):
 కరణ్ శర్మ (రైల్వేస్).

 ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్ - 19 బెస్ట్ క్రికెటర్): 
అక్షర్ పటేల్ (గుజరాత్).

 ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్ - 16 బెస్ట్ క్రికెటర్): 
అర్మాన్ జాఫర్ (ముంబయి).

 ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (బెస్ట్ మహిళా క్రికెటర్):
 తిరుష్ కామిని (తమిళనాడు)

 దేశవాళీ ఉత్తమ అంపైర్: 
శంషుద్దీన్ (హైదరాబాద్).

 బెస్ట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అవార్డు: 
ముంబయి క్రికెట్ అసోసియేషన్.
జనవరి - 12
¤    ఆంధ్రప్రదేశ్ యువ బాక్సింగ్ కెరటం నిఖత్ జరీన్ సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది.          

» 51 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ జరీన్ 3-0తో పాల్ట్‌సెవా ఎక్తరీనా (రష్యా)ను ఓడించింది. 


» నిఖత్ కెరీర్‌లో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం. మొత్తంమీద రెండో స్వర్ణం. 2011 ఐబా ప్రపంచ జూనియర్ స్వర్ణ పతకం సాధించిన నిఖత్ 2012 సెర్బియా నేషన్స్ కప్‌లో రజతం సొంతం చేసుకుంది. 2013 సెప్టెంబరులో బల్గేరియాలో జరిగిన ఐబా ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ రజత పతకం సాధించింది.          

» జాతీయ స్థాయిలో ఈ యువ బాక్సర్ అయిదుసార్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని రెండుసార్లు ఉత్తమ బాక్సర్ అవార్డు గెలుచుకుంది.


¤    న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఆర్చరీ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో రాష్ట్ర క్రీడాకారిణి జ్యోతి సురేఖ విజేతగా నిలిచింది.        
  
»  కాంపౌడ్ మహిళా విభాగం ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో జ్యోతి సురేఖ 143-141 తేడాతో లిల్లీచాను (మణిపూర్) పై విజయం సాధించింది.
జనవరి - 13
¤    సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యాయి.

¤     న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో భారత్ తన మూడో మ్యాచ్‌ను జర్మనీతో 3-3తో డ్రాగా ముగించుకుంది. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ ఓటమి పొందింది.
జనవరి - 15
¤     ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ఫిఫా 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును 2013 ఏడాదికి పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో గెలుచుకున్నాడు. అతడు ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. రోనాల్డోను 2008లో తొలిసారి ఈ అవార్డు వరించింది.
          

»   గత నాలుగేళ్లుగా ఈ అవార్డును అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ నెగ్గడం గమనార్హం.

జనవరి - 16
¤     ఆసియా కప్ క్రికెట్ పోటీలు బంగ్లాదేశ్‌లోనే జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది.          

»   బంగ్లాదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్కడ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. పాకిస్థాన్ కూడా టోర్నీలో పాల్గొనే విషయంలో కొంత విముఖత చూపడంతో టోర్నీ నిర్వహణ అనుమానంగా మారింది. తాజాగా పాకిస్థాన్ టోర్నీలో ఆడేందుకు అంగీకరించడంతో టోర్నీ బంగ్లాలోనే జరుగుతుందని ఏసీసీ ప్రకటించింది.          

»   ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతోపాటు తొలిసారిగా అఫ్గానిస్థాన్ కూడా పాల్గొననుంది.
జనవరి - 18

¤    న్యూఢిల్లీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టైటిల్‌ను నెదర్లాండ్స్ జట్టు గెలుచుకుంది.
          

»   ఫైనల్ పోరులో 7 - 2తో న్యూజిలాండ్‌పై నెదర్లాండ్స్ నెగ్గింది.
          
»   హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్ 6వ స్థానంతో సరిపెట్టుకుంది. 5, 6 స్థానాల కోసం జరిగిన పోరులో భారత్ 1 - 2తో బెల్జియం చేతిలో ఓడింది.
జనవరి - 19
¤    న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా నేపియర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.          

»   మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: అండర్సన్, న్యూజిలాండ్.          

»   వన్డేల్లో 300 అవుట్‌లలో పాలుపంచుకున్న తొలి భారత వికెట్‌కీపర్‌గా ధోనీ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌లో రాస్‌టేలర్ క్యాచ్‌తో అతడు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా గిల్‌క్రిస్ట్ (472), బౌచర్ (424), సంగక్కర (424) తర్వాత అత్యధిక బ్యాట్స్‌మెన్ అవుట్‌లలో పాలుపంచుకున్న నాలుగో వికెట్‌కీపర్‌గా ధోనీ నిలిచాడు.
జనవరి - 21
¤    సయ్యద్ మోడీ ఇండియన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ సిరీస్ పోటీలు లక్నోలో ప్రారంభమయ్యాయి.
          

»   ప్రపంచవ్యాప్తంగా ఏటా 11 గ్రాండ్ ప్రి టోర్నీలు జరుగుతుండగా అందులో మొదటిది ఇండియన్ గ్రాండ్ ప్రీనే.
          

»   తాజాగా సయ్యద్ మోడీ ఇండియన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ సిరీస్‌కు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గుర్తింపు లభించింది.
జనవరి - 22
¤     హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
          

»   న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండో వన్డేలో ఓడిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. మ్యాచ్‌కు ముందు 119 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ రెండు పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి చేరుకుంది. దీంతో 118 పాయింట్లతో ఉన్న అస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికా (110), శ్రీలంక (108), ఇంగ్లండ్ (108) పాకిస్థాన్ (101) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జనవరి - 23
¤      ప్రముఖ క్రీడా నెట్‌వర్క్ 'స్టార్ ఇండియా' దేశంలో హాకీకి ప్రాచుర్యం తీసుకురావడం కోసం రానున్న ఎనిమిదేళ్లలో రూ.1,500 కోట్లను వెచ్చించాలని నిర్ణయించింది.

¤      బౌలింగ్ దిగ్గజం షేన్‌వార్న్ ఆస్ట్రేలియా జట్టు స్పిన్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
         
 »   వార్న్ ప్రధాన కోచ్ డారెన్ లీమన్‌కు సలహాదారుగా సాయపడతాడు. జట్టు స్పిన్నర్లకు ప్రత్యేక శిక్షణనిస్తాడు.

జనవరి - 24
¤      ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2014 మహిళల డబుల్స్ టైటిల్‌ను సారా ఎరానీ - రొబెర్టా విన్సీ (ఇటలీ) ద్వయం కైవసం చేసుకుంది.
          

»    ఫైనల్లో వీరు 6-4, 3-6, 7-5తో మకరోవా - వెస్నినా (రష్యా) జోడీపై గెలిచారు.

జనవరి - 25
¤      న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది.         

»    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజా (భారత్).    
     
»    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 314 పరుగులు చేసింది. భారత్ కూడా సరిగ్గా 314 పరుగులే చేసింది.         
»    భారత్, న్యూజిలాండ్ వన్డే టై కావడం ఇదే తొలిసారి. భారత్‌కు ఇది మొత్తం మీద ఏడో టై కాగా, కివీస్‌కు ఆరోది.

¤      'ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2014' మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా చైనా క్రీడాకారిణి లీ నా నిలిచింది.         
»    ఫైనల్లో 7-6, 6-0 తో డొనిమికా సిబుల్కోవా (స్లొవేకియా)ను ఓడించింది.
         
»    పెద్ద వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన క్రీడాకారిణిగా (31 ఏళ్ల 11 నెలలు) రికార్డు సృష్టించింది. మార్గరేట్ కోర్ట్ (1973లో 30 ఏళ్ల వయసులో) రికార్డును లీ నా తిరగరాసింది.        

 »    లీ నా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2011లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను లీ నా నెగ్గింది. 

         
»    పురుషుల డబుల్స్ టైటిట్‌ను లుకాస్ కుబొట్ (పోలెండ్) - రొబర్ట్ లిండ్ స్టెడ్ (స్వీడన్) జోడీ సాధించింది. ఫైనల్లో కుబొట్ జంట 6-3, 6-3తో వరుస సెట్లలో బుటొరాక్ - క్లాసెన్ జోడీని ఓడించింది.
జనవరి - 26

¤      ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2014 పురుషుల సింగిల్స్ విజేతగా స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా ఆవిర్భవించాడు.         

»    వావ్రింకా ఫైనల్లో 6-3, 6-2, 3-6, 6-3తో టాప్‌సీడ్, టైటిల్ ఫేవరెట్ రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు.         

»    వావ్రింకాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. అతడికి రూ.14.44 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది
         

»    ఆస్ట్రేలియా ఓపెన్ 2014 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను క్రిస్టినా మ్లడెనొవిక్ (ఫ్రాన్స్) - డానియల్ నెస్టర్ (కెనడా) జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ సానియామీర్జా - హొరియా టెక్యూ (రుమేనియా) జోడీ పై నెగ్గింది.

¤      లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియన్ గ్రాండ్ ప్రి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది.         

»    ఫైనల్లో సైనా 21-14, 21-17తో రాష్ట్ర క్రీడాకారిణి పి.వి.సింధుపై నెగ్గింది.    
     »    2012లో  డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ తర్వాత సైనా సాధించిన అంతర్జాతీయ టైటిల్ ఇదే.

         
»    పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చైనా ఆటగాడు జూ సాంగ్ నెగ్గాడు. జూ సాంగ్ ఫైనల్లో రాష్ట్ర క్రీడాకారుడు శ్రీకాంత్‌పై 21-16, 19-21, 13-21తో నెగ్గాడు.
జనవరి - 28
¤      హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి పొందింది. ఇది అయిదు వన్డేల సిరీస్.
        

»    మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: టేలర్, న్యూజిలాండ్
       

 »    ఈ గెలుపుతో మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 3-0తో సిరీస్‌ను గెల్చుకుంది.

        
»    తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన మూడో వన్డే 'టై'గా ముగిసింది.
జనవరి - 29
¤       2017 మహిళల ప్రపంచ కప్ క్రికెట్‌కు అర్హత సాధించే జట్లను నిర్ణయించడం కోసం కొత్తగా అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభిస్తున్నట్లు ఐ.సి.సి. ప్రకటించింది.
      

 »    ఈ ఛాంపియన్‌షిప్‌లో 8 అగ్రశ్రేణి జట్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడతాయి. ఈ జట్లు 2014 మధ్య నుంచి 2016 చివరి వరకు జరిగే మ్యాచ్‌లలో పోటీ పడతాయి.
       

»    తొలి ఆరు స్థానాల్లో జట్లు 2017లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి.
జనవరి - 31
¤       వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి అయిదో వన్డేలో భారత్ 87 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో నెగ్గినట్లయింది.       

»    మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - టేలర్ (న్యూజిలాండ్).       

»    ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత్‌ను 4-0తో ఓడించడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.       

»    ఈ మ్యాచ్ (అయిదో వన్డే)లో ధోనీ వన్డేల్లో 8 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా ధోనీ రికార్డులకెక్కాడు.