ఫిబ్రవరి - 2015 అంతర్జాతీయం - Febraury - 2015 International




ఫిబ్రవరి - 1

¤ పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన క్రీ.శ.1215 నాటి 'మాగ్నా కార్టా' గ్రంథం 800 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులోని నాలుగు ప్రతులను ప్రజల సందర్శనార్థం బ్రిటిష్ లైబ్రరీలో ఏర్పాటు చేశారు.
       » ఈ మాగ్నాకార్టాను 1215 జూన్ 15న రూపొందించారు. యుద్ధంలో రెబల్ బారోన్స్ డిమాండ్‌లతో కింగ్ జాన్ మాగ్నాకార్టాను అంగీకరించారు.
¤ నైజీరియాలో సైన్యం, ఇస్లామిక్ తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో వంద మందికిపైగా మృతిచెందారు.
       » ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురి కేంద్రంగా ఈ మారణహోమం జరిగింది. నగరాన్ని ముట్టడించాలని ప్రయత్నించిన ఇస్లామిక్ తీవ్రవాదులను సైన్యం అడ్డగించింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
       » ఈశాన్య నైజీరియాలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలన్న 'బొకో హరమ్' తీవ్రవాదానికి మైదుగురిని పుట్టిల్లుగా పేర్కొంటారు.
¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ వద్ద బందీగా ఉన్న జపాన్ పాత్రికేయుడు కెంజి గోటోను గొంతు కోసి హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. జపాన్ కు చెందిన ఇద్దరు బందీల్లో హరుణ యుకావా అనే వ్యక్తిని వారం క్రితమే హతమార్చారు.

ఫిబ్రవరి - 2

¤ నోబెల్ బహుమతి గ్రహీత, టిబెట్‌కు చెందిన అధ్యాత్మిక నాయకుడు దలైలామాను ఎవరు కలిసినా, దేని కోసం కలిసినా ఒప్పుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది.
       » ఫిబ్రవరి అయిదో తేదీన వాషింగ్టన్‌లో మత సంబంధమైన స్వేచ్ఛపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రసంగించనున్నారు. దీనికి దలైలామా హాజరు కానున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. దీనిపై చైనా అమెరికా ను హెచ్చరించింది. దలైలామా ఒక వేర్పాటువాదని, అతన్ని ఎవరైనా కలవాలనుకుంటే అది మా దేశానికి సంబంధించిన అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది.
¤ ఫజర్ అనే పరిశీలనా ఉపగ్రహాన్ని ఇరాన్ ప్రయోగించింది. 2012 తర్వాత ఆ దేశం ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి.
       » ఈ ఉపగ్రహాన్ని భూమికి 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ చేపట్టిన నాలుగో ఉపగ్రహ ప్రయోగమిది. మొదటి మూడింటిని 2009 నుంచి 2012 మధ్య ప్రయోగించింది.
       » ఫజర్ బరువు 52 కిలోలు. ఇది అంతరిక్షం నుంచి మెరుగైన చిత్రాలను తీస్తుంది.

ఫిబ్రవరి - 3

¤ ప్రపంచంలోనే తొలిసారిగా కేవలం మహిళల కోసం విలాసవంత విహార నౌకను మొనాకోకు చెందిన లిడియా బెర్సాని రూపొందించారు.
       » దీనికి 'లా బెల్లీ' అని పేరు పెట్టారు. అంటే సౌందర్య రాశి అని అర్ధం.
       » ఈ విహార నౌకలో ఆరు డీలక్స్ కేబిన్లు, అందమైన లాంజ్‌లు, స్పా , డిస్కో క్లబ్, ఐస్ ఫౌంటెయిన్‌లు, సినిమా థియేటర్ మొదలైనవి ఉన్నాయి. ఈ నౌక మీద ఒక హెలిప్యాడ్ కూడా ఉండటం విశేషం.
¤ పాకిస్థాన్ సైనిక, ఆర్థిక అవసరాల కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రూ.6 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. అమెరికా శాసనసభకు ఆయన పంపిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ మొత్తాన్ని సూచించారు. దీని ప్రకారం 'విదేశీ సైనిక సహాయం' కింద పాక్‌కు అమెరికా రూ.1600 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయనుంది. వీటికి అదనంగా ఆర్థిక చేయూత కింద రూ.రెండు వేలకోట్లు, తీవ్రవాదంపై పోరాటం కోసం మరో 890 కోట్ల రూపాయలు పాక్‌కు అందించనుంది.
       » తీవ్రవాదంపై పోరాటం, అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పడం లాంటి అంశాల్లో తమకు పాకిస్థాన్ చాలా కీలకమైందని, అందుకే భారీ మొత్తంలో సహాయం చేస్తున్నామని అమెరికా ప్రకటించింది.
¤ యుగోస్లావియా విభజన సమయం (1990)లో 1.30 లక్షల మంది మారణకాండ సంఘటనపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. క్రొయేషియా, సెర్బియాలను నిర్దోషులుగా ప్రకటించింది.
       » మానవ హక్కుల ఉల్లంఘనలపై 16 ఏళ్ల క్రితం సెర్బియాపై క్రొయేషియా కేసు దాఖలు చేసింది. సంఘర్షణ సమయంలో రెండు దేశాలకు చెందిన దళాలూ నేరాలకు పాల్పడినప్పటికీ, జాతి విధ్వంసానికి దిగాలన్న ఉద్దేశం ఉన్నట్లు రుజువు కాలేదని న్యాయస్థానం పేర్కొంది.
¤ బ్రిటన్ దిగువ సభ సభ్యులు ఒక చరిత్రాత్మక శాసనానికి ఆమోదం తెలిపారు. తద్వారా ముగ్గురి (తల్లీ, తండ్రి, మహిళా దాత) డీఎన్ఏలతో ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని పొందడాన్ని చట్టబద్ధం చేశారు.
       » ప్రపంచంలోనే ఈ తరహా చర్యకు శ్రీకారం చుట్టిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది.
       » దిగువ సభలో ఆమోదం పొందిన ఈ శాసనానికి ఎగువసభ అంగీకారం లభించాల్సి ఉంది.
       » సొంత తల్లిదండ్రుల న్యూక్లియర్ డీఎన్ఏ, మహిళా దాత పిండం నుంచి సేకరించిన ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియల్ డీఎన్ఏ (ఎండీఎన్ఏ)లతో ఐవీఎఫ్ విధానం ద్వారా బిడ్డకు ప్రాణం పోస్తారు. అంటే ఐవీఎఫ్ విధానం ద్వారా రూపుదిద్దుకునే గర్భస్థ పిండంలో ఈ ముగ్గురి డీఎన్ఏలూ ఉంటాయి. సొంత తల్లి నుంచి జన్యుపరంగా అత్యంత ప్రమాదకరమైన జబ్బులు సంక్రమించకుండా మహిళా దాత నుంచి సేకరించే ఆరోగ్యకరమైన ఎండీఎన్ఏ కాపాడుతుంది.
       » ఈ విధానం వల్ల బ్రిటన్‌లో ఏటా కనీసం 150 మంది దంపతులకు మేలు చేకూరనుంది. బ్రిటన్‌లో పుట్టే ప్రతి 6,500 మంది పిల్లల్లో ఒకరికి జన్యు పరంగానే గుండె, కాలేయం, శ్వాసకోశ ఇబ్బందులు, అంధత్వం, కండర క్షీణత లాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ గత ఏడాది డిసెంబరులో బందీగా పట్టుకున్న జోర్డాన్ ఫైలట్‌ను సజీవంగా తగలబెట్టి హతమార్చింది. ఆ క్రూర చర్య తాలూకు చిత్రాలతో ఆన్‌లైన్‌లో వీడియోను ఉంచింది.

ఫిబ్రవరి - 4

¤ చైనా నుంచి అక్రమ రవాణా ద్వారా వచ్చిన వేలాది పిల్లులను వియత్నాం అధికారులు సామూహికంగా సజీవ సమాధి చేయడం వివాదాస్పదమైంది.
       » వియత్నాంలో పెరుగుతున్న పిల్లి మాంసం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టినట్లు, స్మగ్లింగ్ వస్తువులకు సంబంధించిన చట్టం ప్రకారం వాటిని చంపేసినట్లు వియత్నాం వెల్లడించింది.
¤ తైవాన్‌లో ట్రాన్స్ ఏషియా విమానం నదిలో పడిన ఘటనలో 26 మంది మృతి చెందారు.
       » ఉత్తర తైపీలోని సొంగ్షన్ విమానాశ్రయం నుంచి తైవాన్ నియంత్రణలోని కిన్‌మన్ ద్వీపానికి బయల్దేరిన ఆ విమానం మార్గమధ్యంలో రహదారి వంతెనను ఢీ కొని అదుపుతప్పి కిలంగ్ నదిలో కుప్పకూలింది.

ఫిబ్రవరి - 6

¤ చైనాలోని గ్వాంగ్ డాంగ్ రాష్ట్రంలోని హ్యుడాంగ్ కౌంటీలోని హోల్‌సేల్ మార్కెట్ మాల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మాల్‌లో తొమ్మిదేళ్ల బాలుడు లైటర్‌తో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగింది.

ఫిబ్రవరి - 9

¤ నల్లకుబేరులకు సంబంధించి మరో జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా ఖాతాదారుల వివరాలు ఇందులో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఐసీఐజే) బయటపెట్టింది.
       » జాబితాలో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించినవారు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయి.
       » జాబితాలో 1195 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కించినప్పుడు ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ.25,420 కోట్లు)కు పైగా ఉన్నాయి.
       » హెచ్ఎస్‌బీసీకి చెందిన స్విట్జర్లాండ్ శాఖలో నల్లధనం దాచుకున్న వారిలో స్విట్జర్లాండ్ పౌరులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 200 దేశాల్లో భారత్‌కు 16వ స్థానం లభించింది. ఏ దేశానికీ చెందని 19 వేల మంది ఖాతాదారులు దీనిలో ఉన్నారు. భారత్‌కు చెందిన ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠంగా 876.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5258 కోట్లు) సొమ్ము ఉంది. ఖాతాదారుల సంఖ్య పరంగా చూస్తే స్విట్జర్లాండ్ 11,235 ఖాతాలతో ప్రథమ స్థానంలో ఉంది.
¤ ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఎయిర్ డిఫెన్స్ స్టేడియంలో సాకర్ అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ తొక్కిసలాటకు దారితీయడంతో 22 మంది మృతి చెందారు.
       » స్థానిక క్లబ్ జట్లు జమలేక్, ఈఎన్‌పీపీఐ మధ్య మ్యాచ్ ప్రారంభించడానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఫిబ్రవరి - 11

¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై సైనిక చర్యకు లాంఛనంగా అధికారం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా చట్ట సభను కోరారు.
       » ఐఎస్ ఉగ్రవాదుల హింసాత్మక దురాక్రమణను అరికట్టకపోతే అమెరికా కు ముప్పుగా పరిణమించగలదని ఆయన పేర్కొన్నారు.
¤ ఇటీవల జరిగిన మధ్యదరా సముద్ర విషాద ఘటనలో దాదాపు 300 మంది ఆచూకీ లభించడంలేదని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది.
       » లిబియా నుంచి ఇటలీ తీరప్రాంతానికి వలస వస్తున్నవారిలో పలువురు అతిశీతల వాతావరణం కారణంగా మరణించినట్లు ఏజెన్సీ వెల్లడించింది.

ఫిబ్రవరి - 12

¤ రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ రాజధాని మిన్క్స్‌లో శాంతి ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో జర్మనీ, ఫ్రాన్స్‌లు కూడా పాల్గొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది.
       » ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నిరంతరంగా జరుగుతున్న కాల్పులు ఆగిపోతాయి. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. ఆ ప్రాంతం 2015 చివరినాటికి ఉక్రెయిన్ నియంత్రణలోకి వస్తుంది.

ఫిబ్రవరి - 13

¤ కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను భారత్ అమలు చేయనందున భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించడం తమకు ఆమోదయోగ్యం కాదని పాకిస్థాన్ తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పేర్కొన్నారు.
¤ యోగా సాధన సందర్భంగా పలువురు ధరించే పొట్టి దుస్తులను నిషేధించడానికి ప్రవేశపెట్టిన బిల్లు అమెరికా లోని మోంటానా రాష్ట్రంలో వీగి పోయింది.
       » మోంటానాకు చెందిన చట్టసభ సభ్యుడు డేవిడ్ మూర్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాడు.
¤ పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో ఒక షియా మసీదుపై తాలిబన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 20 మంది మరణించారు.
       » ఇటీవల సింధ్ ప్రాంతంలోను షియా మసీదులో జరిగిన దాడిలో మొత్తం 61 మంది మరణించారు.

ఫిబ్రవరి - 15

¤ సౌహార్ధ చర్చల్లో భాగంగా 172 మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాలర్లు వాఘా సరిహద్దు గుండా రైలులో ప్రయాణించి భారత్ చేరుకుంటారు.
       » అరేబియా సముద్రంలోని తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో భారత జాలర్లను పాక్ ప్రభుత్వం గతంలో అరెస్టు చేసింది.
       » ఇంకా 349 మంది భారత జాలర్లు పాక్ జైళ్లలో ఉన్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
¤ ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందానికి ఆదిలోనే విఘాతం కలిగింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే తిరుగుబాటుదారులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు.
       » లుగాన్‌స్క్ ప్రాంతంలోని పొప్సొన్ పట్టణంపై తిరుగుబాటుదారుల దాడుల్లో ఇద్దరు మరణించారు.
¤ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాల మధ్య ఉన్న సముద్రంపై పడవల్లో చిక్కుకున్న 1000 మందికి పైగా వలసదారులను రక్షించడానికి ఇటలీ తీర రక్షక దళం చర్యలు చేపట్టింది. లంపేడూసా దీవికి దక్షిణం వైపు 180 కి.మీ. దూరంలో ఎనిమిది ఓడల్లో వీరు చిక్కుకుని ఉన్నారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment