జనవరి - 2015 నివేదికలు - సర్వేలు




జనవరి - 3

¤ 'సైంటిఫిక్ అసెస్‌మెంట్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్-2014' నివేదికను మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ఏర్పాటైన శాస్త్రీయ విశ్లేషణ ప్యానల్ రూపొందించింది. గత సెప్టెంబరులో ప్రాథమిక నివేదికను వెలువరించిన సంస్థ తాజాగా సవివర నివేదికను విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:
 భూతాపాన్ని పెంచే గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయుల్లో చేపట్టిన చర్యలతో ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే అవి తరగిపోతున్న ఓజోన్ పొరను కోలుకునేలా చేయడంలో మాత్రం విజయం సాధించాయి.
 భూమిపై ఉన్న జీవజాలాన్ని హానికారక అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్‌పొర కొన్ని చోట్ల పలుచబడటమో, కనుమరుగు కావడమో జరిగింది. మానవ చర్యల కారణంగా ఉత్పత్తి అవుతున్న కొన్ని రకాల పదార్థాలే ఇందుకు కారణం. ఓజోన్ హనన పదార్థాలైన హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్లు ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గాయని నివేదిక తేల్చింది.
 ఓజోన్ పొర కోలుకుంటున్నట్లు తొలిసారిగా సంకేతాలు అందాయి. 1980 నాటి ప్రామాణిక స్థాయిని అందుకునే దిశగా ఈ వృద్ధి ఉంది.
 మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకాలు చేసిన వివిధ దేశాలు ఇప్పటివరకూ 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఓజోన్ హనన పదార్థాలను నిర్మూలించాయి. అయితే 6.4 లక్షల మెట్రిక్ టన్నుల హెచ్‌సీఎఫ్‌సీలను మరింత తగ్గించాల్సి ఉంది.

జనవరి - 18

¤ ప్రపంచంలోని 50 అత్యంత విలువైన బ్యాంకుల జాబితా (2014 ఏడాదికి) ను మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ సంస్థ రూపొందించింది.
ముఖ్యాంశాలు
 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ జాబితాలో 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 45వ స్థానంలో నిలిచి, టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంకు‌గా ఉంది.
 అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో జాబితాలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాంకుగా నిలిచింది. 7 కోట్ల మందికి పైగా కస్టమర్లు, 9000కు పైగా శాఖలు, 284 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ బ్యాంకు అగ్ర స్థానంలో ఉంది.
 రెండు, మూడు స్థానాల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లు), జేపీ మోర్గాన్ చేజ్ (234 బిలియన్ డాలర్లు) నిలిచాయి.
 టాప్-10 బ్యాంకుల్లో అమెరికా, చైనాలకు చెందినవి చెరో నాలుగు బ్యాంకులు ఉండగా బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో బ్యాంకు స్థానం పొందాయి.
 భారత్ నుంచి ఎస్‌బీఐ (36 బిలియన్ డాలర్లు) 51వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంకు (33 బిలియన్ డాలర్లు) 55వ ర్యాంకుల్లో నిలిచాయి.

జనవరి - 22

¤ ప్రపంచవ్యాప్తంగా 70% దేశాల్లో చదువులో బాలుర కంటే బాలికలే ఉత్తమంగా నిలుస్తున్నారని గ్లాస్గో, మిస్సౌరి విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
        » స్త్రీల స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలున్న దేశాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది.
        » గణితం, సాహిత్యం, శాస్త్ర సంబంధిత అంశాల్లో 15 ఏళ్ల బాలికలు తమ తోటి బాలుర కంటే మెరుగ్గా ఉన్నట్లు సర్వేలో తేలింది.
       » 2000-2010 మధ్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో విద్యాభ్యాసం చేసిన 1.50 కోట్ల మంది 15 ఏళ్ల లోపు బాలలకు వచ్చిన మార్కులపై సమగ్ర అధ్యయనం చేశాక ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
       » సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న దేశాల్లో సైతం బాల బాలికల మధ్య విద్యాపరంగా అంతరం ఉందని అధ్యయనం పేర్కొంది.
       » లింగ సమానత తక్కువగా ఉన్న ఖతార్, జోర్డాన్, యుఏఈ లాంటి దేశాల్లోనూ ఫలితాలు ఇలాగే ఉన్నాయి.
       » కొలంబియా, కోస్టారికా, భారత్‌లోని హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బాలికల కంటే బాలురు బాగా చదువుతున్నారని అధ్యయనంలో తేలింది.
       » అమెరికా, ఇంగ్లండ్‌లో మాత్రం బాలబాలికల మధ్య చదువులో వ్యత్యాసం లేదని వెల్లడైంది.

జనవరి - 29

¤ వినియోగదారుల విశ్వాసంపై తొమ్మిది దేశాల్లో (భారత్, చైనా, రష్యా, బ్రెజిల్‌, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ) క్రెడిట్ సుయీజీ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ అగ్రగామిగా నిలిచింది. బ్రెజిల్‌, ఇండోనేషియా ద్వితీయ, తృతీయ స్థానాలను పొందగా సౌదీ అరేబియా (4), చైనా (5), టర్కీ (6), మెక్సికో (7), రష్యా (8), దక్షిణాఫ్రికా (9) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
     » స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ద్రవోల్బణం తగ్గుముఖం పట్టడంతో గతేడాది భారత్‌లో వినియోగదారుల విశ్వాసం గణనీయంగా మెరుగైందని సంస్థ వెల్లడించింది.
     » భారత్‌లో రెండేళ్లపాటు స్థిరంగా ఉన్న గృహస్థుల ఆదాయం 2014లో దాదాపు 10 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది.
     » భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం ఇంటర్నెట్‌ను వినియోగించిన వారిసంఖ్య 2013లో 20 శాతం ఉండగా గతేడాది 32 శాతానికి చేరిందని క్రెడిట్ సుయీజీ వెల్లడించింది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment