డిసెంబరు - 2014 ఆర్థికరంగం


డిసెంబరు - 1
¤ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పై అధిక ప్రబావం చూపే 8 కీలక రంగాలు అక్టోబరులో 6.3 శాతం వృద్ధి సాధించాయి. గత 4 నెలల్లో ఇదే గరిష్ఠం. బొగ్గు వెలికితీత, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్తు రంగాల్లో అధిక వృద్ధి వల్లే ఇది సాధ్యమైంది.
డిసెంబరు - 5 
¤ ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణకు శుభారంభం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పెట్టుబడుల ఉపసంహరణైన సెయిల్ (SAIL - స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) షేర్ల విక్రయానికి రెండు రెట్లకు పైగా అధిక స్పందన వచ్చింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1715 కోట్లు సమకూరాయి.       » చిన్న మదుపర్లకు 2.66 కోట్ల షేర్లను కేటాయించగా, 2.66 స్పందన లభించడం విశేషం. (వీరికి కనీస ధర రూ.83 పై 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది). సాధారణ విభాగంలో షేర్లకు 2.01 రెట్ల స్పందన లభించింది.       » తాజా పరిణామంలో సెయిల్‌లో ప్రభుత్వ వాటా 75 శాతానికి పరిమితమవుతుంది.
డిసెంబరు - 8
¤ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుల్లో నలుగురు (నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎస్.డి.శిబూలాల్, కె.దినేష్) 1 బిలియన్ డాలర్ల విలువ (రూ.6,484 కోట్లు) చేసే షేర్లను మూకుమ్మడిగా విక్రయించారు. ఈ తొలి ప్రమోటర్లందరూ యాజమాన్య నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగిన నెలల వ్యవధిలోనే ఈ లావాదేవీలు జరిగాయి.
       » ఈ నలుగురు, వీరి కుటుంబ సభ్యులు కంపెనీలో 3.26 కోట్ల షేర్ల (సంస్థలో 5.5 శాతం వాటా)ను దేశీయ, విదేశీ సంస్థాగత మదుపర్లకు విక్రయించారు. ఈ నలుగురితో పాటు మరో నలుగురు ఇంజినీర్లు 1981లో కేవలం 250 డాలర్ల (రూ.15,000) పెట్టుబడితో స్థాపించిన ఇన్ఫోసిస్‌కు ప్రస్తుతం రూ. 2.25 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఉంది. సెప్టెంబరు త్రైమాసికం చివరినాటికి మొత్తం ప్రమోటర్ల వాటా 15.92 శాతంగా ఉంది.
       » తాజాగా ఈ లావాదేవీలన్నింటినీ డాయిష్ ఈక్విటీస్ ఇండియా నిర్వహించింది. దేశీయ, విదేశీ సంస్థాగత మదుపుదార్లకు వీటిని సగటున ఒక్కో షేరుకు రూ.1988.87 ధర వద్ద విక్రయించారు.
       » కంపెనీ ఏర్పాటైన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సహ-వ్యవస్థాపకులు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మడం గమనార్హం.
¤ దేశ కరెంటు ఖాతా లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 10.1 బిలియన్ డాలర్లు (రూ.60,600 కోట్ల)కు చేరింది. దేశ జీడీపీలో ఇది 2.1 శాతానికి సమానం.
       » 2013-14 రెండో త్రైమాసికంలో ప్రవాస భారతీయుల డిపాజిట్లు 8.2 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇదే సమయంలో విదేశాల నుంచి తెచ్చుకున్న వాణిజ్య రుణాలు 1.3 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
       » ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల మొత్తాన్ని పరిశీలిస్తే క్యాడ్ 1.9 శాతమే. 2013-14 తొలి అర్థభాగంలో ఇది 3.1 శాతం.
డిసెంబరు - 12 
¤ 2014 నవంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.38 శాతానికి చేరింది. 2012 జనవరిలో కొత్త గణాంకాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన అతి తక్కువ స్థాయి సీపీఐ ద్రవ్యోల్బణం ఇదే. 
డిసెంబరు - 15
¤ ధరల పెరుగుదల రేటు నిలిచిపోయింది. 2014 నవంబరు నెలకు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 'సున్నా'గా నమోదైంది. గత అయిదున్నరేళ్లలో ఇదే కనిష్ఠం.
       » ఆహార, ఇంధన, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో ద్రవోల్బణం సున్నాకు చేరిందని, 2009 జులైలో (-) 0.3 ప్రతికూల ద్రవోల్బణం నమోదైన తర్వాత అతి తక్కువ ద్రవ్యోల్బణం (సున్నా) ఇదేనని ప్రభుత్వం పేర్కొంది. సున్నాగా నమోదు కావడం ఇదే తొలిసారి
.
       » 2013 నవంబరులో ద్రవోల్బణం 7.52%, 2014 అక్టోబరులో ద్రవ్యోల్బణం 1.77 శాతం ఉంది
.
¤ ఎగుమతుల్లో వృద్ధి నమోదైనప్పటీకీ, అధిక పసిడి దిగుమతుల కారణంగా నవంబరు 2014లో వాణిజ్య లోటు ఏడాదిన్నర గరిష్ఠానికి చేరింది
.
       » కిందటేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 957 కోట్ల డాలర్లు కాగా, ఈ నవంబరులో 1686 కోట్ల డాలర్లుగా నమోదైంది
.       » వాణిజ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబరులో మొత్తం దిగుమతులు 26.79 శాతం అధికమై 4282 కోట్ల డాలర్లకు చేరాయి. ఎగుమతులు 7.27% పెరిగి 2596 కోట్ల డాలర్లకు చేరాయి.
డిసెంబరు - 19 
¤ నల్లధనం చలామణి, పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నాయని అనుమానించిన 260 సంస్థలు, సంబంధిత వ్యక్తులను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.¤ కేంద్ర ఆర్థిక శాఖ తన అర్థ సంవత్సర ఆర్థిక సమీక్షను ప్రకటించింది.ముఖ్యాంశాలు స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరిగే వీలుంది. రానున్న కాలంలో 7-8 శాతం వృద్ధిరేటు సాధ్యమే. గత రెండేళ్లూ వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. వచ్చే అయిదు త్రైమాసికాల్లో వినియోగ ద్రవ్యోల్బణం 5.1-5.8 శాతం మధ్య ఉండే వీలుంది. భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం, చమురు ధరలు కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)ని పరిమితం చేయనున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో సీఏడీ దాదాపు 2 శాతానికి పరిమితం కాగలదు. బంగారం దిగుమతులు పెరుగుతున్నా, చమురు ధరల క్షీణత ఆ భారాన్ని తగ్గిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి పరిమితం చేయడం కీలకం.
డిసెంబరు - 22
¤ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంస్థ ప్రైవేటు రంగ బ్యాంకుల ఐబీఏ కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది.
       » ఈ కమిటీకి 2014 - 15 ఏడాదికి ఛైర్మన్‌గా శ్యామ్ శ్రీనివాసన్ ఎంపికయ్యారు. ఈయన ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు
.
       » ఈ కమిటీలో 13 ప్రయివేటు రంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉంటారు
.
       » ఈ కమిటీ ఐబీఏలో సభ్యత్వం ఉన్న ప్రైవేటు బ్యాంకుల అవసరాలు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ కాలవ్యవధి ఒక ఏడాది.
డిసెంబరు - 30
¤ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) పేరును భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ ఆఫ్ ఇండియా)గా మార్చారు.
       » 'బీమా చట్ట (సవరణ) ఆర్డినెన్స్ 2014'కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 26న ఆమోదం తెలపడంతో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
       » ఈ ఆర్డినెన్స్ ద్వారా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు.
డిసెంబరు - 31
¤ 3జీ మొబైల్ స్పెక్ట్రమ్ వేలానికి ప్రాథమిక ధరను ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.2720 కోట్లుగా టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సిఫార్సు చేసింది.
        » 2010లో ఆపరేటర్లు చెల్లించిన ధరతో పోలిస్తే ఈ కనీస ధర 19 శాతం తక్కువే.