జులై - 1
|
¤ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 60వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. » ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లలో 'ఎస్‌బీఐ ఇన్ టచ్' పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. త్వరలో కోల్‌కతాలో కూడా ఈ డిజిటల్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరో 5 వేల కొత్త ఏటీఎమ్‌లను ప్రారంభించనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. » గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎస్‌బీఐకు దేశవ్యాప్తంగా 43,515 ఏటీఎమ్‌లు ఉన్నాయి. » ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య.
|
జులై - 2
|
| ¤ భారత్‌లో వ్యాపారం చేయడాన్ని సరళతరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాల్లో భాగంగా పారిశ్రామిక లైసెన్స్ చెల్లుబాటు కాలాన్ని మూడేళ్లకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు ఈ వ్యవధి రెండేళ్లుగా ఉంది. » మూడేళ్ల కాలవ్యవధిని మరో రెండేళ్లు పునర్‌నవీకరించుకునే ఏర్పాటు కూడా చేసింది. » వాణిజ్య సరళి ఉత్పత్తిని ప్రారంభించకపోతే పారిశ్రామిక లైసెన్స్ దానంతటదే రద్దవుతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. |
జులై - 4
|
| ¤ జీఎంఆర్ గ్రూపునకు చెందిన ఏవియేషన్ శిక్షణ సంస్థ జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ)లో పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది. » ఐసీఏఓ 2వ అంతర్జాతీయ సమావేశాలు రెండురోజుల పాటు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. » దేశంలో ప్రభుత్వరంగ శిక్షణ సంస్థ తర్వాత ప్రైవేటు రంగంలో జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి మాత్రమే ఐసీఏఓలో పూర్తి స్థాయి సభ్యత్వం దక్కింది. |
జులై - 5
|
| ¤ సమస్యల్లో ఉన్న దేశీయ చక్కెర పరిశ్రమకు తోడ్పాటునిచ్చే దిశగా ఆర్గానిక్ చక్కెర ఎగుమతుల పరిమాణంపై పరిమితులను కేంద్రం తొలగించింది. ఆర్గానిక్ చక్కెర ఎగుమతుల పరిమాణంపై 10,000 టన్నుల పరిమితి ఉండేది. » టారిఫ్ రేట్ కోటా కింద 8,100 టన్నుల ముడి చక్కెర ఎగుమతులను అనుమతించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోటా కింద నిర్దిష్ట పరిమాణం వరకు చక్కెరను తక్కువ టారిఫ్‌లతో అమెరికాకు ఎగుమతి చేయొచ్చు. పరిమాణం దాటితే అధిక టారిఫ్‌లు వర్తిస్తాయి.¤ 2030 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందని అకౌంటెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ (ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్) అంచనా వేసింది. » గతేడాది ఇండియా 10వ అతిపెద్ద ఎకానమీగా ఉన్నట్లు పీడబ్ల్యూసీ వెల్లడించింది. |
జులై - 6
|
| ¤ ప్రస్తుత సంవత్సరం మొదటి 6 నెలల్లో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) మన దేశ స్టాక్ మార్కెట్లలో నికరంగా రూ.1.23 లక్షల కోట్లు మదుపు చేశారు. » 2014 జనవరి - జూన్ నెలల్లో షేర్లలో 996 కోట్ల డాలర్లు (రూ.59,795 కోట్లు), రుణ మార్కెట్లలో 1042 కోట్ల డాలర్లు (రూ.62,834 కోట్లు) నికరంగా పెట్టుబడులు పెట్టినట్లు సెబీ వెల్లడించింది. అంటే మొత్తం 2,040 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1.23 లక్షల కోట్లు) నిధులను నికరంగా తీసుకొచ్చారు. » కొత్త ప్రభుత్వం స్థిర పాలనను అందించడంతో పాటు సంస్కరణలను చేపట్టగలదన్న అంచనాలతో ఎఫ్ఐఐలు భారీగా నిధులు తీసుకువస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. |
జులై - 8
|
| ¤ రైల్వే మంత్రి సదానందగౌడ తన తొలి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. రికార్డు స్థాయిలో రూ.1,64,374.30 కోట్లతో రూపొందించిన రైల్వే బడ్జెట్‌లో ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి, రైల్వేల ఆధునికీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ ప్రజాకర్షక ప్రకటనలేవీ చేయలేదు. » పట్టాలు తప్పిపోతున్న రైలు బండిని గాడిన పెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. తరిగిపోతున్న రాబడితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేమని గుర్తించింది. ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే పరిష్కారం కాదని, అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులకు సంస్కరణలే మార్గమని తీర్మానించింది. రైల్వే నుంచి అద్భుత ప్రమాణాలు ఆశించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరమని, అందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని రైల్వే మంత్రి తేల్చిచెప్పారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిందేనని స్పష్టం చేశారు. » రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో రైల్వే శాఖ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కొన్ని కఠోర వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన ఆవిష్కరించిన భారతీయ రైల్వే ముఖచిత్రం, చేపట్టదల్చుకున్న చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.మొత్తం రైళ్లు: 12,617ప్రయాణికుల సంఖ్య రోజుకు: 2,30,00,000 (ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం)సరకు రవాణా రైళ్ల సంఖ్య: 7,421ప్రతిరోజూ తరలించే సరకు: 30 లక్షల టన్నులుమొత్తం రైల్వే ట్రాక్ పొడవు: 1.16 లక్షల కి.మీ.మొత్తం పెట్టెలు: 63,870మొత్తం వ్యాగన్లు: 2.4 లక్షలకు పైగాఉద్యోగులు: 13.1 లక్షల మందిమొత్తం క్రాసింగులు: 30,348. (వీటిలో కాపలా లేని క్రాసింగులు 11,563) |
| అభివృద్ధికి రాబడి లేదు: సామాజిక బాధ్యత కింద చేపట్టాల్సిన సేవల విలువ ఏటా పెరిగిపోతోంది. 2012-13లో ఇలాంటి సేవల విలువ రూ.20,000 కోట్లు. అదే ఏడాది ప్రణాళికా వ్యయం కింద మొత్తం పెట్టుబడి రూ.35,241 కోట్లు. ప్రణాళికా వ్యయంలో సగానికి పైగా సామాజిక బాధ్యత కింద చేపట్టాల్సిన సేవలకే పోతుండటంతో అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఏమాత్రం సరిపోవడం లేదు.నామమాత్రం మిగులుతో అద్భుతాలు సాధించడం కష్టం: 2013-14లో స్థూల ట్రాఫిక్ రాబడి రూ.1,39,558 కోట్లు కాగా నిర్వహణ ఖర్చులు రూ.1,30,321 కోట్లు. అంటే ఒక రూపాయి రాబడిలో 94 పైసలు ఖర్చులకే పోతోంది. మిగిలింది 6 పైసలే. ఈ నామమాత్రపు మిగులుకు తోడు ఏళ్ల తరబడి ఛార్జీల సవరణ లేకపోవడంతో మిగులు ఏటా తరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగులు రూ.602 కోట్లు అని అంచనా వేశారు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకే ఏడాదికి రూ.50 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరం. ఇక భద్రతా చర్యలు, సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి వీటికి అదనం. ట్రాక్‌ల పునరుద్ధరణ, కాపలాలేని క్రాసింగుల ఎత్తివేత, వంతెనల నిర్మాణానికే రూ.40 వేల కోట్లు అవసరం. అవసరమైన నిధులకు, మిగులుకు భారీ అంతరం ఉంది.ఛార్జీల్లో హేతుబద్ధత లోపం: వ్యయం, మిగులు మధ్య అంతరాన్ని పూడ్చడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఛార్జీల విధానంలో హేతుబద్ధత లోపించింది. ఖర్చుల కంటే ప్రయాణికుల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. ఈ నష్టం 2000-01లో ఒక్కో ప్రయాణికుడిపై కిలోమీటరుకు పది పైసలు ఉండగా 2012-13లో 23 పైసలకు చేరింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి సరకు రవాణా ఛార్జీలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుతున్నారు. దీంతో సరకు రవాణా ఖాతాదారులు ఇతరత్రా మార్గాలు చూసుకుంటున్నారు. ఈ విధంగా రాబడి పడిపోతోంది. సరకు రవాణాలో రైల్వే వాటా 31 శాతం మాత్రమే.ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి లేదు: ప్రాజెక్టుల మంజూరుపై దృష్టి పెడుతున్నారే కానీ వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గత 30 ఏళ్లలో 676 ప్రాజెక్టులు మంజూరు చేశారు. వీటిలో 317 మాత్రమే పూర్తయ్యాయి. 359 పూర్తి కావాల్సి ఉంది. అందుకు రూ.1,82,000 కోట్లు కావాలి. గత పదేళ్లలో 99 కొత్త ప్రాజెక్టులు మంజూరు కాగా పూర్తయింది ఒకే ఒకటి. 30 ఏళ్ల నాటి నాలుగు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే రూ.వేల కోట్లు ఖర్చు చేయడమే తప్పించి ఫలితం ఏ మాత్రం ఉండదు. |
| వనరుల సమీకరణ ఇలా1. రైల్వే పీఎస్‌యూల ఆర్థిక వనరులను పరిపుష్టం చేయడం:రైల్వేల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మిగులు సాధించే విధంగా రైల్వేకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)కు ప్రత్యేక పథకం. ఈ పథకం వల్ల ఆ సంస్థలకు ఆకర్షణీయమైన లాభాలు వస్తాయి.2. రైల్వే మౌలిక సదుపాయాల్లో దేశీయ ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు:రైల్వే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు నిధులు అందుబాటులో ఉంటేనే రైల్వే రంగం అభివృద్ధి సాధ్యం. అంతర్గత ఆదాయ వనరులు, ప్రభుత్వ నిధులు ఈ అవసరాలను తీర్చలేవు. రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తేనే అవసరాలు తీరుతాయి. ఇందుకోసం మంత్రివర్గ ఆమోదం కోరాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.3. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం: భారీ ఎత్తున నిధులు అవసరమయ్యే రైల్వే రంగంలో పీపీపీ మార్గం ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. హైస్పీడ్ రైలు సహా భవిష్యత్తులో ఎక్కువ ప్రాజెక్టులకు పీపీపీ ద్వారా నిధులు సమీకరించాలన్నది లక్ష్యం.4. నిధుల సమీకరణతోపాటు రైల్వే ప్రణాళిక, పరిపాలనలో కొన్ని వ్యూహాత్మక చర్యలు: ఎ) ప్రణాళిక విరామ వైఖరి బి) ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యాలు, గడువులు నిర్దేశించడం సి) రైల్వే మౌలిక సదుపాయాలకు నిధుల సమీకరణ నిమిత్తం యంత్రాంగాన్ని రూపొందించడం డి) ప్రాజెక్టు అమలుకు మద్దతుగా నిర్ణయ వ్యవస్థ ఇ) వనరుల సమీకరణలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పారదర్శకత ఎఫ్) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాల అనుసరణ. ప్రమాదాలకు కారణాలను అధ్యయనం చేయడానికి సిమ్యులేషన్ కేంద్రం ఏర్పాటు జి) లోకోమోటివ్‌లు, పెట్టెలు, వ్యాగన్ లీజింగ్ మార్కెట్ అభివృద్ధికి ప్రోత్సాహం. |
రైల్వే బడ్జెట్ 2014 ముఖ్యాంశాలురైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో 58 కొత్త రైళ్లను ప్రకటించారు. వీటిలో అయిదు జన సాధారణ్ రైళ్లతో పాటు మరో అయిదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిల్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెము) సర్వీసులు ఉన్నాయి. మరో 11 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. అలాగే కేదార్‌నాధ్, బద్రీనాధ్ లాంటి చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైలు మార్గం నిర్మాణాన్ని ప్రతిపాదించడంతో పాటు మొత్తం 18 నూతన రైలు మార్గాలను మంత్రి ప్రకటించారు.కొత్త రైళ్లలో ముఖ్యమైనవి అహ్మదాబాద్ - దర్భంగా జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ముంబయి - గోరఖ్‌పూర్ జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ముంబయి సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు - మంగుళూరు ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి ఎక్స్‌ప్రెస్ ఇండోర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) నాగ్‌పూర్ - అమృత్‌సర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)¤ దేశవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధిలో రైలును ఓ ముఖ్య సాధనంగా మార్చాలని రైల్వే శాఖ సంకల్పించింది. వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల మీదుగా మంత్రి పలు రైళ్లను ప్రకటించారు. పుణ్యక్షేత్ర రైళ్లు నడిపేందుకు దేవీ సర్క్యూట్, జ్యోతిర్లింగ సర్క్యూట్, జైన్ సర్క్యూట్, క్రైస్తవ సర్క్యూట్, ముస్లిం/ సూఫీ సర్క్యూట్, సిక్ సర్య్కూట్, బౌద్ధ సర్క్యూట్, ప్రఖ్యాత ఆలయాల సర్క్యూట్ తదితర సర్క్యూట్‌లను గుర్తించినట్లు మంత్రి ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ గడగ్ నుంచి బాగల్‌కోట్, బీజాపూర్, సోలాపూర్ మీదుగా పండరీపురం వరకు పర్యాటక రైలు నడుపుతామని మంత్రి ప్రకటించారు. బెంగళూరు, చెన్నై, అయోధ్య, వారణాసి, హరిద్వార్ లాంటి ప్రాంతాల మీదుగా రామేశ్వరం నుంచి మరో పర్యటక రైలును మంత్రి ప్రకటించారు. స్వామి వివేకానంద జీవిత విశేషాలతో ఒక రైలును ప్రకటించారు. ఆయన బోధనల వ్యాప్తి కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి ప్రకటించారు.¤ రైళ్లలో పాల ట్యాంకర్లు, పండ్లు, కూరగాయల రవాణాకు ప్రత్యేక శీతలీకరణ సదుపాయాలను బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల నిల్వ, రవాణాకు సిద్ధమైనట్లు మంత్రి ప్రకటించారు.¤ ఈ-టికెటింగ్ విధానం ద్వారా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నిమిషానికి 2000 టికెట్లను జారీ చేస్తున్నారు. దీన్ని నిమిషానికి 7,200 టికెట్లు ఇవ్వగలిగేలా, లక్షా ఇరవై వేల మంది వినియోగదారులు ఒకేసారి ఈ విధానాన్ని వినియోగించుకునేలా మెరుగుపరుస్తారు. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. రిజర్వేషన్ లేని జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లను కూడా త్వరలో ఆన్‌లైన్ ద్వారా పొందే విధానాన్ని ప్రవేశపెడతారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఇటు వాహనాల పార్కింగ్‌కు, అటు ప్లాట్‌ఫాం టికెట్‌గానూ ఉపయోగపడేలా ఒక ఉమ్మడి టికెట్‌ను ప్రవేశపెడతారు. వీటికోసం టికెట్ జారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల ఇంటర్నెట్ సేవల కోసం ఎ-1, ఎ గ్రేడ్ రైల్వే స్టేషన్లు, కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తారు. రైలు గమ్యస్థానం చేరబోతోందన్న విషయాన్ని ప్రయాణికులకు సెల్‌ఫోన్లలో మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ఐటీ విధానాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించాలని నిర్ణయించారు.¤ రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఆహారాన్ని మెరుగుపరచాలని నిర్ణయించారు. ప్రస్తుతం దూరప్రాంత రైళ్లు, స్టేషన్లలో రైల్వే క్యాటరింగ్ సంస్థ అందజేస్తున్నట్లు ఒకేరకమైనవి కాకుండా రకరకాల పసందైన వంటకాలతోపాటు నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇక రైల్వే సిబ్బంది తయారుచేసేవి కాకుండా బ్రాండెడ్ ఆహారం అందుబాటులోకి రానుంది. అప్పటికప్పుడు వండి వడ్డించేవి కాకుండా ముందుగానే తయారుచేసి పొట్లాల్లో వీటిని సిద్ధం చేస్తారు. ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన రకరకాల ఆహారం లభిస్తుంది. ఇ - మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ విధానాన్ని తొలిదశలో ఢిల్లీ - అమృతసర్, ఢిల్లీ - జమ్ముతావి సెక్షన్లలో అమలు చేస్తారు.¤ రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ పరిధిని విస్తృతం చేశారు. ఇంతవరకు సీట్లు, బెర్తులను మాత్రమే ముందస్తుగా బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు మొత్తం బోగీని, ఏకంగా రైలునే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. రైల్వే విశ్రాంతి గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏడాదిలో అన్ని స్టేషన్లకూ వర్తింపజేయాలని నిర్ణయించారు.¤ రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం పలు చర్యలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. సిబ్బంది సంక్షేమ నిధికి ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కేటాయిస్తున్న మొత్తాన్ని రూ.800కు పెంచనున్నట్లు ప్రకటించారు. విద్య, క్రీడల రంగాల్లో ప్రతిభను చాటే ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని మంత్రి ప్రతిపాదించారు.¤ ప్రస్తుతమున్న ప్రయాణ సమయాన్ని దాదాపుగా సగానికి తగ్గించే అత్యంత ఆధునికమైన బుల్లెట్ రైలును ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మొదట అహ్మదాబాద్ - ముంబయి మధ్య బుల్లెట్ రైలును నడిపేందుకు నిర్ణయించామని, భవిష్యత్తులో అన్ని ముఖ్య నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా వజ్ర చతుర్భుజి పేరుతో మెట్రో నగరాల మధ్య అత్యంత వేగవంతమైన రైళ్లను నడిపేందుకు ప్రస్తుతమున్న వ్యవస్థలను ఆధునికీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఫలితంగా గంటకు 200 కి.మీ. వేగంతో రైళ్లను నడిపించగలరు. ఈ ప్రాజెక్టుపై నివేదిక కోసం రూ.100 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, హై స్పీడ్ రైల్ కారిడార్ చర్యలు చేపడతాయని మంత్రి ప్రకటించారు, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ.60 వేల కోట్లు, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ.9 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.¤ మొదటి బుల్లెట్ రైలును అహ్మదాబాద్, ముంబయి నగరాల మధ్య గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 491 కి.మీ. ప్రస్తుతం అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం 160 కి.మీ. వజ్ర చతుర్భుజిలో భాగంగా గంటకు 160 నుంచి 200 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను ఢిల్లీ - ఆగ్రా, ఢిల్లీ - చండీగఢ్, అహ్మదాబాద్ - ముంబయి, ఢిల్లీ - కాన్పూర్, నాగ్‌పూర్ - బిలాస్‌పూర్, మైసూర్ - బెంగళూరు - చెన్నై, ముంబయి - గోవా, చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్ మధ్య నడపాలని బడ్జెట్‌లో నిర్ణయించారు.¤ పెట్రో ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా రైలు ఛార్జీల సవరణకు వీలు కల్పిస్తున్న గత యూపీఏ ప్రభుత్వ విధానాన్ని తమ ప్రభుత్వమూ కొనసాగించనుందని మంత్రి ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఛార్జీలు పెరుగుతాయి.¤ వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీతో నడిచే కార్లను ప్లాట్‌ఫామ్‌లపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని పీపీపీ విధానంలో అందుబాటులోకి తెస్తారు. ఇవి ప్రధాన స్టేషన్లలో ఉంటాయి.¤ రైళ్లలో మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రైల్వే రక్షణ దళంలో 17,000 మంది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. 4000 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. మహిళలకు ప్రత్యేకించిన బోగీల్లో వీరిని వినియోగిస్తారు. |
¤ రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనం కోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది.¤ రైళ్ల భద్రతను పెంచడానికి, పట్టాల్లో ఏర్పడే లోపాలను, పగుళ్లను సమర్థంగా గుర్తించడానికి అత్యాధునిక అల్ట్రాసోనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు.¤ బొగ్గు రవాణా కోసం మూడు కీలకమైన రైలు మార్గాల నిర్మాణాన్ని శీఘ్రగతిన పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తోరి - శివపూర్ - కతౌటియా ఏరియా (జార్ఖండ్), జార్సిగుడ - బార్‌పల్లి - సర్‌డేగా ఏరియా (ఒడిశా), భూప్‌దేవ్‌పూర్ - రాయ్‌గఢ్ - మండ్ ఏరియా (చత్తీస్‌గఢ్) మధ్య ఈ మార్గాల పనులు సుమారు రూ.7500 కోట్ల ఖర్చుతో జరుగుతున్నాయని మంత్రి ప్రకటించారు.¤ ప్రధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.¤ విమానాశ్రయాన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థాయికి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ.¤ స్టేషన్ల నిర్వహణకు మూలనిధి ఏర్పాటు; స్టేషన్లు, రైళ్లలో ఆర్వో తాగునీరు, ప్రధాన స్టేషన్లకు సౌర విద్యుత్ సౌకర్యం.¤ శుభ్రత కోసం ఉద్దేశించిన బడ్జెట్ 40% పెంచారు. స్టేషన్లలో శుభ్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీల వినియోగం, థర్డ్ పార్టీ తనిఖీలను సైతం ప్రవేశపెడతారు. 50 పెద్ద స్టేషన్లలో పారిశుద్ధ్యాన్ని అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయించారు.¤ రైల్వే రిక్వెస్టు స్టాపులు సెప్టెంబరు 30 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని, ఆ తర్వాత వాటిని సమీక్షిస్తామని మంత్రి ప్రకటించారు. ఆపరేషన్ ఫిజిబులిటీ, కమర్షియల్ జస్టిఫికేషన్ ఆధారంగా వాటిని సమీక్షిస్తామని, భవిష్యత్తు డిమాండ్లను కూడా వాటి ఆధారంగానే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.¤ దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జబ్బు రైల్వే శాఖనూ వదల్లేదు. గత ఏడాది సుమారు 5,300 మంది రైల్వే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రైల్వే బడ్జెట్ విశేషాలు రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. రెండు హై స్పీడ్ రైళ్లతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో మరో రైలును కేటాయించింది. కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి కేవలం రూ.1159 కోట్లను కేటాయించింది. రెండు రాష్ట్రాల్లో పెండింగు ప్రాజెక్టుల ప్రాథమ్యాలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. వజ్ర చతుర్భుజి పథకంలో రాష్ట్రానికి ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రెండు రైళ్లకు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం మాత్రం కల్పించింది. వీటిలో ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్ (చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్)కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి న్యూఢిల్లీకి రోజూ నడిచేలా ఏసీ రైలును ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైలు నడుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ నుంచి న్యూఢిల్లీకి నడపాలని నిర్ణయించిన రైలుకూ ఏపీ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును 'టీజీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. |
జులై - 9
|
¤ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే (2013 - 14)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థికరంగం వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ బడ్జెట్ ప్రతిపాదనకు ముందురోజు ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది.2013 - 14 ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.4 - 5.9 శాతం మాత్రమే ఉండొచ్చు. అయితే 2015 - 16 నాటికి ఇది 7 - 8 శాతానికి పెరిగే అవకాశముంది. ఈ సీజన్లో సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, విదేశాల్లోని ఆర్థిక స్థితిగతులు వృద్ధి రేటుపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014 - 15)లో కరెంటు ఖాతా లోటును (సీఏడీ) 2.1 శాతానికి పరిమితం చేయాలి. పన్ను సంస్కరణలు తక్షణావసరం. జీఎస్‌టీని అమలు చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టాల స్థానంలో డీటీసీ (ప్రత్యక్ష పన్నుల స్మృతి) తీసుకురావాలి. ఎగుమతులు ఇంకా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇరాక్ స్థితిగతులు ఇబ్బందికరం. పారిశ్రామికోత్పత్తి మరో రెండేళ్లకు గానీ కోలుకునే అవకాశం లేదు. మౌలిక సదుపాయాలు, ఇనుము - ఉక్కు, దుస్తులు, పౌర విమానయానం, గనుల రంగాల్లో ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల నాణ్యత క్షీణించింది. మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఏపీఎంసీ చట్టాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవరోధాలుగా మారాయి. ఇది మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకునే శక్తులు తయారయ్యేందుకు దోహదపడుతుంది. |
కరెంటు ఖాతా లోటు ఆశాజనకంగా ఉంది. 2012 - 13లో ఇది జీడీపీలో 4.7% కాగా, 2013 - 14 నాటికి బాగా తగ్గి ఒక శాతానికి చేరుకుంది. మనదేశం వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు 2013 మార్చి నాటికి 292 బిలియన్ డాలర్లు ఉండగా, 2014 మార్చి నాటికి 304.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2013 - 14లో బంగారం, వెండి దిగుమతులు 40% తగ్గి 33.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వచ్చే అయిదేళ్లలో 88,537 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది. మనదేశం ఉత్పత్తి రంగంలో వెనుకంజలో ఉన్నప్పటికీ సేవల రంగంలో సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్త సేవల విపణిలో 1990లో మనదేశం వాటా 0.6% కాగా 2013 నాటికి ఇది 3.3 శాతానికి పెరిగింది. పేదరికం నిష్పత్తి 2004 - 05లో 37.2 శాతం ఉండగా 2011 - 12 నాటికి 21.9 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.98 శాతం ఉండగా, సీపీఐ ద్రవ్యోల్బణం 9.49 శాతంగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా తగ్గొచ్చు. రూపాయి మారక విలువ హెచ్చుతగ్గులు, అధిక ముడి చమురు ధర ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశముంది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం 16 జాతీయ పెట్టుబడుల, తయారీ జోన్ల (ఎన్ఐఎమ్‌జెడ్)ను ప్రకటించింది. జాతీయ తయారీ విధానం కింద ఈ ఎన్ఐఎమ్‌జెడ్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ వాటాను 25 శాతానికి చేర్చడంతో పాటు 10 కోట్ల మందికి ఉద్యోగాలను సృష్టించాలన్నది లక్ష్యంగా ఉంది. 16 ఎన్ఐఎమ్‌జెడ్‌లలో ఎనిమిది ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌లో రానుండగా, మరో ఎనిమిది నాగపూర్, చిత్తూరు, మెదక్, తుముకూరు, కోలార్, బీదర్, గుల్బర్గాల్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. ఎన్ఐఎమ్‌జెడ్‌లు అనేవి కనీసం 50 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఏకీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌లు. |
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు సబ్సిడీలను నేరుగా నగదు రూపంలో వారి ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇందుకోసం బయోమెట్రిక్ గుర్తింపు తదితర సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలని పేర్కొంది. ప్రస్తుత విధానంలో కొన్ని ఇబ్బందులు, అవకతవకలు ఉన్నాయని అభిప్రాయపడింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లెక్కల ప్రకారం 2013-14లో ప్రధాన సబ్సిడీల మొత్తం విలువ రూ.2,47,596 కోట్లుగా నమోదైంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఐటీ ఆధారిత సేవల్లో (ఐటీఈఎస్) భారత్ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. అయితే వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు, వేతన ద్రవ్యోల్బణం, మారకపు రేట్ల ఒడుదొడుకుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇంజినీరింగ్ సేవలు, ఆర్ అండ్ డీని మినహాయిస్తే 2013లో గ్లోబల్ అవుట్ సోర్సింగ్ మార్కెట్‌లో భారత్ వాటా 55 శాతానికి పెరిగింది. 2012లో ఇది 52 శాతం. 2013-14లో ఐటీ-బీపీఓ రంగంలో 1.66 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు లభించాయి. దేశంలో రిటైల్, టోకు వ్యాపారాల వృద్ధికి బహుళ నియంత్రణలు, రకరకాల నిబంధనలే అడ్డంకిగా ఉన్నాయి. ఈ కారణంగానే గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ సూచీలో 2012లో అయిదో స్థానంలో ఉన్న భారత్ గతేడాది 14వ స్థానానికి పడిపోయింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం పరిమాణం 2012-13లో 4.8 శాతం పెరిగి రూ.14.79 లక్షల కోట్లకు చేరింది. జీడీపీలో ఇది 15.8 శాతం ఉంది. భారత మౌలిక సదుపాయాల రంగం పరుగులు తీయడానికి విధానపరమైన అడ్డంకులను తొలగించడంతో పాటు విధానాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం తక్షణ అవసరం. 239 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 110 ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రూ.1000 కోట్లు, అంతకుమించి వ్యయం అయ్యేవే. ప్రారంభంలో 239 ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.7,39,882 కోట్లు ఉండగా పూర్తయ్యే నాటికి రూ.8,97,684 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే జాప్యం కారణంగా వాస్తవ వ్యయం కంటే 21.3 శాతం అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2014, మార్చి చివరినాటికి రూ.6,94,040 కోట్ల విలువైన 1300 ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగంలో విదేశీ పెట్టుబడులు నాలుగు రెట్లకు పైగా పెరిగి 130 కోట్ల డాలర్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఈ రంగంలోకి 30.4 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2014 మార్చి చివరి నాటికి మొత్తం టెలిఫోన్ కనెక్షన్లు 93.30 కోట్లకు పెరిగాయి. ఏడాది క్రితం 89.80 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. దేశీయ విమానయాన రంగం కష్టకాలం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు అందుతున్నాయి. 2013-14లో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కేవలం 5.2 శాతమే పెరిగినప్పటికీ పరిశ్రమ పరిస్థితులు మెరుగయ్యాయి. 2012-13లో భారత విమానాశ్రయాలు 11.63 కోట్ల దేశీయ ప్రయాణికులను హ్యాండిల్ చేయగా 2013-14 నాటికి ఈ సంఖ్య 12.24 కోట్లకు పెరిగింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ 8.34 శాతం వృద్ధితో 4.30 కోట్ల నుంచి 4.66 కోట్లకు పెరిగింది. |
గత రెండు సంవత్సరాల్లో వసూలు కాని రుణాల భారం ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిల భారం నాలుగింతలు పెరిగిపోయింది. 2008-09లో 2.09 శాతం (రూ.59,972 కోట్లు)గా నమోదైన బ్యాంకింగ్ రంగ స్థూల నిరర్థక రుణాలు (గ్రాస్ ఎన్‌పీఏ) 2014 మార్చి నాటికి 4.4 శాతానికి (రూ.2,04,249 కోట్లు) చేరాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులను కూడా కలుపుకుంటే మొత్తం మీద ఎన్‌పీఏలు 2.36 శాతం నుంచి 3.90 శాతానికి పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రస్తుత బలహీనతలను అధిగమించేలా చూడటానికి ఫైనాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్‌సీ) ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ ముసాయిదాను తెస్తోంది. ఇది రానున్న 30 ఏళ్లపాటు భారత ఆర్థిక వ్యవస్థ అవసరాలను నెరవేర్చే విధంగా ఉంటుంది. బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ధరలకు స్వేచ్ఛ కల్పించాలి. బొగ్గు తవ్వకాల్లో ప్రైవేటు రంగాన్ని అనుమతించాలి. కోల్ ఇండియాను పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే బొగ్గు దిగుమతుల బిల్లు తగ్గుతుంది. 2012-13లో రూ.92,538 కోట్ల విలువైన 146 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటే 2013-14కు రూ.95,175 కోట్ల విలువైన 169 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకున్నారు. మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) ర్యాంకింగ్‌లో భారత్ స్థానం దిగజారింది. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) రూపొందించిన హెచ్‌డీఐ వివరాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. హెచ్‌డీఐను మూడు ప్రాథమిక పరామితుల ఆధారంగా నిర్ణయిస్తారు. 1) దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడపడం 2) విద్యావంతులై, జ్ఞానవంతులై ఉండటం 3) గౌరవప్రదమైన ఆర్థిక ప్రమాణాలతో జీవించడం. ఈ ప్రమాణాల ఆధారంగా 2012లో హెచ్‌డీఐలో భారత్ ర్యాంకు 136. 2011లో 134వ స్థానంలో ఉంది. అంటే రెండు స్థానాలు దిగజారింది. ఆరోగ్య, విద్యారంగాల సూచీలను పరిశీలిస్తే పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ చాలా వెనకబడి ఉంది. మానవాభివృద్ధి సూచీలో ఈ రెండు రంగాలూ ఎంతో కీలకం. ఈ రెండు రంగాలనూ ఇంకా విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఐ విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. |
జులై - 10
|
|
¤ రూ.17,94,892 కోట్ల వార్షిక వ్యయ అంచనాలతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2014-15 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల బలోపేతానికి ముఖ్య చర్యలను ప్రతిపాదించారు. రంగాలవారీగా ప్రాథమ్యాలను సభ ముందు ఉంచారు. » ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలను తమ ప్రభుత్వం అనుసరించే అభివృద్ధి వ్యూహంలో 'అందరితో కలిసి .... అందరి వికాసానికి (సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్)' విధానంలో ప్రతిఫలిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు. » 'కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన' లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. వ్యయ సంస్కరణలకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ప్రభుత్వం వ్యయ నిర్వహణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ కమిషన్ మధ్యంతర నివేదికను సమర్పిస్తుంది. ఆహార, చమురు రాయితీలు సహా రాయితీల విధానాన్ని సంస్కరించాలని ప్రతిపాదించారు. అణగారిన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ విషయంలో రక్షణలు కొనసాగిస్తూ... లక్షిత వర్గాలకు సక్రమంగా రాయితీలు అందేలా మార్పులు చేస్తూ యూరియా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. » ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లకు పైగా పన్ను డిమాండ్‌పై వివిధ న్యాయస్థానాలు, అప్పిలేట్ అథారిటీల్లో వివాదాలు నడుస్తున్నాయి. దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ప్రత్యక్ష పన్నుల్లో న్యాయ వివాదాలను తగ్గించడానికి చట్టపరమైన, పరిపాలనారమైన మార్పులు అవసరం. పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా పన్ను చట్టాల్లో ఎక్కడెక్కడ స్పష్టత అవసరమో గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో ఈ కమిటీ నిరంతరం భేటీ అవుతూ సూచనలు స్వీకరిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా సీబీడీటీ, ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఈసీ) రెండు నెలల్లో తగిన వివరణలు ఇస్తుంది. » భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకారిగా ఉండేలా ఎంపికచేసిన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రోత్సహించాలన్నది ఎన్‌డీఏ ప్రభుత్వ విధానం. రక్షణ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా దీన్ని 49 శాతానికి పెంచారు. బీమా రంగంలో ప్రస్తుతం ఎఫ్‌డీఐలపై 26 శాతం పరిమితి ఉండగా దీన్ని 49 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. |
| 2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులుఆరోగ్య రంగం: » అందరికీ ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించింది. ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు లాంటి ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తేనున్నారు. » 2014-15 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య రంగానికి రూ.35,163 కోట్లు కేటాయించారు. 2013-14లో సవరించిన అంచనా ప్రకారం ఈ కేటాయింపులు రూ.27,531 కోట్లు. » గ్రామీణ ప్రాంతాల్లో 15 ఆదర్శ ఆరోగ్య పరిశోధనా కేంద్రాల ఏర్పాటు. » ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రుల నిర్మాణానికి రూ.500 కోట్లు. » జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్ఎమ్)కు రూ.21,912 కోట్లు కేటాయింపు. » కొత్తగా 12 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు. » రాష్ట్రాల ఔషధ, ఆహార తనిఖీ విభాగాల పటిష్టానికి నిధుల కేటాయింపు. » దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న పోషకాహార లోపం సమస్యపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. » మనదేశంలో మొత్తం 5.76 లక్షల పడకల సామర్థ్యంతో 12,760 ప్రభుత్వ అలోపతి ఆసుపత్రులు ఉన్నాయి. అమెరికాలో ప్రతి వెయ్యిమందికి సగటున 3.1 ఆసుపత్రి పడకలు ఉంటే, చైనాలో మూడు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ప్రతి వెయ్యిమందికి ఒకటి కూడా లేదు. » దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత అధికం. |
| స్త్రీ, శిశు సంక్షేమం: » బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.21,193.88 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.18,285.65 కోట్లుగా ఉంది. » ఆడపిల్లల పట్ల వివక్షను, ఉదాసీనతను పరిగణనలోకి తీసుకున్న మోడీ సర్కారు ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. 'బేటీ బచావో .... బేటీ పఢావో' అనే ఈ పథకానికి రూ.100 కోట్లు కేటాయింపు. » మహిళలపై పెరుగుతున్న నేరాలు, పెనుసవాలుగా మారిన వారి భద్రత నేపథ్యంలో పెద్ద నగరాల్లో మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు రూ.150 కోట్లు. » ప్రభుత్వ రోడ్డు రవాణా వ్యవస్థలో మహిళల భద్రతకు ఉద్దేశించిన ప్రయోగాత్మక పైలట్ పథకానికి రూ.50 కోట్లు. » ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని అన్ని జిల్లాల్లో ఈ ఏడాది సంక్షోభ నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన - ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వీటి ఏర్పాటు. నిర్భయ నిధి నుంచి నిధుల కేటాయింపు. » జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం 'ఆజీవిక' కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు నాలుగు శాతం వడ్డీతో ఇస్తున్న బ్యాంక్ రుణ వసతిని మరో వంద జిల్లాలకు పొడిగింపు. » ఆడపిల్లల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక చిన్నతరహా పొదుపు పథకం. వారి చదువు, పెళ్లి కోసం ఉపయోగపడేలా రూపకల్పన. » ఆడపిల్లల భద్రత, సంక్షేమమే ప్రధానం. వారి పట్ల వివక్షను దూరం చేయడానికి పాఠశాల స్థాయి నుంచే బోధనాంశాల ద్వారా ఈ దిశగా చైతన్య సాధనకు కృషి. |
| పర్యటక రంగం: » ఈ ఆర్థిక సంవత్సరంలో పర్యటక రంగానికి రూ.1,966.71 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.1,050.31 కోట్లుగా ఉంది. » దేశ సాంస్కృతిక సుసంపన్నతను, చరిత్రాత్మక, మత, సహజసిద్ధమైన వారసత్వాన్ని సంరక్షించుకోవడంతో పాటు భారీగా ఉపాధి కల్పనకు అవకాశమున్న పరిశ్రమగానూ పర్యటక రంగాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించింది. ప్రత్యేక ఇతివృత్తాలతో అయిదు పర్యటక వలయాలను (టూరిస్ట్ సర్క్యూట్స్) ఏర్పాటు చేసేందుకు రూ.500 కోట్ల కేటాయింపునకు ఆర్థికమంత్రి జైట్లీ ప్రతిపాదించారు. మరికొన్ని కొత్త పథకాలను కేటాయించారు. » జాతీయ వారసత్వ నగర అభివృద్ధి, ఉద్ధరణ (నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్‌మెంటేషన్ యోజన - హృదయ్) పథకాన్ని మథుర, అమృత్‌సర్, గయ, కాంచీపురం, వేళాంకనీ, అజ్మీర్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. దీనికి రూ.200 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని అమలుపరుస్తారు. » జాతీయ తీర్థయాత్రల పునరుద్ధరణ, ఆధ్మాత్మిక ఉద్ధరణ కార్యక్రమం (నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్ - ప్రసాద్) ప్రారంభం. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించారు. » పురావస్తు ప్రాధాన్య ప్రాంతాల పరిరక్షణకు రూ.100 కోట్లు. » సారనాథ్ - గయ - వారణాసి ప్రాంతాలను బౌద్ధ పర్యటక వలయంగా అభివృద్ధి చేయడం. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక వసతులను ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం. » అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న గోవాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి ప్రతిపాదన. » 2012లో మనదేశం పర్యటకరంగం ద్వారా రూ.6,40,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది దేశ జీడీపీలో 6.6 శాతం. ఈ రంగం దాదాపు నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. |
రోడ్డు రవాణా, జాతీయ రహదారులు: » 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి రూ.34,345.20 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.30,338.53 కోట్లుగా ఉంది. » భారత్ లాంటి పెద్ద దేశంలో భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న నగరాలకు వేగంగా చేరుకునేందుకు అనువైన రవాణా నెట్‌వర్క్ ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల వివిధ నగరాల ద్వారా సరకు రవాణా నెట్‌వర్క్ కూడా వృద్ధి చెందుతుంది. జాతీయ రహదారులకు 'అనుమతుల అవరోధాల' నుంచి విముక్తి కల్పించనున్నట్లు అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రకటించారు. » జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), రాష్ట్ర రోడ్లకు రూ.37,880 కోట్ల కేటాయింపు. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు రూ.3 వేల కోట్లు. » పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎంపిక చేసిన ఎక్స్‌ప్రెస్‌వే లపై పని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం రూ.500 కోట్లను ఎన్‌హెచ్ఏఐ కేటాయిస్తుంది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8500 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని సాధిస్తామని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి: » గ్రామీణాభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,093.33 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది రూ.59,355.05 కోట్లుగా ఉంది. » గ్రామీణాభివృద్ధికి మోడీ సర్కారు పెద్దపీట వేసింది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సకల సదుపాయాల మెరుగుకు భారీగా నిధులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. » మంచినీరు, రోడ్లు, వాటర్‌షెడ్లు, ఇళ్ల నిర్మాణం... ఇలా అనేక రకాల పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. » గుజరాత్‌లో విజయవంతమైనట్లుగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో పట్టణ సదుపాయాల కల్పన కోసం 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. » గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం కోసం 'డిజిటల్ ఇండియా'; వచ్చే అయిదేళ్లలో దేశంలో నివాస ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దే 'స్వచ్ఛ భారత్' లాంటి పథకాల ప్రకటనతో పాటు యూపీఏ కలల పథకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.33,364 కోట్లు కేటాయించింది. గతేడాది మన్మోహన్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతే మొత్తం కేటాయించడం గమనార్హం. » గతంలో ఎన్‌డీయే హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రకటించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కి రూ.14,389 కోట్లు కేటాయించారు. » స్వయం సహాయక మహిళలకు 4 శాతం వడ్డీకి రుణాలు అందజేసే 'ఆజీవిక' పథకాన్ని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే మహిళలకు 7 శాతానికి బదులు 4 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేసే ఈ పథకం ప్రస్తుతం 150 జిల్లాల్లో అమలవుతోంది. » గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణం కోసం సహాయపడే గ్రామీణ గృహ నిధి (రూరల్ హౌసింగ్ ఫండ్ - ఆర్‌హెచ్ఎఫ్)ను పటిష్టపరచడం కోసం జాతీయ గృహ నిర్మాణ బ్యాంక్ ఏర్పాటు లేదా ఎరువులు, పురుగు మందులతో నీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, జలశుద్ధి కేంద్రాల ఏర్పాటు. » 'నీరాంచల్' వాటర్‌షెడ్ల పథకానికి రూ.2,142 కోట్లు, జాతీయ గృహనిర్మాణ బ్యాంక్‌కు రూ.8,000 కోట్లు, రహదారుల మెరుగుకు రూ.14,389 కోట్లు, మంచినీటి సరఫరా పథకాలకు రూ.3,600 కోట్లు కేటాయించారు. |
| ప్రాథమిక విద్య: » ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక విద్యకు రూ.55,115.10 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.50,136.30 కోట్లుగా ఉంది. » ప్రాథమిక విద్య తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఎన్డీయే ప్రభుత్వం పేర్కొంది. తొలిదశలో అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొత్తంగా విద్యారంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం కేటాయింపులు పెరిగాయి. » పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలకు రూ.51,828 కోట్లు కేటాయించారు. (విద్యా రంగం మొత్తానికి రూ.68,728 కోట్లు) » సర్వశిక్ష అభియాన్‌కు రూ.28,635 కోట్లు. » రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు. » ఉపాధ్యాయుల్లో ప్రేరణకు, నూతన బోధనా విధానాల అభివృద్ధికి 'పండిట్ మదన్‌మోహన్ మాలవ్య' పేరిట ప్రత్యేక కార్యక్రమం. దీనికి ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించారు. » మదర్సాల ఆధునికీకరణకు రూ.100 కోట్లు. » పాఠశాలకు వెళ్లాల్సిన 5-11 ఏళ్ల లోపు పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 5.78 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. వీరిలో మన దేశానికి చెందినవారు 14 లక్షల మంది ఉన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు అధికంగా ఉన్న తొలి అయిదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.ఉన్నత విద్య: » ఉన్నత విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.25,456 కోట్లు కేటాయించారు. 2013 - 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.24,485 కోట్లు. » దేశంలో కొత్తగా అయిదు ఐఐటీలు, అయిదు ఐఐఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. » కొత్త ఐఐటీలు జమ్మూ, చత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఏర్పాటు చేయనున్నారు. » ఐఐఎంలు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. » మధ్యప్రదేశ్‌లో 'జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్' ఏర్పాటు. » ఆన్‌లైన్ కోర్సులు, వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు రూ.100 కోట్లు. » విద్యా రుణాల నిబంధనల సరళీకరణకు నిర్ణయం. » యూపీఎస్‌సీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయింపు. » ఉన్నత విద్యలో చేరుతున్న యువతీ యువకుల సంఖ్య 2.7 కోట్లు. దేశంలోని 18-23 ఏళ్ల వయసున్న యువతలో ఇది 17.21 శాతం. 2020 నాటికి ఈ సంఖ్యను 4.5 కోట్లకు (25శాతం) పెంచాలని యూజీసీ ప్రతిపాదించింది. |
| వ్యవసాయం: » 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.31,062.94 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.26,070.87 కోట్లుగా ఉంది. » ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్‌లో వేర్వేరు వ్యవసాయ పథకాల కోసం రూ.7,500 కోట్లు ప్రకటించింది. » వ్యవసాయరంగంలో 4 శాతం వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నామని, సాగును లాభసాటిగా మారుస్తామనీ చెప్పారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునికీకరణకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల నుంచి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రకటించారు. » నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 'ప్రధానమంత్రి కృషి సించయీ యోజన' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం రూ.1000 కోట్లు కేటాయించారు. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి లక్ష్యం రూ.8 లక్షల కోట్లు. » వ్యవసాయ రుణాలపై తిరిగి చెల్లింపులను సక్రమంగా చేసేవారికి ప్రస్తుతం అందిస్తున్న 3 శాతం వడ్డీ రాయితీ కొనసాగింపు. » 5 లక్షల రైతు సమూహాలకు 'భూమి హీన్ కిసాన్' పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా రుణాలు. » వ్యవసాయరంగంలో జాతీయ మార్కెట్ ఏర్పాటులో భాగంగా ప్రైవేట్ మార్కెట్ యార్డులు, ప్రైవేట్ మార్కెట్లు నెలకొల్పేందుకు చట్ట సంస్కరణల కోసం రాష్ట్రాలతో కలిసి కృషి చేస్తారు. » రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు పట్టణ ప్రాంతాల్లో రైతు మార్కెట్ల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రోత్సాహం. » వ్యవసాయోత్పత్తుల ధరల అస్థిరత కారణంగా రైతులు కష్టనష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.500 కోట్లతో 'ధరల స్థిరీకరణ నిధి'. » భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తరహాలో అసోం, జార్ఖండ్‌లోనూ పరిశోధన కేంద్రాలు. » ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు; తెలంగాణ, హర్యానాలో ఉద్యాన విశ్వవిద్యాలయాల ఏర్పాటు. దీనికోసం రూ.200 కోట్ల నిధుల కేటాయింపు. » రెండో హరితవిప్లవంలో భాగంగా 'ప్రొటీన్ల విప్లవం' సాధన. » కిసాన్ వికాస్ పత్రాల పునరుద్ధరణ. » దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్ 'గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్)' కార్పస్ నిధికి అదనంగా రూ.5 వేల కోట్లు పెంపుదల. » 2014-15 సంవత్సరానికి గాను శాస్త్రీయ గిడ్డంగుల సౌకర్యాల ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయింపు. » వ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల పరపతిని పెంచేందుకు దీర్ఘకాలిక గ్రామీణ పరపతినిధిని నాబార్డ్‌లో ఏర్పాటు. ఇందులో సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణసాయం కోసం ప్రాథమికంగా రూ.5 వేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు. » 2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ స్వల్పకాలిక సహకార గ్రామీణ పరపతి రీఫైనాన్స్ నిధికి రూ.50 వేల కోట్లు ప్రతిపాదన. » చిన్న కమతాల రైతులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రొడ్యూస్ పేరిట రూ.200 కోట్లతో నాబార్డ్ కింద 'ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ఫండ్'కు ప్రతిపాదన. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2 వేల ఉత్పత్తిదారుల సంస్థల నిర్మాణం. » ఆర్గానిక్ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈశాన్య ప్రజలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ద్వారా భారీ లాభాలు సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయింపు. » ఎరువులను సమతుల పద్ధతుల్లో ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు రూ.100 కోట్లతో ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య కార్డుల అందజేత. » రూ.56 కోట్లతో 100 సంచార భూసార ప్రయోగశాలలు. » వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో 'జాతీయ సర్దుబాటు నిధి'. |
| విద్యుత్ రంగం: » 2014-15 సంవత్సరం కేటాయింపులు రూ.9,543.90 కోట్లు కాగా 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5,410.86 కోట్లు. » దేశాభివృద్థిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమని భావిస్తున్న మోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో పునరుత్పాదక, పర్యావరణహిత విద్యుదుత్పత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. భారీ స్థాయిలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, పార్కులు నెలకొల్పడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా పదేళ్లపాటు పన్ను మినహాయింపులనూ ప్రకటించారు. » సూర్యరశ్మి బాగా ఉండే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, జమ్ము కాశ్మీర్‌లోని లడక్‌లలో అత్యధిక సామర్థ్యం ఉన్న (అల్ట్రా మెగా) సౌర విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయానికి, తాగునీటి పంపింగ్‌కు వినియోగిస్తున్న సాధారణ మోటార్ల స్థానంలో సౌరవిద్యుత్‌తో నడిచే మోటార్లను వినియోగించడం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లక్ష మోటార్లను మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు రూ.400 కోట్లు కేటాయింపు. » కాలువ గట్లపై మెగావాట్ సామర్థ్యంగల సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు. » గుజరాత్ తరహాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లను వ్యవసాయ, గృహ వినియోగ రకాలుగా విభజించనున్నారు. 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన'గా పిలిచే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. » విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఢిల్లీలో విద్యుత్ సంస్కరణల కోసం రూ.200 కోట్లు కేటాయింపు. » 2017, మార్చి 31 నాటికి విద్యుదుత్పత్తి పంపిణీ, సరఫరా ప్రారంభించే సంస్థలకు ఏడాది ప్రాతిపదికన కాకుండా పదేళ్లపాటు పన్ను విరామాన్ని (ట్యాక్స్ హాలిడే) విస్తరించడానికి ప్రతిపాదన. » సంప్రదాయ, పునరుత్పాదక విద్యుత్‌ల అనుసంధానానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం. తద్వారా పవన, సౌర విద్యుత్‌ను ఎక్కడ ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావొచ్చన్నది ప్రభుత్వ యోచన. » సౌర విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే ఫొటోవోల్టాయిక్ సెల్స్ దిగుమతుల ప్రోత్సాహక విధానంలో మార్పులు తీసుకురానున్నారు. » ఫొటోవోల్టాయిక్ రిబ్బన్లలో వాడే రాగి తీగ తయారీదారులకు దిగుమతి సుంకాల్లో మినహాయింపులు. » సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే యంత్రాలు, యంత్ర పరికరాలపై విధించే దిగుమతి సుంకాల తగ్గింపు 5 శాతం వరకూ విస్తరణ. » 2015 మార్చి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటికీ బొగ్గు సరఫరా సమస్య లేకుండా చూడటం. |
| కార్మిక, ఉపాధి కల్పన: » కార్మిక, ఉపాధి కల్పన శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.2,496 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.1723.16 కోట్లుగా ఉంది. » ప్రస్తుతమున్న ఉపాధి కల్పన కార్యాలయాలను కెరీర్ సెంటర్లుగా ఆధునికీకరించేందుకు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ కేంద్రాల వద్దకు వచ్చే విద్యార్థులకు కెరీర్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ఇస్తారు. » అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు, మహిళా కార్మికుల భద్రత, పనితీరును మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.పౌర విమానయాన రంగం: » 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో రూ.9,474 కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.8,502 కోట్లుగా ఉంది. » మెట్రో, నాన్ మెట్రో నగరాలకు కూడా విమాన సర్వీసులను పెంచడానికి ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. » ఎయిరిండియాకి రూ.7,069 కోట్లు, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ - ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు రూ.2,134 కోట్లు కేటాయించారు.క్రీడల రంగం: » ఎన్డీయే సర్కారు తన తొలి బడ్జెట్‌లో యువజన, క్రీడల శాఖకు నిధుల కేటాయింపును పెంచింది. » 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి రూ.1769 కోట్లు కేటాయించారు. 2013 - 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.1207 కోట్లు. » జమ్ము కాశ్మీర్‌లో క్రీడల సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయించారు. » భారత క్రీడా ప్రాధికార సంస్థకు రూ.405.10 కోట్లు కేటాయించారు. » రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్‌కు కేటాయింపులు రూ.104.85 కోట్ల నుంచి రూ.20 కోట్లు కుదింపు. » కామన్‌వెల్త్ క్రీడలు, ఏషియన్ గేమ్స్‌లలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేవారి సాధన ఏర్పాట్ల కోసం రూ.100 కోట్లు. » డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాల కోసం రూ.11.60 కోట్లు కేటాయించారు. |
| రక్షణ రంగం: » ఎన్‌డీయే ప్రభుత్వం రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచింది. ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకునేందుకు అనుమతించింది. » 2014 - 15 తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2,29,000 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్‌లో రక్షణకు రూ.2.03 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌లో రూ.2,24,000 కోట్లు కేటాయించారు. » ఆధునిక ఆయుధాల కొనుగోలుకు కేటాయించిన రూ.89.5 వేల కోట్లకు అదనంగా మరో రూ.5 వేల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. » సరిహద్దుల్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. » 'ఒకే క్యాడర్, ఒకే పెన్షన్'కు ఏటా అదనంగా రూ.1000 కోట్లు. » ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రిన్సెస్ పార్క్ వద్ద యుద్ధ స్మారక చిహ్నం నిర్మాణానికి రూ.100 కోట్లు. » సరిహద్దుల్లో మౌలిక వసతులకు రూ.1000 కోట్లు.ఆదాయపు పన్ను రంగం » అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అల్పాదాయ వర్గాలకు కాస్త ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి 60 ఏళ్లలోపు వారికి కనీస ఆదాయ పరిమితిని రూ.2,00,000 నుంచి రూ. 2,50,000కు పెంచారు. » ఇక 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ.2,50,000 నుంచి రూ.3,00,000కు పెంచారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి రూ.5 వేల మేరకు ప్రయోజనం కలుగుతుంది. » 80 ఏళ్ల వయసువారికి ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు. వీరికి ప్రస్తుతం పన్ను వర్తించని ఆదాయ పరిమితి రూ.5 లక్షలు. » ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80 సి కింద నిర్దేశిత పెట్టుబడులపై గరిష్ఠంగా రూ.లక్ష మేరకు మినహాయింపు లభిస్తోంది. పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మినహాయింపు మొత్తాన్ని రూ.1,50,000 కు పెంచారు. అంటే గరిష్ఠ మొత్తానికి మదుపు చేసిన వారికి కనీసం రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకు కలిసి వస్తుంది. » గృహ నిర్మాణ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ సొంతింటి కోసం రుణం తీసుకున్నవారికి కొంత ఊరట కల్పించారు. గృహరుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 24 బి ప్రకారం గరిష్ఠంగా రూ.2 లక్షల మేరకు ఆదాయంలో నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది రూ.1,50,000 గా ఉంది. దీనివల్ల కనీసం రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. » వ్యాపారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. |
|
|
హోంశాఖ బడ్జెట్ పెంపు:* గతేడాదితో పోల్చితే ఈ ఏడాది హోంమంత్రిత్వ శాఖకు 11 శాతం నిధులు అధికంగా కేటాయించారు.
తాజా బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.65,745 కోట్లు కేటాయించగా, గతేడాది రూ.59,241 కోట్లు కేటాయించారు.* పెద్ద నగరాల్లో మహిళా భద్రతను పటిష్టపరిచేందుకు రూ.150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.* ఈ ఆర్థిక సంవత్సరంలో సీఆర్‌పీఎఫ్ దళాలకు రూ.12,169.51 కోట్లు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు
రూ.1176.43 కోట్లు, ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు రూ.241.20 కోట్లు, జాతీయ పరిశోధన ఏజెన్సీకి
రూ.101.03 కోట్లు కేటాయించారు.పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం: » పట్టణాలను నివాసయోగ్య ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడం, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ,
డిజిటల్ కనెక్టివిటీ లాంటి చర్యలు చేపడతామని ప్రకటించారు. నగరాల్లో రద్దీని తగ్గించేందుకు
మెట్రో రైలు వ్యవస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. 2022 నాటికి అందరికీ సొంతిల్లు
ఉండాలన్న లక్ష్యం మేరకు గృహ రుణాలపై అదనంగా పన్ను ప్రోత్సాహకం కల్పిస్తున్నట్లు జైట్లీ
ప్రకటించారు.గ్రామీణుల చెంతకు తాగునీరు: » కేంద్ర బడ్జెట్‌లో తాగునీటికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశంలో సుమారు 20 వేల
గ్రామాలను కలుషిత జలాల నుంచి కాపాడి రక్షిత మంచినీటిని అందించేందుకు జాతీయ
గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా రూ.3600 కోట్లను ప్రత్యేకంగా వ్యయం చేయాలని
నిర్ణయించారు.సబ్సిడీల పెంపు స్వల్పం: » బడ్జెట్‌లో సబ్సిడీల మొత్తాన్ని ఒక మోస్తరుగా 2.47 శాతం మేర పెంచారు. దీంతో
ఇది రూ.2,51,397.25 కోట్లకు చేరుతుంది. » ఆహార, పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీలతో పాటు మొత్తం సబ్సిడీల విధానాన్ని
సమగ్రంగా పరిశీలిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించారు. అట్టడుగు వర్గాలకు,
పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రక్షణ కల్పిస్తూనే అర్హులైన వారికే సబ్సిడీ అందేలా
తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కొత్త యూరియా విధానాన్ని కూడా రూపొందిస్తామని
ప్రకటించారు. |
స్వచ్ఛమైన భారతం (స్వచ్ఛ్ భారత్ అభియాన్): » అపరిశుభ్ర వాతావరణంతో అల్లాడుతున్న గ్రామాల్లో నేటికీ అత్యధిక శాతం మంది
ఆరుబయట మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తోన్న పరిస్థితుల్లో కేంద్రం గ్రామీణ పరిశుభ్రతకు
ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. వచ్చే అయిదేళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ పరిశుభ్రతతో
కళకళ్లాడేలా చేసే కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాకారమవుతుందని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ 150
వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే లక్ష్యమని
పేర్కొన్నారు. » ఈ మహోన్నత కార్యక్రమం పేరు 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'. » గత యూపీఏ ప్రభుత్వం ఇదే కార్యక్రమాన్ని 'నిర్మల్ భారత్ అభియాన్' పేరుతో మొదలు
పెట్టినా 2022 లక్ష్యంగా పెట్టుకుంది. మోడీ సర్కారు ఈ లక్ష్యాన్ని 2019 నాటికి నిర్దేశించింది. » నిర్మల్ భారత్ అభియాన్ ప్రస్తుతం 607 జిల్లాల్లో అమలవుతోంది. » 11వ ప్రణాళికలో గ్రామీణ పారిశుద్ధ్యానికి రూ.6,540 కోట్లు కేటాయించగా 12వ ప్రణాళికలో
ఏకంగా రూ.34,337 కోట్లు కేటాయించారు. » నిజానికి కేంద్ర ప్రభుత్వం 1986 లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకాన్ని ప్రవేశపెట్టి భారీగా
రాయితీలు ప్రకటించినా పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు. డిజిటల్ ఇండియా: » 'డిజిటల్ ఇండియా' కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోఅంతర్జాల (ఇంటర్నెట్) సేవల
మెరుగుదలకు, గ్రామీణస్థాయిలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికికేంద్రం
రూ.500 కోట్లు కేటాయించింది. » ఈ కార్యక్రమం కింద జాతీయ గ్రామీణ అంతర్జాల,సాంకేతిక సేవల మిషన్ ద్వారా గ్రామాల్లో అంతర్జాల సేవలనుమెరుగుపరచడంపై కేంద్రం దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం, గ్రామాల్లో,పాఠశాలల్లో ఐటీ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను ప్రజలకు చేరువ చేయడం లాంటివాటికి ఇది ఉపకరిస్తుంది. అలాగే గ్రామీణ స్థాయిలో భారతీయ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులనుప్రోత్సహిస్తుంది. సాంకేతిక సేవా సంస్థలకు అవకాశాలను పెంచుతుంది. |
ఈ - వీసా విధానం: » మరింతమంది పర్యాటకులు మన దేశానికి వచ్చేందుకు వీలుగా తాజా బడ్జెట్‌లో ఈ-వీసా
విధానాన్ని ప్రతిపాదించారు. తొమ్మిది విమానాశ్రయాల్లో విడతల వారీగా ఈ-వీసా విధానాన్ని
అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆరు నెలల్లో అందుబాటులోకి
తీసుకురానున్నారు. ఈ-వీసా విధానం కిందకు వచ్చే దేశాలను విడతల వారీగా ఎంపిక చేస్తారు.
విదేశీయులు భారత్‌లోకి వచ్చిన వెంటనే వీసా ఇచ్చే (వీసా-ఆన్-అరైవల్) ప్రక్రియను ఈ-వీసా
మరింత సులభతరం చేస్తుంది.'స్కిల్ ఇండియా' కార్యక్రమం: » యువతకు వివిధ నైపుణ్యాలు నేర్పించేందుకుగాను 'స్కిల్ ఇండియా పేరుతో జాతీయ
స్థాయిలో బహుళ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందులో
యువతకు ఉద్యోగ, వ్యాపార నైపుణ్యాలు నేర్పిస్తారు. వెల్డింగ్, వడ్రంగం, చేనేత లాంటి అనేక
సంప్రదాయ వృత్తి శిక్షణలు అందిస్తారు. » కొత్తగా వ్యాపారాలు, స్వయం ఉపాధి ప్రాజెక్టులు ప్రారంభించే గ్రామీణ యువతకు అండగా
నిలిచే కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. » దేశంలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలను కెరీర్ కేంద్రాలుగా మలచి తగిన ఉపాధి అవకాశాలు
చూపడం; శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తూ మార్గదర్శనం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించారు.
ఈ చర్యలన్నీ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా వేసిన అడుగులుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం కూడా కొలువుల సృష్టికి తోడ్పడుతుందని, పర్యాటక, వ్యవసాయ
ఆధారిత పరిశ్రమలు, బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. » బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ చర్యలతో వచ్చే మూడు నాలుగేళ్లలో వివిధ రంగాల్లో
50 లక్షల నుంచి 80 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. |
నమామి గంగ: » పవిత్ర గంగానది పరిరక్షణ కోసం తాజా బడ్జెట్‌లో రూ.2,037 కోట్లు ప్రతిపాదించారు.
గంగానది పరిరక్షణ కోసం 'నమామి గంగ' పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ
గంగానది అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినప్పటికీ సరైన కృషి లేక ఆశించిన ఫలితాలు
రాలేదు. » గంగానది అభివృద్ధికి ప్రవాస భారతీయుల నుంచి మంచి స్పందన రావడంతో వారి నుంచి
మద్దతు కూడగట్టే విధంగా త్వరలో గంగానదీ ప్రవాస భారతీయ నిధి (ఎన్ఆర్ఐ ఫండ్ ఫర్ గంగ)
ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధితో ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. » కేదార్‌నాథ్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, పాట్నా, ఢిల్లీల్లో నదీ తీర
సుందరీకరణ, ఘాట్‌ల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. » దేశంలో నదుల అనుసంధానంపై అధ్యయనం చేయడానికి రూ.100 కోట్లు కేటాయించారు.
దీంతో నదుల అనుసంధానానికి సంబంధించి సమగ్ర నివేదికను తయారుచేస్తారు.కిసాన్ టీవీ: » రైతులకు అవసరమైన తాజా సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా
'కిసాన్ టీవీ'ని ఆరంభించనుంది. ఇందుకోసం 2014-15 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది
. కొత్త వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం లాంటి అంశాలకు సంబంధించిన
తాజా విషయాలను అందించడం కిసాన్ టీవీ ఉద్దేశం. వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల
ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుంది. ఈ కొత్త ఛానెల్‌ను ఆరంభించడంపై ప్రసార భారతి ఇప్పటికే
పనిచేస్తోంది.జౌళి రంగానికి ఊతం: » తాజా బడ్జెట్‌లో జౌళి రంగానికి ఊతం ఇచ్చేలా దేశవ్యాప్తంగా కొన్ని భారీ టెక్స్‌టైల్ క్లస్టర్లను
ప్రతిపాదించారు. వాణిజ్య కేంద్రాలు, క్రాఫ్ట్ మ్యూజియాల నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు.
వీటితో వారణాసి, ఇతర హస్తకళలకు ప్రాచుర్యం కల్పించనున్నారు. » బరేలీ, లక్నో, సూరత్, కచ్, భాగల్‌పూర్, మైసూర్, తమిళనాడుల్లో టెక్స్‌టైల్ క్లస్టర్ల కోసం
రూ.200 కోట్లు కేటాయించారు. » ఢిల్లీలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో హస్తకళా అకాడమీని ఏర్పాటు చేయాలని
బడ్జెట్‌లో ప్రతిపాదించారు. » పష్మినా (ఉన్ని) ప్రాచుర్య కార్యక్రమం, జమ్మూ కాశ్మీర్‌లోని ఇతర కళల అభివృద్ధికి
రూ.50 కోట్లు కేటాయించారు. |
100 స్మార్ట్ సిటీలు: » దేశంలో 100 నగరాలను ఆధునిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడానికి ప్రస్తుత
ఆర్థిక సంవత్సరంలో రూ.7060 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. » పెద్ద నగరాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలు, చిన్నతరహా పట్టణాలను కేంద్రం ఈ పథకం
కింద ఎంపిక చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో
దీన్ని ప్రకటించింది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం కొన్ని నిబంధనలను సడలించింది.అమర జవాన్ల భారీ స్మారక స్థూపం: » ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్న ప్రిన్సెస్ పార్కులో అమర జవాన్ల కోసం భారీ స్మారక
స్థూపాన్ని, యుద్ధ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్లో
రూ.100 కోట్లు కేటాయించారు. » జాతీయ పోలీసు స్మారక కేంద్రానికి రూ.50 కోట్లు కేటాయించారు.సేవా పన్ను పరిధి పెంపు: » తాజా బడ్జెట్‌లో సేవా పన్ను పరిధిని పెంచారు. పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని
ఆర్జించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం సేవా పన్ను పరిధిని పెంచింది. పరోక్ష పన్నుల ద్వారా
అదనంగా రూ.7,525 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేడియో ట్యాక్సీల
సేవలను కూడా పరోక్ష పన్నుల కిందికి తీసుకొచ్చారు. » సేవా పన్నుల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.బయో టెక్నాలజీకి ఊతం: » శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా బయోటెక్నాలజీపై
ప్రత్యేక దృష్టి పెట్టారు. » ఫరీదాబాద్, బెంగళూరుల్లోని బయోటెక్నాలజీ క్లస్టర్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు
తీర్చిదిద్దుతారు. జన్యు ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ రంగాలకు మరింత ఊతం. » మొహాలీ లోని వ్యవసాయ - బయోటెక్ క్లస్టర్‌ను మరింత మెరుగుపరచి, ప్లాంట్ - జెనెటిక్, ఫెనోటైప్
విభాగాలను జోడిస్తారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా మొహాలీలో సెకండరీ
వ్యవసాయానికి ఊతం. దీనికి తోడు పుణె, కోల్‌కతాల్లో రెండు కొత్త క్లస్టర్ల ఏర్పాటు. » ఢిల్లీలోని అంతర్జాతీయ జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కేంద్రాన్ని అంతర్జాతీయ
స్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రపంచ భాగస్వామ్యాల అభివృద్ధి. » భూశాస్త్ర, వాతావరణ రంగాల్లో పరిశోధన కోసం భూ అధ్యయన శాస్త్ర విభాగానికి రూ.1699 కోట్లు. » సాగర పరిశోధన కోసం రూ.629 కోట్లు కేటాయించారు. |
ఇస్రోకు పెరిగిన కేటాయింపులు: » వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ప్రభుత్వం
కూడా జోరుగా నిధులు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 50 శాతం
మేర కేటాయింపులు పెంచి, రూ.6 వేల కోట్లు ఇచ్చింది. 2013-14లో తొలుత
రూ.5,615 కోట్లు కేటాయించిన తర్వాత దీన్ని సవరించి రూ.4 వేల కోట్లకు పరిమితం చేశారు. » తాజా కేటాయింపుల్లో ఎక్కువ భాగం రూ.3,545.63 కోట్లు అంతరిక్ష పరిజ్ఞానానికి వెళ్తాయి.
ఇన్‌శాట్ ప్రాజెక్టు కోసం రూ.1412.98 కోట్లు కేటాయించారు. » 2014-15లో భవిష్యత్ తరం భారీ వాహక నౌక జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 ప్రయోగాత్మక పరీక్ష
పీఎస్ఎల్‌వీ వాహక నౌక వాణిజ్య ప్రయోగం, రెండు నావిగేషనల్ ఉపగ్రహాల ప్రయోగం ఉంటాయి. » జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 కోసం రూ.378.76 కోట్లు. చంద్ర మండల అన్వేషణ కార్యక్రమం
చంద్రయాన్ కోసం రూ.60 కోట్లు. » అంగారక పరిశోధన ఉపగ్రహం (మామ్) ఈ ఏడాది సెప్టెంబరు 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశం.
ఈ ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్‌లో రూ.65.63 కోట్లు కేటాయింపు.నేషనల్ అడాప్టేషన్ ఫండ్: » వాతావరణ మార్పులపై చర్యలకు రూ.100 కోట్లతో జాతీయ నిధి (నేషనల్ అడాప్టేషన్ ఫండ్)ని
ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. » పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ.2,043 కోట్ల కేటాయింపు. గతేడాది రూ.2430 కోట్లు
కేటాయించారు. ప్రస్తుతం బొగ్గు, లిగ్నైట్ లాంటి వాటిపై పర్యావరణ అనుకూల ఇంధన సెస్‌ను
విధిస్తున్నారు. ఇలా సమకూరే ఆదాయాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాన్ని
ప్రోత్సహించేందుకు, ఆ రంగంలో పరిశోధనకు ఉపయోగిస్తున్నారు. |
స్టాక్ మార్కెట్ల ఊతానికి చర్యలు: » స్టాక్ మార్కెట్లలో మరింత ఉత్సాహం నింపడం కోసం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పలు
చర్యలను ప్రకటించింది. » అంతర్జాతీయ ఇండియన్ డెట్ సెక్యూరిటీల సెటిల్‌మెంట్‌కు ఆమోదం తెలిపారు.
అదే సమయంలో ఇండియన్ డిపాజిటరీ రిసీట్స్ (ఐడీఆర్)లను పూర్తిగా మార్చి భారత్
డిపాజిటరీ రిసీట్స్ (బీహెచ్‌డీఆర్)ను తీసుకువస్తున్నారు. ఏడీఆర్, జీడీఆర్‌ల విధానాన్ని
సరళీకరిస్తున్నారు. » రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఆర్ఈఐటీ)లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. » విదేశీ మదుపర్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పేరిట ఒక కొత్త విభాగాన్ని
సృష్టించారు. సెక్యూరిటీల్లో వీరు జరిపే లావాదేవీల వల్ల వచ్చే ఆదాయాన్ని మూలధన లాభంగా
పరిగణిస్తామని ప్రకటించారు. ఈ కొత్త విధానం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. » రుణ ఆధారిత మ్యూచువల్ ఫండ్లపై దీర్ఘకాల మూలధన పన్నును 10 శాతం నుంచి 20
శాతానికి సవరించారు. అయితే దీర్ఘకాల డెట్ ఫండ్ యూనిట్లను అట్టిపెట్టి ఉంచుకునే వ్యవధిని
12 నెలల నుంచి 36 నెలలకు పెంచారు. ఈ సవరణలు 2015, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. |
సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు: » ఐక్యతకు చిహ్నంగా గుజరాత్‌లో భారీ ఎత్తున నిర్మించతలపెట్టిన ఉక్కు మనిషి సర్దార్
వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.200 కోట్ల నిధులు కేటాయించారు.
గుజరాత్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తాన్ని విరాళాలుగా సమీకరిస్తున్నారు. » ప్రధాని మోడీ ఈ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించడం గమనార్హం.ఉన్నతాధికారుల శిక్షణకు రూ.205 కోట్లు: » దేశంలో సమర్థ పాలనకు ఉద్దేశించి కేంద్ర సచివాలయ ఉన్నతాధికారుల శిక్షణ కోసం
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖకు తాజా బడ్జెట్‌లో కేంద్రం రూ.205.66
కోట్లు కేటాయించింది. » సచివాలయ శిక్షణ, నిర్వహణ సంస్థ (ఐఎస్‌టీఎం), లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పాలన
సంస్థ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ)ల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఎంఎస్ఎంఈ లకు జవసత్వాలు: » సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జవసత్వాలు కల్పించడానికి బడ్జెట్‌లో
అనేకచర్యలను మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ప్రారంభ కంపెనీలను
ప్రోత్సహించడంపై దృష్టిసారించింది. » సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలో ప్రారంభ కంపెనీల
కోసంరూ.10,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.వాటాల విక్రయంతో రూ.63,400 కోట్లు: » ప్రభుత్వ, ప్రభుత్వేతర కంపెనీల్లో తనకున్న వాటాను విక్రయించడం ద్వారా ప్రస్తుత
ఆర్థికసంవత్సరంలో రూ.63,400 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గత ప్రభుత్వంమధ్యంతర బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.56,925 కోట్ల కంటే ఈ మొత్తం అధికం. » యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైడ్ అండర్ టేకింగ్‌లో వాటా సహా ప్రభుత్వ రంగ
కంపెనీల్లోవాటా విక్రయం ద్వారా రూ.43,425 కోట్లు, ప్రభుత్వేతర కంపెనీల్లోని వాటా విక్రయం
ద్వారారూ.15,000 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం ప్రారంభించిన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్
ఎక్స్ఛేంజీట్రేడెడ్ ఫండ్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకులకు రూ.2.4 లక్షల కోట్లు: » ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా భారీ ఎత్తున నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించడంతోపాటు 'బాసెల్ 3' ప్రమాణాలకు అనుగుణంగా వీటిని నిర్వహించేందుకు 2018 నాటికి రూ.2.40 లక్షల కోట్ల మూలధనం సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, తన వాటాను ప్రభుత్వం తగ్గించుకుంటుంది. అయితే బ్యాంకులపై నియంత్రణకు అవసరమైన 51 శాతం మేర వాటాను ప్రభుత్వం కలిగి ఉంటుంది.విద్యుత్ వెలుగులు: » విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యాన్ని ఇచ్చారు. » సమర్థమైన థర్మల్ విద్యుత్తు రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'అత్యాధునిక సూపర్ క్రిటికల్ కోల్ బేస్‌డ్ థర్మల్ పవర్ టెక్నాలజీ' పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికి ప్రాథమికంగా రూ.100కోట్లు కేటాయించారు. మరోపక్క దేశీయంగా బొగ్గు లభ్యత పెంపొందించే లక్ష్యంతో పలు చర్యలను ప్రతిపాదించారు. » విద్యుత్తు రంగానికి పదేళ్ల పన్ను విరామం వెసులుబాటును మరో ఏడాదిపాటు పొడిగించాలని మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. '3 పీ ఇండియా': » మౌలిక సదుపాయాల కల్పనలో నిధుల లభ్యత ప్రధానమైన సమస్య. దీన్ని అధిగమించడానికి రూపొందించిన విధానమే ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ). దీనివల్ల అత్యాధునిక విమానాశ్రయాలు, అద్భుతమైన జాతీయ రహదార్లు నిర్మించే అవకాశం లభించింది. అయితే అదే సమయంలో ఈ విధానంలో ఎన్నో లోపాలు, లొసుగులు బయటపడ్డాయి. అందువల్ల ఈ విధానాన్ని కొత్త రకంగా తీర్చిదిద్దాలని, లోటుపాట్లు సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » '3 పీ ఇండియా' అనే పేరుతో రూ.500 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ - ప్రైవేట్ ప్రాజెక్టులకు సంబంధించిన విధి విధానాలు, అమలు లాంటి వివిధ అంశాలపై ఈ సంస్థ అధ్యయనం చేసి ఆచరణాత్మకమైన మార్పులు, చేర్పులు సూచిస్తుందని భావిస్తున్నారు. నౌకాశ్రయాల అనుసంధానం: » నౌకా రవాణాను ప్రోత్సహించే దిశగా నౌకాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల వర్తకం వృద్ధి చెందుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. » నౌకాశ్రయాలను అనుసంధానం చేయడానికి 16 నౌకాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఈ ఏడాదిలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. » ట్యూటికోరిన్ మొదటి అవుటర్ హార్బర్ ప్రాజెక్టుకు రూ.11,635 కోట్లు కేటాయించారు. కాండ్లా, జేఎన్‌పీటీలలో ఎస్ఈజడ్‌లు ఏర్పాటు చేస్తారు. » 'జల్ మార్గ్ వికాస్' పేరుతో అలహాబాద్ - హల్దియా మధ్య 1620 కిలోమీటర్ల దూరం ఉన్న జల మార్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆరేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టుకు రూ.4200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.సీబీఐకి పెరిగిన కేటాయింపులు: » కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు రూ.520.56 కోట్లకు పెరిగాయి. 2013 - 14తో పోలిస్తే ఇది 17% అధికం. ఇ-పాలన, శిక్షణ కేంద్రం ఆధునికీకరణ, సాంకేతిక విభాగాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం తదితర అవసరాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చూపించారు. » అవినీతి నిరోధక వ్యవస్థ - లోక్‌పాల్‌కు వ్యవస్థాపన ఖర్చుల నిమిత్తం బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించారు.కస్టమ్స్ సుంకం లక్ష్యం పెంపు: » ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,01,819 కోట్ల మేరకు కస్టమ్స్ సుంకాన్ని వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది రూ.1,75,056 కోట్ల సుంకాన్ని వసూలు చేసింది. » సమాచార సాంకేతిక ఒప్పందం కిందకు రాని టెలి కమ్యూనికేషన్స్ ఉత్పత్తులకు 10% కస్టమ్స్ సుంకాన్ని ప్రతిపాదించారు. » సహజ వనరుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని బాక్సైట్ ఎగుమతులను నియంత్రించేందుకు వీలుగా బాక్సైట్ ఎగుమతి సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచారు.ఇతర అంశాలు: » ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే. » అరుణ్‌జైట్లీ పంజాబ్‌కు చెందినవారు. » 2014 ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. » మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి సాధారణ బడ్జెట్‌కు చిన్న అపశ్రుతి ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నడుం నొప్పి కారణంగా బడ్జెట్ ప్రసంగానికి 5 నిమిషాలపాటు ఆటంకం ఏర్పడింది. కూర్చొని బడ్జెట్ పాఠాన్ని చదవడం బహుశా దేశ పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. » తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివృద్ధి అనే పదాన్ని 31 సార్లు, పెట్టుబడులు అనే పదాన్ని 34 సార్లు ఉపయోగించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014-15 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు
|
ఆంధ్రప్రదేశ్ » పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే కొన్ని ప్రతిపాదనలకు బడ్జెట్‌లో స్థానం దక్కింది. » విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఈ ప్రతిపాదనల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. విశాఖ - చెన్నై కారిడార్‌ను చేపడతామని, దీనిలో భాగంగా 20 నూతన పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తూర్పు తీరానికి కంఠహారంగా రూపొందే ఈ కారిడార్‌లో 90 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉండటం గమనార్హం. » విశాఖపట్నం - చెన్నై మధ్య దూరం దాదాపు 800 కిలోమీటర్లు. ఇందులో దాదాపు 700 కిలోమీటర్ల మేరకు ఆంధ్రప్రదేశ్ భూభాగం. » విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో తొలివిడత కనీసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. » ఈ కారిడార్‌కు అవసరమైన ప్రణాళిక తయారీ, పెట్టుబడుల కోసం ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆసక్తి చూపుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, అభివృద్ధి ప్రణాళికను జపాన్ అంతర్జాతీయ సహకార సమాఖ్య (జైకా) సిద్ధం చేస్తోంది. » ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కాకినాడలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కును ప్రతిపాదించింది. కేంద్రమే నేరుగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు లభించనున్నాయి. ఇక్కడ తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నేరుగా కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. » నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ప్రాంతంలో చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఒక స్మార్ట్ సిటీని నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్‌లో తమిళనాడులోని 7 జిల్లాలు, కర్ణాటకలోని 7 జిల్లాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, జిల్లాలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కూడా చేరింది. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తమిళనాడులోని పొన్నేరి, కర్ణాటకలోని తుముకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నాన్ని స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. » కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఒక జాతీయ పారిశ్రామిక కారిడార్ల అథారిటీ ఏర్పాటు కానుంది. దీన్ని పుణె కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. » ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటుకు తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఐఐటీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకూ తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. » బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ జాతీయ అకాడమీని కేంద్రం మంజూరు చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఈ అకాడమీని నెలకొల్పుతారు. ప్రస్తుతం జాతీయ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్ అకాడమీ (ఎన్ఏసీఈఎన్) ప్రధాన శిక్షణ కేంద్రం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా కొనసాగుతోంది. ఈ అకాడమీకి బెంగళూరు, ముంబయి, చెన్నై, పాట్నా, వడోదర, కొల్‌కత, కాన్పూర్, హైదరాబాద్, ఢిల్లీల్లోనూ ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. » కేంద్ర ప్రభుత్వం బెంగళూరు - ముంబయి పారిశ్రామిక కారిడార్‌ను కూడా ప్రతిపాదించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ » తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే మిగిలింది. అనేక వరాలను ప్రభుత్వం కోరినా ఒక్క ఉద్యానవన విశ్వవిద్యాలయంతోనే కేంద్రం సరిపెట్టింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన వాటిలో ఇది ఒకటి. అందులోని మిగిలిన ఏ ఒక్కదానిపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు. కేంద్ర పన్నుల్లో రెండు రాష్ట్రాల వాటా: » ఆంధ్రప్రదేశ్‌కు 2014-15 కేంద్ర పన్నుల్లో వాటా రూపేణా రూ.16,838 కోట్ల మేర లభించనుంది. » ఇదే సమయంలో తెలంగాణకు రూ.9,749 కోట్లు అందుతాయి. » కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా వాటాలను వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిర్ధరించిన శాతాన్ని రెండు రాష్ట్రాలకు జానాభా నిష్పత్తిలో వేరుచేసి ఆ దామాషాలో నిధులను పొందుపరిచింది. » కేంద్ర ప్రభుత్వానికి అందే పన్ను రాబడుల్లో ప్రస్తుతానికి 32 శాతం మేర రాష్ట్రాలకు లభిస్తుంది. ఈ 32 శాతంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటాను ఇవ్వాలనేది 2010లో 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. » దీని ప్రకారం సేవా పన్ను మినహా మిగతా ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ లాంటి వాటిలో ఉమ్మడి రాష్ట్రానికి 6.937 శాతం మేర లభించేది. సేవా పన్నులో 7.047 శాతం అందేది. » రాష్ట్రం వేరుపడిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పన్నుల మొత్తాలను వేర్వేరుగా ఇవ్వాల్సి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వాటాలనే రెండు రాష్ట్రాలకు కేంద్రం జనాభా నిష్పత్తిలో విభజించింది. దీంతో సేవా పన్ను మినహా మిగతా పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4.044 శాతం మేర, తెలంగాణకు 2.893 శాతం మేర తాత్కాలిక వాటాలు లెక్కతేలాయి. » 14వ ఆర్థిక సంఘం చేసే సిఫారసుల మేరకు 2015-16 బడ్జెట్ మొదలుకుని రెండు రాష్ట్రాలకు స్పష్టమైన వాటాల శాతాలు ఉంటాయి. » ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు దానిలో కేంద్ర పన్నుల్లో రూ.27,028 కోట్ల మేర రానున్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి రూ.26,588 కోట్లను ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం బట్టి ఉమ్మడి రాష్ట్ర అంచనా కంటే రూ.440 కోట్ల మేర తగ్గినట్లయింది. |
|
జులై - 13
|
| ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ రుణాలను తెలంగాణ వ్యవసాయశాఖ ఖరారు చేసింది. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌కు కలిపి రూ.27,963.21 కోట్లను వ్యవసాయ రుణాలుగా రైతులకు ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించింది. » గతేడాది కంటే రూ.4,244 కోట్లు అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించింది. మొత్తం రూ.27,963 కోట్లలో పంట రుణాల కింద రూ.23,397.63 కోట్లు, మిగతా సొమ్ము దీర్ఘకాలిక రుణాలుగా రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. » సహకార సంఘాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 7,24,705 మంది రైతులకు రూ.3123.74 కోట్ల రుణాలను ఇచ్చారు. » తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 912 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 38,33,505 మంది సభ్యులున్నారు. కాగా 193 సహకార సంఘాలు మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గతేడాది మొత్తం 38.33 లక్షల సభ్యుల్లో కేవలం 18.9 శాతం మంది రైతులకే సహకార రుణాలు అందించగలిగారు. |
జులై - 14
|
| ¤ సామాన్యుడికి ఓ తీపి కబురు. చుక్కలనంటిన ధరలు నేలకు దిగివస్తున్నాయి. జూన్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నాలుగు నెలల కనిష్ఠానికి, రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 30 నెలల కనిష్ఠానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. » కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ జూన్‌లో 5.43 శాతంగా నమోదైంది. మేలో ఇది అయిదు నెలల గరిష్ఠమైన 6.01 శాతానికి చేరింది. గతేడాది జూన్‌లో 5.16 శాతంగా ఉంది. » మరోవైపు సీపీఐ మేలో 8.28% కాగా జూన్‌లో 7.31 శాతానికి పరిమితమైంది. 2012 జనవరిలో నమోదైన 7.65 శాతం తర్వాత ఇదే అత్యల్పం. » బంగాళదుంపలు, ఉల్లి, బియ్యం ధరలను అదుపులోకి తెచ్చేందుకు మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి కారణం. |
జులై - 15
|
| ¤ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసంగా పేరొందిన సత్యం కుంభకోణంపై సెబీ తన తీర్పును వెల్లడించింది. అయిదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం తీర్పును వెలువరించింది. » ఈ మేరకు మార్కెట్ లావాదేవీల్లో రానున్న 14 ఏళ్లపాటు పాల్గొనకూడదంటూ ఒకప్పటి సత్యం కంప్యూటర్ వ్యవస్థాపక ఛైర్మన్ బి.రామలింగ రాజుపై సెబీ నిషేధం విధించింది. రాజు సోదరుడు బి.రామదాసు (ఈయన అప్పటి సత్యం కంప్యూటర్ ఎండీ), వడ్లమాని శ్రీనివాస్ (ఆ కంపెనీ సీఈవో), జి.రామకృష్ణ (వైస్ ప్రెసిడెంట్), వి.ఎస్.ప్రభాకర్ గుప్త (అంతర్గత ఆడిట్ విభాగం అధిపతి) పైనా ఈ నిషేధాన్ని ప్రకటించింది. » ఈ అయిదుగురూ అక్రమ పద్ధతుల్లో సంపాదించిన రూ.1849 కోట్లను, దానిపై వడ్డీ రూ.1200 కోట్లను 45 రోజుల్లోపు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. » ఈ కుంభకోణంలో దాదాపు రూ.12,320 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సెబీ తన తీర్పులో వెల్లడించింది. దీనివల్ల రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు లాభపడ్డారు. |
జులై - 16
|
¤ జూన్‌లో భారత్ ఎగుమతులు 10.22% పెరిగి 2648 కోట్ల డాలర్లకు చేరాయి. 2013 జూన్‌లో ఇవి 2402 కోట్ల డాలర్లు మాత్రమే. » 2014 మేలోనూ ఎగుమతులు 12.4 శాతం వృద్ధితో 2400 కోట్ల డాలర్లకు పెరిగాయి. » 2014 జూన్‌లో పసిడి దిగుమతులు స్వల్పంగా పెరగడంతో మొత్తం దిగుమతులు 8.33 శాతం అధికమై 3530 కోట్ల డాలర్ల నుంచి 3824 కోట్ల డాలర్లకు చేరాయి. » దీంతో జూన్‌లో వాణిజ్య లోటు 1176 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఇది 11 నెలల గరిష్ఠం. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎగుమతులు 9.31 శాతం పెరిగి 8011 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 6.92 శాతం క్షీణతతో 11319 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు కూడా 4832 కోట్ల డాలర్ల నుంచి 3308 కోట్ల డాలర్లకు తగ్గింది. |
జులై - 17
|
| ¤ సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చి, పూర్తిస్థాయిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించాలనే ఆశయంతో చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల లైసెన్సుల జారీకి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు ప్రకటించింది. » భారీ వాణిజ్య బ్యాంకుల సేవలు పొందలేని వర్గాలకు, మారుమూల ప్రాంతాలకు సేవలు విస్తరించడమే వీటి లక్ష్యం. » సాధారణ వాణిజ్య బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్ల మూలధన పెట్టుబడి అవసరం కాగా చిన్న, చెల్లింపు బ్యాంకులకు ఈ మొత్తాన్ని రూ.100 కోట్లకు పరిమితం చేశారు. » ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్థానిక బ్యాంకులు చిన్న స్థాయి బ్యాంకులుగా మారేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. » చిన్న బ్యాంకులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పొరుగు జిల్లాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి. స్థానికత, అక్కడ సంస్కృతికి అనుగుణంగా పనిచేయాలి. భౌగోళికంగా సారూప్యత ఉంటే, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో చిన్న బ్యాంకుల సేవలు అందించేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తుంది. |
జులై - 19
|
¤ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 'హోమ్ లోన్ ఆన్ వీల్స్' అనే పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బ్యాంక్ గృహ రుణాల గురించి వివరించడం ఈ కార్యక్రమ ధ్యేయం. » బ్యాంక్ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెన్నైలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.¤ కెనరా బ్యాంక్ 5,011వ బ్రాంచ్‌ను న్యూఢిల్లీలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. » కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దూబే.¤ భారత్‌లో ఒకేసారి కెనడాకు చెందిన డాలర్ అకౌంట్‌తోపాటు, దేశంలో ఎన్ఆర్ఐ అకౌంట్‌నూ ప్రారంభించేలా ఐసీఐసీఐ బ్యాంక్ 'హలో కెనడా' పథకాన్ని ప్రవేశపెట్టింది.¤ బ్యాంకుల జాతీయీకరణకు 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. » ఇందిరాగాంధీ హయాంలో 1969లో బ్యాంకుల జాతీయీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పట్లో బ్యాంకులు కొద్దిమంది సంపన్నుల, పారిశ్రామికవేత్తల ఆర్థిక అవసరాలను తీర్చే సాధనాలుగా ఉండేవి. » ఆ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగాన్ని దేశ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందించే, వివిధ రంగాల రుణావసరాలను తీర్చే ఉద్దేశంతో జాతీయం చేశారు. » జాతీయీకరణ (1969 జులై 19) నాటికి దేశంలో ఒకస్థాయికి మించిన (రూ.50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నవి) బ్యాంకులు 14 మాత్రమే ఉండగా, ప్రస్తుతం దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 23 ప్రైవేట్ బ్యాంకులు, 43 విదేశీ బ్యాంకులున్నాయి. ఇవి కాకుండా 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. » ప్రభుత్వం 1991, 1998 లో నరసింహన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంతో బ్యాంకింగ్ రంగం విస్తృతంగా, పటిష్టంగా అభివృద్ధి చెందింది. » తాజాగా దేశంలో బ్యాంకుల పనితీరును మెరుగుపరచి అవి మరింత సమర్థంగా పనిచేసేందుకు తోడ్పడే దిశగా పి.జె.నాయక్ నేతృత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. » నాయక్ కమిటీ పీఎస్‌బీల ప్రైవేటీకరణ దిశగా సిఫార్సులు చేయడంతోపాటు బ్యాంకులను విలీనం చేయాలని ప్రతిపాదించింది.¤ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి రూ.5,957 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఒక ప్రైవేట్ రంగ సంస్థ కేవలం 3 నెలల వ్యవధిలో బిలియన్ డాలర్ల లాభాన్ని ప్రకటించడం కార్పొరేట్ ఇండియా చరిత్రలో ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ.5,237 కోట్ల నుంచి 13.7 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే కాలానికి మొత్తం వ్యాపారం 7.2 శాతం పెరిగి రూ.1,07,905 కోట్లకు చేరుకుంది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35,000 కోట్ల మూలధన వ్యయం దిశగా ఆర్ఐఎల్ ప్రణాళికలను రూపొందించింది. |
జులై - 23
|
| ¤ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లు దాటిన తొలి భారతీయ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చరిత్ర సృష్టించింది. » టీసీఎస్ మార్కెట్ విలువ రూ.5,06,703.34 కోట్లు కాగా ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది అధికం. » ప్రస్తుత మార్కెట్ విలువలో టీసీఎస్‌దే అగ్రస్థానం. తర్వాతి స్థానాల్లో ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోల్ ఇండియా ఉన్నాయి. » స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 2% లాభపడి రూ.2,587 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక రికార్డు ధర. » మొత్తం కంపెనీ షేర్ల సంఖ్యను ప్రస్తుత షేరు ధరతో గుణిస్తే వచ్చేదే మార్కెట్ విలువ. » టీసీఎస్ తొలిసారిగా 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయింది. |
జులై - 24
|
| ¤ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. » బీమా రంగంలో 26 శాతానికి మించిన పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి అవసరమని, యాజమాన్య అజమాయిషీ మాత్రం భారతీయ ప్రమోటర్ల చేతిలో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. » బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన 2008 నుంచి పెండింగ్‌లో ఉంది. » ఈ నిర్ణయంతో నిపుణుల అంచనా ప్రకారం బీమా కంపెనీలు రూ.20,000 - రూ.25,000 కోట్లు వరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. |
|
|