డిసెంబరు - 5
|
¤ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని లోసరి కాలువపై తొలి సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. » గుజరాత్ తర్వాత ఈ తరహా ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. » భీమవరం మండలంలోని గొల్లవానిపిప్ప సమీపంలో లోసరి కాలువపై ఒక మెగావాట్ సామర్థ్యంతో, రూ.10 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. దీనికయ్యే వ్యయంలో సగం అంటే రూ.5 కోట్లను కేంద్ర నూతన, పునరుత్పాదక విద్యుత్ శాఖ రాయితీగా అందించనుంది. » రాష్ట్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) దీన్ని నిర్మించనుంది. » గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సౌర విద్యుత్‌తో నడిచే తాగునీటి పంపుల ఏర్పాటులో భాగంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి పంపు సెట్లను మంజూరు చేసింది.
|
డిసెంబరు - 8
|
¤ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఇన్‌క్యాప్), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్ అధికారులు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, నిర్మాణ ప్రణాళిక తయారీకి సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సింగపూర్ సహకారంతో ఆంధ్రపదేశ్‌కు స్మార్ట్ రాజధాని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.¤ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి ఐటీ శాఖ రూపొందించిన దార్శనిక పత్రానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. » 2020 నాటికి 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే లక్ష్యాన్ని సాధించడం; ఏపీని భారతదేశ సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దడం; ఎలక్ట్రానిక్ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ-పరిపాలన, ఐటీ ఎలక్ట్రానిక్ రంగం, కొత్త ఆలోచన అథారిటీలను ఏర్పాటు చేసింది.
|
డిసెంబరు - 16
|
¤ తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. » రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం జిల్లా), అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), అజ్మీరా చందూలాల్ (వరంగల్), జూపల్లి కృష్ణారావు (మహబూబ్‌నగర్), తలసాని శ్రీనివాస యాదవ్ (హైదరాబాద్), చర్లకోల లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్)తో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. » 2014 జూన్ రెండో తేదీన 12 మందితో కేసీఆర్ మంత్రివర్గం ఏర్పడింది. కొత్తగా చేరిన వారితో కలిసి, మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18కి పెరిగింది.
నూతన మంత్రులు - శాఖలు » తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాలు; స్త్రీ, శిశు సంక్షేమం » అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ » తలసాని శ్రీనివాస యాదవ్ - వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ » చర్లకోల లక్ష్మారెడ్డి - విద్యుత్ » అజ్మీరా చందూలాల్ - గిరిజన సంక్షేమం, పర్యటక, సాంస్కృతిక » జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు, చేనేత, జౌళి, చక్కెర » వీరితో పాటు అబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసులు శాఖను కేటాయించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తాజాగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను కేటాయించారు .
|
డిసెంబరు - 17
|
¤ దేశ వ్యాప్తంగా కేంద్రం నిర్మిస్తున్న సౌర విద్యుత్ పార్కులకు ఆర్థిక చేయూతినిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చాయి. » సహాయం అందించేందుకు ఈ రెండు ఆర్థిక సంస్థలకు రాష్ట్రాలను కేటాయిస్తూ జాతీయ విద్యుత్ గ్రిడ్ సంస్థ (పీజీసీఎల్) తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంధన శాఖలకు లేఖలు రాసింది. » ఆంధ్రప్రదేశ్‌లో 2500, తెలంగాణలో 1000, మధ్యప్రదేశ్‌లో 750 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణసాయం అందుతుందని లేఖలో పేర్కొన్నారు. » పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్మించే సౌర విద్యుత్ పార్కులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సాయం చేస్తుంది. » ఈ పార్కుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 5500 ఎకరాలు; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 5,438 ఎకరాలను కేటాయించారు.
|
డిసెంబరు - 19
|
¤ దేశ వ్యాప్తంగా సుమారు 1.17 కోట్ల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా లోక్‌సభలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 230 జిల్లాల్లో ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. » ఫ్లోరోసిస్ సమస్య రాజస్థాన్‌లో అధికంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. » తెలంగాణలోని 1174 ప్రాంతాల్లో 19 లక్షల మంది ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లోని 745 ఆవాస ప్రాంతాల పరిధిలో సుమారు 11 లక్షల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.¤ గతేడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రాతిపదికగా 'తెలంగాణ రాష్ట్ర న్యాయబద్ధమైన పరిహారం హక్కు - భూసేకరణలో పారదర్శకత సహాయ, పునరావాస నిబంధనలు 2014'ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. » ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త విధానం ద్వారానే భూసేకరణ చేయాల్సి ఉంటుంది.¤ పంచారామాల్లో ఒకటైన గుంటూరు జిల్లా అమరావతిని వారసత్వ నగరం (హెరిటేజ్ సిటీ)గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. » దేశ వ్యాప్తంగా 12 నగరాలను వారసత్వ నగరాలుగా ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతికి చోటు దక్కింది. » 2006లో కాలచక్ర ఉత్సవాలతో అమరావతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కృష్ణానదీ తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రం బౌద్ధుల, జైనుల పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది.
|
డిసెంబరు - 20
|
¤ హుద్‌హుద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి సహకారం అందించాలని కేంద్రానికి విన్నవిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.¤ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) దాదాపు కాగిత రహిత కార్యాలయంగా అవతరించింది. దేశంలో మరే నగర పాలక సంస్థ చేపట్టని రీతిలో ఇది ఈ-కార్యాలయ (ఈ-ఆఫీస్) విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాలనకు సంబంధించి అన్ని పనులకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తున్నారు.
|
డిసెంబరు - 21
|
¤ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. » ఇంతక ముందు 2012 జనవరి 14న ఇక్కడ సున్నా డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. » చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు చేరింది. |
డిసెంబరు - 22
|
¤ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) బిల్లును ఆంధ్రపదేశ్ శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ¤ 2015 గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శనకు ఈసారి ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే 'సంక్రాంతి సంబరాలు' గణతంత్ర వేడుకల్లో దేశవ్యాప్తంగా అలరించనున్నాయి. » 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య శకటం తర్వాత మళ్లీ ఇప్పుడే గణతంత్ర వేడుకల్లో ఏపీ రాష్ట్ర శకటానికి అవకాశం వచ్చింది. ¤ తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ¤ మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. |
డిసెంబరు - 23
|
¤ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థకు చెందిన 10 ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. |
డిసెంబరు - 24
|
¤ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014'లో సెక్షన్ 23ను సవరించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. » నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యుల సంఖ్య 175. రాజ్యాంగం ప్రకారం ఈ సంఖ్యలో మూడోవంతుకు సమానమైనంత (58) మంది శాసనమండలిలో సభ్యులుగా ఉండవచ్చు. ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారు. ¤ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 20,000 మరుగుదొడ్లను నిర్మించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన స్థానిక శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛ సత్తెనపల్లిని స్ఫూర్తిగా తీసుకుని నూరు శాతం మరుగుదొడ్లతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మస్తామని సీఎం ప్రకటించారు.
|
డిసెంబరు - 26
|
¤ సుదీర్ఘ కసరత్తు అనంతరం రాష్ట్రంలో అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. » ఐఏఎస్‌లలో 166 మందిని ఏపీకి, 128 మందిని తెలంగాణకు కేటాయించింది. మరో అయిదుగురిని పని చేస్తున్న చోటే (నలుగురు తెలంగాణ, ఒక్కరు ఏపీ) కొనసాగించాలని ఆదేశించింది. » ఐపీఎస్‌లలో 119 మందిని ఏపీకి, 92 మందిని తెలంగాణకు కేటాయించింది. » ఐఎఫ్ఎస్‌లలో ఏపీకి 76, తెలంగాణకు 51 మందిని కేటాయించింది. » ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
|
డిసెంబరు - 27
|
¤ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం భూమి 76,92,614 హైక్టార్లు. ఇది 7,493 చదరపు కిలో మీటర్లకు సమానం. ఇందులో అటవీ భూముల విస్తీర్ణం కేవలం 70,315 హైక్టార్లు (మొత్తం భూమిలో 9.15 శాతం) మాత్రమే అని ప్రభుత్వం వెల్లడించింది. ¤ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకు భారీగా ప్రవేశపెట్టిన కొన్ని ప్రత్యేక పథకాలకు అయిదేళ్లలో రూ.56,645 కోట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ¤ విద్యార్థినుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి 'రాణి రుద్రమ సేన' అనే పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. |
డిసెంబరు - 28
|
¤ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగిసింది. » ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూచిపూడి కళకారులు ప్రదర్శించిన 'మహాబృంద నాట్యం' ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది. 6327 మంది ఒకే వేదిక మీద ఈ నృత్యం చేశారు. » ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. » 2016లో నిర్వహించే 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం కృష్ణాజిల్లాలోని కూచిపూడిలో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ¤ హైదరాబాద్‌ను శాంతి భద్రతల పరంగా లండన్, న్యూయార్క్ తరహాలో తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1.10 లక్షల సీసీ కెమెరాలు, అనుబంధంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, వీటన్నింటినీ పర్యవేక్షించడానికి రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక పోలీస్ కమీషనరేట్ భవనాన్ని నిర్మిచాలని నిర్ణయించింది. |
డిసెంబరు - 29
|
¤ 9వ జాతీయ యోగా పోటీలను హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. » ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా పశ్చిమబంగ నిలిచింది. ఫస్ట్ రన్నరప్‌గా మహారాష్ట్ర, సెకండ్ రన్నరప్‌గా హర్యానా నిలిచాయి. |
డిసెంబరు - 30
|
¤ 'ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం 2014'ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల పరిధిలో 7068 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చనున్నారు. ఇందులో 122 చ.కి.మీ. లో రాజధాని నగర పరిధి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. » కృష్ణా జిల్లా పరిధిలో 15 మండలాలు పూర్తిగా, 14 మండలాలు పాక్షికంగా, గుంటూరు జిల్లాలో 18 మండలాలు పూర్తిగా, 11 మండలాలు పాక్షికంగా సీఆర్‌డీఏ పరిధిలోకి రానున్నాయి. » సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఎన్.శ్రీకాంత్ నియమితులయ్యారు. |
|
|