డిసెంబరు - 2014 కమిటీలు - కమిషన్లు


డిసెంబరు - 2
¤ నల్లధనం విచారణపై యూపీఏ ప్రభుత్వం నియమించిన పార్థసారధి షోమ్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.ముఖ్యాంశాలు     » బ్యాంకు లావాదేవీలపై పరిమితి విధించాలి. పొదుపు ఖాతా మినహా ఇతర ఖాతాల నుంచి ఒకరోజులో డ్రా చేసే (ఉపసంహరించే) నగదు మొత్తానికి పరిమితి ఉండాలి. అంతకు మించి నగదును డ్రా చేస్తే పన్ను విధించాలి.     » ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేస్తున్న నగదు సంబంధించి వివరాలు నమోదు చేసే వ్యవస్థ లేదు. ఈ సమాచారం ఉంటే, నల్లధనాన్ని అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖకు ఉపకరిస్తుంది.     » బ్యాంకింగ్ నగదు లావాదేవీ పన్ను (బీసీటీటీ)ని అమల్లోకి తెచ్చేందుకు ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించాలి.     » ఒక వ్యక్తి ఖాతా నుంచి రోజుకి రూ.50,000కు మించి తీసుకున్నా, కొందరు వ్యక్తులు రూ.లక్షకు మించి నగదును డ్రా చేసినా పన్ను విధించాలి.     » పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకురావాలి. ఎక్కువ భూమి ఉన్న రైతులకు పన్ను విధించాలి. వ్యవసాయంపై వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు మించితే పన్ను విధించాలి.
డిసెంబరు - 4 
¤ 'టాస్క్‌ఫోర్స్ ఆన్ లీవరేజింగ్ ద పోస్టాఫీస్ నెట్‌వర్క్' కమిటీ తన నివేదికను దిల్లీలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సమర్పించింది.ముఖ్యాంశాలు తపాలా విభాగం కింద ఒక హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేసి దాని ద్వారా బ్యాంకింగ్, బీమా, ఇ-కామర్స్ సేవలను తక్షణం ప్రారంభించాలని కమిటీ కేంద్రానికి సూచించింది. హోల్డింగ్ కంపెనీ కింద అయిదు విభాగాలుంటాయి. అందులో బ్యాంకింగ్, బీమా, ఇ-కామర్స్ సేవలను మాత్రం తక్షణం మొదలు పెట్టాలని సూచించింది. ప్రభుత్వ సేవలు, బీ 2 బీ విభాగాల ఏర్పాటుకు మాత్రం సమయం తీసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద ఇ-కామర్స్ వ్యవస్థల్లో ఒక సంస్థగా తపాలా విభాగం (డీఓపీ) ఆవిర్భవించాలి. బ్యాంకింగ్ తర్వాత అంతటి ప్రాధాన్యాన్ని డీఓపీ ఈ విభాగానికి ఇవ్వాలి. 'పోస్ట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా'ను ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయాలి. తొలి మూడేళ్లలో ప్రతి జిల్లాలో ఒక శాఖను తీసుకురావాలి. అందుకు ప్రభుత్వం ప్రాథమికంగా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టాలి. పోస్ట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రధాని జన్‌ధన్ యోజన పరస్పరం సహకరించుకుని దేశంలో మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందజేయాలన్న లక్ష్యానికి చేరవచ్చు. ఎస్‌బీఐ తర్వాత భారీ స్థాయిలో డిపాజిట్లున్నది తపాలా విభాగం వద్దే. (రూ.6 లక్షల కోట్లున్నాయి) పోస్ట్ కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, స్పీడ్ పోస్ట్ తదితరాలను సబ్సిడీ కింద విక్రయించడం వల్ల డీఓపీకి నష్టాలొచ్చాయి. ఈ కమిటీకి కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వం వహించారు.
డిసెంబరు - 10
¤ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది.
డిసెంబరు - 29
¤ కోల్‌కతలో యువజన కాంగ్రెస్ 1993లో నిర్వహించిన ఉద్యమంలో జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించిన సంఘటనపై ఏర్పాటయిన విచారణ కమిషన్ తన నివేదికను వెల్లడించింది.
     » ఆ సంఘటనను జలియన్ వాలాబాగ్ ఊచకోత కంటే దారుణమని అభివర్ణించింది. ఆ కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షత గాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జస్టిస్ (విశ్రాంత) సుశాంత్ ఛటర్జీ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ ఆదేశించింది
.
     » 1993లో పశ్చిమ బంగ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ ఉన్నారు. వామపక్షాలు ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతున్నందున పోలింగ్‌కు ఓటర్ గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సచివాలయమైన కోల్‌కతలోని రైటర్స్ బిల్డింగ్ వరకు 1993, జులై 21న ప్రదర్శన నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనపై కమిషన్‌ను ఏర్పాటు చేశారు.