జూన్ - 2014 కమిటీలు - కమిషన్లు


జూన్ - 5
¤  ఎల్‌పీజీ రాయితీ ప్రత్యక్ష బదిలీ (డీబీటీఎల్)ని స్వల్ప మార్పులతో పునరుద్ధరించాలని ఈ పథకంపై సమీక్షకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.   »    ఈ కమిటీకి కాన్పూర్ ఐఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.జి.థాండే నేతృత్వం వహించారు.   »    అవకతవకలను నియంత్రించాలనే ప్రాథమిక లక్ష్యాన్ని డీబీటీఎల్ పథకం సాధించిందని, అయితే ఈ పథకాన్ని వేగవంతంగా అమలు చేయడం, ఆధార్ కార్డులు జారీ అయిన జిల్లాలు తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులకు సమస్యలు ఎదురయ్యాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
జూన్ - 9
¤  ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ విధివిధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా నాబార్డ్ మాజీ ఛైర్మన్ కోటయ్య నియమితులయ్యారు.   »    సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సి.ఎస్.రావు, ఆర్థిక నిపుణుడు కుటుంబరావు, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి ఎస్.పి.ఠక్కర్‌లు నియమితులయ్యారు. ఆర్థికశాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
జూన్ - 13
¤  దేశవ్యాప్తంగా ఇంధన ప్రమాణాలను పెంచాలని నిపుణుల కమిటీ సూచించింది.   »    ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. యూరో-5 ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ను ఉత్పత్తి చేయడానికి చమురుశుద్ధి కర్మాగారాలను ఆధునికీకరించాలని ఈ కమిటీ సూచించింది. దీనికి రూ.80 వేల కోట్లు అవసరమని పేర్కొంది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి పెట్రోలు, డీజిల్‌పై 75 పైసల మేర సెస్ విధించాలని తెలిపింది. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల వ్యవధిలో ఈ సెస్ ద్వారా రూ.64వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.   »    2017 నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా యూరో-4 ఇంధన ప్రమాణాలను తీసుకురావాలని, 2020 నాటికి యూరో-5 స్థాయిని అందుకోవాలని కమిటీ సూచించింది. 2024 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వస్తాయి.   »    ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, లక్నో తదితర 26 నగరాల్లో యూరో-4 (బీఎస్-4) ప్రమాణాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల బీఎస్-3 స్థాయి అమల్లో ఉంది.   »    చమురుశుద్ధి కర్మాగారాల ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని కమిటీ సూచించింది. పెట్రోల్ ధరలపై నియంత్రణను 2010 జూన్‌లో తొలగించారు.
 జూన్ - 21
¤  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్ధీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.   »    ఈ నివేదిక ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నింటినీ ఇక ఎఫ్‌డీఐగా పరిగణించనున్నారు. ఒక కంపెనీలో 10% కంటే తక్కువ ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు కానీ, తొలి కొనుగోలు తర్వాత ఏడాదిలోగా వాటాను 10 శాతానికి పైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువే ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు.   »    అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా, దాన్ని ఎఫ్‌డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.