జనవరి - 2015 అంతర్జాతీయం




జనవరి - 3 
¤ చైనాలోని 'త్రీ గోర్జెస్ విద్యుత్ కర్మాగారం' 2014లో 98.8 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. బ్రెజిల్‌ లోని ఇటాయిపు జలవిద్యుత్ కర్మాగారం నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించింది. 2013లో బ్రెజిల్‌ ప్రాజెక్టు 98.6 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.      » స్థాపన సామర్థ్యం అంశంలో 'త్రీ గోర్జెస్' ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ కర్మాగారం. దీని స్థాపక సామర్థ్యం 22.5 మిలియన్ కిలోవాట్లు కాగా, బ్రెజిల్‌ప్రాజెక్టు సామర్థ్యం 14 మిలియన్ కిలోవాట్లు.      » యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ ప్రాజెక్టు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు వరదలను నియంత్రిస్తుంది. నౌకాయానానికి వీలు కల్పిస్తుంది.¤ నైజీరియాలోని బొకోహారమ్ తీవ్రవాదులు దేశ ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రంలో మారుమూల గ్రామం మలారీపై దాడిచేసి 40 మంది బాలలను అపహరించారు.¤ సోనీ పిక్చర్స్‌పై సైబర్ దాడికి వ్యతిరేకంగా ఉత్తర కొరియాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది.
జనవరి - 7  

¤ ఫ్రాన్స్‌కు చెందిన వ్యంగ్య రచనల వారపత్రిక 'ఛార్లీ హెబ్డో
' కార్యాలయంపై కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పత్రిక ప్రధాన సంపాదకుడు స్టీఫెన్ ఛార్బోనైర్; వ్యంగ్య చిత్రకారులు కాబు, టిగ్నస్, వోలిన్ స్కీ; ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం.      » మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు 2006లో ఈ పత్రికపై విమర్శలు వెల్లువెత్తాయి. 2011లోనూ ఇలాంటి ప్రచురణ చేసినందుకు పత్రికపై దాడులు జరిగాయి. కోర్టు కేసులు దాఖలైన తర్వాత కూడా ఇలాంటివి మరికొన్ని సార్లు జరిగాయి. ఈ క్రమంలో తాజా దాడి చోటు చేసుకుంది.      » ఫ్రాన్స్‌ను సమీప భవిష్యత్తులో ఇస్లామిక్ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పే ఊహాచిత్రంతో కూడిన ముఖ పత్రంతో పత్రిక తాజా సంచిక వెలువడిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
¤ యెమెన్ రాజధాని సానాలో పోలీసు కళాశాల వెలుపల జరిగిన కారు బాంబు పేలుడులో 37 మంది ప్రాణాలు కోల్పోగా, 66 మంది గాయపడ్డారు.
 
జనవరి - 8
¤ నైజీరియాలో బొకోహరామ్ ఉగ్రవాదులు మరోసారి హత్యాకాండకు తెగబడ్డారు. ఈశాన్య ప్రాంతంలో ఉన్న బాగా, డొరొన్ బాగా, మైల్ తదితర పట్టణాల్లో 100 మందికి పైగా పౌరులను ఊచకోత కోశారు. 16 గ్రామాలను, పట్టణాలను నేల మట్టం చేశారు.
¤ శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా భారీగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది
.
      » రెండుసార్లు అధ్యక్ష పదవిని చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు మహీంద రాజపక్సే మూడోసారి కూడా ఆ పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్ష పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆయన ముందస్తు ఎన్నికలు చేపట్టారు
.
      » దేశ వ్యాప్తంగా మొత్తం 1076 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది బరిలో నిలిచారు. వారిలో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సే, విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన మధ్య గట్టి పోటీ నెలకొంది.
జనవరి - 9 
¤ పశ్చిమాసియా, ఆఫ్రికాలో యుద్ధం, హింసాత్మక ఘటనల ఫలితంగా 2014 ప్రథమార్ధంలో రెండు లక్షల మందికి పైగా శరణార్థులు భారతదేశం వచ్చారని ఐరాస శరణార్థి సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది.     » ప్రపంచవ్యాప్తంగా 55 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టారని ఆ సంస్థ వివరించింది. వీరిలో 14 లక్షల మంది అంతర్జాతీయ సరిహద్దులు దాటారని, మిగిలినవారు స్వదేశంలోని వేరే ప్రాంతాలకు మారారని పేర్కొంది.¤ పాకిస్థాన్ చట్టసభ సభ్యుల్లో ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యంత ధనవంతుడిగా పేరొందారు. లక్షలాది మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవించే పాకిస్థాన్‌లో రూ.230 కోట్లకు పైగా నికర ఆస్తులతో ఆయన చట్టసభ సభ్యులందరి కంటే అగ్రస్థానంలో నిలిచారు.     » పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ)కి షరీఫ్ సమర్పించిన వివరాల ప్రకారం
2014 - 15కు సంబంధించి తన, తన భార్య పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.171 కోట్ల నుంచి రూ.236 కోట్లకు పెరిగినట్లు ప్రకటించారు.
¤ శ్రీలంక చరిత్రలోనే అత్యంత పోటాపోటీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.     » వరుసగా మూడోసారి తనదే విజయం అన్న ధీమాతో రెండేళ్లకు ముందే ఎన్నికలకు వెళ్లిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సేకు ఓటర్లు దిగ్భ్రాంతికర తీర్పునిచ్చారు. పదేళ్ల రాజపక్సే పాలనకు ముగింపు పలికారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రీపాల సిరిసేనకు పట్టం కట్టారు.     » సిరిసేనకు 62,17,162 ఓట్లు (మొత్తంలో 51.2 శాతం) లభించగా, రాజపక్సేకు 57,68,090 ఓట్లు (47.6 శాతం) వచ్చాయి.     » శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రీపాల సిరిసేన ఎన్నికైనట్లు ఎన్నికల కమిషనర్ మహింద దేశప్రియ ప్రకటించారు.     » 63 ఏళ్ల మైత్రీపాల సిరిసేన కొత్త అధ్యక్షుడిగా, రణిల్ విక్రమ సింఘే ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకూ సింఘే ప్రతిపక్షనేతగా ఉన్నారు.     » 69 ఏళ్ల రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వెలువడటంలో దేశంలోని మైనార్టీలైన తమిళులు, ముస్లింలు కీలక పాత్ర పోషించారు. వారు సిరిసేనకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. 2009లో ఎల్‌టీటీఈతో జరిగిన యుద్ధం చివరి దశలో తమిళులపై శ్రీలంక సైన్యం దారుణమైన అకృత్యాలకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఎల్‌టీటీఈని పూర్తిగా అణిచివేసిన అనంతర కాలంలో తమిళులకు రాజకీయ అధికారాన్ని బదిలీ చేస్తానని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేస్తానని రాజపక్సే హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై తమిళుల్లో తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. ఎల్‌టీటీఈ నిర్మూలన తర్వాత శ్రీలంకలో ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వారు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎల్‌టీటీఈపై సైనిక విజయం సాధించిన తర్వాత పెరిగిన ప్రతిష్ఠను అడ్డుపెట్టుకుని రాజపక్సే ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం, ముఖ్యమైన పదవుల్లో తన బంధువులను నియమించి కుటుంబ పాలనకు తెరతీయడం, అవినీతి పెరిగిపోవడం లాంటి కారణాలు కూడా పార్టీలో, ప్రజల్లో ఆయనకు వ్యతిరేకతను పెంచాయి. దేశ అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలన్న రాజ్యాంగ నిబంధనను సవరించి, మూడోసారి ఎన్నిక కావడానికి రాజపక్సే చేసిన ప్రయత్నం కూడా ఈ వ్యతిరేకతను మరింత పెంచింది.¤ ఎన్నికల్లో విజయం సాధించిన సిరిసేన వాస్తవానికి ఎన్నికల ముందటి వరకు రాజపక్సే అనుచరుడిగానే ఉన్నారు. ప్రభుత్వంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వైదొలగిన ఆయనకు ప్రతిపక్షం యునైటెడ్ నేషనల్ పార్టీ మద్దతు పలికింది. బౌద్ధుల జాతీయ పార్టీ; తమిళుల, ముస్లింల పార్టీలతోపాటు, అధికార పార్టీని వీడిన పలువురు ఎంపీలు, నేతలు సైతం సిరిసేన వెంట నడిచారు.¤ 1951 సెప్టెంబరు 3న సాధారణ రైతు కుటుంబంలో సిరిసేన జన్మించారు. గ్రామీణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సిరిసేనది తొలి నుంచి సాధారణ జీవితమే. ఎప్పుడూ సంప్రదాయ వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆంగ్లంలో మాట్లాడరు. బౌద్ధమతాన్ని బలంగా విశ్వసిస్తారు.¤ ఫ్రాన్స్‌లో ఛార్లీహెబ్డో పత్రిక కార్యాలయం మీద దాడి చేసి 12 మందిని ఊచకోత కోశారని అనుమానిస్తున్న సోదరులు చెరీష్ కోవాచీ, సయద్ కోవాచీలను ప్యారిస్ పోలీసులు హతమార్చారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఈ సోదరులు ఒక మహిళ కారును అపహరించి రెండు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారు. వారిని వెంబడించిన పోలీసులు వారి వద్ద బందీగా ఉన్న మహిళను విడిపించి వారిని హతమార్చారు. 
జనవరి - 10 
¤ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బొకోహరమ్ చరిత్రలో అత్యంత దారుణ నరమేధం నమోదైనట్లు 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ' పేర్కొంది.     » నైజీరియాలోని బమా పట్టణంలో చెలరేగిన హింసలో బొకోహరమ్ దాడుల్లో 2 వేల మంది మృతి చెందినట్లు పలు కథనాలు వెలువడినట్లు ఆమ్నెస్టీ నివేదిక తెలిపింది.
¤ నైజీరియా ఈశాన్య నగరం మైదుగురిలోని మార్కెట్‌లో ఓ బాలిక ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 19 మంది మరణించారు.
¤ శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేన భారత్‌తో సుహృద్భావ చర్యల్లో భాగంగా తమ దేశ ఆధీనంలో ఉన్న భారత జాలర్లందరినీ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
     » మైత్రీపాల సిరిసేన తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా వచ్చేనెల (ఫిబ్రవరి)లో భారత్‌ను సందర్శించాలని నిర్ణయించారు.
¤ ఫ్రాన్స్‌లో ఎలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా నివారించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారీఎత్తున భద్రతా దళాలను మోహరించింది.
 
జనవరి - 11 

¤ ఇటీవల ప్యారిస్‌లో జరిగిన దాడులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ నగరంలో ఐక్యత, భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్ధతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
     » ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేస్తూ దాదాపు 10 లక్షల మంది, 40 దేశాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
     » ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహు, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
¤ పాకిస్థాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న చమురు ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ఘటనలో 62 మంది మృతి చెందారు.
¤ కలుషిత పానీయం తాగి 52 మంది మరణించిన సంఘటన మొజాంబిక్ లోని టెటె ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఓ దహన సంస్కారంలో పాల్గొన్న అనంతరం పోంబేఅనే సంప్రదాయ పానీయం తాగినవారిలో 52 మంది మరణించారు.
జనవరి - 12 

¤ పాకిస్థాన్‌లో ఉగ్రవాద దాడికి గురైన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) పునఃప్రారంభమైంది.
     » 2014 డిసెంబరు 16న తాలిబన్ మిలిటెంట్లు ఏపీఎస్‌పై దాడిచేసి 134 మంది విద్యార్థులతో సహా 150 మందిని దారుణంగా చంపేశారు.
¤ ఇటీవల జావా సముద్ర జలాల్లో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను కనుక్కున్నారు.
జనవరి - 13
¤ పాకిస్థాన్ తాలిబన్ అధినేత మౌలానా ఫజలుల్లాను ప్రపంచ తీవ్రవాదిగా అమెరికా ప్రకటించింది. అతడిపై ఆంక్షలు విధించింది.
జనవరి - 14 
¤ ఫ్రాన్స్ వ్యంగ్య పత్రిక చార్లీహెబ్డో తిరిగి ప్రారంభమైంది. ఉగ్రవాద దాడులను ఏ మాత్రం లెక్క చేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను ప్రజలు ఆదరించారు. సాధారణంగా తాము ముద్రించే 60 వేల కాపీలను ఈసారి 30 లక్షలకు పెంచి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది.     » ఉగ్రవాద దాడులకు ఏ మాత్రం భయపడకుండా తాజా సంచికలోనూ మహమ్మద్ ప్రవక్త చిత్రాన్ని కవర్ పేజీపై ముద్రించారు. మహమ్మద్ ప్రవక్త తనను తాను 'నేను చార్లీ' అని పేర్కొంటూ 'అందర్నీ క్షమించా' అని సంతకం చేస్తూ కంటతడి పెడుతున్న చిత్రాన్ని కవర్ పేజీపై ముద్రించారు. 
జనవరి - 16 
¤ శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ఇటీవల ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన మహింద రాజపక్సే శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్ఎఫ్‌పీ) పగ్గాలను దేశ నూతన అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనకు అప్పగించారు.     » శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సిరిసేన గతంలో రాజపక్సే ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు.¤ బ్రిటన్ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రవాసీయులుగా భారత సంతతికి చెందినవారు నిలిచారు. వారి సంఖ్య 2013లో 7,34,000కు చేరుకుందని జాతీయ గణాంక విభాగ కార్యాలయం తాజాగా ప్రకటించిన వివరాల్లో వెల్లడైంది.     » బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 2004లో 2,32,000 ఉండగా, 2013 నాటికి 7 లక్షలు దాటింది.     » దీంతో ఇప్పటివరకూ బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యాక ప్రవాసీయులుగా ఐర్లాండ్ జాతీయుల పేరిట ఉన్న రికార్డు భారతీయ సంతతి వ్యక్తుల సొంతమైంది.¤ ప్యారిస్‌కు చెందిన వ్యంగ్య వారపత్రిక 'చార్లీహెబ్డో'కు వ్యతిరేకంగా పాకిస్థాన్, కువైట్‌లలో నిరసనలు చెలరేగాయి.     » వివాదాస్పదమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను పునఃముద్రించడాన్ని నిరసిస్తూ ఈ నిరసనలు చెలరేగాయి.¤ భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త శామ్ మల్హోత్ర అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర క్యాబినెట్‌లో మానవ వనరుల విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రంలో ఈ పదవికి భారతీయ అమెరికన్‌ను నియమించడం ఇదే ప్రథమం.     » భారతీయ అమెరికన్ శామ్‌సింగ్ మొదటిసారిగా మిచిగాన్ రాష్ట్ర డెమోక్రటిక్ ఫ్లోర్ లీడర్‌గా నియమితులయ్యారు. ఆయన గతంలో రెండుసార్లు మిచిగాన్ శాసనసభకు ఎన్నికయ్యారు.
జనవరి - 17

¤ పాకిస్థాన్‌లోని ఖుషాబ్ అణు కేంద్రంలో నాలుగో భారజల రియాక్టర్ ప్రారంభమైంది. దీనివల్ల ఆ దేశానికి ప్లుటోనియం ఆధారంగా పనిచేసే చిన్నస్థాయి అణ్వాయుధాలను భారీ సంఖ్యలో తయారు చేయడానికి వీలవుతోంది.
     » ఆయుధ గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తిని పెంచడానికే ఈ రియాక్టర్‌ను రూపొందించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
జనవరి - 18

¤ క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ సందేశ కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫిలిప్పీన్స్  రాజధాని మనీలాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 60 లక్షల మంది ప్రజలు హాజరై ఉంటారని పోలీసులు అంచనా వేశారు. ఇది గతంలో 1995లో ఇదే ప్రాంతంలో పోప్ జాన్ పాల్-II కార్యక్రమం సందర్భంగా నమోదైన రికార్డును అధిగమించింది.
జనవరి - 19
¤ భారతీయ ఆహార పదార్థాలకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. భారతీయులు అమితంగా ఇష్టపడే 'కీమా', 'పాపడ్‌'లకు ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో చోటు దక్కింది.
     » కోల్‌కతాలో విడుదల చేసిన 'ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్‌డ్ లెర్నర్స్ డిక్షనరీ' తొమ్మిదో సంచికలో ఈ రెండు పదాలకు తొలిసారిగా స్థానం లభించింది. అంతేకాకుండా భారతీయ ఇంగ్లిష్ నుంచి మరో 240 పదాలను ఈ సంచికలో పొందుపరిచారు. ఈ నిఘంటువులో చోటు దక్కించుకున్న పదాల్లో ఎక్కువ భాగం భారతీయ వంటిళ్లలో నిత్యం వినిపించేవే కావడం విశేషం. వీటిలో కీమా (చాలా చిన్నస్థాయిలో కోసిన మాంసం), పాపడ్ (అప్పడాలు), కర్రీలీఫ్ (కరివేపాకు) తదితర పదాలున్నాయి.
జనవరి - 20
¤ భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడి పళ్లపై ఏడు నెలలుగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యూరోపియన్ యూనియన్ (ఇ.యు.) నిర్ణయించింది.
     » మామిడి మొక్కల సంరక్షణ సహా వివిధ అంశాల్లో గణనీయమైన పురోగతిని భారత్ సాధించిన దృష్ట్యా ఇకపై నిషేధం అవసరం లేదని ఇ.యు. భావించింది
.
     » మామిడిపళ్లపై పురుగుమందుల అవక్షేపాల దృష్ట్యా 2014 మే ఒకటో తేదీ నుంచి 2015 డిసెంబరు వరకు నిషేధం విధిస్తున్నట్లు ఇ.యు. గతంలో ప్రకటించింది
.
     » భారత్ నుంచి ఎగుమతి అయ్యే పళ్లు, కూరగాయల్లో 50 శాతం ఒక్క ఇ.యు. దేశాలకే వెళ్తున్నాయి. భారత్‌లో ఏటా 15-16 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 వేల టన్నుల్ని ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తోంది. 2013-14లో రూ.304 కోట్ల విలువైన మామిడిని భారత్ ఎగుమతి చేసింది.
జనవరి - 22
¤ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో జంతువుల కోసం విమానాశ్రయంలో టెర్మినల్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 'ఆర్క్' అనే పేరు కూడా పెట్టారు. ఇది పూర్తయితే ఏడాదికి 70 వేల జంతువులను రవాణా చేయడానికి వీలవుతుంది.
     » దీన్ని న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో 14.4 ఎకరాల్లో నిర్మించనున్నారు
.
     » ప్రముఖ స్థిరాస్థి వ్యాపార సంస్థ రేస్ బ్రూక్ క్యాపిటల్ నిర్మించనున్న ఈ టెర్మినల్ ద్వారా పక్షులు, గుర్రాలు, పశువులు, భారీ పరిమాణంలో ఉన్న జంతువులను తరలిస్తారు. ఈ టెర్మినల్ 2016లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది
.
¤ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపడుతున్న జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్ పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది
.
     » జమాత్ ఉద్ దవా, ఫలహ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్, హక్కానీ నెట్ వర్క్, హర్కత్-ఉల్-జిహాద్ ఇస్లామీ, హర్కత్-ఉల్-ముజాహిదీన్, ఉమ్మహ్ తమీర్-ఈ-నయి, రహత్ లిమిటెడ్, అల్-అఖ్తర్ ట్రస్ట్, అల్-రషీద్ ట్రస్ట్, హజీ కయిరుల్లాహ్ హజీసత్తార్ మనీ ఎక్స్ఛేంజ్ లపై నిషేధం విధించింది.
జనవరి - 23 
¤ ముంబయి దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా (జేయూడీ)ని నిషేధించలేదని, కొన్ని చర్యలు తీసుకున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.¤ జేయూడీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా 2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ తర్వాత జేయూడీ బ్యాంకు ఖాతాల స్తంభన, ఆయుధాలపై ఆంక్షలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం లాంటి చర్యలు చేపట్టామని, నిషేధం మాత్రం విధించలేదని ప్రకటించింది.
జనవరి - 26
¤ 1971 - 2011 సంవత్సరాల మధ్య లండన్‌లో స్థిరపడిన విదేశీయుల జనాభా గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. మధ్య ప్రాచ్యం, ఆసియాల్లో పుట్టినవారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. ఇందులో భారతీయుల సంఖ్య లక్షా 55 వేలుగా ఉంది. ఇక్కడ స్థిరపడిన విదేశీయుల్లో ఆఫ్రికన్ల జనాభా కూడా ఎక్కువే. ఆఫ్రికాలో జన్మించి ఇక్కడికి వచ్చినవారి సంఖ్య ఒకప్పుడు 90 వేలు ఉండగా, ఇప్పుడది 6 లక్షల 20 వేలకు చేరింది. నైజీరియన్ల సంఖ్య లక్షకు పెరిగినట్లు 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది.
జనవరి - 27 
¤ లిబియా రాజధాని ట్రిపోలీలో ఓ హోటల్‌పై సాయుధులు జరిపిన దాడిలో 9 మంది మృతి చెందారు. ట్రిపోలీలో విదేశీయులు ఎక్కువగా బస చేసే ప్రముఖ హోటల్ కోరింథియాపై ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన వారిలోనూ ముగ్గురు హతమయ్యారు.     » ఇదే హోటల్‌పై 2013 లోనూ దాడి జరిగింది.¤ మంచు తుపాను కారణంగా అమెరికాలో జనజీవనం అస్తవ్యస్థమైంది. 
జనవరి - 28 
¤ శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే హయాంలో పదవీచ్యుతురాలైన శ్రీలంక తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి షిరానీ బండారు నాయకేను ఆ దేశాధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల పునర్నియమించారు.     » ఆమెను తొలగించిన పద్ధతి అక్రమమని, షిరానీని పునర్నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
జనవరి - 29 
¤ వైట్ హౌస్‌లోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శిరస్సును ఛేదిస్తామని ఇస్లామిక్ తీవ్రవాదులు (ఐఎస్) హెచ్చరించారు. అమెరికాను మరో ముస్లిం దేశంగా మారుస్తామంటూ వీడియోను రూపొందించి అంతర్జాలంలో పెట్టారు.
జనవరి - 30 
¤ ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 27 మంది సైనికులు, ముగ్గురు పౌరులు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
¤ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికర్‌పూర్‌లో తీవ్రవాదులు ఒక మసీదులో బాంబు పేలుడుకు పాల్పడిన ఘటనలో 61 మంది దుర్మరణం చెందారు
.
     » దీనికి తామే బాధ్యులమని జండుల్లా తీవ్రవాద సంస్థ ప్రకటించింది
.
¤ విద్యార్థులపై పాశ్చాత్య భావనల ప్రభావం ఉండకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం ఆ దేశ యూనివర్సిటీల్లో పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం విధించింది
.
     » కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని నిందించే విధంగా ఉండే ఏ పుస్తకమూ యూనివర్సిటీల్లో కనిపించకూడదని ప్రభుత్వం ఆదేశించింది
.
     » చైనాలో యూనివర్సిటీలు అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలో నడుస్తాయి. చరిత్ర, పార్టీ అధికారానికి ముప్పు తెచ్చే ఇతర సున్నితమైన అంశాలను ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే విశ్వవిద్యాలయాల్లో చర్చించాల్సి ఉంటుంది.
జనవరి - 31 
¤ భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ సిల్క్ మార్గంపై ముందుకు వెళ్తున్న చైనా, ఆ ప్రాజెక్టుపై మిగిలిన దేశాల్లో అపనమ్మకాలు నెలకొన్నాయని అంగీకరించి, వాటిని తొలగిస్తామని పేర్కొంది.     » నూతన సిల్క్ మార్గ ప్రాజెక్టులో చైనాను మధ్య ఆసియా ద్వారా యూరప్‌తో కలిపే పురాతన మార్గం కూడా ఉంది.     » బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్ చైనా, పాకిస్థాన్‌లను పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ద్వారా కలుపుతుంది. సముద్ర సిల్క్ మార్గం (ఎంఎస్ఆర్) చైనాను పలు నౌకాశ్రయాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులను కేటాయించారు.¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన విజయవంతమైన నేపథ్యంలో శ్వేతసౌధం (వైట్ హౌస్ - అమెరికా పార్లమెంట్ భవనం) జనవరి 23 నుంచి జనవరి 29 వరకు 'నమస్తే ఒబామా' వారంగా అభివర్ణించింది.     » భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరై చరిత్ర సృష్టించారని పేర్కొంది. అందుకు సంబంధించి అయిదు నిమిషాల నిడివి ఉన్న వీడియోను శ్వేతసౌధం బ్లాగులో పెట్టారు. భారత ప్రజలకు ఒబామా నమస్తే చెబుతున్న వీడియోను అందులో ఉంచారు.¤ ఇటలీ పన్నెండో అధ్యక్షుడిగా సెరిగో మట్టరెళ్ల (73 సంవత్సరాలు) ఎన్నికయ్యారు.     » ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెరిగో మట్టరెళ్ల ఎన్నికయ్యారు.     » మొత్తం 1009 ఓట్లకు 665 ఓట్లు గెలిచారు.     » సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుడి హత్యానంతరం ఆయన క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లో ప్రవేశించారు. 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment