మే - 1
|
| ¤ చేనేత కార్మికుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సురయ్యా హసన్ బోస్‌కు హైదరాబాద్‌లో 23వ యుధ్‌వీర్ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. » యుధ్‌వీర్ ఫౌండేషన్ ఛైర్మన్ నరేంద్ర లూథర్. |
మే - 2
|
| ¤ ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో చూపిన తెగువకు ముగ్గురికి దేశంలో రెండో అత్యున్నత సాహస పురస్కారమైన 'కీర్తిచక్ర'ను, మరో 10 మందికి 'శౌర్య చక్ర'ను ప్రదానం చేశారు. » రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. » సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ భృగునందన్ చౌధరి, అసోంకు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ లోహిత్ సోనోవాల్‌లకు మరణానంతరం ఈ సాహస పురస్కారం ప్రకటించారు. గూర్ఖా రైఫిల్స్‌లో నాయబ్ సుబేదార్ భూపాల్‌సింగ్ మగర్ కు కూడా కీర్తిచక్రను ప్రదానం చేశారు. » సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ భృగునందన్ 2012 సెప్టెంబరులో బీహార్‌లోని చక్రబంధన్ అడవుల్లో మావోయిస్టులతో పోరాడుతూ తీవ్రంగా గాయపడినా, సహచరులను రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయారు. సీఆర్‌పీఎఫ్‌లో కీర్తిచక్ర పురస్కారం అందుకున్న తొలివ్యక్తి భృగునందనే కావడం విశేషం. » నేపాల్ కు చెందిన భూపాల్‌సింగ్ గతేడాది జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి ఇద్దరిని మట్టుపెట్టారు. » పదిమందికి దేశంలో మూడో అత్యున్నత సాహస పురస్కారమైన శౌర్యచక్రను ప్రదానం చేశారు. » శౌర్యచక్ర అందుకున్న సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ప్రకాష్ రంజన్ మిశ్రా ఇప్పటివరకు అయిదు సాహస పురస్కారాలు అందుకోవడం విశేషం.¤ వినూత్న వ్యాపార ఆలోచనలకు సంబంధించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన పోటీల్లో నలుగురు భారతీయులకు అవార్డులు లభించాయి. » భారత్‌కు చెందిన అమృతా సైగల్, సౌరభ్ మహాజన్, మీరా మోహతా, ప్రీతార్ కుమార్‌లు అవార్డులు గెలుచుకున్నారు. » 'సామాజిక సంస్థ' విభాగంలో హార్వర్డ్ ఎంబీఏ విద్యార్ధిని అమృతా సైగల్ గ్రాండ్‌ప్రైజ్ గెలుచుకున్నారు. ఒరాకిల్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న క్రిస్టెన్ కాగెత్సుతో కలిసి ఆమె 'సాథీ' అనే ప్రాజెక్టును ప్రతిపాదించారు. అరటి చెట్టు నుంచి సేకరించిన పీచుతో భారత్‌లోని గ్రామీణ మహిళలకు చౌకగా శానిటరీ ప్యాడ్‌లు అందించడం దీని ఉద్దేశం. ఈ ఆలోచనకు 50 వేల డాలర్ల బహుమతితో పాటు ప్రేక్షకుల ఎంపిక అవార్డు కూడా దక్కింది. » బిజినెస్ ట్రాక్ విభాగంలో సౌరభ్ మహాజన్, మార్సెలా శాపోన్, జెస్‌బెక్‌లు డ్రై క్లీనింగ్, ఇంటిని శుభ్రపరచడం, లాండ్రీ వంటి సేవలకు సంబంధించి 'ఆల్ఫ్రెడ్' అనే ఆలోచనతో 50 వేల డాలర్లు గెలుచుకున్నారు. » సామాజిక వ్యాపార ఆలోచన విభాగంలో ఎంబీఏ విద్యార్థులు మీరా మెహతా, మైక్ లారెన్స్‌లు ప్రతిపాదించిన 'టమోటా జోస్' రన్నరప్‌గా నిలిచింది. » వ్యాపార విభాగంలో ఎంబీఏ విద్యార్థి ప్రీతార్ కుమార్ ప్రతిపాదించిన 'బూయా వ్యాపారం' రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ జిమ్‌లు, ఇన్‌స్ట్రక్టర్లు రూపొందించిన శారీరక కసరత్తులను వీడియో ద్వారా అందించడం దీని ప్రత్యేకత. |
మే - 3
|
| ¤ ప్రముఖ సినీ గేయ రచయిత, దర్శకుడు గుల్జార్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని (2013 సంవత్సరానికి) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. » న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో గుల్జార్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. » గుల్జార్‌ను రాష్ట్రపతి స్వర్ణకమల పతకం, రూ. 10 లక్షల నగదు, శాలువతో సత్కరించారు. భారత చలనచిత్రరంగంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. » దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు 61వ జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా రాష్ట్రపతి విజేతలకు ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ చిత్రీకరించిన 'షిప్ ఆఫ్ థీసియస్' అవార్డును గెల్చుకుంది. ప్రాంతీయ భాషా చిత్రాల కేటగీరిలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'నా బంగారు తల్లి' పురస్కారం గెలుచుకుంది. |
మే - 4
|
| ¤ పోలియో నివారణకు విశేష సేవలందించినందుకు బీహార్‌కు చెందిన ఆరోగ్య శాఖ అధికారిణి మార్తా డోడ్రేను భారత ప్రభుత్వం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు - 2014కు ఎంపిక చేసింది. » మార్తా డోడ్రే జార్ఖండ్‌లోని పాలమౌ జిల్లాకు చెందిన గిరిజన మహిళ. ఆమె బీహార్‌లోని దర్బంగా జిల్లాలోని కుషేశ్వర్‌స్థాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తోంది. » పోలియో టీకాల ప్రచారంలో భాగంగా ఆమె ప్రతిరోజూ మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు అనేక కిలోమీటర్లు కాలినడకనే వెళ్లి వందలాది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించడంలో సఫలీకృతమయింది. » ఈ అవార్డు కింద మార్తాకు రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. » అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా మే 12న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును డోడ్రేకు ప్రదానం చేయనున్నారు. » 2013 నవంబరులో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును కూడా మార్తా డోడ్రే అందుకోవడం గమనార్హం. |
మే - 5
|
| ¤ టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా బ్రిటన్‌లో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ)ని అందుకున్నారు. » 1950లో భారత్ గణతంత్రంగా ఆవిర్భవించిన తరువాత ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి భారతీయుడు రతన్‌టాటాయే. » భారత్‌లో బ్రిటిష్ హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సర్ జేమ్స్ బేవన్ న్యూఢిల్లీలో టాటాకు జీబీఈని రెండో ఎలిజబెత్ రాణి తరపున అందజేశారు. » బ్రిటన్ - భారత్ సంబంధాలు పటిష్ఠం కావడానికి రతన్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. |
మే - 6
|
| ¤ అట్లాంటాలోని (అమెరికా) మిల్టన్ ఉన్నత పాఠశాలలో సీనియర్ విద్యనభ్యసిస్తున్న ప్రవాసాంధ్ర బాలిక నల్లజర్ల మేఘనకు 2014 అమెరికా అధ్యక్ష పురస్కారం లభించింది. » అధ్యక్షుడు ఒబామా నియమించిన సభ్యుల సంఘం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి మొత్తం 141 మందిని ఈ అవార్డుకు ఎంపికచేశారు. » జూన్ 20న నిర్వహించే 50వ అధ్యక్ష పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఒబామా చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. |
మే - 25
|
| ¤ ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ముగిసిన 67వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డును 'వింటర్ స్లీప్' అనే టర్కిష్ చిత్రం గెలుచుకుంది. » వింటర్ స్లీప్ చిత్ర దర్శకుడు నూరి బిల్డ్ సెలాన్. » ఇప్పటివరకు టర్కిష్ నుంచి 'ది వే' (1982లో) చిత్రం మాత్రమే కేన్స్‌లో ఈ ఘనత సాధించింది. » కేన్స్‌లో రెండో అత్యున్నత పురస్కారమైన 'ది గ్రాండ్ ప్రిక్స్'ను ఇటాలియన్ చిత్రం 'ది వండర్స్' గెలుచుకుంది. అలైస్ రోర్ వాచర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. » ఉత్తమ నటుడిగా తిమోతీ స్పాల్ (మిస్టర్ టర్నర్ అనే చిత్రంలో నటనకు) ఎంపికయ్యారు. » 'మాప్స్ టు ది స్టార్స్' చిత్రానికి జులియన్నే మూర్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. » 'ఫాక్స్ కేచర్' సినిమాకు బెన్నెట్ మిల్లర్ ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు.¤ వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, పలు దాడుల్లో గతేడాది మృతి చెందిన 106 మందికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక డాగ్ హామర్షల్డ్ అవార్డు ప్రకటించింది. వీరిలో 8 మంది భారతీయ సైనికులు, సిబ్బంది ఉన్నారు. » మృతి చెందిన వారి తరపు బంధువులకు అంతర్జాతీయ శాంతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ఐరాస సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ ఈ అవార్డును అందజేస్తారు. » భారతదేశం నుంచి ఈ అవార్డుకు మనిపాల్ సింగ్, లాన్స్ నాయక్ నందకిషోర్, హవల్దర్ హీరాలాల్, నాయక్ సుబేదార్ శివకుమార్ పాల్, హవల్దర్ భరత్ సాస్ మాల్, సుబేదార్ ధర్మేష్ సంగ్వాన్, సుబేదార్ కుమార్ పాల్‌సింగ్, రామేశ్వర్ సింగ్ ఎంపికయ్యారు. » వీరు ఐరాస దక్షిణ సూడాన్ విభాగంలో విధులు నిర్వర్తించేవారు. » గత అరవై ఏళ్ల నుంచి ఐరాస శాంతి పరిరక్షక దళానికి భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. |
మే - 27
|
| ¤ దూరవిద్య విధానంలో ఉత్తమ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2014 సంవత్సరానికి 'సీఎస్ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ మ్యాగజైన్ 'కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ' ఏర్పాటు చేసింది. |
|
|