జనవరి - 2
|
¤ ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ఇంటింటికీ అంతర్జాల సౌకర్యం కల్పించి ఏపీని సాంకేతిక రాష్ట్రంగా మార్చాలనే ఆశయంతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.30 కోట్ల ఇళ్లకు 10-15 ఎంబీపీఎస్ వేగంతో ప్రతి ఇంటికీ నెలకు రూ.150కే ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. » అనంతపురం జిల్లాలో 60 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం రెండు మండలాల్లో నాలుగు చోట్ల భూములు కేటాయించారు. » రైతు సాధికార సంస్థ తరహాలో మహిళల అభ్యున్నతి కోసం మహిళా సాధికార సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 26 వేల గ్రామాల్లోని 6.58 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 69 లక్షల మంది సభ్యులున్నారు. పేదరిక నిర్మూలన ధ్యేయంతో మహిళా సాధికార సంస్థ ఏర్పాటు చేస్తారు. సెర్ప్, డ్వాక్రా, మెప్మా సంస్థలు మూడింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి మహిళలకు సంబంధించిన అన్ని ఆర్థిక వనరులను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకొస్తారు. » రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పల్లెలో ముగ్గుల పోటీలు, ఆహారోత్సవాలు, పశు ప్రదర్శన, గాలిపటాలు ఎగరేయడం, ఉత్తమ రైతులకు పురస్కారాల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ¤ తెలంగాణ రాష్ట్ర తొలి యువజనోత్సవాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పది జిల్లాల నుంచి వచ్చిన 650 మంది యువతీయువకులు శాస్త్రీయ, జానపద నృత్యాలతో పాటు 33 అంశాల్లో పోటీ పడుతున్నారు.
|
జనవరి - 3
|
¤ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉద్యోగాల పథంలో కీలకమైన తొలి అడుగువేసింది. వివిధ రకాల ఉద్యోగ పరీక్షలకు అనుసరించాల్సిన ప్రణాళిక రూపకల్పనకు ఉన్నతస్థాయి నిపుణులు కమిటీని ఏర్పాటు చేసింది. » 26 మంది సభ్యులున్న ఈ కమిటీకి ఆచార్య హరగోపాల్ సారథ్యం వహిస్తారని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. వివిధ రంగాలతోపాటు సబ్జెక్ట్ నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ కమిటీకి రూపమిచ్చారు. » దీని ద్వారా వివిధ పోస్టుల (గ్రూప్-1, గ్రూప్-2, జోనల్, జిల్లాస్థాయి) భర్తీకి పరీక్షల్ని ఎలా నిర్వహించాలి? రాత పరీక్షలెలా? ఇంటర్వ్యూలెలా? ఏయే అంశాల్లో అభ్యర్థుల్ని పరీక్షించాలి? జాతీయ, రాష్ట్ర స్థానికాంశాల్లో వేటికి ఎంత మేరకు విలువ ఇవ్వాలి? తదితర అంశాలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడు వారాల్లోగా ఇది నివేదిక సమర్పిస్తుంది. నివేదిక ఆధారంగా ఉద్యోగ పరీక్షల రూపురేఖలపై ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తర్వాత సబ్జెక్టుల వారీగా పాఠ్యప్రణాళిక కమిటీలను మళ్లీ నియమిస్తుంది.¤ పీకే అగర్వాల్ నేతృత్వంలోని పదో వేతన సవరణ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు 29% ఫిట్‌మెంట్ సిఫార్సు చేసింది. కనిష్ఠ వేతనంగా రూ.13 వేలు, గరిష్ఠ వేతనంగా రూ.1.10 లక్షలు సిఫార్సు చేసింది.
|
జనవరి - 4
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'స్వచ్ఛ భారత్' పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 'స్వచ్ఛ తెలంగాణ' పేరుతో కార్యాచరణను రూపొందించింది. » తెలంగాణలోని 68 పట్టణాలు/ నగరాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకాన్ని అమలు చేయనున్నారు. దశల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రణాళిక రచించారు. దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. » 'స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ తెలంగాణ' నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజా భాగస్వామ్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. » రాబోయే అయిదేళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రూ.979 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు రూ.130 కోట్లు రాష్ట్రానికి ఇవ్వనుంది. » తెలంగాణలో నగర జనాభా ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌ను మినహాయిస్తే రాష్ట్రంలో 68 పట్టణాలు/ నగరాలు ఉన్నాయి. వీటిలో ఆరు కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయితీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ పట్టణ జనాభా 1.37 కోట్లు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాలో 39 శాతం. » తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు/ నగరాల్లోని ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పర్వాలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంలో జాతీయ సగటు 81.4 శాతంగా ఉంటే, తెలంగాణ పట్టణాల్లో 91.12 శాతంగా ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో సొంత మరుగుదొడ్లు లేని ఇళ్లు 2,75,151గా తేల్చారు. అంటే 8.98 శాతం. జాతీయ స్థాయిలో ఈ తరహా ఇళ్ల సగటు 12.6 శాతంగా నమోదైంది. » జిల్లాలకు సంబంధించి తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 25.87 శాతం, మహబూబ్‌నగర్‌లో 19.37 శాతం, నల్గొండలో 18.22 శాతం ఇళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం లేదని తేలింది. » తెలంగాణలోని 51.54 శాతం జనాభాకు మాత్రమే భూగర్భ మురుగునీటి (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) సౌకర్యం ఉంది. మూడు నగరాల్లో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది. మరో నాలుగు పట్టణాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. 62 పట్టణాలు/ నగరాల్లో మురుగునీటిని శుద్ధి చేసే విధానాలే లేవు. » తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు/ నగరాల్లో కలిపి 3777 మురుగువాడులు ఉన్నాయి. వీటికి నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
|
జనవరి - 5
|
¤ పాఠశాలల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వినియోగించకూడదని నిబంధన విధించింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.¤ హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిపై కార్యగోష్ఠి (వర్క్‌షాప్)ని నిర్వహించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 18 మంది ప్రముఖులను స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.ప్రచారకర్తలుగా ఎంపికైన ప్రముఖులు: గల్లా జయదేవ్, కల్వకుంట్ల కవిత (ఎంపీలు); వి.వి.ఎస్. లక్ష్మణ్, శివలాల్ యాదవ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి (క్రీడారంగం); పవన్ కల్యాణ్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, నితిన్, సుద్దాల అశోక్ తేజ, అక్కినేని అమలా నాగార్జున (సినిమా రంగం); బి.వి.ఆర్.మోహన్ రెడ్డి, జె.ఎ.చౌదరి, జె.రామేశ్వరరావు, జి.వి.కె.రెడ్డి (పారిశ్రామిక రంగం); డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జి.ఎస్.రావు (వైద్య రంగం); వేమూరి రాధాకృష్ణ (మీడియా).¤ తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం కొత్త సంవత్సర కానుకగా తెలంగాణ ప్రభుత్వం 'ఆరోగ్య లక్ష్మి' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని 31,897 అంగన్ వాడీ కేంద్రాలు, 4,076 మినీ అంగన్ వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 'ఆరోగ్య లక్ష్మి' కార్యక్రమ వివరాలు: 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు గతంలో నెలకు 8 కోడిగుడ్లు అందించేవారు. ఇప్పుడు నెలకు 16 కోడిగుడ్లు అందించనున్నారు. వీటితో పాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల సంచిని ప్రతినెల మొదటి తేదీన అందజేస్తారు. 3 నుంచి ఆరేళ్ల పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు అందించే వారు. ప్రస్తుతం ప్రతిరోజు గుడ్డు ఇవ్వాలని నిర్ణయించారు. వీటితో పాటు రోజూ పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, అల్పాహారాన్ని అందజేస్తారు. గర్భిణులు, బాలింతలకు గతంలో నెలకు మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె అందించేవారు. 68 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 16 గుడ్లు, 81 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 25 గుడ్లు అందించేవారు. ఇప్పుడు మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో నెలకు అన్ని రోజులు గుడ్లు, కనీసం 25 రోజుల పాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తారు. ఈ కార్యక్రమం కింద తెలంగాణ లోని 5,90,414 మంది గర్భిణులు, బాలింతలకు; 18,20,901 మంది పిల్లలకు ప్రభుత్వం ద్వారా షోషకాహారం అందుతుంది.¤ తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ తపాలా కార్యాలయాల్లో మొదలైంది. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో తితిదే కార్యనిర్వహణాధికారి సాంబ శివరావు, తపాలాశాఖ ఏపీ సర్కిల్ ఛీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ వీటి జారీని లాంఛనంగా ప్రారంభించారు. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 95 ప్రధాన తపాలా కార్యాలయాలు, రెండు ఉప తపాలా కార్యాలయాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు శ్రీవారి దర్శనం అందుబాటులోకి తెచ్చేందుకు తపాలా కార్యాలయాలు ఉపకరిస్తాయని అధికారులు వెల్లడించారు.¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా విశ్రాంత ప్రొఫెసర్ ఎం.ఎల్.కాంతారావు నియమితులయ్యారు. ఆయన శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర విభాగంలో డీన్‌గా పని చేశారు. » శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ముని రత్నం నాయుడు, ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ఆర్.సుదర్శన్ రావు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గుడిపూడి సంధ్యారాణి ఆర్థికసంఘం సభ్యులుగా నియమితులయ్యారు. » పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన సి.వెంకటేశ్వర రావు సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. » ఆర్థిక సంఘం కాల పరిమితి అయిదేళ్లు.
|
జనవరి - 6
|
¤ 'మిషన్ కాకతీయ' పైలాన్ నమూనాను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి గుర్తుగా ఈ పైలాన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. » తెలంగాణలోని దాదాపు 46వేల చెరువులను పునరుద్ధలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది 9 వేల చెరువులను పునరుద్ధరించనుంది. » తెలంగాణలో వేలాది చెరువులను తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను చేపట్టింది. వరంగల్ రాజధానిగా కాకతీయుల పాలన సాగడంతో పాటు ఎక్కువ చెరువులు ఈ జిల్లాలోనే ఉండటంతో పైలాన్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
జనవరి - 7
|
¤ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెల్లడించింది. » తెలంగాణ వ్యాప్తంగా గత ఆగస్టు 19న ఒక్క రోజులోనే 1,09,00,515 కుటుంబాలను సర్వే చేశారు. 3,85,892 మంది ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ సర్వే నిర్వహించారు. 1,01,93,027 కుటుంబాల వివరాలను తాజాగా కంప్యూటరీకరించారు.ముఖ్యాంశాలుతెలంగాణలో సగం మంది (51.08 శాతం) వెనకబడిన వర్గాలే అని సర్వేలో వెల్లడైంది. 21.50% మంది ఓసీలు, 17.50% మంది ఎస్సీలు, 9.91% మంది ఎస్టీలు, 14.46% మంది మైనార్టీలు ఉన్నట్లు తేలింది. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రికార్డులకెక్కించిన 1,01,93,027 కుటుంబాల్లో 3,63,37,160 మంది ఉన్నారు. జనాభా పరంగా 61,45,663 మందితో మొదటి స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో 27,71,320 మంది బీసీలు ఉండగా, 42,86,792 మంది ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 24,95,895 మంది; 38,42,584 మంది జనాభా ఉన్న కరీంనగర్ జిల్లాలో 24,08,627 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీల్లో రంగారెడ్డిది మొదటి స్థానం, మహబూబ్‌నగర్‌ది రెండో స్థానం కాగా, ఎస్టీల్లో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మైనార్టీల్లో హైదరాబాద్ మొదటి స్థానం, రంగారెడ్డి రెండో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఎయిడ్స్ రోగులు కూడా అధికంగానే ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 10,638 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. 7.58 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 1.17 లక్షల మందికి గుండె జబ్బులున్నాయి. 32,339 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 65,903 మంది పక్షవాతం బారిన పడగా, 65,903 మంది ఫ్లోరోసిస్‌కు గురయ్యారు. తెలంగాణలో ఆదాయపన్ను చెల్లించే కుటుంబాల సంఖ్య 7%గా తేలింది. మొత్తం ఏడు లక్షల కుటుంబాలు ఆదాయపన్ను చెల్లిస్తుండగా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనే 3.6 లక్షలున్నాయి. 30 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యత్వం ఉన్న కుటుంబాలు 35 శాతం మాత్రమే. 22 శాతం కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలున్న కుటుంబాల సంఖ్య కేవలం మూడు శాతమే. తెలంగాణలోని మొత్తం కుటుంబాల్లో హిందూ మతానికి చెందినవి 87.17 శాతంగా ఉన్నాయి. 11.01 శాతం ముస్లిం కుటుంబాలు కాగా, 1.27 శాతం క్రైస్తవ కుటుంబాలు, 0.15 శాతం సిక్కు కుటుంబాలు, 0.06 శాతం జైనుల కుటుంబాలు, 0.05 శాతం బౌద్ధుల కుటుంబాలు, 0.22 శాతం ఇతరుల కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం కుటుంబాల్లో మహిళలే పెద్దదిక్కుగా ఉన్న కుటుంబాలు 18.13 శాతంగా ఉన్నాయి. ఒక మహిళ ఉన్న కుటుంబాల శాతం 8.14 కాగా, ఒక మనిషి మాత్రమే ఉన్న కుటుంబాల శాతం 8.40, ఇద్దరు వ్యక్తులున్న కుటుంబాల శాతం 18.51 కాగా, ముగ్గురున్న కుటుంబాల శాతం 19.68, నలుగురున్న కుటుంబాల శాతం 30.78, అయిదుగురున్న కుటుంబాల శాతం 14, ఆరుగురున్న కుటుంబాలు శాతం 5.05, ఆరుగురి కంటే ఎక్కువ కుటుంబాల శాతం 3.50 గా ఉంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని మడకశిర పేటళ్లలో ఎత్తయిన ప్రదేశం నుంచి ఆర్టీసీ బస్సు కిందకు పడిపోయిన ఘటనలో 13 మంది విద్యార్థులు సహా 15 మంది మరణించారు. సంక్రాంతి ఉత్సవాల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
|
జనవరి - 8
|
¤ బిట్స్ పిలానీ అనుబంధ విద్యా సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ఆదిత్యబిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా ముందుకొచ్చారు. విశాఖపట్నంలోనే బిర్లా అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకూ సంసిద్ధత వ్యక్తం చేశారు. » హైదరాబాద్ సచివాలయంలో కుమార మంగళం బిర్లా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. » బిర్లా సంస్థ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు దగ్గర అల్ట్రాటెక్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ¤ నిజామాబాద్‌లో పసుపు వాణిజ్య పార్కు ఏర్పాటుకు జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి సాంకేతిక ఆమోదం తెలిపింది. » జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి ప్రధాన కార్యాలయం కేరళలోని కోచిలో ఉంది.
|
జనవరి - 10
|
¤ ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాల నిర్వహణకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ రూ.13.02 కోట్లు మంజూరు చేసింది. » తిరుపతిలో రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఈ వేడుకను కన్నుల పండువగా జరిపేందుకు వీలుగా ఈ నిధులు కేటాయించారు. » ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయుల్లో గ్రామీణ ఆటలు, స్థానికంగా ప్రసిద్ధి పొందిన కళారూపాలతో ప్రదర్శనలు చేపట్టనున్నారు. అలాగే ముగ్గుల పోటీలు, వంటల ప్రదర్శనలు; పంటల, పశువుల ప్రదర్శనలు; గాలి పటాల పోటీలు నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా సాంస్కృతిక మండళ్ల ఛైర్మన్‌లకు సమాచారం పంపించారు. ¤ ఆంధ్రప్రదేశ్‌లోని వృద్ధ కళాకారులకు చెల్లిస్తున్న పింఛను మొత్తం పెరిగింది. ఇప్పటి వరకూ నెలకు రూ.500 చొప్పున అందిస్తున్న పింఛనును రూ.1500లకు పెంచారు. పెంచిన మొత్తం జనవరి నుంచే చెల్లించనున్నారు. ¤ ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ ఆధ్యర్యంలో కాకినాడ బీచ్ (వాకలపూడీ)లో మూడు రోజులపాటు సాగే 'సాగర సంబరాలను' మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. » కాకినాడ సాగర తీరానికి ఎన్టీఆర్ పేరును పెడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు.¤ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తొలి దశలో ఏడు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. » తొలి దశలో అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ జిల్లాల్లో తాగునీటికి, పరిశ్రమలకు సరఫరా చేసేందుకు 73.134 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. దీనికి రూ.1400 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. » అనంతపురం జిల్లాకు పెన్నా అహోబిలం, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా, చిత్తూరు జిల్లాకు హంద్రినీవా సుజల స్రవంతి, గండికోట ద్వారా; వైఎస్ఆర్ కడపకు గండికోట మైలవరం ద్వారా, కర్నూలు జిల్లాకు శ్రీశైలం నీటిని; నెల్లూరు జిల్లాకు సోమశిల, కండలేరు నీటిని; గుంటూరు, ప్రకాశం జిల్లాల వాటర్‌గ్రిడ్‌కు కృష్ణా జలాలను వినియోగించాలని నిర్ణయించారు. » మొత్తం 13 జిల్లాలకు తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం వాటర్‌గ్రిడ్ ద్వారా 232.10 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చారు.
|
జనవరి - 11
|
¤ విశాఖ జిల్లా లంబసింగిలో 0 º
C (సున్నా డిగ్రీల సెల్సియస్) కనిష్ఠ ఉష్ణోగ్రత మళ్లీ నమోదైంది. చింతపల్లిలో 3 ºC కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. » 2014 డిసెంబరు 21న కూడా ఇదే ప్రాంతాల్లో, ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ¤ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్థాపించిన స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ¤ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారి సత్రం మండలం నేలపట్టు, సుళ్లూరు పేట పట్టణం, పులికాట్ సరస్సు ప్రాంతాల్లో మూడురోజులపాటు నిర్వహించిన పక్షుల పండగ ముగిసింది. ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షులను దృష్టిలో పెట్టుకుని ఈ పండగ నిర్వహించారు. |
జనవరి - 12
|
¤ సౌర విద్యుత్ ఉత్పాదనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా సోలార్ రూఫ్ టాప్ తదితరాల ఏర్పాటులో శిక్షణ ఇచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వంతో ఒక అవగాహన కుదుర్చుకుంది. » 'వైబ్రెంట్ గుజరాత్' సందర్భంగా ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
|
జనవరి - 14
|
¤ విశాఖపట్నం జిల్లా పూడిమడికలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ఏర్పాటు చేయదలచిన భారీ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు ప్రతిపాదించిన స్థలం సునామీలు/భారీ వరదలు వచ్చే ప్రాంతంలో ఉన్నందున నిర్మాణానికి అనుమతించలేమని, వేరే చోటుకు మార్చుకోవాలని సూచించింది.
|
జనవరి - 15
|
¤ దేశ రాజధాని దిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరం విజయవాడకు ఎయిర్ ఇండియా సంస్థ డైరెక్ట్ సర్వీసును ప్రారంభించింది.
|
జనవరి - 17
|
¤ విశాఖ శివారు గంభీరంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం - విశాఖపట్నం)కు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ¤ ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 6.54 కోట్లకు చేరింది. ముఖ్యంశాలు: » ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు 12 జిల్లాల్లో (అనంతపురం మినహా) మహిళా ఓటర్లే పురుషుల కంటే అధికంగా ఉన్నారు. » తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు ఎనిమిది జిల్లాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. » ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 3,70,82,855 మంది నమోదు అయ్యారు. వీరిలో 1,86,64,912 మంది మహిళా ఓటర్లు కాగా, 1,84,14,685 మంది పురుష ఓటర్లు. మూడో జండర్ ఓటర్లు 3,258 మంది ఉన్నారు. » తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2,83,15,120కి చేరింది. వీరిలో పురుషులు 1,44,72,054 మంది కాగా 1,38,40,715 మంది మహిళా ఓటర్లు. 2,351 మంది మూడో జండర్ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. » తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో 87,67,735 మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 3,81,112 మంది అధికంగా ఉన్నారు. » ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో 4,27,085 మంది కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నారు. సవరణకు ముందు ఉభయ రాష్ట్రాల్లో 6,49,70,890 ఓటర్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 6,53,97,975కు చేరింది. తెలంగాణలో ఓటర్లుగా 49,031 మంది అదనంగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 3,78,045 మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారు. » తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2,82,66,089 నుంచి 2,83,15,120కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు 3,67,04,801 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 3,70,82,855కు చేరింది. ¤ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక ఏర్పడ్డ కాళోజీ ఆరోగ్య వైద్యవిశ్వవిద్యాలయం తొలి రిజిస్ట్రార్‌గా డాక్టర్ బక్కరాజు బాధ్యతలు స్వీకరించారు.
|
జనవరి - 18
|
¤ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలో ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. » మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వేలివెన్ను నుంచి శెట్టిపేట, తాళ్లపాలెం, సింగవరం మీదుగా నిడదవోలు వరకు సుమారు 18 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. » ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెల్లో పుట్టి ఇతర దేశాల్లో ఉంటున్నవారు, దేశంలోనే ఇతర ప్రాంతాల్లో వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడినవారు తమ తమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ¤ రాష్ట్రవ్యాప్తంగా భూముల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ చేయడానికి మూడు సభా సంఘాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఛైర్మన్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. » రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార గృహ నిర్మాణ సంఘాల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి వరంగల్ జిల్లా వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు.
|
జనవరి - 19
|
¤ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.18 వేల కోట్లతో సమర్పించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదించారు. » ఈ పథకం ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో 7 లక్షలు, రంగారెడ్డిలో 2.5 లక్షలు, నల్గొండలో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ¤ విశాఖ జిల్లా లంబసింగిలో మళ్లీ 0º C, చింతపల్లిలో 3º C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
|
జనవరి - 20
|
¤ ఆదివాసీల నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ¤ విభజన బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిన 'ఎయిమ్స్'ను నల్గొండ జిల్లా బీబీనగర్‌లోని నిమ్స్ ప్రతిపాదిత ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
|
జనవరి - 21
|
¤ కాకినాడ సెజ్‌లో తొలి పరిశ్రమగా 'రూరల్ బీపీవో' ప్రారంభమైంది. » జీఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్, దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ¤ దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని మరింత పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. » గోదావరి నుంచి మూడు దశల్లో 38.15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఈ పథకాన్ని చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు 60 టీఎంసీల నీటిని మళ్లించాలని నిర్ణయించింది. » 2004లో దేవాదుల మొదటి దశను ప్రారంభించిన ప్రభుత్వం తర్వాత మరో రెండు దశలను చేపట్టింది. ¤ కూచిపూడి నాట్యకళకు పుట్టినిల్లు అయిన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ ప్రకటించింది. » ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునకు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నామని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. |
జనవరి - 23
|
¤ తెలంగాణ రాష్ట్ర రహదారి భద్రతా మండలి (రోడ్ సేఫ్టీ కౌన్సిల్)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » 29 మంది సభ్యులతో ఉండే ఈ మండలికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.¤ 'విశాఖ ఉత్సవ్' కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వీటి ప్రత్యేకతలను తెలియజేసేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
|
జనవరి - 24
|
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై అధ్యయనం చేయడానికి నిర్ణయించింది. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, ప్రాజెక్టుల సమీకృత నిర్వహణకు సంబంధించిన అంశాలపై రూర్కీలోని జాతీయ జలధర్మ శాస్త్ర విద్యా సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ -ఎన్ఐహెచ్) ఈ అధ్యయనం నిర్వహిస్తుంది. » కృష్ణా బేసిన్‌లో మూడు టీఎంసీలకు మించి సామర్థ్యం ఉన్న అన్ని ప్రాజెక్టులపై ఆలమట్టి, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల పైనా అధ్యయనం చేసి నివేదికను అందజేసే బాధ్యతను ఎన్ఐహెచ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
|
జనవరి - 25
|
¤ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గం నుంచి తొలగించారు. » రాజయ్య స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి విద్యా శాఖను అప్పగించారు. » గవర్నర్ నరసింహన్ శ్రీహరితో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. » మంత్రుల శాఖల్లో కూడా సీఎం కేసీఆర్ మార్పులు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డికి విద్యుత్తు శాఖను కేటాయించారు. లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్యశాఖను కేటాయించారు.¤ చాలా ఏళ్లుగా తెలంగాణ జిల్లాలో అనేక బాధలు పడుతున్న బీడీ కార్మికుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. » బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి వీరికి నెలకు రూ.1000 చొప్పున 2015 మార్చి నుంచి అందించాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.¤ తెలంగాణ రాష్ట్రంలో మరో పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. అర్బన్ జిల్లాగా ఉన్న వరంగల్‌ను కమిషనరేట్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. » 2011 గణాంకాల ప్రకారం 13,09,848 జనాభాతో తెలంగాణలోనే వరంగల్ పెద్ద పట్టణంగా ఉందని, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌ను కమిషనరేట్‌గా మార్చుతున్నామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
|
జనవరి - 27
|
¤ అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే దిశగా (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జనధన్ యోజన (పీఎంజేడీవై) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నూరు శాతం అమలు అయినట్లు ఈ రెండు రాష్ట్రాల లీడ్ బ్యాంకులు ప్రకటించాయి. » ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజేడీవై లక్ష్యాన్ని సాధించినట్లు ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి వెల్లడించింది. దీనిప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో నివసించే ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున సేవింగ్స్ ఖాతా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 49.47 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో 28.32 లక్షల ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో, 21.15 లక్షల ఖాతాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో కలిసి రాష్ట్రం మొత్తం 1,18,55,000 కుటుంబాల్లో 99.70 శాతానికి బ్యాంకు ఖాతాలు ఏర్పడ్డాయి. » తెలంగాణలో 52 లక్షల కుటుంబాలు ఉండగా, ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు బ్యాంకింగ్ సేవల పరిధిలో ఉన్నట్లు ఎస్‌బీహెచ్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది. » ఆంధ్రప్రదేశ్ లీడ్‌బ్యాంక్‌గా ఆంధ్రాబ్యాంకు, తెలంగాణ లీడ్ బ్యాంక్‌గా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు వ్యవహరిస్తున్నాయి. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో ఈ పథకం అమలైంది. జమ్మూకశ్మీర్, ఒడిశా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలు మాత్రమే కాస్త వెనుకంజలో ఉన్నాయి. » కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు 21.05 కోట్లు కాగా, ఇందులో 20.99 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. ఈ మొత్తంలో 11.50 కోట్ల ఖాతాలు సీఎంజేడీవై పథకం కింద ప్రారంభించినవే కావడం గమనర్హం. ఈ ఖాతాల్లో ఇప్పటికే రూ.9188 కోట్ల మొత్తం జమ అయింది.
|
జనవరి - 28
|
¤ అరుదైన, నాణ్యమైన విత్తనాలను భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాలం దాచుకోవడానికి విత్తన బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. » రైతులు, విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలను దాచుకునే విధంగా ప్రైవేటు రంగంలో మొదటి జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్‌ను గుబ్బా గ్రూప్ హైదరాబాద్‌కు సమీపంలో రూ.4 కోట్ల పెట్టుబడితో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. » ఈ జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్‌ను సినీనటి అక్కినేని అమల లాంఛనంగా ప్రారంభించారు.¤ పంట చేతికి వచ్చాక నిల్వచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని (పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ) అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.¤ బాబా అణు పరిశోధన సంస్థ (బీఏఆర్‌సీ - బార్క్) విశాఖపట్నం శివారులోని దిబ్బపాలెంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. » బార్క్ ఇటీవల కాలంలో అణుశక్తి సంబంధ పరిశోధనలతో పాటు పలు అనుబంధ సాంకేతిక పరిజ్ఞానాలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.¤ వరంగల్ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హోదా కల్పించింది. » వరంగల్ నగరపాలక సంస్థ పేరును గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చారు. » తాజాగా 42 పంచాయితీల విలీనంతో వరంగల్ జనాభా 10 లక్షలకు చేరువైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
|
జనవరి - 30
|
¤ 'ఫాస్ట్' పథకాన్ని విరమించుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. పాత పద్ధతిలోనే ఫీజు తిరిగి చెల్లించే పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. » హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఛాతీ ఆసుపత్రిలో కొత్త సచివాలయ నిర్మాణం కోసం రూ.150 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. » జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 125 గజాల్లో గుడిసెలు, ఇళ్లు వేసుకున్న పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ¤ ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంచేందుకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్ ముందుకొచ్చింది. » 'ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్' పేరిట తమిళనాడులో నిర్వహిస్తున్న మొక్కల పెంపకం, పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న విధంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ కార్యక్రమం చేపడతామని ఈషా ఫౌండేషన్ ప్రకటించింది.
|
జనవరి - 31
|
¤ ఒకేసారి 1,28,918 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. » గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో నాలుగు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తాజాగా వీరు తిరగరాశారు.¤ విశాఖపట్నంలో జాతీయ సమగ్ర అధ్యయన సంస్థ (ఎన్ఐవో) ప్రాంతీయ కేంద్రం భవనాల సముదాయానికి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment