ఏప్రిల్ - 2
|
¤ సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి డి.కె. పాఠక్ నియమితులయ్యారు. 1979 బ్యాచ్ అస్సాం - మేఘాలయ క్యాడర్‌కు చెందిన పాఠక్‌ను బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఎంపిక చేస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. » పాఠక్ ఇప్పటివరకు బీఎస్‌ఎఫ్‌కు ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. బీఎస్‌ఎఫ్ అధినేతగా ఉన్న సుభాష్ జోషి ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.¤ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) టెక్నికల్ డైరెక్టర్‌గా ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) ఎన్.బి.సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన భారత వైమానిక దళంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (కమ్యూనికేషన్)గా పనిచేశారు. » ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడైనన సింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఎఫ్‌ఐఈటీఈ)లో సభ్యుడు. భారత వైమానిక దళంలో 35 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అతి విశిష్ట సేవా మెడల్ కూడా పొందారు.
|
ఏప్రిల్ - 4
|
| ¤ ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక ప్రత్యేక న్యాయస్థానం ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంతన్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన రెండేళ్లు పదవీలో ఉంటారు. |
ఏప్రిల్ - 11
|
| ¤ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా (64) నియమితులయ్యారు. ఏప్రిల్ 27న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆయన్ను నియమించినట్లుగా న్యాయ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.ఎం.లోధాయే అత్యంత సీనియర్ న్యాయమూర్తి. కాగా లోధా సెప్టెంబరు 27న పదవీ విరమణ చేయనుండటంతో అయిదు నెలల కాలమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సదాశివం సూచించారు. » జోధ్‌పూర్‌లో జన్మించిన జస్టిస్ లోధా అంతకుముందు రాజస్థాన్, బాంబే హైకోర్టుల్లో న్యాయమూర్తిగా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 డిసెంబరు 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి జస్టిస్ లోధాయే నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలున్న సీనియర్ అధికారులను విచారించడానికి సీబీఐ, ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని గతంలో ఆయన స్పష్టం చేశారు. మైనారిటీ పాఠశాలల్లో విద్యా విధానాలను పరిశీలిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. ఔషధ పరీక్షలకు సంబంధించిన కేసులనూ ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.¤ రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్రకెక్కారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తికి దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. త్వరలో ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. » జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న గొర్ల సావిత్రి, సూర్యారావు దంపతులకు విశాఖపట్టణంలో జన్మించారు. 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1980 డిసెంబరు 18న న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. ఎ.పి.లా జర్నల్స్ వ్యవస్థాపక చీఫ్ ఎడిటర్‌గా పని చేసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా చేరారు. అలా కెరీర్ తొలినాళ్లలోనే లా జర్నల్స్‌కు రిపోర్టర్‌గా పని చేసే అవకాశం లభించింది. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. » హైకోర్టు, పరిపాలనా ట్రైబ్యునల్, సివిల్ కోర్టుల్లో న్యాయవాదిగా పని చేశారు. సివిల్, క్రిమినల్, సర్వీసు కేసులతోపాటు రిట్ పిటిషన్లలో వాదనలు వినిపించారు. 1995 నుంచి 2001 వరకు రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, నీటిపారుదల వ్యవస్థ, విద్యుత్తు, ఆర్థిక, కార్మిక శాఖలతోపాటు ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయాలకు చెందిన పలు కేసులను పర్యవేక్షించారు. » 2001 జూన్ 25న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002 జులై 31న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ జి.రోహిణి నియమితులయ్యారు. అప్పటి నుంచి ఎన్నో సంచలన కేసుల్లో తీర్పులను వెలువరించారు. » రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ జి.రోహిణి అదనపు న్యాయసేవలందించారు. లోక్‌అదాలత్‌ల ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి జస్టిస్ రోహిణి ఎంతో కృషి చేశారు. గతంలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యులుగా, జువెనైల్ జస్టిస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. |
ఏప్రిల్ - 12
|
| ¤ వాటికన్‌కు చెందిన కీలకమైన 'పోన్టిఫిషియల్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్' సారథిగా బ్రిటిష్ మహిళా సోషియాలజిస్టును పోప్ ఫ్రాన్సిస్ ఎంపిక చేశారు. అత్యంత ప్రాధాన్యమైన ఈ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలంటూ మార్గరేట్ స్కాట్‌ఫోర్డ్ ఆర్చర్ పేరును ప్రతిపాదించారు. వాటికన్ విధాన నిర్ణయాలకు ఒకరకంగా పునాదిగా నిలిచే పరిశోధనలన్నీ కూడా ఈ సంస్థ లోనే జరుగుతాయి. » 71 సంవత్సరాల మార్గరేట్ ఆర్చర్ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. |
ఏప్రిల్ - 15
|
| ¤ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారాంను నూతన ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. » నియమకాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (ఏసీసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. » అరవింద్ మాయారాం 1978 ఐఏఎస్ బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందినవారు. » 2012 నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి బాధ్యతలను మాయారాం నిర్వహిస్తున్నారు. ఇకమీదట కూడా ఆర్థిక వ్యవహారాల విభాగాన్ని మాయారాం పర్యవేక్షిస్తారు. » సుమిత్ బోస్ మార్చి 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో నూతన ఆర్థిక కార్యదర్శిగా అరవింద్ మాయారాం నియమితులయ్యారు. |
ఏప్రిల్ - 17
|
| ¤ భారత నూతన నౌకాదళాధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత నౌకాదళానికి 22వ అధిపతి. » నౌకాదళంలో జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ, డి.కె. జోషి తన పదవికి రాజీనామా చేయడంతో రెండు నెలలుగా ఆ స్థానం ఖాళీగా ఉంది. » తాత్కాలిక చీఫ్‌గా ఉన్న ధోవన్‌ను నౌకాదళాధిపతిగా ప్రభుత్వం నియమించింది. » 59 ఏళ్ల ధోవన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అమెరికాలోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, నావల్ వార్ కాలేజ్ పూర్వ విద్యార్థి. » ధోవన్ 25 నెలల పాటు భారత నౌకదళాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.¤ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నరేంద్ర కొఠారీ నియమితులయ్యారు. » కొఠారీ నియామకాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం (ఏసీసీ) ఆమోదించింది. |
ఏప్రిల్ - 21
|
| ¤ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) డైరెక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ నియమితులయ్యారు. |
ఏప్రిల్ - 27
|
| ¤ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్రమల్ లోధా (ఆర్.ఎం.లోధా) చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. » చీఫ్ జస్టిస్‌గా లోధా సెప్టెంబరు 27 వరకు కొనసాగనున్నారు. » బొగ్గుగనుల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. » సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల (సీజేల)కు నియమిత పదవీ కాలం ఉండాలనే ఆలోచన తనకు అంగీకారం కాదని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఆర్.ఎం.లోధా అన్నారు. ప్రస్తుతమున్న కొలీజియం విధానమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ లోధా ఈ విషయంలో తనకంటే ముందు పనిచేసిన జస్టిస్ పి.సదాశివం అభిప్రాయంతో విభేదించారు. సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు రెండేళ్ల స్థిర పదవీకాలం ఉండాలని జస్టిస్ పి.సదాశివం గతంలో పేర్కొన్నారు. » 'క్రమశిక్షణపై ఆధారపడిన వ్యవస్థ ఇది. రెండేళ్ల స్థిరమైన పదవీకాలం ఉంటే మిగతా న్యాయమూర్తుల ఆకాంక్షలు దెబ్బ తింటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సగటు పదవీకాలం నాలుగేళ్లకంటే తక్కువే ఉన్నపుడు, సీజేఐ రెండేళ్లు కొనసాగడం భావ్యం కాదు' అని జస్టిస్ ఆర్.ఎం.లోధా పేర్కొన్నారు. దోషరహిత వ్యక్తిత్వమున్న సచ్ఛీలురను న్యాయమూర్తులుగా నియమిస్తేనే న్యాయసంస్థలు సాఫీగా నడుస్తాయని ఆయన వెల్లడించారు. |
ఏప్రిల్ - 29
|
| ¤ భారత వైమానిక దళ మాజీ అధిపతి నార్మన్ అనిల్ కుమార్ బ్రౌనే నార్వేలో భారత రాయబారిగా నియమితులయ్యారు. » బ్రౌనే 2011 జులై నుంచి 2013 డిసెంబరు వరకు వైమానిక దళ అధిపతిగా వ్యవహరించారు. » ఆర్.కె.త్యాగి స్థానంలో బ్రౌనే నియమితులయ్యారు.¤ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఇట్స్ఏపీ) కొత్త అధ్యక్షుడిగా రమేష్ లోగనాథన్ నియమితులయ్యారు. » 2014-16 సంవత్సరాలకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. » అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సంస్థ ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌లో నెలకొల్పిన అతిపెద్ద పరిశోధన - అభివృద్ధి కేంద్రానికి రమేష్ నాయకత్వం వహిస్తున్నారు. 2012-14 సంవత్సరాలకు ఆయన ఇట్స్ఏపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. » వి.రాజన్న స్థానంలో రమేష్ బాధ్యతలు చేపట్టారు.¤ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధిపతుల జాబితాలో మరో భారతీయుడు చేరారు. » భారత్‌లో పుట్టిన రాజీవ్‌సూరి (46) ఫిన్లాండ్‌కు చెందిన నోకియాకు ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నోకియా సొల్యూషన్స్ నెట్‌వర్క్స్ (ఎన్ఎస్ఎన్) అనే చిన్నపాటి నెట్‌వర్క్ సామగ్రి యూనిట్‌కు అధిపతిగా ఉన్నారు. » స్టీఫెల్ ఎలాప్ స్థానంలో రాజీవ్ సూరి బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్‌కు ఎలాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటారు. తాత్కాలిక సీఈఓగా ఉన్న రిస్తో సిలస్మా ఇక నోకియా బోర్డు డైరెక్టర్లకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మే 1 నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి. నోకియా తన హ్యాండ్‌సెట్ల వ్యాపారాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు 7.2 బిలియన్ డాలర్లకు విక్రయించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. » మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికైన సత్య నాదెళ్ల లాగే సూరి కూడా మంగళూరు యూనివర్సిటీకి చెందిన మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) లోనే చదివారు. » అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా ఉన్న భారతీయుల జాబితాలో సూరి కూడా చేరారు. ఇప్పటికే సత్య నాదెళ్లతో పాటు ఇంద్రా నూయి (పెప్సికో ఛైర్‌పర్సన్), రాకేష్ కపూర్ (రెకిట్ బెంకిసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), అజయ్ బంగా (మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవో), అన్షూ జైన్ (డాయిష్ బ్యాంక్ సీఈవో) తదితరులు ప్రపంచ యవనికపై భారత పతాకను రెపరెపలాడిస్తున్నారు. » రాజీవ్ సూరి 1967లో భారత్‌లో జన్మించారు. 1989లో మంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. » ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా ఆయనకు ఎంబీఏ/ పీజీ, మేనేజ్‌మెంట్, ఇతరత్రా ఉన్నత డిగ్రీలేవీ లేకపోవడం గమనార్హం. |
|
|