జనవరి - 2015 సదస్సులు - సమావేశాలు



జనవరి - 3

¤ 102వ 'భారత సైన్స్ కాంగ్రెస్‌'ను ముంబయి విశ్వవిద్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు సామాన్య, పేద ప్రజలకు చేరాలని పిలుపునిచ్చారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఎంత ముఖ్యమో శాస్త్ర పరిశోధనలను సునాయాసంగా చేపట్టేలా చూడటమూ అంతే కీలకమని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా చేయాలన్నారు. డిజిటల్ సంధానత మౌలిక హక్కుగా ఉండాలని చెప్పారు. సమాజంలో సైన్స్ పట్ల 'మోజు'ను పునరుద్ధరించాలని, చిన్నారుల్లో దీనిపై ఉన్న అభిమానం పెరిగేలా చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
       » అయిదు రోజులపాటు జరిగే సైన్స్ కాంగ్రెస్‌లో దేశ విదేశాల నుంచి వచ్చిన 12వేల మందికి పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు పాల్గొంటున్నారు.
       » ఈ సందర్భంగా నోబెల్ పురస్కార గ్రహీతలైన కుర్ట్ వత్‌రిచ్ (స్విట్జర్లాండ్), ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), రాండి చెక్‌మాన్ (అమెరికా)లను ప్రధాని మోదీ సత్కరించారు.
       » భారత సైన్స్ కాంగ్రెస్‌ను పురస్కరించుకుని 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' పేరిట ముంబయిలోని బాంద్ర-కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎంఆర్‌డీఏ మైదానంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఇందులో భారత్‌కు చెందిన అగ్రశ్రేణి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధన ల్యాబ్‌లు, విద్యాసంస్థలు అభివృద్ది చేసిన అత్యాధునిక పరిజ్ఞానం, ఉత్పత్తులతోపాటు పరిశోధన, అభివృద్ధిలో కీలక విజయాలను ప్రదర్శించారు.
¤ మహారాష్ట్రలోని పుణెలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ బ్యాంకర్ల సమావేశం 'జ్ఞాన్ సంగమ్' ముగిసింది.
       » ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 27 మంది ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్‌బీఐ గవర్నరు రఘురామ్ రాజన్, ఆర్థికశాఖ సహాయ మంత్రి సిన్హా, ఆర్థికసేవల కార్యదర్శి అధియా వంటి ప్రముఖులతోపాటు నలుగురు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ప్రభుత్వ బీమా సంస్థలు, ఆర్థిక సంస్థల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బహుశా దేశ చరిత్రలో బ్యాంకింగ్ దిగ్గజాలంతా పాల్గొన్న తొలి సమావేశం ఇదే కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
       » 'జ్ఞాన్ సంగమ్' సమావేశాల్లో ఎన్నో కీలకాంశాలు చర్చకొచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి, విధాన నిర్ణయాల్లో భరోసా వంటివి ఇందులో కీలకం. వీటిలో కొన్నింటికి తక్షణ పరిష్కారం కూడా దొరికింది.

జనవరి - 6

¤ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.
       » దేశ విద్యావ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్న ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)కు ఈ సమావేశంలో రాష్ట్రాల నుంచి ఆమోదం లభించింది.
       » సీబీసీఎస్ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టును మధ్యలో ఎంచుకోవచ్చు. విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండానే మరో విశ్వవిద్యాలయానికి మధ్యలో మారవచ్చు. తమకు వీలయినంత కాలవ్యవధిలో నచ్చిన కోర్సులను నేర్చుకోవచ్చు. అదనపు కోర్సులు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యా సంస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా మారొచ్చు.

జనవరి - 7

¤ 102వ భారత సైన్స్ కాంగ్రెస్ ముగిసింది. భారత సైన్స్ కాంగ్రెస్‌తో పాటు 'బాలల సైన్స్ కాంగ్రెస్', 'మహిళల సైన్స్ కాంగ్రెస్', వైజ్ఞానిక ప్రదర్శను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.
       » ముంబయి విశ్వవిద్యాలయం అతిథ్యం ఇచ్చిన ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 15 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు.
       » ఈ సమావేశాల్లో ప్రాచీన భారతదేశంలో శాస్త్రసాంకేతిక రంగాలు, వైమానిక రంగం, శస్త్ర చికిత్సలు, గణిత శాస్త్రం తదితర అంశాలపై చర్చ జరిగింది.
జనవరి - 9

¤ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా మందిర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన ప్రవాస భారతీయ దినోత్సవం ముగిసింది.
       » ముగింపు సందర్భంగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రవాస భారతీయులకు ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు.
       » పీఐవో (భారత సంతతి వ్యక్తి) కార్డు ఉన్నవారంతా ఇక ఓసీఐ (ప్రవాస భారత పౌరులు) కార్డును కలిగి ఉన్నట్లే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పీఐవో కార్డుదారులంతా ఓసీఐ కార్డును కలిగి ఉన్నట్లుగా అయ్యింది. ఇక విస్తృత ప్రయోజనాలతో ఒకే ఒక్క ఓసీఐ కార్డు అమల్లో ఉంటుంది.
       » పీఐవో, ఓసీఐ పథకాన్ని విలీనం చేస్తూ ప్రభుత్వం జనవరి 6న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం పీఐవోలకు జీవితకాలంపాటు భారత వీసా లభిస్తుంది.
       » ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవాస భారతీయ దివస్‌లో పాల్గొని ప్రసంగించారు.

జనవరి - 11

¤  గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో వైబ్రంట్ గుజరాత్ (ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సు) ప్రారంభమైంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
       
       » ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గేతోపాటు వివిధ దేశాల నుంచి విశిష్ట అతిథులు, పారిశ్రామిక దిగ్గజాలు, వందకు పైగా ఫార్చ్యూన్ కంపెనీలు, అయిదువందల సంస్థల సీఈఓలు, ఇతర ప్రముఖులు హాజరైన ఈ సదస్సులో భారత పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, కె.ఎం. బిర్లా, ఆది గోద్రెజ్ తదితరులు పాల్గొన్నారు.
       » రాబోయే 18 నెలల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ సదస్సులో వెల్లడించారు.
       » గుజరాత్‌లోని తమ ప్లాంట్ల సామర్థాన్ని పెంచేందుకు రూ.20,000 కోట్లు పెట్టుబడి పెడతామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సదస్సులో వెల్లడించారు.
       » గుజరాత్‌లో రూ.25,000 కోట్ల పెట్టుబడితో సౌర విద్యుత్తు పార్కు నెలకొల్పాలని అదానీ ఎంటర్‌ప్రైజెస్, అమెరికా కేంద్రంగా పనిచేసే సన్ ఎడిసన్ సంయుక్తంగా నిర్ణయించాయి.
       » ఏడాదికి 1.50 లక్షల కార్లు తయారు చేసేలా రూ.4000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో నిర్మిస్తున్న ప్లాంటు 2017కు పూర్తవుతుందని 'సుజుకీ మోటార్ కార్పొరేషన్

' ఛైర్మన్ ఒసాము సుజుకీ చెప్పారు.
       » ఏడాదికి 60,000 టన్నుల ఫైబర్ గ్లాస్ తయారు చేసే పరిశ్రమను రూ.2000 కోట్ల పెట్టుబడితో భారూచ్‌లో ఏర్పాటు చేస్తామని వీడియోకాన్ గ్రూప్ సహ ప్రమోటర్ రాజ్‌కుమార్ ధూత్ తెలిపారు.
       » హాంకాంగ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే చైనా లైట్ అండ్ పవర్ హోల్డింగ్స్ 2000 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని రూ.12,000 కోట్లతో నిర్మించేందుకు సుముఖత చూపింది.
       » ఈ సదస్సులో 31 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 60,000 గిరిజన కుటుంబాల అభ్యున్నతి కోసం రతన్‌టాటా అండ్ నవాజ్ భాయ్ రతన్ టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది.
¤ యువ పార్లమెంటు వార్షిక సదస్సును పుణెలో నిర్వహించారు.
       » ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఈ సదస్సులో 'మహిళా సాధికారత' అనే అంశంపై ప్రసంగించారు.
జనవరి - 12

¤ 19వ జాతీయ యువజన సమ్మేళనం ఉత్సవాలను గౌహతిలో నిర్వహించారు.
      » ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి.
      » కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జనవరి - 19

¤ ప్రపంచ మరుగుదొడ్ల సదస్సు దిల్లీలో ప్రారంభమైంది.
      » కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
      » మరుగుదొడ్ల వాడకాన్ని జీవన సరళిలో భాగంగా చేయాల్సి ఉందనీ, అప్పుడే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలోని 7135 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పరంగా ఏ ఒక్కటీ హరిత నగరంగా అర్హత సాధించలేక పోయిందని ఆయన వెల్లడించారు. 90 పాయింట్లను సాధించాల్సి ఉండగా ఛండీగఢ్, దిల్లీ, సూరత్, మైసూరు మాత్రం 66 పాయింట్లను దక్కించుకున్నాయని చెప్పారు. అపారిశుద్ధ్యం కారణంగా దేశంలో ఏటా 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.24 లక్షల కోట్లు) స్థూల జాతీయోత్పత్తిని నష్టపోతున్నామని ఆయన తెలిపారు.

జనవరి - 20

¤ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రారంభమయ్యాయి.
      » డబ్ల్యుఈఎఫ్ వార్షిక సమావేశాలు గత 45 ఏళ్లుగా దావోస్‌లోనే జరుగుతున్నాయి. 2002లో మాత్రం ఉగ్రవాద దాడులకు గురైన అమెరికాకు సంఘీభావం ప్రకటించడానికి వేదికను ఆ దేశానికి మార్చారు.
      » 'భారత్‌లో తయారీ' (మేక్ ఇన్ ఇండియా) కార్యక్రమానికి ప్రాచుర్యం కల్పించడానికి భారత ప్రతినిధులు ఈ సదస్సులో తగిన ఏర్పాట్లు చేశారు. గతంలో 'ఇండియా అడ్డా' పేరుతో భారతదేశ కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రచారం కల్పించేవారు. ఈసారి ఆ పేరును మార్చి 'మేక్ ఇన్ ఇండియా' పేరుతోనే ఒక ఆవరణను ఏర్పాటు చేశారు.
      » ఈ సమావేశాలకు మొత్తం 2500 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతుండగా, వారిలో 17% మంది మహిళలు ఉన్నారు.

జనవరి - 23

¤ 'హైదరాబాద్ సాహిత్య పండుగ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - హెచ్ఎల్ఎఫ్)' వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
      » ప్రముఖ గేయ రచయిత, కవి, కథా రచయిత, పద్మభూషణ్ జావెద్ అక్తర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
¤ ప్రపంచవ్యాప్తంగా 18 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,080 లక్షల కోట్లు) నల్లధనం పోగుబడి ఉందని బ్రిటన్‌కు చెందిన పరిశోధన సంస్థ ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.
      » స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
      » ఈ సొమ్మును తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడితే ఎంతో మంది పేదరికం నుంచి బయటపడతారని సంస్థ తెలిపింది.

జనవరి - 26

¤ భారత్ - అమెరికా సీఈవో వేదిక సమావేశాన్ని, భారత్ - అమెరికా వాణిజ్య సదస్సును దిల్లీలో నిర్వహించారు.
      » ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

జనవరి - 27

¤ విశాఖపట్నం, అలహాబాద్, అజ్మీర్‌లను ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్‌ సిటీస్)గా తీర్చిదిద్ది, సత్వర చర్యలు తీసుకునేందుకు వీలుగా సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని భారత, అమెరికాలు నిర్ణయించాయి.
      » కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, అమెరికా వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్‌కర్‌ల మధ్య దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్ టీడీఏ) సాయంతో ఈ మూడు నగరాలను అభివృద్ధి చేయాలనే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం జరిగింది.

జనవరి - 30

¤ 'ఈ - పాలన'పై ఏర్పాటైన 18వ జాతీయ సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.
      » మొబైల్ - పాలన (ఎం-గవర్నెన్స్)ను విస్తృతపరచడానికి సెల్‌ఫోన్ల ద్వారా వీలైనన్ని సేవలను అందించే అవకాశాలను పరిశీలించాలని ఐటీ నిపుణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.
      » ఒక సభను ఉద్దేశించి మాట్లాడటానికి ప్రధానమంత్రి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్‌ను వినియోగించడం ఇదే ప్రథమం.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment