ఆగస్టు - 2014 వార్తల్లో వ్యక్తులు


ఆగస్టు - 4
¤  'మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2010'లో భాగమైన '2014 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ప్రపంచ ఛాంపియన్' గా ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల విద్యార్థి అర్జిత్ కన్సాల్ ఎంపికయ్యాడు.   »    ఈ అవార్డు కింద అర్జిత్‌కు అయిదువేల డాలర్ల బహుమతి లభించింది.    »    మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ప్రపంచ ఛాంపియన్ పోటీలను గత 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.    »    తాజాగా అమెరికాలోని డిస్నీ గ్రాండ్ కాలిఫోర్నియన్ రిసార్ట్‌లో జరిగిన 13వ వార్షిక పోటీకి 130 దేశాల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు పోటీ పడ్డారు.    »    మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులపై ఉన్న నైపుణ్యం ఆధారంగా వీరి నుంచి 123 మందిని తుదిదశకు ఎంపిక చేశారు.    »    అర్జిత్ పశ్చిమ ఢిల్లీలోని మహారాజా అగ్రసేన్ పాఠశాల విద్యార్థి.¤  రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ఆతిథ్యం స్వీకరించనున్న చిత్రకారుల్లో ప్రప్రథమ విశిష్ఠ అతిథిగా జోగేన్‌చౌధురి (75 సంవత్సరాలు) ప్రత్యేకతను సాధించారు.    »    ఆగస్టు 4 నుంచి 14 రోజులపాటు ఆయన రాష్ట్రపతి భవన్‌లో అతిథిగా ఉంటారు. శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ఎమిరైటస్ ప్రొఫెసర్ అయిన ఆయన చక్కని చిత్రకారుడు. ఆయన కుంచె నుంచి జాలువారిన ఎన్నో పెయింటింగులు ఎప్పటినుంచో రాష్ట్రపతి భవన్ కళాకృత శ్రేణిలో ఉన్నాయి.   »    ఇటీవలే కొందరు ఆవిష్కర్తలకు ఆతిథ్యమిచ్చిన రాష్ట్రపతి భవన్ ఇప్పుడు చిత్రకారులు, రచయితలను సాదరంగా సత్కరించేందుకు సమాయత్తమైంది.
ఆగస్టు - 6
¤  చిత్తూరు జిల్లా గాదంకిలోని నేషనల్ అట్మాస్ఫిరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్
సంచాలకులుప్రొఫెసర్ అచ్యుతన్ జయరామన్ అంతరిక్ష పరిశోధన కమిటీ ఉపాధ్యక్షుడిగా 
ఎన్నికయ్యారు.   »    మాస్కోలో జరిగిన 40 అంతరిక్ష పరిశోధన కమిటీ సాధారణ సమావేశాల్లో  ఎన్నికజరిగింది.   »    వాయు పీడనాన్ని కొలిచే బెలూన్‌లురాకెట్లుఅంతరిక్ష వాహనాల ప్రయోగాలు 
లాంటిపరిశోధనల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా జయరామన్‌కు  పదవి లభించింది.   »    భారత్‌లో తొలిసారిగా ఇంతటి అత్యున్నత పదవి అందుకున్న వ్యక్తిగా జయరామన్ వార్తల్లోనిలిచారు.
ఆగస్టు - 8
¤  అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని అమెరికా ఆహ్వానించింది. తనకు అనుకూలమైన తేదీలో మోడీ ప్రసంగించేందుకు ఆహ్వానిస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయెనర్ లేఖ రాశారు.¤  బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన జ్యుయెలరీ దిగ్గజం రణ్‌బీర్ సింగ్ సురి బ్రిటన్ 'హౌస్ ఆఫ్ లార్డ్స్' సభ్యుడిగా ఎంపికయ్యారు.   »    'పీరేజెస్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్‌డమ్ ఫర్ లైఫ్‌'ను పొందిన 22 మంది ప్రముఖుల్లో రణ్‌బీర్ ఒకరు. టీవీ తార, మహిళా వ్యాపారవేత్త క్యారెన్ బ్రాడీ, రిటైల్ వ్యాపారవేత్త సర్ స్టువార్ట్ రోస్ లాంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.   »    వీరి చేరికతో 'హౌస్ ఆఫ్ లార్డ్స్‌'లో పీర్స్ సంఖ్య 850కి చేరింది.   »    బ్రిటన్‌లోని అత్యంత ధనిక ఆసియన్లలో ఒకరిగా రణ్‌బీర్‌సింగ్ పేరు పొందారు. ఆయన సంపద విలువ 4 కోట్ల పౌండ్ల మేర ఉండొచ్చని అంచనా. ఆయన ఓషనిక్ జ్యువెలర్స్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.   »    బ్రిటన్ ప్రధానమంత్రి వద్ద వ్యూహరచన డైరెక్టర్‌గా కూడా రణ్‌బీర్‌సింగ్ గతంలో పనిచేశారు. 
ఆగస్టు - 10
¤  కృష్ణగోపాల్ తివారీ అనే అంధుడు మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. కంటిచూపు లేని ఐఏఎస్‌ను కలెక్టరుగా మధ్యప్రదేశ్‌లో నియమించడం ఇదే ప్రథమం.¤  తైక్వాండో కిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన రంగస్వామి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.   »    అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తైక్వాండో క్రీడలో భాగంగా 20 నిమిషాల్లో తన కాళ్లతో 50 వేల కిక్స్ (ఒక కాలుతో మరో కాలును కొట్టడం) చేశాడు. తాజాగా రంగస్వామి 10 నిమిషాల్లో 50,614 కిక్స్ చేసి ఆ రికార్డు బద్దలు కొట్టాడు.
ఆగస్టు - 13
¤  రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ సహా అయిదుగురు భారత బిలియనీర్ల వద్దే దేశంలో మొత్తం కుబేరుల సంపదలో సగం పోగుపడి ఉందని వెల్త్ - ఎక్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.         »    ముకేష్ అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వి, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ దేశంలో తొలి అయిదుగురు కుబేరులు.   »    ఈ అయిదుగురి వద్ద మొత్తం 85.5 బిలియన్ డాలర్లు (రూ.5,23,897 కోట్లు) ఉన్నట్లు
వెల్త్ - ఎక్స్ ప్రకటించింది. ఈ అయిదుగురి సంపద మొత్తం భారత బిలియనీర్ల సంపదలో 47.5 శాతానికి సమానం.
   »    ముకేష్ అంబానీ 24.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,49,474 కోట్లు)తో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో నిలిచారు. యార్సెలర్ మిట్టల్ ఛైర్మన్, సీఈఓ లక్ష్మీ మిట్టల్ (17.2 బిలియన్ డాలర్లు), దిలీప్ సంఘ్వి (16.3 బి.డా.), అజీమ్ ప్రేమ్‌జీ (14.9 బి.డా.), షాపూర్జీ మిస్త్రీ (12.7 బి.డా.) వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.   »    భారత్‌లో అత్యంత ధనవంతుడైన నటుడిగా బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ నిలిచారు. ఆయన సంపద 600 మిలియన్ డార్లు. క్రికెట్ దిగ్గజం సచిన్ సంపద 160 మిలియన్ డాలర్లు.   »    ముకేష్ అంబానీకి చెందిన ఐపీఎల్ క్రికెట్ టీమ్ 'ముంబయి ఇండియన్స్' అత్యంత విలువైన టీమ్‌గా నిలిచింది. ఈ టీమ్ 112 మిలియన్ డాలర్లను కలిగి ఉంది.¤  అంతర్జాతీయ ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్‌లో ఢిల్లీకి చెందిన విద్యార్థి అక్షత్ బబ్నా బంగారు పతకం సాధించి, ఈ ఘనత సాధించిన మొదటి భారత విద్యార్థిగా నిలిచాడు.¤  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నలుగురు జడ్జిలు బాధ్యతలు స్వీకరించారు. ప్రఫుల్ల చంద్ర పంత్, అభయ్ మనోహర్ సాప్రే, ఆర్.భానుమతి, ఉదయ్ ఉమేష్ లలిత్ న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.   »    వీరిలో పంత్, సాప్రే, భానుమతి మేఘాలయ, గౌహతి, జార్ఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వచ్చారు. సీనియర్ న్యాయవాది లలిత్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.   »    ఈ నలుగురు జడ్జిల చేరికతో ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.¤  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా అన్నాడీఎంకేకు చెందిన ఎం.తంబిదురై (67 సంవత్సరాలు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి రెండుసార్లు ఎన్నికయ్యింది ఇప్పటివరకు తంబిదురై ఒక్కరే.   »    తమిళనాడులోని కరూర్ నియోజకవర్గానికి తంబిదురై ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   »    తంబిదురై తొలిసారిగా 1985లో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు.
ఆగస్టు - 16 
¤  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) కొత్త ఛైర్‌పర్సన్‌గా నియమితులైన 64 ఏళ్ల రజ్నీ రాజ్‌దాన్ బాధ్యతలు స్వీకరించారు.   »    డీపీ అగర్వాల్ స్థానంలో ఆమె నియమితులయ్యారు.¤  రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా వరుసగా పదో ఏడాది కూడా ఆర్జనలో అగ్రస్థానంలో నిలిచింది.   »    2013 జూన్ - 2014 జూన్ మధ్యకాలంలో వాణిజ్య ఒప్పందాలు, ప్రైజ్‌మనీ ద్వారా సుమారు రూ.148 కోట్లకు పైగా సంపాదనతో మహిళా అథ్లెట్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.   »    చైనా టెన్నిస్ స్టార్ లి నా సుమారు రూ.143 కోట్లతో రెండో స్థానంలో, సెరెనా విలియమ్స్ సుమారు రూ.143 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 
ఆగస్టు - 18 
¤  రెండేళ్లుగా తాను తలదాచుకుంటున్న లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని త్వరలో వీడనున్నట్లు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ప్రకటించారు.   »    ఆస్ట్రేలియా జాతీయుడైన ఆయన కొంతకాలంగా గుండె, ఊపరితిత్తులకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, ఆయన తక్షణం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితులు వెల్లడించారు.   »    అసాంజేకు చెందిన విక్‌లీక్స్ వెబ్‌సైట్ అమెరికాకు సంబంధించిన సైనిక, దౌత్య రహస్య పత్రాలను గతంలో వెలువరించింది. ఇది అమెరికాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. అసాంజేపై దర్యాప్తు మొదలుపెట్టింది. మరోపక్క ఆయన ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు స్వీడన్‌లో అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో 2012 ఆగస్టు నుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే ఆయనను అరెస్టు చేయడానికి స్కాట్లాండ్ యార్డు పోలీసులు 24 గంటలూ ఈ కార్యాలయం వద్ద పహారా కాస్తున్నారు. 
ఆగస్టు - 19
¤  మెదడు పనితీరుపై పరిశోధన చేసేందుకు భారత సంతతి శాస్త్రవేత్త పార్థ మిత్రాకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రోత్సాహక కార్యక్రమం కింద రూ.1.8 కోట్ల గ్రాంటు లభించింది.   »    'ఎర్లీ కాన్సెప్ట్ గ్రాంట్స్ ఫర్ ఎక్స్‌ప్లొరేటరీ రిసెర్చ్ (అన్వేషణాత్మక పరిశోధనకు ముందస్తు సాయం)' కింద ఈ గ్రాంటును మంజూరు చేశారు.   »    అమెరికా నేషనల్ సైన్స్ ఫాండేషన్‌లో శాస్త్రవేత్త అయిన పార్థ మిత్రా తన సహచరుడు ఫ్లారిన్ అల్బెనుతో కలసి మెదడులోని నాడీకణాల అమరిక, సమాచార ప్రసారంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 'వర్చువల్ న్యూరో అనాటమిస్ట్ (నాడీ కణాలను, వాటి పనితీరును గుర్తించగలిగే కృత్రిమ మేధ) ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నారు.
ఆగస్టు - 20
¤  14 ఏళ్లుగా ఉపవాసదీక్ష చేస్తున్న మణిపూర్ హక్కుల నేత ఇరోను చాను షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు.
¤  జపాన్‌కు చెందిన 111 ఏళ్ల సకారీ మొమోయి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డులకెక్కాడు.
ఆగస్టు - 21
¤  అద్భుత కళాకారులు, రచయితలు అయిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి భవన్ విశిష్ట అతిథులుగా ప్రకటించింది. వీరు సెప్టెంబరు 8 నుంచి 26 వరకు విశిష్ట అతిథులుగా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ఆతిథ్యాన్ని పొందుతారు.   »    విశిష్ట అతిథులుగా ఎంపికైన నలుగురిలో ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన ప్రఖ్యాత రచయిత వేంపల్లి గంగాధర్ కూడా ఉన్నారు. ఆయన రాసిన 'మొలకల పున్నమి'కి 2011లో సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. రైతులు, మహిళలు, రాయలసీమ కరవు ప్రాంతాలపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు.   »    దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట ఈ నలుగురిని ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. మిగిలినవారిలో యాషే డోమా భూటియా (గాంగ్‌టక్), రసూల్ సక్సేనా (చెన్నై), ప్రతాప్ సుధీర్ మోరే (ముంబయి) ఉన్నారు.
ఆగస్టు - 23
¤  గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బయాలజీ, విశ్లేషణ లాంటి అయిదు ప్రధాన సబ్జెక్టుల్లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన లండన్‌లోని భారత సంతతి విద్యార్థి అసానిస్ కళ్యాణ సుందరం అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు.
   »    బోర్డు పరీక్షల్లో ('ఎ' స్థాయిలో) ఇంతటి అరుదైన ప్రతిభ కనబరచడం ఓ రకంగా అసాధారణం. అందుకే 18 ఏళ్ల అసానిష్ అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా బ్రిటన్‌లో ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఆగస్టు - 24
¤  కోట్లాది రూపాయలు చేతులు మారిన కామన్వెల్త్, కోల్‌గేట్ కుంభకోణాల ఆడిట్ నివేదికల నుంచి కొంతమంది పేర్లను తొలగించాలంటూ యూపీఏ హయాంలో తనపై ఒత్తిడి వచ్చినట్లు నాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (మాజీ సీఏజీ) వినోద్ రాయ్ సంచలన ప్రకటన చేశారు.   »    సీఏజీగా ఉన్నప్పటి తన అనుభవాలను వినోద్ రాయ్ 'నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్' పేరిట అక్షరబద్దం చేస్తున్నారు. ఈ పుస్తకం అక్టోబరులో విడుదల అవుతుందని భావిస్తున్నారు. అందులో ఆయన యూపీఏ హయాంలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని నిర్ణయించారు. 2జీ కుంభకోణం వల్ల రూ.1.76 లక్షల కోట్లు, కోల్‌గేట్ మూలంగా రూ.1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ మాజీ సీఏజీ అంచనా వేశారు.
ఆగస్టు - 28
¤  నేర నివారణే లక్ష్యంగా ఇంటర్‌పోల్ చేపడుతున్న 'టర్న్ బ్యాక్ క్రైమ్' అనే అంతర్జాతీయ కార్యక్రమానికి షారుఖ్‌ఖాన్ ప్రచారకర్తగా ఎంపికయ్యారు.   »    షారూఖ్ ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారత నటుడిగా గుర్తింపు పొందారు. జాకీచాన్‌తో పాటు షారుక్ దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.
ఆగస్టు - 31
¤  ఏకంగా 104 డిగ్రీలను సాధించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె.సుధాకర్ వార్తల్లో నిలిచారు.   »    బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో ఆయన తన 104వ డిగ్రీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా చేతుల మీదుగా అందుకున్నారు.   »    ఇప్పటివరకు సుధాకర్ ఇంజినీరింగ్ మినహా ఇతర విభాగాల్లో డిగ్రీలను సాధించారు. న్యాయశాస్త్రంలో ఏకంగా 39 డిగ్రీలను సొంతం చేసుకున్నారు.¤  ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త శివ అయ్యాదురై 'ద కంట్రోల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఫౌండేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ మెడిసిన్: ది రొసెట్టా స్టోన్ ఫర్ సిద్ధ అండ్ ఆయుర్వేద' పేరిట పరిశోధన పత్రాన్ని వెలువరించారు.   »    ఈ పత్రం ఆయుర్వేదం, సిద్ధలోని శాస్త్రీయ పునాదులను వివరిస్తోంది. పురాతన యోగులు, సాధువులు కేవలం వైద్యులు మాత్రమే కారని, వారు సిస్టమ్స్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కూడా అని అందులో పేర్కొన్నారు. రోగం రాకముందే దాని నుంచి రక్షణ కల్పించి, బలాన్ని ఇచ్చేలా ఆయుర్వేదం, సిద్ధను యోగులు తీర్చిదిద్దారని అయ్యాదురై వివరించారు. సరైన జీవన విధానాన్ని ఇది బోధిస్తుందని తెలిపారు.¤  మెక్సికోకు చెందిన 127 ఏళ్ల లియాండ్రా బెకర్రా లుంబ్రేరాస్ బహుశా ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత సుదీర్ఘ కాలం జీవిస్తున్న వ్యక్తి కావచ్చని భావిస్తున్నారు. ఆమె తన 127వ పుట్టిన రోజును జరుపుకుంది.   »    1887 ఆగస్టు 31న మెక్సికోలోని జపోపాన్ నగరంలో లియాండ్రా జన్మించారు. ఆమె రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. లియాండ్రాకు 73 మంది మునిమనవళ్లు ఉన్నారు.