డిసెంబరు - 2014 జాతీయం


డిసెంబరు - 1
¤ నాగాలాండ్‌లో ప్రతి ఏడాది భారీ ఎత్తున నిర్వహించే హార్న్‌బిల్ ఉత్సవాన్ని ప్రధాని మోదీ కిసామాలో ప్రారంభించారు.     » ఓఎన్‌జీసీ - త్రిపుర ప్రభుత్వం సంయుక్త వెంచర్ అయిన 750 మెగావాట్ల పలాటన విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.     » నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు.    » ఈశాన్య ప్రాంతాల్లో 2జీ మొబైల్ కవరేజ్ కోసం రూ.5 వేల కోట్లు, ఈశాన్య ప్రాంత విద్యుత్ వ్యవస్థను మెరుగు పరిచే ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లను మంజూరు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మణిపూర్‌లో జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.¤ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కాసులపాడు గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది జవాన్లు మరణించారు. మృతుల్లో 223 - బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ వర్మ, అసిస్టెంట్ డిప్యూటీ కమాండెంట్ రాజేష్ కపూడియా ఉన్నారు.¤ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థలన్నింటినీ ఒకే ఛత్రం కిందికి తీసుకురావడమే కాకుండా, విద్యార్థులు పట్టాలు పొందడంలో తోడ్పడే బిల్లు 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) బిల్లు - 2014'కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.    » ఈ బిల్లును లోక్‌సభ నవంబరు 26నే ఆమోదించింది.    » ఈ విద్యాసంస్థల నుంచి బయటికొచ్చే విద్యార్థులు పట్టాలు పొందుతారనీ, ఇవి స్వతంత్ర హోదాతో పని చేస్తాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.    » ఈ బిల్లుతో అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంలోని ఐఐఐటీలు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదాను పొందుతాయి.¤ ఖాయిలా పడిన జౌళి పరిశ్రమల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
డిసెంబరు - 2
¤ జమ్ము కశ్మీర్, ఝూర్ఖండ్ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.జమ్ము కశ్మీర్‌లో 18 శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 71 శాతం ఓటింగ్ నమోదైంది.ఝూర్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత 20 శాసనసభ నియోజక వర్గాల్లో 65.46 శాతం ఓటింగ్ నమోదైంది.¤ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజు (డిసెంబరు 25)ను జాతీయ 'సుపరిపాలన దినోత్సవం'గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.¤ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 30 ఏళ్లు పూర్తయ్యింది.    » 1984, డిసెంబరు 2వ తేదీ రాత్రి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యూసీసీ) ప్లాంట్ నుంచి 40 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ బయటకు విడుదలై 3,707 మంది మరణించారు. 5,58,125 మంది క్షతగాత్రులయ్యారు. స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం విషవాయువు ప్రభావానికి 25 వేల మంది మరణించారు. లక్ష మంది ఇప్పటికీ వైకల్యంతో బాధపడుతున్నారు.
డిసెంబరు - 3 
¤ సామాజిక అంశాలపై ముఖ్యంగా మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు సంబంధించిన కేసుల విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక సామాజిక న్యాయ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.    » న్యాయమూర్తులు మదన్ బి.లోకుర్, యు.యు.లలిత్‌తో కూడిన ఈ ధర్మాసనం డిసెంబరు 12 నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమవుతుంది.    » సామాజిక న్యాయానికి సంబంధించిన ఎన్నో కేసులు చాలా ఏళ్లు సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విధానం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడిన నేపథ్యంలో సామాజిక న్యాయ ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశించినట్లు తెలిపింది.    » సామాజిక న్యాయ పరిధిలో సామాజిక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించే వివిధ కేసులను చేరుస్తారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను కరవు పీడిత ప్రాంత ప్రజల వినియోగం కోసం విడుదల చేయడం, ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీ కోసం కొత్త పథకాన్ని రూపొందించడం లాంటి అంశాలు దీని పరిధిలోకి వస్తాయి.¤ 90 కాలం చెల్లిన సవరణ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.    » రద్దుకు ప్రతిపాదించిన చట్టాల్లో పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు, అలవెన్సుల సవరణ చట్టం, సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం-2008, వక్ఫ్ సవరణ చట్టం-2013, బ్యాంకింగ్ నిబంధనల సవరణ చట్టం మొదలైనవి ఉన్నాయి.¤ సూపర్ కంప్యూటర్ రంగంలో దేశ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచానికి దీటుగా ఎదిగేందుకు 'జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌'ను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.    » ఈ మిషన్‌కు 2014-15 ఏడాదిలో రూ.42.50 కోట్లు, ఏడేళ్ల కాలంలో మొత్తం రూ.4,500 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు.
డిసెంబరు - 4 
¤ ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకాన్ని ఆరంభించింది. బ్యాంకులు లేదా తపాలా కార్యాలయాల్లో ఈ ఖాతాను తీసుకోవచ్చు.    » 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకం కింద పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ పథకం ముగుస్తుంది. అయితే 14 ఏళ్లు పూర్తయ్యేంత వరకు డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.    » ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య, వివాహం కోసం ఖాతాలో జమైన దాంట్లో సగం మొత్తాన్ని తీసుకోవచ్చు.    » చిన్న మొత్తాలను సేకరించడం; వాటిని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం ఈ పథకం లక్ష్యం.¤ ముంబయి తీరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది.    » 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (కాంగ్రెస్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్) మొదటిసారిగా దీనిపై ప్రకటన చేసింది. అప్పటి నుంచి పర్యావరణ అనుమతులు లభించక విగ్రహ ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు.
డిసెంబరు - 5 
¤ దోష నిరూపణ జరిగినవారు మినహా, జైల్లో ఉన్న ఇతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 'దోష నిరూపణ జరిగి, శిక్ష ఖరారైతే సరే. కానీ, ఎఫ్ఐఆర్ నమోదు కావడం, నిర్బంధంలో ఉండటం అనే కారణాలు ఒక వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి సరిపోవు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.    » సంబంధిత చట్ట సవరణను రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందంటూ ఫిబ్రవరి 6న దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేశారు. ఈ అపీల్‌ను పిటిషనర్ దాఖలు చేశారు.    » ప్రస్తుతమున్న చట్టం ప్రకారం జైలు లేదా పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చట్ట సభలకు పోటీ చేయగలరని సుప్రీంకోర్టు గతేడాది జులై 10న స్పష్టం చేసింది. దీంతో కేంద్రం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి నిర్బంధంలో ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించింది.¤ పంజాబ్‌లో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు (క్యాటరాక్ట్ సర్జరీ) వికటించి సుమారు 60 మంది చూపు కోల్పోయారు.    » పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా గుమన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.¤ సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో సైనికులను లక్ష్యంగా చేసుకుని నాలుగు చోట్ల దాడులు చేశారు. అవి: ఉరీలో సైనిక శిబిరం, శ్రీనగర్ శివారు సౌరా, త్రాల్ బస్టాండ్, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్. 
డిసెంబరు - 6 
¤ రెండో జాతీయ లోక్ అదాలత్‌లో ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1.25 కోట్ల కేసులకు పరిష్కారం లభించింది. మోటారు వాహన ప్రమాదాల్లో రూ.3000 కోట్లు పరిహారంగా చెల్లించారు.    » గతేడాది తొలిసారిగా జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 71 లక్షల కేసుల్ని పరిష్కరించగలిగారు. ఈ ఏడాది అదాలత్ ద్వారా సగటున 9% కేసులు దేశవ్యాప్తంగా తగ్గాయని జాతీయ న్యాయ సేవల సంస్థ వెల్లడించింది.    » రెండో లోక్ అదాలత్‌లో భాగంగా సుప్రీంకోర్టులో ఏర్పాటైన మూడు ధర్మాసనాలు కలిసి 53 కేసులకుగాను 28 పరిష్కరించాయి.    » కుటుంబ వివాదాలు, విడాకుల కేసులు, వాహన ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, వసూలు, చెక్కులు నిరాదరణకు గురికావడం, రెవెన్యూ తగాదాల లాంటివి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లో పరిష్కారానికి నోచుకున్నాయి.
డిసెంబరు - 7 
¤ 2014 నవంబరు 30కి దేశంలోని ప్రైవేటు టెలివిజన్  ఛానళ్ల సంఖ్య 821కి చేరినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.    » గత డిసెంబరులో మొత్తం 784 ఛానళ్లు ఉండగా, ప్రస్తుత డిసెంబరుకి వీటి సంఖ్య 821కి చేరింది. అంటే ఒక ఏడాదిలో 37 ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి.
    »
 ఈ 821 ఛానళ్లలో 404 ఛానళ్లు వార్తలు, కరెంట్ అఫైర్స్ సంబంధ కార్యక్రమాల ప్రసారానికి ఉద్దేశించినవి కాగా, ఈ తరహా కార్యక్రమాల ప్రసారంతో సంబంధం లేనివి మరో 417 ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతితో దేశంలో ప్రసారాలను కొనసాగిస్తున్నాయి. 
డిసెంబరు - 8 
¤ అంతర్జాల ఆధారిత పాలనారీతులకు దర్పణం పట్టే విధంగా కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన 'మొబైల్ వన్ (ఎం-1)' సేవలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరులో ప్రారంభించారు. ఏక గవాక్ష మార్గం ద్వారా చరవాణి ఆధారంగా వివిధ రకాల ప్రజా అవసర కార్యక్రమాలు, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ అనుకూలిస్తుంది.    » కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ వాజూభాయి వాలా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిసెంబరు - 9 
¤ జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.    » మూడో దశలో జమ్మూకశ్మీర్‌లో 58%, ఝార్ఖండ్‌లో 61.78% పోలింగ్ నమోదైంది.
డిసెంబరు - 10
¤ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో సౌలభ్యాన్ని కల్పించింది. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు ఏడాదిలో 14.2 కేజీల సిలిండర్లను పన్నెండు వరకు రాయితీపై పొందుతున్నారు. ఇక నుంచి 5 కేజీల సిలిండర్లను సబ్సిడీపై పొందేందుకు వారికి అవకాశం దక్కింది. దిల్లీలో ఈ సిలిండరు ధర రూ.155. అయితే ఏడాదికి వీటి సంఖ్య 34కి మించకూడదు. అంతకు మించి వినియోగిస్తే బహిరంగ విపణిలో అందుబాటులో ఉన్న ధర రూ.351ను చెల్లించాల్సి ఉంటుంది.
    » వినియోగదారులు గ్యాస్ డీలర్ల వద్ద 14.2 కేజీల లేదా 5 కేజీల సిలిండర్లలో ఏదో ఒకటే పొందొచ్చు. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనుకుంటున్నారో ఏడాది ప్రారంభంలోనే డీలర్‌కు స్పష్టం చేయాలి. ఏడాది మధ్యలో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండరుకు మారడానికి కుదరదు. డీలర్ వద్ద నమోదు చేయించుకోని వినియోగాదారులు పెట్రోల్ బంకుల వద్ద 5 కిలోల సిలిండర్లను పొందవచ్చు.
¤ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
¤ ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి పరిమితం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాసెల్ 3 ప్రమాణాల మేరకు అదనపు మూలధనం కోసం అవసరమైన రూ.1.60 లక్షల కోట్లను ఈక్విటీ మార్కెట్ల నుంచి సమీకరించేందుకు అనుమతించింది.
    » చిన్న మదుపర్లకు అధిక షేర్లు కేటాయించే పద్ధతిలో నిధుల సమీకరణకు ప్రయత్నించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది.
    » మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అధిక వాటా ఉన్న 22 బ్యాంకులను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. వీటిలో 56.26% - 88.63
%
 ప్రభుత్వ వాటా ఉండగా, మిగిలిన 5 బ్యాంకుల్లో ఎస్‌బీఐకి అధిక వాటా ఉంది.
    » బాసెల్ 3 నిబంధనలు 2019 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకోసం 2018 నాటికి పీఎస్‌బీలకు రూ.2.40 లక్షల కోట్ల నిధులు కావాలి. గత నాలుగు సంవత్సరాల్లో బ్యాంకులకు ప్రభుత్వం రూ.58,634 కోట్లను అందించగా ఈ ఏడాది రూ.11,200 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించడం ద్వారా నిధులు సమీకరించినా, 2015-19లో రూ.78,895 కోట్లను బ్యాంకులకు సమకూర్చాల్సి ఉంటుంది.
¤ పర్యావరణహిత, ఇంధన భద్రతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, సౌర పార్కులకు ఆమోదం తెలిపింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 25 సౌరపార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పార్కులను అయిదేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
    » మరోవైపు రక్షణ రంగంలోనూ సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రక్షణ రంగంలో 300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
    » జాతీయ శుద్ధ ఇంధన నిధి (ఎన్సీఈఎఫ్) నుంచి నవీన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు రూ.750 కోట్ల మొత్తాన్ని అందజేసే నిబంధనను కేబినెట్ ఆమోదించింది.
¤ రూ.3 లక్షలలోపు సల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులకు ఏడు శాతం వడ్డీరేటును, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి మూడు శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
¤ తమిళనాడులో రూ.1593 కోట్ల వ్యయంతో విద్యుత్తు ప్రసార వ్యవస్థ (ట్రాన్స్‌మిషన్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది.¤ మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు ఆరు రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. వీటిని ఛండీగఢ్, బెంగళూరు, ఎర్నాకుళం, డెహ్రాడూన్, శిలిగురి, హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు.
¤ తేయాకు అభివృద్ధి, ప్రోత్సాహక పథకానికి రూ.1425 కోట్లను కేటాయించారు.
¤ లోక్‌పాల్ ఛైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేసే కమిటీలో లోక్‌సభలో విపక్ష పెద్ద పార్టీ నేత మల్లికార్జున ఖర్గేను చేర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిసెంబరు - 12 
¤ విదేశాల్లో పోగుపడిన నల్లధనం అంశంలో మరో ముందడుగు పడింది. నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం 339 మంది భారతీయులు స్విస్ బ్యాంకుల్లో రూ.4,479 కోట్ల నల్లధనాన్ని దాచినట్లు వెల్లడించింది. దేశీయంగా లెక్కల్లో చూపని ధనం రూ.14,958 కోట్లుగా తేల్చింది.¤ తూర్పు నావికా దళంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఐఎన్ఎస్ సర్కార్స్ 75 వసంతాలను పూర్తి చేసుకుంది.    » ఈ సందర్భంగా విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో 'ప్లాటినం జూబ్లీ' వేడుకలను నిర్వహించారు. ఐఎన్ఎస్ సర్కార్స్ 75 వసంతాలపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.¤ కొత్త కంపెనీల చట్టంలో 14 సవరణలు చేయడానికి 'కంపెనీల చట్టం (సవరణ) బిల్లు -2014'ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.    » చట్ట విరుద్ధంగా పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి, నిధులను సమీకరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి, దేశంలో వ్యాపారాన్ని మరింత సులభం చేయడానికి ఈ సవరణలు దోహదం చేస్తాయి.¤ అయిదేళ్లకు మించి పాతబడిన యంత్రాల దిగుమతులపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల దేశీయ తయారీ రంగంలో ఉత్పత్తి వ్యయం తగ్గి, కంపెనీల పోటీతత్వం పెరుగుతుంది.¤ 'బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు-2014'ను మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.    » 204 బొగ్గుక్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు సెప్టెంబరులో రద్దు చేసింది. అయితే, వాటిని ఇప్పుడు తాజాగా వేలం వేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అంతేకాదు, అక్టోబరులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జారీ చేసిన 'బొగ్గు గనుల ఆర్డినెన్స్-2014' స్థానంలో ఈ బిల్లు అమల్లోకి వస్తుంది.    » తాజాగా ఆమోదం పొందిన ఈ బిల్లు బొగ్గు తవ్వకాలు, ఉత్పత్తి కార్యక్రమాలు కొనసాగేందుకు నిబంధనలను నిర్దేశిస్తుంది.¤ కర్ణాటక అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.    » బీజేపీ సభ్యుడు ప్రభు చవాన్ తన సెల్‌ఫోన్‌లో ప్రియాంక గాంధీ ఫోటోను జూమ్ చేసి చూస్తూ టీవీ కెమెరాకు చిక్కిన ఘటన నేపథ్యంలో నిషేధం విధించారు.    » ప్రభు చవాన్‌ను స్పీకర్ సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.¤ సామాజిక అంశాల కేసుల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక 'సామాజిక న్యాయ ధర్మాసనం' విచారణలు ప్రారంభించింది.    » తొలి రోజు నర్మదా ప్రాజెక్టు, ఇళ్లు లేనివారికి ఆశ్రయం, సర్కస్‌లలో పనిచేసే పిల్లల శ్రమను దోచుకోవడం తదితర కేసులను చేపట్టింది. 
డిసెంబరు - 13 
¤ భారత పార్లమెంటుపై 2001 డిసెంబరు 13న చేసిన దాడి ఘటనకు 13 సంవత్సరాలు పూర్తయింది.    » ఆ రోజున అయిదుగురు సాయుధులు పార్లమెంటు ఆవరణలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి తొమ్మిదిమందిని హతమార్చారు. ఈ కేసులో దోషి అఫ్జల్‌గురుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలైంది.    » రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పార్లమెంటు ఆవరణలో ఘటనా స్థలం వద్ద మృతులకు నివాళులు అర్పించారు.¤ జాతీయ అవార్డు సాధించిన హిందీ చిత్రం 'జల్' 87వ ఆస్కార్ అవార్డుల రేస్‌లో నిలిచింది. ఉత్తమచిత్రం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఈ చిత్రానికి నామినేషన్లు దక్కాయి. ఈ సినిమాకి గిరీష్ మాలిక్ ‌దర్శకత్వం వహించగా, సోను నిగమ్, బిక్రమ్ ఘోష్ సంగీతమందించారు.    » ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఆస్కార్ పురస్కారాల ప్రాబబుల్స్‌లో మన దేశం నుంచి స్థానం పొందారు. హాలీవుడ్ చిత్రాలు ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, మిలియన్ డాలర్ ఆర్మీ, కొచ్చాడయన్‌కి ఒరిజినల్ స్కోరు విభాగంలో ప్రాబబుల్స్ జాబితాలో స్థానం సంపాదించారు. గతంలో '127 అవర్స్', 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రాలకు ఆయన ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.    » ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మనదేశం నుంచి 'లయర్స్ డైస్' ఇప్పటికే ప్రాబబుల్స్‌కు ఎంపికైంది.    » మొత్తం మీద 114 పేర్లతో ఆస్కార్ ప్రాబబుల్స్ బాబితాను ప్రకటించారు.
డిసెంబరు - 14
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణిలో మూడో విడత 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా యువతను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు స్వస్తి పలకాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలతో త్రీ'డీ' సమస్యలు (డార్క్‌నెస్ - అంధకారం, డిస్ట్రక్షన్ - విధ్వంసం, డివాస్టేషన్ - వినాశనం) ఉన్నాయని ఆయన చెప్పారు.    » ప్రకృతి అందాలను ఆస్వాదించే యువత ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలని కూడా ఆయన సూచించారు.¤ జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగో దశ ప్రశాంతంగా ముగిసింది. కశ్మీర్‌లో 49% ఝార్ఖండ్‌లో 61.65% చొప్పున పోలింగ్ నమోదైంది.¤ బీహార్ రాష్ట్రం సహస్ర జిల్లాలోని పర్మినియా గ్రామంలో దహ్వాదేవి(65) అనే మహిళ మరణించిన తన భర్త చరిత్రాయాదవ్ (70) చితికి పెట్టిన మంటల్లోకి దూకి సతీసహగమనానికి పాల్పడింది.
డిసెంబరు - 15
¤ ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కడా మత మార్పిడి లేదా తిరిగి అదే మతంలోకి వచ్చేవారిని ఆహ్వానించడం (ఘర్‌వాపసీ) లాంటి కార్య్రమాలను అనుమతించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
¤ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధి నుంచి పెట్రోలియంను వేరుగా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిగా 2016 ఏప్రిల్ నుంచి ప్రతిపాదించిన కొత్త పన్ను వ్యవస్థలో ప్రవేశ పన్నును జోడించేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి
.
    » ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఏడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ రాజీ కుదిరింది
.
    » మిగతా రాష్ట్రాల ఆందోళలను గతంలోనే సమాధాన పరిచారు
.
    » తాజా అంగీకారం ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులను ప్రారంభంలో కొన్నేళ్లపాటు జీఎస్‌టీ బిల్లు పరిధిలోకి తీసుకురారు. కొత్త పన్ను వ్యవస్థలోకి చేర్చే అంశంపై నిర్ణయం తర్వాత తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది
.
¤ 2జీ కుంభకోణం కేసులపై దర్యాప్తు బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ కొత్త సంచాలకులు అనిల్ సిన్హాకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది
.
¤ ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
డిసెంబరు - 16
¤ ఉగ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)'ను భారత్‌లో నిషేధించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు.
¤ మత పుస్తకాలు, పత్రికలను 90 ఏళ్లుగా ముద్రిస్తూ జనాదరణ పొందిన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని చారిత్రక గీతా ప్రెస్ నిరవధికంగా మూతపడింది
.
    » వేతనాలు పెంచాలంటున్న ఉద్యోగులతో చర్చలు విఫలం కావడంతో లాకౌట్ ప్రకటించాలని నిర్ణయించినట్లు యాజమాన్యం తెలిపింది.
డిసెంబరు - 17 
¤ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పై రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది.   » ఎక్ఛ్సేంజ్ సుంకం, సేవ పన్ను లాంటి పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్‌టీ అమల్లోకి వస్తుంది.   » ఈ బిల్లును 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ రద్దవ్వడంతో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతుంది.   » జీఎస్‌టీ గురించి తొలిసారిగా 2006-07లో అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.¤ కంపెనీల చట్టంలో సవరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే కాక, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.   » కంపెనీల చట్టం - 2013లో గుదిబండగా మారిన పలు నిబంధనలను తొలిగిస్తూ సూచించిన సవరణ ప్రతిపాదనల బిల్లును (కంపెనీల చట్టం (సవరణ) బిల్లు - 2014) అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
డిసెంబరు - 19 
¤ ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ బెయిల్ మంజూరు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. బెయిల్ మంజూరును ముక్త కంఠంతో ఖండిస్తూ లోక్‌సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.¤ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని 5 కోట్ల మందికి పైగా ఖాతాదారుల డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 8.75% వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.¤ కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజనను ప్రారంభించింది. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.   » గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ ఫీడర్లను వేరు చేసేందుకు రాష్ట్రాలకు దీని నుంచి సహకారం అందుతుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, వినియోగదారులకు మీటర్లు ఏర్పాటు విషయంలోనూ చేయూత అందుతుంది. కేంద్ర గ్రాంటు 60 శాతం (ప్రత్యేక రాష్ట్రాల్లో అయితే 85 శాతం) ఉంటుంది. 10 శాతం నిధులను విద్యుత్ పంపిణీ సంస్థలు సమకూర్చగా, 30 శాతం నిధులను ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకోవచ్చు.   » రూ.43,033 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల గ్రాంటును కేంద్రం కేటాయించింది. 
డిసెంబరు - 20 
¤ జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.   » జమ్ముకశ్మీర్‌లో అయిదు దశల్లో కలిపి అత్యధికంగా గత పాతికేళ్లలో ఎప్పుడూ లేని విధంగా 65% మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లో అయిదు దశల్లో కలిపి 66% మందికిపైగా ఓట్లు వేశారు.
డిసెంబరు - 21
¤ పునర్‌వ్యవస్థీకరించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)లో ముగ్గురు నిపుణుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
   » విపత్తుల నష్టాల తగ్గింపు నిపుణుడు కమల్ కిషోర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.సి.మార్వాహ్, బాబా అణు పరిశోధన కేంద్రంలో ఆరోగ్యం, భద్రత, పర్యావరణ గ్రూప్ డైరెక్టర్ డి.ఎన్.శర్మ పేర్లను ప్రధాని మోదీ ఆమోదించారు
.
   » ఈ సంస్థలో గతంలో ఎక్కువ మంది రాజకీయ నేతలు, విపత్తు నిర్వహణ నేపథ్యంలోని విశ్రాంత అధికారులు ఉండేవారు
.
   » ఎన్‌డీఎంఏ సభ్యుల హోదాను సహాయమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి ఇటీవల ప్రభుత్వం తగ్గించింది. ఈ సంస్థకు ప్రధాని ఎక్స్ అఫీషియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు
.
   » గత ఎన్‌డీఎంఏకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో వైస్ ఛైర్మన్, మరో 9 మంది సభ్యులు ఉండేవారు. ఈసారి వైస్ ఛైర్మన్ కాకుండా నలుగురు సభ్యులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిసెంబరు - 22
¤ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్‌బీ) అధీకృత మూలధనాన్ని 2,000 కోట్ల రూపాయలకు పెంచడంతోపాటు క్యాపిటల్ మార్కెట్‌ల నుంచి అవి నిధులు సమీకరించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఒక బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
   » ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 ఆర్ఆర్‌బీలు ఉన్నాయి
.
¤ లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపింది
.
   » లోక్‌పాల్ అధ్యక్షుడు, సభ్యుల ఎంపిక కమిటీలో లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్షపార్టీ నేతను సభ్యుడిగా చేర్చేందుకు 'లోక్‌పాల్, లోకాయుక్త ఇతర సంబంధిత చట్టం సవరణ బిల్లు, 2014' వీలు కల్పిస్తుంది.
డిసెంబరు - 23
¤ ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.
   » ఝార్ఖండ్‌లో మొత్తం స్థానాలు 81. భాజపా అత్యధికంగా 37 స్థానాలను గెలుచుకుంది. జేఎంఎం 19 స్థానాలు, జేవీఎం (పీ) 8 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, ఏజేఎస్‌యూ 5 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు
.
   » జమ్ముకశ్మీర్‌లో మొత్తం స్థానాలు 87. పీడీపీ అత్యధికంగా 28 స్థానాల్లో గెలుపొందింది. భాజాపా 25 స్థానాలు, ఎన్‌సీ 15 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు, జేకేపీసీ 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు
.
¤ అసోంలోని సోనిట్‌పూర్, కోక్ర ఝార్ జిల్లాల్లో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదులు నాలుగుచోట్ల జరిపిన దాడుల్లో 43 మంది మరణించారు
.
   » ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) అంటే నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (సోంగ్బిజిట్
).
¤ 2005 కంటే ముందు ముద్రితమైన రూ.500, రూ.1000 సహా వివిధ కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ గడువును పొడిగించింది. జూన్ 30, 2015 వరకు అందుకు అనుమతించింది. డిసెంబరు 31, 2014కి నోట్లను మార్చుకోవాలని మార్చి 2014లో గడువును విధించింది. దాన్ని తాజాగా మరో 6 నెలలు పొడిగించింది
.
   » 2005 కంటే ముందు కరెన్సీ నోట్లకు వెనుక వైపున సంవత్సరం ఉండదు. 2005 తర్వాత జారీ అయిన అన్ని నోట్లకు వెనుకవైపు కింది భాగాన ఆ నోటు అచ్చయిన సంవత్సరాన్ని ముద్రిస్తున్నారు
.
   » ఇప్పటి వరకు ఆర్‌బీఐ రూ.51,855 కోట్ల విలువైన 144.66 పాత 500 నోట్లను చలామణి నుంచి తప్పించింది
.
¤ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారంలో మరోసారి మనకు నిరాశే ఎదురయింది. గీతూ మోహన్ దాస్ రూపొందించిన 'లయర్స్ డైస్' చిత్రం ప్రాథమిక వడపోతలోనే వైదొలగింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రాన్ని ప్రతిపాదించారు. తదుపరి పరిశీలన కోసం నిలిచిన తొమ్మిది చిత్రాల్లో దీనికి చోటు దక్కలేదు.
డిసెంబరు - 24
¤ బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దేశ విద్యారంగ దిశను మార్చిన దివంగత నేత మదన్ మోహన్ మాలవ్యా ; భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయీకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది. రాష్ట్రపతి కార్యాలయం ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
  » గతేడాది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారతరత్న ప్రకటించారు.
  » తాజా ప్రకటనతో ఇప్పటివరకు 'భారతరత్న'
ను పొందిన వారి సంఖ్య 45కు చేరింది.

మదన్ మోహన్ మాలవ్యా
 మదన్ మోహన్ మాలవ్యా 1861 డిసెంబరు 25న అలహాబాద్‌లో జన్మించారు. 1946 నవంబరు 12న వారణాసిలో మరణించారు.
 భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ మితవాద భావజాలానికి మాలవ్య ప్రతీక. 1909, 1918, 1932, 1933 సంవత్సరాల్లో పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
 ఆసియాలోనే అతిపెద్ద గురుకుల విశ్వవిద్యాలయమైన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం రూపకర్తగా మాలవ్య ప్రసిద్ధులు. 1911లో అనిబిసెంట్, మాలవ్యలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనిబిసెంట్ 1898లో తాను ఏర్పాటు చేసిన హిందూ కళాశాలను ఈ విశ్వవిద్యాలయంలో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 1915లో బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసింది. 1916లో విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. నాటి నుంచి వీసీగా ఉన్న మాలవ్య 1939లో ఆ బాధ్యతలను సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అప్పగించారు.
 మాలవ్య హిందూస్థాన్ పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. తర్వాత అలహాబాద్ వెళ్లి న్యాయవాద విద్యను అభ్యసించి, న్యాయవాద వృత్తిని చేపట్టారు. చౌరీ చేరా సంఘటనలో ఉరిశిక్ష పడిన 177 మంది ఖైదీల కోసం వాదించి 156 మందిని నిర్దోషులుగా విడిపించారు. న్యాయవాద వృత్తిని 1911లో విశ్వవిద్యాలయ స్థాపన లక్ష్యం కోసం వదిలేశారు. మాలవ్య 1912 నుంచి 1926 వరకు బ్రిటిష్ ఇండియా జాతీయ చట్టసభల్లో సభ్యుడిగా ఉన్నారు. సహాయనిరాకరణ ఉద్యమంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ముస్లింలను మెప్పించే క్రమంలోనే కాంగ్రెస్ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు పలికిందంటూ దాన్ని వ్యతిరేకించారు.
 భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు వచ్చిన సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ 1928లో లాలా లజపతిరాయ్, జవహర్‌లాల్ నెహ్రులతో కలిసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంప్రదింపులకు వెళ్లిన బృందంలో మాలవ్య కూడా ఉన్నారు. 1932లో 'బై ఇండియన్' ఉద్యమాన్ని ప్రారంభించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాలవ్యను బ్రిటిష్‌వారు అరెస్టు చేశారు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అంగీకరించిన కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, 'జాతీయవాద కాంగ్రెస్ పార్టీ'
ని స్థాపించారు.
 1924 నుంచి 1946 వరకు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఛైర్మన్‌గా పనిచేశారు.
 హిందూ మతంలో కులాల అంతరాన్ని మాలవ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దళితవాడల్లో సామాజిక కార్యక్రమాలను ప్రారంభించి, వారికి ఆలయ ప్రవేశాల్ని కల్పించారు. 'సత్యమేవ జయతే' నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 

 హరిద్వార్‌లో ఆయన ప్రారంభించిన గంగా హారతి కార్యక్రమం ఇప్పటికీ 'మాలవ్య ద్వీప' పేరుతో కొనసాగుతోంది. పార్లమెంటు ప్రధాన మందిరంలో మాలవ్య నిలువెత్తు చిత్ర పటాన్ని తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. 
అటల్ బిహారీ వాజ్‌పేయీ
 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న వాజ్‌పేయీ జన్మించారు. గ్వాలియర్‌లోని విక్టోరియా (ప్రస్తుతం లక్ష్మీబాయి) కళాశాల, కాన్పూర్‌లోని డీఏవీ కళాశాలలలో ఆయన విద్యనభ్యసించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942లో జైలుకెళ్లారు. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) కార్యకర్తగా కూడా పని చేశారు.
 భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా, పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా వాజ్‌పేయీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
 వాజ్‌పేయీ పాత్రికేయుడిగానూ రాణించారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ సంపాదకుడిగా పనిచేశారు. హిందీ వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్ లకు కూడా సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు.
 9 సార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. తొలిసారిగా రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు.
 మూడు సార్లు భారత ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1996లో బీజేపీ ఆధ్వర్యంలోని తొలి సంకీర్ణ ప్రభుత్వం 13 రోజులకే పడిపోవడంతో ఆయన కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. 1998-99 మధ్య రెండోసారి, 1999 అక్టోబరు 13 నుంచి 2004 మే 13 వరకు మూడోసారి ప్రధానిగా వ్యవహరించారు.
 1998 మే 11, 13న రెండుసార్లు సాహసోపేతమైన అణు పరీక్షలను నిర్వహించి సంచలనం సృష్టించారు.
 పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పేందుకు అమిత చొరవ తీసుకున్నారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సు యాత్రను చేపట్టారు.
 దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ 'స్వర్ణ చతుర్భుజి'
 పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులను నిర్మించారు. వందల ఏళ్ల తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద రోడ్ల నిర్మాణం ఇదే.
 'అందరికీ ప్రాథమిక విద్య'
 అనే భారీ లక్ష్యంతో సర్వశిక్షా అభియాన్‌ను ప్రారంభించారు.
 రాజకీయ ఏకాభిప్రాయంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడు కొత్త రాష్ట్రాలను (ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్) ఏర్పాటు చేశారు.
 వాజ్‌పేయీ ప్రభుత్వం తెచ్చిన కొత్త టెలికం విధానం దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. అప్పటి వరకు టెలికం అందుబాటు రేటు 3 శాతం (1999లో) మాత్రమే ఉండగా, 2012 అక్టోబరు నాటికి 70 శాతానికి చేరింది.
 సుధీర్ఘ పాలన అందించిన కాంగ్రెసేతర ప్రధాని ఆయనే.
 వాజ్‌పేయీ అత్యుత్తమ హిందీ కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన కవితలు అత్యంత సున్నితమైన ఆయన వ్యక్తిత్వాన్ని, అపారమైన దేశ భక్తిని, సామాన్యుల అవస్థలపై ఆందోళనను, ప్రజాస్వామ్యం పట్ల చిత్త శుద్ధిని ప్రతిబింబిస్తాయి.
వాజ్‌పేయీ రచనలు: 'మేరీ సంసదీయ యాత్ర'(నాలుగు సంపుటాలు), 'సంకల్ప్ కాల్', 'శక్తి సే శాంతి', 'ఫోర్ డెకేడ్స్ ఇన్ పార్లమెంట్' (మూడు సంపుటాల్లో ప్రసంగాలు 1957-95) 'లోక్‌సభా మే అటల్ జీ' (ప్రసంగాల సంకలనం), 'మృత్యు యా హత్య', 'అమర్ బలిదాన్', 'ఖైదీ కవిరాజ్ కీ కుండలియాన్' (అత్యవసర సమయంలో జైల్లో ఉండగా రాసిన కవితల సంకలనం), 'న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ' (1977-79 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రసంగాల సంకలనం), 'జనసంఘ్ ఔర్ ముసలమాన్', 'సంసద్ మే తీన్ దశక్' (పార్లమెంటులో హిందీ ప్రసంగాలు 1957-92 మూడు సంపుటాలు), 'అమర్ ఆగ్ హై' (కవితల సంకలనం - 1994) అనే మొదలైన పుస్తకాలను రచించారు. ఆయన రచించిన 'ఇక్యావన్ కవితాయే'
 పుస్తకం భారీగా అమ్ముడైంది.
 1992లో పద్మవిభూషణ్, 1994లో లోకమాన్యతిలక్ పురస్కారం, పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం, 1993లో కాన్పూర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌లను పొందారు.
¤ అసోంలో ఎన్‌డీఎఫ్‌బీ (ఎస్) తీవ్రవాదుల హింస మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. తీవ్రవాదుల మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 65కు చేరింది.
డిసెంబరు - 25
¤ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ పుట్టినరోజుని 'సుపరిపాలనా దినం'గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
     » ప్రభుత్వం దేశ సర్వతోముఖాభివృద్ధి అన్నదొక్కటే లక్ష్యంగా అనేక సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రప్రథమ ప్రాధాన్యాన్ని పౌరులకే ఇస్తూ 'సిటిజెన్స్ ఫస్ట్' నినాదంతో ముందుకొచ్చింది. ఈ కృషిని మరింత బలోపేతం చేయడానికి వాజ్‌పేయీ జన్మదినాన్ని (డిసెంబరు 25) 'సుపరిపాలనా దినం'గా జరపాలని కూడా తీర్మానించింది.
     » ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుతో సహా అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా 'సుపరిపాలన'ను సాధించాలంటే ప్రధానంగా 8 సూత్రాలకు సమధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నాయి.
వాటి వివరాలు
భాగస్వామ్యం: పరిపాలనా వ్యవహారాల్లో, కీలక నిర్ణయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందరికీ అంటే స్త్రీ, పురుషులు, అన్ని వర్గాల వారికీ భాగస్వామ్యం ఉండాలి. ముఖ్యంగా అందరూ పాలుపంచుకొనేలా వ్యవస్థలు సహకరించాలి. సమాజంలో బలహీనంగా ఉన్న వర్గాలకు, వారి వాదనలకు కూడా ప్రాధాన్యం ఉండాలి.
ఏకాభిప్రాయం: సమాజమంటే ఇందులో ఎన్నో పక్షాలు, వర్గాలు, సంస్థలు పని చేస్తుంటాయి. వీరిలో ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. వీరందరికీ వేర్వేరు దృక్పథాలు, దృక్కోణాలు ఉండొచ్చు. వీరందరి మధ్యా మధ్యవర్తిత్వం వహిస్తూ సామాజిక స్థాయిలో ఒక విస్తృత ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. ఏకాభిప్రాయ సాధనకు నిలకడైన అభివృద్ధే అంతస్సూత్రం కావాలి
.
జవాబుదారీ తనం: సుపరిపాలనలో అత్యంత కీలకమైన అంశం ఇది. ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రైవేటు రంగం, పౌర సమాజం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ముఖ్యంగా తమ నిర్ణయాలతో ఎవరు ప్రభావితమవుతారో వారికి కచ్చితంగా జవాబుదారీగా ఉండటం అవసరం. పారదర్శకత, చట్టబద్ధత లేకుండా దీన్ని సాధించడం అసాధ్యం
.
పారదర్శకత: నిర్ణయాలు తీసుకోవడం, వీటిని అమలు చేయడంలోనూ చట్టానికి, నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ ఆ సమాచారం పూర్తిగా అందరికీ స్వేచ్ఛగా, సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలి. గత కొంత కాలంగా మనదేశంలో ప్రభుత్వాలను నడిపిన పక్షాలేవీ కూడా ఈ సూత్రానికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల పాలన పూర్తిగా కుంభకోణాల పరంపరగా మారింది
.
సత్వర స్పందన: పౌరులు, భాగస్వాములకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలోనూ సాధ్యమైనంత త్వరగా స్పందించాలి. ఈ విషయంలో అర్ధరహితమైన తాత్సారాలకు ఆస్కారం ఇవ్వకపోవడం అవసరం
.
సమత, సమ్మిళిత: పాలనలో తమకు, తమలాంటి వారందరికీ భాగస్వామ్యం ఉందని ప్రతి పౌరుడు భావించేలా చెయ్యడం, ముఖ్యంగా తమను దూరంగా ఉంచారన్న భావన వారిలో కలగకుండా చూడటం అవసరం. సమాజంలోని బలహీన వర్గాలు, నిరాదరణకు గురైన పక్షాలన్నింటికీ అవకాశాలు అందుబాటులో ఉండేలా చూడాలి
.
సమర్థత: అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకుంటూ, పౌరుల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పని చేయాలి. ఇదే సమర్థతకు కొలమానం అవుతుంది. సహజవనరులు, పర్యావరణ పరిరక్షణ కూడా ఇందులో భాగమే అవుతుంది. ప్రజావసరాలను నెరవేర్చే పేరుతో ఇష్టారాజ్యంగా వనరులను వాడటం సమర్థత అనిపించుకోదు
.
చట్టబద్ధత: చట్ట వ్యవస్థలన్నీ కూడా అరమరికలు, దాపరికాలు లేకుండా పనిచేయాలి. నిరపేక్షంగా, నిష్పాక్షికంగా పని చేసే న్యాయ, పోలీసు విధానాలుండాలి
.
    » సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వారణాసిని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛభారత్ కార్యక్రమ స్ఫూర్తిని నింపారు
.
     » స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమ ప్రచారంలో భాగస్వాములవ్వాల్సిందిగా రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, మరికొంత మంది ప్రముఖులను, సంస్థలను నామినేట్ చేశారు
.
ప్రధాని ఆహ్వానించిన ప్రముఖులు, సంస్థలు

 పద్మనాభ బాలకృష్ణ ఆచార్య (నాగాలాండ్ గవర్నర్
)
 కిరణ్ బేడీ (సామాజిక కార్యకర్త, మాజీ ఐపీఎస్
)
 సౌరవ్ గంగూలీ (క్రికెటర్
)
 కపిల్ శర్మ (టీవీ వ్యంగ్య కార్యక్రమాల ప్రయోక్త
)
 సోనాల్ మాన్‌సింగ్ (ఒడిస్సీ నృత్యకళాకారిణి
)
 రామోజీరావు (రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్
)
 అరుణ్ పూరీ (ఇండియాటుడే గ్రూప్
)
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియా

 ఈనాడు గ్రూప్, ఇండియటుడే గ్రూప్, ముంబయి డబ్బావాలాలు
¤ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా ఆయన పేరిట ఉపాధ్యాయ శిక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వారణాసిలో ప్రారంభించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 'ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

¤ భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రముఖంగా చాటిచేప్పేలా ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల సాంస్కృతికోత్సవం 'సంస్కృతి'ని వారణాసిలో ప్రారంభించారు. నృత్యం, నాటకం, సాంస్కృతిక అంశాలపై చలన చిత్రాలు మొదలైన అంశాలను ఈ సాంస్కృతికోత్సవంలో ప్రదర్శిస్తారు
.
¤ భారత్-పాక్ సరిహద్దులోని నదీ ప్రాంతాల్లో కాపలా క్లిష్టతరంగా మారడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సరికొత్త యోచన చేసింది. ఇలాంటి చోట ఉగ్రవాదులు సరిహద్దులు దాటి రాకుండా లేజర్ గోడల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించింది. బీఎస్ఎఫ్ 'ఫర్హీన్ లేజర్ గోడ' లాంటి సొంత సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసింది
.
     » జమ్మూ ప్రాంతంలో బసంతర్, బీన్‌నాలా, కరోల్ కృష్ణా, పలోవానాలా ప్రాంతాల్లో లేజర్‌ను ఏర్పాటు చేశారు
.
     » రక్షణలేని సరిహద్దులపై ఏవైనా కదలికలు చోటు చేసుకుంటే సెన్సర్ పెద్ద శబ్దంతో హెచ్చరించి సరిహద్దు దళాల్ని అప్రమత్తం చేస్తుంది
.
     » ఇజ్రాయిల్, సింగపూర్ తమ సరిహద్దుల్ని కాపాడుకునేందుకు ఇలాంటి పరిజ్ఞానాన్నే వినియోగిస్తున్నాయి
.
డిసెంబరు - 26 
¤ గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఝార్ఖండ్‌లో పద్నాలుగేళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయానికి భాజపా తెరదించింది. రాష్ట్రానికి తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్‌ను ఎంపిక చేసింది. ఇటీవల ఎన్నికల్లో 37 స్థానాల్లో విజయం సాధించిన భాజపా తమతో కలిసి ఎన్నికల బరిలోకి దిగి 5 సీట్లలో గెలుపొందిన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.¤ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపునకు మార్గం సుగమం చేసే ఆర్డినెన్స్, రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల పునః కేటాయింపులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు.     » ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వీటికి సంబంధించిన బిల్లులు ఆమోదం పొందలేకపోయిన నేపథ్యంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.     » బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదన 2008 నుంచి ఉంది. అయితే ఆమోదం లభించలేదు. ఈ పరిమితి పెంపుతో బీమా రంగంలో 6-8 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.     » 'బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు- 2014' లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం ముందుకు కదలలేదు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలను ఈ-వేలం వేయడానికి, నేరుగా కేటాయించేందుకు వీలవుతుంది.¤ దేశంలోని 16 ప్రధాన నగరాల్లో వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారులకు వివిధ సేవలు అందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పనున్నారు.     » దిల్లీ, లక్నో, చంఢీగఢ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, పుణె, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, గువహతి, షిల్లాంగ్, రాయ్‌పూర్, భోపాల్ నగరాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.     » వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు సంబంధించి ఆయా కేంద్రాలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి.¤ చెన్నై తీరాన్ని అతలాకుతలం చేసి సుమారు 7 వేల మందిని పొట్టన పెట్టుకున్న సునామి ఘటన జరిగి పదేళ్లు గడిచాయి.     » హిందూ మహా సముద్రంలో సంభవించిన పెను భూకంపం కారణంగా ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ప్రారంభమై అండమాన్ మీదుగా 2004లో చెన్నై తీరాన్ని తాకిన జలప్రళయం ఎన్నో జీవితాలను కబళించింది.
డిసెంబరు - 28
¤ ఝార్ఖండ్‌లో భాజపా ఏజేఎస్‌యూ ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా నేత రఘువర్ దాస్ (59 సంవత్సరాలు) రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
     » రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రఘువర్ దాస్‌, మరో నలుగురు మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
     » 81 సీట్లున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో భాజపా 37 స్థానాలు, దాని మిత్ర పక్షం ఏజేఎస్‌యూ అయిదు సీట్లు గెలుచుకుంది. దీంతో రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డానికి మార్గం సుగుమం అయ్యింది.
     » 1955 మే 3న జెమ్‌షడ్‌పూర్‌లో జన్మించిన రఘువర్ దాస్ టాటా స్టీల్ కంపెనీ కార్మికుడిగా పని చేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
     » 1995 అసెంబ్లీ ఎన్నికల్లో జెమ్‌షెడ్‌పూర్ (తూర్పు) స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి ఎన్నికయ్యారు. అక్కడి నుంచి పోటీ చేసి 5 సార్లు విజయం సాధించారు. ఝార్ఖండ్ ఏర్పడిన తర్వాత బాబూలాల్ మరాండీ ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి అయ్యారు. అర్జున్ ముండా నేతృత్వంలో ఏర్పడ్డ రెండు ప్రభుత్వాల్లోనూ అమాత్యుడిగా ఉన్నారు. 2009లో శిబుసోరెన్ నేతృత్వంలోని సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
¤ మన దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉంది. 2013లో ఉత్తరప్రదేశ్‌లో 79,616 మంది క్యాన్సర్‌తో మరణించారు.
     » నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 34,119 క్యాన్సర్ మరణాలు సంభవించినట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి.
     » కొన్నేళ్ల నుంచి క్యాన్సర్ సంబంధిత మరణాల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోందని 'భారత వైద్య పరిశోధన మండలి
'
 (ఐసీఎంఆర్) గణాంకాలు పేర్కొన్నాయి. 2011లో 4,52,541గా ఉన్న క్యాన్సర్ మరణాల సంఖ్య 2013 నాటికి 4,78,185కు చేరుకున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
¤ కర్ణాటక రాజధాని బెంగళూరులో బ్రిగేడ్ రోడ్డు సమీపంలోని చర్చి వీధిలో ఓ హోటల్ వద్ద బాంబు పేలుడు సంభవించి, ఒక మహిళ మరణించింది.
¤ కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
¤ సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
డిసెంబరు - 29
¤ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు అనుబంధంగా పని చేస్తున్న వికలాంగుల వ్యవహారాల విభాగం పేరును వికలాంగుల సాధికారత విభాగం (వికలాంగజన్ సశక్తీకరణ్ విభాగ్)గా మార్చారు.
¤ ప్రధాన మంత్రి జనధన్ యోజన (పీఎమ్‌జేడీవై) కింద 10 కోట్ల ఖాతాలను ప్రారంభించాలన్న లక్ష్యాన్ని బ్యాంకులు ఒక నెల ముందుగానే సాధించాయి. జనవరి 26 గడువుగా పెట్టుకోగా, డిసెంబరు 26 నాటికే ఈ పథకం కింద తెరచిన ఖాతాల సంఖ్య 10.08 కోట్లకు చేరింది. అదే సమయంలో బ్యాంకులు డిసెంబరు 22 నాటికి 7.28 కోట్ల రూపే కార్డులు జారీ చేశాయి.
డిసెంబరు - 30
¤ మిజోరాం, ఉత్తరాఖండ్ గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.
      » ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీని మిజోరాం గవర్నర్‌గా నియమించారు
.
      » మేఘాలయ గవర్నర్ కె.కె.పాల్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు. పాల్ ఉత్తరాఖండ్‌తో పాటు మణిపూర్ బాధ్యతలను కూడా చూస్తారు
.
      » పశ్చిమ్ బంగా గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ అదనంగా మేఘాలయ బాధ్యతలు చూస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబరు - 31
¤ దేశంలో అల్ప సంఖ్యాక వర్గాల (మైనారిటీ) అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. వారికోసం ప్రవేశపెట్టిన పథకాల అమలు, వాటి పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు 'సాధికారత మిషన్'ను ఏర్పాటు చేసింది.
      » ఆయా పథకాల అమలు, పురోగతిని క్షేత్రస్థాయి నుంచి పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించింది.
¤ న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునే కొలీజియం వ్యవస్థ స్థానంలో 'జాతీయ న్యాయ నియామకాల కమిషన్' (ఎన్.జె.ఎ.సి.)ని 
ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు.
      » దీనికి సంబంధించిన 121వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంటు అమోదించింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించడంతో 20 ఏళ్లుగా ఉన్న కొలీజియం స్థానంలో ఎన్.జె.ఎ.సి. ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.
      » సుప్రీంకోర్టు, 24 హైకోర్టులకు న్యాయమూర్తుల్ని నియమించడంతో పాటు, వారి బదిలీలను కూడా ఈ కమిషనే చూసుకుంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వం వహించే ఎన్‌జేఏసీకి రాజ్యాంగ ప్రతిపత్తి ఉంటుంది. ఆయనతో పాటు సుప్రీంకోర్టుకు చెందిన మరో ఇద్దరు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు ప్రముఖులను ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత ఎంపిక చేస్తారు.
      » రాజ్యాంగ సవరణ బిల్లుకు 50 శాతం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం అవసరం కావడంతో ఆ మేరకు కేంద్రం ఈ బిల్లును పంపినప్పుడు 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు తమ ఆమోదం తెలిపాయి.
      » 1993కి ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి న్యాయవ్యవస్థతో సంప్రదించి న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టేవారు. 1993లో కొలీజియం వ్యవస్థ ఏర్పడ్డాక న్యాయమూర్తులే ఇతర న్యాయమూర్తుల్ని నియమించుకునే విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంపై అనేక విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్న నేపథ్యంలో ఎన్‌జేఏసీ ఆవిర్భవించింది.
      » చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా మొత్తం ఖాళీలను ప్రకటిస్తారు. పదవీ కాలం ముగిసే ముందే ఖాళీల గురించి ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే ఈ కమిషన్‌కు సమాచారం పంపిస్తుంది. మరణాలు, రాజీనామాల వల్ల ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడితే నెల రోజుల్లోగా ప్రభుత్వం తెలియజేస్తుంది. అనుభవం, ప్రతిభ, సామర్థ్యం, ఇతర ప్రామాణికాల ఆధారంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఎన్‌జేఏసీ సిఫార్సు చేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికీ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కోసం సంబంధిత ప్రధాన న్యాయమూర్తి నుంచి నామినేషన్లు కోరుతుంది. సిఫార్సులు చేసే ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి, గవర్నర్‌ల అభిప్రాయాలను తీసుకుంటుంది.
¤ పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రక్షణ, గృహ నిర్మాణం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద చేపట్టే పథకాలకు అవసరమైన భూమిని సేకరించడం కోసం భూసేకరణ చట్టంలో సవరణలకు కేంద్రం రూపొందించిన ఆర్డినెన్సుకి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు.
¤ బ్యాంకింగ్ పాలనా వ్యవస్థలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పదవిని రెండుగా విభజించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చింది.
      » పి.జె.నాయక్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు సీఎండీ పదవిని వేరుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారులను (సీఈవో) నియమించింది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది.
      » ప్రభుత్వం కొత్తగా నియమించిన ఎండీ, సీఈవోలు: ఆర్.కోటీశ్వరన్ (ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్), అనిమేష్ చౌహాన్ (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్), కిషోర్ కుమార్ సాన్సి (విజయ బ్యాంక్), పి.శ్రీనివాస్ (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా).