జులై - 2014 వార్తల్లో వ్యక్తులు


జులై - 3
¤  అమెరికా పారిశ్రామికవేత్తల్లో అత్యంత సంపన్నుడిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిలిచారు. ఆయన నికర సంపద 80.2 బిలియన్ డాలర్లు (రూ.4.8 లక్షల కోట్లు).   »    వెల్త్-ఎక్స్ రూపొందించిన తొలి 10 మంది అమెరికా కుబేరుల జాబితాలో ఆరుగురు 'సాంకేతిక పరిజ్ఞాన' విభాగానికి చెందినవారే కావడం గమనార్హం.   »    మొత్తం 10 మంది సంపద విలువ 407.4 బిలియన్ డాలర్లు. అమెరికాలో ఉన్న సంపన్నుల మొత్తం సంపదలో ఇది 20 శాతం.   »    జాబితాలో కురువృద్ధుడైన వారెన్ బఫెట్ (83 ఏళ్లు) 64.2 బిలియన్ డాలర్ల (రూ.3.85 లక్షల కోట్లు) నికర సంపదతో రెండో స్థానంలో ఉండగా అత్యంత పిన్న వయస్కుడైన జుకర్‌బర్గ్ (30 సంవత్సరాలు) ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు.అమెరికాలోని తొలి 10 మంది కుబేరులు (సంపద బి.డాలర్లలో)1. బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు - 80.22. వారెన్ బఫెట్, ప్రఖ్యాత మదుపుదారు - 64.23. లారీ ఎలిసన్, ఒరాకిల్ సీఈఓ - 48.24. మైఖేల్ బ్లూమ్‌బర్గ్, బ్లూమ్‌బర్గ్ ఎల్‌పీ వ్యవస్థాపకుడు - 33.75. షెల్డన్ అడెల్సన్, లాస్‌వెగాస్ శాండ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ - 32.86. లారీ పేజ్, గూగుల్ సహవ్యవస్థాపకుడు - 31.37. మార్క్ జుకర్‌బర్గ్; ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ - 30.98. జెఫ్ బెజోస్; అమెజాన్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ - 30.59. సెర్గీ బ్రిన్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు - 30.110. కార్ల్ ఇకైన్, ఇకైన్ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ - 25.5
 జులై - 4
¤  అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి.త్యాగి, మరో 20 మందిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నల్లధనం చలామణి కేసు నమోదు చేసింది.   »    రూ.3,600 కోట్ల కోనుగోలు వ్యవహారంలో రూ.360 కోట్లకు పైగా చేతులు మారినట్లు 2013 మార్చిలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో త్యాగి, ఆయన కుటుంబ సభ్యులు, ఐరోపా జాతీయులైన కార్లో గెరోసా, క్రిస్టియన్ మైఖేల్, గిడో హష్కే, ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా; యూకేకు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్, చండీగఢ్‌కు చెందిన ఐడీఎస్ ఇన్ఫోటెక్, ఏరోమ్యాట్రిక్స్ కంపెనీలు; మారిషెస్, ట్యునీషియాకు చెందిన రెండు కంపెనీలు, ఇతరులపై ఈడీ కేసు నమోదు చేసింది. 
 జులై - 5
¤  మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల సహా నలుగురు భారతీయ అమెరికన్లను అమెరికా స్వాతంత్య్ర దినం (జులై 4) సందర్భంగా యూఎస్ ప్రభుత్వం న్యూయార్క్‌లో ఘనంగా సన్మానించింది.   »    సత్య నాదెళ్ల సహా ప్రముఖ హాస్య ప్రయోక్త, నటుడు ఆసిఫ్ మండ్వి, కార్నెగీ మిలాన్ వర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్, వర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా మాజీ అధ్యక్షుడు బెహరూజ్ సెథ్నా అమెరికాలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా సన్మానం పొందారు.   »    వీరితో పాటు మరో 36 మందిని కూడా సత్కరించారు. 
 జులై - 7
¤  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ రోహిన్‌టన్ ఎఫ్ నారిమన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా వీరందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.   »    సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. వీరితో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది.¤  కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, జేడీయూ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.   »    కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
 జులై - 9
¤  అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అవకతవకలకు సంబంధించి గవర్నర్ నరసింహన్‌ను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షిగా గవర్నర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.   »    వీఐపీల కోసం కేంద్ర ప్రభుత్వం 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని తలపెట్టగా... వీటి సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో అప్పట్లో ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) సంచాలకుడిగా ఉన్న నరసింహన్‌తోపాటు, అప్పటి జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సంచాలకుడు వాంఛూ సభ్యులుగా ఉన్నారు. సీబీఐ ఇప్పటికే నారాయణన్, వాంఛూను ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.¤  ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షాను (50 సంవత్సరాలు) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.   »    ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
 జులై - 11
¤  నిరంతర, పరిశుద్ధ గంగానది ప్రవాహం (అవిరల్ - నిర్మల్ గంగ) లక్ష్యంగా నెలరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాశీ మహాసంస్థాన్ పీఠం అధిపతి నాగ్‌నాథ్ యోగేశ్వర్ వారణాసిలో మరణించారు.   »    నది సహజ ప్రవాహాన్ని నిరోధిస్తున్న అన్ని అడ్డంకులను తొలగించాలని, కాలుష్యం నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ నిరాహారదీక్షకు దిగి ప్రాణత్యాగం చేశారు.   »    హరిద్వార్‌లో గంగానది ఒడ్డున అక్రమ తవ్వకాలను నిరసిస్తూ స్వామి నిగమానంద్ సైతం 2011లో 115 రోజులు నిరాహార దీక్ష చేసి తుదిశ్వాస విడిచారు.¤  ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంతో బీబీసీ రేడియో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసింది.   »    ప్రముఖ బీబీసీ హోస్ట్ నూరీన్‌ఖాన్ బాలుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.   »    బీబీసీ రేడియోలో ఓ దక్షిణాది కళాకారుడి ఇంటర్వ్యూ ప్రసారం కావడం ఇదే తొలిసారి.
జులై - 12 
¤  అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్' ముఖ్య సమాచార అధికారి (సీఐఓ)గా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని విజిమురళి నియమితులయ్యారు.   »    సీఐఓతో పాటు సమాచార, విద్యా సాంకేతిక పరిజ్ఞాన విభాగం వైస్ ప్రొవోస్ట్‌గానూ ఆమె నియమితులయ్యారు.   »    ఆమె 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఉమెన్స్ కాలేజీలో జీవశాస్త్రం, రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1977లో ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ సైన్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. 1981లో అక్కడే ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.   »    2007 నుంచి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సమాచార ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. 
జులై - 14
¤  అంతర్జాతీయ మెట్ట పంటల, ఉష్ణమండల వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) రాయబారులుగా ప్రముఖ హరిత విప్లవకారుడు ఎం.ఎస్.స్వామినాథన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు.   »    'ఇక్రిశాట్ అంబాసిడర్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డును ఎం.ఎస్.స్వామినాథన్, సైనా నెహ్వాల్‌కు ప్రదానం చేశారు.¤  ప్రపంచంలోని అతి పొడవైన యుక్తవయస్కురాలిగా టర్కీకి చెందిన రుమిషా గెల్గీ (17 సంవత్సరాలు) గిన్నిస్ రికార్డు సృష్టించారు.   »    ఈమె ఏడు అడుగుల 0.09 అంగుళాల పొడవుతో ఈ ఘనత సాధించారు. 
జులై - 16
¤  భారత్‌కు చెందిన ఇబ్రహీం శబ్రాదీ అనే 8 ఏళ్ల బాలుడు దుబాయ్‌లో రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచి 'జాతి ప్రబోధకుడు' అనే టైటిల్ గెల్చుకున్నాడు.   »    దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దుబాయ్రంజాన్ ఫోరం 'సిన్స్ ఆఫ్ ద టంగ్' అనే అంశంపై నిర్వహించిన మత ప్రబోధ పోటీలో ఇబ్రహీం విజేతగా నిలిచాడు.¤  వారెన్ బఫెట్ తాజాగా రూ.16,800 కోట్ల సంపదను అయిదు దాతృత్వ సంస్థలకు విరాళంగా ప్రకటించాడు. ఈ మేరకు బెర్క్‌షైర్ హ్యాథ్‌వేలో తన 2.1 కోట్ల షేర్లను వదులుకున్నాడు.
జులై - 17
¤  దేశవ్యాప్తంగా పేరుపొందిన బెనారస్ సిల్క్ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
జులై - 18
¤  ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) సెక్రటరీ జనరల్ అల్విన్ దిదార్ సింగ్‌కు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.   »    భారత్‌లో ఇ-కామర్స్‌లో గౌరవ డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తిగా సింగ్ రికార్డులకెక్కారు.   »    ఫిక్కీకి ప్రధాన కార్యదర్శి కాకముందు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఆయన పని చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)లో ఆర్థిక సభ్యుడిగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా విధులను నిర్వర్తించారు.   »    కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖలో విదేశీ వాణిజ్యశాఖ బాధ్యతలను కూడా నిర్వహించారు.¤  ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు బోస్టన్‌లోని బెర్కలీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.   »    'స్లమ్ డాగ్ మిలియనీర్', '127 అవర్స్', 'ఎలిజిబెత్ : ది గోల్డెన్ ఏజ్', 'మిలియన్ డాలర్ ఆర్మ్' తదితర ప్రపంచ స్థాయి చిత్రాలకు స్వరాలు అందించి సంగీతానికి చేస్తున్న సేవలకు గుర్తుగా రెహమాన్‌కు ఈ డాక్టరేట్‌ను ప్రకటించారు.   »    సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్న రెహమాన్ పేరు మీదుగా బెర్కలీ కళాశాల అక్కడి విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.
జులై - 21
¤  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రభుత్వం ఎంపిక చేసింది.   »    తెలంగాణ వికాసానికి విశిష్ట వ్యక్తులతో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   »    టెన్నిస్‌లో మరింతగా ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం, సానియాకు తెలంగాణ సర్కారు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది.¤  ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు యూపీఏ హయాంలో రాజకీయ ఒత్తిడికి తలొగ్గి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు న్యాయమూర్తి ఒకరికి పదవీ కాలాన్ని పొడిగించారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరోపణలు చేశారు.
జులై - 22
¤  హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది.   »    హాలీవుడ్ సూపర్‌స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఏడాదికి రూ.450 కోట్ల పారితోషికంతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.   »    జాబితాలో రెండో స్థానంలో డ్వేన్ దిరాక్ జాన్సన్ (రూ.313 కోట్లు), మూడో స్థానంలో బ్రాడ్లీ కూపర్ (రూ.277 కోట్లు) నిలిచారు. నాలుగు, అయిదు స్థానాల్లో వరుసగా లియోనార్డో డికాప్రియో, క్రిష్ హెమ్స్‌వర్త్ నిలిచారు.
జులై - 24
¤  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త అధ్యక్షుడిగా ఎ.ఎస్.దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.   »    ఉపాధ్యక్షుడిగా పి.వి.భట్టాడ్ ఎన్నికయ్యారు.   »    వీరిద్దరూ 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి తమ పదవులు నిర్వహిస్తారు.
జులై - 25
¤  బాలీవుడ్ సూపర్‌స్టార్ దివంగత రాజేష్ ఖన్నా ఇంటిని (బంగ్లా) ఆయన కుమార్తెలు విక్రయించారు. ప్రముఖ వ్యాపారవేత్త శశికిరణ్ శెట్టి రూ.90. కోట్లకు ఈ బంగ్లాను సొంతం చేసుకున్నారు.   »    ముంబయిలోని కాటర్ రోడ్డు సముద్ర తీరంలో 'ఆశీర్వాద్' పేరుతో ఈ భవంతి ఉంది.   »    రాజేష్ ఖన్నా అప్పట్లో ఈ ఇంటిని బాలీవుడ్ నటుడు రాజేంద్రకుమార్ వద్ద రూ.3.50 లక్షలకు ఖరీదు చేశారు.
జులై - 27
¤  మహారాష్ట్ర హార్టికల్చర్ (ఉద్యానవనశాఖ)కు రాయబారిగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు.   »    20 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలను పెంచుతూ మహారాష్ట్ర దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.   »    అమితాబ్ బచ్చన్ గుజరాత్ రాష్ట్ర పర్యాటక రాయబారిగా కూడా వ్యవహరిస్తున్నారు.
జులై - 28
¤  కష్టమైన ప్రాంతాల్లో కష్టమైన పనులు చేసేవారికి ఇచ్చే పురస్కారం నిమిత్తం తుది జాబితాలో భారత్‌కు చెందిన గొల్లపల్లి ఇజ్రాయెల్ ఎంపికయ్యారు.   »    'ది ఓపస్ ప్రైజ్ ఫౌండేషన్' తరఫున గొండిగా వర్సిటీ అక్టోబరు 16న ప్రదానం చేసే ఈ పురస్కారం కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను విజేతకు అందజేస్తారు.   »    తమిళనాడులో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దళితుల విద్య, మానవ హక్కుల కోసం పాటుపడుతున్న గొల్లపల్లి ఇజ్రాయెల్ తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.¤  తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అరుదైన ఆహ్వనం అందుకున్నారు.   »    సింగపూర్‌లోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)' పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించే సదస్సుకు కేసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.   »    సింగపూర్‌లోని 'రాఫెల్స్ సిటీ కన్వెన్షన్ సెంటర్' లో ఆగస్టు 22, 23వ తేదీల్లో 'ఇంపాక్ట్ 2014' పేరుతో జరిగే ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సింగపూర్ ప్రధానమంత్రి లీహ్సీన్ లూంగ్, అధ్యక్షులు ఎస్.ఆర్. నాథన్, ఉప ప్రధానమంత్రి థర్మన్ షణ్ముగ రత్నం, మంత్రి ఎస్.ఈశ్వరన్ కూడా హాజరుకానున్నారు.   »    భారత దేశం నుంచి ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే.   »    వివిధ దేశాల నుంచి కార్యక్రమానికి హాజరయ్యే ఐఐఎం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు.
జులై - 31
¤  దేశ 26వ సైన్యాధ్యక్షుడిగా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బాధ్యతలు స్వీకరించారు.   »    బిక్రమ్‌సింగ్ స్థానంలో దల్బీర్ సింగ్ నియమితులయ్యారు.   »    న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పూర్వ సైన్యాధ్యక్షుడు బిక్రమ్ సింగ్ నుంచి సుహాగ్ 'చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బ్యాటన్' అందుకున్నారు. 30 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.   »    సుహాగ్ 1987లో శ్రీలంకలో భారతీయ శాంతి సంరక్షక దళంలో పనిచేశారు. కార్గిల్ ద్రాస్ సెక్టార్‌లో పనిచేసినప్పుడు అందించిన అత్యుత్తమ సేవలకు గాను సుహాగ్‌కు 'అతి విశిష్ట సేవా పతకం' లభించింది.¤  హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జాతీయ నిర్మాణ సంస్థ (NAC - నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) డైరెక్టర్ జనరల్‌గా బి.శ్యాంబాబు బాధ్యతలు చేపట్టారు.   »    ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు - భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబుకు ఏపీ ప్రభుత్వం న్యాక్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.   »    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే న్యాక్ డీజీగా రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ముఖ్య ఇంజినీర్‌ను నియమించింది.   »    న్యాక్ తమకే చెందాలని ఇరు ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది.