జనవరి - 2
|
¤ ఐసీఐసీఐ గ్రూప్ చేపట్టిన 'డిజిటల్ విలేజ్' కార్యక్రమాన్ని ముంబయిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. » గుజరాత్‌లోని అకోదర గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐసీఐసీఐ బ్యాంక్ నగదు రహిత బ్యాంకింగ్, ఈ-హెల్త్, డిజిటలైజ్డ్ పాఠశాలలు, మండీలు మొదలైన వాటితో దాన్ని డిజిటల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతోంది. » అన్ని విషయాల్లోను టెక్నాలజీ ప్రయోజనాలను స్థానికులకు అందుబాటులోకి తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ¤ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు అమెరికా స్వచ్ఛంద సంస్థలకు అందుతున్న నిధులపై భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పరిమితులు విధించింది. » 'ఆవాజ్', 'బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్', 'సియర్రా క్లబ్', '350 .ఓఆర్జీ' కు విదేశాల నుంచి వస్తున్న నిధుల స్వీకరణపై నిషేధం విధించింది. ఈ సంస్థలు లేదా వాటి ప్రతినిధులు నిధులు స్వీకరించరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. » ఆయా సంస్థలకు విదేశాల నుంచి విరాళాల రూపంలో అందుతున్న డబ్బు కొందరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
|
జనవరి - 6
|
¤ ఎవరూ ఊహించని విధంగా భారత్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఏకంగా అయిదున్నరేళ్ల లోనే 'అత్యధిక ఒక రోజు పతనాన్ని' నమోదు చేశాయి. » బీఎస్ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ దెబ్బతో మదుపర్ల సంపద ఏకంగా రూ.3 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. » యూరో ప్రాంతంలో ఓ చిన్న దేశమైన గ్రీసులో రాజకీయ సంక్షోభమే ఇందుకు కారణం. ఆ దేశం యూరో జోన్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వస్తుందేమోననే భావనలు అంతర్జాతీయ మార్కెట్లను కూల దోశాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు అంతక్రితం రోజు అంతర్జాతీయంగా బ్యారెల్‌కు 50 డాలర్ల దిగువకు చేరడం కూడా ప్రతికూలతలను ఎగదోశాయి. దీంతో మన మార్కెట్‌లకు కష్టనష్టాలు కలిగాయి. » తాజా నష్టం జులై 6, 2009 తర్వాత అంటే అయిదున్నరేళ్ల తర్వాత మార్కెట్‌కు వాటిల్లిన అత్యధిక నష్టం ఇది.¤ నెలలవారీగా నగదు దాచుకునే ఖాతాదారుల కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) కొత్తగా నెలవారీ పొదుపు డిపాజిట్ పథకం 'ఎస్‌బీహెచ్ - కుబేర మంత్లీ'ని ప్రవేశపెట్టింది. » ఈ రికరింగ్ డిపాజిట్ పథకం కింద ఖాతాదారులు నెలకు రూ.2,500 చొప్పున మూడేళ్లు పాటు జమ చేస్తే చివరకు రూ.1,02,649 లభిస్తుంది. ఈ డిపాజిట్‌పై అత్యధికంగా 8.85 శాతం వడ్డీరేటు చెల్లిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2,500 గుణిజాల్లో (రూ.5,000, రూ.7,500 మొదలైనవి) కూడా ఖాతాదారులు డిపాజిట్ చేయొచ్చు.
|
జనవరి - 7
|
¤ ఐసీఐసీఐ బ్యాంక్ భారత్‌లో తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, ఎక్స్‌ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీతో పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. » ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయని బ్యాంక్ ప్రకటించింది. » ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబయి, గుడగావ్‌లలో ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ప్రకటించింది.
|
జనవరి - 9
|
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి రూ.1827.24 కోట్ల విలువైన 12 ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది.¤ స్విట్జర్లాండ్‌కు చెందిన కన్సల్టింగ్, సేవల సంస్థ సాఫ్ జెన్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్ర వెల్లడించింది.¤ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ 'విస్తారా' విమానయాన సేవలు ప్రారంభమయ్యాయి. » దిల్లీలో బయలుదేరిన తొలి విమానానికి టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా శుభాకాంక్షలు తెలిపారు. ముంబయి విమానాశ్రయానికి చేరిన ఈ విమానానికి టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఆహ్వానం పలికారు. » ప్రస్తుతం పూర్తిస్థాయి విమానయాన సంస్థలుగా ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ ఉన్నాయి. 'విస్తారా' 3వ సంస్థ అవుతుంది. ఈ సంస్థలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలున్నాయి.
|
జనవరి - 12
|
¤ నవంబరులో పారిశ్రామికాభివృద్ధి (ఐఐపీ) 5 నెలల గరిష్ఠ స్థాయి 3.8 శాతానికి చేరింది. తయారీ, తవ్వక రంగాలు మెరుగుకావడంతోపాటు యంత్ర పరికరాలు రాణించడంతో ఇది సాధ్యమైంది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ 1.3 శాతం క్షీణించడం గమనార్హం. గతేడాది అక్టోబరులో ఐఐపీని - 4.2 శాతానికి సవరించారు. 2014 - 15 ఏప్రిల్ - నవంబరు కాలంలో ఐఐపీ 2.2 శాతం వృద్ధి చెందింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇది 0.1 శాతంగా నమోదైంది. ¤ పళ్లు, కూరగాయలతోపాటు కొన్ని ఆహార వస్తువుల ధరలు ప్రియం కావడంతో డిసెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కాస్తంత పెరిగి 5 శాతానికి చేరింది. నవంబరులో ఇది 4.38 శాతంగా నమోదైంది. జనవరి 2012లో కొత్త విధానం మొదలు పెట్టినప్పటి నుంచి నమోదైన కనిష్ఠ స్థాయి నవంబరుదే. ఇక డిసెంబరు 2013లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతంగా ఉంది.
|
జనవరి - 19
|
¤ ఏడాది కిందట ఫేస్‌బుక్ ద్వారా నగదు బదలాయించే సౌకర్యాన్ని ప్రారంభించిన ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా ట్విటర్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని కల్పించింది. » నగదు బదిలీతోపాటు నిల్వను తెలుసుకోవడానికి, మొబైల్ రీచార్జ్‌లకు కూడా ఈ సౌకర్యం వీలు కల్పిస్తుంది.
|
జనవరి - 23
|
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 13% పెరిగి రూ.5.46 లక్షల కోట్లకు చేరాయి. » 2013-14 ఇదే కాలంలో ఈ మొత్తం 4.84 లక్షల కోట్లు మాత్రమే. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో కార్పొరేట్ పన్నులు 12.79% పెరిగి రూ.3.50 లక్షల కోట్లకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను 12.62% పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరాయి. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రాబడి 16% పెరిగి, రూ.7.36 లక్షల కోట్లకు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వాస్తవానికి గత 9 నెలల్లో రిఫండ్‌లు పోగా, నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.4.48 లక్షల కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం నికర వసూళ్లతో పోలిస్తే ఇది 7.41% అధికం.
|
జనవరి - 24
|
¤ ప్రస్తుతం టెలికాం సర్కిల్ (ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాలు) పరిధిలో అమలవుతున్న మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)ని దేశస్థాయిలో మే 3 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఇందుకోసం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. » ఇప్పటివరకు ఒక టెలికాం సర్కిల్ పరిధిలోని మొబైల్ ఖాతాదారులు, తమ నెంబరు మారకుండానే వేరే టెలికాం నెట్‌వర్క్‌కు మారే అవకాశం ఉంది. ఇతర టెలికాం సర్కిళ్ల (రాష్ట్రాల)కు మారితే, నెంబరు పోతుంది. » మే 3 నుంచి ఈ ఇబ్బంది ఉండదు. దేశంలో ఏ రాష్ట్రం/టెలికాం సర్కిల్ పరిధిలోని ఖాతాదారు మరే రాష్ట్రం/టెలికాం సర్కిల్ పరిధిలోకి వెళ్లినా, అక్కడ తన నెంబరు మారకుండానే నచ్చిన టెలికాం నెట్‌వర్క్ సేవలను ఎంచుకోవచ్చు.
|
జనవరి - 27
|
¤ ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో గతేడాది భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. భారత్ గత అయిదు సంవత్సరాలుగా వరుసగా ఇదే స్థానంలో ఉంది. » వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్ఏ) గణాంకాల ప్రకారం 2014లో భారత్ 83.20 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కు ఉత్పత్తి చేసింది. » 822.7 మిలియన్ టన్నులతో చైనా మొదటి స్థానంలో ఉండగా, 110.66 ఎంటీలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది. 88.34 మిలియన్ టన్నులతో అమెరికా మూడో స్థానంలో ఉంది. » 2009లో భారత్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత నాల్గో స్థానానికి పడిపోయింది. భారత్ ప్రస్తుత వ్యవస్థీకృత ఉత్పత్తి సామర్థ్యం 100 మిలియన్ టన్నులు. 2013లో సగటున ప్రపంచ తలసరి ఉక్కు వినియోగం 225 కేజీలు. అయితే ఈ విషయంలో భారత్ పరిమాణం కేవలం 57.8 కేజీలుగా ఉన్నట్లు డబ్ల్యూఎస్ఏ వెల్లడించింది. » ప్రపంచం మొత్తంగా 2014లో ఉక్కు ఉత్పత్తి 1,661 మిలియన్ టన్నులని డబ్ల్యూఎస్ఏ గణాంకాలు వెల్లడించాయి. 2013తో పోల్చితే 1.2 శాతం (1,642 ఎంటీ) పెరిగింది. ఇందులో 1,132 ఎంటీలతో ఆసియా మొదటి స్థానంలో ఉంది. 310 ఎంటీలతో యూరప్ రెండో స్థానం దక్కించుకుంది.¤ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫిలిప్పీన్స్ లో చేపట్టిన 'సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ' ప్రాజెక్టు విస్తరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబీ) 75 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది.
|
జనవరి - 30
|
¤ 2013-14లో భారత వృద్ధి రేటును 6.9 శాతంగా ప్రభుత్వం సవరించింది. అంత క్రితం 4.7 శాతంగా నమోదైంది. అయితే జీడీపీ గణాంకాలను లెక్కకట్టడం కోసం ప్రాతిపదిక (ఆధార) సంవత్సరాన్ని 2011-12 ఏడాదికి సవరించడంతో వృద్ధి రేటులో మార్పు వచ్చింది. » అధిక వృద్ధి రేటు వల్ల ద్రవ్యలోటుపై ఎలాంటి సానుకూల ప్రభావం పడబోదు. ఎందుకంటే సవరణ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) పరిమాణం రూ.113.45 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ప్రాతిపదిక సంవత్సరమైన 2004-05 స్థానంలో 2011-12ను ఎంచుకోవడంతో 2013-14 వృద్ధి 4.7% నుంచి 6.9 శాతానికి చేరింది. » ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రాతిపదికలో మార్పు చేస్తుంటారు. 2012-13కి కూడా ఆర్థిక వృద్ధి రేటును అంత క్రితం అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు.
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment