ఏప్రిల్ - 1
|
| ¤ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 'అత్యంత స్ఫూర్తిమంతమైన బాలీవుడ్ మహిళా దిగ్గజం'గాఎంపికయ్యారు. గతేడాది ప్రారంభించిన ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విజేత ఆమె. ఈ మేరకు బ్రిటన్‌లో జరిగిన మూడో బ్రాడ్‌ఫోర్డ్ ఇన్‌స్పిరేషన్ వుమెన్ అవార్డ్స్ (బీఐడబ్యూఏ)లో 46 ఏళ్ల నటీమణిని పురస్కారంతో గౌరవించారు. » గతేడాది ప్రపంచం 100 ఏళ్ల బాలీవుడ్ సినిమా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో అత్యంత స్ఫూర్తిమంతమైన మహిళా బాలీవుడ్ దిగ్గజాన్ని సత్కరించడమే లక్ష్యంగా బీఐడబ్ల్యూఏ - 2013ను ప్రకటించారు. |
ఏప్రిల్ - 2
|
¤ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను హైదారాబాద్ సీబీఐ విభాగం ఇన్‌స్పెక్టర్ విజయ్ భాస్కర్‌కు అవార్డు లభించింది. సీబీఐ అవతరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్ రంజిత్‌సిన్హా చేతుల మీదుగా విజయ్‌భాస్కర్‌కు 'ఉత్తమ దర్యాప్తు అధికారి' అవార్డును అందజేశారు.
|
ఏప్రిల్ - 3
|
¤ ఉత్తమ చిత్రాలకు ఏటా ఇచ్చే బి.నాగిరెడ్డి పురస్కారాన్ని 2013 ఏడాదికి గాను 'అత్తారింటికి దారేది' చిత్రానికి అందించనున్నట్లు 'విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' బాధ్యులు బి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. కుటుంబ విలువలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్‌కు ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తామని చెప్పారు.
|
ఏప్రిల్ - 11
|
| ¤ హైదరాబాద్ సోదరులుగా పేరుపొందిన కర్ణాటక సంగీత విద్వాంసులు డి.శేషాచారి, డి.రాగాచారిలకు 2013 ఏడాదికిగాను 'సంగీత నాటక అకాడమీ అవార్డు'ను రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ బహూకరించారు.¤ టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'నైట్ గ్రాండ్ క్రాస్ (జీబీఈ)' అవార్డు లభించింది. బ్రిటన్, భారత్ మధ్య సంబంధాలు; బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీస్ (ఎఫ్‌సీఓ) వెల్లడించింది. 2014కి అయిదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటిష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్ టాటా ఒకరు. » 2009లో టాటాకు నైట్ కమాండర్ (కేబీఈ) అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది. ఆయన నేతృత్వంలోని టాటా గ్రూప్ బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ లాండ్ రోవర్‌ను కొనుగోలు చేసిన ఏడాదికి ఈ పురస్కారం లభించింది. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని గాడిలోకి తీసుకురావడంలో టాటా గ్రూప్ విజయం సాధించింది. టాటా గ్రూప్ బ్రిటన్‌లో దాదాపు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. |
ఏప్రిల్ - 12
|
| ¤ కవిగా, రచయితగా, కథకుడిగా, దర్శకుడిగా, సంభాషణల రచయితగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన గుల్జార్‌కు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని ప్రకటించింది. » గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కర్లా. గుల్జార్ అతడి కలం పేరు. 1934లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని దీనా అనే చిన్న పట్టణంలో జన్మించారు. దేశ విభజన సమయంలో అతడి కుటుంబం అమృత్‌సర్‌కి వలస వచ్చింది. » 'బందిని' చిత్రంతో గుల్జార్ గీతరచయితగా పరిచయమయ్యారు. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, శంకర్ జైకిషన్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ఎందరో హేమాహేమీల్లాంటి సంగీత దర్శకులు ఆయన పాటలకు స్వరకల్పన చేశారు. కిషోర్‌కుమార్, లతామంగేష్కర్, ఆశాభోంస్లే లాంటి గాయనీగాయకుల గళాల్లో గుల్జార్ రాసిన పాటలు సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. » 2010లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని 'జయహో గీతానికి ఆయన రెహమాన్‌తో కలసి ఆస్కార్‌ను అందుకున్నారు. ఇదే పాటకు గ్రామీ కూడా దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అయిదు జాతీయ పురస్కారాలు, ఇరవై ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు గుల్జార్‌ను వరించాయి. 2004లో భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారంతో సత్కరించింది. » గజల్స్ ప్రక్రియలో గుల్జార్ సరికొత్త ప్రయోగం చేశారు. 'త్రివేణీ' పేరుతో మూడు పంక్తుల్లో ముగిసే గజల్స్‌కి రూపకల్పన చేశారు. » పిల్లల వ్యక్తిత్వ వికాసాలకు ఉపయోగపడే రచనలను చేశారు. దూరదర్శన్‌లో విశేష ఆదరణ పొందిన 'జంగిల్ బుక్' సిరీస్‌కు గీత రచయిత ఈయనే. పాటల రూపంలో ఉండే కథలుగా ఈయన రాసిన 'కరాడీ టేల్స్' చిన్నపిల్లలను అమితంగా ఆకట్టుకున్నాయి. » సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకుంటున్న 45వ వ్యక్తిగా గుల్జార్ నిలిచారు. » ఈ అవార్డు కింద స్వర్ణకమలంతో పాటు రూ.10 లక్షల నగదు, శాలువా అందజేస్తారు. |
ఏప్రిల్ - 16
|
¤ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్‌ఫెస్టివల్స్ 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను న్యూఢిల్లీలో ప్రకటించింది. 2013 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. » ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 62 విభాగాల్లో విజేతలను ప్రకటించింది. ఎక్కువ శాతం హిందీ, మలయాళం, మరాఠీ చిత్రాలే అవార్డులు దక్కించుకున్నాయి. మానవ సంబంధాల్ని, సమకాలీన సమస్యల్ని ఆవిష్కరించిన చిత్రాలకే జ్యూరీ పెద్ద పీట వేసింది. » జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన 'షిప్ ఆప్ థిసియస్' (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం. ముగ్గురి కథగా సాగుతూనే అంతర్లీనంగా ఉనికి, జీవితం, మరణాల గురించి చెప్పే చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. గ్రీకు రాజు పేరు మీద తీసిన ఈ సినిమా ఓ చూపులేని ఫొటోగ్రాఫర్, జబ్బుపడిన ఓ ఆధ్యాత్మిక గురువు, కిడ్నీ మార్పిడి చేసుకున్న ఓ స్టాక్ బ్రోకర్ కథలుగా సాగుతుంది. » కళ్లు లేకుండానే మంచి ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఓ యువతి మనోభావాలు ఆపరేషన్‌తో చూపు వచ్చాక ఎలా మారాయి? దేశంలో జంతువులపై ఔషధ పరీక్షలను వ్యతిరేకించిన ఓ గురువు, తానే జబ్బుపడి తను పోరాడిన వారి సాయమే పొందాల్సి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఓ స్టాక్ బ్రోకర్ ఎవరి కిడ్నీ వల్ల తను బతికాడో తెలుసుకుని ఏం చేశాడు? అనే సున్నితమైన అంశాలను అపురూపంగా, ఆలోచింపజేసేలా ఈ సినిమాను రూపొందించారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో తీసిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలాన్ని పొందింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు చెరో 2.5 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. » ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'షాహిద్' దర్శకుడు హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. హన్సల్ మెహతా ఈ చిత్రంలో 1992 నాటి బొంబాయి గొడవల్ని, అప్పటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించారు. » ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని ఈ సారి ఇద్దరు పంచుకున్నారు. హిందీ చిత్రం 'షాహిద్' లోని నటనకు రాజ్‌కుమార్ యాదవ్, మలయాళ చిత్రం 'పెరారియావతార్'కు సూరజ్ వెంజరాముడు అవార్డుకు ఎంపికయ్యారు. » ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించిన 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో మిల్కాసింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించాడు. దేశ విభజన వల్ల జరిగిన అల్లర్లలో కళ్లముందే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ విధి వంచితుడు, ప్రాణాల కోసం భారతదేశం పారిపోయి వచ్చిన ఓ వలస బాధితుడు, దొంగతనాలు చేస్తూ, ఎదిగి మారిన మనిషిగా, దేశానికే సైనికుడిగా సేవ చేసినవాడు, అత్యుత్తమ క్రీడాకారుడిగా మారి, అంతర్జాతీయ వేదికలపై పతకాలు అందుకున్నవాడు మిల్కాసింగ్. మిల్కాసింగ్ తన జీవిత కథ హక్కుల్ని కేవలం ఒక్క రూపాయికే సినీ నిర్మాతకు విక్రయించి, సినిమా లాభాల్లో మాత్రం వాటా అడిగాడు. అదికూడా స్వార్థంతో కాదు. తాను పదేళ్లుగా నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కి విరాళంగా. ఈ సినిమా విశేష ఆదరణ పొందిన ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలాన్ని గెల్చుకుంది. దర్శక నిర్మాతలకు రెండేసి లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. » 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మన తెలుగు చిత్రం 'నా బంగారు తల్లి' మూడు పురస్కారాలు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతం (శాంతను మొయిత్రా)కు అవార్డు దక్కించుకుంది. తన జీవితాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు చెబుతూ, ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన అంజలి పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అంజలి పాటిల్, సిద్ధిఖి, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం 'నా బంగారు తల్లి'. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడుల నేపథ్యంలో దర్శకుడు రాజేష్ టచ్ రీవర్ ఈ సినిమాని రూపొందించారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చిత్రంలో ప్రస్తావించారు. 'ఇండోనేషియా అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ'లో ఉత్తమ చిత్రంగా, ట్రినిటీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ ఫీచర్ పిల్మ్‌గా 'నా బంగారు తల్లి' అవార్డులు గెలుచుకుంది. » నంద గోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' పుస్తకం ఉత్తమ సినిమా పుస్తకంగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ప్రపంచ సినిమాపై నందగోపాల్ చేసిన అధ్యయన సారమే 'సినిమాగా సినిమా' పుస్తకం. కదిలే బొమ్మలకాలం నుంచి సినిమా ఎలా మాటలు నేర్చింది? ఆ తర్వాత సినిమాకి ఎలాంటి సొబగులు అద్దారు? వాటిమూలంగా ప్రస్తుతం సినిమా ఏ స్థానంలో ఉంది? అనే విషయాల్ని నందగోపాల్ ఈ తెలుగు పుస్తకంలో అక్షరీకరించారు. » 'లయర్స్ డైస్' చిత్రంలో పోషించిన కమల పాత్రకు గీతాంజలి థాపా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. గ్లామర్‌తో కాక తన నటనతోనే గీతాంజలి అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.పురస్కార విజేతలు: ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థిసియస్ (హిందీ-ఇంగ్లిష్) ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా ('షాహిద్ అనే హిందీ చిత్రానికి) ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ యాదవ్‌రావ్ (షాహిద్ - హిందీ); సూరజ్ వెంజరాముడు (పెరారియావతర్ - మలయాళం) ఇద్దరికీ సంయుక్తంగా. ఉత్తమనటి: గీతాంజలి థాపా (లయర్స్‌డైస్ - హిందీ) ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ) ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ఎల్‌బీ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం నర్గీస్ దత్ అవార్డు: బాలు మహేంద్ర (తలైమురైగల్- తమిళం) ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ) ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్ - బెంగాలీ) ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మకొంచా - మరాఠీ) ఉత్తమ మాటల రచయిత: సుమిత్రభావే (అస్తు - మరాఠీ) ఉత్తమ పాటల రచయిత: ఎన్.ఎ.ముత్తుకుమార్ (తంగా మింకాల్ - తమిళం) ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేష్ ఆచార్య (భాగ్ మిల్కా భాగ్ - హిందీ) ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్ - బెంగాలీ) ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్ (హిందీ) » నాన్ ఫీచర్ సినిమాల విభాగంలో ఇంగ్లిష్ - తెలుగు భాషల్లో తెరకెక్కించిన 'ఓ ఫ్రెండ్ దిస్ వెయిటింగ్' ఉత్తమ ఆర్ట్/ కల్చరల్ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాకి సంధ్యకుమార్, జస్టిన్ మెక్ కార్తీ దర్శకత్వం వహించారు. 'ది లాస్ట్ బెహ్రుపియ' అనే హిందీ చిత్రంతో కలిసి ఈ చిత్రం సంయుక్తంగా పురస్కారానికి ఎంపికైంది. |
ఏప్రిల్ - 26
|
| ¤ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'పద్మ' పురస్కారాలను ప్రదానం చేశారు. » రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒకరికి పద్మ విభూషణ్, 11 మందికి పద్మభూషణ్, 44 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. » ప్రముఖ యోగా గురువు బెల్లూరు క్రిష్ణమాచర్ సుందరరాజా అయ్యంగార్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. » టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పి.బలరాం, జస్టిస్ దల్వీర్ భండారీ, రచయిత రస్కిన్ బాండ్, ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తదితరులు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. » రాష్ట్రానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు డాక్టర్ అనుమోలు శ్రీరామారావు, షార్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్, ప్రముఖ నటుడు పరేష్‌రావల్ ప్రముఖ మహిళా క్రికెటర్ అంజుంచోప్రా తదితరులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. » ఈ ఏడాది మొత్తం 127 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. వీరిలో 66 మందికి మార్చి 31న అవార్డులను ప్రదానం చేశారు. |
ఏప్రిల్ - 27
|
| ¤ 15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా - IIFA) పురస్కారాలను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న టంపాలో ప్రదానం చేశారు. » ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో 'భాగ్ మిల్కా భాగ్' అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడుగాఫర్హాన్ అక్తర్, ఉత్తమ దర్శకుడిగా ఓం ప్రకాష్ మెహ్రా అవార్డుల్ని స్వీకరించారు. » 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో నటనకు దీపికా పదుకొనే ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. » 'డిడే' చిత్రానికి రిషికపూర్ ఉత్తమ విలన్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. » శతృఘ్న సిన్హాకు జీవితకాల సౌఫల్య పురస్కారం లభించింది. ఆయన సొంతూరైన పాట్నా ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. » 'రాన్ జానా' చిత్రానికి తమిళనటుడు ధనుష్‌కి ఉత్తమ తొలిచిత్ర కథానాయకుడి పురస్కారం దక్కింది.¤ సివిల్ సర్వీసెస్‌లో అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని పర్వీన్ తల్హా (70)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. » క్లాస్-1 సర్వీసుల్లోకి ప్రవేశించిన తొలి ముస్లిం మహిళగా, యూపీఎస్‌సీలో సభ్యురాలైన తొలి ఐఆర్ఎస్ అధికారిగా, కేంద్ర మాదక ద్రవ్యాల విభాగంలో పనిచేసిన తొలి వనితగా పర్వీన్ తల్హా రికార్డు సృష్టించారు. |
ఏప్రిల్ - 28
|
| ¤ క్షేత్రస్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఛత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేష్ అగర్వాల్ ప్రతిష్ఠాత్మక 'గోల్డ్‌మ్యాన్' పర్యావరణ బహుమతిని గెలుపొందారు. » ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్న రమేష్ అగర్వాల్ సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు. పర్యావరణ అనుమతులు లేకుండానే బొగ్గుగనుల తవ్వకం కోసం ప్రయత్నించిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రమేష్ ఆ కంపెనీ ప్రాజెక్టును అడ్డుకున్నారు. » ఈ నేపథ్యంలో ఆయనపై ఒకసారి హత్యాయత్నం జరిగినా, త్రుటిలో తప్పించుకున్నారు. » ఈ అవార్డు విలువ రూ.1.06 కోట్లు. రమేష్‌తోపాటు ఈ అవార్డుకు మరో ఆరుగురు కూడా ఎంపికయ్యారు. |
|
|