జనవరి - 1
|
¤ ప్రణాళిక సంఘం పేరు 'నీతి ఆయోగ్'గా మారింది. » 'భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ' (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా - ఎన్ఐటీఐ) సంక్షిప్త రూపమే నీతి. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు.నీతి ఆయోగ్ సమగ్ర స్వరూపంనీతి ఆయోగ్ అధ్యక్షుడు: ప్రధాన మంత్రి ఒక ఉపాధ్యక్షుడు, సీఈవో ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. అయిదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షికకాల సభ్యులు ఉంటారు. ఈ ఇద్దరినీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి తీసుకుంటారు. నలుగురు కేంద్రమంత్రులు తమ పదవిరీత్యా దీనిలో సభ్యులవుతారు. నీతి ఆయోగ్ కింద కొన్ని ప్రాంతీయ మండళ్లు ఏర్పాటవుతాయి. కొన్ని రాష్ట్రాలకు లేదా ఒక ప్రాంత నిర్దుష్ట అంశాలను ఇవి చూస్తాయి. ఆయా ప్రాంతాల సీఎంలు, గవర్నర్లు దీనిలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు లేదా ఆయన నియమించిన వ్యక్తిగానీ ఈ మండళ్ల అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తారు. సమర్థ పాలన కోసం మంచి ఆలోచనలను ఇవ్వడానికి సంస్థ కృషి చేస్తుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు విధానాలు వెళ్లే ప్రణాళిక సంఘం స్థానంలో రాష్ట్రాలకు నిజమైన, నిరంతర భాగస్వామ్యం కల్పించడం కొత్త వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.లక్ష్యాలు - విధులు 'బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం' అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను ఈ సంస్థ సమకూరుస్తుంది. ఆర్థికాంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు చేస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతుంది. వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలు ఉండేలా చూస్తుంది. ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం లాంటివి దీని లక్ష్యాల్లో ఉన్నాయి. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1950 మార్చి 15న ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘాన్ని అకస్మాత్తుగా రద్దు చేయడంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అభ్యంతరం వ్యక్తం చేశారు.¤ అనుమానిత ప్రయాణికులను, అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 'అధునాతన ప్రయాణికుల సమాచార వ్యవస్థ - ఏపీఐఎస్'ను ప్రారంభించారు. ఇది ప్రయాణికులు, సిబ్బంది, దేశంలోకి వచ్చే ఇతర విమాన సంస్థల సిబ్బందికి సంబంధించిన సమాచారనిధిగా ఉపయోగపడుతుంది. ¤ దేశ రాజధానిలో మహిళల భద్రత కోసం దిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన 'హిమ్మత్' మొబైల్ యాప్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఆండ్రాయిడ్‌తో నడిచే స్మార్ట్ ఫోన్లు ఉన్న మహిళలెవరైనా ఈ యాప్ ద్వారా పోలీసుల సహాయాన్ని కోరవచ్చు. ఈ యాప్ పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానమై ఉంటుంది.
|
జనవరి - 2
|
¤ ఉపాధిహామీ పథకం నిధులతో బంజరు భూములు, అంతరించిపోతున్న అటవీ ప్రాంతాల్లో నూనెగింజల చెట్లను పెంచేందుకు కేంద్రం అనుమతించింది. » కేంద్రం ప్రకటించిన 11 నూనెగింజల చెట్లలో వేప, కానుగ, ఆలివ్, సిమోర్బా, మహువా, చేవురా, కోకుం, జజోభా, తుంగ, వైల్డ్ ఆప్రికాట్, కరంజలు ఉన్నాయి.
|
జనవరి - 3
|
¤ చలామణి నుంచి అదృశ్యమైన ఒక రూపాయి నోట్ల ముద్రణను జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పున: ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో మార్కెట్లోకి ఇవి రాబోతున్నాయి. » దాదాపు 20 సంవత్సరాల క్రితం రూ.1, రూ.2, రూ.5 నాణేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి నోట్ల ముద్రణను నిలిపేశారు. నవంబరు 1994 లో ఒక రూపాయి నోటు, 1995 ఫిబ్రవరిలో రెండు రూపాయల నోటు, అదే ఏడాది నవంబరులో అయిదు రూపాయల నోటు ముద్రణను ఆపేశారు. కొద్దికాలం తర్వాత అయిదు రూపాయల నోటు ముద్రణను పునః ప్రారంభించారు. » ఒక రూపాయి నోట్లపై ప్రస్తుత ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకం ఉంటుంది. నోటు ముందు భాగంలో 'భారత సర్కార్' అని ఉంటుంది. అంటే భారత ప్రభుత్వం అని అర్ధం. ఈ నోటు రంగు మిగిలిన వాటికంటే వేరుగా ఉంటుంది.¤ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిర్వహించిన మరాఠీ వార్తాపత్రిక 'పుథారీ' 75వ వార్షికోత్సవ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. » ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నరు సీహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.¤ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. గతంలో 'ధూమ్ 3' చిత్రంతో దేశవ్యాప్తంగా రూ.271.82 కోట్లు వసూళ్లు సాధించి బాలీవుడ్ టాప్‌గా నిలిచిన అమీర్ ఇప్పుడు 'పీకే'తో ఆ రికార్డు చెరిపేశాడు. ఆయన నటించిన 'పీకే' చిత్రం రూ.285.37 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. » ఈ రెండు చిత్రాల తర్వాత సల్మాన్ ఖాన్ 'కిక్' (రూ.244 కోట్లు), షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' (రూ.228 కోట్లు) ఉన్నాయి.
|
జనవరి - 5
|
¤ ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించారు. డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటింగ్, ఎల్ఈడీ ఆధారిత గృహ, వీధి దీపాల జాతీయ కార్యక్రమం కింద ఈ పథకాన్ని ప్రారంభించారు. » దేశంలోని 100 నగరాల్లో గృహ, వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అందించే ప్రాజెక్టు 2016 మార్చి నాటికి పూర్తవుతుంది. » దిల్లీలో గృహ వినియోగదారుల వద్ద ప్రారంభంలో రూ.10 చొప్పున వసూలు చేసి ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.10 చొప్పున బిల్లులో వసూలు చేస్తారు. అంటే బల్బు మొత్తం విలువ రూ.130. ఏక మొత్తంలో కొనుగోలు చేస్తున్నందుకు ఈ ధరకు వస్తోంది. బయట మార్కెట్లో చిల్లర ధర రూ.350 - రూ.600 వరకు ఉంటుంది. మూడేళ్ల వారెంటీ ఇస్తారు.¤ ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన 'నీతి ఆయోగ్'కు తొలి వైస్ ఛైర్మన్‌గా భారతీయ అమెరికన్, ప్రముఖ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థికవేత్త అరవింద్ పనగరియా (62)ను ప్రధాని మోదీ నియమించారు. ఆరుగురు సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రధాని నియమించారు. » ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్, డీఆర్‌డీవో మాజీ అధిపతి వి.కె.సారస్వత్ పూర్తికాల సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, సురేష్ ప్రభు, రాధామోహన్ సింగ్ లను ఎక్స్ అఫీషియో సభ్యులుగా; నితిన్ గడ్కరీ, స్మృతీ జుబిన్ ఇరానీ, థావర్ చంద్ గెహ్లాట్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. » నీతి ఆయోగ్‌కు ప్రధాని ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. » పనగరియా అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యులు. అంతకు ముందు ఆయన ఆసియాన్ అభివృద్ధి బ్యాంకు (ఏడిబీ) ప్రధాన ఆర్థికవేత్తగా, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రకేంద్రం ఆచార్యులుగా, కో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన ఆయన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. » గుజరాత్ నమూనా అభివృద్ధికి పనగరియా మద్దతుదారు. మరో ప్రముఖ ఆర్థికవేత్త జగదీష్ భగవతితో కలిసి ఆయన 'వై గ్రోత్ మ్యాటర్స్' సహా 15 పుస్తకాలు రాశారు. రాజస్థాన్‌లోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో కార్మిక సంస్కరణలకు మద్దతుదారుగా ఉన్నారు.¤ ప్రయాణికుల రద్దీ నేపథ్యలో కోల్‌కత - ఢాకా కంటోన్మెంట్‌ల మధ్య ప్రస్తుతం వారంలో రెండు రోజులపాటు నడుస్తున్న మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను మరో రోజు అదనంగా నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. » జనవరి 4 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ రైలు కోల్‌కత నుంచి మంగళ, శని వారాల్లో ఢాకాకు బయలు దేరగా, తాజా నిర్ణయంతో ఆదివారం కూడా ఈ ప్రయాణం ఉంటుంది. » తిరుగు ప్రయాణంలో సోమ, బుధ, శుక్ర వారాల్లో ఢాకా నుంచి బయలుదేరి కోల్‌కతాకు చేరుకుంటుంది. » 2015 జూన్ 29 వరకు ప్రయాణికులకు ఈ సేవలను భారతీయ రైల్వే అందించనుంది. తర్వాత బంగ్లాదేశ్ రైల్వే ఈ బాధ్యతలు చేపడుతుంది.¤ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరిట ఆ రాష్ట్రంలో మరో ప్రజాకర్షక పథకం కింద 'అమ్మ సిమెంట్' పథకాన్ని తిరుచిరాపల్లిలో ప్రారంభించారు. » ఈ పథకం ద్వారా 50 కేజీల సిమెంటు బ్యాగును రూ.199 సబ్సిడీ ధరకు అందిస్తారు. » ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 50 కేజీల సిమెంటు బ్యాగు ధర దాదాపు రూ.400గా ఉంది.
|
జనవరి - 7
|
¤ గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో 13వ ప్రవాసీ భారతీయ దివస్
కార్యక్రమాలను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రారంభించారు. మహాత్మాగాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. ¤ దేశ రాజధాని దిల్లీలోని రహదారులలపై ఎలక్ట్రిక్ రిక్షాలు రాకపోకలు సాగించడానికి మార్గం సుగమమైంది. ఈమేరకు మోటారు వాహనాల చట్టం సవరణకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్డినెన్స్ జారీ చేశారు. ¤ 'భారత తపాలా వ్యవస్థ సద్వినియోగం'పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందం తన నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేసింది. » తపాలా వ్యవస్థ సద్వినియోగం, వస్తుసేవల సరఫరా తరహాలో ఆర్థికవ్యవస్థలో పాత్ర కల్పించడంపై ప్రధాని మోదీ గతేడాది ఈ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు. |
జనవరి - 8
|
¤ 13వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రధాని మోదీ గాంధీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4 వేల మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ ప్రవాసులు దేశానికి గొప్ప సంపద అని ప్రధాని అన్నారు. » గయానా అధ్యక్షుడు డొనాల్డ్ ఆర్ రామోతర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. » మహాత్మాగాంధీ జీవితం, ఆయన కృషికి సంబంధించిన అంశాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల 'దండి కుటీర్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. » మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ రూ.10, రూ.100 నాణేలను ; రూ.5, రూ.25 విలువ చేసే తపాలా బిళ్లలను విడుదల చేశారు. నాణేలు, తపాలా బిళ్లలపై రెండు విభిన్నమైన గాంధీ బొమ్మలను ముద్రించారు. ఒకటి యువ న్యాయవాదిగా ఉన్నప్పటి చిత్రం కాగా, మరొకటి మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన చిత్రం. » గాంధీ దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు ఉన్న తర్వాత 1915, జనవరి 15న భారత్‌కు తిరిగి వచ్చారు. ఆయన రాకను గౌరవిస్తూ ప్రవాస భారతీయుల కోసం 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రారంభించింది. » గాంధీ పుట్టిన రాష్ట్రమైన గుజరాత్‌లో ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ¤ గయానాలో ఒక రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి, ప్రయాణికుల రవాణా నౌక కోసం 60 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్ సమకూర్చాలని నిర్ణయించింది. గయానా అధ్యక్షుడు డొనాల్డ్ ఆర్ రామోతర్‌తో గాంధీనగర్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించిన సందర్భంగా ప్రధాని మోదీ ఇందుకు ఆమోదం తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఆ దేశంలో రవాణా సమస్యను అధిగమించడానికి వీలవుతుంది. » గయానా పౌరుల కోసం ఆగమనానంతర వీసా సదుపాయాన్ని కూడా మోదీ ప్రకటించారు.
|
జనవరి - 9
|
¤ జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ, రెండో పెద్ద పార్టీగా అవతరించిన భాజపాలు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఆధిక్యాన్ని సమీకరించలేకపోవడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. » జమ్మూకశ్మీర్‌లో 1977 నుంచి గవర్నర్ పాలన విధించడం ఇది ఆరోసారి. » రాజ్యాంగంలోని సెక్షన్ 92(1) ప్రకారం జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధిస్తున్నట్లు గవర్నర్ ఎన్.ఎన్.ఓహ్రా ప్రకటించారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ పాలనకు ఈ సెక్షన్ అనుమతిస్తుంది. » 2014 డిసెంబరు 23న జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 87 స్థానాలకు గాను పీడీపీకి 28 స్థానాలు రాగా, భాజపాకు 25 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 44 స్థానాలు అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)కు 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 12 దక్కాయి.
|
జనవరి - 10
|
¤ జాతీయ విజ్ఞాన నెట్‌వర్క్ ద్వారా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్ నుంచి కొత్త సంవత్సర సందేశం ఇచ్చారు. » దేశ భౌగోళిక సమగ్రతను రక్షించేందుకు అంతర్గతంగా, బయటి నుంచి భద్రత పకడ్బందీగా ఉండేందుకు అన్ని రకాల చర్యలను తీసుకునేందుకు సంసిద్ధంగా ఉండాలని గవర్నర్లకు ఆయన పిలుపునిచ్చారు.
|
జనవరి - 12
|
¤ ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాల వేలానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. » ఈ ఆర్డినెన్స్‌కు 2015, జనవరి 5న ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. » బొగ్గు కాకుండా ఇతర ఖనిజాలు, ఇనుప ఖనిజం కేటాయింపునకు పోటీ బిడ్డింగ్ ప్రవేశపెట్టడానికి ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ¤ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా మలీహాబాద్ ప్రాంతంలోని ఖర్తా; ఉన్నావో జిల్లా హసన్‌గంజ్ ప్రాంతంలోని తలసరాయి గ్రామాల్లో కల్తీ కల్లు తాగి 14 మంది మృతి చెందారు. |
జనవరి - 13
|
¤ ధూమపాన వ్యతిరేక చట్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. పొగాకు విడి ఉత్పత్తుల విక్రయం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే విధించే జరిమాన పెంపు; 21 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని కేంద్రం పలు ప్రతిపాదనలు తెచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి పదివేల నుంచి లక్ష రుపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్ట ఉల్లంఘనల కేసు విచారణకు ప్రత్యేక సెషన్సు కోర్టు, చట్ట అమలు, పర్యవేక్షణకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు సిగరెట్, పొగాకు ఉత్పత్తుల (సవరణ) బిల్లు- 2015లో తీసుకురానున్న ప్రతిపాదనలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.బిల్లులోని ముఖ్యాంశాలు: పొగాకు విడి ఉత్పత్తుల విక్రయంపై నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే విధించే జరిమానా మొత్తం రూ.200 నుంచి రూ.1000కి పెంపు. రెస్టారెంట్లు, హోటళ్లలో కేటాయించిన 'స్మోకింగ్ జోన్ల' తొలగింపు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేటాయించిన ప్రాంతాల్లో ధూమపానానికి అనుమతి. 'హుక్కా' కేంద్రాలపై నిషేధం.¤ రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిపతి పదవి నుంచి అవినాష్ చందర్‌ను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. ఆయన కాంట్రాక్టు ఇంకా 15 నెలలు ఉండగానే ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 31 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. » అవినాష్ చందర్ డీఆర్‌డీవో విభాగానికి కార్యదర్శిగా, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడిగా కూడా ఉన్నారు. గతేడాది నవంబరు 30న ఆయన పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి 18 నెలల పాటు (2016 మే 31 వరకు) ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతలోనే కాంట్రాక్టును తాజాగా రద్దు చేసింది.¤ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ కాలుష్యం బారిన పడుతుండటంతో దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజ్‌మహల్‌కు సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని నిషేధించింది. ఈ చారిత్రక కట్టడం క్రమంగా పసుపు రంగును సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.¤ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సహకరించడానికి యూఎస్ ఎయిడ్, బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంట్లో భాగంగా అయిదేళ్లపాటు గేట్స్ ఫౌండేషన్ ఏటా 25 లక్షల డాలర్లను (దాదాపు రూ.15 కోట్లు), యూఎస్ ఎయిడ్ సంస్థ ఏటా 20 లక్షల డాలర్లను (దాదాపు రూ.12 కోట్లు) అందించనున్నాయి. » ఈ ఆర్థిక సాయంతోపాటు జాతీయ పారిశుద్ధ్య లక్ష్యాల సాధనకు అవసరమైన కొత్త ప్రక్రియలు, సాంకేతిక విధానాలను ఈ సంస్థలు పరిచయం చేస్తాయి.¤ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన 'నీతి ఆయోగ్' మొదటి ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త అరవింద్ పనగడియా (62) బాధ్యతలు స్వీకరించారు.
|
జనవరి - 15
|
¤ 'డేరా సచ్ఛా సౌధ' ఆథ్యాత్మిక సంస్థ అధినేత గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్'కు వ్యతిరేకంగా దిల్లీ, పంజాబ్, హరియాణాలో నిరసనలు తీవ్రమయ్యాయి. ఆ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ శిరోమణి అకాలీదళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, హరియాణా సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ తదితర సిక్కు సంస్థలు నిరసనలు చేపట్టాయి.
|
జనవరి - 16
|
¤ ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురల్' గుజరాతీ అనువాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో విడుదల చేశారు. » తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా ఈ గ్రంథాన్ని విడుదల చేశారు. » డాక్టర్. పి.సి.కోకిల తిరుక్కురల్ గ్రంథాన్ని గుజరాతీలోకి అనువాదం చేశారు.¤ షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయమందించే 'వెంచర్ క్యాపిటల్ ఫండ్' పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దిల్లీలో ప్రారంభించారు. ఈ పథకం కింద కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తారు.
|
జనవరి - 17
|
¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. » భారత్‌లో పోలియో చుక్కల కార్యక్రమం 1995 నుంచి అమలవుతోంది. చివరిసారిగా 2011 జనవరి 13న పోలియో కేసును గుర్తించారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 మార్చి 27న ప్రకటించింది.
|
జనవరి - 18
|
¤ దేశవ్యాప్తంగా 101 నదులను జల రవాణా మార్గాలుగా మార్చే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 'ప్రధానమంత్రి జల్ మార్గ్ యోజన'ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు, నదీ మార్గాలను జల మార్గాలుగా మార్చడంతోపాటు డ్రై, శాటిలైట్ ఓడరేవులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. » ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయిదు జాతీయ జలమార్గాలను ప్రకటించింది. అవి.. 1. గంగా-భగీరథీ హుగ్లీ నదీ వ్యవస్థ (అలహాబాద్-హల్దియా-1620 కి.మీ.) 2. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ (ధుబ్రీ-సదియా-891 కి.మీ.) 3. ఉద్యోగ మండల్ - చంపకర కెనాల్స్ లోని పశ్చిమ తీర కాలువల వ్యవస్థ(కొట్టాపురం-కొల్లామ్-205 కి.మీ.) 4. కాకినాడ-పుదుచ్చేరి కెనాల్స్ వ్యవస్థ (గోదావరి-కృష్ణానదులు 1078 కి.మీ) 5. బ్రహ్మ పుత్ర-మహానదిలోని తూర్పు తీర కెనాల్ వ్యవస్థ (588 కి.మీ) ఈ జాతీయ జల మార్గాల్లో ఉన్నాయి. ¤ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు.
|
జనవరి - 19
|
¤ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రముఖ సామాజిక కార్యకర్త, తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీని దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. » 1972లో కిరణ్‌బేడి తొలి మహిళా ఐపీఎస్‌గా ఘనత సాధించారు. దిల్లీలోని చాణక్యపురి సబ్ డివిజినల్ పోలీస్ అధికారిగా తొలి పోస్టింగ్. » ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాల విభాగానికి నేతృత్వం వహించారు. » 1988లో నవ్‌జ్యోతి ఫౌండేషన్ ను స్థాపించారు. |
జనవరి - 20
|
¤ భారత్‌లో ఓటర్ల సంఖ్య 2015 జనవరి 5కి దాదాపు 83 కోట్లకు చేరిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ వెల్లడించారు. » 2014 ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య కంటే ఇది దాదాపు 2 కోట్లు ఎక్కువ. తాజా ఓటర్ల సంఖ్య ఐరోపా జనాభా కంటే ఎక్కువ. » 1951లో మొదటి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. ¤ భారతదేశంలో పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు పెరిగింది. » 2010తో పోలిస్తే ఈ పెరుగుదల సుమారు 30.5 శాతంగా ఉన్నట్లు తాజా అధికార గణాంకాలు వెల్లడించాయి. » కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ 'అఖిల భారత పులుల యాత్ర - 2014' పేరుతో రూపొందించిన పులుల లెక్కల నివేదికను దిల్లీలో విడుదల చేశారు. » 2006లో పులుల లెక్కలు సేకరించినపుడు వాటి సంఖ్య కేవలం 1,411గా నమోదు కాగా, 2010కి 1,706కు చేరింది. » ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో ప్రస్తుతం భారత్ వద్ద 70 శాతం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. » పులుల సంఖ్య ఎక్కువగా ఉండే 18 రాష్ట్రాల్లో సుమారు 3,78,118 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పులుల లెక్కలను సేకరించారు. » కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 340, ఉత్తరప్రదేశ్‌లో 117, బీహార్‌లో 28, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68, ఛత్తీస్‌గఢ్‌లో 46, మధ్యప్రదేశ్‌లో 308, మహారాష్ట్రలో 190, ఒడిశాలో 28, రాజస్థాన్‌లో 45, ఝూర్ఖండ్‌లో 3, కేరళలో 136, తమిళనాడులో 229, గోవాలో 5, అసోంలో 167, అరుణాచల్‌ప్రదేశ్‌లో 28, మిజోరంలో 3, పశ్చిమబంగలో 79 పులులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ¤ అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద జనవరి 17 వరకు 11.50 కోట్ల కొత్త ఖాతాలను బ్యాంకులు ఆరంభించాయి. లక్ష్యాన్ని అధిగమించడంతో పాటు, ప్రపంచంలోనే అత్యధికంగా ఖాతాలు ప్రారంభించినందుకు గిన్నిస్‌బుక్ రికార్డు సాధించింది. » ఈ ఖాతాల్లో రూ.9000 కోట్ల నగదు జమ కావడం మరో విశేషం. 10 కోట్ల మందికి రూపే కార్డుల జారీ చేశారు. వీరికి రూ.లక్ష మేర వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.30,000 జీవిత బీమా లభిస్తుంది. » సామాజిక భద్రతా కార్యక్రమాల కింద జారీఅయ్యే నగదును, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామని, గత నవంబరు 15 నుంచి రూ.1757 కోట్లు ఇలా బదిలీ చేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. » 2014 ఆగస్టు 23-29 తేదీల్లో (వారంలో) 1,80,96,130 కొత్త ఖాతాలను ఈ పథకం కింద ప్రారంభించడాన్ని కూడా గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదు చేసింది.
|
జనవరి - 21
|
¤ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పునరుత్తేజితం చేయడానికి, సంరక్షించుకోవడానికి ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకం (హృదయ్)ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దిల్లీలో ప్రారంభించారు. » పర్యటక, సాంస్కృతిక మంత్రి డాక్టర్ మహేష్ శర్మతో పాటు హృదయ్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హృదయ్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాలు: అమరావతి (ఆంధ్రప్రదేశ్); వరంగల్ (తెలంగాణ); అమృత్ సర్ (పంజాబ్); అజ్మీర్ (రాజస్థాన్); బదామి (కర్ణాటక); కాంచీపురం, వెల్లన్‌కన్ని (తమిళనాడు); మధుర, వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్); గయ (బీహార్); ద్వారక (గుజరాత్); పూరి (ఒడిషా). » ఆయా పట్టణాల జనాభా ఆధారంగా వచ్చే రెండేళ్లలో ఖర్చు చేయడానికి అనుమతులనూ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా వరంగల్‌కు రూ.40.54 కోట్లు, అమరావతికి రూ.22.26 కోట్లు కేటాయించారు. » వరంగల్ నుంచి కడియం శ్రీహరి, గుంటూరు నుంచి రాయపాటి సాంబశివరావు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. » హృదయ్ పథకం కింద తొలిదశలో ఎంపిక చేసిన 12 పట్టణాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారు. ¤ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు నాలుగు చొప్పున మొత్తం ఎనిమిది ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌ల (ఐ.ఆర్.బెటాలియన్స్) మంజూరుకు అంగీకరించింది. » వీటిలోకి సిబ్బందిని రాష్ట్ర ప్రత్యేక పోలీసుల బెటాలియన్ల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. వీరి వేతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు మాత్రం కేంద్రం భరిస్తుంది. ¤ న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులతో పాటు వివాదాలు ప్రాథమిక దశలో ఉన్న కేసులను పరిష్కరించడానికి కొత్త తరహాలో లోక్ ఆదాలత్‌లను నిర్వహించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) నిర్ణయించింది. » ఇందులో భాగంగా నెలలో ప్రతి రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించాలని నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నిర్ణయించారు. ¤ ఎన్ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5500 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు ఆసక్తి ఉన్న మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. » ప్రస్తుతం ఎన్ఎండీసీలో ప్రభుత్వానికి 80 శాతం వాటా ఉంది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.43,425 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇప్పటివరకు సెయిల్‌లో వాటా విక్రయం ద్వారా రూ.1715 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ¤ దేశవ్యాప్తంగా 2022 నాటికి 'అందరికీ గృహ వసతి' లక్ష్యాన్ని సాధించడానికి 2 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన 'అందరికీ గృహ వసతి' కార్యక్రమం కింద దిల్లీలో 6 లక్షలు, ముంబయిలో 16 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, కోల్‌కతలో 4 లక్షలు ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ఈ కార్యక్రమంలో భాగంగా బలహీన వర్గాలకు, మురికివాడల వాసులకూ ఇళ్లను నిర్మించనున్నారు. పట్టణాల్లో - మురికివాడల్లో నివసించే పేదలు, పట్టణాల్లో ఇల్లు లేనివారు, ఆశ్రయం కోసం కొత్తగా పట్టణాలకు వలస వచ్చేవారు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తారు. మెట్రోనగరాలు, చిన్న పట్టణాలు, అన్ని పట్టణ ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. » 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యేటప్పటికి అందరికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్డి, సదుపాయాలతో కూడిన గృహవసతిని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. » ఈ కార్యక్రమం కింద సింహ భాగాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తారు.
|
జనవరి - 22
|
¤ 'బేటీ బచావో బేటీ పఢావో' (కూతురిని కాపాడండి కూతురిని చదివించండి) అనే పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. » ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. » 'బేటీ బచావో భేటీ పఢావో' కార్యక్రమానికి ప్రచారకర్తగా ప్రముఖ సినీనటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. » మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 2,000 ఆడశిశువుల భ్రూణ హత్యలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమాన స్త్రీ, పురుష నిష్పత్తిని సాధించే గ్రామానికి రూ.కోటి ప్రోత్సాహకాన్ని మంత్రి ప్రకటించారు. » ఈ కార్యక్రమం కింద 'సుకన్య సమృద్ధి యోజన'ను బాలికల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద పదేళ్ల లోపు బాలికల పేరిట రూ.1000 కనీస మొత్తంతో బ్యాంకు/ పోస్టాఫీసు ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలో జమ చేసే సొమ్ముపై వాటా 9.1 శాతం వడ్డీ, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల వ్యయం కోసం ఖాతాలోంచి సగం మొత్తంను తీసుకోవచ్చు. అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చే వరకు లేదా వివాహం జరిగే వరకు (18 ఏళ్ల తర్వాతే) ఈ ఖాతా కొనసాగుతుంది. ¤ సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను బలవంతంగా జరపడాన్ని వ్యతిరేకిస్తూ 1976లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో యూపీలో నిరసన తెలిపిన 25 మందిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జాతీయ మైనారిటీ కమిషన్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. » ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దిల్లీకి చెందిన మానవ హక్కుల కేంద్రం డైరెక్టర్ రాజన్స్ బన్సాల్ మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కమిషన్ తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ¤ భారతదేశంలో 2001 నుంచి 2011 మధ్య ముస్లిం జనాభా 24 శాతం పెరిగింది. దేశం మొత్తం జనాభాలో వీరి పెరుగుదల రేటు 13.4 శాతం నుంచి 14.2 శాతం అయింది. » జమ్మూకశ్మీర్‌లో అత్యధిక స్థాయిలో 68.3 శాతం ముస్లిం జనాభా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అసోం (34.2 శాతం), పశ్చిమబంగా (27 శాతం) ఉన్నట్లు మత వర్గాలపై అధికారిక జనాభా లెక్కల గణాంకాలు తెలుపుతున్నాయి. » ముస్లిం జనాభా వృద్ధిరేటు 1991 నుంచి 2001 మధ్యలో 29 శాతం ఉండగా, తాజా గణాంకాల్లో 24 శాతంతో జాతీయ సగటు 18 శాతం కంటే ఎక్కువగా ఉంది. » మణిపూర్‌లో మాత్రం ముస్లిం జనాభా 8.8 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గింది. బంగ్గాదేశ్ నుంచి అక్రమ వలసలు ఎదుర్కొంటున్న పశ్చిమ బంగాలో 25.2 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. » జాతీయ స్థాయిలో మొత్తం జనాభాలో ముస్లింల శాతం 2001లో 13.4 శాతం ఉండగా, 2011లో 14.2 శాతానికి పెరిగింది. » అసోంలో అత్యధికంగా 30.9 శాతం నుంచి 34.2 శాతానికి పెరిగింది. » ముస్లింల జనాభా అధికంగా పెరిగిన ఇతర రాష్ట్రాల్లో ఉత్తరాఖాండ్ (2%), కేరళ (1.9%), పశ్చిమబంగా (1.8%), గోవా (1.6%), జమ్మూకశ్మీర్ (1.3 %)లు ఉన్నాయి. » అతి తక్కువగా మేఘాలయ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 0.1% పాయింట్ల పెరుగుదల నమోదైంది. » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 0.4 శాతం వృద్ధి నమోదైంది. ¤ పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లకు భారతీయులు తేసుకెళ్లే ద్రవ్యం విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు సవరణలు చేసింది. » గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేకుండా, కేవలం రూ.100 లేదా అంతకంటే తక్కువ విలువ చేసే నోట్లనే ఈ దేశాలకు తీసుకేళ్లేందుకు ఇప్పటివరకు ఆర్‌బీఐ అనుమతించేది. » తాజాగా చేసిన సవరణలు ప్రకారం ఇకపై నేపాల్, భూటాన్‌లకు వెళ్లే భారత పౌరులు రూ.500, రూ.1000 నోట్లను సైతం తమ వెంట తీసుకెళ్లొచ్చు. అయితే గరిష్ఠ మొత్తం రూ.25 వేలకు మించకూడదు.
|
జనవరి - 23
|
¤ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో ఆయనకు నివాళులు అర్పించారు. » నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఆయన సొంత రాష్ట్రమైన పశ్చిమబంగాలో ఘనంగా నిర్వహించారు. » సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా దేశ్‌ప్రేమ్ దినోత్సవంగా నిర్వహించారు.¤ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఉక్రెయిన్‌లోని డోనెట్సెక్, లుగన్సెక్ ప్రాంతాలను ఖాళీ చేయాలని భారత విద్యార్థులకు కేంద్రం సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో క్షీణించిన శాంతి, భద్రతల నేపథ్యంలో అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలని విదేశాంగ వ్యవహారాల శాఖ సూచించింది.
|
జనవరి - 24
|
¤ ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా భారతీయ రైల్వే ఆహార, విహార సంస్థ (ఐఆర్‌సీటీసీ) ఈ-కేటరింగ్ సదుపాయాన్ని 76 రైళ్లల్లో అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఆన్‌లైన్, టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని పొందవచ్చు. » 2014 సెప్టెంబరులో ప్రయోగాత్మకంగా ఢిల్లీ-అమృతసర్ మార్గంలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తాజాగా ఈ సదుపాయాన్ని 76 రైళ్లలో ప్రారంభించారు. » ప్రయాణికులు ఆహారం కోసం www.ecatering.irctc.co.in లేదా 1800-1034-139, 0120-4383892-99 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకోవచ్చు.¤ భారత వాతావరణ విభాగం ఇకపై భూకంపాల తీవ్రతను నమోదు చేయనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 78 సంఖ్యా సంకేత భూకంప లేఖిని కేంద్రాలను (డిజిటల్ సిస్మోగ్రాఫ్ సెంటర్ - డీఎస్‌సీ) నెలకొల్పాలని నిర్ణయించుకుంది. » ఇప్పటివరకు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్ఐ), ఇతర పరిశోధన సంస్థలు భూకంప నమోదు కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చాయి.
|
జనవరి - 26
|
¤ 66వ భారత గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. » దిల్లీలోని రాజ్‌పథ్ వద్ద జరిగిన గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. » రాష్ట్రపతి కారులో ముఖ్య అతిథి వచ్చే సంప్రదాయానికి భిన్నంగా ఒబామా తన సొంత కారులోనే రాజ్‌పథ్ వద్దకు చేరుకున్నారు. » రాష్ట్రపతి ప్రణబ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సైనిక వందనం స్వీకరించారు. సైనిక సంప్రదాయం ప్రకారం 21 సార్లు గాలిలో కాల్పులు జరిపి వందనం చేశారు. » ఈసారి గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలకు చెందిన మహిళా విభాగాలన్నీ కలిసి కవాతు నిర్వహించాయి. ఇలా చేయడం ఇదే మొదటిసారి. » 16 రాష్ట్రాలు తమ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకునే రీతిలో శకటాలను రూపొందించి ప్రదర్శించాయి. » మకర సంక్రాంతి పండగను తెలియజెప్పేలా ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తరఫున బోనాల పండగను చాటేలా శకటాన్ని ప్రదర్శించారు. » సముద్రతల నిఘాకు, జలాంతర్గాముల వేటకు ఇటీవలే సమకూర్చుకున్న పి - 8ఐ విమానం, విమాన వాహక నౌకలపై ఉంచే మిగ్ 29 - కె యుద్ధవిమానం కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మోదీ కలల పథకమైన 'భారత్‌లో తయారీ' (మేక్ ఇన్ ఇండియా) కోసం ప్రత్యేకంగా ఒక శకటాన్ని యాంత్రిక సింహం ఆకారంలో రూపొందించారు. » ఎడారిలో గస్తీకి ఉపయోగపడే ఒంటెలతో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) చేసిన ప్రదర్శన ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన 'కోబ్రా' బెటాలియన్ కూడా మొదటిసారి కవాతులో పాల్గొంది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ప్రదర్శించిన శకటంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఐక్యత విగ్రహానికి, సర్దార్ సరోవర్ యోజనకు పెద్దపీట వేశారు. » దేశీయంగా రూపొందించిన ఆకాష్ క్షిపణి, ఆయుధాలను గుర్తించే రాడార్‌లను డీఆర్‌డీవో ప్రదర్శించింది. టీ - 90 భీష్మ ట్యాంకు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ లాంటివి ఆకట్టుకున్నాయి. '1965 యుద్ధానికి 50 ఏళ్లు' పేరుతో భారత వాయుసేన ఒక శకటాన్ని ప్రదర్శించింది. భారత నౌకాదళం తన సన్నద్ధతను చాటేలా శకటాన్ని రూపొందించింది. ఐ.ఎన్.ఎస్. కోల్‌కత యుద్ధ నౌక, ధ్రువ్ హెలికాప్టర్‌లకు దీనిలో చోటు లభించింది. గోవా నుంచి బ్రెజిల్‌లోని రియో - డి - జనిరోకు సముద్ర యాత్ర సాగించిన మహిళల గురించి 'భారత నౌకాదళం - మహిళా శక్తి' పేరుతో ఈ శకటంలో తెలియజేశారు. ¤ విజయవాడ ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. » ఈ సందర్భంగా 10 శకటాలను ప్రదర్శించారు. » అత్యుత్తమ శకటం పురస్కారాన్ని దేవదాయ శాఖ రూపొందించిన తిరుమల తిరుపతి శకటం దక్కించుకుంది. వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ, నీటిపారుదల శకటానికి తృతీయ పురస్కారాలు లభించాయి. పరేడ్‌లో అత్యుత్తుమ ప్రదర్శన పురస్కారాన్ని విశాఖ బెటాలియన్ గెలుచుకుంది. ¤ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ¤ దేశవ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రతినెలా ఒకసారి రేడియోలో ప్రసంగించే 'మన్‌కీ బాత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. » భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మోదీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
|
జనవరి - 28
|
¤ దిల్లీలో జరిగిన ఎన్‌సీసీ వార్షిక గణతంత్ర దినోత్సవ శిబిరం ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. » జూన్ 21వ తేదీని 'అంతర్జాతీయ యోగా దినం'గా ఐరాస ప్రకటించినందుకు ఆ రోజు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో యోగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని మోదీ ఎన్‌సీసీ క్యాడెట్లకు సూచించారు. » ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తలదన్నే విధంగా ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని దీనికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించి ఈ సందేశాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. » పరిసరాల్ని పరిశుభ్రంగా మల్చుకునే 'స్వచ్ఛ భారత్' ఉద్యమాన్ని కూడా ఎన్‌సీసీ క్యాడెట్లు చేపట్టాలని ప్రధాని పేర్కొన్నారు.¤ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ విలువైన కానుకను అందించారు. భారత్‌లో పర్యటన ముగించుకొని వెళ్తున్నప్పుడు ఓ అరుదైన టెలిగ్రామ్ ప్రతిని అందమైన అమరికతో రాష్ట్రపతికి ఇచ్చారు. » 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా భారత్ అవతరించిన సందర్భంగా ప్రప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రుమన్ శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన టెలిగ్రామ్ అది. » కాలిఫోర్నియాకు చెందిన స్టీఫెన్ అనే కళాకారుడు అందమైన గాజుతో దీన్ని రూపొందించి, రెండు దేశాల జెండాలను జ్ఞాపికపై చిత్రించారు.¤ సౌదీ అరేబియా రాజుగా బాధ్యతలు చేపట్టిన సల్మాన్‌బిన్ అబ్దుల్ అజీజ్ అల్‌సౌద్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపించారు.¤ అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్. జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతాసింగ్ పదవీకాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను ఈ పదవి నుంచి తప్పించింది. » ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.
|
జనవరి - 29
|
¤ దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రెండు కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దీన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. 2019 నాటికి దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన లేకుండా చేసే పథకంలో ఇదొక భాగం. » ఈ పథకం అమలు కోసం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అక్షరాస్యులైన మహిళలను ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. పారిశుద్ధ్యానికి సంబంధించి వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత వారు పారిశుద్ధ్య కార్మికులు (శానిటరీ మేట్స్)గా వ్యవహరిస్తూ గ్రామాల్లో పర్యటిస్తారు. స్థానికులకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించడంతో పాటు దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు. » ఈ పథకానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.¤ గణతంత్ర వేడుకలు దిల్లీలోని విజయ్ చౌక్‌లో ఘనంగా ముగిశాయి. 'బీటింగ్ ది రిట్రీట్' పేరుతో నిర్వహించిన ఈ సంప్రదాయబద్ధ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణణ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. » సూర్యాస్తమయం కాగానే యుద్ధక్షేత్రం నుంచి సైనిక బలగాలు తమ శిబిరాలకు వెనుదిరిగి పోవడాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకను ఏటా నిర్వహిస్తున్నారు. » గణతంత్ర దినోత్సవ కవాతులో ఉత్తమ ప్రదర్శన చూపిన దళాలు, శకటాలకు రక్షణ శాఖ పురస్కారాలను ప్రకటించింది. సైనిక దళాల విభాగంలో బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్‌లు సంయుక్తంగా ఉత్తమ పురస్కారాన్ని దక్కించుకున్నాయి. పారా మిలటరీ, అనుబంధ విభాగంలో సీఐఎస్ఎఫ్‌కి ఉత్తమ పురస్కారం లభించింది. శకటాల విభాగంలో 'పుణ్యక్షేత్రం పండర్‌పూర్'పై రూపొందించిన మహారాష్ట్ర శకటానికి ప్రథమ బహుమతి దక్కింది.
|
జనవరి - 30
|
¤ జాతి పిత మహాత్మాగాంధీ 67వ వర్ధంతి సందర్భంగా దిల్లీలోని బాపు సమాధి 'రాజ్‌ఘాట్' వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు నివాళులు అర్పించారు. » ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. » త్రివిధ దళాధిపతులు ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, అడ్మిరల్ రాబిన్ ధోవన్, జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
జనవరి - 31
|
¤ వాహనాల కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ఈ నగరాలకు కొంత ఊరట లభించనుంది. » కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు వాహనాలకు వినియోగించే పెట్రోలు, డీజిల్‌ను మరింత శుద్ధిచేసి సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2005 ఏప్రిల్ నుంచి భారత్-3 ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత అయిదేళ్లకు 2010 ఏప్రిల్ నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న హైదరాబాద్ సహా 13 మెట్రో నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో భారత్-3 ఇంధనం అమల్లో ఉంది. » భారత్-3 పెట్రోలు, డీజిల్‌లో వరుసగా కిలోకు 150 మిల్లీ గ్రాముల సల్ఫర్ ఉంటే భారత్-4లో అది 50 మిల్లీ గ్రాములకు తగ్గింది. ఇంధనంలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల ఇంజిన్ సామర్థ్యం తగ్గి ఉద్గారాలు ఎక్కువగా వెలువడతాయి. » ఈ సమస్య పరిష్కారంలో భాగంగా దేశంలోని మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), కొచ్చిన్ (కేరళ), కోయంబత్తూరు (తమిళనాడు) తదితర నగరాలున్నాయి.
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment