జనవరి - 2015 పర్యటనలు




జనవరి - 5

¤ ప్రముఖ హాలీవుడ్ నటుడు, ప్రపంచ బౌద్ధ సమాఖ్య అంతర్జాతీయ రాయబారి రిచర్డ్ గెరె భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

జనవరి - 19

¤ జర్మనీ ఆర్థికమంత్రి ఓల్ఫ్ గ్యాంగ్ షాబూల్ తన భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

జనవరి - 25

¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ చేరుకున్నారు. మూడురోజుల పాటు ఈయన భారత్‌లో ఉంటారు.
       » దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామాకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తర్వాత ఆయన రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌కు చేరుకొని ప్రధాని మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
       » భారత్ - అమెరికా మధ్య పౌర అణు ఒప్పందంలో ఆరేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఈ చర్చలతో తెరపడింది. వాణిజ్యపరమైన సహకారాన్ని అందించుకోవాలని, రక్షణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భారత దేశీయ రక్షణ పరిశ్రమను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలూ నిర్ణయించాయి.
       » పౌర అణు ఒప్పందం, వాతావరణ మార్పులు, రక్షణ ఒప్పందాలు, వాణిజ్యం, ఆర్థికరంగాలపై అగ్రనేతలిద్దరూ చర్చించారు.
       » రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాన్ని రెండు దేశాలూ పునరుద్ధరించుకున్నాయి. మరో పదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది.
       » మానవ రహిత విమానాల ఉత్పత్తి, సి-130 సైనిక రవాణా విమానాలకు అవసరమైన ప్రత్యేక పరికరాల తయారీలో రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయి. విమాన వాహక నౌకలు, జెట్ ఇంజిన్ల సాంకేతిక పరిజ్ఞానాలపై ఒక కార్యబృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
       » తొలిసారిగా రెండు దేశాల అగ్రనేతలు, జాతీయ సలహాదారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. తద్వారా కీలకమైన భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోనున్నాయి.
       » ఒబామా, మోదీల మధ్య చర్చల అనంతరం రెండు దేశాలూ 'చలే సాత్ సాత్' పేరుతో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
       » అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన కానుకను అందజేశారు. భారత్, అమెరికాల చరిత్రలో ఓ ఘటనకు దర్పణం పట్టే 1946 నాటి టెలిగ్రామ్ ప్రతిని సమర్పించి గత స్మృతులను స్మరించుకునేలా చేశారు. అమెరికా నుంచి భారత్‌కు అధికారికంగా అందిన తొలి టెలిగ్రామ్ అది. భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభ తొలి టెలిగ్రామ్.

జనవరి - 27

¤ భారత్‌లో మూడురోజులు పర్యటన కోసం వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తన చివరి రోజు పర్యటనలో భాగంగా దిల్లీ 'సిరి ఫోర్ట్' సమావేశ మందిరంలో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. తన పక్కన భారత దేశ నాయకులెవరూ లేకుండా ఆయన పాల్గొన్న ఏకైక కార్యక్రమం ఇదే.
       » భారత్ - అమెరికా మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఆయన తన ప్రసంగంలో సాపేక్షంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, భిన్నత్వాలు, అట్టడుగుస్థాయి వారికి కూడా అగ్రస్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించడంలో రెండు దేశాలు ఒకటేనని చెప్పారు. అందుకే రెండు దేశాలూ సహజ భాగస్వాములని పేర్కొన్నారు.
       » ఐరాస భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్‌కు అమెరికా మద్ధతు ఉంటుందని ఒబామా ప్రకటించారు. 20వ శతాబ్దిలో ఏర్పాటు చేసుకున్న సంస్థలను 21వ శతాబ్దానికి తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉందని, అందుకే తాను భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణకు మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌కు దీనిలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్నారు.
       » ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ గొప్ప పాత్రను పోషించాలని అధ్యక్షుడు ఒబామా ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో సముద్రంపై చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
       » గణతంత్ర వేడుకల్లో భాగంగా 'జాన్ బాజ్' పేరుతో సరిహద్దు భద్రత దళం జవాన్లు మోటారు సైకిళ్లపై చేసిన సాహసోపేతమైన ప్రదర్శనను ఒబామా తన ప్రసంగంలో మెచ్చుకున్నారు.
       » ఒబామా తన ప్రసంగంలో లింగ, మత సమానత్వంపై ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్‌ఖాన్, ప్రముఖ క్రీడాకారులు మిల్కాసింగ్, మేరీకోమ్‌లతో పాటు నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థిల పేర్లను ప్రస్తావించారు.
       » ఈ ప్రసంగం అనంతరం ఒబామా నేరుగా పాలం విమానాశ్రయానికి వెళ్లి తన 'ఎయిర్‌ఫోర్స్ వన్' విమానంలో సౌదీ అరేబియాకు వెళ్లారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment