నవంబరు - 2014 వార్తల్లో వ్యక్తులు


నవంబరు - 1
¤ నార్వేకు చెందిన గున్నార్ గార్‌ఫోర్స్, టేయంగ్, ఓస్టీన్‌లు 24 గంటల వ్యవధిలో 19 దేశాల్లో పర్యటించి ప్రపంచ రికార్డు సృష్టించారు.¤ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ చిత్తరంజన్ బిశ్వాల్ పదవీ విరమణ చేశారు.         » 2012 డిసెంబరు 28న బిశ్వాల్ బాధ్యతలు స్వీకరించారు.¤ ఐక్యరాజ్యసమితి అత్యున్నత శాంతి పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా భారత విశ్రాంత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహ నియమితులయ్యారు.         » 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో అభిజిత్ గుహను సభ్యుడిగా ఐరాస అధినేత బాన్‌కీ మూన్ నియమించారు.         » శాంతి పరిరక్షణలో ఐరాస ప్రస్తుత, భవిష్యత్ పాత్రను ఈ కమిటీ అంచనా వేస్తుంది.
నవంబరు - 3
¤ వర్థమాన దేశాల్లో తీవ్రంగా ప్రబలే మలేరియా, ఇతర అంటువ్యాధులపై పోరాటానికి ఈ ఏడాది రూ.3,000 కోట్ల (500 మిలియన్ డాలర్లు) కంటే అధికంగా అందించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బిల్‌గేట్స్ ప్రకటించారు.
         » అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ వార్షిక సమావేశంలో ఆయన ఈ సంగతి వెల్లడించారు
.
         » ఎబోలా నిరోధానికి రూ.300 కోట్లు (50 మిలియన్ డాలర్లు) ఇస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ సెప్టెంబరులో ప్రకటించింది.
నవంబరు - 4 
¤ హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ మిలటరీ పోలీస్ కెప్టెన్‌గా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసీ గబార్డ్ బాధ్యతలు స్వీకరించారు.         » హవాయిలోని కిలువా అగ్ని పర్వతం నుంచి లావా పొంగి సమీప గ్రామాల గుండా ప్రవహిస్తూ ఇళ్లు, రోడ్లను చుట్టేస్తున్న తరుణంలో యూఎస్ నేషనల్ గార్డ్ తమ బృందాలను హవాయిలో దింపింది. ఈ నేపథ్యంలో తులసీ గబార్డ్ బాధ్యతలు స్వీకరించారు.
నవంబరు - 5 
¤ విశ్వవిద్యాలయం పేరుతో మోసం చేసినందుకు కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం (టీవీయూ) వ్యవస్థాపకురాలు సుసన్ జియో-పింగ్ సూ (44) కు 16 ఏళ్ల జైలు శిక్షను విధించారు. ఈ విశ్వవిద్యాలయంలో చేరి వందలాది మంది భారతీయ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాలను కోల్పోయారు.         » సుసన్ 2008లో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్, వైద్య, న్యాయ విద్య కోర్సులకు అవకాశం కల్పించారు. అక్రమ ఇమ్మిగ్రేషన్‌తో కోర్సులను నిర్వహిస్తున్నట్లు యూఎస్ అధికారులు గుర్తించి ఆ విశ్వవిద్యాలయాన్ని మూసి వేయడంతో వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.¤ ప్రపంచంలోని 72 మంది అత్యంత శక్తిమంతుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.         » రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తొలి అయిదు స్థానాల్లో నిలిచారు.         » భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు.         » రిలయన్స్ ఇండస్ట్రీస్ సారధి ముఖేష్ అంబానీ 36, ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, సీఈవో లక్ష్మీమిట్టల్ 57వ స్థానాల్లో నిలిచారు. భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సారధి సత్య నాదెళ్ల 64వ స్థానంలో నిలిచారు.         » ఈసారి సోనియా గాంధీ జాబితాలో చోటు కోల్పోయారు.         » ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో భారత్ ప్రధాని మోదీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ అల్ సిసి కొత్తగా చేరారు. ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కూడా ఈ జాబితాలో ఉన్నారు. 
నవంబరు - 6 
¤ సాహిత్య, సినీ రంగంలో అందించిన సేవలకుగాను ప్రముఖ కవి, సినీ దర్శకుడు గుల్జార్ (సంపూరణ్‌సింగ్ కల్రా)కు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.¤ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను తుదముట్టించిన అమెరికా నౌకాదళంలోని 'సీల్స్' విభాగం కమాండో వివరాలు బహిర్గతమయ్యాయి.     » అతడి పేరు రాబర్ట్ ఒ నీల్ (38).     » 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని ఒక ఇంటిపై 23 మంది సభ్యుల సీల్స్ బృందం రహస్యంగా దాడి చేసింది. వారిలో రాబర్ట్ కూడా ఉన్నాడు. అతడే లాడెన్ తలలోకి మూడు తూటాలు పేల్చి, హతమార్చాడు.¤ స్వీడన్ ఇండియా నోబెల్ స్మారక క్విజ్ 2014 కోసం నిర్వహించిన తుది పోటీలకు దేశంలోని పది నగరాల నుంచి హాజరైన పోటీదారులను ఓడించి అసోంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం విజయం సాధించింది.     » ఈ విశ్వవిద్యాలయం నుంచి పాల్గొన్న అనుభవ్‌జోషి, సుభాషిష్ దత్తా, అసుతోష్ దషావే విజేతలుగా నిలిచారు. వీరికి స్వీడన్ దేశ పర్యటన బహుమతిగా లభించింది.     » అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కోల్‌కత, ముంబయి, పుణెకు చెందిన కళాశాలలు, సాంకేతిక సంస్థల నుంచి విద్యార్థులు ఈ క్విజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.¤ మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ - ఏఎఫ్ఎస్‌పీఏ)కు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోమ్ చాను షర్మిల చేపట్టిన నిరశన దీక్ష 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.     » ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని మణిపూర్‌లో నవంబరు 2, 2000లో అసోం రైఫిల్స్ దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది పౌరులు మృతి చెందారు. దీంతో ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ షర్మిల అదే ఏడాది నవంబరు 5 నుంచి నిరశన దీక్ష చేస్తున్నారు. 
నవంబరు - 9
¤  దేశీయంగా శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ప్రసార మాధ్యమాలు, ఫ్యాషన్, వినోద రంగాల్లో ఈ మహిళలున్నారు.     »  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖా శర్మ, హెచ్‌పీసీఎల్ ఛైర్‌పర్సన్, ఎండీ నిషీ వాసుదేవ, ఏజడ్‌పీ పార్ట్ నర్స్ సహ వ్యవస్థాపకురాలు జియా మోదీ, టఫె సీఈఓ మల్లికా శ్రీనివాసన్, క్యాప్ జెమిని ఇండియా సీఈఓ అరుణా జయంతి, అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజస్ ఎండీ ప్రీతారెడ్డి, బయోకాన్ ఛైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా, హెచ్‌టీ మీడియా ఛైర్‌పర్సన్ శోభనాభర్తియా ఉన్నారు.     »  బ్యాంక్ లాభాలను తగ్గిస్తున్న నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) పై పోరాటం చేస్తున్నందుకే అరుంధతీ భట్టాచార్య ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. బ్యాంక్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఆస్తుల నాణ్యత మెరుగుపరచడంతో పాటు నిర్వహణా ఖర్చులు తగ్గించగలిగారని ఫోర్బ్స్ పేర్కొంది. 2,22,033 మంది ఉద్యోగులు, 190 విదేశీ కార్యాలయాలను నిర్వహిస్తూ, 1.90 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకులో ఇలా చేయడం సామాన్యమైన విషయం కాదని ఫోర్బ్స్ వివరించింది.
నవంబరు - 10 
¤ సింగపూర్ అభివృద్ధి ప్రణాళిక విభాగంలో ముఖ్యుడు, సింగపూర్ జాతీయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్‌సీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖూతెంగ్ చుయ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహా కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేసింది.     » ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ ఛైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో ఇప్పటికే తొమ్మిది మంది సభ్యులున్నారు. ఖూతెంగ్ చుయ్ నియామకంతో కమిటీలో సభ్యుల సంఖ్య 10 కి చేరింది.¤ అంధుల కోసం తక్కువ వ్యయమయ్యే ప్రింటర్‌ను అబివృద్ధి చేసిన భారత సంతతి అమెరికన్ బాలుడు శుభమ్ బెనర్జీ (13 ఏళ్లు) కి ఇంటెల్ క్యాపిటల్ నుంచి భారీగా నిధులు లభించాయి.     » చిన్న వయసులోనే ఒక వెంచర్ క్యాపిటల్ సంస్థ నుంచి నిధులు పొందిన టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్‌గా శుభమ్ నిలిచాడు.     » బ్రెయిలీ ప్రింటర్లు తయారు చేసే బ్రియాగో ల్యాబ్స్ సీఈఓగా శుభమ్ బెనర్జీ ఈ ఘనత సాధించాడు. 
నవంబరు - 11 
¤ టోక్యోలో నిర్వహించిన 'మిస్ ఇంటర్నేషనల్ బ్యూటీ' అందాల పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన హెర్నాండెజ్ మాషియస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ సహా 74 దేశాల యువతులు పాల్గొన్నారు.     » భారత్ తరఫున జతాలెకా మల్హోత్రా పాల్గొన్నారు. ఈమెకు 'మిస్ ఇంటర్నెట్ బ్యూటీ' టైటిల్ లభించింది.¤ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో భారతీయ అమెరికన్ అదితి హర్దీకర్‌కు ముఖ్య పదవి లభించింది.     » స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు, ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్స్‌కు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు.     » భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్ స్థానంలో అదితి నియమితులయ్యారు.¤ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో భారతీయ అధికారి కె.సి.రెడ్డికి చోటు దక్కింది.     » గాజాలోని ఐరాస ప్రాంగణాల్లో ఆయుధాలు ఉండటం పైన, ఇజ్రాయల్- పాలస్తీనా ఘర్షణల్లో సమితి కార్యాలయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాల పైన ఈ కమిటీ విచారణ జరుపుతుంది. 
నవంబరు - 12
¤ ఇంటర్నెట్ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ నిర్వహించిన 'డూడుల్ 4 గూగుల్' పోటీలో పుణె విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది.     » పుణెలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న వైదేహి 'సహజ, సాంస్కృతిక స్వర్గం - అసోం' పేరుతో డూడుల్‌ను రూపొందించి విజయం సాధించింది.     » గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా బొమ్మలతో రూపొందించే 'గూగుల్' లోగోను డూడుల్‌గా పిలుస్తారు.     » 'భారత్‌లో నేను చూడాలనుకుంటున్న ప్రదేశం' అనే కాన్సెప్ట్‌తో డూడుల్‌ను రూపొందించాలని ఈ ఏడాది 50 పట్టణాల్లోని 1700 స్కూళ్లలో డూడుల్ పోటీ నిర్వహించగా వైదేహి విజేతగా నిలిచింది.     » వైదేహి రూపొందించిన డూడుల్‌ను బాలల దినోత్సవం (నవంబరు 14) సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రదర్శిస్తారు.¤ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమా రావుకు ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశిష్ట సభ్యత్వం (ఫెలోషిప్) ప్రకటించారు.     » 'చరిత్ర రాజకీయాలు: భారత్ - చైనా, 1949-1962' ప్రాజెక్టుపై నిరుపమా రావు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఫెలోషిప్‌ను ప్రకటించినట్లు జవహర్‌లాల్ నెహ్రూ స్మారక నిధి వెల్లడించింది.     » 2009 ఆగస్టు నుంచి 2011 జులై వరకు నిరుపమా రావు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. చోకిలా అయ్యర్ అనంతరం విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన రెండో మహిళ ఆమే.     » 1988లో చైనాలో ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన చరిత్రాత్మక పర్యటనలో ఆయన వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో నిరుపమా సభ్యురాలు.
నవంబరు - 13
¤ కంపెనీలను అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో నడుపుతున్న 50 మంది ప్రపంచవ్యాప్త కార్పొరేట్ సంస్థల అధిపతుల పేర్లను ఫార్చ్యూన్ పత్రిక విడుదల చేసింది.
     » ఈ జాబితాలో భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈఓలకు స్థానం దక్కింది. వారు: మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా (28వ స్థానం), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల (38వ స్థానం), హర్మాన్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ దినేష్ పలివాల్ (42వ స్థానం
).
¤ భారత సంతతికి చెందిన కునాల్ షా అనే యువకుడు (32 ఏళ్లు) గోల్డ్‌మాన్ శాక్స్‌లో అరుదైన ఘనత సాధించాడు
.
     » ప్రస్తుతం ఈ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కునాల్‌కు భాగస్యామి (పార్ట్‌నర్)గా పదోన్నతి లభించింది
.
     » మొత్తం 78 మంది భాగస్వాములుగా పదోన్నతి పొందగా (ఇందులో అయిదుగురు భారత సంతతికి చెందినవారు) అందులో కునాల్ పిన్న వయస్కుడిగా నిలిచాడు
.
     » కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పట్టభద్రుడైన షా 2011లో ఫోర్బ్స్ '30 అండర్ 30' ఫైనాన్స్ జాబితాలో చోటు సంపాదించాడు. 27 ఏళ్ల వయసులోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజంలో మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు
.
     » ఈ ఏడాది భాగస్వాములుగా పదోన్నతి పొందిన వారిలో భారత సంతతికి చెందిన మీనా లక్డావాలా ప్లిన్, మణికందన్ నటరాజన్, ఉమేష్ సుబ్రమణియన్, రాజేష్ వెంకట రమణి కూడా ఉన్నారు
.
     » 1994లో 27 ఏళ్ల వయసులో కంపెనీ భాగస్వామిగా చేరిన ఎరిక్ మిండిచ్ పేరిటే అతి పిన్న వయస్కుడి రికార్డు ఉంది. భారత సంతతికి చెందివారిలో మాత్రం కున్నాల్‌దే రికార్డు
.
     » మొత్తం మీద గోల్డ్‌మాన్ భాగస్వాముల సంఖ్య 467కు చేరింది. మొత్తం సిబ్బంది సంఖ్య 35,000లో ఇది 1.6 శాతానికి సమానం
.
     » భాగస్వాములకు 9 లక్షల డాలర్ల (దాదాపు రూ. 5.4 కోట్లు) వార్షిక వేతనంతోపాటు బోనస్ కూడా అదనంగా ఉంటుంది.
నవంబరు - 15
¤ హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ తరఫున సంస్థ అధ్యక్షురాలు నీతా అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రూ.11.11 కోట్ల విరాళం ఇచ్చారు.¤ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగాస్వచ్ఛ విద్యాలయ అభియాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా దక్షిణ దిల్లీకి చెందిన 12 ఏళ్ల విద్యార్థిని రష్మీనాయక్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఎంపిక చేశారు.     » ప్రతి విద్యార్థి స్వచ్ఛభారత్‌లో భాగస్వామి కావడం, వారి ఇల్లు, చదువుకునే స్కూలు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చూడటం స్వచ్ఛ విద్యాలయ అభియాన్ లక్ష్యాలు.¤ గ్రాండ్ జీరో సమిట్ పేరిట దిల్లీలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ సమావేశంలో ఎనిమిదేళ్ల భారత సంతతి అమెరికన్ బాలుడు రూబెన్ పాల్ సైబర్ సెక్యూరిటీపై ప్రసంగించి అందరినీ ఆకర్షించాడు.     » ఒక నకిలీ వెబ్‌సైట్ లింక్ ద్వారా మన కంప్యూటర్‌లోకి, ఖాతాల్లోకి హ్యాకర్లు ఎలా చొరబడతారో వివరించాడు.     » రూబెన్‌పాల్ ఇటీవలె ప్రూడెంట్ గేమ్స్ అనే కంపెనీని స్థాపించి, దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు.
నవంబరు - 16 
¤ దేశంలోనే ఆదర్శ గ్రామంగా పుట్టంరాజు కండ్రిగను తీర్చిదిద్దుతామని భారతరత్న, రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రకటించారు.     » ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పూర్తితో నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ ప్రకటించారు.     » నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని తను దత్తత తీసుకున్న గ్రామంలో సచిన్ పర్యటించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులతో మాట్లాడారు. గ్రామస్థులతో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. 
నవంబరు - 17
¤ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ప్రత్యర్థుల నుంచి ఆయనకు దాడుల ముప్పు ఉందన్న భద్రతా సంస్థల నివేదిక మేరకు కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
     » రాందేవ్‌కు ముందు నుంచే జెడ్ కేటగిరీ భద్రత ఉన్నా, దాన్ని ఉత్తరాఖండ్ పరిధి వరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. ఇకపై దేశ వ్యాప్తంగా జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. 40 మంది భద్రతా సిబ్బంది అన్ని వేళలా బాబాకు రక్షణగా ఉంటారు
.
¤ ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి విధాన నిర్ణేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు
.
     » మోదీ తర్వాతి స్థానంలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, భాజపా అధ్యక్షుడు అమిత్ షా నిలిచారు
.
     » అమెరికాకు చెందిన ఫారిన్ పాలసీ మ్యాగజీన్ రూపొందించిన ఈ జాబితాలో 64 ఏళ్ల మోదీని ప్రజాకర్షక నేతగా, వ్యాపార వర్గాలకు స్నేహపూరితంగా ఉండే ప్రధానిగా అభివర్ణించింది
.
     » భారత రుణ భారాన్ని గురించి కఠోర వాస్తవాలను వెల్లడించిన మహిళగా పేర్కొంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యనూ ఈ జాబితాలో మ్యాగజీన్ చేర్చింది
.
¤ బ్రిటన్‌కు చెందిన జేమ్స్ రాబర్ట్స్ అనే యువ పరిశోధకుడు శిశువుల కోసం గాలి లేదా గ్యాస్‌తో నింపదగిన తక్కువ ధర ఇంక్యుబేటర్‌ను రూపొందించారు
.
     » 250 పౌండ్ల విలువైన ఇంక్యుబేటర్‌ను తయారు చేసినందుకు రాబర్ట్స్ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ జేమ్స్ డైసన్ అవార్డును కూడా గెలుచుకున్నారు
.
     » లాఫ్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్స్ రూపొందించిన ఇంక్యుబేటర్‌కు 'మామ్' గా నామకరణం చేశారు
.
     » ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తీసుకుని వెళ్లేందుకు వీలుగా, విద్యుత్తు సరఫరాలేని సమయంలో బ్యాటరీతో నడిచే విధంగా దీన్ని తయారు చేశారు.
నవంబరు - 18 
¤ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) - ముంబయి సెక్రటరీ జనరల్ హార్మజ్ మసానీ వరుసగా నాలుగోసారి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఐఎఫ్ఏబీసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు.     » 2016 వరకు మసానీ ఈ పదవిలో కొనసాగుతారు.     » ఐఎఫ్ఏబీసీ అధ్యక్షుడిగా బ్రెజిల్‌కు చెందిన ఫెడ్రో సిల్వా ఎన్నికయ్యారు.     » భారత ఏబీసీ (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్) తరహాలో మరో 35 దేశాలకు చెందిన ఏబీసీలు ఐఎఫ్ఏబీసీలో సభ్యులుగా ఉన్నాయి. 
నవంబరు - 19 
¤ ఇంట్లో మరుగుదొడ్డి కట్టించడం కోసం మంగళసూత్రాన్ని అమ్మి వార్తల్లో నిలిచిన మహారాష్ట్రకు చెందిన సంగీతను ఆ రాష్ట్ర ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్ అభియాన్‌'కు రాష్ట్ర ప్రచారకర్తగా ఎంపిక చేసింది.¤ హత్యా నేరాన్ని ఎదుర్కొంటూ న్యాయస్థానం ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంటున్న వివాదాస్పద స్వామి రాంపాల్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
నవంబరు - 20
¤ లండన్‌లోని పార్లమెంట్ స్వ్కేర్‌లో మహాత్మాగాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భారత సంతతి వ్యాపారవేత్త, సన్ మార్క్ లిమిటెడ్ డైరెక్టర్ రామి రేంజర్ రూ.97.25 లక్షల (లక్ష పౌండ్లు) విరాళాన్ని ప్రకటించారు.
నవంబరు - 21
¤ 2015 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రానున్నారు.
     » భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు హాజరు కావడం ఇదే మొదటిసారి
.
¤ సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కె.దత్తా 2జీ కేసు పర్యవేక్షణకు కొత్త అధిపతిగా నియమితులయ్యారు. సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా స్థానంలో ఆయన నియమితులయ్యారు
.
     » 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన రూపక్ కుమార్ దత్తా ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు
.
¤ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరాకరించనప్పటికీ ఆపార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేకు లోక్‌సభ ప్రతిపక్ష నేత సీటును కేటాయించారు
.
     » సాధారణంగా డిప్యూటీ స్పీకర్‌కు పక్కన ఉండే ప్రతిపక్షనేత సీటును ఖర్గేకు కేటాయించారు
.
¤ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త థామస్ కైలత్‌కు అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ దక్కింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేషంగా కృషి చేసినందుకు ఈ గుర్తింపు లభించింది. వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ మెడల్‌ను ప్రదానం చేశారు
.
     » కైలత్ 1935లో కేరళలో జన్మించారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది
.
     » శాస్త్ర, సాంకేతిక అంశాలపై కైలత్ అనేక రచనలు చేశారు.
నవంబరు - 22 
¤ అమెరికాలోని వాషింగ్టన్ జిల్లా కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ అమిత్ ప్రివర్థన్ మెహతా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ కీలక పదవికి మెహతాను నామినేట్ చేయగా, సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది.¤ వరంగల్ జిల్లాకు చెందిన ఫార్మసీ వైద్య శాస్త్రవేత్త, అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ సాంబరెడ్డికి ప్రతిష్ఠాత్మక అమెరికా ఫార్మా సొసైటీ ఫెలో (ఏపీఎస్ఎఫ్) అవార్డు లభించింది.     » మెదడు సంబంధ జబ్బులకు నూతన ఔషధాలు కనుక్కోవడంలో 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి, నరాల వ్యాధులకు చికిత్సలు కనిపెట్టి ప్రపంచ ఫార్మా రంగానికి కీర్తి ప్రతిష్ఠలను తీసుకొచ్చినందుకు సాంబరెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.¤ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను నియమించుకుంది.¤ ప్రతిష్ఠాత్మక జామా మసీదు ఇమామ్‌గా ఉన్న సయ్యద్ అహ్మద్ బుఖారి తన 19 ఏళ్ల కుమారుడు షాబాన్ బుఖారీని  నయీబ్ ఇమామ్‌ (ఉప ఇమామ్‌) గా నియమించారు.     » 17వ శతాబ్దంలో మొగలుల హయాంలో నిర్మితమైన దిల్లీలోని జామా మసీదుకు ఇమామ్‌లుగా బుఖారీలు కొనసాగుతూ వస్తున్నారు.
నవంబరు - 23
¤ భారత్‌కు చెందిన ఇద్దరు క్రీస్తు మతబోధకులకు అత్యంత పవిత్రమైన 'సెయింట్ హుడ్' లభించింది. మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్య దైవాలుగా వీరిని ప్రకటించారు.
     » వాటికన్ సిటీలో జరిగిన ప్రత్యేక ప్రార్థన కూడికలో పోప్ ఫ్రాన్సిస్ భారత్‌లోని కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-1871), సిస్టర్ యూఫ్రేసియా (1877-1952) ను 'సెయింట్' లుగా ప్రకటించారు. వీరితో పాటు ఇటలీకి చెందిన నలుగురికి కూడా 'సెయింట్' హుడ్ లభించింది
.
     » కేరళకు చెందిన సిస్టర్ అల్ఫోన్సాను 2008 లోనే 'సెయింట్‌'గా ప్రకటించడంతో ఈ రాష్ట్రం నుంచి మొత్తం ముగ్గురు అత్యంత మహిమాన్వితులైన సెయింట్లు అయ్యారు. ఏకంగా ముగ్గురు క్రీస్తు సేవకులు 'సెయింట్‌'లు గా ప్రకటితులైన ప్రత్యేకత కేరళలోని శతాబ్దాల నాటి 'సిరియో మలబార్ కేథలిక్' చర్చికి దక్కింది
.
     » ఫాదర్ కురియకోస్ 'కార్మలైట్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్' (సీఎంఐ) అనే ప్రత్యేక కూడికను స్థాపించారు
.
     » సిస్టర్ యూఫ్రేసియా తన ప్రార్థనలు, బోధనలతో త్రిశూర్‌లోని ప్రజలకు సాంత్వననిచ్చి 'ఇవు-ప్రేసియమ్మ'గా పరిచితులయ్యారు.
నవంబరు - 25 
¤ ఐక్యరాజ్య సమితి దక్షిణాసియా మహిళా సుహృద్భావ ప్రచారకర్తగా సానియా మీర్జా ఎంపికయ్యారు.
నవంబరు - 26
¤ ముంబయిలో నిర్వహించిన 'మిస్ వీల్ ఛైర్ ఇండియా' 2014 పోటీల్లో రాజ్యలక్ష్మి విజేతగా నిలిచింది.
     » ఈ పోటీల్లో దేశం మొత్తం మీద ఏడుగురు పాల్గొన్నారు.
     » చక్రాల కుర్చీకి పరిమితమైన మహిళలకు కూడా మోడలింగ్, టీవీ, సినిమా రంగాల్లో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు.
¤ ప్రముఖ నటి, డీఎంకే మాజీ నాయకురాలు ఖుష్బూ దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
¤ భారతీయ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన లండన్ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ లభించింది.
     » లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో కుమార్తె ప్రిన్సెస్ ఏన్ చేతుల మీదుగా ఆయన ఈ సత్కారం పొందారు.
     » ఈ గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి హైదరాబాదీ కూడా ఆయనే. ప్రజారోగ్యం, గుండెకు సంబంధించిన వ్యాధులపై ఆయన అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
     » ప్రిన్సెస్ ఏన్ లండన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు.
     » శ్రీనాథ్ రెడ్డి 2006 నుంచి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
¤ చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (శ్రీరామ స్వామి మెమోరియల్ యూనివర్సిటీ) విద్యార్థి సుల్తాన్ ఖేతని కి ప్రతిష్ఠాత్మక 'బ్రైట్ ఫ్యూచర్ ఫ్రైజ్-2014'
పురస్కారం దక్కింది.
¤ హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించి ఓ మైక్రోచిప్‌ను ఆవిష్కరించినందుకు సుల్తాన్‌కు ఈ పురస్కారం లభించింది.
     » ఒక్క చుక్క రక్తంతో సదరు వ్యక్తి రక్తంలో హెచ్ఐవీ స్థాయి ఎంత ఉందో గుర్తించడంతో పాటు ఆ వ్యక్తికి చికిత్స అందిస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఈ మైక్రో చిప్ వెల్లడిస్తుంది.
నవంబరు - 30
¤ కేంద్ర రిజర్వు భద్రతా దళం (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ పదవీ విరమణ చేశారు.     » ఆయన స్థానంలో నూతన నియామకం జరిగేంత వరకు ఆర్‌. సి తయాల్ తాత్కాలిక అధిపతిగా వ్యవహరిస్తారు.