డిసెంబరు - 2
|
¤ అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఖండాంతర క్షిపణి అగ్ని-4ని 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీవో) ఒడిశాలోని బాలాసోర్ వద్ద విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణికి 4,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. » అగ్ని-4 శ్రేణికి సంబంధించి ఇది నాలుగో పరీక్ష. ఈ క్షిపణిలో అత్యాధునిక మార్గ నిర్దేశక వ్యవస్థలను అయిదోతరం ఆన్‌బోర్డ్ కంప్యూటర్‌లను అమర్చారు. దీని వల్ల సుదూరంలో ఉన్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలుగుతుంది. » సైన్యం అమ్ముల పొదిలో అగ్ని-1, 2, 3; పృథ్వీ క్షిపణులు ఇప్పటికే చేరాయి.
|
డిసెంబరు - 3
|
¤ జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'హయబుస - 2' ప్రయోగం విజయవంతమైంది. » జపాన్ శాస్త్రవేత్తలు సొంతంగా తయారు చేసిన హెచ్ - 2ఏ రాకెట్ 'హయబుస - 2'ను గగనతలంలోకి తీసుకెళ్లింది. ఇది రోదసీలో నాలుగేళ్లు ప్రయాణించి 2018లో '1999 జేయూ3' అనే గ్రహ శకలంపై దిగుతుంది. అక్కడ పేలుడు జరిపి, దీని వల్ల ఏర్పడే గొయ్యి లోంచి గ్రహశకలానికి సంబంధించిన రాళ్లు, ధూళి తదితరాలను సేకరించి 2020లో తిరిగి భూమికి చేరుకుంటుంది. » ఈ రాళ్లు, ధూళి కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తారు. గ్రహశకలాలు సౌర కుటుంబ ఆవిర్భావ సమయంలో ఏర్పడి ఉంటాయని, వాటి శిథిలాలపై పరీక్షలు జరపడం ద్వారా జీవం పుట్టుక రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
|
డిసెంబరు - 5
|
¤ మానవులను అంగారకుడి పైకి సుదూర విశ్వంలోకి తీసుకెళ్లే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఒరియన్ వ్యోమనౌకను విజయవంతంగా పరీక్షించింది. ఇది నిర్దేశిత రీతిలో కక్ష్యలోకి వెళ్లి, తిరిగి భూమిని చేరింది. నలుగురు వ్యోమగాములు ప్రయాణించే వీలున్న ఈ వ్యోమనౌకను ప్రస్తుతానికి మానవ రహిత స్థితిలోనే పరీక్షించారు. » కేప్ కెనావెరాల్‌లోని వైమానిక స్థావరం నుంచి డెల్టా-4 రాకెట్‌తో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. » దాదాపు 554 మైళ్ల ఎత్తులో కక్ష్యలో వ్యోమనౌక పరిభ్రమించి, అక్కడి నుంచి భూమికి సంబంధించిన అద్భుత చిత్రాలను చేరవేసింది. ఆ తర్వాత భూమికి 36వేల మైళ్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో తిరిగింది. అనంతరం తిరిగి భూవాతావరణంలో (రీఎంట్రీ)కి ప్రవేశించి, పారాచూట్ సాయంతో పసిఫిక్ జలాల్లో పడిపోయింది.
|
డిసెంబరు - 6
|
¤ వెనాడియం అనే మూలకం నుంచి తయారు చేసిన నానో తీగలకు మానవ శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడే శక్తి ఉన్నట్లు బెంగళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' (ఐఐఎస్‌సీ)కి చెందిన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. » వార్ధక్యం, గుండె, పలు నాడీ సంబంధ సమస్యలకు వాడే మందుల తయారీలో ఈ పరిశోధనా ఫలితాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. » వెనాడియం అనే మూలకానికి, టైటానియంకు చాలా దగ్గరి పోలికలుంటాయి. దీని నుంచే వెనాడియం ఆక్సైడ్ లేదా వెనాడియా తయారవుతుంది.
|
డిసెంబరు - 7
|
¤ భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-16ను, డైరెక్ట్ టీవీ సంస్థకు చెందిన డైరెక్ట్ టీవీ-14 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. » కక్ష్యలోకి చేరిన జీశాట్-16 నియంత్రణను కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) చేపట్టింది. జీశాట్-16ను ఈ నెల 12న భూమికి 36 వేల కి.మీ. ఎగువన ఉన్న నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేరుస్తుంది. » ఏరియన్ శ్రేణి రాకెట్లకు ఇది 221వ ప్రయోగం. ఇప్పటివరకు ఈ రాకెట్ భారత్‌కు చెందిన 18 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. » జీశాట్-16 బహుళ ప్రయోజనాలను అందించే టెలీకమ్యూనికేషన్ ఉపగ్రహం. భారత ఉపఖండం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఇందులో 48 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇస్రో నిర్మిత కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద సంఖ్య. » జీశాట్-16 తయారీ, ప్రయోగానికి ప్రభుత్వం రూ.865.5 కోట్లను కేటాయించింది. » ఈ ఉపగ్రహం బరువు 3181 కిలోలు. ఇందులో 24 సీబ్యాండ్, 12 కేయూ బ్యాండ్, 12 అప్పర్ ఎక్స్‌టెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. వీటివల్ల ప్రభుత్వ, ప్రైవేటు టీవీ, రేడియో సేవలు మెరుగుపడతాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ కార్యకలాపాలకు కూడా భారీగా ఊతం లభిస్తుంది. » ఇస్రోకు ట్రాన్స్‌పాండర్ల కొరత ఉంది. ప్రస్తుతం ఈ సంస్థకు దాదాపు 180 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. కాని, అవి సరిపోకపోవడంతో విదేశీ ఉపగ్రహాల నుంచి 95 ట్రాన్స్‌పాండర్లను అద్దెకు తీసుకుంది. అందుకే జీశాట్-16 ప్రయోగాన్ని నిర్దేశిత సమయం కంటే ఆరు నెలల ముందే నిర్వహించింది. ఈ ఉపగ్రహం ద్వారా 48 ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోకి రానున్నాయి. » జీశాట్-16 ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. నిర్దేశిత గడువు కంటే ముందే ఏప్రిల్‌లో నిలిచిపోయిన ఇన్‌శాట్-3ఈ ఉపగ్రహం స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది.
|
డిసెంబరు - 9
|
¤ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అధునాతన పినాక మార్క్-2 రాకెట్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. » ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఫ్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్ఈ)లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బ్యారెల్ లాంచర్ సాయంతో దీన్ని చేపట్టారు. » పినాక మార్క్-2 రాకెట్ పరిధి సుమారు 60 కిలోమీటర్లు. » పుణెలోని రక్షణా పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
|
డిసెంబరు - 18
|
¤ అంతరిక్షంలోకి మానవులను పంపే తొలి ప్రయత్నంగా వ్యోమగామి మాడ్యూల్ (క్రూ మాడ్యూల్ అట్మాస్ఫెరిక్ రీఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్ - కేర్) ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. » భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యంత భారీ రాకెట్ జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 దీన్ని మోసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగంతో భారీ సమాచార ఉపగ్రహాలను సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు కూడా మార్గం సుగమమైంది. » దాదాపు 12 ఏళ్లుగా జీఎస్ఎల్‌వీ మార్క్ - 3ని ఇస్రో అభివృద్ధి చేస్తోంది. దీనిలో 200 టన్నుల ఘన ఇంధన రాకెట్ మోటార్లు రెండు, 110 టన్నుల ద్రవ ఇంజిన్ ఉన్నాయి. వీటితోపాటు క్రియారహితంగా ఉండే డమ్మీ క్రయోజెనిక్ ఇంజిన్ కూడా ఉంది. పూర్తిస్థాయి క్రయోజెనిక్ ఇంజిన్ ఇంకా సిద్ధం కాకపోవడం వల్ల ఈ డమ్మీని ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్‌లో ద్రవ ఆక్సిజన్ బదులుగా ద్రవ నైట్రోజన్; ద్రవ హైడ్రోజన్‌కు బదులుగా వాయు నైట్రోజన్‌ను ఉపయోగించారు. ఈ రాకెట్‌ను ఎల్‌వీఎం3 అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ వాహక నౌకలో కేర్‌ను ఉంచారు. ఒక చిన్న పడక గది పరిమాణంలో ఉండే ఈ మాడ్యూల్‌లో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించవచ్చు. రోదసి యాత్ర తర్వాత తిరుగు ప్రయాణంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు (రీఎంట్రీ) రాపిడి కారణంగా తలెత్తే తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలను ఇది తట్టుకోగలదా అనేదాన్ని శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. నిర్దేశించిన రీతిలో ఇది సాగర జలాల్లో క్షేమంగా పడుతుందా అన్నది కూడా తెలుసుకోనున్నారు. » ప్రయోగించిన 5.4 నిమిషాలకు భూమికి 126.15 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా రాకెట్ నుంచి కేర్ మాడ్యూల్ విడిపోయింది. సముద్రమట్టానికి 80 కిలోమీటర్ల ఎత్తులో ఇది భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ క్రమంలో 1600 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతను దీని ఉష్ణ రక్షణ వ్యవస్థ తట్టుకుంది. బాలిస్టిక్ మోడ్‌లో కిందికి దిగింది. దీని వేగాన్ని అదుపు చేసేందుకు పారాచూట్‌లు విచ్చుకున్నాయి. వీటిని డీఆర్‌డీవోకు చెందిన ఏరియల్ డెలివరీ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఆగ్రా) రూపొందించింది. ప్రధాన పారాచూట్ వ్యాసం 31 మీటర్లు. ఇది దేశంలోనే అతిపెద్ద పారాచూట్. ఇది మాడ్యూల్ వేగాన్ని సెకనుకు ఏడు మీటర్లకు తగ్గించింది. మొత్తం మీద ప్రయోగించిన 20 నిమిషాలకు కేర్ అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణం అంచు అయిన ఇందిరా పాయింట్‌కు 180 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో పడింది. » ఈ ప్రయోగం విజయవంతమైనా మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోకు కనీసం మరో పదేళ్లు పడుతుంది. మానవసహిత అంతరిక్ష యాత్రకు భారత ప్రభుత్వం ఇంకా లాంఛనంగా అనుమతి ఇవ్వలేదు. » జీఎస్ఎల్‌వీ మార్క్ - 3లోని పూర్తిస్థాయి క్రయోజెనిక్ ఇంజిన్‌ను తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తున్నారు. » జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 ఎత్తు 43.43 మీటర్లు. బరువు 630.58 టన్నులు. » కేర్ బరువు 3,735 కిలోలు. ఎత్తు 2.7 మీటర్లు. వ్యాసం 3.1 మీటర్లు. వ్యోమగామి గదిని దృఢమైన అల్యూమినియం మిశ్రమంతో తయారు చేశారు.¤ అమెరికా నావికా దళం ఒక స్వతంత్ర జలాంతర డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ అచ్చం షార్క్‌లా ఈదుతూ, అలలు, ప్రవాహాలు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ నావికా దళం మానవరహిత జలాంతర వాహనం (యూయూవీ) ఘోస్ట్ స్విమ్మర్‌పై కూడా పరీక్షలు పూర్తి చేసింది.నావికాదళం పలురకాల కార్యక్రమాలను చేపట్టేందుకు ఘోస్ట్ స్విమ్మర్ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
|
డిసెంబరు - 20
|
¤ అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని చైనా విజయవంతంగా పరీక్షించింది. 12వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధిలోకి అమెరికా మొత్తం రావడం గమనార్హం. ఈ అస్త్రంలో తొలిసారిగా బహుళ వార్‌హెడ్‌లను చైనా ఉపయోగించింది. డీఎఫ్-41 అనే ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పూర్తిస్థాయిలో ఈ నెల 13న పరీక్షించింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.¤ అంతరిక్షంలో దూరతీరాలకు మానవులను చేర్చే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. భూమిపై డిజైన్ చేసిన ఒక హార్డ్‌వేర్ (రాచెటింగ్ సాకెట్ రెంచ్)ను తొలిసారిగా రోదసీలోకి ఇ - మెయిల్ చేశారు. అక్కడున్న త్రీడీ ప్రింటర్ దాన్ని ముద్రించి వ్యోమగాములకు అందించింది. దీనివల్ల సుదూర అంతరిక్ష యాత్రల్లో వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఈ త్రీడీ ప్రింటర్‌ను 'మేడ్ ఇన్ స్పేస్' అనే సంస్థ రూపొందించింది. దీన్ని సెప్టెంబరులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇఎస్ఎస్)కి తరలించారు. » రాచెటింగ్ సాకెట్ రెంచ్ కావాలని అంతరిక్షంలో ఉన్న ఐఎస్ఎస్ కమాండార్ బ్యారీ విల్‌మోర్ కోరడంతో ఇందుకు అనుగుణంగా 'మేడ్ ఇన్ స్పేస్' పరిశోధకులు క్యాడ్ సాయంతో ఈ పరికరాన్ని కంప్యూటర్‌లో డిజైన్ చేశారు. తర్వాత దీన్ని త్రీడీ ప్రింటర్‌కు అనుగుణంగా మార్చి, నాసాకు అందజేశారు. » త్రీడీ ప్రింటర్, ఎడిటివ్ మానుఫ్యాక్చరింగ్ అనే విధానాన్ని ఉపయోగించుకుని తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్లాస్టిక్ ఫిలమెంట్‌ను వేడి చేస్తుంది. యంత్రంలోకి చొప్పించిన డిజైన్ ఫైల్ ఆధారంగా అవసరమైన వస్తువులను పొరలు పొరలుగా ముద్రిస్తుంది.
|
డిసెంబరు - 21
|
¤ 4డి ముద్రణ పరిజ్ఞానంతో రూపును మార్చుకునే త్రీడీ ఆకృతులను అమెరికా శాస్రవేత్తలు సృష్టించారు. దీంతో సులభంగా మెరుగైన వైద్య ఇంప్లాంట్లు, గృహోపకరణాలను తయారు చేయవచ్చు. » ముద్రించాక ఆకృతిని మార్చుకునే త్రీడీ ముద్రిత వస్తువులతో కూడిన 4డీ ప్రింటింగ్‌పై మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన డ్యాన్ రవీవ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాలుపంచుకుంది. ¤ వైకల్యంతో పుట్టిన ఒక శునకానికి త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో అమెరికా పరిశోధకులు కృత్రిమ అవయవాలను రూపొందించి విజయవంతంగా అమర్చారు. ¤ నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు అత్యంత భద్రత నడుమ వ్యోమగామి గది చేరింది. ఈ నెల 18న షార్ నుంచి జీఎస్ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ద్వారా నింగిలోకి మూడు టన్నుల బరువున్న వ్యోమగామి గదిని పంపారు. అదేరోజు శ్రీహరి కోటకు 1600 కిలోమీటర్ల దూరంలో అండమాన్ నికోబార్ సమీపంలో ఇందిరా పాయింట్‌కు 180 కి.మీ. వద్ద వ్యోమగామి గదిని మార్క్-3 బంగళాఖాతంలో విడిచింది. దీన్ని భద్రంగా షార్‌కు తరలించారు. |
డిసెంబరు - 23
|
¤ అత్యంత ఆధునికమైన భారీ తరహా 'అంగారా రాకెట్'ను రష్యా దిగ్విజయంగా ప్రయోగించింది. ఉత్తర రష్యాలోని ప్లీనెట్‌స్క్ నుంచి నిర్వహించిన అంగారా-5ఎ ప్రయోగాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో లింకు ద్వారా వీక్షించారు. |
డిసెంబరు - 24
|
¤ చక్రాలతో కూడిన మానవరహిత గగనతల వాహనం (యూఏవీ)ని తొలిసారిగా గాల్లోకి డీఆర్‌డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 'పంచి' అని పేరు పెట్టారు. » దిల్లీలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహనం దాదాపు 20 నిమిషాల పాటు గాల్లో తిరిగింది.
|
డిసెంబరు - 25
|
¤ సమాంతర హైబ్రిడ్-ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థతో కూడిన తొలి విమానాన్ని బ్రిటన్ విజయవంతంగా పరీక్షించింది. ఇది గాల్లో ఎగురుతుండగానే తన బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోగలదు. » ఈ విమానంలో ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజిన్ కలిసి ప్రొపెల్లర్‌ను పని చేయిస్తాయి. దీన్ని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు బోయింగ్ సహకారంతో విజయవంతంగా పరీక్షించారు. » విమానం నేలమీద నుంచి పైకి లేచేటప్పుడు (ఎత్తుకు చేరుకునేటప్పుడు) పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పని చేస్తాయి. కానీ, విమానం ప్రయాణించే ఎత్తుకు చేరుకున్నాక ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీలు రీఛార్జ్ అయ్యేలా జనరేటర్ రూపంలోకి మారుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాలంలో సరికొత్త సమాచార వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. తదుపరి తరంవారికి అవగాహన పెంచేలా కొత్త వెబ్‌సైట్isro.gov.in ను రూపకల్పన చేశారు. » నాలుగు దశాబ్దాల ఇస్రో చరిత్రలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోతున్న ప్రయోగాలను విపులంగా తెలియజేస్తూ ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. |
డిసెంబరు - 27
|
¤ విశాఖపట్నంలోని నౌకాదళ శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాల (ఎన్ఎస్‌టీఎల్) శాస్త్రవేత్తలు కొత్తగా ఆవిష్కరించిన టార్పిడో వెలికితీత నౌకను గుజరాత్‌లోని బారూచ్ షాప్ట్ ఫిప్‌యార్డులో ప్రారంభించారు. తూర్పు నావికాదళంలో ఈ నౌక విధులు నిర్వహించనుంది. ¤ భారత నౌకాదళం అమ్ముల పొదిలోంచి నీటి పాలైన 'వరుణాస్త్రం' తిరిగి లభ్యమైంది. 'సాగర నిథి' జలాంతర్గామిలోని ఈ వరుణాస్త్రాన్ని నవంబరు 6న విశాఖలోని ఎన్ఎస్‌టీఎల్ నుంచి ప్రయోగిస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. దాన్ని గుర్తించి వెలికితీయడానికి విశాఖ నౌకాదళ అధికారులు చెన్నైలోని జాతీయ సాగర సాంకేతిక సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ - నియట్)ను సంప్రదించారు. రెండు సంస్థల నిపుణులు కలిసి సముద్రంలో 168 మీటర్ల లోతులో ఉన్న ఈ వరుణాస్త్రాన్ని గుర్తించారు. |
డిసెంబరు - 29
|
¤ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్ కోసం కీలకమైన 'సమీకృత జీవన తోడ్పాటు వ్యవస్థ' (ఐఎల్ఎస్ఎస్)ను రక్షణ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీంతో సైనిక విమాన రంగంలో ఈ పరిజ్ఞానంపై పట్టు సాధించిన అయిదు దేశాల సరసన భారత్ చేరింది. » యుద్ధ విమానం ఎక్కువ ఎత్తులో, అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు అందులోని పైలట్లకు మరింత మెరుగైన రక్షణను ఇది కల్పిస్తుంది. విమానం కాక్‌పిట్‌లో ఉన్న అతికొద్ది చోటులోనే అమరేలా దీన్ని రూపొందించారు. ¤ ప్రమాదకరమైన ఎబోలా వైరస్ నుంచి రక్షించే ఒక టీకాను రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని త్వరలోనే ఆఫ్రికాలో పరీక్షించనున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ప్లూయెంజాకు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు. తొలుత దీన్ని జంతువులపై, ఆ తర్వాత మనుషులపై పరీక్షించనున్నారు. » తాము రూపొందించిన ఎబోలా టీకాను ఆఫ్రికా ప్రజలపై ప్రయోగించగా ఔషధం సురక్షితమేనని తేలిందని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) సంస్థ పేర్కొంది. » చైనా పరిశోధకులు కూడా ఒక టీకాను రూపొందించినట్లు ప్రకటించారు. దీన్ని కూడా మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. |
డిసెంబరు - 30
|
¤ కేవలం ఆరు గంటల్లో రక్తంలో ఉన్న వెయ్యి వరకూ వ్యాధికారక సూక్ష్మ జీవులను గుర్తించే సరికొత్త పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. » 'ఇండికా' అనే ఈ వ్యవస్థను లండన్‌లోని అబాట్ సంస్థకు చెందిన ఇబిస్ బయో సైన్సెస్ రూపొందించింది. ఇది రక్తం లేదా కణజాలం లాంటి నమూనాల నుంచి నేరుగా వ్యాధులను గుర్తించగలదు. |
|
|