డిసెంబరు - 2014 వార్తల్లో వ్యక్తులు


డిసెంబరు - 1
¤ బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన రోహ్‌తక్ అక్కాచెల్లెళ్ల (పూజ, ఆర్తి)ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సన్మానించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది.   » హరియాణాలో బస్సులో కళాశాలకు వెళుతున్న ఈ యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు దిగడంతో తీవ్రంగా ప్రతిఘటించి ఆ అక్కాచెల్లెళ్లు వారికి బుద్ధి చెప్పారు.
డిసెంబరు - 3 
¤ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో బంతి తగిలి మృతి చెందిన (నవంబరు 27న) ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు అతడి స్వస్థలం మాక్స్‌విలేలో జరిగాయి.   » ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్లతోపాటు అంతర్జాతీయ క్రికెటర్లు; భారత్ నుంచి విరాట్ కొహ్లీ, అర్షద్ అయూబ్, రవిశాస్త్రి పాల్గొన్నారు. 
డిసెంబరు - 4 
¤ యూకేకు చెందిన వారపత్రిక 'ఈస్ట్రన్ ఐ' నిర్వహించిన అభిప్రాయ సేకరణలో శృంగారపరంగా ఆకర్షణీయమైన ఆసియా మహిళల ప్రపంచ జాబితాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (32 సంవత్సరాలు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన కత్రినా కైఫ్‌ను వెనక్కు నెట్టి ప్రియాంక చోప్రా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.   » 50 మందితో రూపొందించిన ఈ జాబితాలో టీవీ నటులు ద్రష్టిధామి, సనయా ఇరానీ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా, కత్రినా కైఫ్‌కు నాలుగో స్థానం దక్కింది.¤ అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సత్య నాదెళ్ల గుర్తింపు పొందారు. ఆయనకు ఏడాదికి 84 మిలియన్ డాలర్ల (సుమారు రూ.520 కోట్లు) వేతనం ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వాటాదార్లు అంగీకరించారు. 
డిసెంబరు - 5 
¤ జర్మనీలోని మెగ్‌డేబర్గ్‌లో జురిగిన 'మిస్ ఇంటర్ కాంటినెంటల్ - 2014' అందాల పోటీల్లో వాంగ్ పాటాపోర్న్ విజేతగా నిలిచింది.   » ఆమె  థాయ్‌లాండ్కు చెందిన యువతి.   » మొదటి రన్నరప్‌గా జెస్లీ మెర్గల్ (క్యూబా), రెండో రన్నరప్‌గా క్రిస్ టఫనీ జాసన్ (ఫిలిప్పీన్స్) నిలిచారు.¤ ఈ ఏటి మేటి ఆసియన్‌గా ప్రధాని నరేంద్రమోదీ ఎంపికయ్యారు.   » సింగపూర్‌కు చెందిన దినపత్రిక 'ది స్ట్రెయిట్ టైమ్స్' ఈ మేరకు ప్రధాని మోదీని ఎంపిక చేసింది. అభివృద్ధి దృష్టి ఉన్న నేతగా, పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని పత్రిక ప్రశంసించింది. రాజకీయంగా, సామాజికంగా మోదీ దేశాన్ని శక్తివంతం చేశారని పేర్కొంది.   » ఏడాది కాలంలో ఆసియా ఖండంలో లేదా వారి దేశంలో కానీ విశేష ప్రభావాన్ని చూపిన ఆసియాకు చెందిన వ్యక్తుల్ని ఈ దినపత్రిక 2012 నుంచి ఒకరిని ఎంపిక చేస్తోంది.   » 2012లో తొలిసారిగా మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్, 2013లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా ఈ గౌరవాన్ని పొందారు. 
డిసెంబరు - 6 
¤ చారిత్రక, ఇతర ప్రత్యేకతలు ఉన్న అయిదు గ్రంథాలయాలు, వాటిలోని గ్రంథాల వివరాలను అంతర్జాతీయంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరుకు చెందిన బాసె కాశీ విశ్వనాథ్‌కు ప్రపంచస్థాయి సంస్థ 'వికీపీడియా' మద్దతు లభించింది.   » 2015 జనవరిలో ప్రకటించే గ్రాంట్‌కు ప్రపంచవ్యాప్తంగా అందిన అనేక ప్రతిపాదనల్లో అర్హత పొందిన 26 ప్రాజెక్టులను వడపోశారు. వాటి నుంచి ఏడింటిని ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి విశ్వనాథ్ ప్రతిపాదన ఒక్కటే ఎంపికైంది.   » ఈ ప్రాజెక్టులో భాగంగా ఆవిర్భావం నుంచి తెలుగువారి సాహితీ చైతన్యం, రాజకీయోద్యమాలతో పెనవేసుకున్న ఈ గ్రంథాలయాల చరిత్రను, వాటితో అనుబంధం ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వివరాలను సేకరించి వికీపీడియాలో ఉచితంగా వాడుకునేలా చేరుస్తారు.¤ 'మిస్ సుప్రనేషనల్ - 2014' టైటిల్‌ను భారత యువతి ఆశాభట్ గెలుచుకుంది. ఈ పోటీలో ఆమెకు 25,000 అమెరికా డాలర్ల నగదు బహుమతి లభించింది.   » ఇప్పటివరకు ఈ టైటిల్‌ను దక్కించుకున్న తొలి భారతీయురాలిగా ఆశాభట్ చరిత్ర సృష్టించింది.   » పోలండ్ రాజధాని వార్సాలో జరిగిన ఈ పోటీలో సుమారు 70 దేశాల యువతులు హాజరయ్యారు.¤ అల్‌ఖైదా ప్రపంచ కార్యక్రమాల నిర్వహణ అధినేత అద్నాన్ షుక్రిజుమాను పాకిస్థాన్ సైన్యం హతమార్చింది. దక్షిణ వజీరిస్థాన్‌లోని శిన్‌వార్సక్ ప్రాంతంలో తమ దళాలు జరిపిన దాడిలో అద్నాన్ మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది.   » న్యూయార్క్ సబ్‌వేపై దాడికి కుట్ర పన్నిన కేసులో భాగంగా 2009 నుంచి అమెరికా ప్రభుత్వం ఇతడి కోసం గాలిస్తోంది.¤ భారత సంతతి సితార్ విద్వాంసురాలు అనౌష్కా శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మక 57వ గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు.   » ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క రూపొందించిన 'ట్రేసెస్ ఆఫ్ యూ' ఆల్బంకు ఈ గౌరవం దక్కింది. గతంలోనూ ఆమె గ్రామీకి నామినేట్ అయ్యారు.   » భారత సంతతికి చెందిన రచయిత్రి, విద్యా హక్కుల కార్యకర్త నీలా వాస్వానీ కూడా గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు. 'ఐ యామ్ మలాలా: హౌ వన్ గర్ల్ స్టుడప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఛేంజ్డ్ ది వరల్డ్' అనే ఆడియో పుస్తకాన్ని తయారు చేసినందుకు ఆమె 'ఉత్తమ పిల్లల ఆల్బం' కేటగిరీలో నామినేట్ అయ్యారు.   » ఈ 57వ గ్రామీ అవార్డుల నామినేషన్ల జాబితాలో ప్రముఖంగా బ్రిటిష్ గాయకుడు శాంస్మిత్, ఆర్ అండ్ బీ క్వీన్ బియాన్సే, ఫారెల్ విలియమ్స్ ఉన్నారు.   » ఫిబ్రవరి 8వ తేదీన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది.
డిసెంబరు - 8
¤ పది లక్షల డాలర్ల విలువైన విశ్వ ఉపాధ్యాయ బహుమతి కోసం 50 మందితో కూడిన జాబితాలో ముగ్గురు భారతీయ ఉపాధ్యాయులు స్థానం సంపాదించారు.
   » అహ్మదాబాద్‌లోని రివర్‌సైడ్ పాఠశాలకు చెందిన కిరణ్ బిర్ సేథి, కోల్‌కతలోని బిర్లా ఉన్నత పాఠశాలకు చెందిన హీరా ప్రసాద్, రాజ్‌కోట్‌లోని ఎస్ఎన్ కన్సగ్రా పాఠశాలకు చెందిన బిజల్ దమాని ఈ జాబితాలో ఉన్నారు.
¤ 'ఈ యేటి వ్యక్తి
'
 హోదా కోసం ఆన్‌లైన్‌లో టైమ్ పత్రిక నిర్వహించిన పోల్‌లో పాఠకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే పట్టం కట్టారు.
   » కానీ ఆ పత్రిక సంపాదకులు రూపొందించిన ఎనిమిది మందితో కూడిన తుది జాబితాలో మోదీకి చోటు దక్కలేదు.
   » ఈ జాబితాలో చైనా వ్యాపార దిగ్గజం అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా అగ్రస్థానంలో నిలిచారు. ఎబోలా బాధితుల రక్షకులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫెర్గూసన్ నిరసన కారులు, గాయని టేలర్ స్విఫ్ట్, అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కమిషనర్ రోజర్ స్టోకో గుడెల్, కుర్దిష్ నేత మసౌద్ బర్జాని తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం 50 లక్షల మంది ఈ పోల్‌లో పాల్గొన్నారు.
   » నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసు అధికారి డ్యారెన్ విల్సన్‌పై నేరాభియోగాన్ని మోపరాదన్న గ్రాండ్ జ్యూరీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన ఫెర్గూసన్ నిరసనకారులు రెండో స్థానంలో నిలిచారు.
   » హాంకాంగ్ నిరసనకారుల నేత జాఘవా వాంగ్, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్, ఎబోలాకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు మొదటి అయిదు స్థానాల్లో నిలిచారు.
¤ భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 సంవత్సరానికిగాను ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది అన్వేషించిన వ్యక్తిగా నిలిచారని సామాజిక వేదిక 'యాహూ' పేర్కొంది. 'యాహూ' తన ఏడో సంపుటి (ఎడిషన్)లోని 'ఇండియన్ ఇయర్ ఇన్ రివ్యూ'
లో ఈ వివరాలను వెల్లడించింది.
   » ప్రధాని మోదీ తర్వాత ఆన్‌లైన్‌లో అత్యధికలు వెతికిన వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అని 'యాహూ' పేర్కొంది.
డిసెంబరు - 10
¤ ఈ ఏడాది అత్యధికంగా దానం చేసిన 10 మంది దాతల జాబితాను వెల్త్ - ఎక్స్ సంస్థ విడుదల చేసింది.
   » ఈ జాబితాలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 2.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,600 కోట్లు)ను విరాళంగా ఇచ్చారు. తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వేకు చెందిన 1.66 కోట్ల షేర్లను ఆ ఫౌండేషన్‌కు ఇచ్చారు.
   » ఈ జాబితాలో గోప్రొ వ్యవస్థాపకుడు, సీఈఓ, ఛైర్మన్ నికోలస్ ఉడ్‌మాన్ రెండో స్థానంలో నిలిచారు. ఈయన తన భార్యతో కలిసి సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు 497.5 మిలియన్ డాలర్లను దానమిచ్చారు.
   » ఈ ఏడాదిలో మొత్తం 10 అగ్రశ్రేణి దాతల్లో ఎనిమిది మంది అమెరికాకు చెందినవారు కాగా, మిగతా ఇద్దరు హాంకాంగ్ స్థిరాస్థి దిగ్గజాలు రోనీ (3వ స్థానం), గెరాల్డ్ చాన్ (4వ స్థానం). వీరిద్దరూ కలిసి హార్వర్డ్ యూనివర్సిటీకి 350 మిలియన్ డాలర్లను విరాళంగా అందజేశారు. ఆ వర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళం.
   » హెడ్జ్ ఫండ్ మేనేజర్ కెనెత్ గ్రిఫిన్ 150 మిలియన్ డాలర్లను హార్వర్డ్ యూనివర్సిటీకి అందించి 5వ స్థానాన్ని దిక్కించుకున్నారు.
   » కొలంబియా స్పోర్ట్స్ వేర్ యజమాని గెర్ట్ బోయెల్ (ఓరిజాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి 100 మిలియన్ డాలర్ల విరాళం), సిస్కో గౌరవ ఛైర్మన్ జాన్ మోర్‌గ్రిడ్జ్ (యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్-మాడిసన్‌కి 100 మిలియన్ డాలర్ల విరాళం), జాన్ జే జోర్డాన్ (యూనివర్సిటీ ఆఫ్ నోటర్ డేమ్‌కు 75 మిలియన్ డాలర్ల విరాళం) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.
   » అమెరికా రాజకీయ వేత్త ఎడ్వర్డ్ మేయర్ వీల్ కార్నెల్ వైద్య కళాశాలకు 75 మిలియన్ డాలర్లను, అమెరికా వ్యాపారవేత్త చార్లెస్ ముంగర్ కాలిఫోర్నియా శాంతా బార్బరాకు 65 మిలియన్ డాలర్లను ఇచ్చి వరుసగా 9, 10 స్థానాలను పొందారు.
¤ బ్రిటన్ వార పత్రిక 'ఈస్ట్రన్ ఐ
' విడుదల చేసిన 'ఆసియా శృంగార పురుషుల జాబితా-2014'లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అగ్రస్థానంలో నిలిచాడు.
డిసెంబరు - 11
¤ అంతర్జాతీయ అధ్యయన సంస్థ (ఐఎస్ఏ) అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి టి.వి.పాల్ ఎంపికయ్యారు.   » ఈయన జేమ్స్ మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలపై బోధిస్తున్నారు.¤ లెబనాన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యుమానిటీ-2014' పోటీల్లో భారత్‌కు చెందిన రుహీసింగ్ విజేతగా నిలిచింది.   » ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారత యువతిగా ఆమె వార్తల్లో నిలిచింది. 
డిసెంబరు - 12 
¤ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆసియాలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఆలీబాబా ఈ-కామర్స్ అధినేత జాక్ మా నిలిచారు.    » 2012 నుంచి అత్యంత సంపన్న ఆసియావాసిగా ఉన్న హాంకాంగ్ రియల్టీ, పోర్ట్స్ టైకూన్ లిక-షింగ్‌ను తోసి రాజని జాక్ మా 2,860 కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో నిలిచారు. 2014లోనే జాక్ మా సంపద 2,500 కోట్ల డాలర్లకు పెరిగింది.   » మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 8,540 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.   » రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అత్యంత సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన సంపద 2,180 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రపంచ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ముకేష్ 32వ స్థానంలో నిలిచారు. 
డిసెంబరు - 14
¤ కేంద్ర మాజీమంత్రి జైరాం రమేష్ ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన సలహా సంఘంలో సభ్యుడిగా నియమితులయ్యారు.   » ఈ సలహా సంఘం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే అంతర్జాతీయ పర్యావరణ సాంకేతిక కేంద్రానికి (ఈఐటీసీ) విధానపరమైన సలహాలను ఇస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ అనుకూల సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది కృషి చేస్తోంది.¤ 2014వ సంవత్సరానికి ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్)గా దక్షిణాఫ్రికాకు చెందిన రోలీన్ స్ట్రాస్ (22) ఎంపికైంది.   » లండన్‌లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రోలీన్ స్ట్రాస్ శిరస్సుపై గతేడాది ప్రపంచ సుందరి మేగన్ యంగ్ కిరీటాన్ని అలంకరించింది. ప్రపంచ వ్యాప్తంగా 121 మంది సుందరీమణులతో పోటీ పడి నెగ్గిన స్ట్రాస్ వైద్య విద్యార్థిని.   » ఎడినా కుల్క్సార్ (హంగేరీ), ఎలిజబెత్ సాఫ్రిత్ (అమెరికా) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.   » భారత సుందరి కోయల్ రాణాకు తొలి పదిమందిలో చోటు దక్కింది. ఆమె ఉత్తమ డిజైనర్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ నుంచి చివరిగా 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందింది.   » మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ కథానాయిక ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను ఇదే వేదికపై ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైనప్పటి నుంచి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు ఈ అవార్డును అందజేశారు.
డిసెంబరు - 15
¤ లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియానికి మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర నూతన ధర్మకర్త (ట్రస్టీ)గా నియమితులయ్యారు.
   » 2015, జనవరి నుంచి నాలుగేళ్లపాటు ఆనంద్ ధర్మకర్త బాధ్యతలు నిర్వహిస్తారని లండన్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియం తెలిపింది
.
   » 1650 కోట్ల డాలర్ల మహీంద్ర గ్రూప్ భారత్‌లో మొదటి పది కార్పొరేట్ గ్రూపుల్లో ఒకటి
.
¤ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) లావు నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు తన రాజీనామా లేఖ పంపారు
.
   » నాగేశ్వరరావు ఏఎస్‌జీగా 2013లో బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2014 మేలో ఈయనకు మరోసారి ఏఎస్‌జీగా అవకాశం కల్పించింది
.
   » వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.
డిసెంబరు - 16
¤ అమెరికా సర్జన్ జనరల్‌గా భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి (37) నియమకాన్ని సెనేట్ ఆమోదించింది.
   » అతి చిన్నవయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే
.
   » బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన ఆయన కర్ణాటకలో జన్మించారు. మూడేళ్ల వయసులోనే అమెరికాకు వలస వెళ్లారు.
డిసెంబరు - 17 
¤ రామన్ మెగసెసె పురస్కార గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా 'పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI - పరి)' అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.¤ బ్రిటన్‌లో తొలిసారిగా మహిళా బిషప్ నియమితులయ్యారు. ఉత్తర ఇంగ్లండ్‌లో స్టాక్‌పోర్టు బిషప్‌గా 48 ఏళ్ల రెవరెండ్ లిబ్బీలేన్ నియమితులయ్యారు.   » అయిదు వందల ఏళ్ల ఇంగ్లండ్ చర్చి చరిత్రలో ఒక మహిళ బిషప్ కావడం ఇదే ప్రథమం. 
డిసెంబరు - 18 
¤ డిజిటల్ సర్వీస్‌లను అందించే సంస్థ 'టు ది న్యూ' జరిపిన సర్వే ప్రకారం సామాజిక అనుసంధాన వేదికల్లో తారల పాపులారిటీకి సంబంధించి ట్విట్టర్‌లో అమితాబ్ మొదటి స్థానంలో ఉన్నారు.   » 12 మిలియన్ అభిమానులతో అమితాబ్ నెంబర్ వన్ ట్విట్టర్ కింగ్‌గా నిలిచారు. షారుక్ ఖాన్ (10.4 మిలియన్) రెండో స్థానం, అభిషేక్ బచ్చన్ (5.4 మిలియన్) మూడో స్థానంలో ఉన్నారు.   » తారలకున్న పేరు ప్రఖ్యాతులు, ట్విట్టర్‌లో అభిమానులతో వాళ్లకున్న అనుబంధం, ఎప్పటికప్పుడు వాళ్లు చేసుకునే ట్వీట్ల ఆధారంగా రేటింగ్‌ను ఇచ్చారు. ¤ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్ జాయ్‌లకు మరో అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరిని 'శాంతికి ప్రతీకలు' గా పేర్కొంటూ అమెరికా సెనెట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చిన్నారులందరికీ విద్యను అందించేందుకు విశేష కృషి చేయడంతోపాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వీరు పాటుపడ్డారని కొనియాడింది.   » సెనెటర్ టామ్ హార్కిన్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అమెరికా సెనెట్ 113వ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని చివరి అంశంగా ఆమోదించారు.
డిసెంబరు - 23
¤ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు అంతర్జాతీయ పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఎంపికయ్యారు.
   » దక్షిణాసియా ఎన్నికల నిర్వహణ మండలి కోరిక మేరకు భన్వర్‌లాల్‌తో పాటు మరో ఇద్దరు సీఈఓలను శ్రీలంక అధ్యక్ష ఎన్నికల నాలుగో దశ పర్యవేక్షులుగా పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
డిసెంబరు - 28
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీ డైరెక్టర్ రఘునాథ్ కేఎస్ షెవ్‌గాంకర్ మరో రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్ఆర్‌డీ) ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు రావడంతో ఈ రాజీనామా వ్యవహారం వివాదాస్పదమైంది.
డిసెంబరు - 29
¤ ఆంధ్రప్రదేశ్ తరఫున దక్షిణ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుని గవర్నర్ నరసింహన్ నియమించారు. కౌన్సిల్ సలహాదారుగా ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ నియమితులయ్యారు.
   » 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ప్రతి కౌన్సిల్‌లో దాని పరిధిలోకి వచ్చే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక్కో రాష్ట్రం నుంచి గవర్నర్ నామినేట్ చేసే ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉంటారు.
డిసెంబరు - 30
¤ పెటా సంస్థ 2014 సంవత్సరానికి ప్రధాని మోదీ, బాలీవుడ్ నటీమణి రేఖను 'అత్యంత ప్రముఖ శాకాహారులు'గా ప్రకటించింది.
   » శాకాహారులుగా ఉండటమే కాకుండా, 2014లో శాకాహారానికి అత్యంత ప్రాచుర్యం కల్పించినందుకు వీరిని పెటా ఎంపిక చేసింది.
డిసెంబరు - 31

¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్ పదవీ విరమణ చేశారు.
   » ఇస్రో ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ 2009 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలో 13 పీఎస్ఎల్‌వీ, 3 జీఎస్ఎల్‌వీ ప్రయోగాలు జరిగాయి. అంగారక యాత్ర విజయవంతం చేశారు. జీఎస్ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను ప్రయోగించారు.
   » రాధాకృష్ణన్ స్థానంలో ఇస్రో తాత్కాలిక ఛైర్మన్‌గా శైలేష్ నాయక్‌ను నియమించారు.