ఆగస్టు - 2014 ఆర్థికరంగం


ఆగస్టు - 1
¤  సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (SFURTI - Scheme Of Fund for Regeneration of Traditional Industries) కు సంబంధించి స‌వ‌రించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.    »    సవరించిన 'స్ఫూర్తి' ప్రకారం మూడు రకాల క్లస్టర్లు ఉంటాయి. వీటిని హెరిటేజ్
(1000 - 2500 మంది కార్మికులు); పెద్ద క్లస్టర్ (500 - 1000 మంది కార్మికులు); చిన్న క్లస్టర్‌ (500 వ‌ర‌కు కార్మికులు)గా వర్గీకరిస్తారు. ప్రతీ క్లస్టర్‌లో ప్రాజెక్టు అమలుకు మూడేళ్ల గడువు ఇస్తారు.
   »    తొలి దశలో దేశవ్యాప్తంగా 71 క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి రూ.149.44 కోట్లు కేటాయించారు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012 - 17) కింద ఈ క్లస్టర్ల సంఖ్యను 800 వ‌ర‌కూ తీసుకెళతారు. దీనికోసం కేంద్రం, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి నిధులను కోరతారు.
ఆగస్టు - 5
¤  ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ముంబయిలో ప్రకటించింది.ముఖ్యాంశాలు: రెపో రేటు, రివర్స్ రిపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), బ్యాంకు రేటులను యధాతథంగా ఉంచింది. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)లో అరశాతం కోత విధించింది. ఫలితంగా ఇది 22 శాతానికి చేరింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు అదనంగా నిధులు వస్తాయి. అంటే బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో పెట్టాల్సిన డిపాజిట్లు ఆ మేరకు తగ్గుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.5 శాతంగా ఉండవచ్చు. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి 2015 కల్లా 8 శాతానికి, జనవరి 2016 కల్లా 6 శాతానికి పరిమితం చేయాలి. రెపో రేటు - 8% రివర్స్ రెపో రేటు - 7% సీఆర్ఆర్ - 4% బ్యాంక్ రేటు - 9%
ఆగస్టు - 7
¤  పాఠశాల/ విశ్వవిద్యాలయ రుసుములు, మున్సిపల్/ ఆస్తి పన్ను, కరెంటు తదితర వినియోగ బిల్లులను ప్రజలు సాఫీగా కట్టేందుకు వీలుగా 'ఎప్పుడైనా ఎక్కడైనా' బిల్లు చెల్లించే ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది.   »    'భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)' పేరిట దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.   »    ఏజెంట్ల యంత్రాంగం అండతో పరస్పర సమన్వయంతో దీన్ని నిర్వహిస్తారు.   »    ఖాతాదారులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఈ చెల్లింపు వ్యవస్థను రూపొందించనున్నారు.   »    బహుళ విధాల చెల్లింపు పద్ధతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది.
ఆగస్టు - 13
¤  విద్యుత్ రంగంలో దేశీయంగా అతిపెద్ద లావాదేవీ నమోదైంది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ తన ఉడిపి పవర్ ప్లాంటును రూ.6,000 కోట్లకు విక్రయించింది. 1200 మెగావాట్ల సామర్థ్యంగల ఈ ప్లాంటును అదానీ గ్రూపు సొంతం చేసుకుంది.   »    దిగుమతి చేసుకునే బొగ్గు ఇంధనంగా దేశంలో ఏర్పాటైన మొదటి స్వతంత్ర విద్యుత్తు ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.   »    న్యూ మంగళూర్ పోర్టులో దీనికి 4 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అనువైన సొంత జెట్టీ కూడా ఉంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 90 శాతం కర్ణాటక రాష్ట్రానికే సరఫరా అవుతోంది. మిగిలిన 10 శాతం విద్యుత్తును పంజాబ్ తీసుకుంటోంది.
ఆగస్టు - 15
¤  2015 మార్చికల్లా అయిదు ప్రధాన ఓడరేవుల సామర్థ్యాన్ని 67 మిలియన్ టన్నులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను గుర్తించింది. రూ.4,575 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.   »    ప్రస్తుతం దేశంలోని 12 ప్రధాన ఓడరేవులు కాండ్లా, ముంబయి, జేఎన్‌పీటీ, మర్మగావ్, న్యూమంగళూర్, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్, వీఓ చిదంబర్నర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్‌కతల సామర్థ్యం 2014 మార్చి 31 నాటికి 700 మిలియన్ టన్నులుగా నమోదైంది.   »    కొత్త ప్రాజెక్టుల పనుల్లో భాగంగా చెన్నై పోర్ట్ వద్ద ఉన్న డ్రై పోర్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద లిక్విడ్ టర్మినల్ అభివృద్ధి, కాండ్లా పోర్ట్ వద్ద లిక్విడ్ టర్మినల్, కంటెయినర్ టర్మినళ్ల అభివృద్ధి; ముంబయి పోర్ట్ వద్ద బల్క్ సిమెంట్ నిల్వ, ఒడిశాలోని పారాదీప్ వద్ద ఇనుప ఖనిజం అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నారు.¤  మహాత్మాగాంధీ 2005 శ్రేణిలో కొత్త రూ.1000 నోట్లను విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. రూపాయి చిహ్నం () తోపాటు, ఆంగ్ల అక్షరం ఆర్ కూడా ఈ నోట్లపై ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది. నోటు వెనుక 2014 ముద్రిస్తామని వివరించింది. వీటికితోడు పాతనోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఆగస్టు - 19
¤  ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయానికి సంబంధించి ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు జారీచేసింది.   »    సొంత బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నెలకు 5 లావాదేవీలు, ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో అయితే నెలకు 3 లావాదేవీలకు పరిమితం చేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది. ఆపైన లావాదేవీలకు ఒక్కోదానికి రూ.20 వరకు రుసుము వసూలు చేస్తారు.   »    నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఆదేశాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాకే పరిమితం కానున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఆర్‌బీఐ ఈ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.   »    నగదు విత్‌డ్రా లాంటి ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాలెన్స్ చూసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ లాంటి ఆర్థికేతర లావాదేవీలను కూడా ఇందులో లెక్కగడతారు.   »    2014 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
ఆగస్టు - 27
¤  ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన 'అత్యంత వినూత్న కంపెనీ'ల జాబితాలోని ప్రపంచవ్యాప్త ఐటీ సేవల కంపెనీల్లో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అగ్రస్థానంలో నిలిచింది.