జనవరి - 2015 వార్తల్లో వ్యక్తులు




జనవరి - 2

¤ పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ నరసింహా రెడ్డితో ప్రమాణం చేయించారు.
     » భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన మొదటి భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (46) దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.

జనవరి - 4

¤ అంధుల కోసం లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం వికలాంగుల సాధికారత శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కూడా బ్రెయిలీ జయంతిని నిర్వహించాయి.
     » 1809 జనవరి 4 ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో లూయిస్ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో ఒక కంటిలో సూది గుచ్చుకోవడంతో మరో కంటి దృష్టి కూడా కోల్పోయి అంధులయ్యారు. అంధులు చదవడానికి అనువుగా ఏదైనా లిపిని కనుక్కోవాలనుకున్నారు. దీంతో 12 ఏళ్ల వయసులోనే, ఆయన ఉబ్బెత్తుగా ఉండే చుక్కల విధానంతో ప్రయోగం చేశారు. 17వ ఏట పూర్తి విధానాన్ని ఆవిష్కరించి, ఇతర అంధులకు దాన్ని బోధించడం ప్రారంభించారు.
     » 1852 జనవరి 6న లూయిస్ బ్రెయిలీ మరణించారు.
¤ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మేయర్‌గా మధు కిన్నార్ అనే హిజ్రా గెలుపొందారు.
     » స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మధు కిన్నార్ సమీప భాజపా అభ్యర్థి మహావీర్ గురూజీపై 4,537 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
     » ఒక హిజ్రా మేయర్‌గా ఎన్నికవ్వడం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

జనవరి - 6

¤ ఫోర్బ్స్ ఆరువందల మందితో ప్రకటించిన యువ ఒరవడి నిర్దేశకుల ప్రపంచవ్యాప్త జాబితాలో 44 మంది భారతీయులు/ భారతీయ సంతతి వారు చోటు పొందారు. ఐటీ, పెట్టుబడులు, విధానాల రూపకల్పన తదితర 20 రంగాల్లో ఉన్న 30 ఏళ్లలోపు వారిని ఈ జాబితా కోసం పరిగణలోకి తీసుకున్నారు.
     » నితీష్ బాంటా, అంకుర్ జైన్, అవినాష్ గాంధీ, పార్థ ఉన్నవ, అమన్ అద్వానీ, ఇష్వీన్ ఆనంద్, విజయ్ చుదసమా, వినీత్ మిశ్రా, వివేక్ రవిశంకర్, దీపికా కురుప్, నిఖిల్ అగర్వాల్, రాహుల్‌రేఖీ, విక్రమ్ అయ్యర్ తదితురులు ఈ జాబితాలో ఉన్నారు.
¤ ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగానికి ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్) గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ఎన్నికయ్యారు.
¤ గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), సహవ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ను '2014 - బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌'గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది.
     » ప్రపంచంలోని అగ్రశ్రేణి 20 మంది కార్పొరేట్లలో ల్యారీపేజ్ అగ్రస్థానంలో నిలిచారు.
     » ఇ-కామర్స్ పోర్టల్ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫాస్ట్‌ఫుడ్ గొలుసుకట్టు సంస్థ చిపాటిల్ సహ సీఈఓలు మోరన్, స్టీల్ ఎల్స్, ఫెడెక్స్ ఛైర్మన్ ఫ్రెడ్ స్మిత్ కంటే ముందు ల్యారీపేజ్ నిలిచారు.
     » ఈ జాబితాలో అయిదుగురు మహిళలు కూడా చోటు పొందారు.

జనవరి - 7

¤ బాలల హక్కుల ఉద్యమ కర్త కైలాష్ సత్యార్థి తనకు ఇటీవల లభించిన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దిల్లీలో అందజేశారు. 18 క్యారెట్ల బంగారంతో రూపొందిన 196 గ్రాముల ఈ పతకానికి రాష్ట్రపతి భవన్‌లోని ప్రదర్శనశాలలో చోటు కల్పించారు.
     » తనకు లభించిన బహుమతిని భారత జాతికే అంకితం చేస్తున్నట్లు సత్యార్థి ఈ సందర్భంగా ప్రకటించారు.
¤ అమెరికా కాంగ్రెస్ మహిళా సభ్యురాలు, భారత సంతతికి చెందిన తులసి గబార్డ్, సహచర డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు డాక్టర్ అమీబెరా వరుసగా రెండోసారి అమెరికా ప్రతినిధుల సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.

జనవరి - 8

¤ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారు. తన జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో తానే హీరోగా నటించేందుకు అంగీకరించారు.
     » ముంబయికి చెందిన 200 నాటౌట్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రిటన్ డైరెక్టర్ జేమ్స్ ఎరిక్‌సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
¤ ఐక్యరాజ్యసమితి (యూఎన్) శాంతి కమిటీ బాధ్యుడిగా భారతీయ సీనియర్ దౌత్యవేత్త అతుల్ ఖరే నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌ కి మూన్ ఆమోదించారు.
     » ఖరే 2010-11లో శాంతి కమిటీ న్యూయార్క్ కార్యకలాపాలకు డిప్యూటీ హెడ్‌గా ఉన్నారు. 2011-12 మధ్య కాలంలో మార్పు నిర్వహణ కమిటీకి అధ్యక్షత వహించారు.

జనవరి - 11

¤ ప్రఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ తొలి రికార్డు 'మై హ్యాపినెస్' ఏకంగా మూడు లక్షల డాలర్లు పలికింది. రాక్ఎన్‌రోల్ రారాజుగా పేరొందిన ఎల్విస్ సుమారు 18 ఏళ్ల వయసులో ఈ రికార్డును చేశారు. వాస్తవానికి దాన్ని తన తల్లి గ్లాడిస్‌కు బహుమతిగా ఇవ్వాలని అప్పట్లో ఎల్విస్ అనుకున్నారు. తన ఇంట్లో వినేందుకు ప్లేయర్ లేకపోడంతో ఆ రికార్డును తీసుకుని నేరుగా ఎడ్‌లీక్ అనే తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అతడి ప్లేయర్‌పై విన్న తర్వాత దాన్ని అక్కడే ఉంచి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆ రికార్డు ఎడ్‌లీక్ వద్దే ఉండిపోయింది. ఎడ్‌లీక్ మరణాంతరం అతడి సమీప బంధువు లోరిసా హిల్ బర్న్ వద్దకు చేరింది.
     » 1953లో ఎల్విస్ ఈ రికార్డును రూపొందించగా ఇప్పుడదే రికార్డు స్థాయిలో మూడు లక్షల డాలర్లు పలికింది.


జనవరి - 12

¤ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదర్శ యువ ఎమ్మెల్యే - 2014గా పుణెలోని భారతీయ విద్యార్థి పార్లమెంటు ఎంపిక చేసింది.
¤ ముస్లిం జనాభా అధికంగా ఉండే బంగ్లాదేశ్‌కు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఒక హిందువు నియమితులయ్యారు.
     » సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎస్.కె. సిన్హాను రాష్ట్రపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
     » ఈయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నెల 17న బాధ్యతలు స్వీకరిస్తారు. బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకేసులో తీర్పు సహా సిన్హా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు.


జనవరి - 14

¤ భారత యువ ఓపెన్ వాటర్ స్విమ్మర్ భక్తిశర్మ అరుదైన ఫీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
     » అంటార్కిటికా సముద్రంలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతలో 1.4 మైళ్ల దూరాన్ని 52 నిమిషాల్లో ఈదిన 24 ఏళ్ల భక్తిశర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా, తొలి ఆసియా యువతిగా నిలిచింది.
     » ఆమె గత పది సంవత్సరాలుగా ఓపెన్ వాటర్‌లో ఈదుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచంలోని అయిదు సముద్రాల్లో ఈది తన సత్తా చాటింది.

జనవరి - 15

¤ ప్రపంచ పటంలోని అన్ని దేశాలనూ ఇట్టే గుర్తుపట్టి చూపించగల భారత సంతతి చిన్నారి మేధావి విహాన్ చామల న్యూయార్క్‌లో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
     » ప్రపంచ పటాన్ని చూసిన 4 నిమిషాల 42 సెకన్లలో 196 దేశాల పేర్లను గుక్కతిప్పకుండా చెప్పిన మూడేళ్ల చిన్నారి విహాన్ ప్రపంచ రికార్డును సాధించాడు.

జనవరి - 16

¤ తాము అమెరికాకు వచ్చింది ఆ దేశ పౌరులవడానికేనని, భారతీయ అమెరికన్లుగా గుర్తింపు పొందడానికి కాదని లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ పేర్కొన్నారు.
     » తన తల్లిదండ్రులు నాలుగు దశాబ్దాల కిందట భారత్ నుంచి అమెరికాకు వచ్చారని ప్రకటించారు. అమెరికన్లను మరో రకంగా పిలవడాన్ని విశ్వసించనని ఆయన తెలిపారు.
¤ సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్ లీలా శ్యాంసన్ తన పదవికి రాజీనామా చేశారు.
     » 'డేరా సచ్ఛా సౌధ' ఆధ్యాత్మిక సంస్థ అధినేత గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్' వివాదం నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు.
¤ మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత షాజియా ఇల్మీ భారతీయ జనతా పార్టీలో చేరారు.

జనవరి - 21

¤ అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రతిష్ఠాత్మక రట్జెర్స్ విశ్వవిద్యాలయ డీన్‌గా భారత సంతతి వ్యక్తి జస్జిత్ అహ్లువాలియా నియమితులయ్యారు.
     » న్యూయార్క్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన అహ్లువాలియా ప్రస్తుతం మిన్నెసోటా విశ్వవిద్యాలయ అకడమిక్ ఆరోగ్య కేంద్రంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
¤ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బుద్ధవరపు శ్రీనివాస్ నాగేశ్వర్ కుమార్‌ను ఆఫ్రికాలోని గినీ దేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆనరరీ కాన్సుల్‌గా నియమించింది.
     » గినీ దేశంలో ఆయనకు చెందిన బుద్ధవరపు ఫార్మ్స్ అయిదు లక్షల హెక్టార్లలో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ దేశ ప్రజల కోసం ఆరోగ్య సేవా కార్యక్రమాలను అందిస్తోంది. దీనికి గుర్తింపుగా గినీ దేశం కుమార్‌ను ఆనరరీ కాన్సుల్‌గా నియమించింది.
     » భారత్, గినీ దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం, తెలుగు రాష్ట్రాల వాణిజ్యవేత్తలకు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన సమాచారాన్ని అందించడం, మౌలిక సౌకర్యాల రూపకల్పనలో తోడ్పాటు అంశాలపై ఆయన పని చేస్తారు.

జనవరి - 23

¤ కర్ణాటకలోని విఖ్యాత శృంగేరి శారదా పీఠం అధిపతి భారతీ తీర్థస్వామి వారసుడిగా విధు శేఖరస్వామి చిక్కమగళూరులో సన్యాసం స్వీకరించి, ఆ పీఠానికి 37వ మఠాధిపతి అయ్యారు.
     » ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అనంతవరానికి చెందిన కుప్పా వెంకటేశ్వర ప్రసాద్ శర్మను భారతీ తీర్థ స్వామి వారసుడిగా ఎంపిక చేశారు. సన్యాసం స్వీకరించాక ఆయన పేరును విధు శేఖర భారతి స్వామిగా మార్చారు.
¤ ప్రముఖ భారతీయ విద్యావేత్త, పరిశోధకురాలు సరస్వతీ మీనన్‌ను ఐక్యరాజ్యసమితి 'శాంతి పరిరక్షణ వ్యవస్థ' సలహా సంఘం సభ్యురాలిగా ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ నియమించారు.
     » ఐరాస మహిళా విభాగంలో, ఐరాస అభివృద్ధి పథకం మూల్యాంకన కార్యాలయ సంచాలకురాలిగా మంగోలియా, నేపాల్ తదితర దేశాల్లో ఐరాస ప్రతినిధిగా ఆమె గతంలో పనిచేశారు.
     » 'శాంతి పరిరక్షణ వ్యవస్థ' సలహా సంఘంలో పాకిస్థాన్‌కు చెందిన విశ్రాంత మేజర్ జనరల్ అనిస్ బజ్వాతో సహా మొత్తం ఏడుగురు నిపుణులను ఎంపిక చేశారు.

జనవరి - 24

¤ బ్రిటన్ రాణి ఎలిజబెత్(88 సంవత్సరాలు) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వయోవృద్ధురాలైన రాణిగా నిలిచారు.
     » సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా (90) మృతితో ఆమె ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు.

జనవరి - 26

¤ 'మిస్ యూనివర్స్-2014'గా కొలంబియాకు చెందిన పౌలినా వెగా (22 ఏళ్లు) కిరీటాన్ని గెలుచుకుంది.
     » అమెరికాలోని మియామిలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 80 మందికి పైగా అందగత్తెలను పక్కకు నెట్టి వెగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.
     » ఇవి 63వ మిస్ యూనివర్స్ పోటీలు. భారత్‌కు చెందిన యోనితా లాఢ్ టాప్ టెన్‌లో కూడా అర్హత సాధించలేక పోయింది.
     » ఈ పోటీల్లో రన్నరప్స్‌గా మిస్ అమెరికా నియా శాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కూషా, మిస్ జమైకా కాసి ఫెన్నెల్, మిస్ నెదర్లాండ్స్ యాస్మిన్ వర్హెజిన్ నిలిచారు.

జనవరి - 27

¤ బ్రిటన్ పార్లమెంటరీ స్క్వేర్‌లో ప్రతిష్టించనున్న మహాత్మాగాంధీ విగ్రహం కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి రెండు లక్షల పౌండ్లు (సుమారు కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు) విరాళంగా అందించారు.
     » సుమారు 7,50,000 పౌండ్ల వ్యయంతో గాంధీ విగ్రహాన్ని రూపొందించనున్నారు. బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్ సైతం దీనికోసం పెద్ద మొత్తంలో సహాయం అందజేసినట్లు ఈ విరాళాలు సేకరిస్తున్న 'గాంధీ స్టాట్చ్యూ మెమోరియల్ ట్రస్ట్' ప్రకటించింది.
     » బ్రిటన్ పార్లమెంటరీ స్వ్కేర్‌లోని ఆ దేశ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా విగ్రహాల పక్కన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ గతంలో నిర్ణయించారు.

జనవరి - 30

¤ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మాజీ అధికారి వి.కె.సారస్వత్ 'నీతి ఆయోగ్‌'లో శాశ్వత సభ్యడిగా ఎంపికయ్యారు.
     » ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేవ్రాయ్ ఇటీవలే 'నీతి ఆయోగ్‌'లో శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు.
     » ద్రవ ఇంధనంతో నడిచే ఇంజిన్ 'డెవిల్‌'ను రూపొందించడంలో వి.కె.సారస్వత్ కీలకపాత్ర పోషించారు. 'పృథ్వి' క్షిపణి ప్రయోగంలో సారస్వత్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.
¤ దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి (సీపీఆర్ వో)గా ఎం.ఉమాశంకర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
     » కె.సాంబశివరావు స్థానంలో ఈయన నియమితులయ్యారు.
¤ రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌కు రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగ (డీడీఆర్అండ్‌డీ) అదనపు బాధ్యతలు అప్పగించారు.
     » ప్రస్తుత డీడీఆర్అండ్‌డీ కార్యదర్శి; రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్ నుంచి మాథుర్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు.

జనవరి - 31

¤ ఏడు ఖండాల్లో వారం రోజుల్లో ఏడు గంటల్లో 148 కిలోమీటర్ల ప్రపంచ మారధాన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన చిగురుపాటి కృష్ణప్రసాద్, ఉమ దంపతులు (హైదరాబాద్) రికార్డు సృష్టించారు.
     » జనవరి 16న అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి మారధాన్‌ను ప్రారంభించి దక్షిణ అమెరికాలోని పంటా ఎరీనాస్, ఉత్తర అమెరికాలోని మియామీ, ఐరోపాలోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని మొరాకో, ఆసియాలోని దుబాయ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వరకు మారధాన్ కొనసాగించారు.
     » ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాకు కృష్ణప్రసాద్ సీఎండీ. ఆయన భార్య ఉమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
     » అత్యంత వేగంగా మారధాన్ పూర్తి చేసిన భారతీయ జంటగా రికార్డు సృష్టించి, మారధాన్ గ్రాండ్‌శ్లాం క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment